జీవధార
- పూర్ణిమ సుధ
కర్షకుల కళ్ళల్లో ఆనందాన్ని నింపే జీవనది...
పచ్చని తీవాచీల కోనసీమ నట్టింట
పరికిణీ వేసిన వరికి, వరుణ దేవుడు వరమిచ్చినా, ఈయకున్నా
గోదావరి వరించి, తరింపజేసి...
జీవాన్ని నింపి, తొమ్మిది నెలల నిండు గర్భిణిలా
చల్లని పైరగాలికి సేదతీరి, పైరు తలయూస్తుంటే...
రైతు గుండె - తన చేతుల మీదుగా పెరిగిన ఆడపిల్ల
నట్టింట నిండు చూలాలై తిరుగుతున్నంత
ఆనంద పడే క్షణాలు... కేవలం నీ వరం...
ఇసుక తిన్నెల మసక రాత్రిలో
విసిగిన మనసుకి స్వాంతన నీ మందగమనం
వెన్నెల కిరణాల వన్నెల హొయలు నీ సొంతం
బీడువారిన భూదారిని, మోడువారిన మహిని నీవే
జీవనదిగా మారి... సకల జీవరాశుల్లో జీవాన్ని నింపుతున్నావ్...
మబ్బుల మాటున దాగిన ముత్యాలసరిని
నీలో ఇముడ్చుకుని, కొండలు గుట్టలు
కోనలు లోయలు - అన్నీ దాటి మన్నే తడిపి
ప్రతివారి గుండెల్లో మిన్నంటు సంతోషాలకు కారణమవుతున్నావు...
పుష్కరాల పులకింతతో తడిసి ముద్దవబోతున్న గోదావరికి
పూర్ణిమ అందిస్తున్న అక్షరాల కుసుమాంజలి..
No comments:
Post a Comment