వెన్నెల యానం-4
భావరాజు పద్మిని
ఆకాశాన్ని తాకుతూ రాజులా ఠీవిగా నిల్చున్న పాపికొండల నడుమ, గోదారమ్మ ముగ్ధలా ఒదిగి ఒదిగి సాగుతోంది. లయబద్ధమైన అలల సడితో కొండలను ముద్దాడుతూ హొయలు పోతోంది.
గోదారమ్మ వెన్నెల జలతారు చీరను ఒళ్ళంతా కప్పుకుంది. ఆకాశంలో మెరిసే తారలతో, గోదావరిపై మెరిసే వెన్నెల జిలుగులు పోటీ పడుతున్నాయి. చలిగాలులు నదికి తెరచాపలా పరుచుకుని, గిలిగింతలు పెడుతున్నాయి. ఇసుక తిన్నెలు వెన్నెల్లో, వెండి తివాసీలు పరిచినట్లు మెరుస్తున్నాయి.
మనోహరంగా, మౌనంగా ఉన్న ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, ఒక చిన్న పూల పడవలో ప్రయాణిస్తున్నారు శరత్, చంద్రిక. ఆ పడవ చుట్టూ మల్లెలు, జాజుల మాలలు, సంపెంగలు అలంకరించి ఉన్నాయి. చంద్రిక అసలే చాలా అందగాత్తేమో, కొత్తపెళ్లికూతురన్న సూచనగా ఆమె బుగ్గన ఉన్న చుక్క, చేతి గాజుల గలగలలు, కట్టుకున్న తెల్లటి చీర, జడలోని జాజులు, మరింత అందంగా అమరి, ముత్యానికి ముస్తాబు చేసినట్లు ఉన్నాయి. ఆమె నేలకు దిగిన జాబిల్లిలా ఉంది.
“శరత్... నీ పేరూ వెన్నెలే ! నా పేరూ వెన్నెలే, ఇప్పుడు ఈ వెన్నెల్లో తడిసి ముద్దౌతుంటే, ఈ పూల పరిమళాలు పులకింతలు రేపుతుంటే, నాకు ఈ ప్రకృతిలో నిలువెల్లా కరిగిపోతున్నట్టు ఉంది. యెంత చిత్రమైనదో కదా జీవితం ! ఎవరు, ఎప్పుడు ఎక్కడ కలుస్తారో, ఏ మనసులు ఎలా ముడిపడతాయో, ఎంతటి విచిత్రం ! ఇదిగో, ఈ గోదారమ్మ లాగే, ఎక్కడో పుట్టిన నేను, ఉరకలూ పరుగులతో దూకుడుగా ఎక్కడెక్కడో సాగి, చివరికి ఈ పాపికొండల నడుమ ఈ నది ఒదిగినట్లు నీ ప్రేమలో మునిగాను. మందగమననై లలితంగా సాగుతూ, వెన్నెల సముద్రం వంటి నీలో ఏకమవ్వాలని తపించే ఈ క్షణం ఎంత మధురంగా ఉంది...”
ఆమెనే మైమరచి చూస్తూ, ఆమె మాటలు వింటున్న శరత్, ఆమె పడవ చివరికి వెళ్ళడంతో, కంగారుగా...
“ ఇదిగో పిల్లా ,ఆగాగు, అటు వెళ్ళకు, పడవ కుదుపుకి బోల్తా పడుతుంది. అసలే ఇక్కడ గోదారి లోతెక్కువ. నేనేం పడవ నడిపేవాడిని కాదు, జాలరినీ, గజ ఈతగాడ్ని కాదు. ఏదో నీ బలవంతం మీద, ఈ తెడ్లు ఆడిస్తున్నానని మర్చిపోకు,” అన్నాడు.
“ తెల్సులేవోయ్ సుబ్బారావు, అలా కోప్పడుతుంటే నువ్వు నాకు భలే ముద్దొస్తావనుకో. ఇప్పుడే నాకో ఐడియా వచ్చింది, నువ్వు కూడా తెడ్లు వదిలేసి వస్తే, ఈ వెన్నెల్లో పడవ అంచున మనిద్దరం టైటానిక్ జంటలా నిల్చుంటే యెంత బాగుంటుందో కదా ! రా ఇలాగ !”
“అమ్మా తల్లీ ! మానవమాత్రులకు కలిగే కోరికలు ఏవీ నీకు కలగవా ? మా బామ్మ ఇంత చక్కటి పేరు పెడితే, సుబ్బారావు, అప్పారావు అని పిలుస్తావే ? వెన్నెల్లో హనీమూన్ అన్నావ్. ఎలాగో కష్టపడి, ఈ పడవ నడపడం నేర్చుకున్నా ! ఇద్దరికీ బాగా ఈతోచ్చు కదా, కాబట్టి నీకోసం సాహసం చెయ్యొచ్చని, ఇదిగో కూడా ఈ లైఫ్ జాకెట్స్ తెచ్చాను. మున్ముందు ఇంకేం చెయ్యమంటావో ! అమ్మా, కరణం మల్లేశ్వరీ ! దిల్సుక్ నగర్ బాబా గుడి వద్ద నిన్ను మొదటిసారి ఎప్పుడైతే చూసానో, అప్పటి నుంచి నా గ్రహాలే కలవరపడి ఇష్టమొచ్చినట్టు తిరుగుతున్నాయి...” అన్నాడు, తన అక్కసంతా ఒక్కసారే వెళ్లగక్కుతూ, బుంగమూతి పెట్టి.
వెంటనే పడవ కొస నుంచి ముందుకు వచ్చి కూర్చుని, “ఏంటి ? కరణం మల్లేశ్వరా ?నువ్వు నన్ను మొదటిసారి కాలేజి బస్సు లో చూడలేదా ? బాబా గుడి దగ్గర చూసావా ? మన పెళ్లి పుస్తకంలో ఈ అధ్యాయం తెలియకుండా ఉండకూడదు. కాసేపు నేను తెడ్డు వేస్తా కాని, నువ్వు గింగిరాలు తిరుగుతూ, నీ నుదుటిపై ఉన్న శోభన్ బాబు రింగ్ తిప్పుకుంటూ, గత జ్ఞాపకాల్లోకి వెళ్ళు చెప్తా !” అంది హుషారుగా .
చంద్రిక సంగతి బాగా తెల్సు కనుక, కొత్త పెళ్ళాం ముచ్చట కాదనలేక, వెనక్కి వెళ్ళే అలల్ని చూస్తూ ఇలా చెప్పసాగాడు శరత్.
దిల్సుక్ నగర్ బాబా గుడి... సమర్ధ సద్గురు సాయినాధుడు సమస్త జగతికి మకుటం లేని మహారాజులా సింహాసనం అధిష్టించి ఉన్నారు ప్రేమస్వరూపుడైన ఆయనను పూజించి, బాబా కృపను పొందాలని, స్త్రీలు, పిల్లలు, పెద్దలు, ఎంతోమంది వేచిఉన్నారు.
గుళ్ళోంచి శ్రావ్యమైన భక్తి గీతం వినిపిస్తోంది...
ద్వారకామాయి వాసా సాయి
నీదరి చేరితి దయగనవోయి
సాయి రూపమే పరమశివం
సాయి నామమే పరమపదం
నిన్ను కన్నంతనే కలుగును హాయే
నిను నమ్మి కొలిచితె కలతలు పోయే
నీ కృప కలిగితే తొలగును మాయే
నీ చరణమ్ములే వరములు వేయే // ద్వారకామాయి //
మది నీ మందిరం సాయి దేవా
శ్రద్ధ సబూరి నిరతమునీవా
ప్రేమతో పిలిచితి కావగ రావా
భక్తుల పెన్నిధి నీవే కావా ? / / ద్వారకామాయి //
గాయకుడి చక్కటి గొంతులోని మార్దవం భక్తుల మనసులు కరిగిస్తోంది...
ఆ పాడింది ఎవరో కాదు, నేనే !
అంటూ, ఆశ్చర్యంగా నోరు తెరుచుకు చూస్తున్న చంద్రిక ముందు చిటికేసి, “ చూడమ్మా, నీకు తెలీదు కదూ, నేను పాడతాను. నువ్వలా లంకిణి లాగా నోరు తెరుచుకు కూర్చున్నావే అనుకో, పాపం ఈ చల్లగాలికి ఎగిరే రెక్కల పురుగులు, చిట్టి హనుమంతుల్లా నీ నోట్లోకి దూరి, అన్యాయంగా చస్తాయ్... ఇదేముంది, ఇంకా విను, ఇప్పుడుంది అసలు కధ ! “ అంటూ ఇలా కొనసాగించాడు శరత్.
ఎందుకో చిన్నప్పటి నుంచి నా మనసు బాబా మీద లయమైపోయింది. ఆయనే నాకు సర్వస్వం. రోజూ గుడికి వెళ్లి కూర్చునేవాడిని. అమ్మ నేర్పిన సంగీతం, నాకున్న రచనాపటిమ కలిపి, బాబాపై పాటలు రాసి, పాడుతూ ఉండేవాడిని. ఆ రోజు నా మనసులో మరింత ఆనందం. ఎందుకంటే... ఆ రోజు కాంపస్ సెలక్షన్ లో నాకు MCA లో సీట్ వచ్చింది.
ఎంతో ఆనందంగా గుడి బయటకు వచ్చిన నాకు, బయట ఏదో కొట్లాట కనిపించింది.
ఒకమ్మాయి, ఒకతని కాలర్ పట్టుకు పైకి లేపుతోంది. వాళ్ళ ప్రక్కన ఒక బైక్ పడుంది. ‘ ఏరా ! యెంత ధైర్యం ఉంటే, నా మెళ్ళో చైన్ లాగే ప్రయత్నం చేస్తావ్ ? ఎవరనుకున్నావ్ ? కరాటే లో బ్లాక్ బెల్ట్. మార్షల్ ఆర్ట్స్ లో మాష్టరమ్మని. ఎక్కడ ఎలా కొడితే, ఏం జరిగి, ప్రాణాలు వాయిదా పద్ధతిలో పైకి పోతాయో ప్రత్యేకంగా నేర్చుకున్నా ! పీక దగ్గర ఒక్క దెబ్బ కొట్టానంటే చచ్చూరుకుంటావ్ ! ఆడాళ్ళ మెళ్ళో గొలుసులు, మంగళసూత్రాలు లాగి నీ సరదాలు తీర్చుకోడానికి సిగ్గు లేదూ ! నాలుగు తన్నానంటే, కాళ్ళూ చేతులూ విరిగి, ఆ అడుక్కు తినే వాళ్ళ లైన్ లో కూర్చోవాలి ‘, అంటూ ఎవడినో వాయించేస్తోంది.
నాకు చిన్నప్పటి నుంచి కొట్లాటలు, గొడవలంటే చాలా భయం. ఊహతెలిసాకా ఎవరినీ కొట్టలేదు, తన్నులు తినలేదు. అందుకే భయమేసి, ఒకాయన వెనకాల దాక్కుని చూస్తున్నా !
