కళాసరస్వతీ పుత్రుడు - జిత్ మోహన్ మిత్రా
ముఖాముఖి : భావరాజు పద్మిని
దాదాపు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తీసిన సినిమాలు అన్నింటిలోనూ ‘జిత్‌మోహన్ మిత్రా’ గారు ఏదో ఒక పాత్రలో కనిపిస్తారు. శంకరాభరణం సినిమాలో ‘శంకరశాస్త్రి’ గారిని కవ్వించబోయి భంగపడ్డ వెస్ట్రన్ గాయకుడిగా, ‘ గోవుల్లు తెల్లన’ అనే సప్తపది చిత్రంలోని పాటలో గోవుల కాపరిగా, వంశవృక్షం సినిమాలో జ్యోతి భర్తగా, ఇలా అనేక పాత్రలు పోషించారు మిత్రా గారు. నాటకరంగంలో విశేషమైన ప్రతిభగల కుటుంబనేపధ్యం వీరిది. కేవలం నటులుగానే కాక, 61 సం. గా తన గానమాధుర్యంతో అందరినీ అలరిస్తున్న వీరికి, తాజాగా ‘స్వరగాన వజ్రోత్సవం’ నిర్వహించి, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేతులమీదుగా పౌర సత్కారం నిర్వహించి, ప్రశంసించారు. కొన్ని దశాబ్దాలుగా రాజకీయ, నాటక, కళా, సినీ, న్యాయవాద , సాంఘిక రంగాల్లోని వారికి తలలో నాలుకలా మెలుగుతున్న స్నేహశీలి మిత్రా గారితో భావరాజు పద్మిని జరిపిన ప్రత్యేక ముఖాముఖి, ఈ సంచికలో మీ కోసం...
నమస్కారమండి, మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి చెప్తారా ?
నా పేరు శ్రీపాద జిత్‌మోహన్ మిత్రా. నేను 1942 డిసెంబర్ లో పుట్టాను. మాది రాజమండ్రి. వృత్తిరీత్యా అడ్వకేట్ ను. నాకు 1953, 54 నుంచి నాటకాలు వెయ్యటం పెద్దల ద్వారా సంక్రమించిన ఆస్తి. 53 లో మా స్కూల్ లో జరిగిన ఒక పోటీలో ఒక ఫాన్సీ డ్రెస్ వేషంతో నటుడిగా నా ప్రస్థానం మొదలుపెట్టాను. అలాగే 54 లో గాయకుడిగా, ఒక హిందీ పాటతో నేను నా ప్రతిభను చాటుకుని, పాడడం మొదలుపెట్టాను. అది వైజు భావరా సినిమాలో మహమ్మద్ రఫీ గారు పాడిన ‘ఓ దునియా కే రఖ్వాలే’ అనే పాట. అనేక భాషల్లో నేను పాడగలను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అంటే, 61 సం. గా పాడుతూనే ఉన్నాను, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. 1972 లో నేను నా ‘ జిత్ మోహన్ ఆర్కెస్ట్రా ‘ అనే సొంత ఆర్కెస్ట్రా పెట్టుకుని, భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ దాదాపుగా 4500 పైగా ప్రోగ్రాంలు ఇచ్చాను.
67- 69 దాకా నేను హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ, నైట్ కాలేజీ లో లా చదువుతూ, ఒక ఏడాదిపాటు హై కోర్ట్ లో పనిచేసి, మళ్ళీ రాజమండ్రి వచ్చాను. తర్వాత సినీ ఆర్టిస్ట్ గా 75 లో బాపు గారి ‘ముత్యాల ముగ్గు’ సినిమా ద్వారా తెరంగేట్రం చేసాను. అప్పటినుంచి 210 సినిమాల దాకా, తెలుగు, తమిళ్, ఒరియా, కన్నడ, హిందీ వంటి వివిధ భాషల్లో నటించాను. కొన్ని సినిమాలో పాటలు కూడా పాడాను.
సినిమాల్లో మీరు పాడిన కొన్ని పాటల గురించి చెప్తారా ?
శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి గారిని టీస్ చేస్తూ పాడే పాట పాడాను. అలాగే, ముద్దమందారం సినిమాలో ఒక హిందీ గేయం ‘హమ్ కాలే హైతో క్యా హువా...’ పాటకు అనుకరణ అయిన ‘ నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి...’ అనే పాట పాడాను.
చిన్నప్పటి నుంచి, మీకు నటన, గానం రెండిటింటిలోనూ ఆసక్తి ఉండేదా ?
