తెలుగు భాషకు మకుటం - రాజరాజ నరేంద్రుడు - అచ్చంగా తెలుగు

తెలుగు భాషకు మకుటం - రాజరాజ నరేంద్రుడు

Share This

// తెలుగు భాషకు మకుటం - రాజరాజ నరేంద్రుడు//

                                                                 - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్,   

                                                                                            21.06.2015


"రాజమహేంద్రి ధన్య, కవిరాజ ! మిముంగని; ధన్యుదయ్యె నా
రాజనరేంద్రు డాశశివిరాజిత కీర్తిసమార్జనంబునన్
తేజమునొంది రాంధ్రులు త్వదీయ కృతిన్; గయికొమ్ము భక్తి నీ
రాజనముల్ బుధావళినిరంతర మర్చనసేయు నిమ్ములన్"  
                                                                        - డా .యస్వీ  రాఘవేంద్ర రావు .
 ******
                  గోదావరి గురించి, తెలుగు గురించి చెప్పాలంటే,  ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన,  చెప్పాల్సిన  పేరు రాజరాజ నరేంద్రుడు అనే చాళుక్య రాజు పేరు.. ఆయన గురించి తెలుసుకోకుండా తెలుగు హొయలు లేవు .. గోదావరి నడకలు లేవు అనేది  అతిశయోక్తి కాదేమో.. అందుకే వారి గురించి అనేక శోధనలను, క్రోడీకరించిన ఈ చిన్న వ్యాసం అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రిక పాఠకుల కోసం . .

