గురు పూర్ణిమ - శ్రీకాంత్ కానం - అచ్చంగా తెలుగు

గురు పూర్ణిమ - శ్రీకాంత్ కానం

Share This
గురు పూర్ణిమ -  శ్రీకాంత్ కానం 

విశిష్టత 
వ్యాస మహర్షి జన్మించింది  ఆషాఢ శుద్ధ  పౌర్ణమి నాడు. ఈ పూర్ణిమ నాడు వ్యాసభగవానుడిని పూజించిన వారికి, ధ్యానించిన వారికి తన స్వరూప దర్శనం కలుగుతుందని వ్యాసుడే చెప్పినట్లుగా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తున్నది. అందుకే యావద్భారతదేశం పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా వ్యాసమహర్షిని పూజించి తరిస్తున్నది.
ఎవరైతే సత్యవతీ-పరాశరుల  పంటగా, నది మధ్య ఉన్న దీవిలో నల్లటిరంగుతో జన్మించి కృష్ణ ద్వైపాయనుడుగా పేరు  గడించాడో , ఎవరైతే పుడుతూనే వేదాలను వల్లించి, ఆ తరువాత చిక్కుముడులతో ఏకాకృతిగా ఉన్న వేదరాశిని సంస్కరించి, విభజించి, బోధించి, వ్యాప్తి చేసి వేదాంగ భాస్కరుడుగా కీర్తి పొందాడో, ఎవరైతే పురాణేతిహాసాల్లో సులభతరం చేసిన వేదసారాన్ని చొప్పించి పంచమ వేదమైన మహాభారతాన్ని, భక్తిరసప్రధానమైన భాగవతం మొదలైన పద్దెనిమిది పురాణాలనూ రచించి, అమూల్యమైన ఆర్ష సాహిత్యాన్ని లోకానికి అనుగ్రహించిన జ్ఞానమయ ప్రదీపుడుగా విశ్వవిఖ్యాతి చెందాడో, ఎవరైతే సనకసనందాదుల చెంత బ్రహ్మవిద్యను అభ్యసించి, న్యాయ ప్రస్థానమైన బ్రహ్మ సూత్రాలను రచించి, బదరికావనం లో తపస్సు చేసినందు చేత బాదరాయణుడు అనిపించుకొని జగద్గురువైన శ్రీకృష్ణ స్వరూపిడిగా ప్రకటితమయ్యాడో ఆ మహానుభావుడే వ్యాస భగవానుడు…..
విష్ణు పాదాల నుండి జనించి, ఉధృతంగా కిందకు దుమికిన గంగా ప్రవాహం, శివుడి జటాజూటం నుంచి జాలువారి భూలోకాన్ని పవిత్రం చేసింది. పరమాత్మ నుంచి జనించిన జ్ఞాన గంగ కూడా వ్యాసుడి ముఖకమలం నుండి జాలువారి, గురుపరంపర ద్వారా ప్రవహించి లోకుల్ని పూనితం చేసింది, చేస్తున్నది. గురువు తన జ్ఞాన బోధద్వారా శిష్యుడిలోని అజ్ఞానాన్ని పోగొట్టి, పూర్ణ స్వరూపుడిగా తీర్చిదిద్దే త్రిమూర్తి స్వరూపుడు. అజ్ఞానం నుంచి మేల్కొలిపే దేవుడే గురు దేవుడు. పాంచ భౌతికమైన శరీరంలో తెలియవచ్చే భగవానుడే గురుదేవుడు. వేద విదుడు, పాపరహితుడు, కామనారహితుడు, బ్రహ్మ విధులలో శ్రేష్ఠుడు, బ్రహ్మ నిష్ఠుడు, ఇంధనం లేని అగ్నిలా శాంతుడు, అవ్యాజ కరుణా సముద్రుడు , శరణా  గత సుజనులకు మిత్రుడైన వాడే నిజమైన గురువు. సాక్షాత్కార కమలాన్ని వికసింప చేసే విష్ణు స్వరూపుడే గురుదేవుడు. ఇటువంటి గురుశిష్య సంప్రదాయాన్ని ఏర్పరిచిన గురువులకు గురువే వ్యాస భగవానుడు. ఈయన వల్లనే ఆధ్యాత్మిక గురువుకు ఆర్ష సంస్కృతిలో ఎనలేని గౌరవస్థానం దక్కింది. అందుకే గురు పరంపరలో నిలిచిన గురు మహాత్ములందరినీ జ్ఞాన ప్రదాతలుగా సంస్మరించుకొని , తమతమ గురువుల్లో వ్యాసాదులను దర్శించి, ఏటేటా వారిని కృతజ్ఞతతో ప్రత్యేకంగా పూజించే పండుగే గురు పూర్ణిమ లేక వ్యాస పూర్ణిమ.
గురువు గొప్పతనం 
మన దేశ సంస్కృతీ సంప్రదాయాలలో గురువుకు  ఎనలేని ప్రాముఖ్యత ఉంది. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు. జన్మనిచ్చే తల్లి దైవ సమానురాలు. మనకు స్వయం శక్తి  వచ్చేవరకు పోషించే తండ్రి కూడా దైవసమానుడే. అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞానమనే వెలుగు బాటలో నడిపించే గురువూ దైవ సమానులే. ఏ విద్య బోధించే గురువైనా పరబ్రహ్మస్థానీయుడే. విద్య అంటే విముక్తిని ప్రసాదించేది కనుక  భారతీయ సంప్రదాయంలో గురువుకు పరమోత్కృష్ట స్థానం ఉంది.
ఆచార్యుడు, గురువు అనే పదాలు అర్థవంతమైనవి, పవిత్రమైనవి. ఆచార్యుడంటే తాను ఆచరించి శిష్యుని  చేత ఆచరింపజేసేవాడు. 'గు' అంటే అంధకారం, 'రు' అంటే దాన్ని నిరోధించేవాడు. గురువుకు మరో అర్థం కూడా ఉన్నది. 'గు' అంటే గుహ్యమైనది. తెలియనది. 'రు' అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన విషయాన్ని తెలియపరిచేది గురువేకదా!
మేఘానికి, గురువుకు సహజమైన ఔదార్యం ఉంటుంది. మేఘం తనకున్నదంతా మనకిచ్చి 'అయ్యో! వీరికి నేనేమీ చేయలేకపోయానే' అని వెలవెలపోతుంది. అదేవిధంగా ఆచార్యుడు కూడా తనకున్నదంతా శిష్యులకిచ్చినా సంతృప్తిపడడు.
భారతీయ సంప్రదాయంలో గురుశిష్య సంబంధం అతి పవిత్రమైనది. గాంభీర్యం, ఔదార్యం, సౌలభ్యం గురువు ప్రధాన లక్షణాలు. ద్రోణాచార్యుడు శిష్యుల్ని పరీక్షించి వారి వారి సంస్కారాల్నిబట్టి విద్య బోధించేవాడు. ఉత్తమ శిష్యుల్ని వరించి వారికి అగ్నిపరీక్షలు పెట్టి మేలిమి బంగారంలా ప్రకాశించేవారినే ప్రియశిష్యుడిగా స్వీకరించే ఉత్తమాచార్య సంప్రదాయం ద్రోణుడిది. తన కుమారుడైన అశ్వత్థామకు చెప్పని అస్త్ర విద్య  రహస్యాలను అర్జునుడికి బోధించాడాయన.
జీవితంలో ఒక్కసారైనా ఒక గొప్ప అధ్యాపకుడి చేతిలో పడితే ఆ వ్యక్తి గొప్ప నాగరికుడిగా మారే అవకాశం ఉందంటారు బెర్ట్రాండ్ రస్సెల్.  ఈ విషయాన్ని బహుష  పురాణాల్లో హిరణ్యకశిపుడు కూడా గ్రహించినట్లుంది. అందుకే...
చదువని వాడజ్ఞుండగు
చదివిన సద సద్వివేక చతురతగలుగున్
చదువగవలయును జనులకు
చదివించెద నార్యులొద్ద జదువుము తండ్రీ!!
(చదువుకోకపోతే అజ్ఞానుడవవుతావు. చదువుకుంటే సత్ వివేకము కలుగుతుంది . చతురత కూడా కలుగుతుంది. జనులందరూ తప్పక చదువుకోవలయును. నిన్ను ఆర్యుల (గురువుల) వద్ద చదివిస్తాను. చదువుకో నాయనా !)
అంటాడు కుమారుడైన ప్రహ్లాదునితో. అంత రాక్షసుడిగా పేరొందిన హిరణ్యకశిపుడే గురువుల గొప్పతనం గ్రహించాడు.
ప్రపంచంలో  అన్ని వృత్తులను నేర్పించే వృత్తే ఉపాధ్యాయ వృత్తి. ఇంజినీర్లయినా, డాక్టర్లయినా, లాయర్లయినా, సైంటిస్టులైనా, ప్రధానమంత్రులైనా, రాష్ట్రపతులైనా ఉపాధ్యాయుడి శిక్షణ నుంచి వచ్చినవారే. వేమన అన్నట్లు..
గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగును
అజునికైన, వానియబ్బకైన,
తాళపుచెవి లేక తలుపెట్టులూడును,
విశ్వదాభిరామ వినురవేమ
‘‘గురువు లేకుండా ఎంతటి వారికైనా గొప్పదనం సిద్ధించదు. రఘువంశ రాజైన అజుడైనా.. ఆయన తండ్రైనా, ఎవరైనా సరే! తాళంచెవి లేకుండా  తలుపు తీయటం ఎలా సాధ్యం?’’ అని అర్థం. అంటే అజ్ఞానం అనే తాళం కలిగిన విద్యార్థి అనే ద్వారానికి, జ్ఞానం అనే తాళంచెవితో తలుపు తీసేవాడే గురువు.  తల్లి తండ్రులు జన్మనిస్తారు. ఆ జన్మని సార్ధకం చేసుకునేలా ప్రేరణ ఇచ్చేది గురువు కాబట్టి గురువే జీవితానికి చుక్కాని  లాంటివాడు.
