రుద్రాణి రహస్యం – 4 - అచ్చంగా తెలుగు

రుద్రాణి రహస్యం – 4

Share This

రుద్రాణి రహస్యం – 4

 వేద సూర్య


(జరిగిన కధ : రుద్రాణి కోనలో ఉన్న శక్తిని వశం చేసుకోవాలని చూస్తుంటాడు ఫ్రెడ్రిక్. ఈ ప్రయత్నంలో భాగంగా అతను పంపిన ఇద్దరు విదేశీయులు, కొనలో అకస్మాత్తుగా కనిపించిన వెలుగుతో మాడి మసైపోతారు. ఇది ప్రొజెక్టర్ పై చూసిన ఫ్రెడ్రిక్ విస్తుపోతూ ఉండగా, విలియమ్స్ అతన్ని క్షుద్రపూజలు చేసే అత్రిక వద్దకు తీసుకువెళ్తాడు. ఆ శక్తి అత్రికకు అందక, ఆమె వారిని భారత్ లో ఉన్న తన గురువు తంత్రిణి వద్దకు వెళ్ళమని పంపుతుంది. గండరుడి కోసం పూజలు చెయ్యాలని నిశ్చయించుకుంటుంది తంత్రిణి. రుద్రాణి కోనకు ఆర్కియాలజి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రవల్లికకు బదిలీ అవుతుంది. సృష్టి, అధ్భుత్ కలిసినప్పుడల్లా ప్రమాదాలు తప్పిపోతుంటాయి.  ప్రవల్లిక వెళ్తున్న జీప్ పంక్చర్ అయితే, ఆ అడవిలో తిరుగుతున్న దేవ్ రిపేర్ చేస్తాడు. తంత్రిణి హోమానికి ప్రసన్నుడైన గండరుడు రుద్రాణి కోన రహస్యం గురించి చెప్తూ ఉంటాడు. ఇక చదవండి...)
ఆడ, మగ అనే భేదం లేకుండా ఆంగ్లేయులతో ప్రతిఘటించారు వాళ్ళంతా. రుద్రాణి శక్తి అండగా నిలవటంతో ఆంగ్లేయులు కోయ సైన్యాన్ని ఏమి చేయలేకపోయారు. రుద్ర కోటను దైవశక్తి కాపు కాస్తున్నదని తెలుసుకుని క్షుద్ర ఉపాసకుడైన కింకాసురుడిని సాయం అడిగారు ఆంగ్లేయులు.
ఆ మణిని సొంతం చేసుకుంటే అతనికి ఎదురే ఉండదని పధకం వేసిన కింకాసురుడు , జాబిల్లి మీద కన్నేసిన సిద్ద అనే కోయవాడిని లొంగదీసుకున్నాడు. జాబిల్లి , సూరీడుల ప్రేమను  అంగీకరించిన సింగడు , రుద్రాణి ఆలయంలో పూజలు నిర్వహించే పూజారి ఆశీస్సులతో  శ్రావణ పౌర్ణమి రోజున వివాహం నిర్ణయించాడు .వివాహ సమయానికి  కుతంత్రంతో సూరీడుని అంతం చేసి మణిని దొంగిలించాలని సిద్ధ వేసిన పధకం తెలిసిన లచ్చిమి, హెచ్చరించే లోపు దాడి చేసిన ఆంగ్లేయులు సూరీడు, జాబిల్లిలను హతమార్చారు .అప్పటివరకు కింకాసురుడి క్షుద్ర స్తంభనలో ఉన్న రుద్రాణి లచ్చిమి, గన్నడు చేసిన ఆత్మ త్యాగం వల్ల విముక్తురాలై ఆగ్రహించి కింకాసురుడిని, ఆంగ్లేయులను దహించి వేసింది.  సూరీడు , జాబిల్లిల మరణంతో ఆ నేల మలినమైందని ఆగ్రహించిన రుద్రాణి ప్రతి రాత్రి  వెలుగు రూపంలో అక్కడేనాట్యం చేస్తుంది. ఆమె ఆగ్రహం సూరీడు, జాబిల్లి మళ్లీ పుట్టిన తరువాతే తీరుతుందని , వారిద్దరూ కొన్ని వందల సంవత్సరాల తరువాత రాబోయే బ్రహ్మ ముహూర్తం లో పుడతారని , వారి కలయిక వారికి తెలియకుండా జరుగుతుందని వారి రాక ను కొడిగట్టిన ఆలయ దీపమేచెపుతుందని , వారి రాకతోనే మైల పడిన ఆ నేల పులకిస్తుందని చెప్పింది రుద్రాణి. అప్పటివరకు ఆ నేలకు సంబంధం లేని వారు ఎవరు అడుగు పెట్టాలని చూసినా రుద్రాణి ఆగ్రహానికి బలైపోతారు. కింకాసురుడిని పూర్తిగా చంపకుండా శక్తి హీనుడిని చేసి బూడిదగా మార్చి, తిరిగి బ్రతికించి, ఆమె జ్వాలలకుఇప్పటికీ బలి చేస్తూనే ఉంది. “ అంటూ రుద్రాణి కోన కధ చెప్పాడు గండరుడు.