ఆ అమ్మాయి చిలకాకుపచ్చ పరికిణీ, రాణి రంగు ఓణి వేసుకుంది. పొడవాటి జళ్ళో సింహాచలం సంపంగి మాల, మెళ్ళో ముత్యాల హారం. అందానికి చిరునామాలా ఉంది. వెంటనే నాకొచ్చిన సందేహం ఆపుకోలేక, ముందున్న ఆయనతో...
‘ ఏవండి ? అచ్చ తెలుగు పిల్లలా ఉన్న ఆ అమ్మాయి ఆహార్యానికి, తీరుకి అసలు సంబంధం ఉందా ? కలర్ డ్రెస్ లో ఉన్న కరణం మల్లేశ్వరీ లాగా అతన్ని ఒంటి చేత్తో ఎత్తి, ఎలా భయపెడుతోందో చూడండి...’ అన్నాను.
వెంటనే ఆయన కోపంగా... ‘కొట్టక, నీలా ఇతరుల చాటున దాక్కుంటుందా ? అయినా చూస్తూ ఊరుకోడానికి దాన్ని నేను ఆడపిల్లలా పెంచలేదు, మగరాయడిలా పెంచాను. అవును, తను , నా కూతురు. పోన్లే పాపం అని వదిలేస్తున్నాను. ఇంకో క్షణం ఇక్కడ కనిపిస్తే, నీపని కూడా పట్టమని ఇటు పిలుస్తాను, జాగ్రత్త ! ‘ అన్నారు.
అంతే ! నేను పరుగు పందెంలో పాల్గొనే మగ పి.టి. ఉష లాగా ఆదరాబాదరాగా అక్కడినుంచి మాయం...
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే... అంటూ అర్ధోక్తిలో ఆగి, అల్లరిగా చంద్రిక వంక చూసాడు శరత్.
“ తెల్సులే ! నేనేగా ! ఆ రోజు మేము హైదరాబాద్ లో ఉన్న మా అత్తయ్య ఇంటికి వచ్చాము. మా నాన్న గుడి నుంచి అత్త ఇంటికెళ్ళాకా, ఎవరో తన వెనుక దాక్కున్నారని చెప్తే, ఒకటే నవ్వు తెల్సా ! అంత పిరికివాడేనా ఇలా నట్టేట్లో నావ నడుపుతున్నదీ, అని అనుమానం !” ఆటపట్టిస్తూ అంది చంద్రిక.
“అవును భామినీ ! ప్రేమ గుడ్డిది కదా ! అందుకే, నిన్ను చూడగానే కళ్ళు మూసేసుకున్నా ! నీ ప్రతాపం చూడలేక ! ఇదేం చూసావు, నిన్ను రెండోసారి కాలేజీ బస్సు లో చూసినప్పుడు చెప్పాలి, నా అవస్థ !”
“ఓహో, చెప్పు చెప్పు... మన ప్రేమ కధ నీ నోట వింటుంటే, బహు ముచ్చటగా ఉంది ప్రేమికా ! మన కధను ఎవరైనా కాపీ కొట్టి... వెన్నెల్లో లవ్ స్టొరీ’ అని సినిమా తీసేస్తారేమో అని కూడా అనుమానంగా ఉంది...” అంటూ..
దూరంగా ఇసుకతిన్నెల్లో మసగ్గా కనిపిస్తున్న కోయ గూడాల్లోని, వెలుగు వంక చూస్తున్న శరత్ ను గమనించి, అతన్ని దృష్టి మళ్ళించకూడదని, చెంపకు చెయ్యి ఆనించుకుని, ఆసక్తిగా శరత్ కేసి చూడసాగింది చంద్రిక.
****************
నర్సాపురం గోదావరి ఒడ్డున ఉన్న వై.ఎన్ కాలేజీకి 75 ఏళ్ళ చరిత్ర ఉంది. ప్రతిష్టాత్మకమైన ఆ కళాశాలకు చుట్టుప్రక్కల ఊర్ల నుంచి ఎర్ర బస్సులో వస్తుంటారు చాలామంది! నర్సాపురం వద్దకల సీతారామపురంలో శరత్ దూరపు చుట్టాలు ఉండడంతో, వారి ఇంటి డాబా పైగది నాకు ఇప్పించి, నన్ను వారి పర్యవేక్షణలో ఉంచింది మా అమ్మ. చాలా మంది విద్యార్ధులు అక్కడే ఉంటూ ఉండడంతో, దారి పొడుగునా, ఎంతో మంది సీనియర్లు బస్సు ఎక్కుతూనే ఉంటారు...
మన హాబీ లు అన్నీ చెప్పేస్తే, సీనియర్ లు ఆడించి, పాడించి, తాటాకులు కట్టేస్తారని, ఏమీ రావని చెప్పమంది మా అమ్మ. నేనూ అలాగే అమాయకుడిలా నటిస్తూ నెట్టుకు వస్తున్నా అంతవరకూ.
అప్పటికి క్లాసులు మొదలై నెల రోజులైనా, సీనియర్ల రాగింగ్ తగ్గలేదు. అద్దెకు ఉండే గది దగ్గరినుంచి, కాలేజీ గుమ్మం దాకా, ఎక్కడ కనిపిస్తే, అక్కడ రాగింగ్ పేరుతో వాయించేస్తున్నారు. ఈ రోజు ఎవడికి ఆహారమౌతానో, అనుకుంటూ బెదురుగా నిల్చుని, చూస్తుండగానే వచ్చాడు, జిగురు జోగారావు. పట్టుకుంటే చాలు, తుమ్మ జిగురులా వదలని అతనికి, మేం తగిలించిన ఇంటిపేరు అది. ఇంతలోనే బస్సు వచ్చింది. వెనుక కిక్కిరిసి ఉండడంతో, ముందు వైపునుంచి మేమిద్దరం ఎక్కి, డ్రైవర్ ప్రక్కనే నిలబడ్డాము.
‘గుడ్ మార్నింగ్ సర్...’ అన్నాను.
‘ఆ, ఏం ఈ పొద్దు హుశారున్నవ్ తీయ్. మంచి పాట గిట్ల పాడు,’ అన్నాడు జోగి. అతనికి వత్తాసుగా బస్సు డ్రైవర్ కూడా, ‘ బాబ్బాబూ, ఈ స్టీరింగ్ ముందు కూర్చుని, గంట పైనయ్యింది. నాకు పాటలంటే చచ్చేంత ఇష్టం, పాడు బాబూ, పాడు,’ అన్నాడు.
‘నాకు పాటలు పాడడం రాదు సర్...’ అన్నాను వినయంగా.
‘ఓయ్, ఏం మాట్లాడుతున్నవ్, పాట పాడకుంటే మంచిగుండదు బిడ్డా ! ఎట్లోస్తే అట్ల పాడు...’ అన్నాడు దబాయింపుగా.
‘అనుకున్నా, వీడేదో మెలిక పెడతాడని, పాట కావాలా, ఉండు నీ పని చెప్తా, ‘ అనుకుని... ముక్కు పట్టుకుని, హిమేష్ రేషమ్య ను తల్చుకుని మొదలుపెట్టాను...
“ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు... వేదన శ్రుతిగా రోదన లయగా సాగే గానమిది...” పాపం డ్రైవర్ కన్నీళ్లు కార్చసాగాడు.
జోగికి తిక్కరేగింది. ‘ఏం పాట బై ఇది... పాటంటే ఎట్లుండాలి, ఒంట్లోంచి ముళ్ళు లేవాలి... వేరే పాట పాడు...’
‘నిను వీడని నీడను నేనే, కలగా మిగిలే కధ నేనే...’ అంటూ రెండు మూడు దెయ్యం కూతలు కూసాను.
‘హమ్మో, నాకసలే దెయ్యాలంటే భయం, నేను బస్సు దిగి పోతా ! ‘ అన్నాడు డ్రైవర్.
‘నువ్వుండు భాయ్, మంచి ఐటెం సాంగ్ గిట్ల పాడిస్తా...’ అని డ్రైవర్ ని ఓదార్చాడు జోగి. నా వంక తిరిగి, బ్రహ్మానందం లాగా కళ్ళు ఎగరేసాడు.
‘ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా... అందుకేగా నీవు చేసే పూజలన్నీ తపోధనా...’అని విప్రనారాయణ సినిమా పాట పాడసాగాను. ఎక్కడా శృతి, లయ లేకుండా జాగ్రత్త పడ్డాను.
‘ఇది ఐటెం సాంగ్ రా బై ! కనీసం రాసినోడికి తెల్సంటావా ! ఏం పరేషాన్ జెయ్యబట్టినావ్... మంచి ఊపున్న పాట పాడరా...’
‘మాయమర్మం ఎరగనోళ్లం, మట్టిపిసికి బతికేటోళ్లం... ఊరిదేవతైన నిన్నే ఊపిరిగా కొలిచేటోళ్లం ... గండవరం నెయ్యి పోసి గారెలొండి తెచ్చినాము... బుజ్జిముండ కల్లుకుండ వెంటబెట్టుకొచ్చినాము... దండాలు దండాలు అమ్మోరు తల్లో... శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్లు తెచ్చాము అమ్మోరు తల్లో... పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో’
“ఆపు, ఏంటా పాట !”
“సర్... ఇందులో అంతా పూనకంతో ఊగుతూ పాట పాడతారు... మీకు ఊపున్న పాట కావాలి, అన్నారుగా... అలా చూడండి, పాట నచ్చి, డ్రైవర్ కూడా ఊగుతున్నారు... “ అన్నాను.
అంతలో అప్పటివరకూ ఉగ్గబట్టి ఆపుకున్న నవ్వుకి అడ్డుగోడ తీసేసినట్టు, బస్సులో ఎక్కడి నుంచో తెరలు తెరలుగా నవ్వు... అలలు అలలుగా నవ్వు... మండువేసవిలో తొలకరి జల్లులా ఇంపుగా ఉంది... గుప్పెడు మల్లెలు దోసిలితో గుమ్మరించినట్టు సమ్మోహనంగా ఉంది... నన్ను చుట్టేస్తున్నట్టు ఉంది... బస్సు లో అంతా ఆ నవ్వు వినవచ్చిన వైపుకు చూడసాగారు. నేనూ వెనక్కి తిరిగి చూసాను ... అంతే, ఒక్క క్షణం నా గుండాగిపోయినట్లు అనిపించింది.
“హమ్మయ్యోయ్, కరణం మల్లేశ్వరీ, ప్రక్కన ఉన్నావిడ కూడా ఈమె లాగే ఉంది, ఆ కోమలి తల్లే అయ్యుంటుంది... ” అనుకున్నాను మనసులో.
అప్పటికి మధ్యలో దిగిన వాళ్ళతో రద్దీ కాస్త తగ్గడంతో, వెనుకనుంచి ఎలాగో దూరి వచ్చిన కండక్టర్ ‘టికెట్...’ అన్నాడు.
‘ నర్సాపురం కాలేజి కి ‘ రెండు టికెట్ లు ఇవ్వండి, అన్నాను, జోగి గాడిది కూడా కలిపి.
‘బాబూ, ఇదిగో బాబూ... ‘ పిల్చింది సీనియర్ మల్లేశ్వరీ.
నన్ను కానట్టు ఎక్కడో చూడసాగాను నేను. అందమైన అమ్మాయి తల్లి పిలవడంతో ‘చెప్పుండ్రి...’ అంటూ వెళ్ళాడు జోగి.
‘బాబూ, మీరూ వై.ఎన్ కాలేజీ పిల్లలా... మా అమ్మాయి థర్డ్ కౌన్సిలింగ్ లో సీట్ వస్తే, ఇవాళే MCA లో చేరేందుకు వచ్చింది. మొదటి రోజు కదా, కూడా జాగ్రత్తగా తీసుకెళ్తారా ?’
‘ఓహ్, తప్పకుండా ! నేను MCA సెకండ్ ఇయర్ ఆంటి. అట్లైతే మీ పాప నాకు జూనియర్ అన్నట్టు. ఓయ్, పేరేంది ?’ అన్నాడు జోగి దబాయింపుగా.
‘చంద్రిక.. ‘ అన్నావు నువ్వు, కళ్ళ వెంట నిప్పులు కురిపిస్తూ.
‘ఏంది గట్లజూస్తావ్... పక్కన అమ్మ ఉందని పరేషాన్ గాకు. సీనియర్ ను సర్ అని పిలవాలె . మేం జెప్పినట్టు జెయ్యాలి. ఏం మస్తుగున్నవ్. ఇప్పుడోచ్చినవ్ గాని, ఫ్రెషర్స్ పార్టీ ముందు వచ్చుంటే ఆడుకునేటోడిని. ఏదీ, ఒకసారి కోడిలా కూతబెట్టు...’ అన్నాడు జోగి. బిగుస్తున్న నీ పిడికిలి చూసాను నేను.
‘వద్దు సార్... మీరిలా రండి చెప్తా...’ అన్నాను నేను.
‘ఏందిరా ? సీనియర్ నే ఎదిరిస్తావ్ ? చమ్డాల్ దీస్త బిడ్డా...’ అంటూ నా మీదకొచ్చాడు జోగి.
‘కానీ, నీకివాళ దరిద్రం అదృష్టం పట్టినట్టు పట్టింది, ఇక ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు... ‘ అనుకుని, మిన్నకున్నాను.
‘పాపా, కోడిలా కుయ్... తర్వాత నక్కలా ఊళ పెట్టు... గాడిద లాగా ఓండ్ర పెట్టు...’ అంటూ ముందుకు వచ్చాడు వాడు.
అంతే ! ఫాట్ మని నువ్ కొట్టిన దెబ్బ శబ్దం బస్సు అంతా ప్రతిధ్వనించింది. డ్రైవర్ బస్సు ఆపాడు, నేను బస్సు దిగి పారిపోయాను.... నన్ను తరుముతూ వెనుక మళ్ళీ నీ నవ్వు...
ఆ రోజు క్లాసు లో నిన్ను నువ్వు పరిచయం చేసుకుంటున్నప్పుడు, నువ్వు సీతారామపురం పెద్దరాజు గారి అమ్మాయివని, బహుముఖప్రజ్ఞాశాలివని తెలుసుకున్నాను. లంచ్ బ్రేక్ లో నలుగురు సీనియర్లు అడగ్గా, నువ్వు పాడిన ‘తరలి రాద తనే వసంతం..’ అనే పాట కుడా నాకు బాగా ఇష్టమైనదే ! అయినా... ఎక్కడో, నువ్వంటే ఉన్న భయం అలాగే ఉండిపోయింది.
కట్ చేస్తే .....
సీతారామపురం నిండా దట్టమైన మామిడి తోటలు... రూమ్ వద్ద ఉన్న ఒక చక్కటి తోటలో గున్నమావిచెట్టుకింద కూర్చుని, బుద్ధిగా చదువుకుంటున్నాను నేను... ఎక్కడినుంచో కమ్మటి కోకిల గానం, పక్షుల కలరవాలు ఆహ్లాదపరుస్తున్నాయి. ఇంతలో ఎక్కడి నుంచో ఆర్తనాదాలు...
“పాపగారు, నన్నొగ్గెయ్యండమ్మా... ఏదో బుద్ది తక్కువై, కక్కుర్తి పడి ఈ పని చేసాను... పిల్లలు గలవాడ్ని , పిచ్చుక మీద మీ పిడికిలి ఎత్తకండమ్మా... పచ్చడైపోతా... “
“ఏరా, మా తోటలో కాసిన మామిడికాయలు దొంగతనంగా అమ్ముకుందామని చూస్తావా ? ఈ పెద్దరాజు గారి కూతురు, పది మందినైనా, ఒంటి చేత్తో మట్టి కరిపించేయ్ గలదు రోయ్ ... జాగ్రత్త !” తర్వాత తన్నుల శబ్దం వినవొచ్చాయి...
“ఓహో, ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ అన్నమాట... అయితే ఇంకెవరు కరణం మల్లేశ్వరే అయ్యుంటుంది...” మనసులో అనుకుంటూ ఉండగానే, నా కాళ్ళ దగ్గర వచ్చి పడ్డాడు సదరు శాల్తీ... అసలే కోపం మీద ఉన్నవేమో, పన్లోపనిగా నాకూ రెండు తగిలిస్తావని భయమేసి, చెట్టెక్కేసాను. అసలే కోపంగా ఉన్న నువ్వు నాతో...
“ఏయ్, చెట్టుదిగు ముందు, నన్ను చూస్తే చాలు పారిపోయి, బెదిరిపోతావే !”
“హమ్మో, నేను దిగను, నువ్ అందర్నీ కొడతావ్ ! నాకు నువ్వంటే భయం. అసలే మా అమ్మకి ఒక్కడే కొడుకుని...”
“నువ్వు చెట్టు దిగుతావా, లేక నన్ను ఈ కొమ్మ పట్టుకు విరవమంటావా ? చెప్పు...”
“వద్దు, నీ ప్రతాపం నాకు తెల్సుగా, అందుకే బుద్ధిగా శరణాగతి వెడుతున్నాను. చెట్టు దిగొస్తా కాని, నన్నేమీ చెయ్యనని నీ మీద ఒట్టేయ్ ... !”
“ అలాగేలే దిగి రా !” అన్నావు నవ్వుతూ...
“ అమ్రీష్పురి మొగాంబో కుష్ హువా...” అన్నట్లుగా వినిపించి, నెమ్మదిగా ధైర్యం చేసి, దిగి వచ్చి నిల్చున్నా..
అప్పుడు నువ్వు చెప్పిన మాటలు.. నా మనసుమీద చెరగని బలమైన ముద్ర వేసాయి...
“చూడు, నేనేమీ రాక్షసిని కాదు. కాని, ‘ ధైర్యమే జీవనం... పిరికితనమే మరణం...’ అన్న వివేకానందుడి సూక్తిని మనసారా నమ్మిన దాన్ని. చూడు, పుట్టిన ప్రతివాడూ, ఎప్పుడో అప్పుడు చావాల్సిందే ! కాని, ఇలా అనుక్షణం భయంతో చచ్చే కంటే, నాలా ధైర్యంగా బ్రతికి ఒక్కసారే చావటం మేలు కదా, ఆలోచించు ! అణిగే గుణం నీకుంటే, ఈ లోకం నిన్ను అణగద్రొక్కుతూనే ఉంటుంది. భయపడే గుణం నీకుంటే, భయపెడుతుంది. అంటే, జీవితంలో అడుగడుగునా, నీ బలహీనతే ఎదుటి వాడి బలం అవుతుంది. ఇలాగైతే నీకంటూ స్వతంత్ర భావాలు లేకుండా, అందరి మాటలకూ గంగిరెద్దు లాగా తలూపుతూ బ్రతకాల్సిందే ! ఇతరుల మెప్పు కోసం నీ అభిరుచుల్ని, భావాల్ని అణుచుకుని ఉండాల్సిందే ! అలా నేనుండలేను. అందుకే, నేను అన్యాయాన్ని ప్రతిఘటిస్తాను, తిరగబడతాను. ఒక్కసారి తిరగబడి చూడు, లోకం నీకు సలాం కొట్టి, గులాం అవుతుంది. ఒక్కసారి బెదిరి పారిపోయి చూడు, నువ్వు లోకానికి గులాం అవుతావు. నీ జీవితం నువ్వు ఎలా దిద్దుకుంటావో నీ ఇష్టం !”
నేను మౌనంగా అక్కడినుంచీ నిష్క్రమించాను....
అప్పటి నుంచి, నేనెప్పుడూ భయపడలేదు. భయమే నన్ను చూసి భయపడేలా ఉండేవాడిని. అంతేకాదు, నీ మాటలతో ఎంతోమందికి ప్రేరణ కలిగించాను. నువ్వే బ్రతుకు బాటలో నా మార్గదీపికవి.... అంటూ ఆపి చంద్రిక వంక చూసాడు శరత్...
వెన్నెల్లో గోదావరి అందాలను తిలకిస్తూ, శరత్ చెప్పే మాటలను శ్రద్ధగా వింటున్న చంద్రిక, “ఏం పాపగారు.... కొత్త జంట లాగున్నారు...” అంటూ ప్రక్కన వెళ్తున్న పడవలోని తాత పలకరింపుకు ఈ లోకంలోకి వచ్చింది.
“అవును తాతా, ఈ అబ్బాయి నచ్చాడని, ఎత్తుకొచ్చి, పెళ్లి చేసుకున్నా... ఎలా ఉన్నాడంటావ్ ... నీకు నచ్చకపోతే చెప్పు, ఇప్పుడే నీ పడవెక్కించి పంపేస్తా...” అంది కొంటెగా శరత్ నే చూస్తూ చంద్రిక.
“ తాతా, చూసావుగా ఈ పిల్ల అల్లరి. బుద్ధిమంతుడిని తీసుకొచ్చి, నట్టేట్లో పడేసింది... ఇక ఈవిడతో వేగలేను తాతా, నన్ను నీతో తీసుకుపో,” అంటూ అసమ్మతి ప్రకటించే నేత లాగా మొహం పెట్టి, తెడ్లు వదిలేసి, లేచి నిల్చున్నాడు శరత్.
“తీసుకునే పోదును కానీ మనవడా, తొందరపడబాక. ఆ మూల కూకుందే, మా ముసిల్ది, పేరు మల్లి లే ! మొదట్లో అది కూడా ఈలాగే కొరకరాని కొయ్యనాగే ఉండీది. తర్వాత మెత్తబడింది. అదీ నేనూ ఈ పున్నమేళ వనీమూన్ కు వచ్చినాము. ఆ మాటకొస్తే, మా పెళ్ళైన కాడ్నుంచీ ప్రతి పున్నమికీ పడవలో తిప్పకపోతే, నా మల్లి నాకు బువ్వెట్టదు. మా మజ్జ పానకంలో పుడక నాగా నువ్వెందుగ్గానీ, ఏదో ఆ పిల్లతోనే సర్దుకుపో...” బోసినవ్వులు నవ్వుతూ అన్నాడు తాత...
“ఓ పంచభూతాల్లారా ! నన్ను మీలో కలిపేసుకోండి, ఈ తాతకు కూడా నేను లోకువైపోయాను... ఇక ఈ లోకంలో నాకు స్థానం లేదు... “ అంటూ రెండు చేతులూ చాచి, గట్టిగా అరిచాడు శరత్.
“నువ్వేమీ మగ సీతవు కాదు, ఇక్కడ నీకు అగ్ని పరీక్ష ఏమీ జరగట్లేదు... సినిమా డైలాగ్ లతో, హాయిగా గోదాట్లో కళ్ళు తెరుచుకు నిద్దరోతున్న చేపల్ని, ఇతర జీవాల్ని కంగారుపెట్టక బుద్ధిగా కూర్చో ! నాకు కరాటే లో బ్లాక్ బెల్ట్ ఉంది,నీకు తెల్సుగా “ ఒక కనుబొమ పైకెత్తి విలన్ లా అంది చంద్రిక. నిజంగా భయపడ్డట్టు నటిస్తూ, కూర్చుండిపోయాడు శరత్.
వాళ్ళనే చూసి నవ్వుకుంటున్న తాత...” మీ సరసాల కేంగానీ, ఇదిగో పాపగోరూ... పున్నమి కందా, ఎదర గోదారి మాంచి పోటు మీద ఉంది. ఏటికెదర గెడయ్యడం పడవలో పుట్టి పెరిగిన గోదారి కూనలం మావోల్లే కాలేదు. అటుగా పోమాకండి. కుడి చేతిపక్కగా ఎల్లారంటే, కాసేపటికి లంకలు తగులుతాయి. అక్కడ ఎవ్వరూ ఉండరు. అటేపు పడవ తిప్పండి...” అంటూ నెమ్మదిగా వాళ్ళను దాటుకుంటూ, చెయ్యూపుతూ పోయారు తాత, మల్లి.
బుంగమూతి పెట్టుకుని, పడవను అటుగా తిప్పుతున్న శరత్ ను చూసి, “హేయ్ , అలిగావా ? ఊరికే సరదాగా నిన్ను ఏడిపించాను. నిజంగా కొట్టనులే !” అంది చంద్రిక.
బెట్టు నటిస్తూ, ముఖం అవతలకి తిప్పుకున్నాడు శరత్.
“సరే, అయితే నీకు ఇష్టమైన పాట పాడనా... అప్పుడెప్పుడో గోదావరి ఒడ్డున నువ్వు రాసిస్తే నేను పాడిన పాట ..., మా మంచి శరత్ వు కదూ, నవ్వవూ...” అంటూ అతని గడ్డం పట్టుకు బ్రతిమాలింది చంద్రిక.
“నీమీద కోపం ఏమీ లేదు చంద్రా... నిజానికి నీ అల్లరంటే నాకూ ఇష్టమే !” అంటూ తేలిగ్గా నవ్వేసి, “ అయినా, పాట ఆఫర్ వదులుకోను. అన్నట్టు, ఏ పాట అది , నాకేం గుర్తులేదే... “ తెలియనట్టు అమాయకంగా మొహం పెట్టి, అన్నాడు శరత్.
“ఇదిగో, మరీ అంత ఘజిని సినిమాలో సూర్య లాగా బిల్డ్ అప్ ఇవ్వకు... నా నోటితో చెప్పించాలనే కదూ, నీ ఉద్దేశం... సరే, చెప్తా విను...”
**************
ఈ దేశంలో కాలేజీ లో క్లాస్సులు ఎన్ని జరుగుతాయో అందుకు సరిసమానంగా బంద్ లు జరుగుతాయి. ఆ రోజు తీరా సీతారాంపురం నుంచి ఎండల్లో బస్సుల్లో పడి, కాలేజీ కి వచ్చాకా... బంద్ అని చెప్పారు. ఏం చెయ్యాలో తోచలేదు, వెంటనే వెనక్కి వెళ్లేందుకు మనస్కరించలేదు. సర్లే... వశిష్ట గోదావరి ఒడ్డున ఉన్న నర్సాపురం గ్రామదేవత ‘కొండాలమ్మ’ ను దర్శించుకుని వెళ్దామని అనుకున్నాను. ఆ అమ్మవారంటే, మా ఊరి వాళ్ళకే కాదు, చుట్టుప్రక్కల వాళ్లకి కూడా చాలా నమ్మకం ! ఈ అమ్మవారి కధ ఏమిటంటే...
ఒకసారి వరద గోదారి ఉరవళ్ళు పరవళ్ళుగా ప్రవహిస్తోంది. వరదతో పాటు ఓ కొయ్య విగ్రహం కొట్టుకొచ్చింది. .'ఇది భద్రాచలం నుండి వరదలో కొట్టుకొచ్చింది. మన నరసాపురానికి వచ్చి ఆగింది, కాబట్టి మనం ఇక్కడే గుడి కట్టాలి.' అన్నారు ఊరిపెద్దలు. ఆవిధంగా గోదావరి ఒడ్డునే చిన్న గుడి కట్టి, పూజిస్తుంటే... కోరిన కోరికలు తీరి, రోగాలు తగ్గించి, ఆ తల్లి చూపిన మహిమకు అందరికీ కొండాలమ్మ పై బాగా గురి కుదిరింది. 97 లో వచ్చిన వరదల్లో, ఆ చిన్న గుడి దెబ్బతినటంతో, వెనుక పెద్ద గుడి కట్టి, విగ్రహాన్ని అందులోకి మార్చారు.
అమ్మవారి దర్శనం చేసుకుని, కుంకుమ పెట్టుకుని, పూజారిగారు అమ్మవారి చేతిలో ఉన్న ఖడ్గం నుంచి తీసి ఇచ్చిన రెండు ఎర్ర గాజులు చేతికి వేసుకుని, అలా గోదారి గట్టున కాసేపు కూర్చుందామని వచ్చాను. ఇక్కడ పుట్టిపెరిగిన వాళ్లకు గోదావారంటే అమ్మంత ఇష్టం, మమకారం ! గట్టు మీద, ఎవరో యువకుడు, నీళ్ళలో కాళ్ళు పెట్టి ఆడుతూ, చేతిలో పుస్తకం, పెన్ను పెట్టుకుని, తదేకంగా గోదావరిలో సాగుతున్న నావను చూస్తూ ఉన్నాడు. ఇంకాస్త దగ్గరకి వచ్చి చూద్దును కదా, అది ఎవరో కాదు, ప్రపంచంలోకే అతి ధైర్యవంతులైన నా సహపాఠి... శరత్ గారు. కాస్త ఏడిపిద్దాం... అనిపించింది.
“ఏవండోయ్ భూషణం గారు... నీళ్ళల్లో కాళ్ళు పెట్టి ఆడే కాపీ రైట్ కేవలం ఆడవాళ్లకే రాసిచ్చాడు దేవుడు, తెల్సా !” అన్నాను.
ఏదో తపోభంగం జరిగినట్టు వెనుదిరిగి, నన్ను చూసి, “నా పేరు భూషణం కాదు, శరత్... అలాంటి రూల్ ఏమీ లేదు.”
“అబ్బో, ఈ పాటికి నాకు భయపడి, ఏట్లో దూకేస్తారేమో... నాకు శరత్ హత్యాపాతకం చుట్టుకుంటుందేమో, అని భయపడ్డాను. పర్లేదు, చూడబోతే ,కాస్త ధైర్యం పెరిగినట్టే ఉంది. పుస్తకం హస్త - భూషణం అన్నారు కదండీ, అలాగ పుస్తకం చేతిలో పుచ్చుకుని, దిక్కులు చూస్తుంటేనూ... భూషణం అని పిలవాలని అనిపించింది. అన్నట్టు, అంతగా గుడ్లు మిటకరించి చూడడానికి, ఈ గోదాట్లో ఏముందట ?”
“ఈ గోదావరిలో ఏముందో తెలీదు. మౌనంగానే మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అలసటను అలలతో కడిగేస్తుందో, పైరగాలి వీవెనతో సేద తీరుస్తుందో గాని, మనసు కలతగా ఉన్నప్పుడు, కాసేపు ఈ నది ముంగిట మౌనంగా కూర్చుంటే కొత్త ఊపిరి పోసుకున్నట్లుగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు నదిఒడ్డున తచ్చాడుతుంటే, చిలిపి అలల సవ్వడితో కేరింతలు కొడుతూ మనతో ఆడుతున్నట్లుగా ఉంటుంది. బేధభావాలు చూపకుండా అందరినీ సమానంగా, అమ్మలా ఆదరిస్తుంది. ఆటుపోట్లకు తలొగ్గక, పాత నీటిని, కొత్త నీటిని కలుపుకుంటూ ముగ్ధంగా సాగిపోయే ఈ నది, మౌనంగా జీవన వేదాన్ని బోధిస్తున్నట్లుగా ఉంటుంది... “ మనసులోని ఆరాధననంతా కళ్ళలో నింపి, గోదావరినే తదేకంగా చూస్తూ అన్నాడు శరత్.
“బ్యూటిఫుల్... కవులకు తగిన భావగంభీరమైన భాషలో హృద్యంగా మాట్లాడావు. టన్నుల కొద్దీ భావుకత నీలో దాగుందని, ఇవాళే తెలిసింది. అయితే, ఇప్పుడు నీకో సవాల్... పండిత భాషలో చెప్పిన ఇదే భావాన్ని, పామర భాషలో చెప్పగలవా ? అంటే, చదువురాని పడవ వాడు, తన భాషలో ఇదే భావాన్ని పాటగా పాడితే ఎలా ఉంటుందో, నువ్వు ఇప్పుడే, ఇక్కడే పది నిముషాల్లో ఒక పాటగా రాయగాలవా ? చెప్పు ?” అడిగింది చంద్రిక.
“రాస్తాను... కాని, నువ్వు నన్ను సవాల్ చేసావు కనుక... నీకూ ఒక చిన్న సవాలు. నా గార్ధభ గాన మాధుర్యం ఆ రోజు బస్సు లో విన్నావుగా... నీకున్న సంగీత పరిజ్ఞానం గురించి నాకు తెలుసు. అందుకే, పది నిముషాల్లో నేను రాసిన పాటకి, పది నిముషాల్లో నువ్వు బాణీ కట్టి పాడగలవా ? చెప్పు... “ తిరిగి ప్రశ్నించాడు శరత్.
“తప్పకుండా ! రాసిచ్చి చూడు... నాకు ఇటువంటి సవాళ్లంటే భలే సరదా... “ అంటూ కాస్త దూరంగా కూర్చుని, నీళ్ళల్లో పట్టీల కాళ్ళు ఆడిస్తూ కూర్చున్నాను నేను. నా పాదాలకు ఉన్న పారాణి, నీళ్ళలో లయబద్ధంగా కదులుతున్న నా మువ్వల సవ్వడి వింటూ... కళ్ళు మూసుకున్నావు నువ్వు. అంతే ! ఒక అద్భుతమైన పాట నీ మనోనేత్రంలో క్షణాల్లో జీవంపోసుకుంది...
పల్లవి : గుండె గోదారితోన ఊసులాడతాంది
మాట గొంతు దాటక మూగవోయింది
గోదారి అమ్మలా కుశలమడుగుతాది
చిలిపి అలల సడితోన ఆటలాడుతాది
పైరగాలి పైటతో నిలువెల్లా నిమురుతాది
నిండుమనసుతోన నన్ను సల్లగ దీవిత్తాది // గుండె //
బతుకు పడవ ఆటుపోట్లు వాడుకేనంది
కుంగకపొంగక సాగితె ఏడుకేనంది
పాతనీరు కొత్తనీరు కలుపుకుపొమ్మంది
నిండినా ఎండినా నిబ్బరంగ నవ్వమంది // గుండె //
పాట చదివి నేను ఆశ్చర్యపోయాను. అది ఎవరో మామూలు వ్యక్తి రాసిన పాటలా లేదు. ప్రకృతిలో తాదాత్మ్యం చెందిన ఒక మహర్షి, రాసిన కావ్యంలా ఉంది... ఇక ఈ పాటకు నేను నా గొంతుతో సంగీతంతో ప్రాణం పొయ్యాలి... అదీ పది నిముషాల్లో... పల్లె పడవ వాడి స్వరంలో... నాకు సాధ్యమేనా , సవాలు గెలవగాలనా ? మౌనంగా కళ్ళు మూసుకున్నాను...
వసంతంలో వగరు మామిడి చిగుర్లు తిన్న కోటి కోయిలలు ఒక్కసారి పలికాయా అనిపించింది. వీనులవిందై, మైమరపించే గంధర్వ గానం అంటే ఇదేనా ? తొలకరికి తడిసిన స్వచ్చమైన మట్టివాసనతో తయారైన మట్టిపూలలో ఇమిడి ఉన్న సుగంధం ఇంత మధురంగా ఉంటుందా ? ఏ గానం నేర్వకుండానే విధాత దీవెనలతో పలికే పల్లెకారు పాట... ఇంత ముగ్ధంగా ఉంటుందా ? (ఈ పాట పాడిన లింక్ ను క్రింద జతపరిచాను... వినండి.)
కళ్ళు మూసుకుని, పాట పాడుతున్న చంద్రిక వంకే తదేకంగా చూడసాగాడు శరత్. ఆమె నుదుట గోదావరి అలలకు ఎగసి పడ్డ నీటి చుక్క, ముత్యంలా మెరుస్తోంది. బహుసా, ఆ గోదారి తల్లి తన దీవెనలను ఈ రూపంలో తనకు అందించిందేమో ! లేదులేదు, ఈమే స్త్రీ రూపంలో వచ్చిన గోదావరీ మాతేమో ! ఆ క్షణంలోనే అతని మనసులో చంద్రిక పట్ల ఒక ఆరాధనా భావం కలిగింది. రెప్ప వెయ్యకుండా చూస్తున్న శరత్, పాట ముగిసి, చంద్రిక తనవంక చూడడంతో ఈ లోకంలోకి వచ్చాడు.
“అద్భుతంగా పాడారు. మీరే గెలిచారు...” అన్నాడు శరత్.
“లేదు, మీ సాహిత్యం గెలిచింది. అదే నాతో ఇలా పాడించింది.” అంది చంద్రిక.
“సరే ఐతే,గెలుపు మనిద్దరిదీ కాదు, మనలో ప్రేరణ కలిగించిన ఈ గోదావరిది... సరేనా ? నా మిత్రులు నాకోసం ఎదురుచూస్తూ ఉంటారు, ఇక నేనూ నెమ్మదిగా బయల్దేరతాను..” అంటూ లేచాడు శరత్.
“మళ్ళీ కలుద్దామండి, బై ,” అని చెప్పి, లేచి తనూ కాలేజీ దిశగా నడవసాగింది చంద్రిక.
******
చెప్పడం ఆపి, నీటి వడికి కంగారు పడుతున్న శరత్ వంక చూసింది చంద్రిక. తను కూడా తెడ్డు తీసుకుని, అతనికి సాయం చెయ్యసాగింది. కాసేపటికి పూల పడవ మళ్ళీ మామూలుగా నడవసాగింది. వెన్నెల యానం కొనసాగింది.
“అవును, ఈ నది వేగం చూస్తే గుర్తొచ్చింది, ఫ్రెషర్స్ పార్టీ అప్పుడు నాకు అమ్మవారు పోసి, నేను రాలేకపోయాను. అప్పుడు నలుగురు సీనియర్లు నీళ్ళలో మునిగిపోయిన సంఘటన, మన కాలేజీ మొత్తానికి విషాదాన్ని మిగిల్చింది. నువ్వు ప్రాణాలకు తెగించి, మునిగిపోతున్న ముగ్గురిని కాపాడావని, చెప్పారు. చీమ చిటుక్కుమంటే, ఉలిక్కిపడే శరత్ ధీరుడేనా ఇంత సాహసానికి ఒడికట్టింది ?అని నేను ఎన్నో సార్లు ఆశ్చర్యపోయాను. ఆ రోజు అసలేమి జరిగిందో చెప్పు,” అడిగింది చంద్రిక.
“ కాలేజీలో సీనియర్లు జూనియర్స్ కి ఫ్రేషర్స్ పార్టీ ఇస్తారు. తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు జూనియర్స్, వాళ్లకి ఫేర్వెల్ పార్టీ ఇస్తారు, ఇదంతా అన్ని కాలేజీలలోనూ జరిగేదే కదా ! జూనియర్స్ అందరికీ రావులపాలెం బ్రిడ్జి దగ్గర ఉన్న జొన్నాడ లోని అరటి తోటల్లో ఉదయం నుంచి, సాయంత్రం వరకూ సరదాగా గడిపి, సాయంత్రం గోదావరిలో కొంతమంది హాయిగా స్నానం చేసి, బయల్దేరాలని అనుకున్నాము.
ఆ రోజు తినే ఆహారపదార్ధాలన్నీ ప్యాక్ చేసుకుని, ఒక వాన్ మాట్లాడుకుని, బయలుదేరాము. దారి పొడుగునా పాటలు, అంత్యాక్షరి తో సరదాగా గడిచిపోయింది. అరటి తోటలో దుప్పటీలు పరిచి సీనియర్స్ , జూనియర్స్ ఎదురెదురుగా కూర్చున్నాము. చివరి సారి రాగింగ్ అంటూ, ఇద్దరు అమ్మాయిల్ని పిలిచారు. ఒక పెద్ద టేకు ఆకు మీద, గండుచీమను వేసిచ్చి, ‘రాం నాం సత్య హై, ‘ అని అరుస్తూ, తోట చుట్టూ తిరిగి రమ్మన్నారు. చీమ క్రింద పడితే, మరో రౌండ్ తప్పదట ! అంతా ఒకటే నవ్వులు, గోల... వాళ్ళ వెంట ఊరేగింపుకు వెళ్లినట్టు కాపలా...
తర్వాత సిద్ధూ గాడిని పిల్చి, ఒరేయ్, మాలక్ష్మి మేడం ను ఇమిటేట్ చెయ్యరా... అన్నారు. వాడు మొదలెట్టాడు.
ముందుగా అక్కడున్న ఒక అరిటాకును తెంపి, దానిమీద పుల్లతో ఏదో రాసినట్టు నటించాడు. అది చేతిలో పుస్తకంలా పట్టుకుని, వయ్యారంగా నడుస్తూ వచ్చాడు.
“స్టూడెంట్స్, ఇవాళ నేను మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ ప్రోగ్రామింగ్ గురించి ఎంచక్కా ఈ గైడ్ లో రాస్కుంది చూసి, చదివుతూ రాస్తూ చెప్తానే. మీరు చరిత్ర అడక్కుండా చెప్పేది మాత్రం వినాలి. మీరు మంచి వాళ్ళుట, మీకస్సలు డౌట్స్ రావట , ఏం ?” అంటూ కళ్ళజోడు ముక్కు మీదకు లాక్కుని, దానిపైనుంచి అందరినీ చూసాడు.
“మనం ఊరెళ్ళేటప్పుడు పెట్లో బట్టలు సర్డుకుంటాం కదా, అలాగే కంప్యూటర్ డేటా ని దాని బుర్రలో సర్దుకుంటుంది. బట్టలు కొనడం, కుట్టిన్చుకోడం, ఉతకడం, ఇస్త్రీ చెయ్యడం లాగా... డేటా దాచడానికీ ఒక లెక్కుంటుంది. దాన్ని ఫ్లో చార్ట్ గా ముందు మనం వేసుకోవాలి అని ఈ పుస్తకంలో డేటా చెప్తోంది...” అంటుండగా...
సీనియర్ గోపి చెయ్యెత్తాడు ... “ ఏం ? ముందే చెప్పానుగా డౌట్ లు అడగద్దని, కూర్చో, ‘ కసిరాడు సిద్ధూ గాడు, అచ్చం మాలచ్చిమి మేడం లాగా. అంతా ఘోల్లున నవ్వులు.
‘మేడం ప్లీజ్, ఒక్క డౌట్... ‘ అన్నాడు గోపి.
‘నువ్ కూర్చుంటావా, నేను క్లాసు లోంచి, వెళ్లిపోనా ? నాక్కోపం వస్తే, నేను వెళ్ళిపోతా, తెల్సుగా...” పళ్ళు కొరుకుతూ అన్నాడు సిద్ధూ. అది, మాలక్ష్మి మేడం అసలు డౌట్ లు అడక్కుండా చేసేందుకు, కనిపెట్టిన కిటుకు. ఆవిడలాగే చేసాడు మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన సిద్ధూ. ఆ తర్వాత కొందరు నటీనటుల్ని ఇమిటేట్ చేసాడు. అంతా చాలా సేపు హాయిగా నవ్వుకున్నాం.
మధ్యాహ్నం కావడంతో అంతా భోజనాలకు ఉపక్రమించాము. అనేక రకాలు తనివితీరా తిన్నాకా, అక్కడున్న గోదావరి పాయ అయిన గౌతమి వద్దకు వెళ్లి, స్నానాలకు ఉపక్రమించారు ఈతొచ్చిన కొందరు. నాకు ఆసక్తి లేకపోవడంతో, ఒడ్డున కూర్చుని, వారిని గమనించసాగాను. తమతో వచ్చిన ఆడవాళ్ళ ముందు గొప్పలకి నానా విన్యాసాలు చేస్తూ, లోలోపలికి పోసాగారు. ఇంతలో జరిగింది ఒక అనుకోని విపత్తు !
ఉత్తరాదినుంచి వచ్చిన వరదనీరు నిండిపోవడంతో, ఒక్కసారిగా రావులపాలెం బ్రిడ్జి గేటు లు అన్నీ ఎత్తేసారు. విపరీతమైన వేగంతో జొన్నాడ వద్దకు ఉరకలెత్తింది గోదావరి. పిల్లచేపల్లా, లోపలికి దిగి ఈదుతున్న సీనియర్స్ ప్రవాహ వేగానికి నీటిలో కొట్టుకుపోసాగారు. అంతా అసహాయంగా చూస్తున్నారు.
వాళ్ళని చూస్తుంటే, నాకు ఆ క్షణంలో, వాళ్ళమీద పెట్టుకున్న వాళ్ళ తల్లిదండ్రులే గుర్తుకు వచ్చారు. ఆపై నా ధైర్య దేవత - చంద్రిక మాటలు గుర్తుకొచ్చాయి. నేను ప్రక్కనే పడవకు లంగరేసి కట్టిఉన్న తాడు తీసుకుని, దాన్ని గట్టిగా ఒడిసి పట్టుకోమని కొందరికి చెప్పి, నీళ్ళలో దూకాను. ఈతలో నేను చాంపియన్ నే ! నా పూర్తి శక్తిని రెక్కల్లో నింపి, ముందుకు కొట్టుకుపోతున్న వసంత్ ను జుట్టు పట్టుకు తెచ్చి, తాడుకు కట్టాను. ఒడ్డున ఉన్నవాళ్ళు అతన్ని, నన్ను బలంగా గట్టుకు లాగారు. అలాగే వెనక్కు, ముందుకు ఈదుతూ ఫణి, శ్రీనివాస్ లను రక్షించి, నేను ఒడ్డుకు చేరి, స్పృహ కోల్పోయాను. కాసేపటికి మెలకువ వచ్చి చూస్తే ఏముంది ? అప్పటివరకూ మాతో సరదాగా గడిపిన సీనియర్స్ లో నలుగురు కొట్టుకుపోయారట! రాత్రికి వాళ్ళ శవాలు దొరికాయి. అంతా ఒకటే ఏడుపులు... అప్పటివరకూ ఆనందంగా గడిపిన అందరిలో విషాదం ! యెంత అశాశ్వతమైనది జీవితం ? దిగులు మబ్బులు కమ్ముకున్న అందరం చివరకు ఎలాగో ధైర్యం తెచ్చుకుని, వెనక్కు వచ్చాము.
మర్నాడు నా సాహసానికి, తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ నుంచి పత్రికల దాకా, అంతా మెచ్చుకున్నా, కళ్ళముందు ప్రాణాలు నీటిపాలు అవుతున్న సన్నివేశం నాకు బాగా గుర్తుండిపోయి, కొన్ని నెలల పాటు నిద్ర లేకుండా చేసింది. అప్పటి నుంచి కాలేజీలో పార్టీ లు, వన భోజనాలు అన్నీ బాన్ చేసింది, యాజమాన్యం. “ చెప్తూ ఉండగానే శరత్ కళ్ళలో నీటి చారికలు, చిగురుటాకులా ఒణికిపోతున్నాడు...
అతన్ని అలా చూసి, చలించిపోయింది చంద్రిక. మళ్ళీ ఉత్సాహపరచాలని, ‘ ఏడవకు బేబీ, వుడ్ వర్డ్స్ గ్రైప్ వాటర్ వెయ్యమని, మీ బామ్మతో చెప్తాలే !” అంది.
వెంటనే నవ్వేసిన శరత్... “అదిగో, ఆ తాత చెప్పిన లంకలు అవే అనుకుంటా, చూడు, వెన్నెల్లో వెండి తివాసీ పరిచినట్లు ఎలా మెరుస్తున్నాయో ! చూడు,” అన్నాడు దూరంగా చూపిస్తూ.
“హమ్మయ్య, ఈ డ్రైవింగ్ లైసెన్సు లేని పడవ డ్రైవర్ తో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని, అరపూట వెన్నెల్లో భయపడ్డాను. ఇక నాకు ఆజాదీ రానుంది... వి డు ద ల ... విడుదల...” అంటూ ఇద్దరు సినిమాలో పాట పాడసాగింది చంద్రిక.
“ఓయ్ ! అసలే తింగరబుచ్చివి. సగం రాత్రంతా పడవ నడిపించావు, మిగతా సగం లంకల్లో రన్నింగ్ రేస్ పెట్టవు కదా, ప్రామిస్ చేస్తేనే... పడవ అటు పోనిస్తా, లేకపోతే... మళ్ళీ నట్టేట్లోకే ... త్వరగా చెప్పు...” అనుమానంగా చూస్తూ అన్నాడు శరత్.
“లేదులే ! ఈ పడవలో ఉన్న ఎయిర్ బెడ్ బాగా ఊదేసి, పక్కేసి పెట్టు. తర్వాత ఆ స్వీట్లు గట్రా ఇచ్చేస్తే, తినేసి, హాయిగా బజ్జుంటాను. అస్సలు పరిగెట్టను. ఒట్టు,” బుద్ధిగా చేతులు కట్టుకుని కూర్చుని, అంది చంద్రిక.
“ తమరి ఆజ్ఞ శిరోధార్యం చండీ రాణి ... తమరు శయనించండి, నేను మీకు అధాంగ పూజ చేసుకుంటాను ” అంటూ కొంటెగా కన్నుగీటి, పడవ వేగం పెంచి, లంకల ఒడ్డుకు చేర్చాడు శరత్. అక్కడ ఒక కర్రను పాతి, పడవను తాడుతో కట్టేసి, ఎయిర్ బెడ్ లో గాలిని గాలి కొట్టే యంత్రంతో నింపసాగాడు...
పడవ అంచున కూర్చుని, “ప్రేమకోసమై లంకల పాలయ్యే పాపం పసివాడు... అయ్యో పాపం పసివాడు... “ అని పాడుతూ శరత్ ను ఉడికించసాగింది చంద్రిక.
“వేసుకున్నవాడిదే పక్క, ఓహో ఈ గాలి పక్క(ఎయిర్ బెడ్) ఎంత మెత్తగానున్నది... అరె, ఏంటి అలా చూస్తున్నావు ? ఓహో, నీకూ కాస్త చోటు కావాలా ? ఐతే, ఓ చంద్రికా... తొలిరేయి పెళ్ళికూతురిలా పడవలో ఉన్న టెట్రా ప్యాక్ లోని పాలు గ్లాసులో పోసుకుని, సిగ్గుపడుతూ మెల్లిగా వచ్చి, కాలి బొటనవేలితో నేలను రాస్తూ నిల్చోమ్మా... అప్పుడు ఆలోచిద్దాం ...” తలకింద చేతులు పెట్టుకు పడుకుని, ఆవలిస్తూ అన్నాడు శరత్.
అసలే కోపంగా ఉందేమో, విసవిసా నడిచి వచ్చి నిల్చుని నేల చూపులు చూడసాగింది చంద్రిక.
“ఆహా, మాయాబజార్ సినిమాలో మాయా శశిరేఖ లాగా యెంత గొప్పగా నడిచావు ? కొత్త పెళ్లికూతుళ్ళు అందరికీ ఈ నడక వీడియో తీసి చూపించాలి... అసలు గజ గామిని, హంస నడక తర్వాత , చంద్రిక నడక అని కొత్త ఉపమానం తీసుకురావాలి...” వినోదంగా చూస్తూ అన్నాడు శరత్.
“ఐ హర్టు ... పో నీతో పచ్చి, నన్నేడిపిస్తున్నావ్ ... “ బుంగమూతి పెట్టేసుకుని, ఇసుకతిన్నెల మీదే చతికిలబడి, అటు తిరిగి కూర్చుంది చంద్రిక.
“త్వమసి మమ భూషణం త్వమసి మమజీవనం ...’ అంటూ ‘ ఓ చెలీ ! నీవే నాకు భూషణము, నీవే నాకు జీవనము, నీవే నా భవసాగర మాణిక్యానివి, ఇదిగో నీకు నమస్కరిస్తున్నాను. నన్ను ప్రేమతో అనుసరించు. నా హృదయము నీకొరకే తపిస్తున్నది...” అనే అర్ధం వచ్చే “ ప్రియే చారుశీలే !” జయదేవ అష్టపదిని ఆర్ద్రంగా ఆలపించాడు శరత్.
పాటలోని మాధుర్యం తన హృదయాన్ని తాకుతున్నా, బెట్టు వదలలేదు చంద్రిక... అసలు అటు తిరిగి చూడనేలేదు.
“స్మర గరళ ఖండనం మమ శిరసి మండనం ... దేహి పద పల్లవ ముదారం...” అంటూ అతను కొనసాగించగానే ఒక్క ఉదుటన లేచి, అతనివద్దకు వెళ్లి అల్లుకుపోయింది చంద్రిక.
“శరత్... యెంత గొప్ప పాట పాడావు... ఇది జయదేవ అష్టపదులలో 19 వదైన ‘దర్శనాష్టపది’. అష్టపదులను రాస్తున్న జయదేవుడు, ఇందులో తన చెలి రాధ కోపాన్ని తగ్గించడానికి, ‘కోమలమైన నీ పాదాలను నా తలపై ఉంచు,కనీసం అలాగైనా నీ విరహబాధ కాస్త తీరుతుంది...’ అని అర్ధం వచ్చే ఈ చరణాన్ని రాసి, ‘అయ్యో, రాధ పాదాలు దేవదేవుడైన కృష్ణుడి నెత్తిన ఉంచమని రాసాను, ఇది చాలా తప్పు,’ అనుకుని, తను రాసింది చింపేసి, స్నానానికి వెళ్ళాడట. అప్పుడు ఏమైందో తెలుసా ?”
“నువ్వే చెప్పు, నువ్వు చెప్తే వినాలని ఉంది...” మృదువుగా ఆమె నుదుట చుంబిస్తూ అన్నాడు శరత్.
“స్వయంగా కృష్ణుడే జయదేవుడి రూపంలో వచ్చి, వారి ఇంట భోజనం చేసి, అదే చరణాన్ని తిరిగి రాసి, వెళ్ళిపోయాడట ! కృష్ణ దర్శనం అయ్యింది కనుక, ఈ అష్టపదిని ‘దర్శనాష్టపది’ అంటారు. అంటే... రాధ పాదాల్ని తన తలపై ఉంచడంలో తప్పు లేదని, కృష్ణుడే స్వయంగా చెప్పినట్లు కదా ! అలాగే, సత్యభామ కధలో ఆమె తన పాదంతో కృష్ణుడి తలను తన్నితే, ‘ తంతే తన్నావు కానీ, ఓ చెలీ, నీ కోమలమైన పాదాలు కందిపోలేదు కదా ‘ అని అడుగుతాడు కృష్ణభగవానుడు. ఆ మాటలకు ఆమె కోపం ఎగిరిపోతుంది, మనసు కరిగిపోతుంది. ఇలాగే అనేక కావ్యాల్లో, అలిగిన నాయికని మెప్పించేందుకు నాయకుడు ఆమె పాదాలు పట్టుకున్నట్టుగా చదివాము. ఎందుకంటావు ? దీని వెనుక ఏదైనా అంతరార్ధం ఉందా ?” సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది చంద్రిక.
“ఉంది చంద్రా ! దైవం మనకిచ్చిన అతి గొప్పవరాల్లో ప్రేమ అగ్రస్థానంలో ఉంటుంది. ఈ ప్రేమకు ప్రతిబంధకం అహం. స్త్రీ అయినా, పురుషుడైనా తాను ప్రేమించినవారిని తన్ను తాను ప్రేమించినట్లుగా, నిజానికి అంతకంటే గొప్పగా ప్రేమించాలి. మన కాళ్ళు పట్టుకోడానికి మనకి ఎటువంటి అభ్యంతరం ఉండదుగా, అలాగే మనం ప్రేమించిన వాళ్లవీనూ. అంటే- నేను, నా భార్య... ఒకటే... రెండు దేహాలలో ఉన్న ఒకే ఆత్మ మేము... అన్న అద్వైత భావన గుండెల్లో బలపడితే తప్ప, నిజమైన శృంగారం, రసానుభూతి అనుభవంలోకి రాదు. ఏ ఒక్కరిలో తమ ఆధిక్యత చూపాలన్న ఆరాటం ఉన్నా, వారి దాంపత్యం రసహీనమవుతుంది. అందుకే, స్వయంగా భగవంతుడే అహపు తెరలు కమ్మిన నాయిక మనసు కరిగిపోయేలా, నీ కాళ్ళు కూడా పట్టడానికి సిద్ధం... అంటూ, అహం లేనప్పుడే నిజమైన ప్రేమ, తాదాత్మ్యం సాధ్యం అని స్వయంగా ఆచరించి చూపారు. ఈ సూత్రాన్ని పాటించిన దంపతుల జీవితం ఆనందమయమౌతుంది. కదూ... ఇదేనా నాతో నువ్వు చెప్పించాలని అనుకున్నది... “ అడిగాడు శరత్.
అతను చెప్పిన విషయంతో ఏకీభావిస్తున్నట్లుగా కనురెప్పలను మూసి, “ సమున్నత భావాలున్న నీవంటి భర్త దొరకడం నా అదృష్టం శరత్,” అంటూ చటుక్కున అతని బుగ్గపై ముద్దుపెట్టింది చంద్రిక. “అదృష్టం నీది మాత్రమే కాదు చంద్రిక, నాది కూడా,” అంటూ ఆమెను మరింత గాఢంగా హత్తుకున్నాడు శరత్.
ఇద్దరి మధ్యా మౌనం ... మనసుమనసుతో మాట్లాడుకునేటప్పుడు ఇక మాటలతో పనేముంది ? ఒకరి గుండె చప్పుడు ఒకరికి వినిపిస్తోంది. అతని వెచ్చటి శ్వాస ఆమెను తడుపుతోంది... ఇద్దరి తనువుల్లో సన్నటి ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రేమను పండించుకుంటున్న ఆ జంటను చూసేందుకు చంద్రుడు మరింత క్రిందికి వచ్చాడా అన్నట్లు, వెన్నెల పుచ్చపువ్వులా దీవంతా పరచుకుంది.
వెన్నెల వేడెక్కింది... వెన్నెల వెన్నెలనే హత్తుకుంది... వెన్నెల వెన్నెల్లో కరిగిపోయింది... వెన్నెల వెన్నెలలో కలిసిపోయింది.
రెప్పలపై పడ్డ నులివెచ్చని సూర్యకాంతికి మెలకువ వచ్చి, నెమ్మదిగా లేచి కూర్చుంది చంద్రిక. పక్కన శరత్ లేడు. నిలబడి చుట్టూరా చూసింది, కనిపించడే ! అటూ, ఇటూ చూస్తుండగా... గోదారి నీళ్ళలో అలికిడి వినబడింది. అటుగా వెళ్ళిన చంద్రికకు ఎవరూ కనిపించలేదు. కాస్త నీళ్ళలోకి దిగి ముందుకు నడిచి చూస్తుండగా... ఒక్క ఉదుటన నదిలోంచి లేచిన శరత్, ఆమెను కూడా నీళ్ళల్లో ముంచేసాడు.
“హేయ్, ఆగు, ఏవిటీ అల్లరి...” అంటూ అతన్ని వారించి, లేచి నిలబడ్డ చంద్రిక నడుమును గట్టిగా ఒడిసి పట్టుకుని, ‘ సరిగోదావరి స్నానాలోయ్... తప్పేముంది, ఇప్పుడు నువ్వు నా పెళ్లానివి...నాకు హక్కుంది...’ అన్నాడు శరత్.
‘అలాగేకాని, ఇప్పుడే నిద్దర లేచాను కదా, కాస్త ఫ్రెష్ అవ్వనివ్వు... తర్వాత చూద్దాం...’ అందామె విడిపించుకుంటూ.
‘అటులనే దేవీ ! ముందుగా తమరు కాస్త నా వీపును రుద్ది, తదుపరి నిష్క్రమించుడు. తమ కొరకు కాఫీ కలిపి, ప్రక్కన ఫ్లాస్క్ లో ఉంచితిమి, గ్రోలుడు...’ గ్రాంధిక భాషలో అన్నాడతను.
“ఏంటి ? నేను నీ వీపు రుద్దాలా ? పెళ్ళాంతో సేవలు అప్పుడే మొదలా ?”
“రాత్రి దేవి గారు అహము కూడదని సెలవిచ్చినారు, అందులకే అది నిరూపించుకొను అవకాశమును వారికి కల్పించ సంకల్పించినాము...”
“ఓహో, అటులనే నాధా... నేను తక్షణమే వెళ్లి , 100 నిమ్మకాయల శక్తిగల విం బార్ ను తెచ్చి, పీచుతో తమ వీపు తోమెదము, అనుమతినివ్వుము...” దాసిలా నటిస్తూ అంది చంద్రిక.
“స్త్రీలు వాడు లేపనములు మేము సంగ్రహించము. కోమలమైన నీ కరములే చాలును దేవీ ! కాలయాపన చెయ్యక మా ఆజ్ఞను శిరసావహించుము...” మహారాజు పోసులో అన్నాడు శరత్.
కిలకిలా నవ్వేసి, ‘అలాగే, వెనక్కి తిరుగు,’ అంటూ అతని వీపు రుద్దుతూ...’ శరత్... మనం కలిసి చదువుకునే రోజుల్లో నన్ను పెళ్ళిచేసుకోవాలని ఎప్పుడైనా అనుకున్నావా ?’ అడిగింది చంద్రిక.
“నీకో విషయం చెప్పాలి చంద్రిక... చిన్నప్పటి నుంచి నాకో కల వచ్చేది.. ఆ కల్లో ఒక అందమైన అమ్మాయి...”
“ఆగాగు, డ్రీం గర్ల్... అంటే, హేమామాలిని వచ్చేదా ? నీది బాగా పాత టేస్ట్...”
“లేదు... కల్లో ఒకమ్మాయి కనిపించేది. నాలాగే ఆటపాటల్లో, కళల్లో, చదువులో మేటి అయిన అమ్మాయి. అచ్చంగా నా మనసు అద్దంలో ప్రతిబింబంలా ఉండే అమ్మాయి, మా కాలేజీలో నాతోటే చదువుతుందని, ఆమెనే నేను పెళ్లి చేసుకుంటానని... తియ్యటి కల... ఎన్నిసార్లు వచ్చిందో..”
“హాయ్, ఆ అమ్మాయి నేనేనా ? ఐతే చిన్నప్పుడే నువ్వు కాలేజీ రేంజ్ లో కలలు కనేవాడివా ?” ఉత్సాహంగా వీపు రుద్దడం ఆపి, ముందుకు వంగి అంది చంద్రిక.
“అబ్బే, నువ్వయ్యే అవకాశం ఎంతమాత్రం లేదు, ఎందుకంటే, నా కలలరాణి కనబడ్డవాల్లనల్లా కరాటే తో చితగ్గోట్టలేదు...” కవ్విస్తూ అన్నాడు శరత్.
“సర్లే గాని, ఈ సినిమా కధ చెప్పడం ఆపి, ఇక అసలు విషయానికి రా... ఈ సెంటిమెంట్ బరువుకు నా చీర కొంగు తడిసిపోయింది...” కొంగు గోదాట్లో పిండుతూ అంది చంద్రిక.
“అరెరె , ఐతే, నీ కాలికి మట్టి అంటకుండా... అలా తీసుకెళ్ళి, కూర్చోబెట్టి, చెప్తాను, పద...” అమాంతం ఆమెను తన చేతులపైకి ఎత్తుకుని మోసుకువెళ్ళసాగాడు శరత్...
చంద్రిక ‘ఉండు, కాస్త ఫ్రెష్ అయి వస్తాను,’ అంటూ అతన్ని విడిపించుకుని వెళ్ళింది.
చంద్రిక స్నానం చేసి, ఫ్రెష్ అవుతుండగా, సరంజామా అంతా తిరిగి పడవలో సర్దేసాడు శరత్. ఆమె రాగానే, వేడివేడి కాఫీ, బ్రెడ్ అందించాడు. ఇద్దరూ కొండల్లోంచి ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండగా,
“ఆ, నీ డ్రీం గర్ల్ గురించి చెప్తూ ఆపేసావు కదా, కొనసాగించు...” అంది చంద్రిక.
“నాకెప్పుడూ ఒకటే కల, ఆ కల్లో అస్పష్టమైన ఒక అందమైన అమ్మాయి. నాలాగే ఆడుతూ, పాడుతూ, రాస్తూ, చదువుతూ, అన్ని కళల్లో మేటిగా ఉండే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నట్లు కల వచ్చేది. నువ్వు పరిచయం అయ్యాకా, ఆ అస్పష్టత తొలగి, అది నీ రూపంగా మారింది. నీ పాట, మనోధైర్యం, నీ నడత, అన్నీ నా మనసులో నీపట్ల బలమైన ఆరాధనా భావాన్ని పెంచాయి. నాకు తెలియకుండానే నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను.”
“ఓహ్, అలాగా, మరి నాకెప్పుడూ చెప్పలేదే ! ఇంతలా నన్ను పొగుడుతుంటే నాకు మబ్బుల్లో తెలుతున్నట్టు ఉందనుకో!” సిగ్గుపడ్డట్టు నటిస్తూ అంది చంద్రిక.
“మరీ అంతలా తేలకు, వానపడితే, మబ్బుల నుంచి దబ్బునకింద పడతావు. మొదట్లో చెప్పేంత చనువు మన మధ్యన లేదు. తర్వాత నెమ్మదిగా చెబుదాము అనుకుంటుండగా, నువ్వు నా గుండెల్లో ఆటం బాంబు పేల్చావు..”
“హమ్మో, ఇలా ఎక్కడన్నా అనేవు. యురేనియం తో చేసారేమో అని ,నీ గుండెతో రీసెర్చ్ చేసి, న్యూట్రాన్ లతో దెబ్బకొట్టి పరీక్షించగలరు. ఇంతకీ నేను నీ గుండెను హిరోషిమా, నాగసాకి చేసానంటావ్ , ఎలా ? ఎప్పుడు ?”