మరి రాజరాజ నరేంద్రుడి గురించి తెలుసుకుందామా ...
           దక్షిణ భారత దేశం లో తూర్పు ప్రాంతం లోని ఆంధ్రదేశమునకు వేంగి/వేగి దేశమని  పేరు కలదు. ఈ వేగిదేశము 8000 చదరపుమైళ్ళ వైశాల్యం కలిగి ఉండేది. పడమర  తూర్పుకనుములకు, తూర్పున  సముద్రమునకు,  ఉత్తరాన గోదావరి నదికి,  దక్షిణాన కృష్ణానదికి  మధ్యస్థల మయిన తెలుగుదేశము నే , వేగిదేశము అనేవారు.  ఈ వేగిదేశమునకు వేగి అను పట్టణము రాజధానిగా ఉండేది.
           ఈ వేగిదేశ పాలకుడు, చాళుక్యరాజు విమలాదిత్యుడు.  విమలాదిత్యడు రాజరాజచోడుని, కూతురును అనగా  రాజేంద్రచోడుని చెల్లెలు కూండవాంబాదేవిని వివాహమాడెను.  విమలాదిత్యునికి కూండవాంబాదేవి యందు జనించిన జేష్ఠపుత్రుడే  రాజరాజ విష్ణువర్ధనుడు.  ఇతడు రాజరాజచోడుని మనుమడు కావటం వల్ల   చోడులు ఇతనిని  రాజరాజని పిలిచేవారు. చాళుక్యులు ఇతనిని విష్ణువర్ధనుడని పిలిచేవారు.  రాజరాజను పేరు వహించిన వేంగిరాజులలో  మొదటివాడును,  విష్ణువర్ధన పేరు వహించిన వేంగిరాజులలో ఇతడు తొమ్మిదవవాడు.  రాజరాజ నరేంద్రునుకి  విజయాదిత్యుడను తమ్ముడు కూడా ఉన్నాడు..  తూర్పు చాళుక్య రాజవంశస్తులు జైనమతం మరియు శైవ మతంకు మద్దతు నిచ్చారు. రాజరాజ నరేంద్రుడు శైవమతస్తుడు . అయినా అతను బ్రాహ్మణులను, వారి సంస్కృత భాషను , మరియు వారి మతాన్ని  గౌరవించాడు.
          రాజరాజ నరేంద్రుడు క్రీ.శ.1022 నుండి క్రీ.శ1063 వరకు 41 సంవత్సరములు వేగి దేశాన్ని పరిపాలించాడు.  ఆంధ్రదేశమును పరిపాలించిన పూర్వరాజులలో రాజరాజ విష్ణువర్ధనుడు మిక్కిలి అదృష్టవంతుడని చెప్పవచ్చంటారు చరిత్రకారులు. . తమ భుజ బల పరాక్రమముచేత దక్షిణ హిందూ దేశమునంతను జయించి శత్రుజన భయంకరులైన చోడరాజులకు , రక్తబంధువవటం తో ,  ఇతర రాజులు  ఎవ్వరును ఇతని జోలికి, గానీ ఇతని రాజ్యం జోలికి  గాని వెళ్ళేందుకు సాహసించేవారు గాదు.   అందువలన ఆంధ్రదేశమునకు శాంతి నెలకొనడం సుసాధ్యమైంది రాజరాజ నరేంద్రునికి.
     రాజరాజ నరేంద్రుడు శాలివాహన శకము 944వ సంవత్సరము శ్రావణ బహుళ ద్వితీయా, గురువారము నాడు ఉత్తరాభాద్ర నక్షత్రమున సింహాసన మెక్కినట్లు  కోరుమల్లి నందమపూడి శాసనములవలన తెలుస్తోంది.  ఈ కాలము లెక్కలేసి చూడగా,  క్రీస్తుశకము 1022 వ సంవత్సరము జులై నెల పంతొమ్మిదవ తేదితో సరియగుచున్నది.
         కులోత్తుంగు చోళదేవుడు , గోదావరి మండలములోని కోరంగికి సమీపమున ఉండే చెల్లూరు గ్రామము కొలనుకాటమ  నాయకున కిచ్చినట్టియు కాలేరగ్రహారమును,  దాక్షారామ పీఠికా పుర సత్రములను జరుపుటకయి ముద్గలగోత్రుడును పోతనార్యుని పుత్రుడునయిన మేడమార్యుడను బ్రాహ్మణునకిచ్చినట్టి,  దాన శాసనములను బట్టి రాజరాజనరేంద్రుని కుమారుడయిన కులోత్తుంగ చోడదేవుడు శాలివాహనశకము 986వ సంవత్సరమనగా క్రీస్తుశకము 1063వ సంవత్సరమున రాజ్యమునకు, వచ్చినట్టు చెప్పబడియున్నది గనుక రాజరాజనరేంద్రుడు1022వ సంవత్సరము మొదలుకొని 1063వ సంవత్సరము వరకును 41సంవత్సరములు నిరాటంకము గా రాజ్య పరిపాలన చేసినట్లు చరిత్రకారులు లెక్కలు గట్టారు.
       రాజ రాజనరేంద్రుడు 1011 వ సంవత్సరమునకును నడుమ జన్మించి ఉండవచ్చని,  సింహాసన మెక్కునప్పటికి పది , పన్నెండు సంవత్సరాల బాలుడై ఉంటాడని ఒక అభిప్రాయం కాగా ,     మరి కొన్ని లెక్కల ప్రకరం  రాజరాజ నరేంద్రుడు సింహసనమెక్కునప్పటికి  ఇరవై ఏళ్ళు లోపల  ఉండొచ్చని కొందరి అభిప్రాయం .  నూనుగు మీసాల నూతన యవ్వనమున సింహాసనం అధిష్టించాడనేది మాత్రం ఖాయం.
      విక్రమాదిత్య  1022 తొలినాళ్ళలో  లేదా మధ్యలో మరణించి ఉంటాడని,  1006 లో  పుట్టీన రాజరాజ నరేంద్రునికి పదహారేళ్ళు (16 ఏళ్ళు) ఉండొచ్చని,  తండ్రి మరణానంతరం తనను తాను గా రాజ్రాజ నరేంద్రుడు ప్రకటించుకున్నాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం .
    రాజరాజనరేంద్రుడు సింహాసనమెక్కిన తరువాత కొండ రాజేంద్రుని కూతురగు అమ్మంగదేవిని వివాహమాడాడు. .  రాజరాజ కాలంలో వేగి దేశం సుభిక్షంగా ఉండటం వెనుక చోడుల సహకారం ఉన్నప్పటికీ రాజరాజు అన్నీ విద్యల్లో నిష్ణాతుడు..