గండరుడు చెప్పింది విన్న తంత్రిణి  “వారిద్దరి ని పట్టేదెలా?” అని అడిగింది .
“వారిద్దరూ కలిసారు, త్వరలోనే వారు కోనకు చేరబోతున్నారు. వారు మానవమాత్రులైనా వారిని ఎదిరించటం సులభం కాదు , వారిద్దరూ కోనలోకి అడుగు పెట్టిన మరుక్షణమే వారికి తెలియకుండా వారు శక్తివంతులవుతారు. ఆ శక్తిని ఎదిరించాలంటే మన శక్తి సరిపోదు. రుద్రాణి శక్తినే స్థంభింపచెయ్యగల కింకాసురుడి సాయం కావాలి. బందీగా ఉన్న కింకాసురుడిని పునః శక్తి వంతుడిని చేయటానికి 48 రోజులు నగ్నంగా ద్వాదశ వక్ర హోమం చేయాలి. వక్రుడు ప్రసన్నం కావాలంటే నిన్ను నువ్వు పూర్తిగా వక్రుడికి అర్పించుకోవాలి. వక్రుడుని మెప్పించగలిగితే నీ పని సగం పూర్తి అయినట్లే .. దుష్ట గ్రహ యోగ చక్రంలో పుట్టిన పునర్వసు నక్షత్ర జాతకుడు అతనికి తెలియకుండానే నీకు సాయమవుతాడు.” అని చెప్పి అంతర్దానమయ్యాడు గండరుడు.
తంత్రిని అత్రికను అష్టాదశ శక్తులను సంపన్నం చేసుకునే హోమాన్ని మొదలుపెట్టమని ఆజ్ఞాపించింది. ఆమె వక్రుడిని ప్రసన్నం చేసుకునే ద్వాదశ వక్ర హోమం చేసేందుకు ఉపక్రమించి, ఫ్రెడ్రిక్ బృందాన్ని కోనకు దగ్గరలో మకాం ఏర్పాటు చేసుకొమ్మని చెప్పి, హోమానికి కింకరుడ్ని ఏర్పాట్లు చేయమని ఆదేశించింది.
******
మెడికల్ కాలేజ్ కాంపౌండ్ లో క్లీనింగ్ చేస్తున్న హౌస్ కీపింగ్ అమ్మాయికి షాక్ తగిలి పడిపోవటంతో, ట్రీట్మెంట్ కు హాస్పిటల్ కాంపౌండ్ కు తరలించారు. ఆమెను ట్రీట్ చేసిన డాక్టర్ , పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పటంతో ఇంటర్న్ గా చేస్తున్న సృష్టి తట్టుకోలేకపొయింది. ఐ. సి. యులో క్రిటికల్ స్టేజ్ లో ఉన్న ఆమె పరిస్థితి తెలిసి విలవిల్లాడి పోతున్న ఆమె పిల్లలను చూసి, హాస్పిటల్ కాంపౌండ్ లో ఉన్న దేవుడి విగ్రహం దగ్గరకి వెళ్ళి, ‘ప్లీజ్ ఇలా చేయొద్దు .. నువ్వున్నావనే వారి నమ్మకాన్ని వమ్ము చేయకు’ అని మొక్కింది. అటుగా వెళుతున్న అద్భుత్ సృష్టిని చూస్తుండగా , ఐ.సి.యు లో ఉన్న ఆమె పిల్లలు , అద్భుత్ ని చూడగానే దగ్గరకు చేరి ‘అన్నా! అమ్మకు బాలేదంట ?’ అని చెప్పటం విని, ఐ .సి. యు కి వెళుతుంటే సృష్టి అద్భుత్ వెనకే వెళ్ళింది.
