ఇల్లంతా సందడి - అచ్చంగా తెలుగు

ఇల్లంతా సందడి

Share This
ఇల్లంతా సందడి
 

పెయ్యేటి శ్రీదేవి



          ' ఇక్కడ పండు అంటే ఎవరు?'' ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండు భ్లాకు అవుతుందో, వాడే పండుగాడు.  నేనే ఆ పండుని.  విషయమేమిటో చెప్పు.' అన్నాడు పండు అని పిలవబడే ఐదేళ్ళ కృష్ణతేజస్వి అప్పుడే అమెరికా నించి వచ్చిన విష్ణుతో.విష్ణు వాడి మాటలకి ఉలిక్కిపడి, ' అమ్మా, ఎవరే ఈ పోకిరి?  వీడి గురించేనా ఫోన్లో బాదేస్తావు?' అడిగాడు. ' ఏరా పండూ!  ఈయన నీకు మామయ్య అవుతాడు.  మామయ్యని అలా అనచ్చా?  సారీ చెప్పు.  నిన్న పోకిరి సినిమా టి.వి.లో వస్తూంటే పిల్లలందరూ చూసారు.  వీడు మహేష్ బాబు ఫేను.' ' పోనీ అమ్మా, చిన్నపిల్లాడు, ఊరుకో.  వీడు రమక్క కొడుకా, కమలక్క కొడుకా?' అడిగాడు విష్ణు. ' రమక్క కొడుకే గాని, అమెరికా వెళ్ళి ఐదు సంవత్సరాలైంది.  అప్పట్నించి మమ్మల్ని చూడాలని ధ్యాసే లేదేమిట్రా నీకు?  అందుకే పిల్లలకి ఎవరెవరో పరిచయాలు చేయాల్సివస్తోంది.  పోనీలే, పుష్కరాలకి, నాన్నగారి షష్టిపూర్తికి ఈ విధంగానైనా వచ్చావు.  కమలక్క వాళ్ళ అత్తగారితో పుష్కరస్నానానికి గోదావరికి వెళ్ళింది.  మేమూ వస్తామంటూ వాళ్ళతో పిల్లలు కూడా వెళ్ళారు.  ఔనుగాని, మీ ఆవిడ, పాపాయి ఏరీ?' అడిగింది తల్లి విశాలమ్మ. '
 వాళ్ళ నాన్నగారు ఎయిర్ పోర్టునించే వాళ్ళింటికి తీసికెళ్ళారు.  ఎల్లుండొ స్తుంది.' ' అదేమిట్రా?  ముందర అత్తగారింట్లో దిగడం మర్యాద.  తర్వాతెలాగూ అక్కడే వుంటుంది కదా?' ' ఏరా తమ్ముడూ, బాగున్నావా?  ఎంతసేపైందిరా వచ్చి?' ' బాగుందే నువ్వడగడం!  కనీసం ఎవరూ ఎయిర్ పోర్టుకన్నా రాలేదు.  పోనీ ఇంటికొచ్చాక ఎవరన్నా స్వాగతం పలికారా అంటే, ఇదుగో, ఈ పండుగాడు, నీ సుపుత్రుడేగా?  పండు అంటే ఎవరు అని అ డిగిన పాపానికి, ' ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండు బ్లాకవుతుందో వాడే పండు.  నేనే పండుని.  ఇంతకీ మీరెవరు? అంటూ నిజంగా దిమ్మ తిరిగి మైండు బ్లాకయ్యేలాగే, చాచి లెంపకాయ కొట్టినట్టు వాగాడు.  ఇక అమ్మయితే, ' మీ ఆవిడేదీ?  ఇక్కడికి ముందు రావద్దా? అంటూ సతాయింపు!  కమలక్కేమో ఎక్కడికో వాయినానికి వెళ్ళిందట!  వచ్చిన సంతోషం లేకుండా పోయింది.' ' ఛ!  ఊరుకోరా.  నాలుగేళ్ళ పిల్లాడు, వాడి మాటలేం పట్టించుకోకు.  సారీరా తమ్ముడూ!  కారువాడు ఫోను చేసినా రాలేదు.  ఎలాగూ మీ మావగారు వెడతానన్నారు.  ఒరేయ్ పండూ!  విష్ణు నీకు మామయ్య అవుతాడురా.  పిల్లలందరూ ఎటో వెళ్ళిపోయినా వీడు మాత్రం మామయ్య ఎప్పుడొస్తాడు అంటూ నీకోసం ఎదురు చూస్తూ ఇంటోనే వున్నాడు.  ఏరీ మీ ఆవిడ, పాప?' ' మళ్ళీ పురాణం చెప్పలేను తల్లీ.  వాళ్ళ నాన్నగారింటి నించి రేపో ఎల్లుండో వస్తుందిలే.  అందులోనూ వాళ్ళ చెల్లెలు రేపు సింగపూర్ వెళిపోతుంది.  అందుకే అక్కడ దిగింది.  ఇంతకీ షష్టిపూర్తి పెళ్ళికొడ్డుగ్గారేరి?  అసలింటో ఎవరూ కనిపించరేం?' ' ఓ, నాన్నగారా?  పూజలో వున్నారు.  ఈ రోజు పుష్కరాలు మొదటి రోజు కదా, అక్క వాళ్ళ అత్తగారితో స్నానానికి వెళ్ళింది.  మేమూ వస్తామంటూ గొడవ చేసి పిల్లలందరూ ఆవిడ వెంట వెళ్ళారు.' ' ఇదుగో, ముందర కాఫీ తాగరా విష్ణూ!  తరవాత గీజర్ లో వేడినీళ్ళున్నాయి.  స్నానం చేసిరా.  టిఫిన్ తిందూగాని.' అంటూ తల్లి కాఫీ అందించింది. ' మమ్మీ!  ఈ పొడుగాటి ఆయనేనా మామయ్య?' అడిగాడు పండు అనబడే కృష్ణతేజస్వి. ' అవున్రా.  నీకు మామయ్య, నాకు తమ్ముడు అవుతాడు.  అమెరికాలో వుంటున్నాడు.' ' నమస్తే మామయ్యా.  అమెరికా నించి నాకేం తెచ్చావు?' ' నీకేమంటే ఇష్టం?' ' నాకా?  ఊ..............