తెలుగు భోజుడు రాజరాజ...
          తెలుగు మకుటం రాజరాజ నరేంద్రుడు,  కీర్తి మంతుడగు  భోజరాజు ఇద్దరూ సమకాలీనులవ్వడం  ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశం.  భోజరాజు 1018 వ సంవత్సరము మొదలుకొని 1060 వ సంవత్సరము వరకు ధారాపురి రాజధానిగా మాళవదేశాన్ని,  నలభై ఏండ్లు పైగా రాజ్యపాలన చేశాడు..  దాదాపు నలుబై  ఒక్క సంవత్సరం  రాజ రాజనరేంద్రుడు వేగి దేశా రాజ్యపాలన చేశాడు.   ఇద్దరిలో  విద్యావిషయాలలో , సాహిత్య అభిలాషలో దగ్గరి పోలికలున్నాయి. భోజరాజు సంస్క్ట్రత సాహిత్యాన్ని పోషించి, కళాశాలలు నిర్మించి, కవులను పోషించి  దేశంలోనే పేరు ప్రఖ్యాతులు పొందిన రాజు గా చరిత్ర చెబుతుంటే.. అదే కాలంలో తెలుగుకు పట్టం కట్టీ. తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చి, మహాభారతం వంటి పంచమ వేదాన్ని తెనిగీకరించేందుకు కృషి చేసిన  కవిరాజు గా రాజరాజ నరేంద్రుడు తెలుగు వారి హృదిలో నిలిచి పోయారు...
రస సిద్ధుడు రాజరాజ ...
రాజరాజ నరేంద్రుడు కావ్య సంగీత సాహిత్య ప్రియుడని నన్నయ్య భట్టు తన  మహాభారతములో చెప్పాడు.  ఇతని కొలువులో బహుభాషా పండితులు కొలువయ్యారు.   చేతన భట్టు , నారాయణ భట్టు, నన్నయ్య భట్టు,  ముట్టే భట్టూ, నారాయణ కవి  వంటి కవివరులు రాజ రాజ  ఆస్థానాన్ని తమ సాహిత్యంతో ఓలలాడించారు..
 తెలుగన్న బహు తీపి ...
రాజరాజ నరేంద్రుడికి తెలుగు భాష పట్ల విపరీతమైన అభిమానం . ఎన్నో భాషలలో విన్న మహాభారతాన్ని తెలుగులో వినాలన్న కుతూహలం ఆయనను మహోన్నతుడిని చేసింది.  ఆ తెలుగు భాషాభిమానమే రాజరాజనరేంద్రుని చిరంజీవిగా మన ముందుంచింది.
          తెలుగు భాకు ఏదైనా చేయాలంటూ మిత్రుడైన   నారాయణ భట్టును రాజరాజ నరేంద్రుడు కోరినప్పుడు  కన్నడ పండితుడైన నారాయణ భట్టు,  ఆ పనికి నన్నయ భట్టు ని సూచించాడు.  ఆవిధంగా రాజరాజమహేంద్రుని కొలువులో నన్నయ చేరి,. రాజు కుటుంబ పురోహితునిగా కూడా కొనసాగారు.
     రాజరాజనరేంద్రుని పాలనా సమయంలోని  క్రీ.శ. 1045-1060 మధ్య కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉంటుంది . నన్నయ ముద్గల గోత్రజాతుడగు వైదికబ్రాహ్మణుడు. అతడు రాజరాజ నరేంద్రుని కులబ్రాహ్మణుడు అని తన మహాభారత పద్యంలో చెప్పుకున్నాడు నన్నయ్య.
       శైవ మతాభిమానము గల వాడేఇనప్పటికీ శ్రీమహాభారతము నందలి అభిప్రాయాన్ని వినాలన్న అభిలాషను  రాజరాజ నరేంద్రుడు.. ...ఈ క్రింది పద్యంలో  నన్నయ భట్టు దగ్గర వెలిబుచ్చారు.
" జననుత కృష్ణద్వైపాయనముని
వృషభాభి హితమహాభారత బ
ద్ధనిరూపితార్థమేర్పడ
దెనుగున రచియుంపు మధికదీయుక్తిమెయిన్." అని  రాజరాజనరేంద్రుడు నన్నయ్య భట్టుని  "భారతాంధ్రీకరణం" చేయాలని అర్ధించాడు..
ఆయన కోరిక పై గోదావరీ తీరంలో రాజరాజనరేంద్రునికి వినిపించినదే ఈ తెలుగు మహాభారతమని చెబుతుంటరు.