ఉండేదండి. మా నాన్నగారు, అన్నగారి వల్ల అది సంక్రమించింది. నేను సంగీతం నేర్చుకోలేదు. విని, నేర్చుకునేవాడిని. నాన్నగారు 1915 నుంచి పౌరాణిక నాటకాల్లో కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి పాత్రలు వేసేవారు. వారినుంచి, ఆ పద్యాల, పాటల్లోని ఒరవడి అబ్బింది. మా అన్నగారు శ్రీపాద పట్టాభి గారని, వారు గరికపూడి రాజారావు గారితో కలిసి, ‘రావు కళాసమితి ‘ అనే డ్రామా కంపెనీ తో 1952 నుంచి డ్రామాలు వెయ్యటం జరిగింది. అలా వీరిని చూసి నటన, గానం నేర్చుకున్నాను.
గోదావరితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా ?
నేను చిన్నతనంలో చదువుకున్న మా మున్సిపల్ హై స్కూల్ గోడ ప్రక్కనే గోదావరి ఉండేది. రోజూ 49-57 దాకా, దాదాపు 8 ఏళ్ళపాటు గోదావరితో అనుబంధం నాకు. స్కూల్ లో క్లాస్సులు ఎగ్గొట్టి, గోదావరిలో దిగి, ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆ రకంగా ఆ నీళ్ళుతాగడం వల్ల , స్థల ప్రభావం వల్ల మాకు కళలు అబ్బి, కళాకారులుగా మేము ప్రాచుర్యం పొందగాలిగాము అనే అనుభూతి, ఆనందం మాకు మిగిలిపోయింది. ఈ గోదావరి ప్రాంతంలో పూర్వం ఎందరో మహనీయులు పుట్టిపెరిగి తిరగడంవల్ల, వారి పాదస్పర్శ వల్ల పునీతమైన ఈ ప్రదేశంలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తాను.
సినిమాల్లో మీరు పాడటం ఎలా సంభవించింది ?
చిన్నప్పటి నుంచి స్కూల్ లో, కాలేజీ లో డ్రామాలు వెయ్యటం, అనేక పోటీల్లో పాల్గొని బహుమతులు గెల్చుకోవడం జరిగింది. ఆంధ్రా యూనివర్సిటీ లో చదువుతుండగా, రాష్ట్రస్థాయి హిందీ పాటల పోటీల్లో పాల్గొని వరుసగా 4 సం.లు అంటే - . 70, 71,72,73 సం.లలో గోల్డ్ మెడల్ సంపాదించాను. అప్పట్లో అందరూ తెలుగు పాటలే పాడేవారు, హిందీ పాటలు పాడితే నాకంటూ ఒక గురింపు ఉంటుందన్న ఉద్దేశంతో హిందీ పాటలు పాడడం మొదలుపెట్టాను.ఆ రకంగా నాకు సినిమాల్లో ఛాన్స్ రావడం కూడా హిందీ పాటలవల్లనే జరిగింది.
ఒకసారి 1976 వ సం. లో సిరిసిరిమువ్వ తీస్తుండగా, వర్షం వల్ల ఒక షూటింగ్ ఆగిపోతే, ఆ సమయంలో విశ్వనాధ్ గారు, ‘మీరు బాగా పాడతారటగా, పాడమని అడగ్గా, రెండు హిందీ పాటలు పాడటం జరిగింది. అది విని ఆయన శంకరాభరణం సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
శుభప్రదం సినిమాలో ఓపెనింగ్ లో ఒకచోట హిందీ పాట పాడించారు, అందులో నేను నటించడం కూడా జరిగింది. అలాగే జంధ్యాల గారు, ముద్దమందారం సినిమాలో ‘ నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి...’ అనే పాట పాడించారు.
18 రకాల గాయకుల్ని అనుకరించి పాడడం నా ప్రత్యేకత. పిఠాపురం నాగేశ్వరరావు గారు, పి.బి.శ్రీనివాస్ గారు , సత్యం గారు, కిషోర్ కుమార్ గారు, రఫీ గారు ఇలా ఎందరో గొంతుల్ని ఏకలవ్య శిష్యుడి లాగా గమనించి, అనుకరిస్తాను. హిందీలో 9 మందిని, తెలుగులో 9 మందిని అనుకరిస్తాను. గానం పట్ల ఉన్న అభిరుచితో ఎన్నో ప్రయోగాలు చేసాను. 73 సం. గా పాడుతున్నాను, ఇప్పటికీ భగవంతుడు నాకు పాడే శక్తిని అనుగ్రహించాడు.
సినీరంగంలో మీ ప్రస్థానం ఎలా కొనసాగింది ?
