శ్రీధరమాధురి -16 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి -16

Share This

శ్రీధరమాధురి -16

(సాన్నిహిత్యం గురించి, దైవప్రేమ గురించి పూజశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు )


సాన్నిహిత్యం అనేది కేవలం శారీరకం కాదు. ఇది ఒకరితో, వారి ఆత్మలోకి చూడగలిగినంత లోతుగా అనుబంధాన్ని పెంచుకోవడం.

 అడ్డుగోడలన్నీ పడగొట్టే వరకూ సాన్నిహిత్యం వీలుకాదు. ఇది కేవలం లౌకికమైన అంశాలలోనే కాదు, దైవాన్ని సమీపించేందుకు కూడా వర్తిస్తుంది.

మీరు అడ్డుగోడలన్నీ పడగొట్టాలి... నటన ను వదిలెయ్యాలి, సంకోచాలను విడనాడాలి, అహాన్ని వదిలెయ్యాలి, వ్యక్తిత్వాన్ని వదిలెయ్యాలి. ఇవన్నీ జరిగినప్పుడే గురువుతో సామీప్యం సాధ్యమవుతుంది. ఒకవేళ మీరు గురువుతో సాన్నిహిత్యం కలిగిఉంటే మీరు నిర్వాణ స్థితిలో ఉంటారు. అన్నింటిలో దైవాన్ని చూడగలుగుతారు. మీరు గమ్యాన్ని చేరినట్టే !

ప్రేమ అనేది అన్యోన్యతను కలిగిఉండడం. చాలా వరకూ మనం దాస్తూ ఉంటాము, నటిస్తూ ఉంటాము. ఇతరుల నుంచి దాచటం మాత్రమే కాదు, మన నుంచి మనమే దాక్కుంటూ ఉంటాము. ఈ అవరోధాలని అధిగమిస్తే, ప్రేమ మొలకెత్తుతుంది, సాన్నిహిత్యం కూడా దానితోపాటే అంకురిస్తుంది.

అతను – గురూజీ, ఆమె నన్ను ప్రేమిస్తున్నాను అంటుంది.కాని, నాతో ఎక్కడికీ రాదు. సినిమాలకు రాదు. నిజానికి, మేము ఎక్కడా కలవము. అన్నీ ఫోన్ లోనే. కొన్ని సార్లు ఆమె నన్ను ఊరించేలా, కవ్వించేలా  మాట్లాడుతుంది. మున్ముందు నాకు ఏమి జరగనుందని మీకు అనిపిస్తోంది ?
నేను – నీవు ఆమె ప్రవర్తనతో తృప్తి పడుతున్నంతవరకూ ఇది కొనసాగుతుంది. కొంతకాలం తర్వాత నీవు మరొకర్ని, ఆమె వేరొకర్ని పెళ్లి చేసుకోవచ్చు. ఇది కేవలం టైం పాస్. ఇది ప్రేమ అని నేను భావించట్లేదు. ఇవన్నీ ఫోన్ లో సరసాలే.
‘దీన్నే ఫ్లిర్టింగ్ అంటారు, తనకు ఏమీ కానంత దూరంలో ఉంటూ సామీప్యాన్ని చూపడం ...’
సరిగ్గా అదే జరిగింది. ఆమె వేరెవరినో పెళ్లి చేసుకుంది, అతను కూడా మరొకామెను పెళ్లి చేసుకున్నాడు.
  
దూరం అనుబంధాన్ని దూరం చెయ్యలేదు....
సామీప్యం సంబంధాలను నిర్మించలేదు...
ఒకవేళ మీ భావనలు నిజమైనవి, నిజాయితీతో కూడుకున్నవి అయితే, అనుబంధం అలాగే ఉంటుంది.

ఒంటరితనానికి లోనుకాకండి. ఈ క్షణంలోనే, మీ ప్రక్కనే ఒకరు కూర్చున్నారు, వారిని ‘దైవం’ అంటారు.
గౌతమ బుద్ధుడితో ఆనంద అనుబంధం చాలా ప్రత్యేకమైనది. ఆనందకు బుద్ధుడితో ఎంతో సాన్నిహిత్యం దక్కింది, అతను దగ్గరగా బుద్ధుడిని గమనిస్తూ ఉండేవాడు. బుద్ధుడి వద్దకు వచ్చే ప్రతి ఒక్కరితో ఆయన మెలిగే విధానం, ప్రతిస్పందించే విధానం, ఆజ్ఞాపించే విధానం మారుతూ ఉండేది. ఆనంద ఎన్నోసార్లు తన గురువు ఇచ్చే బదులుతో ఆశ్చర్యపోయేవాడు, ఆయనిచ్చే జవాబుల్లో ఎంతో అంతరం ఉండేది. చాలాసార్లు బుద్ధుడు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ఆనంద వంక చూసి, నవ్వేవారు. ఒక్కోసారి ఆయన జావాబు ఇవ్వకుండా, ఆనంద వంక చూసి, నవ్వేవారు. ఒకరోజు ఆనంద కారణం తెలుసుకోవాలని అనుకుని, ఇలా అడిగాడు...
“గురువర్యా, మీరిచ్చే జవాబులు ఒకేతీరుగా ఉండవు. ప్రతి సందర్భంలో మీరు కొత్త జవాబులు ఇస్తూ ఉంటారు. ఎందుకిలా చేస్తూ ఉంటారు ?”
“బుద్ధుడు ఇలా జవాబిచ్చాడు “ప్రతివారూ ప్రత్యేకమైనవారు కదా, అందుకే నేనిచ్చే బదులు, అర్ధం చేసుకునే వ్యక్తియొక్క ప్రత్యేకత మీద ఆధారపడి ఉంటుంది.”
ఆనంద – కాని సత్యం ఒక్కటే కదా... ఏకం సత్యం...
బుద్ధ – అవును.
ఆనంద – చాలాసార్లు మీరు చెప్పేది నేను అర్ధం చేసుకోలేకపోతున్నాను గురుదేవా
బుద్ధ – బహుశా, అది నీకు అర్ధం కావలసింది కాదేమో.
ఆనందా – మరైతే, నాకు అర్ధం అయ్యేలా చెప్పడం గురువు బాధ్యత కాదా ?
బుద్ధ – సందేశాన్ని ఇవ్వడంతో గురువు బాధ్యత ముగుస్తుంది. అది ఎలా అర్ధం చేసుకోవాలి అన్నది అందుకేనేవారి గ్రహణశక్తి, అవగాహనా సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుంది.
ఆనంద – అయితే, నేను ఇక్కడ ఎందుకున్నాను ?
బుద్ధ – నీవు ఇక్కడ జ్ఞానం కోసమో, ప్రావీణ్యం సంపాదించేందుకో లేవని నాకు తెలుసు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. కాని ఆనందా, నాపై నీకున్న ప్రేమకోసం, నీపై నాకున్న ప్రేమ కోసం నీవిక్కడ ఉన్నావని నాకు తెలుసు. గురువుతో ఉండేవారంతా జ్ఞానసముపార్జనకే ఉండరు. కొందరు గురువు తమపై పంచే ప్రేమకోసం, శిష్యుడికి గురువుపై ఉండే ప్రేమకోసం ఉంటారు. అంతా దైవానుగ్రహం.
ఆనంద కన్నీటిపర్యంతమయ్యాడు. గురువుకు ముమ్మారు ప్రణామాలు.

అతను – నేను మిమ్మల్ని ఎప్పుడు కలవచ్చు ?
మేము – నీవు ఎవరినైనా ప్రేమించావా ? నిజమైన ప్రేమ... కేవలం ఆమెతో పార్క్ కు, సినిమా హాల్ కు, రెస్టారెంట్ కు తిరుగుతూ దాన్ని ప్రేమ అనటం కాకుండా... ప్రేమించావా ?
అతను – ప్రేమించాను గురూజీ.
మేము – నిజమైన ప్రేమలో ఏమవుతుంది ?
అతను – ఎప్పుడూ ఆమెతోనే ఉండాలని అనిపించేది, ఆమెను ఒక్కరోజు చూడకపోతే, నా గుండె మండిపోతున్నట్టుగా అనిపించేది...
మేము – సరిగ్గా, అటువంటి దహించే తృష్ణ నీ హృదయంలో నాకై జనించినప్పుడు, నేను నీ గుమ్మంలో ఉంటాను.

మీరు ప్రేమకోసం అన్వేషించట్లేదు. అదెప్పుడూ ఉంది. మీరు వెతకాల్సింది, మీరు సృష్టించుకున్న అడ్డుగోడని. దాన్ని తీసివేస్తేనే ప్రేమ అనే నది ప్రవహిస్తుంది.
డా. మాల్కోం ఒక గొప్ప రసాయనశాస్త్రవేత్త, నా స్నేహితుడు. చాలాకాలం క్రితం ఫ్రాన్స్ లోని అతని ప్రయోగశాలను దర్శించే అవకాశం నాకు దక్కింది. అతను నాకు కొన్ని అపురూపమైన అంశాలను చూపసాగాడు. అతను ఒక తెల్లటి ద్రవాన్ని వేరొక సీసాలోనికి ఒంపి, కొంత ఉప్పు కలపగానే అది గులాబి రంగులోకి మారింది. అప్పుడు అతను పిప్పేట్ లోనుంచి ఏదో ద్రావాన్ని చుక్కలుగా బౌల్ లో ఉన్న ఒక ఆకుపచ్చని ద్రవంలో పోయ్యగానే అది తెల్లగా మారింది. అతను  రసాయన శాస్త్రంలోని అద్భుతాలను నాకు వివరిస్తూ ఉన్నాడు, వాటిని అర్ధంచేసుకోవడం నాకు చాలా కష్టం. ఇంతలో అతని పెద్దన్నయ్య అక్కడికి వచ్చి, అతనిపై అరవసాగాడు. ఏవో కుటుంబ విషయాలు. క్రమంగా ఆ గొడవ వ్యక్తిగత అంశాలకు, నిందలకు మారుతూ ఉండడంతో, నేను అక్కడినుంచి జారుకోవాలని అనుకున్నాను. హఠాత్తుగా అతని సోదరుడు, ల్యాబ్ నుంచి బైటికి వెళ్తున్న నన్ను చూసాడు. నావంక చూసి, నవ్వాడు. నన్ను నేను అతనికి పరిచయం చేసుకున్నాను. ఉన్నట్టుండి, అతను మామూలుగా మారిపోయాడు. అతను తన తమ్ముడితో చాలా ప్రేమగా మాట్లాడసాగాడు. మేము ముగ్గురం సరదాగా ఎన్నో అంశాలు మాట్లాడుకున్నాము. వారి మధ్య విభేదాలకు అదే చివరిరోజు. తర్వాత వారు ఇప్పటివరకూ పోట్లాడుకోలేదు. నిన్న డా. మాల్కోం పుట్టినరోజు. యధాలాపంగా అతను హైదరాబాద్ లో ఉండడంవల్ల నేను అతన్ని కలిసాను. అతను, నేను వారితో ల్యాబ్ లో ఉన్నరోజును గుర్తుచేసుకున్నాడు. నన్ను ఇలా అడిగాడు – ఆ తర్వాత, మా అన్నయ్య నాతో ఎప్పుడూ దెబ్బలాడలేదు. మీరు ఏమి చేసారు ?
నేను నవ్వి, ‘అదంతా దైవానుగ్రహం. మీరు ఏవేవో ద్రవాలు కలిపి, మీరు గొప్ప కెమిస్ట్ (రసాయనవేత్త ) అని నాకు నిరూపించారు. అలాగే, ఆరోజు నాద్వారా దైవం గొప్ప ‘ఆల్ కెమిస్ట్(రసవాది) ‘ అని నిరూపించుకున్నారు. నేను మాల్కొం కళ్ళలోని కన్నీటి తెరలలో  కృతజ్ఞతాభావాన్ని చూసాను.  అంతా దైవానుగ్రహం. దైవం నిజమైన రసవాది – ఆల్ కెమిస్ట్.
  

No comments:

Post a Comment

Pages