హార్ట్ టచింగ్.....పంచ్ ఏది? - అచ్చంగా తెలుగు

హార్ట్ టచింగ్.....పంచ్ ఏది?

Share This
హార్ట్ టచింగ్.....పంచ్ ఏది?
 

పెయ్యేటి శ్రీదేవి


          
ఇద్దరు రచయితలు, వెంకట్రావు, సుబ్బారావు ఎదురుపడ్డారు.  కలిసి మాట్లాడుకుంటున్నారు.వెంకట్రావు: ' ఏమోయ్, సుబ్బారావ్!  నేను కథలు చలా బాగా రాస్తానని అందరూ తెగ మెచ్చుకుంటారు.  కాని నీ కథలే ఎక్కువ పడుతున్నాయేమిటి?'సుబ్బారావు: ' నేను సంపాదకులు చెప్పినట్టు తు.చ. తప్పకుండా రాస్తాను.' వెంకట్రావు: ' అంటే సంపాదకులే కథ చెప్పి నీ చేత రాయిస్తారా ఏమిటి?' సుబ్బారావు: ' ఛి, ఛీ, అదేంకాదు.  హార్ట్ టచింగ్ తో, పంచ్ పెట్టి రాయమంటారు.  అందుకే అన్నీ పడుతున్నాయి.' వెంకట్రావు: ' అంటే ప్రతి కథా అలా ఎలా కుదురుతుందయ్యా?  కష్టం కదా?' సుబ్బారావు: ' ఈ మాటే నేను సంపాదకులతో అంటే, మనసుంటే మార్గముంటుంది అన్నారు.  అప్పుడు మనసు పెట్టి ఆలోచిస్తే అదేదో జ్ఞానోదయం లాగ మార్గోదయం కలిగింది.' వెంకట్రావు: ' బాబ్బాబు, ఆ మార్గోదయమేమిటో నాకూ చెబుదూ.' సుబ్బారావు: ' కథ తీసికెళ్ళి నిద్రపోతున్న సంపాదకుని హార్టు మీద పెడతాను.  హార్టుకి టచ్ కాగానే నిద్రలోంచి లేచి, కథ పేజీ మడతల్లో వున్నది  చూసి, చాల్లే అనుకుని సంతృప్తి చెందుతారు.  తరవాత పంచి పెడతాను.  వారు కట్టుకునే పంచెలన్నీ నేనిచ్చినవే.  ఇహ, పోటీ కథలకైతే ఘనంగా హార్ట్ టచ్ చేసి, పట్టుపంచెతో సత్కరిస్తాను.  అందుకే మొదటి బహుమతి నాకే వస్తుంది.' చాలీ చాలని, బొటాబొటీగా వచ్చే జీతంతో సంసారాన్ని నడుపుతున్న వెంకట్రావు తను రాసే కథలన్నా వేణ్ణీళ్ళకి చన్నీళ్ళు తోడవుతాయనుకుని, తన బుధ్ధిబలంతో ప్రొఫెషనల్ రైటర్ అవుదామనుకున్న వెంకట్రావు, తన కథలకి హార్ట్ టచింగ్, పంచ్ లు పెట్టే తాహతు తనకు లేదని నిరాశగా వేదాంత ధోరణిలో ఓ వెర్రినవ్వోటి నవ్వుకున్నాడు. పాపం, ఇంట గెలిచినా రచ్చ గెలవలేని ఆ గొప్ప రచయిత!!
**************************

No comments:

Post a Comment

Pages