రాజమండ్రి లోనే షూటింగ్ లు ఎక్కువ జరగటంవల్ల, నేను ఇతర ప్రదేశాలకు వెళ్ళకుండా అక్కడే నటించే వీలు కలిగింది. రాజమండ్రిలో షూటింగ్ కోసం వారి రాకకి నేను సహాయపడబట్టి, సినిమాల్లో చిన్న వేషమైనా సరే, గుర్తింపు ఉన్న వేషాలు నాకు ఇచ్చారు. సినిమా ముత్యాలముగ్గులో హీరొయిన్ ను రేప్ చేసే వేషం బాపు గారు నాకిచ్చారు. దానికి కీచకుడు అని పేరు పెట్టారు. తర్వాత సిరిసిరిమువ్వ, సప్తపది, శంకరాభరణం, శ్రీరామదాసు, వంటి సినిమాలు, ఇ. వి. వి. సత్యనారాయణ గారు, జంధ్యాల గారి, రాఘవేంద్రరావు గారు, కోడి రామకృష్ణ గారు, తమిళ్ డైరెక్టర్ బాలచందర్ గారు, మహనీయుల సినిమాలు వంటివి చేసాను. ఆనందభైరవి తెలుగు, కన్నడ సినిమా రెండింటిలోనూ ఒకేసారి ఆక్ట్ చేసాను. బాలచందర్ గారి సినిమా ‘తొలికోడి కూసింది’ తమిళ్ వెర్షన్ లో, హిందీ సినిమాలు ‘సిరిసిరిమువ్వ ‘ ను సర్గం అనే పేరుతో హిందీలో తీస్తే నటించాను, శంకరాభరణం- సుర్ సంగం పేరుతో, శుభలేఖ- శుబ్ కామ్నా పేరుతో హిందీలో తీస్తే, ఆ వెర్షన్ లలో కూడా నటించాను. అలాగే బాపు గారు బుద్ధిమంతుడు సినిమాని హిందీలో పరమాత్మ అనే పేరుతో తీస్తే అందులో నటించాను. ఇతర భాషల్లోని సినిమాలు కూడా రాజమండ్రిలో చేసాను.
మరి సినీరంగంలో నటిస్తూ, అడ్వకేట్ గా మీ వృత్తిని ఎలా కొనసాగించారు ?
నేను చెప్పాలంటే, అన్నింట్లోనూ ఉన్నానండి, రాజకీయాల్లో, సామాజిక సేవలో. చిన్నప్పటి నుంచి కూడా అనేక క్రీడల్లో ఆడుతూ, నేషనల్ లెవెల్ లో బహుమతులు గెల్చుకున్నాను. గాయకుడిగా, నటుడిగా, రాజకీయవేత్తగా, సహకార వాదిగా, క్రీడాకారుడిగా, అడ్వకేట్ గా... నాకున్న సమయాన్ని అన్నింటికీ వెచ్చించుకున్నాను. అన్నింట్లోనూ రాణించాను.
నాటకరంగంలో నాడు- నేడు ఎటువంటి పరిణామాలు జరిగాయండి ?
నాటకరంగంలో ఏంటంటే – పూర్వం నాటకాలు వెయ్యడం చాలా కష్టంగా ఉండేది. సొంతడబ్బులు వెచ్చించి, అన్ని సామాన్లు కొని, ప్రయాణాలు చేసి, ఊర్లు వెళ్లి వాళ్ళను అభ్యర్ధించి చెయ్యాల్సి వచ్చేది. ఇవాళ ఒక డ్రామా గెలిస్తే దానికి కాష్ ప్రైజ్ ఇస్తున్నారు. పూర్వం గాని ఇచ్చుంటే, చాలా బాగుండేది, ఇబ్బందులు తగ్గేవి. సరైన వేదిక దొరక్క పార్క్ లలో వెయ్యాల్సి వచ్చేది.
ఇంకా ఈ పద్యాలు పాడుతూ నాటకాలు వేసే సంస్కృతి ఇంకా కొనసాగుతోందా ?
పూర్వం ఈ పద్య నాటకాలు చాలా అద్భుతంగా ఉండేవి. తర్వాత రానురానూ వాటికి ఆదరణ తగ్గి, అవసాన దశకు వచ్చాయి. మళ్ళీ గత 8, 10 ఏళ్ళుగా నంది నాటకోత్సవాలు నిర్వహిస్తూ ఉండడంవల్ల అవి మళ్ళీ బ్రతికాయి.
నంది నాటకోత్సవాల్లో మీరు ఎటువంటి పాత్ర నిర్వహించారు ? ఇవి చూసినప్పుడు మీకు ఎటువంటి అనుభూతి కలిగింది ?