చాక్లెట్లు!  అమెరికాలో చాక్లెట్లు బాగుంటాయని మా పక్కింటి ఆంటీ వాళ్ళబ్బాయి, మా ఫ్రెండు రవి చెప్పాడు.  వాళ్ళ పిన్ని అమెరికా నించి తెచ్చిందని నాకు రెండు పెట్టాడు.' ' ఐతే పిల్లలందరూ రానీ.  అందరికీ ఒక్కసారే పెడతాను.  ఒకసారొకళ్ళకి, ఒకసారొకళ్ళకి పెడితే కోట్లాడుకుంటారు.  ఈలోగా నేను స్నానం చేసి వస్తా.  సరేనా?' అంటూ కాఫీ తాగడం పూర్తి చేసి స్నానం చేయడానికి వెళ్ళాడు విష్ణు. పెద్దమ్మ కొడుకు ఎనిమిదేళ్ళ సాయితేజ, వాడి చెల్లెలు ఐదేళ్ళ శ్రీవల్లి, చిన్నమ్మమ్మ కూతురు కొడుకు ఆరేళ్ళ సూర్య, వాడి తమ్ముడు నాలుగేళ్ళ ప్రకాశ్, ఇంకా ఎంతమంది పిల్లలున్నారో అంతమందినీ పిలుచుకొచ్చాడు పండు. అరగంటయ్యాక విష్ణు తలస్నానం చేసి తల తుడుచుకుంటూ టవల్ తో బాత్ రూమ్ నించి వచ్చేసరికి బాత్రూముకడ్డంగా పదిమంది పిల్లలదాకా నుంచున్నారు.  వాళ్ళందర్నీ చూసి విష్ణు కంగారుగా బాత్రూము కోసం అనుకుని, ' అమ్మా..........అక్కా......!  ఈ పిల్లలంతా ఎవరు?  ఇక్కడ కూడా బాత్రూముకి ' క్యూ ' సిస్టమా?' అని అరిచాడు. ' కాదు మామయ్యా!  మేము బాత్రూము కోసం నుంచోలేదు.  చాక్లెట్లు పిల్లలందర్నీ పిలుచుకొస్తేనే పెడతానన్నావుగా?  అందుకే అందరూ వచ్చారు.' అన్నాడు పండు. ' ఒరేయి పండూ!  ఉదయాన్నే చాక్లెట్లేమిట్రా?  మామయ్యని ముందర టిఫిన్ చెయ్యనీ.  మీరందరూ కూడా టిఫిన్లు తినండి.  ఇప్పుడు పెట్టకురా విష్ణూ.  భోజనాలయ్యాక సాయంత్రం పెట్టచ్చు.  మళ్ళీ ఆకలి లేదంటూ అన్నాలు మానేస్తారు.' అంది విశాలమ్మ. ' అదేం కుదర్దు.  మాకు ఇప్పుడే చాక్లెట్లు కావాలి.  మాకు టిఫిన్లు, భోజనాలూ వద్దు.' అన్నారు పిల్లలందరూ ముక్తకంఠంతో. ఇంతలో తాతయ్య అనబడే రాఘవయ్యగారు పూజ పూర్తి చేసుకుని హాల్లోకొచ్చి కూచున్నారు.  ' ఏరా విష్ణూ!  ప్రయాణం బాగా జరిగిందా?  పుష్కరాలు మొదలైనాయి.  కొంచెం ముందర రాకపోయావా?' టేబుల్ మీద అందరికీ టిఫిన్లు ఏర్పాటు చేసింది వంటమనిషి సీతమ్మ. విష్ణుతో కబుర్లు చెబుతూ రాఘవయ్యగారు టిఫిన్ పూర్తి చేసారు.  పిల్లలు ముందర చాక్లెట్లిమ్మని గొడవ చేసారు.  టిఫిన్ తింటే గాని చాక్లెట్లు పెట్టనని గట్టిగా చెప్పేసరికి, గబగబా ఇష్టం లేకపోయినా నోట్లో కుక్కుకుంటూ టిఫిన్ తిన్నారు. పుష్కరాలకి, రాఘవయ్య షష్టిపూర్తి మహోత్సవానికి బంధువులు, మనవలు, మనవరాళ్ళు, ఆయన ఇద్దరు కూతుళ్ళు, అమెరికాలో వుండే కొడుకు విష్ణు, కోడలు పద్మ, వాళ్ళ రెండేళ్ళ కూతురు స్నిగ్ధ వచ్చారు.  రెండోకొడుకు లాయరు అక్కడే వుంటాడు.  ఇంకా రాఘవయ్యగారి అక్క, ఇద్దరు చెల్లెళ్ళు వచ్చారు.  ఇంకా అల్లుళ్ళు, మిగతా బంధువులు రావాలి.  పుష్కరాలు కాబట్టి తప్పనిసరిగా వస్తారు.  పుష్కరాలు కనక ఇంకా చాలామందే రావచ్చు.  రాఘవయ్యగారి అక్క జానకమ్మ కొడుక్కి ఆయన పెద్దకూతుర్నిచ్చి చేసారు.  చెల్లెలు శాంతమ్మ కొడుక్కి రెండో కూతుర్నిచ్చారు. మళ్ళీ పండు అడిగాడు, ' ఏం మామయ్యా, అందరం టిఫిన్లు తినేసాంగా?  మరి త్వరగా చాక్లెట్లు పెట్టు.' ' ఉండరా పండూ!  లగేజ్ ఓపెన్ చెయ్యనీ.' అంటూ మిగతా పిల్లలూ ఆగేలా లేరని అన్నీ ఓపెన్ చేసాడు.  కాని చాక్లెట్ పేకెట్ ఎక్కడా కనిపించలేదు.  ' ఉండరా, నా బేగ్ లో లేవు.  అత్త బేగ్ లో వున్నట్టున్నాయి.  అత్త వచ్చాక ఇస్తాను.' అనగానే పండుతో సహా మిగతా పిల్లలందరూ ఇప్పుడే కావాలంటూ రాగాలాపన చేసారు. విష్ణు సముదాయించ బోయేసరికి, ' మాకు ఆకలేస్తోంది.  ఇప్పుడే కావాలీ.....ఈ......' అంటూ మళ్ళీ రాగం అందుకున్నారు. ' ఆకలేస్తే అన్నం తినండి.  చాక్లెట్లు తింటే ఆకలి తీరుతుందర్రా?' అంటూ తాతయ్య మందలించారు. ' సరే, అత్త దగ్గిరకెళ్ళి ఇప్పుడే తెస్తా.  