సిస్టర్ ఇచ్చిన రిపోర్ట్ చూసి, ఆమె నాడిని పరిశీలించి , కనిపిస్తున్న కరెంటు వైరు నిగట్టిగా లాగాడు, అద్భుత్.
“ఏం చేస్తున్నావ్?” అని సృష్టి అడిగింది.
“నా చేతుల్ని పట్టుకో,” అని అద్భుత్  అనటంతో సృష్టి , అద్భుత్ చేతుల్ని పట్టుకుంది.
“విషానికి విషమే విరుగుడు,” అంటూ కరెంటు పాస్ అవుతున్న ఆ వైరుని ఆమె నాడికి తగిలించాడు అద్భుత్.
దగ్గరైన ఇద్దరి భుజాలపై ఉన్నసూరీడు, జాబిల్లి మచ్చలు నుండి ఉద్భవించిన శక్తి వల్ల ఐ.సి.యు మానిటర్ లో మార్పు మొదలై  క్రిటికల్ గా ఉన్న అమ్మాయిలో చలనం మొదలయ్యింది. ఆ విషయం తెలిసి, అంతకు ముందు చేతులు ఎత్తేసిన డాక్టర్ , ఐ.సి.యు నుండి వెళుతున్న అద్భుత్ తో, ‘ నువ్వెందుకు లోపలికి వెళ్ళావు ?దీనికి డీన్ముందు ఎక్స్ప్లనేషణ్ చెప్పాలి’ అన్నాడు కోపంగా.
ఏ సమాధానం చెప్పని అద్భుత్ నవ్వుకుని, “ఇప్పుడు నీకేమైనా పనుందా?” అని సృష్టి ని అడిగాడు. సృష్టి ఏం సమాధానం చెప్పకుండా అద్భుత్ వెనకే నడవసాగింది.
ఇద్దరు పక్క పక్కనే నడుస్తూ కాంపౌండ్ లోకి రావటంతో అక్కడి దేవుడి విగ్రహానికి వెలుగొచ్చి, విగ్రహానికి ఉన్న పువ్వు రాలి పడింది. పిల్లలు ఆ పువ్వును తెచ్చి అద్భుత్ కి ఇచ్చారు. అద్భుత్ పిల్లలని లోపలికి వెళ్ళమని చెప్పి, ఆ పువ్వుని సృష్టి కి ఇచ్చాడు.
సృష్టి ఆ పువ్వుని తలలో తురుముకుంది.
“అవును, ఇంతకుముందు కళ్ళు మూసుకుని ఆ బొమ్మని ఏంటి  అడుగుతున్నావ్?” అని అడిగిన అద్భుత్ ప్రశ్నని విని, “బొమ్మని కాదు దేవుడిని అడుగుతున్నా,” అని చెప్పింది సృష్టి .
అది విని అద్భుత్ గట్టిగా నవ్వాడు.
“ఎందుకు నవ్వుతున్నావ్?” అడిగింది సృష్టి.
“ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో తెలియని వాడిని అడుగుతున్నావ్ అంటే, నవ్వు కాక ఏమొస్తుంది?”
“నీకు దేవుడంటే నమ్మకం లేదా?”
“ఉనికి లేని వాడు ఉన్నాడంటే ఎలా నమ్మాలి?”
“మన ఉనికిని నిర్ణయించే వాడి ఉనికి మనకి ఎలా తెలుస్తుంది? “
“మరి ఉన్నాడని ఎలా తెలుస్తుంది?”
“దేవుడు ఉన్నాడు అనటానికి ఋజువులు, సాక్ష్యాలు ఉండవు. నిండు మనసుతో కొలిస్తే కళ్ళ ముందు అన్నీఅద్భుతాలే !” అంది సృష్టి.
ఇద్దరూ మాట్లాడుకుంటూ ఒకరి పక్కన ఒకరు నడుస్తూ గ్రౌండ్ లోకి వెళ్ళారు.
“ఇదంతా ఆ దేవుడి వల్ల జరిగిందంటే నమ్మాలా”? అడిగాడు అద్భుత్ మళ్ళీ.