భగవద్గీతలో కృష్ణుడు అంటాడు-
యద్యదాచరతి శ్రేష్ఠః  తత్త దేవేతరో జనాః
సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే
ఉత్తములైన గురువులు ఏది ఆచరిస్తే  ఇతరులు దాన్నే ఆచరిస్తారు. వారు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తే  లోకమంతా దాన్నే స్వీకరిస్తుంది.
లేత వయసులో రాక్షస సంహారం కోసం రామలక్ష్మణుల్ని తనతో పంపమన్న విశ్వామిత్రుని విజ్ఞప్తిని అంగీకరించలేకపోయిన దశరథునితో వశిష్ఠుడు... విశ్వామిత్రుని వంటి గురువు లభించటం ఎంతో అదృష్టమని చెబుతూ..
ఏష విగ్రహవాన్ ధర్మః ఏష వీర్యవతామ్ వరః
ఏష విద్యాధికో లోకే తపసః చ పరాయణమ్
ఈయన విగ్రహమే ధర్మానికి ప్రతిరూపం. వీరత్వంలో ఈయనకు వేరెవరూ సాటిలేరు. మేధస్సులో లోకంలో అందరినీ మించినవాడు. ఋషుల్లో బ్రహ్మర్షి  అని... దశరథునికి ఆ గురువు గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని గురించి చెబుతాడు. అలాంటి గొప్ప గురువు లభించబట్టే శ్రీరాముడు రఘుకులాన్వయ రత్నదీపమయ్యాడు .
"శ్రీకైవల్యసారథి" అనే పుస్తకంలో డాక్టర్ క్రోవి సారథి ఇలా వ్రాశాడు -
"ఏ మహాత్ముని రూపం నీకు మదిలో నిలిచిపోతుందో,
ఏ సన్యాసి నీకు స్వప్నంలో కూడా కనిపించి సన్మార్గాన్ని బోధిస్తాడో,
ఏ సాధువు చెప్పిన ధర్మసూత్రాలు నీ మదిలో నిలిచిపోతాయో,
ఏ మహనీయుని దగ్గరకు వెళ్ళగానే నీ సందేహాలు నివృత్తి అవుతాయో,
ఏ వ్యక్తి దగ్గర నీకు ప్రశాంతత, ఆనందము కలుగుతాయో,
ఏ వ్యక్తిమీద నీకు నమ్మకము, గురి కలుగుతాయో ...
ఆ మహనీయుడే నీకు గురువు"
గురువు ఒక వ్యక్తి కాదు... జ్ఞానవ్యవస్థ! గురువులో స్వార్థం, ఈర్ష్య ఉండవు. తనలో వెలిగే  దివ్వెను అందరిలో చూడగలిగేవాడు ఉత్తమ  గురువు.
ఇలా చెపుతుంటే  ఎన్నో సందర్భాలు.. మరెన్నో విశేషాలు.. బహుశా  గురువు గొప్పతనం వర్ణించడానికి నిఘంటువులో ఉన్న పదాలు సరిపోవేమో..
కానీ...
‘‘ఆకాశం ఎత్తులో ఉన్న ఈ ‘గురు’  శబ్దం భూలోకంలో పడి అటుపై చిత్రసీమలో స్వైరవిహారం చేసి అక్కడ కూడా అవమానాలకు, వెక్కిరింతలకు గురై ఎక్కడా తలదాల్చుకోలేక పాతాళంలో పడిపోయిన ఈ రోజుల్లో గురు శబ్దం ఎవరైనా పలుకుతుంటే వెక్కిరింతగా వినిపిస్తోంది’’ అనే పులికింటి మాటలు ఈనాటి కాలంలో అందరికీ ఆలోచనీయాంశం. గురువు ఆజ్ఞ పాటించటానికి పొలంలో నుంచి నీరు పోకుండా, పగలు రాత్రి పొలానికి అడ్డంగా తానే గట్టై పడుకున్న అరుణి (మహాభారతంలోని ఉపాఖ్యానంలో పేర్కొన్న పాత్ర) కాలంనాటికి... ఈనాటికి గురుశిష్య సంబంధంలో వచ్చిన విపరీతమైన మార్పునకు పులికంటి మాటలే ఉదాహరణ. ‘‘జీతం పుచ్చుకోవటం వల్ల  ఉపాధ్యాయులు సేవకులు అవుతున్నారు, వేతనం ఇస్తుండటంతో విద్యార్థులు ప్రభువులవుతున్నారు’’ అని అన్న కందుకూరి మాటలు కూడా  ఈ కాలం విద్యార్థులు, గురువులు, తల్లిదండ్రులందరినీ ఆత్మావలోకనం చేసుకోవటానికి ప్రేరేపించేవే.
(గురువు గొప్పతనం గురించి రాసేంత అర్హత, తెలివితేటలు, సాహిత్య పరిజ్ఞానం  నాకు లేకపోవడం వలన  అంతర్జాలంలో ఎందరో  మహానుభావులు రాసిన వాటిని ప్రేరణగా తీసుకోవడం జరిగింది)

No comments:

Post a Comment

Pages