       మూడు భాగాలుగా తెలుగుభారతం రాసిన కవిత్రయం లో చివరివాడైన ఎర్రాప్రగ్గడ 200 ఏళ్ళ తరువాత , అప్పటికే మరణించిన రాజరాజ నరేంద్రునికే తాను అనువదించిన భాగాన్ని అంకితం ఇచ్చారంటే,  ఆ ఉత్కృష్టమైన పనిని  ప్రోత్సహించిన రాజరాజనరేంద్రుని ప్రభావం ఎంతగా వుందో అర్ధం చేసుకోవచ్చు.
రాజమహేంద్రవరము ....
                   గోదావరి తీరాన నిర్మించిన ఈ పట్టణానికి, రాజరాజ నరేంద్రునికి అవినాభావ సంబంధం ఉంది..  రాజమహేంద్రపురము రాజమహేంద్రుడని బిరుదుగాంచిన అమ్మరాజు విష్ణువర్ధనుని కాలములో  కట్టబడినట్లు శాసనకారుల అభిప్రాయము.   రాజరాజనరేంద్రునకు ఆ పట్టణము రాజధానిగా ఉంది. .  రాజమహేంద్రపురము వేగి రాజ్యములో మధ్యమభాగమున నుండుట చేత రాజనరేంద్రుడు ఇందులో ఒక  కోటను గట్టి , తనకు రాజధానిగ జేసి కొని చిరకాలము రాజ్యపాలన చేశాడు.    ఆ రాజమహేంద్రవరమే నేడు రాజమండ్రిగా పిలువబడుతోంది.   ఈ వేగిపురమును పరిపాలిస్తున్న రాజరాజ నరేంద్రుని పేరు తోనే   ఈ నగరానికి రాజమహేంద్రవరము అనే పేరు వచ్చిందని కూడా కొందరి అభిప్రాయం.
                   రాజమహేంద్రపురము వేగిదేశంబునకు నాయకరత్నంబని నన్నయభట్టు తన  మహాభారతమున జెప్పియున్నాడు, ఈ పట్టణమునకు గలిగిన ప్రఖ్యాతి రాజనరేంద్రుని మూలమున గలిగినదేగాని మఱియొకరి మూలమున కలిగినది కాదు అనేది కొందరి అభిప్రాయము. .   విన్నకోట పెద్దన్న యనుకవి తనకావ్యాలంకార చూడామణిలో తన కృతికర్తయగు విశ్వేశ్వర మహారాజువంశమును వర్ణించునపుడు
"..............
రాజమహేంద్రనరస్థాతరాజన
రేంద్రుడెక్కువ తాత యే విభునకు................" అంటూ ప్రస్తుతించారు. .
రాజరాజ నరేంద్రుడు చేసిన  తెలుగు భాషా సేవకు ప్రతిఫలంగా మొదటిసారి 1924 ఆగస్టు 17 న రాజమండ్రి లో రాజరాజ నరేంద్రుని 900 వ సంవత్సర పట్టాబిషేక మహోత్సవం జరిగింది.చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు ఆ తేదీని నిర్ధారించడమే కాక స్వయంగా ఆ వేడుకలో పాల్గొన్నారు.. .
రాజరాజ నరేంద్రుని బిరుదులు ....
          సత్యాశ్రయ కులశేఖరుడు, సర్వ లోకాశ్రయుడు, రాజ కంఠీరవుడు, త్రిభుననాంకుశుడు, సమస్త భువనాశ్రయుడు, బిరుదాంక భీమడు, రాజమహేంద్రుడు, రాజమార్తాండుడు, పరగండ భైరవుడు, రాజ పరమేశ్వరుడు మొదలగు బిరుదునామములెన్నో వహించి రాజరాజనరేంద్రుడు ప్రఖ్యాతి గాంచిన వాడని, నన్నయభట్టనేక బిరుదులతో  ఆయనను కీర్తించాడు. అంతేగాక  రాజనరేంద్రుని "నారాయణాఖ్యు"డనియు "విష్ణుమూర్తి" అని కూడా పొగిడాడు నన్నయ.
sahakaaraM :   రాజరాజ చాళుక్య -  భావరాజు వి. కృష్ణారావు గారి  ఆంగ్ల వ్యాసం,  వికీపీడియా రాజరాజ నరేంద్రుడు, నన్నయ వ్యాసాలు ,  ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము  (1910), పదునాలుగవ ప్రకరణము - - చిలుకూరి వీరభద్రరావు రచన ,సుమశ్రీ బ్లాగ్ లోని "వేంగీమహాజ్ఞాని" రాజరాజనరేంద్రుడు పద్యాలు, మరియు మరికొన్ని చిన్న వ్యాసాలు .

No comments:

Post a Comment

Pages