నేను ఈ ఉత్సవాల్లో స్టేజి చైర్మన్ గా ఉన్నాను. నటించలేదు. భారత నాటక ప్రక్రియ చాలా గొప్పది. గొప్ప కళాకారులు, ప్రయోగాలు చేసినవారు ఉన్నారు. అన్ని జిల్లాల కళాకారులతో గత 50 ఏళ్ళుగా నాకు అనుబంధం ఉంది. దానితో రచయతలు, నటులతో నాకు గొప్ప అనుబంధం ఉండేది.
గాయకుడిగా మీ ప్రస్థానం ఎలా సాగింది ?
ఆంధ్రదేశంలో ఏ పల్లెటూరికి వెళ్ళినా నన్ను గుర్తిస్తారు. కొన్ని వేల గ్రామాల్లో, ఏ మూలకు వెళ్ళినా, ‘మీరు మా ఊళ్ళో పెళ్ళిలో పాడారు, ఉత్సవాల్లో పాడారు, లేక రాజకీయాలకు సంబంధించిన మీటింగ్ లలో పాడారు అంటారు. 4500 ప్రోగ్రాంలు ఇవ్వడం అంటే మాటలు కాదు కదా ! ట్రైబల్ ఏరియా లో కూడా పాడాను.
పాట అనేదానికి భాషా, ప్రాంత భేదాలు ఉండవు. పాటలో ఉండే రిథం అందరినీ ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ప్రజల్ని అలరిచాలంటే, సినిమా పాటలే పాడాలి, అని నా అభిప్రాయం. స్కూల్ లో ఉండగా 54 లో రాజమండ్రి లో ఉన్న ఆర్కెస్ట్రా వారు మమ్మల్ని రానిచ్చేవారు కాదు. నేను, మా ఫ్రెండ్స్ ఇద్దరు – ఒకరు తబలా, ఒకరు హార్మోనియం తో పాడే వాళ్ళం. క్రమేపి అలా నెమ్మదిగా సొంత ఆర్కెస్ట్రా తయారుచేసుకున్నాను.
మిమిక్రీ మీకు ఎలా అలవడింది ?
ఆసక్తి తో దృష్టి కేంద్రీకరించడం వల్లనండి. ఒక వ్యాపారవేత్త తన మంచి మాటలతో, కష్టసుఖాలు అడుగుతూ కొనుగోలుదారుల్ని ఎలా ఆకట్టుకుంటాడో, అలాగే సమయానుకూలంగా అక్కడి ప్రజలు ఎవరి పాటల్ని ఆసక్తిగా వింటారో, అందుకు తగ్గట్టుగా పాటల్ని ఎంచుకుని, వారి స్వరాలను అనుకరించి పాడుతూ అందరినీ రంజింపచేసేవాడిని. పాటకు టాలెంట్ ఒక్కటే ముఖ్యం.
మీరు రాజకీయ, సేవా రంగాల్లో చేసిన సేవలను గురించి చెబుతారా ?
BJP లో ఉండగా స్టేట్ కౌన్సిల్ మెంబెర్ గా, సాంస్కృతిక శాఖ కన్వీనర్ గా చేసాను. కాంగ్రెస్ లో ఉండగా సెన్సార్ బోర్డు మెంబెర్ గా చేసాను. నాకున్న పరిధిలో నేను జిల్లా యావత్తూ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉండి చాలా కార్యక్రమాల్లో చేసాను. 5 పుష్కరాలు చూసాను, అన్ని పుష్కరాల్లో సాయం అందించాను.
ఈ పుష్కరాల్లో రాజకీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. మాకు అనేక స్వచ్చంద సేవా సంస్థలు కూడా ఉన్నాయి. వచ్చిన వాళ్లకి వసతి భోజన సదుపాయాలు, ప్రదేశాల వివరణ, పిండ ప్రదానం గురించిన అంశాలు, ఇటువంటివి చేస్తుంటాం. వాళ్ళని గైడ్ చేస్తుంటాము.
మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని అనుభూతుల గురించి చెప్తారా ?
నేను 20 ప్రదేశాల్లో కిశోర్ కుమార్ అవార్డును పొందాను. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, వంటి చోట్ల నాకు సన్మానం చేసారు. నాటకపోటీలలో కూడా అనేక ప్రైజులు గెల్చుకున్నాను.
సినిమా కంటే నాటకాల్లో నటించడం కష్టం. ఇక్కడ టేక్ లు ఉండవు. చిన్న తప్పు జరిగినా, జనంలో అభాసుపాలు అవుతారు. పోటీల్లో ఓడిపోతారు. ఈ రకంగా నాటక ప్రక్రియలో, ఉన్న కాస్త స్థలంలోనే, జనంలో ఆఖరి వరుసలో కూర్చున్న వారికి కూడా భావం, మాట, నటన స్పష్టంగా కనిపించేలా చూసుకోవడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఉన్నసమయంలోనే, ప్రోమ్ప్తింగ్ ఉన్నా, సమయస్పూర్తితో ,మన ప్రతిభ అంతా చూపించాలి. అందుకే నా ఉద్దేశంలో నాటక ప్రక్రియ చాలా గొప్పది.
బహుమతులు అనేకం వచ్చినా, ఒక్క ప్రశంస వంద బహుమతులు పొందిన దానికంటే ఎక్కువ అని నేను భావిస్తాను. కళాకారుడికి కావలసింది చిన్న ప్రశంస, దానితోనే అతను రాణిస్తాడు. అంతమందిని రంజింపచెయ్యాలంటే, అతనికి టాలెంట్ తో పాటు భగవత్ శక్తి కూడా కావాలి. ప్రేక్షకుల నాడి కనిపెట్టి చెయ్యడం వల్లే ఇన్నాళ్ళు నేను రాణించగలిగాను.
73 ఏళ్ళ నిండు జీవితాన్ని చూసిన వ్యక్తిగా భావికళాకారులకి మీరిచ్చే సందేశం ఏమిటి ?
ఎంత కృషి చేస్తే, అంత పైకి వస్తారు. ఒక 25 కిలోల ముద్దను ఉందనుకోండి, ఒకేసారి తినలేము కదా, ముక్కలు ముక్కలుగా తినాలి. అలాగే కళాకారుడు కూడా అంచెలంచలుగా నేర్చుకుంటూ ప్రతిభను పంచాలి. క్రింది స్థాయి నుంచి నేర్చుకుంటూ, కొన్నేళ్ళు కృషి చేస్తేనే పైకోస్తారు. ఆభరణం చెక్కడానికి, బొమ్మను వెయ్యటానికి, శ్రమించినట్లే, కళాకారుడు కూడా కష్టపడాలి. 50 లలో మా ఇంటిప్రక్కన సినిమా హాల్లో సినిమా వేస్తుంటే, గోడ పక్కన నుంచుని, పాటలు రాసుకుని పాడేవాళ్ళం. తర్వాత రేడియో లు అవీ వచ్చాయి. ఆ కృషే, ఈ రోజున నన్నిలా నిలబెట్టింది.
ఒక్క రంగంలోని వారికే ఐక్యత లోపిస్తున్న తరుణంలో రాజకీయ, న్యాయవాద, సాంఘిక, సేవా, కళా, సినీ, నాటక రంగాల్లోని వారికి మీరు తలలో నాలుకలా మెలగుతూ, ఇన్నేళ్ళుగా సహకరిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమయ్యింది?
విభేదాలు కలుగుతున్నాయి అంటే, క్రింది మూడు లక్షణాలు మీలో ఉన్నాయేమో సరిచూసుకోవాలి... లేకపోతే, పతనం తప్పదు.
- ఒక వర్గానికి కొమ్ము కాయటం
- స్వార్ధంగా ఆలోచించడం
- అసూయతో ప్రవర్తించడం
వీటి వల్లనే అభిప్రాయ భేదాలు వస్తాయి. తోటివాళ్లకు దూరమవుతాము, ఆరోగ్యం కూడా పాడవుతుంది. తోటి వాళ్లకు చేయూతనిస్తూ, వాళ్లకు అవకాశమిస్తూ , నాకు వాళ్ళూ అవకాశమిస్తూ ఉండడం వల్లనే, నేను ఇన్ని రంగాల్లోని వారితో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాను. స్వార్ధం వల్ల ఓటమి, అసూయ వల్ల ఆరోగ్యం పాడవడం తప్పదు. నేను బాగుండాలి, నా తోటివాళ్ళూ బాగుండాలి - అని నేను అనుకోవడం వల్లనే, 73 ఏళ్ళ వయసులో కూడా చక్కటి ఆరోగ్యంతో జీవిస్తున్నాను.
చాలా సంతోషమండి, అమూల్యమైన విషయాలు వివరించారు. భవిష్యత్తులో కూడా మీరు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని, మా పాఠకులు అందరి తరఫునా కోరుకుంటున్నాను. కృతజ్ఞాతభివందనాలు .
శ్రీ జిత్ మోహన్ గారితో నా ముఖాముఖి ని, చివరిలో వారి గళం నుంచి జాలువారిన రెండు అద్భుతమైన పాటల్ని, క్రింది లింక్ లో వినండి .
No comments:
Post a Comment