“మన మనుషుల్తో ప్రాబ్లెమ్ ఏంటో తెలుసా? మనకు తెలియకుండా జరిగితే ఆహా.. ఓహో.. అద్భుతం అంటాం, కళ్ళ ముందు కనిపిస్తుంటే మాత్రం ఒప్పుకోం.”
“అలా అయితే ప్రాణం మీదకు వచ్చినపుడు డైరెక్ట్ గా గుడికే తీసుకెళ్ళి పోవచ్చుగా, హాస్పిటల్ కెందుకు తీసుకురావటం?”
“బహుశా అక్కడ నీలాంటి దేవుడు డాక్టర్ లా ఉంటాడేమో...”
 “ఇప్పుడు నన్ను దేవుడిని చేస్తున్నావా?”
“నా వరకు దేవుడంటే నమ్మకం, నిజం! అది మన గురించి ఆలోచించకుండాఎదుటి మనిషి కి సాయం చేసే ప్రతి ఒక్కరిలోను కనిపిస్తుంది. భక్తి అంటే నైవేద్యాలు, ఫలహారాలు పెట్టడమో, హారతులు ఇవ్వడమో కాదు పూర్తి మనసుతో కొలుస్తూ నీకు నువ్వుగా పొందే భరోసా!”
 “ఇప్పుడు చేసిన పనికి నేను దేవుడిని అంటే, ఆ దైవత్వంలో నీకూ పార్ట్ ఉంది”
 “అదెలా?” ఆశ్చర్యపోతూ అడిగింది  సృష్టి.
 “ఆ వైరు నుండి వచ్చే పవర్ ని నా ఒక్కడి బాడీ తట్టుకోలేదు. నువ్వు వేసుకున్న యాంటిక్ జ్యువెలరీలో ఉన్న కార్బన్... ఎలక్ట్రిసిటి ని డిఫెండ్ చేస్తుంది, అందుకే ఇందులో నీకూ భాగం ఉంది అంటున్నాను.”
“మరి షాకే ఎందుకు వాడావు?”
“ఒక్కొక్కసారి షాక్వల్ల బ్రెయిన్ ఒకలాంటి ట్రాన్స్ కి వెళ్ళిపోతుంది, కొంత టైంలో మరలా అలాంటి షాక్ తగిలితే బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి పడిపోయిన పల్స్ పరుగెడుతుంది. చదివింది అప్లై చేసాను, అంతే.. అనుకోకుండా వర్క్ అవుట్ అయింది.” అంటూ నవ్వాడు అద్భుత్.
సృష్టి కి కాల్ రావటం తో, మొబైల్ వైపు చూసి ,”సరే మరి నేను వెళ్తాను”, అంది.
వెళుతున్న సృష్టిని, “మరి నేను చెప్పింది ఏం చేసావ్?” అని అడిగాడు అద్భుత్.
“ఇంకా ఏం అనుకోలేదు”, చిరునవ్వును మునిపంట నొక్కిపెట్టి అంది సృష్టి.
“మరెప్పుడు అనుకుంటావో చెప్పు, నన్నొక అమ్మాయి డేట్ కి రమ్మని అడుగుతుంది, ఆ అమ్మాయికి ఏం చెప్పను?”
“చంపేస్తానని చెప్పు!!” కసిగా అంది సృష్టి.
అది విని నవ్వుకుని, “ఎందుకు?”అనడిగాడు అద్భుత్. అతనికి సృష్టిని ఇంకా ఉడికించాలని ఉంది.
“ ఏమో?” అని చెప్పి వెళుతున్న సృష్టి ని చూసి, “చెప్పేదాకా వదలను చూడు,” అంటూ సంతోషంగా ఫీల్ అవుతూ గెంతులేసాడు అద్భుత్.
కాలేజ్ స్పీకర్స్ నుండి “మిస్టర్ అద్భుత్, ఫైనల్ ఇయర్, యు ఆర్ సపోజ్డ్ టు బి ఎట్ డీన్స్ ఆఫీస్” అంటూ వినిపించటం తో “ఇప్పుడే కదరా గెంతులేసాను, ఇంతలోనే రంకెలా,” అనుకుంటూ డీన్ ఆఫీస్ వైపుకు కదిలాడు అద్భుత్.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages