// తల్లి గోదారి..//
-కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్,
14.06.2015.
తెలతెలవారుతోంది.. ఉషా తుషార ధవళ కాంతులు నేలను ముంచెత్తుతున్నాయ్.. చల్లగాలి మెల్లగా వీస్తోంది.. సన్నని వర్షపు జల్లు కురుస్తోంది... పచ్చదనం ఇరువైపులా పరిచిన చెట్ల మధ్య ఉన్న రోడ్డు మీద.. సర్రున గాలి చీల్చుకుంటూ దూసుకొస్తున్న హుండాయ్ కారు పూనవరం ఊరిలోకి వచ్చి ఆగింది.. అక్కడక్కడా ఆడవాళ్ళు ఇళ్ళ ముందు వీథి చిమ్ముతున్నారు..
కారుని ప్రక్కగా ఉన్న చింతచెట్టు క్రింద పార్క్ చేసి క్రిందికి దిగాడు సూటుబూటులో ఉన్న ధరణ్. దిగుతూ సూట్ కేసు తీసుకుని పైన ఉన్న కోటు కారులో విసిరి సూట్ కేసు నెత్తిన పెట్టుకుని అక్కడికి ఫర్లాంగు దూరంలో ఉన్న గోదావరి ఒడ్డుకు పరుగుపెట్టాడు. చిరుజల్లు కాస్త ఎక్కువవ్వసాగింది.. అక్కడికి దగ్గరలో ఉన్న గౌతమి ఘాట్ సమీపంలో మెట్ల ప్రక్కన పడుకున్న ఒక ముసలి వ్యక్తిని పిలుస్తున్నాడు.. అతనో సారంగు.. అదే గోదావరి నదిలో పడవ నడుపుతుంటాడు. రంగయ్యా.. ఓ రంగయ్యా.. ! ధరణ్ పిలుస్తున్నాడు.. ధరణ్ కష్టపడకుండానే " ఆయ్..అయ్యా.. వచ్చారండయ్యా..లేచే ఉన్నానయ్యా ఆయ్" అంటూ ఒక్క ఉదుటన లేచాడు నిద్ర నుండి. "వెళ్దామా.." అన్నాడు ధరణ్.. "వానకురుత్తాంది కదండయ్యా.. కాస్త ఆ చెట్టు క్రింద ఉండడయ్యా తగ్గగానే ఎల్లిపోదాం.. ఈలోగా పడవ కట్టేత్తా ఆయ్.." అనుకుంటూ ధరణ్ కి చెట్టు చూపించి తలకి కండువ కట్టుకుంటూ నదిలో లంగరు వేసిన పడవ దగ్గరకి పరుగులాంటి నడకతో వెళ్ళాడు రంగయ్య. చెట్టు క్రింద నిలబడి ముద్దగా తడుస్తున్నా.. అదేమీ పట్టించుకోకుండా రంగయ్య నది వైపు దిగి వెళ్ళిన మెట్లనే తీక్షణంగా చూస్తూ నిలబడిపోయాడు.. అ క్షణం ధరణ్ మెదడుని ఎన్నో ఆలోచనలు తొలిచేస్తున్నాయ్. రంగయ్య అక్కడ రోజూ పడవ నడుపుతూ, విహారానికి వచ్చే వాళ్ళని కాసేపు గోదావరి నదిపై తిప్పి, గోదారమ్మ గురించి తనకు తెలిసిన, తాను విన్న విశేషాలను వారితో పంచుకుంటుంటాడు. కొన్ని సార్లు ఎక్కువమంది పర్యాటకులు వస్తుంటారు కాసులు ఆ రోజు గలగల లాడతాయ్.. ఒకోరోజు ఒకరిద్దరే వస్తారు.. ఆరోజు కడుపులో పేగులు మాడ్తయ్.. తాతల కాలం నుంచి కుల వృత్తిగా వస్తున్న సారంగు వృత్తిని కొనసాగిస్తున్నాడు రంగయ్య. "ఆయ్.. సారు.. రండి వానపోనాది.. గోదారమ్మ" సల్లంగా రమ్మంటుండాది.." అంటూ గోదారి నీటికి దండం పెట్టుకుని, పడవెక్కాడు రంగయ్య. పరిగెత్తుకుంటూ వచ్చి తానూ పడవెక్కాడు ధరణ్.. ఆరు అడుగుల ఎత్తు చామన ఛాయ కన్న, కాస్త ఎక్కువ రంగులో మెరిసిపోతూ ఉన్న ధరణ్ ఐసిఎస్ కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా హైద్రాబాద్ నగరంలో పనిచేస్తున్నాడు. చల్లని గాలి వీచికలు ధరణ్ మోమును తాకుతుండగా ప్రశాంతంగా కాసేపు కళ్ళు మూసుకున్నాడు.. మబ్బు వీడి నేరుగా నేల వైపు దూసుకొచ్చిన ఓ చినుకు ధరణ్ నుదుటి పై పడి ముద్దాడింది ..సంబరపడింది.. చిందేసింది..నేలజారింది.. మబ్బులు చీల్చుకుంటూ వెళ్తున్న ఆకాశ విహంగంలా వెళ్తోంది బోటు మంచు తెరలను తొలుచుకుంటూ... వేరే ఏ ఆలోచనలు మదిలోకి రాకుండా గోదారి అందాలను చూస్తూ మైమరచిపోతున్నాడు ధరణ్.. పడవలో కూర్చుని నీళ్ళు పైకి విసిరాడు.. పడవ వేగానికి చింది పైన పడుతున్న జల్లుని తుడుచుకుంటూ .. అనందించాడు.. తూర్పు వైపు సూరీడు మంచు రేఖలను చీల్చుకుంటూ నీటిని తాకే ప్రయత్నం మొదలు పెట్టాడు.. సూర్యకాంతి తో వెండి రంగులో మెరిసిపోతున్నాయి దూరంగా పాపి కొండలు... బోటు దూసుకుంటూ పోతోంది.. " తెల్లారిందమ్మా.. తల్లిగోదారి.." అంటూ రంగయ్య ఏదో పాటనందుకున్నాడు.. మధ్య మధ్య హైలెస్సా అంటూ ఆనందపడుతున్నాడు రంగయ్య.. అంతలో " రంగయ్యా.. ఖచ్చితంగా నేనీరోజు వస్తానని నీకెలా తెలుసు..?." అడిగాడు ధరణ్. "ఆయ్.. అయ్యా తవరెప్పుడూ వత్తారు గదండీ.. ఈయాల నేనెరుగుదునండి ఆయ్.. మీరొచ్చే తారీఖు నాకు గుర్తేనండి..ఆయ్" అన్నాడు రంగయ్య. ఓ చిరునవ్వు నవ్వాడు ధరణ్.. తన తెలివికి గర్వంగా లోలోన సంబరపడ్డాడు రంగయ్య. పన్నెండేళ్ళ నుంచి ప్రతి ఏటా అదే తేదీన వస్తుంటాడు ధరణ్.. కేవలం తేదీ మాత్రమే తెలుసు రంగయ్యకి.. ఇంతకీ ధరణ్ పేరు గాని, ఊరుగానీ, అసలు ఎందుకొస్తాడో గానీ ఎప్పుడూ అడిగే ప్రయత్నం చేయలేదు రంగయ్య. ఉదయం నుంచి రాత్రి దాకా అదే తేదీన అక్కడికి వచ్చి గోదారిలో షికారు చేసి, నదిలో స్నానం చేసి రాత్రికి అదే ఒడ్డుకి చేరుకుని మెట్లపైనే నిద్రచేసి, తెల్లవారక ముందే లేచి వెళ్ళిపోతుంటాడు.. అలా ఎందుకు చేస్తాడో అడుగుదామనుకుంటూనే ఉంటాడు రంగయ్య.. కానీ ఎప్పటికప్పుడు మనకెందుకులే అని వాయిదావేసుకుంటుంటాడు. . కొద్దిసేపటికి అక్కడక్కడ పడవలు.. లాంచీలతో గోదారమ్మ ఆనందపరవశమై పరవళ్ళు తొక్కుతోంది. నీటి నడిమధ్యలో ఏర్పడే పిల్ల తెమ్మెరలు.. కొద్ది కొద్దిగా పెద్దవై ఒడ్డుదాకా ప్రయాణించి ఒడ్డుకు ఢీకొని ఎగసిపడుతున్నాయ్.. అక్కడక్కడా చిన్ని చిన్ని చేపలు ఎగిరిపడుతూ తమ అందాలను నీటి అద్దంలో చూసుకుని మురిసిపోతున్నాయ్.. ఎండపెరిగే కొద్దీ.. పట్టపగలు నక్షత్రాలు నేల వాలాయా అన్నట్లు పరవళ్ళు తొక్కుతున్న గోదారి అలలపై అంబరమణి కిరణాలు చేరి నృత్యం చేస్తూ అలరిస్తూ గోదారి అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి... నీటి పై మెరుస్తున్న ఎండ పొడను చూస్తూ ఆనందిస్తున్నాడు ధరణ్. నెమ్మదిగా వారు ప్రయాణిస్తున్న బోట్ పాపికొండల నడుమ ఉన్న పేరంటంపల్లికి చేరుకుంది. అక్కడ బోట్ దిగిన ధరణ్ , గోదావరి నదిలో దిగి స్నానం చేసి నమస్కరించుకున్నాడు. అక్కడ నుంచి ముందుగా రిజర్వ్ చేసుకున్న కాటేజ్ వైపు అడుగులేశాడు. అతణ్ణి అనుసరించాడు రంగయ్య. కొద్దిసేపటి తర్వాత అక్కడే ఉన్న ప్రసిద్ధ శివాలయం కి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు.. అక్కడ నుంచి కాటేజ్ కు తిరిగి చేరుకుని, టిఫిన్ తెప్పించుకు తిన్నారిద్దరు. కాసేపటికి బెడ్ పై వాలాడు ధరణ్. ఆలోచనల సాగర మధనం బుర్రని తొలుస్తుండగా నిద్రలోకి జారుకున్నాడు.. భుజం మీద కండవ, నేల మీదపరుచుకుని పడుకున్నాడు రంగయ్య. నిద్ర లేచి మధ్యాహ్నం భోజనం పూర్తి చేసుకుని అక్కడే ఉన్న జలపాత హొయలు చూసేందుకు వెళ్ళారు.. జలపాతం నుంచి నేరుగా నేల పై పడుతున్న నీటిని చూస్తూ తనని వేధిస్తున్న ఆలోచనలన్నీ మరచి నిలబడి పోయాడు ధరణ్.. "ఏంటయ్యా అట్టా సూత్తున్నారు నీళ్ళని ఆయ్.." ఆనందానికి అడ్డు వచ్చాడు రంగయ్య. "ఏం లేదు రంగయ్య.. ఆ జలపాతం హొయలు చూస్తుంటే గంగమ్మ తల్లి ఆకాశం నుండి నేరుగా శివుని జటాజూటాల మీదకి దుముకుతున్న దృశ్యంలా అనిపిస్తోంది కదూ.." అన్నాడు.. అర్ధమయ్యి, అర్ధం కాని రంగయ్య , శివుడు - గంగమ్మ పేరు వినబడటంతో మరోసారి జలపాతం వైపు చూసి దండం పెట్టుకున్నాడు.. ధరణ్ వచ్చిన రోజంతా మరే బేరం ఒప్పుకోడు రంగయ్య.. ధరణ్ వెంటే ఉంటుంటాడు.. దానికి తగ్గ ఫలితం వెళ్ళెప్పుడు ఇచ్చి వెళ్తుంటాడు ధరణ్. కొద్ది సేపటికి "బయలుదేరుదామా..?" అన్నాడు ధరణ్.. "ఆయ్ మీరెట్టాసెబితే అట్టానేనండి ఆయ్.." అంటూ సిద్ధమయ్యాడు రంగయ్య.. తిరుగు ప్రయాణం మొదలెట్టారు.. పాపి కొండల కిరీటం ధరించి.. పాపి కొండల నడుమ దిగిపోతున్న సూరీడే గోదారమ్మ నుదుట తిలకంగా భాసిల్లుతున్నాడు.... తల్లి గోదారి తన నీటి పైటను సవరించుకుని కన్న బిడ్డను పొదివినట్టు తనదగ్గరికి వచ్చే వారిని పొదివి హత్తుకుని అమ్మతనం చూపిస్తుండగా... ఆ అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ.. పిల్ల గాలుల పలకరింపులే అమ్మ లాలిపాటలుగా ఆనందిస్తూ.. తెలియని మధురానుభూతితో విహరిస్తూనే ఉన్నాడు ధరణ్... ప్రయాణం నెమ్మదిగా సాగుతోంది.. ఒక వైపు సూరీడు మరో వైపు చంద్రుడు వచ్చేంతవరకూ నీటి అలలపై ..బోటు షికారు చేస్తూనే ఉంటుందెప్పుడు. కొద్ది దూరం వెళ్ళాక ... "ఆయ్.. బాబుగారూ మిమ్మల్నోటగనాండీ....మరోలా అనుకోగూడదండి .. ఆయ్? ఎప్పటి నుంచో తన మదిని వేధిస్తున్న ఓ ప్రశ్న ధరణ్ పై సంధించడాని మానసికంగా సిద్ధమై అడిగాడు రంగయ్య, ధరణ్ ని . అడిగితే ఏమనుకుంటాడో అని ఏళ్ళ తరబడి తరచి చూసి ఇప్పుడు అడిగేయాలని నిర్ణయించుకున్నట్లు మొదలెట్టాడు.. అప్పటి దాకా అమ్మ ఒడి లో సేద తీరుతున్న పసివాడిని ఎవరో పిలిచినట్లు తిరిగాడు ధరణ్.. "ఏంటది అడుగు" అన్నట్లు సైగ చేశాడు,..ధరణ్ " ఆయ్.. అట్టగేనండి ఆయ్..మరి తవర్ని చాలా కాలం నుంచి సూత్తున్నాను ఏటేటా వచ్చి ఇదే దొరువుకాడ గంగమ్మ తల్లిని సూసుకుంటూ ఉంటారు.. రోజంతా తిరుగుతారు.. ఈడకొచ్చిన అందరూ రేత్రికాడ పేరంటంపల్లిలో తొంగుంటే, మీరేమో రేవు కాడ తొంగుంటారు.. ఎందుకా అని..??" చివర్లో సణూగుతూ.. ముఖం అష్ట వంకర్లు తిప్పుతూ.. చూపు పడవ నడిపే తెడ్డు వైపు నిలిపాడు రంగయ్య. అలలు నిశ్శబ్ధంగా తమతో తామే రమిస్తున్నట్లుగా ఉన్నాయ్.. సూరీడు పశ్చిమాన పాపికొండల వైపు నేల జారుతుంటే.. అదే అదనుగా చంద్రుడు గాలిపటంలా ఆకాశాన విహారానికి వచ్చాడు.. అటు సూరీడుతో కెంజాయ వర్ణం శోభిస్తుంటే.. ఇటు చంద్రుని రాక నీల వర్ణాన్ని ఆకాశానికి కొద్ది కొద్ది గా పులుముతోంది.. రెంటికి నడుమ ..గోదారి ... ఆ గోదారి నట్టనడుమ వీరి నావ... నీటిలో పడుతున్న ప్రతిబింబం చూస్తూ అప్పటి దాకా తన వద్ద ఉన్న చేపల కోసం తెచ్చిన గింజలని ఒక్కసారిగా నీటిలో విసిరేశాడు ధరణ్.. నిశ్శబ్ధం ఆవరించి ఉన్న నీరు తరంగ తరంగాలుగా విడిపోయి, అప్పటి వరకూ గోదారి తనపై పరచుకున్న అందమైన ప్రకృతి కాన్వాస్ ను చెదరగొట్టాయి. ధరణ్ ఏదో చెప్పబోతున్నాదని అర్ధమైంది రంగయ్యకి.. చెవులు రిక్కరించాడు,.. ప్రశాంతతను, చీలుస్తూ గంభీరంగా నిట్టూర్పు విడిచిన ధరణ్ చెప్పడం మొదలెట్టాడు..
*********
రెండు పుష్కరాల క్రితం... అనగా 1991 గోదావరి పుష్కరాలు.. జనంతో గోదావరి తీరం అంతా ఇసకేస్తే రాలని జనం.. అటు నాసిక్ లోని త్రయంబకం మొదలు ఇటు బంగాళాఖాతం లో గోదారి కలిసేంత వరకూ 1465 కిలో మీటర్ల మేర అక్కడక్కడ అటవీ ప్రాంతం మినహా భక్తులతో , తల్లి గోదావరి ఆనందతాండవమాడుతోంది... తమ పిల్లలతొ పాటు రాజేశ్వరరావు అతని భార్య రాజేశ్వరి పుష్కర స్నానానికి భద్రాధ్రి రామయ్య కు చేరువలోని పూనవరం చేరుకున్నారు.. అక్కడి గౌతమి ఘాట్ లో దిగి స్నానాలు చేసేందుకు బయలుదేరారు..
బస్ ఊరికి దూరంగా ఆగింది.. బస్సులోచి దిగుతూనే.. "ఏమేవ్ రాజి అన్నీ లెఖ్ఖ పెట్టుకున్నావా.. ఆ ప్రక్కన నిలబడదాం, త్వరగా తెములు మరలా పిండప్రదానం చేయటానికి ఇట్టే సమయం చాలదు.. ఒరే పెద్దోడా ఆ సంచీ పట్టుకో.. ఆ చిట్టి దాన్ని నువ్ చంకెత్తుకోవే.. ఈ సూట్కేసు చిన్నోడీనీ నేను తెస్తాలే. పదండి.. పదండి.. జాగ్రత్త..నా వెనకాలే రండి.. అంటూ వెనుక వస్తున్న తమ వారిని పట్టించుకోకుండా జనాలలోకి దూసుకుంటూ వెళ్తున్నాడు పంచ కాస్త ఎగదోసిన రాజేశ్వరరావు.. " గోదారమ్మకు దండాలు.. గంగామాదేవి దండాలు.. దండాలమ్మ దండాలు.. అడవి బిడ్డ నీకు దండాలు.. మా ఊరి మాలచ్చి దండాలు.. అకాశ గంగమ్మ దండాలు.. గౌతమి నువ్వంట దండాలు.." అంటూ పాటలు పాడుతున్నారు చుట్టూ ప్రక్కల వారు.. మనిషి మనిషికి మధ్య గాలి చొరబడటానికి కూడా సందులేనంతగా జనంతో కిక్కిరిసుందా ప్రాంతం... తోసుకుంటూ జరజరా ముందుకెళ్తున్నాడు రాజేశ్వరరావు అతని వెనుకనే భార్య పిల్లలు వడివడిగా అడుగులేస్తున్నారు.. స్నానఘట్టం కి చేరువవుతున్నారు.. అంతలో.. అప్పటిదాకా తన చేతిని పట్టుకున్న లాక్కెళ్తున్న నాన్న లేడు.. ఏడుపు లంఘించుకున్నాడు రాజేశ్వరరావు చిన్న కొడుకు గౌతం.. రాజేశ్వరరావు చేతి నుండి విడిపోయిన గౌతం ని వేరొక మహిళ అంది పుచ్చుకుంది.. ఆమె కూడా గౌతం ని గమనించలేదు.. దండాలు మాతల్లి దండాలు అనుకుంటూ పరిగెత్తుతూ వెళ్తున్న ఆమె గౌతం ని లాక్కెళ్తూ.. అకస్మాత్తుగా చూసి నిశ్చేష్టురాలైంది.. పెద్దగా "అయ్యో ఎవరు బాబూ నువ్వు.. మా వాడేడీ.. ఒరేయ్ వెంకటా ఏడబోయావురా.." అంటూ గౌతం ని అక్కడే వదిలేసి తన కొడుకుని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది.. అప్పుడు ఖచ్చితంగా పూనవరం ఘాట్ మెట్ల పై ఉన్నాడు గౌతం.. ఏడుపొస్తోంది.. అమ్మ, నాన్న, అన్న, చెల్లి ఎవ్వరూ కనిపించలేదు..అటూ ఇటూ నెట్టే వారితో ఏ దిక్కుకి వెళ్తున్నాడో తెలీదు గౌతంకి.. "అమ్మా అమ్మా " అని ఏడుస్తూ నడుస్తూ.. గోదావరి తీరానికి చాలాదూరం వచ్చేశాడు.. అక్కడే ఎదురుగా ఎర్రబస్సు కనబడింది.. అదే బస్సు లో అందరూ వచ్చిందని గుర్తుపట్టాడు గౌతం.. ఎర్రబస్సు ఎక్కి కూర్చున్నాడు..కాసేపటికి క్రింద పడుకుని నిద్రలోకి జారిపోయాడు.. ఎర్రబస్సులన్నీ ఒకే ఊరికి వెళ్ళవని తెలీదా క్షణం ఆ చిన్నారి గౌతం కి...తాము వచ్చిన బస్సు అనుకుని వేరే ఎర్రబస్సు ఎక్కేసి నిద్రపోయాడు గౌతం. చివరకు విశాఖపట్నం వెళ్ళిన ఆ బస్సు.. అంతా ఖాళీ అయినా, లోపల పిల్లాడు ఉండటం గమనించిన కండెక్టరు.. గౌతం ని నిద్రలేపి.. ఆరా తీసి.. అతను ఏమీ చెప్పలేకపోవడంతో పోలీసులకి అప్పగించారు.. "తప్పిపోయినోళ్ళందర్నీ ఈడతెస్తారేంట్రా.. ఇదేమన్న అనాధ శరణాలయమా" అంటూ ఓ పోలీసు అధికారి నోటికి పనిచెప్పాడు... అంతలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ స్త్రీ శిశు సంక్షేమాధికారులకి సమాచారం అందించాడు. వారు రావడంతో పోలీసులు చేసేదేమీ లేక , చుట్టుపక్కల నాలుగు స్టేషన్లకి మెసేజ్ ఇచ్చి.. చేతులు దులుపుకున్నారు. అంతే.. గౌతం ఆచూకీ బయటకు రాలేదు.. వచ్చినా లక్ష్యం చేరలేదు.. అక్కడే బాలసదన్ లో చదువుకున్నాడు గౌతం..
********
గౌతం కథ విన్న రంగయ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగుతున్నాయ్.. కన్నీళ్ళు తుడుచుకుంటూ "ఆయ్.. ఈడ శానా మంది అట్టే తప్పిపోయారయ్యా.. ఏడుత్తూ ఉన్న పిల్లల్ని సూత్తుంటే కడుపు తరుక్కపోతావుంటదండయ్యా, ఆయ్.. ఆడ -ఈడ ఎంగిలాకులు తీంటూ.. చిత్తు ఏరుకుంటావుంటే.. ఏ తల్లి కన్న బిడ్డలో అని అనిపిత్తాఉంటదండయ్యా..!" అయినా తవరికి, మీరు సెప్పిన గౌతం కి ఏటి సంబందం ఉండాదయ్యా.." అడిగాడు రంగయ్య. " పోగొట్టుకున్న దగ్గరే వెదుక్కోవాలని పాతసామెత రంగయ్యా.. అందుకే నావాళ్లని పోగొట్టుకున్న గట్టు దగ్గరే వారు దొరుకుతారేమోనని నా ఆశ..."...మాటలు కొనసాగిస్తూనే ఉన్నాడు ధరణ్ అప్పటికే బోట్.. నది మధ్య నుంచి ఒడ్డుకు చేరుకుంది.. గౌతమీ ఘాట్ వద్ద కు చేరుకున్నారు.. " అందుకే ఇక్కడికి చేరుకుని నా వారెప్పుడోకప్పుడు రాకపోతారా అని ఎదురు చూస్తూ ఉంటాను.. బాలసదన్ లో చేరాక నా పేరు ధరణ్ గా పేరు మార్చారు.. ఆ తర్వాత నన్ను ప్రభుత్వమే ఇంజనీరింగ్ చేసిందాకా చదివించింది.. ఇప్పుడు నేను నా పిల్లలు నా కుటుంబం... అంతే రంగయ్యా.. నేను బాలసదన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు 2003 లో పుష్కరాలొచ్చాయ్. అప్పుడు మా హాస్టల్ వార్డెన్ ద్వారా నా గురించి నేను తెలుసుకున్నా.. ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలోనే నేను తప్పిపోయిందని గుర్తించా.. నాకు మా అమ్మ, నాన్నల మొఖాలు మాత్రం బాగా గుర్తు. ఇక ఎవరూ గుర్తులేరు.. అందుకే ఆనాటి నుంచి నేను ఇక్కడికి వస్తూనే ఉన్నా.. నావాళ్ళు నాకు దొరక్క పోయినా ఈ తల్లి గోదారమ్మ ఒడిలో కాసేపు , సేదతీరితే అమ్మ ఒడిలో పడుకున్నంత హాయిగా ఉంటుంది.. అందుకే ఇక్కడిదాకా వచ్చి ఇక్కడే నిద్ర చేసి వెళ్తుంటా.! అంటూ సూట్ కేసులోని కండవ తీసి మెట్ల మీద పరచి.. తలక్రింద సూట్ కేసు పెట్టుకుని పడుకున్నాడు ధరణ్.. ఆ క్షణం ధరణ్.. తల్లి గోదారి ఎడమ చేతిని తలగడగా చేసుకుని ఒద్దికగా పడుకున్న ఆరేళ్ళ పసిబాలుడు లా కనిపించాడు రంగయ్యకి.. ! "పొదుగుంకినాదమ్మా తల్లిగోదారి..నిద్దురింకబోవమ్మా .. నిండు గోదారి పొద్దుగాలె వత్తలే.. అమ్మ గోదారి.. బయపడబోకమ్మా.. పండు గోదారి.. " అంటూ రంగయ్య అందుకున్న పాట నెమ్మదిగా దూరమైంది.
******* *******
మళ్ళి గోదావరిని పుష్కరాలు పలకరించే వేళ.. 2015 పుషరాలు.. మీ సేవలో మేము.. పుష్కరాలలో పెద్దపెద్ద హోర్డింగులు.. . వేలమంది పోలీసు పహారా.. ఎక్కడికక్కడ కెమెరాలు.. కిటకిటలాడుతున్న జనం.. ప్యాంట్లు , షార్ట్ నిక్కర్లు.. ఆడమగ తేడా లేకుండా ఉన్న విచిత్ర భక్తులని చూస్తూ ముందుకెళ్తున్నాడు రాజేశ్వరరావు.. అతని వెనుకే చక్కగా చీరంతా భుజం చుట్టూ కప్పుకున్న రాజేశ్వరి.. ఆమె చేతిని గట్టిగా వదలకుండా పట్టుకుని నడుస్తున్నాడు.. గౌతమీ ఘాట్ దగ్గరకు వచ్చేసరికి వెక్కి వెక్కి ఏడుస్తోంది రాజేశ్వరి.. ఇరవై నాలుగేళ్ళ క్రితం కొడుకు తృటిలో తప్పిపోయిన ఘటన ఆమె కళ్ళముందు కదలాడసాగింది..
***********
పుష్కరాలకి వచ్చి నదీ స్నానానికి హడావుడిగా వెళ్తున్న సమయంలో భర్త రాజేశ్వరరావు చేయి పట్టుకు నడుస్తున్న చిన్నోడు గౌతం,... భర్త ప్రక్కన లేడు.. "అయ్యో పిల్లాడేడండీ.. మీ ఆత్రం మండిపోనూ . పిల్లాడిని వదిలేసి ఆవిడనెవర్నో లాక్కొచ్చేశారు.. అయ్యో చిన్నాడేడీ.. ఎంతపని చేశారండీ... మీ తొందర గోదార్లో తొక్క... నా కొడుకు ఏమయ్యాడో ఈ జనాల్లో.. ఎక్కడని మనకోసం వెదుకుతున్నాడో.. బిడ్డ ప్రొద్దుటి నుంచి ముద్దకూడా తినలేదు.". ఏడుపుతో పాటు భర్త పై తిట్ల పురాణం మొదలెట్టింది రాజేశ్వరి. "గౌతం.. గౌతం.. "అంటూ పిలుపందుకున్నారందారు... గౌతం కి వెదికేందుకు , ఎక్కడికి వెళ్ళినా అందరూ..ఆ ప్రక్కనే ఉన్న చింత చెట్టు దగ్గరికి రావాలని నిశ్చయించుకుని, రాజేశ్వరరావు.. రాజేశ్వరి పెద్దకొడుకు స్వరేశ్ లు తప్పిపోయిన గౌతం కోసం వెదకటం మొదలెట్టారు.. ఎంత వెదికినా గౌతం కనబడలేదు.. వెదకలేక, కళ్ళల్లో నీళ్ళు కుక్కుకుని అక్కడే పోలీస్ సేవా కేంద్రం వద్దకు చేరుకుని ఎనౌన్స్ మెంట్ ఇప్పించారు.. గళ్ళ చొక్కా , పచ్చనిక్కరు వేసుకుని చామనఛాయ రంగులో ఉండే, ఆరేళ్ళ బాలుడు కనిపించడంలేదు.. పేరు గౌతం.. తెలుగు స్పష్టంగా మాట్లాడగలడు..ఆచూకీ తెలిసిన వారు పోలీసులకి అప్పగించగలరు.. " అంటూ మైక్ లు ఘోషిస్తున్నాయ్..ఫలితం శూన్యం. పుష్కర స్నానాలు ముగించామనిపించుకుని ఇంటికి చేరిన రాజేశ్వరరావు కుటుంబం ప్రతి రోజూ గౌతం ఆచూకీ కోసం వెదుకుతూనే ఉన్నారు .. గోడలమీద పోస్టర్లు వేయించారు.. పాంప్లెట్స్ వేసి అన్నీ ఊర్లకి వెళ్లే బస్సుల్లో ఇచ్చారు.. ఆచూకీ దొరకక పోవడంతో పోలీసులకి ఫిర్యాదు చేస్తే.. "కంప్లైంట్ తర్వాత ఇవ్వొచ్చు.. మీ చుట్టాలిళ్ళకు వేల్లారేమో .. ముందు వెదకండి .. కొట్టుంటారు వాడి పారిపోయుంటాడు.. " అని గదిమారు... పేపర్లో ప్రకటన ఇస్తే ఫలితముండోచ్చని వెళితే.. కేసు పెట్టి, ఆ ఎఫ్.ఐ.ఆర్ కాపీ తెచ్చిఇస్తే కానీ, అచ్చువేయమని తేల్చేశారు.. తిరిగి తిరిగి చివరకు తమకు ఇద్దరే పిల్లలని సరిపెట్టుకున్నారు..రాజేశ్వరరా వు దంపతులు...
********
తమ జీవితాల్లో విషాదంగా మిగిలి పోయిన ఆరోజు మరిచిపోవడం ఏళ్ళు గడుస్తున్నా రాజేశ్వరి వల్ల కాలేదు.. ఇప్పుడూ ఆమెది అదే పరిస్థితి. వెదికి వెదికి , కన్న కొడుకు ఆచూకీ లభించకపోవడంతో విసుగెత్తి వెదుకులాట వదిలేశారు..తమ కొడుకు పుష్కరాల వల్ల తప్పిపోయాడని గోదారమ్మ పుషరాలంటే ఆగ్రహంతో తరువాత పుష్కరాలకు రాలేదీ దంపతులు.. ఇప్పుడుకూడా రావాలని లేకున్నా. మరో పుష్కరానికి తాము బ్రతికి ఉంటామో లేదో అన్న మీమాంస వెంటాడుతుండటంతో బయలుదేరి వచ్చరిద్దరూ..! ఎక్కడో ఓ మిణుకు ఆశ.. ఏమో తమ గౌతం దొరుకుతాడేమో.. అని.. పూనవరం లోని గౌతమీ ఘాట్ వద్దకే వచ్చారు.. గట్టున భార్యని ఉండమని పితృదేవతలకు పిండప్రదానం చేసేందుకు పురోహితుల వద్దకు వెళ్ళాడు.. అంతలో ఒక చిన్నపాప తల్లి నుంచి తప్పించుకుని రాజేశ్వరి వెనక దాకుంది అంతలో అక్కడికి వచ్చిన ఆమె ఆ చిన్నారిని "రా రాజ్ఞి తప్పిపోతావ్" అంటూ లాక్కెళ్తుంటే చూసిన రాజేశ్వరికి అచ్చం గౌతం లాగా తోచింది.. "గౌతం.. అని అప్రతిహతంగా అరిచాయి పెదాలు.. కాదు.. కాదు.. అమ్మాయి కదా.. అని తనకు తాను సరిపుచ్చుకుంది.. హృదయం ద్రవించడం మొదలైంది.. రాజేశ్వరరావు అక్కడకి రావడంతో విషయం చెప్పింది.. "అచ్చు మనవాడిలాగే ఉంది..." అని చెబితే మంద్రంగా నవ్వాడు రాజేశ్వరరావు... "పిచ్చిదానా.. అనుకుంటూ.. మరచెంబు పట్టుకుని గోదారిలోకి దిగాడు.. మునకవేశాడు.. భర్త వైపే చూస్తూ ఉండి పోయింది రాజేశ్వరి.. ప్రక్కనే నీళ్ళ లోంచి ధరణ్ లేచాడు.. తల్లి రాజేశ్వరి మనసు అతనే తన బిడ్దని అనిపించింది.... మనసుకు ఏదో శంక.. రెండో సారి చూసింది.. మునిగి లేచిన ధరణ్. ఎడమచేయి టీకా క్రింద పుట్టుమచ్చ.. ఖచ్చతంగా అతడే తన కొడకని అనిపిస్తోంది రాజేశ్వరికి.. మూడో మునక వేశాడు ప్రక్కనే ఉన్న రాజేశ్వరరావు , ధరణ్ ఎదురెదురుగా లేచారు.. రాజేశ్వరావుని చూసిన వెంటనే గుర్తుపట్టాడు ధరణ్...అనుమానంగా "నాన్నా.." అంటూ నసిగినట్లు పిలిచాడు.. రాజేశ్వరరావు తల మీద నుంచి కారుతున్న గంగమ్మ.. తెరలు తెరలుగా తన్నుకొస్తున్న కన్నీటిని కూడా కలుపుకొని తర్పణమౌతోంది.. తనని తాను నమ్మలేక పోతున్నాడు రాజేశ్వరరవు.. తాను విన్నది నిజమేనా లేక భ్రమా అన్న అనుమానంతో కళ్ళు నులుముకుని మరీ చూస్తున్నాడు.. ఎదురుగా తననే తదేకంగా చూస్తూ నిల్చున్న ధరణ్ కనిపించాడు.. భక్తులు నీటిలో వదిలిన పుష్పాలు తడిసి ధరణ్ ఒంటికి అతుక్కుపోయి వున్నాయ్.. " గౌతం.." అన్నాడు అనుమానంగా రాజేశ్వరరావు.. అవునన్నట్లు తలూపాడు ధరణ్.. ఒక్కసారిగా ఒకరినొకరు హత్తుకున్నారు.. నాలుగు కళ్ళూ జలపాతాలయ్యాయి.. రాజేశ్వరరావు వడివడిగా ఒడ్డు వైపుకి ధరణ్ ని లాక్కేళ్తూ.. "మీ అమ్మ రా ఇక్కడే ఉంది.. రా.. రా.. నీ కోసం కళ్ళల్లో వత్తులేసుకుని ఎదురుచూస్తోంది పిచ్చిది.. "ఏమేవ్.. నీ కొడుకు.. నీ కొడుకు .. గౌతం.. ఇడిగో" అనుకుంటూ జనాల్ని తోసుకుంటూ దూసుకు వస్తున్న రాజేశ్వరరావుని చూస్తుంటే.. చిన్నప్పుడు వదిలేసినప్పుడు ఎలా గౌతం ని లాక్కెళ్ళాడో అదే తీరుని తలపిస్తోంది.. అప్పుడు చిన్నోడు,ఇప్పుడు ఎదిగిన కొడుకు...." నీ కొడుకే గోదారమ్మ తల్లి కరుణించిందే.. నీ కొడుకుని పువ్వుల్లో పెట్టి తెచ్చిందే.." ఆనందంతో మాటలు మూగవోతున్నాయ్ రాజేశ్వరరావుకి.. ఒణుకుతున్న చేతులతో.. ధరణ్ మోము నిమిరింది రాజేశ్వరి.." గౌతం.. ఎలా వున్నావురా ఇన్నాళ్ళు ఈ అమ్మనొదిలి.."అంటూ పెద్ద పెట్టున రోదించింది.. ఆ క్షణం ఆమెను ఓదార్చే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు.. "అమ్మా.." అంటూ కాళ్ళ మీదపడిపోయాడు ధరణ్... అనంద భాష్పధారలు గోదారమ్మ పరవళ్ళయ్యాయి.. అంతలో అక్కడకి కొద్ది దూరంలొ నుంచున్న ధరణ్ భార్య సుదతి, రాజ్ఞి లు అక్కడికి చేరుకున్నారు.. తాను కొద్ది సేపటి క్రితం చూసిన ఆ చిన్నారే తన మనుమరాలని తెలుసుకుని పరవశమైంది.. ఆనందం తో ఉక్కిరి బిక్కిరి అయిన వృద్ధదంపతులు.. కోడల్ని మనుమరాలిని హత్తుకుని ఇంటికి పయనమయ్యారు.. ధరణ్ తల్లి గోదారికి మరొక్కసారి మనసులో నమస్సు తెలియజేసుకున్నాడు.. తన గోడు అమ్మ విన్నదని లోలోపల సంతోషపడ్దాడు.. తరువాత ఏడాది.. " రంగయ్య తాత..రంగయ్య తాత" అంటూ నిద్రపోతున్న సారంగి రంగయ్యను రాజ్ఞి నిద్ర లేపింది "ఎవరమ్మా నువ్వు" అని అడుగుతున్న రంగయ్యకు అనుమానం వచ్చి "ధరణ్ బాబు కూతురివా.. ఆయ్.." అంటుండగా.. తల్లిదండ్రి, అన్న, చెల్లి వాళ్ళ కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకున్నారు ధరణ్ దంపతులు.. అందరూ కలిశారని తెలుసుకున్న రంగయ్య కళ్ళు చెమ్మగిల్లాయి.. రంగయ్య పడవెక్కి అందరూ తల్లి గోదారి ఒడిలో విహరించారు.అనంతరం ఆ రాత్రి అందరూ తిరిగి వచ్చి తల్లిగోదారి మెట్ల పైనే నిదురచేశారు.
*****
No comments:
Post a Comment