మరి నే వచ్చేలోగా అన్నాలు తినండి.' అంటూ కాఫీ తాగి మావగారింటికి స్కూటరేసుకుని బయలుదేరాడు విష్ణు. ఈలోగా వాళ్ళని సముదాయించడానికి క్రితం రోజు చేసిన జంతికలు, సున్నుండలు పెట్టింది విశాలమ్మ. ' ఎప్పుడూ ఈ జంతికలేనా?' అంటూ ఆవిడ చెయ్యి తోసేసి, ఏడుస్తూనే మళ్ళీ అవి తీసుకుని కరకరలాడించడం మొదలుపెట్టారు. ఆ మర్నాడు వచ్చాడు విష్ణు చాక్లెట్ డబ్బాతో. బతిమాలీ, బామాలీ ఎలాగో అన్నం తినిపిస్తున్న విశాలమ్మ చెయ్యి తోసేసి విష్ణు దగ్గిరకి పరిగెత్తారు చాక్లెట్లిమ్మని. ' ఉండండుండండి.  అందరికీ తాతయ్య పెడతారు.' అంటూ విష్ణు చాక్లెట్ల డబ్బా తండ్రి రాఘవయ్యగారికిచ్చాడు. రాఘవయ్యగారు మనవలు, మనవరాళ్ళు, ఇంకా మిగతా పిల్లలందరికీ తలో రెండు చాక్లెట్లు ఇచ్చారు.  పిల్లలు ఇంకా కావాలన్నారు.  ఇంకోటిచ్చారు.  అదీ తినేసి, ఇంకా.........ఇంకా.....అని అడుగుతూనే వున్నారు.  రాఘవయ్యగారు ఇంకోటి పెట్టి గమ్మున వాళ్ళు చూడకుండా ఎక్కడో దాచేసారు. పండు తాతగారి దగ్గరకెళ్ళాడు.  ఆయన పడక్కుర్చీలో కూర్చుంటే, ఆయన కాళ్ల మధ్యగా నుంచుని గారాలు పోయాడు ఇంకా చాక్లెట్లిమ్మని. ' చాక్లెట్లు ఎక్కువ తినకూడదు.  పెద్దయాక సుగరు జబ్బులూ అవీ వస్తాయి.' అన్నారాయన. ' మేం ఇంకా పెద్దవ్వలేదుగా?  అందుకే ఇప్పుడే పెట్టు.  పెద్దయ్యాక తినం.  మరి నువ్వు చిన్నప్పుడు చాక్లెట్లు తినకపోయినా నీకు సుగరు ఎందుకొచ్చింది?' అడిగాడు పండు. తాతగారు ఎన్నో విధాల నచ్చజెప్పారు.  ఎన్నో కథలు చెప్పారు.  కథ వినడం అయిపోగానే మళ్ళీ చాక్లెట్లిమ్మని అడిగారు. ఇలా రెండు రోజులు ఆయన చాక్లెట్లివ్వడం, పిల్లలు ఇంకా కావాలని అడగడం....ఆయనకి కోపం వచ్చి అందర్నీ కేకలేసారు.  ఐనా పిల్లలు వాళ్ళ పట్టుదల వదలలేదు.  వాళ్ళూ కోపం వచ్చి అలిగారు. పండు అమ్మమ్మ విశాలమ్మ పెద్ద వెండికంచం నిండా వేడి వేడి అన్నం, వాళ్లకిష్టమైన టొమేటో పప్పు, ఇంత నెయ్యి వేసి కలిపి తీసుకువచ్చింది.  ఎవరూ అన్నాలు తినకుండ మొహాలు ముడుచుకు కూర్చున్నారు. ఇలా రెండు రోజుల్నించి అన్నాలు మానేసి గదిలో కూచుని సమ్మె చెయ్యడం మొదలుపెట్టారు. ' పెద్దాళ్ళ జులుం నశించాలి!  పిల్లల కోరికలు పెద్దాళ్ళు తీర్చాలి!  మాకు ప్రత్యేక చాక్లెట్ల డబ్బా కావాలి!  పిల్లలకి స్వేఛ్ఛాస్వాతంత్ర్యాలు కావాలి!' అంటూ అట్టల మీద రాసి నినాదాలు చేయడం మొదలు పెట్టారు.  దీనికంతటికీ పండు నాయకుడు. ఇదేదో చిన్నపిల్లల ఆట అనుకోడానికి వీలు లేదు.  పిల్లలు నిజంగా చాలా సీరియస్ గానే టి.వి. వార్తా ఛానెళ్ళలో లాగా సమ్మె ప్రారంభించారు.  దాంతో పెద్దవాళ్ళు కూడా చాలా సీరియస్సయ్యారు.  పండుని, కమల పదేళ్ళ కొడుకు శేఖర్ ని గట్టిగా కేకలేసారు. ' ముందర అన్నాలు తినండి.  అస్తమానూ చాక్లెట్లు తినకూడదు.  ఆరోగ్యం పాడవుతుంది.  పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి.' అంటూ తాతగారు, అమ్మమ్మ, విష్ణు కేకలేసారు. ' ముందర మీ పెద్దవాళ్ళే మా మాట వినండి.  అప్పుడు మీ మాట వింటాం.' అంటూ పిల్లలు ఇంకా రెచ్చిపోయి, ' పెద్దవాళ్ళ జులుం...........నశించాలి!  పిల్లల కోర్కెలు...........తీర్చాలి!' అంటూ మళ్ళీ గట్టిగా నినాదాలు చేసారు. తాతయ్య తన చెల్లెలి కొడుకు, టెన్త్ చదువుతున్న రాజాని మధ్యవర్తిగా పంపాడు. ' తాతయ్య ముందు అన్నాలు తింటేనే చాక్లెట్లు ఇస్తామని చెప్పమన్నారు.' ' మాకు ముందర చాక్లెట్లడబ్బా ఇచ్చెయ్యండి.  అప్పుడే అన్నాలు తింటాం.' అన్నారు పిల్లలు ముక్త కంఠంతో. ఈలోగా వాళ్ళ దగ్గిర దాచుకున్న డబ్బులతో ఐస్ క్రీములు, బిస్కట్లు తెచ్చుకుని తింటూ, నిరాహార దీక్షకి కూచున్నట్టు కూచున్నారు ఓ గదిలో.
          అప్పుడు రాజా వచ్చి, ' మీ కోరికలేమిటో సరిగ్గా చెప్పమన్నారు తాతయ్య.' అన్నాడు.' మా కోరికలు ఎన్నిసార్లు చెప్పాలి?  ప్రత్యేక చాక్లెట్ల డబ్బా ఇమ్మని అడిగాం.  అంతే కదా?  డబ్బులడిగామా, బంగారాలడిగామా?  సినిమాలకి తీసికెళ్ళమని అడిగామా?  ప్రత్యేక రాష్ట్రం ఇమ్మని అడిగామా?  చిన్ని శ్రీరాముడు ఆకాశంలోని చందమామని తెచ్చిమ్మని అడిగినట్టు మేమేమన్నా అడిగామా?  ఏనుగులు, గుర్రాలు, విమానాలు అడిగామా?  కనీసం కొత్త బట్టలైనా అడిగామా?  ఆఫ్టరాల్, చాక్లెట్ల డబ్బా ప్రత్యేకంగా ఇమ్మని అడిగాం.  అదేదో గొంతెమ్మ కోరికైనట్టు మీ అధిష్టానం పెద్దలు ఎందుకింత రాధ్ధాంతం చేస్తున్నారు?  ఈమాత్రం పిల్లల కోర్కె తీర్చలేరా ఈ పెద్దాళ్ళు?  వెళ్ళు...........వెళ్ళి మీ అధిష్టానంతో చెప్పు.'' అధిష్టానం అంటే ఎవరు?' ' అదే, మమ్మల్ని ఎవరు కట్టడి చేస్తున్నారో, వాళ్ళు!  మాకు తాతగారు, అమ్మమ్మ.  నీకైతే మామయ్య, అత్తయ్య.  వాళ్ళే కదా అధిష్టానం?  మాకు కథలు చెప్పి మరిపిద్దామనుకుంటున్నారేమో!  ఆ పప్పులేం వుడకవు.' అన్నాడు పండు. ' ఒరే పండూ!  ఒకసారిలా రా నానా.' ఉదయమే వచ్చిన రాఘవయ్యగారి చెల్లెలు శాంతమ్మ పిలిచింది. ' ఎందుకు నానమ్మా?' ' ఇదిగో, నీ కిష్టమని బంగాళాదుంపల ఫళంగా కూర చేయించాను.  రా, అన్నం కలిపి నోట్లో పెడతాను.' ' వద్దు నానమ్మా.  మేం అందరం నిహారాహాహార దీక్షలో వున్నాం.' ' అంటే ఏమిటిరా?' ' మా కోరికలు తీరకపోతే అన్నం మానేసి నిహారాహాహార దీక్ష చేయడం అన్నమాట!' ' మరి అన్నం మానేస్తే ఆకలౌతుంది కదరా?  ఆరోగ్యం పాడవుతుంది.  అది సరేగాని, నిహారాహాహార దీక్ష ఏమిటిరా?  నిరాహార దీక్ష అనడం కూడా చాతకాని నీకు ఈ దీక్షలేమిటిరా?' ' మరి మాకు చాక్లెట్ల డబ్బా ఇస్తేనే దీక్ష విరమిస్తాం.' ' సరే.  నేను ఇప్పిస్తాలే.  ముందర అన్నం తిను.' ' అదేం కుదరదు.  పిల్లల్ని మరిపించడానికి మీ పెద్దాళ్ళందరూ ఇలాగే ఉట్టి కబుర్లు చెబుతారు.' ఇంతలో రాజా వచ్చి, ' ఒరే పండూ!  మిమ్మల్నందర్నీ అధిష్టానం చర్చలకి రమ్మంటోంది.  అన్నట్టు పుష్కరాలు, వాటి విశిష్టత గురించి అందరికి చెబుతారు.  తప్పనిసరిగా అందరూ వినాలట.  తాతయ్య చెప్పమన్నారు.' అన్నాడు రాజా. ' ఒరేయ్ రాజా!  ఓ మూల వాడన్నం తింటుంటే వచ్చి చెడగొడతావేంరా?  మీ అధిష్టానంతో చెప్పు.  ఐనా మీ మామయ్య చెప్పే పుష్కరాల గురించి పిల్లలకేం అర్థమవుతుంది?  కావలిస్తే పెద్దవాళ్ళందరికీ ఆయన్ని చెప్పమను.  పిల్లలందరికీ వాళ్ళ కర్థమయ్యేలా నేను చెబుతానులే.  నువ్వెళ్ళు.' ' నానమ్మా!  ఇంకా తాతయ్య పుట్టినరోజు ఎన్నాళ్ళుంది?' ' పది రోజులుంది.  తాతయ్య పుట్టిన రోజు, నీ పుట్టినరోజు ఒకరోజే.  మరి తాతయ్య పుట్టిన రోజుకి ఇలాగే సమ్మెలు, దీక్షలు చేస్తారా?' ' అబ్బ, చెయ్యంలే గాని, మరి తాతయ్యకి షష్టిపూర్తి అన్నావుగా, ఎప్పుడు?' ' పుట్టినరోజునే చేస్తారు.  ఐనా ఇప్పుడు పుష్కరాలు అవుతున్నాయిగా?  పుష్కరాలు అయిన మర్నాడు షష్టిపూర్తి.' ' పుషరాలు అంటే ఏమిటి?' ' ముందర మాటలు నేర్చుకోరా నువ్వు.  పుషరాలు కాదు, పుష్కరాలు.  మనకి పన్నెందు నదులు వున్నాయి.  అవి గంగ, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ, నర్మద, సింధు, కావేరి, బ్రహ్మపుత్ర, పినాకిని, తపతి, స్వర్ణముఖి.  ఒక్కొక్క నదికి పన్నెండేళ్ళకొకసారి పుష్కరాలు వస్తాయి.  ఇప్పుడు మనమున్న రాజమండ్రి గోదావరికి పుష్కరాలు.  నరసాపురంలో కూడా గోదావరి వుంది.  అక్కడ కూడా పుష్కర స్నానాలు చెయ్యచ్చు.  ఈ పుష్కరాలు పన్నెండు రోజుల్లో ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఒకరోజో, రెండురోజులో గోదావరిలో పుష్కరస్నానాలు చేస్తారు.  పన్నెండు రోజులూ కూడా చేసేవాళ్ళుంటారు.  స్నానాలు చేసి పెద్దలకి తర్పణాలు వదులుతారు.  బ్రాహ్మలకి ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు దానాలు ఇస్తారు.' ' అందుకేనా నానమ్మా, ఈ పుష్కరాల సమయంలో గోదావరిలో పుష్కర స్నానాలకి చాలా చాలా బోల్డుమంది మనింటికి చుట్టాలూ, వాళ్ళూ వస్తున్నారు?' ' అవును.  వాళ్ళందరూ వస్తుంటే నిన్నేమో ప్రశ్నలు వేస్తారు.  పండూ, నీ పేరేమిటి, ఏం చదువుతున్నావు, అన్నం తిన్నావా అని కూడా అడుగుతారు.  వాళ్ళలా అడుగుతుంటే, అన్నం తినను.  సమ్మెలో వున్నాను అంటావా?  ఎందుకు సమ్మెలో వున్నావు అని అడుగుతారు.  నాకు అధిష్టానం చాక్లెట్లు పెట్టటల్లేదు, అందుకే సమ్మెలో వున్నాను అంటావా?  వాళ్ళు నవ్వుతారు.  ఇంత చిన్నపిల్లలు అన్నం తినకుండా సమ్మె చెయ్యకూడదు అంటారు.  వాళ్ళు నీగురించి చెడ్డగా అనుకుంటే నీకు వాళ్ళ మీద కోపం వస్తుంది.  అప్పుడేమో పండు మీద వాళ్ళకి కోపం వస్తుంది.  అందుకే ఇక మీ ఇంటికి రాము అంటారు.  అందుకే గమ్మున ఈ కాస్త అన్నం తినెయ్.  రేపు మనందరం పుష్కరస్నానాలు చేద్దాము.' అంది. ' ఏమిటి నానమ్మా, ఏవో ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పి అన్నం కూరేస్తున్నావు?  నేను దీక్షలో వున్నాను కదా?' ' దీక్ష చెయ్యి.  ఎవరొద్దన్నారూ?  ఈ కొంచెం తినేసి దీక్షలో కూర్చో.' ' అది తప్పు కదా?  తిన్నాక నిహారాహాహార దీక్ష ఎలా అవుతుంది?' ' దీక్షల్లో అనేక రకాలున్నాయి.  రిలే దీక్ష, గంట దీక్ష, నాలుగు రోజులు దీక్ష, వారం రోజుల దీక్ష.....ఇలా ఎలాగైనా చెయ్యచ్చు.  నువ్వు మరో గంట దాకా ఏమీ తినకు పోనీ.  ఐనా మాటలు కూడా సరిగా రావే!  నిరాహారదీక్ష అనడం కూడా చేతకాని చిన్నపిల్లలు, మీకు దీక్షలేమిటిరా?  నాలుగేళ్ళ పిల్లాడివి, నీకు దీక్షలా?' ' ఏం కాదు, కొన్ని రోజుల్లో నాకు ఆరేళ్ళొస్తాయి కదా?' ' సరేలే.  అప్పటికి, ఇప్పటికి మహా పెద్దవాడివి ఏం అయిపోవు.  నువ్వింకా చిన్నవాడివే.  దీక్షలంటూ అన్నం మానేస్తే, ఎదుగుదల ఆగిపోయి ఎప్పటికీ చిన్నపిల్లాడిగానే వుంటావు.  తెలివితేటలు కూడా పెరగవు.  అన్నం మానేసే టైము ముందరుంది.  అప్పుడు తినాలన్నా తినలేవు.  తినడం మానేస్తేనే బెటరు.  తినమని నిన్నెవరూ బతిమాలరు.  ఇప్పుడు మానేస్తే ఆరోగ్యం దెబ్బతిని డాక్టర్ల చుట్టూ తిరగాలి.  వాళ్ళేమో చేదు మందులు, ఇంజక్షన్లు ఇస్తారు.  అది నీకు మంచిదా?' నోట్లో అన్నం కూరుతూ చెప్పింది శాంతమ్మ. ' ఒద్దొద్దు.  తింటాలే.  మరి బుజ్జి, చిట్టి, రమ్య, ఇంకా బోల్డుమంది పిల్లలున్నారు.  పాపం, వాళ్ళకీ తినిపించు.' ' వాళ్ళందరూ శుభ్భరంగా బాగానే తింటున్నారులే.  తినకపోతే వాళ్ళ అమ్మలూరుకోరు.  మీ అమ్మంటే పట్టించుకోదు.  నువు తినంటూ ఎటో వెళిపోతుంది.  అందుకే నన్ను గాని, మీ అమ్మమ్మని గాని పెట్టమంటుంది.  నువ్వెన్ని చిరుతిళ్ళు తిన్నా, అన్నం తినకపోతే బలం రాదు.  ఇదిగో, ఈ కొంచెం తిను.' ఇంతలో రాజా వచ్చి, ' ఒరే పండూ!  నేను బజారుకెడుతున్నాను.  మామయ్య, అదే, మీ తాతయ్య ఏదో పట్టుకు రమ్మన్నారు.' అన్నాడు. ' ఎలా వెడుతున్నావు?' అడిగాడు పండు. ' స్కూటరు మీద.  ఏం, అలా అడిగావు?' స్కూటరు స్టార్టు చేస్తూ అడిగాడు. పిల్లలందరూ స్కూటరుకడ్డంగా నిలబడ్డారు. ' ఇవాళ రాస్తా రోకో.  అందుకని ఇవాళ ఏ వాహనాలూ మనింటినించి కదలడానికి వీల్లేదు.  అలాని మీ అధిష్టానానికి చెప్పు.' అన్నాడు పండు. రాజా వెళ్ళి పండు అన్న మాటలు మామయ్యతో చెప్పాడు. ' రాజా!  ఇవాళ్టినించీ 144 సెక్షను విధిస్తున్నాం.  ఇంట్లో ఎవరూ గుంపులు గుంపులుగా గాని, ఇద్దరేసి గాని వుండకూడదు.  అలా వున్నట్టయితే గదిలో పెట్టి బంధిస్తాం.  ఈ విషయంలో అధిష్టానం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పు.  ఇందాక చర్చలకి రమ్మంటే రాలేదు.  సాయంత్రం లోగా అధిష్టానంతో చర్చలకి వస్తే సరి.  లేకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోవలసి వస్తుంది.' అని తాతయ్య అందరికీ వినబడేలా గట్టిగా చెప్పాడు. ' షష్టిపూర్తి ఫంక్షనులోగా అందరూ కలిసిపోయి సరదాగా వుండాలని చెప్పు రాజా!  రాస్తా రోకో అంటూ ఎవరడ్డగిస్తారో చూస్తాను.  నువ్వు వెళ్ళు.  పిల్లలందరి కొలతలూ సరిగా తీసుకున్నావు కదా?  ఏవి ఎవరి కొలతలో పేర్లు కూడా రాసుకో.  మంచి క్వాలిటీవి చూసి పట్రా.  పెద్దవాళ్లందరూ రేపు వెళ్ళి తీసుకోండి.' రాజా స్కూటరు మీద వెళ్ళాడు.  ఈసారి ఎవరూ అడ్డగించలేదు.  తాతయ్యకి మరీ కోపం వచ్చిందని తెలుసుకుని భయంతో అందరూ కిక్కురుమనకుండా కూచున్నారు. ' ఇదుగో శాంతా!  ఈరోజు పిల్లలందరికీ అన్నాలు కలిపిపెట్టు.  వాళ్ళు తినకపోతే నేనూ తినను.  రాజకీయనాయకుల్లా ఇప్పట్నించీ పిల్లలకి సమ్మెలు, నిరాహార దీక్షలు ఏమిటసలు?  పిల్లలమాట పెద్దవాళ్ళు వినాలా, పెద్దవాళ్ల మాట పిల్లలు వినాలా?  పిల్లలకి అడిగిందల్లా కొనిచ్చి, అతి గారాబం చేస్తే ఇలాగే పెద్దవాళ్ళనెదిరించి క్రమశిక్షణ లేకుండా పెరుగుతారు.  అన్నట్టు శాంతా!  ముంబై నించి రేపు నా స్నేహితుడు సీతారామారావూ, అతని భార్య, పిల్లలు పుష్కరస్నానాలకి మనింటోనే దిగుతారు.  ఈ పుష్కరాలన్ని రోజులూ వంటావిడ సీతమ్మని ఇక్కడే వుండమను.  వీధి అరుగు మీదుండే చిన్నగదిలో మంచం మీద పడుకోమను.  రేపు ఇంట్లో అందరం స్నానాలకెడదాం.' అన్నారు చెల్లెలు శాంతమ్మతో. ' తాతయ్యా!  మమ్మల్ని ఏ తిట్లన్నా తిట్టు కాని, రాజకీయనాయకులతోను, మంత్రులతోను మాత్రం పోల్చద్దు.' అన్నారు పిల్లలందరూ. ' ఏం, ఎందుకు?  వాళ్ళేం పాపం చేసారు?' ' ప్రజల సొమ్ము అన్యాయంగా మేసి, హత్యలు చేస్తూ, అన్యాయంగా కోట్లు సంపాదించి జైలుకెళుతున్నారు.  నీకు తెలీదా?  టి.వి.ల్లో చూడటల్లేదా?' ' ప్రజలకి మంచి పనులు చేస్తే ఎందుకు జైల్లో పెడతారు?' ' ఎంత మంచిగా వున్నా, చెడుదార్లకి మళ్ళిస్తూ, డబ్బాశ చూపి, వాళ్ళని కూడా కేసుల్లో ఇరికిస్తారు.  అందుకే మేం ఆ నీచ రాజకీయ నాయకులం అవం.' ' మరేం చేద్దామనుకుంటున్నారు?' ' డాక్టరో, ఇంజనీరో చదివి సినిమా హీరోలవుతాం.' ' టి.వి.ల ప్రభావం బాగానే ఒంట పట్టించుకున్నారు.  రేపట్నించీ టి.వి.లు చూడకండి.  టి.వి.కనెక్షను తీయించేస్తాను.  రాజా స్కూటరు మీద వెళ్ళబోతే రాస్తా రోకోలంటూ అడ్డగిస్తారా?  రాజాని చూసి నేర్చుకోండి, ఎంత బుధ్ధిగా వుంటాడో!  ప్రతిరోజు ఐదుగంటలకల్లా లేచేస్తాడు.  లేవడం తోటే దేముడికి దణ్ణం పెట్టుకుని, టిఫిన్ తిని, స్కూలు బుక్సు చదువుకుంటాడు.  సాయంత్రం స్కూలు నించి వచ్చి, స్కూలు డ్రస్సు మార్చుకుని, చేతులు, కాళ్ళు కడుక్కుని కాసేపు ఆడుకుంటాడు.  తర్వాత పదిగంటల దాకా చదువుకుని, పెందరాళే పడుకుంటాడు.  టి.వి.లో మంచి ప్రోగ్రాంలు ఐతేనే చూస్తాడు.  మీకులా అడ్డమైన చెత్త చూసి, సమ్మెలు, దీక్షలు అంటూ అన్నం మానెయ్యడు.  రోజూ వాళ్ళ అమ్మ, నాన్నల పాదాలకి నమస్కారం చేస్తాడు.  పెద్దవాళ్ళనెదిరించడు.  పెద్దలు చెప్పిన మాట వింటాడు.  ప్రతిరోజు క్రమశిక్షణతో పధ్ధతిగా వుంటాడు.  అందుకే వాడికి చదువులో కూడా ఫస్టుక్లాసులే వస్తాయి.' ' మరి తాతయ్యా!  నువ్వెంతో రాజాబాబాయిని మెచ్చుకుంటావు గానీ, ఇందాకనే చూసా.  రాజాబాబాయి దగ్గర అక్రమార్జన చాలా వుంది.  ఎన్ని కోట్లున్నాయో మరి!  జేబుల్లో కూరుకోడం చూసా.' ' ఎంత డబ్బుందిరా?' ' ఏమో, చాలా కోట్లే వున్నాయి.  చొక్కా జేబుల్లో కొన్నుంటాయి.  ఫేంటు జేబుల్లో కొన్నుంటాయి.  బేక్ పాకెట్లలో కొన్నుంటాయి.  అవన్నీ ఎలా వచ్చాయంటావు?  ఉద్యోగం లేకుండా, చదువుకునే బాబాయికి అంత డబ్బెక్కడిది?  నేను బాబాయి మీద ఎబిసిడి ఎంక్వైరీ పెట్టిద్దామనుకుంటున్నాను.' ' నీ మొహంలే!  తిక్కతిక్కగా వాగకు.  పైగా ఎబిసిడి ఎంక్వైరీ పెట్టిస్తావా?  నిన్న గాక మొన్న పుట్టిన నీకిన్ని తెలివితేటలెలా వచ్చాయిరా?  రాజాకి డబ్బిచ్చి ఏవో కొనమని నేనే పంపాను.  డబ్బు పెట్టుకోడానికి బేగు తీసికెళ్ళమంటే జేబుల్లో కుక్కుకున్నట్లున్నాడు.  రాజాబాబాయినే అనుమానిస్తార్రా మీరు?  వాడు నిజంగా రాజాలాంటి వాడు.  వాడ్ని చూసి పిల్లలే కాదు, పెద్దాళ్ళు కూడా నేర్చుకోవల్సినవి ఎన్నో వున్నాయి.' ' అలాగే మేం కూడా రాజాబాబాయి లాగే బుధ్ధిగా వుంటాం తాతయ్యా.  రేపట్నించి రాజాబాబాయి కంటే ముందరే లేచి, డేట్సు కేలండ్రి చింపి, ఆ రోజు డేట్ పెడతాము.' ' మరీ..........మరీ...........' ' ఏమిటి, చెప్పండి.' ' మాకు.....మాకు ప్రత్యేక చాక్లెట్లు కావాలి.' ' ఇంత చెప్పినా మీ పట్టుదల వదల్రు.  నిజంగా లేవురా.  మామయ్య కొన్నే తెచ్చాడు.' ' ఇవిగోనర్రా.  నేనింకా తెచ్చాను.  నా దగ్గరున్నాయి.' అంటూ కోడలు పద్మ చేతిలో తెల్లటి అమెరికా బొమ్మని ఎత్తుకుని లోపలికొచ్చింది.  కారు డ్రైవరు సామాన్లు లోపల పెట్టాడు. ' రండి బావగారూ!' అంటూ విశాలితో అరిచాడు, ' ఏమేవ్!  కోడలు, వియ్యంకుడు గారు, అమెరికా మనవరాలు వచ్చారు.'
          విశాలి హడావిడిగా లోపల్నించి వచ్చి, ' ఉండమ్మా, లోపలికి రాకు.  దిష్టి తీస్తా.' అంటూ మళ్ళీ లోపలికెళ్ళి పారాణినీళ్ళు తెచ్చి కోడలికి, మనవరాలికి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది.పాపని అత్తగారి చేతికిచ్చి, అత్తగారికి, మామగారికి పాదాలకి నమస్కారం చేసి, వాళ్ళ క్షేమసమాచారాలు కనుక్కుంది.' ఎంత బాగుందిరా విష్ణూ నీ కూతురు!  తెల్లగా, బొద్దుగా అచ్చం అమెరికా బొమ్మలాగే వుంది.'   ముద్దులాడుతూ, ' నీ పేరేమిటి చిట్టితల్లీ?' అడిగింది విశాలి పాపని. ' చిత్తి తల్లీ కాదూ.......నా ..........పేరూ............' అంటూ తల పైకి పెట్టి, ' ....................ఇస్ స్ స్ స్ ...నిగ్........' అని పలికి ' ధ ' అని గట్టిగా వత్తి పలుకుతూ తల కిందకి దించి, తల అటూ ఇటూ తిప్పి, దానిమ్మ గింజల్లాంటి చక్కని పలువరసతో ' హి.........హి.....హి......' అంటూ చిలకలా నవ్వేసింది. స్నిగ్ధ అని ఆ పేరు చెప్పిన విధానానికి పిల్లలు, పెద్దలు అందరూ పగలబడి నవ్వేసారు. ' నీ పేరేంటమ్మా?' అని మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చెప్పించుకుని ఆ చిన్నారిని ముద్దులతో ముంచేసారు. కోడలు పద్మ బేగ్ లోంచి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలలో చాక్లెట్లు నింపి, ' ప్రత్యేక చాక్లెట్ల డబ్బా కావాలని అన్నాలు తినకుండా తాతగారి మీద, అమ్మమ్మ మీద అలిగి దీక్షలు చేపట్టారట కదా?  అందుకే మీ అందరికీ తలో చాక్లెట్ల డబ్బా తెచ్చాను.  ఇవిగో, తీసుకోండి.  ఏడీ, పండు అంటే నువ్వేనా?' అంటూ వాడికి రెండు డబ్బాలిచ్చి ముద్దులాడింది పద్మ.  ఆడపడుచుల్ని, మరిదులని అందర్నీ పేరు పేరునా పలకరించింది. ఇల్లంతా ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది.  ఈలోగా రాజా పెద్ద పెద్ద బట్టల పేకెట్లతో లోపలికొచ్చాడు.  పిల్లలందరికీ తీసుకున్న కొలతల ప్రకారం డ్రస్సులు కొని తెచ్చాడు. ' రాజా బాబాయ్!  పాపం మాకు బట్టలు తేవడానికి వెళ్ళావా?  ఇందాక పాపం నిన్ను రాస్తా రోకో అని ఆపేసాం.' అన్నాడు పండు. ' అవునూ, అన్యాయంగా కోట్లు సంపాదించానని తాతయ్యతో చెప్పారట జేబులో నోట్లు చూసి?  అందుకే తాతయ్య ఫోను చేసారు డబ్బు జాగ్రత్త అని.  పైగా నా మీద ఎబిసిడి ఎంక్వైరీ పెట్టిస్తానన్నారట?  అందుకే మీమీద కోపం వచ్చింది.'
ఆ మర్నాడు పిల్లలందరూ లేవగానే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకరికి తెలియకుండా మరొకరు డేటు కేలండర్లో డేట్లు చింపేసారు.  రాజాలా బుధ్ధిగా త్వరగా స్నానాలు చేసి, దేవుడి స్తోత్రాలు చదువుకున్నారు.  బుధ్ధిగా బోర్నవిటా తాగారు.  తాతయ్య లేచాక, తాతయ్యకి, అమ్మమ్మకి నమస్కారాలు చేసారు.పండు తాతయ్యతో గొప్పగా అన్నాడు, ' చూడు తాతయ్యా!  ఇవాళ నీకంటే కూడా త్వరగా లేచి స్నానాలు చేసి, దేవుడికి దణ్ణం పెట్టుకుని, రాజాబాబాయి కన్నా ముందరే తయారై బోర్నవిటా తాగేసాం.  అందరం డేట్సు కూడా చింపేసాం.'నీ షష్టిపూర్తి ఇక రెండు రోజులే వుందని, ఇవాళ ఇరవైనాలుగో తారీకని, కాదు, ఒక రోజుందని, కాదు, కాదు, నాలుగు రోజులుందని, మూడు రోజులుందని............ఇలా పిల్లలందరూ రాఘవయ్యగారి షష్టిపూర్తి ఎప్పుడో, వాళ్ళు చింపిన డేట్సు ప్రకారం లెక్కలేసి చెప్పారు. రాఘవయ్యగారు ఏమిటా అని కింద చూస్తే డేట్సు కేలండర్ లోని పిల్లలు చింపిన కాగితాలన్నీ నేల మీద కుప్పలుగా పడివున్నాయి. 'మంచిగుణాలు నేర్చుకోవాలని రాజాని ఉదాహరణగా తీసుకుని మీకు అర్థమయేలా చెప్పినందుకు తారీకుల కాగితాలన్నీ పిల్లలందరూ తలొకటీ చింపేసారర్రా?  ఏకంగా పదిరోజుల కాగితాలన్నీ ఒక్కరోజునే చింపేసారు.' ' తాతయ్యా!  మలేమోనేమో నీ పుట్టిన లోజు తొందలగా వచ్చేయాలని నేనూ ఒకటి చింపేసా.  మలేమో మళ్ళీ మేం అమెలికా వెళిపోవాలి కదా?  అందుకే చింపేసా.' చిన్నారి స్నిగ్ధ ముద్దుమాటలకి అందరూ గొల్లున నవ్వారు. ' మరి నువ్వే కదా తాతయ్యా, రాజాని చూసి నేర్చుకోవాలన్నావు?' అన్నాడు పండు. ' సర్లెండి, రేపట్నించి డేట్సు ఎవరూ చింపకండి.  రాజా!  నువ్వు కూడా పొరబాట్న చింపేవు.  25 వ తేదీ వరకూ ఎవరూ చింపకండి.' ' తాతయ్యా!  డేట్సు ఎవరూ చింపంలే గాని.......మరీ, నీ పుట్టినరోజు, నా పుట్టిన రోజూ ఒకటే కదా?  మరి నువు షష్టిపూర్తి చేసుకుంటున్నావు కదా?  నేనూ షష్టిపూర్తి చేసుకోనా?' పండు మాటలకి అందరూ గొల్లున నవ్వారు. ' నీ మొహం!  నీకు ఐదెళ్ళి ఆరేళ్ళొస్తాయి.  షష్టిపూర్తి అరవై నిండాక చేసుకుంటారు.  నువ్వు కూడా అరవై ఏళ్ళు నిండాక, తాతయ్యవయ్యాక అప్పుడు చేసుకుందూ గాని.' అంది రాఘవయ్యగారి చెల్లెలు శాంతమ్మ. ' ఊ..........ఊ....నేను తాతయ్య నవనూ..........ఊ..... పండుగానే వుంటానూ.................' ' ఇదిగో శాంతా!  ఈ రోజు పుష్కరాల విశిష్టత, ఎన్ని నదులున్నాయో, అన్నీ వివరంగా చెబుతాను.  అందరూ వినండి.' అంటూ గోదావరి పుష్కరాల గురించి అందరికీ వివరంగా చెప్పారు.  రేపు అందరం పుష్కర స్నానాలు చేద్దాం.  కొంతమంది పెద్దవాళ్ళు ముందర వెళ్ళి స్నానాలు చేసిరండి.  తరవాత పిల్లల్ని తీసుకుని కొంతమంది వెళ్ళండి.  పిల్లల్ని కనిపెట్టుకుని జాగ్రత్తగా పట్టుకుని చేయించండి.  అమ్మాయిలూ, అబ్బాయిలూ, విష్ణూ, పద్మా!  బ్రాహ్మలకి దానాలు అవీ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఇచ్చుకోండి.' ' తాతయ్యా!  పాపం లేనివాళ్ల పిల్లలకి నేను కూడా నా బట్టలూ, పుస్తకాలూ దానమిస్తా.' ' ఏం, నీకు చదువుకోటానికి పుస్తకాలక్కర్లేదా?  నువ్వే దానాలూ ఇవ్వక్కర్లేదు గాని, అమ్మ, నాన్న దగ్గరే వుండి స్నానం చెయ్యి.' మర్నాడు ముందర రాఘవయ్య, భార్య విశాల, చెల్లెలు శాంత, అక్క జానకమ్మ వెళ్ళి స్నానాలు చేసారు.  వాళ్ళకి తోచిన దానాలూ అవీ ఇచ్చారు. తరవాత కొడుకు విష్ణు, కోడలు పద్మ, ఇంకా మిగతా బంధువులు వెళ్ళి స్నానాలు చేసారు.  స్నిగ్ధని కూడా జాగ్రత్తగా పట్టుకుని స్నానం చేయించింది పద్మ. స్నానాలు చేసి ఇంటికి వచ్చాక ' ఒదినా, మీరు కూడా వెళ్ళండి స్నానాలకి.' అంది పద్మ. పద్మ పొడవాటి జుట్టు నీళ్ళు కారడం చూసి ఆడపడుచులు రమ, కమల అన్నారు, ' ఏమమ్మా పద్మా!  గోదావరిలో నీళ్లన్నీ మీరే అవగొట్టేసారా, మాకేమన్నా మిగిల్చారా?' ' మీరేం బెంగ పడకండొదినా, మిగిల్చినా మరీ అడుగు నీళ్ళు బాగుండవేమోనని మీ ఇద్దరికీ రెండు బిందెల నీళ్ళు పట్టి, పైన మూత పెట్టి చెంబు పెట్టాను.  బట్టలు మార్చుకునే రూములో వుంచాను ఆ రెండు బిందెలూ.  త్వరగా వెళ్ళండొదినా.  మళ్ళీ అవి ఎవరైనా కాజేయగలరు.' పద్మ సమాధానానికి మూత్తిప్పారు ఆడపడుచులు. పుష్కరాలు పన్నెండు రోజులూ బంధుమిత్రులతో, భోజన వసతి సదుపాయాలతో, అతిథి మర్యాదలతో, పిల్లల ఆటపాటలు, అల్లర్లతో రాఘవయ్య, విశాలమ్మ దంపతుల ఆ ఆనందనిలయం ఇల్లంతా సందడిగా అయింది పుష్కరాల ధర్మమా అని. రాఘవయ్యగారు, విశాలమ్మ పన్నెండు రోజులూ పుష్కరస్నానాలు చేసారు.  లేదనకుండా గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం అన్నీ తృప్తిగా చేసుకున్నారు. చివరి రోజు నువ్వులదానం ఇస్తుంటే ఎవరూ నువ్వుల దానం పట్టడానికి ముందుకు రాలేదు.  పన్నెండు, ఒంటిగంట, రెండు...........టైము గడిచిపోతోంది.  ఆ దానం పూర్తయితే గాని ఇంటికెళ్ళి భోజనం చెయ్యడం కుదరదు.  రాఘవయ్యగారు, విశాలమ్మ అలాగే ఎదురు చూస్తున్నారు, ఎవరొస్తారా అని.  ఇంక ఎవరూ రారని నిర్ధారించుకుని వెనుదిరిగి వెళిపోతుంటే......... ' అయ్యా!  నా కొడుకు హార్ట్ ప్రాబ్లెమ్ తో బాధ పడుతున్నాడు.  డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చెయ్యాలంటున్నారు.' అంటూ ఒక బ్రాహ్మడు అర్థించాడు. వెంటనే ఆ నువ్వులదానం ఆ పేద బ్రాహ్మడికి ఇచ్చారు.  కొత్త బట్టలు పెట్టారు.  అదే భాగ్యమనుకుని, దానం తీసుకుని, నిరాశగా వెళ్ళాడు ఆ బ్రాహ్మడు. మర్నాడు రాఘవయ్యగారి షష్టిపూర్తి, పండుగాడి పుట్టిన రోజు వైభవంగా జరిగాయి. మర్నాడు సాయంత్రం విష్ణు, పద్మ, చిన్నారి స్నిగ్ధ అమెరికా ప్రయాణానికి సిధ్ధమవుతున్నారు. విష్ణు ప్రయాణానికి సర్దుకుంటూ, ' మొత్తానికి తాతయ్యని, అమ్మమ్మని, నానమ్మని, అందర్నీ దీక్షల పేరుతో బలే ఆడించి, ఇల్లంతా సందడి చేసావురా పండూ.' అన్నాడు. ' నాక్కొంచెం తిక్కుంది.  కానీ దానికో లెక్కుంది.' అన్నాడు కాలరెగరేస్తూ పండు. ' ఈ డైలాగు ఏ సినిమాలోది నాయనా?  ఇది కూడా మహేష్ బాబుదేనా?' అడిగాడు విష్ణు. ' కాదు.  ' గాబరాసింగ్ ' లో ' పాన్ కయలాణ్.' ముందర వాడి మాట ఎవరికి అర్థం కాక, తరవాత అర్థమై, ' ఓ!  గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ దా?' అంటూ అందరూ గొల్లున నవ్వారు వాడి మాటలకి. ఇంట్లో అందరికీ వాడో హీరో అయిపోయాడు. పుష్కర స్నానాలు, దానాల ఘట్టాలు, వచ్చిన బంధుమిత్రులకి నిత్యం భోజన వసతులు, సత్రంలా అనిపించిన ఆ యింటి వాతావరణం, పిల్లల అల్లరి, దీక్షలు, ఆ తరవాత జరిగిన రాఘవయ్య, విశాలమ్మ దంపతుల షష్టిపూర్తి మహోత్సవం, అప్పుడే పండుగాడి పుట్టినరోజు, విష్ణు ఈ ' ఇల్లంతా సందడి ' ని విడియోలో చిత్రీకరించుకుని, అమెరికా ప్రయాణానికి భార్య పద్మ, కూతురు స్నిగ్ధతో బయలుదేరబోతున్నాడు. తల్లి విశాలమ్మ కొడుకు, కోడలు, స్నిగ్ధని పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుంది.  రాఘవయ్యగారు గంభీరంగా వుండిపోయారు. ' మామయ్యా!  అత్తయ్యా!  మీరిక్కడే వుండండి.' అంటూ ఏడ్చాడు పండు. ' పుష్కరాలయిపోయాయిగా?  మళ్ళీ సంవత్సరం చిన్నమామయ్య పెళ్ళికి వస్తాంలే.' అంటూ బయలుదేరారు. ఇంతలో ఇద్దరు దంపతులు, వాళ్ళ ఇరవై ఏళ్ళ అబ్బాయి వచ్చి రాఘవయ్యగారి కాళ్ళమీద పడి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ' అయ్యా!  నా కొడుక్కి ప్రాణదానం చేసారు.  మీ మేలు ఎప్పటికీ మర్చిపోను.' ' ఎవరు మీరు?  నేనెవరికీ సాయం చెయ్యలేదే!  మిమ్మల్నెప్పుడూ చూడలేదు.' అన్నాడు రాఘవయ్య. ' ఆ పుష్కరాల చివరిరోజు నువ్వుల దానం ఇచ్చారు కదయ్యా?  అందులో మీరు బంగారు కడ్డీ, బోలెడు డబ్బు పెట్టారు.  పేద బ్రాహ్మణ్ణయ్యా నేను.  ఇప్పుడింత గొప్పోణ్ణయ్యానంటే మీ చలవేనయ్యా.  మీరు ధర్మప్రభువులయ్యా.  మీ కుటుంబం కలకాలం నిండునూరేళ్ళు చల్లగా వర్ధిల్లాలి.' అంటూ దీవించి వెళ్ళాడు. రాఘవయ్యగారి కళ్ళు చెమర్చాయి.
*************************

No comments:

Post a Comment

Pages