“సెకండ్ ఇయర్ మొదట్లో ఉండగా, ‘మా బావతో నాకు ఎంగేజ్మెంట్, మీరు తప్పక రావాలి,’ అంటూ నువ్వు కార్డులు తెచ్చి అందరికీ పంచావు. నాక్కూడా ! అశనిపాతంలా తాకింది ఆ వార్త నన్ను. ఆరోజు మీ ఫ్రెండ్స్ తో నీ సంభాషణ నాకు ఇంకా గుర్తే !
‘మీ బావ ఏం చేస్తుంటాడే... ‘
’ మా బావా వాళ్ళు నా చిన్నప్పుడే అమెరికాలో స్థిరపడ్డారు, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ తీసేసి, భారత్ లోనే కంపెనీ పెట్టి, పూర్తిగా ఇక్కడికే వచ్చెయ్యాలని వాళ్ళ ఆలోచన. ఏవో కుటుంబకలహాల వల్ల ఇన్నాళ్ళూ రాకపోకలు లేవు. ఇప్పుడు మా అత్తయ్య స్వయంగా ఫోన్ చేసి, ఈ సంబంధం కలుపుకోమందిట ! నాన్నగారు ఒప్పుకున్నారు.’
‘అయితే నువ్వు మీ బావని ఇంతవరకూ చూడలేదా ?’
‘లేదే, పెద్దరాజు గారి మాటంటే ఈ ఊరి వాళ్లకు వేదవాక్కు. ఆయన కూతుర్ని నేను. ఆయన ఏది చేసినా, నా మంచికే చేస్తారన్న నమ్మకం నాకుంది.’
‘కంగ్రాట్స్ చంద్రికా. మీ ఎంగేజ్మెంట్ కి తప్పకుండా వస్తాం’. అంటూ అభినందిస్తున్న వాళ్ళతో, నేనూ విష్ చేసి వెళ్ళిపోయాను. ఆ రాత్రే ఏమైనా, నువ్విచ్చిన ప్రేరణకు కృతజ్ఞతగా నవ్వుతూనే ఉండాలని, నీతో స్నేహం చెడిపోకూడదని, నీపై ఉన్న ప్రేమని నా మనసులోనే సమాధి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.
మావిడాకుల తోరణాలు కట్టిన కొబ్బరాకుల పందిరి మీ ఇంటిముందు వేసుంది ఆ రోజున. మిత్రులం అంతా నీకు మంచి బహుమతి తెచ్చాము. మీ బావ చూడచక్కగా, ఆరడుగుల ఎత్తుతో ఉన్నాడు. ఇక్కడి పద్ధతులు తెలీవేమో, కాస్త ఇబ్బంది పడుతున్నా, చిరునవ్వు చెక్కుచెదరనివ్వట్లేదు. ‘చక్కని జోడీ’ అనుకున్నాను మనసులోనే. నాకంటే, అన్ని విధాలుగా అతనే నీకు తగినవాడు అనిపించింది.
నీ ఎంగేజ్మెంట్ వేడుకల్లో మన మిత్రులు చేసిన హడావిడి అంతాఇంతా కాదు. అంత్యాక్షరి ఆడించారు, మూగసైగల ఆట ఆడించారు, ఆటపాటలు, సందడి. అన్నీ చూసి ఆనందిస్తూనే ఉన్నా, మీ బావ నీ చేతికి ఉంగరం తొడుగుతూ ఉండగా మాత్రం, జన్మజన్మలుగా నాకు స్వంతమైన అపురూపమైన మనిషిని ఎవరో తన్నుకుపోతున్న అనుభూతి కలిగింది. ఏదో పనుంది అంటూ, అక్కడినుంచి మౌనంగా నిష్క్రమించాను. చిన్నప్పటి నుంచి అమ్మా, నాన్నా అన్నీ తానే అయ్యి నా మీదే ప్రాణాలు పెట్టుకున్న అమ్మ గుర్తుకు వచ్చింది. అంతే, ఆ రాత్రికే బస్సు ఎక్కి అమ్మదగ్గరికి వెళ్లాను. అమ్మ ఒడిలో పడుకుని, మళ్ళీ అప్పుడే పుట్టినట్లు భావించాను, నన్ను నేను తమాయించుకున్నాను. మూడు రోజుల తర్వాత నేను తిరిగి వచ్చేసరికి, హడావిడిగా వచ్చిన మీ అత్తయ్య కుటుంబం వెనక్కు వెళ్ళిపోయిందని, నీ చదువు పూర్తి కాగానే జరిగే మీ పెళ్ళికి మళ్ళీ తిరిగి వస్తుందనీ విన్నాను.
ఆటపాటలు, అల్లరి, విజ్ఞాన సముపార్జన, వినోదం అన్నీ కలగలసి కాలేజి జీవితం అందరి మనస్సులో ఒక మధుర జ్ఞాపకం. చూస్తుండగానే మూడో సంవత్సరం చివరికి వచ్చేసరికి, మన కాలేజీ లో క్యాంపస్ ఇంటర్వ్యూ లు మొదలయ్యాయి. తొలి విడత సెలక్షన్ లోనే నాకు మంచి కంపెనీ లో ఉద్యోగం వచ్చింది. వారే పైచదువులు చదివిస్తామని, విదేశాలకు పంపుతామనీ చెప్పారు. మన మిత్రులంతా అభినందించారు. అమ్మ చాలా సంతోషించింది. ఆమె ఋణం తీర్చుకునే అవకాశం ఇచ్చినందుకు ఆ దైవానికి కృతఙ్ఞతలు తెలుపుకున్నాను.
చివరి రోజున మనం కలిసినప్పుడు, నువ్వు ఎర్రంచు ఉన్న తెల్లటి చీరలో దేవకన్య లాగా అనిపించావు. మళ్ళీ నువ్వు కనిపించవు కదా అని, నిన్ను అభ్యర్ధించి, నీతో ఒక ఫోటో తీయించుకున్నాను. అది ఇప్పటికీ నాదగ్గర పదిలంగా ఉంది. ఆ రోజు వెళ్ళిపోతున్న నిన్నే చూస్తూ, మళ్ళీ కలవలేనేమో అని మనసులో కట్టలు తెంచుకున్న ఉద్వేగం కన్నీళ్ళ రూపంలో ఉబికి వస్తోంది... చూస్తుండగానే ఆ కన్నీటితో పాటే, మసకబారిన నీ రూపం అలా కళ్ళవెంట జారి, కరిగిపోయింది...”
“ఓహో, ఇంత కధ దాచావా ? అయినా, ట్వంటీ ఫస్ట్ సెంచరీ లో కూడా ఈ ఉద్వేగాలు ఏంటి శరత్... చిటికెడు సెంటిమెంట్ డబ్బాడు కన్నీరు అంటూ ! ఇవన్నీ నాకు నచ్చవు. అదే ‘శ్రీ’ అయితే యెంత సరదాగా ఉంటాడో తెలుసా. క్షణాల్లో నవ్వించేస్తాడు. అసలు నీ బదులు అతన్నే చేసుకోవాల్సింది !” అంది చంద్రిక నిట్టూరుస్తూ !
“అవును చంద్రికా, కాలేజీ అయిపోయాకా నేను నిన్ను కలవలేదు. తర్వాత ఏమి జరిగింది ? మీ బావ ఏమయ్యాడు ? ఈ ‘శ్రీ’ ఎవరు ?” అడిగాడు శరత్...
‘చెప్తా, చెప్తా... నది పోటు ఉదయం తగ్గిపోతుంది. అలా పడవలో వెళ్తూ మాట్లాడుకుందామా ?’ అంది చంద్రిక. ఇద్దరూ, మళ్ళీ పయనం కొనసాగించారు.
శరత్ తెడ్డు వేస్తుండగా, కదులుతున్న అలల్ని, ఆ అలల ఊయలలో మెరుస్తున్న లేతభానుడి కిరణాల్ని చూస్తూ, ఇలా చెప్పసాగింది చంద్రిక.
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే దాన్ని జీవితం అని అనరేమో ! విధి మనుషులతో, వింత నాటకం ఆడి, వారి బ్రతుకుల్ని అనుకోని మలుపులు తిప్పేసి, వినోదిస్తుంది. అటువంటి సంఘటనలే, కాలేజీ పూర్తయ్యి, ఉద్యోగం వచ్చి, నువ్వు వెళ్లిపోయాకా, నా జీవితంలో కూడా జరిగాయి శరత్.
నవంబర్ 10, కార్తీకమాసంలో బావతో నా పెళ్లి ఖాయం అయ్యింది. అమెరికాలో ఉన్న తన వ్యాపారాలు అన్నీ మూసేసి, హైదరాబాద్ కు వచ్చి, ‘స్పూర్తి ఇన్ఫోటెక్’ అనే కంపెనీని ఆరంభించే పనిలో పడ్డాడు మా బావ. మా అత్తయ్య కుటుంబంవారు అంతా శివభక్తులు. శివానుగ్రహం వల్ల అన్ని పనులూ, ప్రభుత్వ పర్మిషన్ లు పూర్తి అయ్యాయి. ఇక ప్రారంభోత్సవం కూడా చాలా ఘనంగా జరిగింది. అన్నీ పూర్తయ్యాకా, వారు మ్రొక్కులు తీర్చుకోవాలని బయలుదేరుతూ, మమ్మల్ని కూడా రమ్మన్నారు. పెళ్ళికి ఇంకా నెల రోజులు కూడా లేకపోవడం, పనుల ఒత్తిడి ఎక్కువ ఉండడంతో నన్ను షాపింగ్ కోసం, బట్టలు కుట్టించుకోవడం కోసం రాజమండ్రి లో ఉన్న మా పిన్ని ఇంట్లో దింపి వెళ్ళారు మావాళ్ళు. అత్తయ్య, మావయ్య, బావ, అమ్మా, నాన్న, మావయ్య చుట్టాలు, వాళ్ళ పిల్లలు, ఇలా మొత్తం 10 మంది కలిసి, యాత్రలకు బయలుదేరారు.
భూమిమీద విశిష్టమైనవి, శివుడికి రెండు కన్నులలాగా అత్యంతప్రీతిపాత్రమైన క్షేత్రాలు రెండు ఉన్నాయి. ఒకటి కాశి, రెండు కేదారనాథ్. పరమేశ్వరుడు సృష్టిని ఆరంభించినప్పుడు ఆయన అర్ధనారీశ్వర స్వరూపం నుంచి పురుష రూపమైన నారాయణుడు, స్త్రీ రూపమైన ప్రకృతి అవతరించాయి. సృష్టి చేసే శక్తిని సంపాదించేందుకు వారిని తపస్సు చెయ్యమని పరమశివుడు ఆదేశించాడు. కాని, ఎక్కడ చూసినా, జలమే కనిపిస్తుండడంతో సందిగ్ధంలో ఉన్న వారికోసం, శివుడు తన తేజస్సుతో ఐదు క్రోసుల విస్తీర్ణం కల ఒక పట్టణాన్ని నిర్మించాడు. అదే, కాశి. ఆపై దేవతల కోరికలను అనుసరించి, శివుడు ఆ క్షేత్రంలోనే ’విశ్వేశ్వరుడి’గా కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రం శివుడి త్రిశూలంపై ఉంటుందనీ, బ్రహ్మ సృష్టి కాదు కనుక ప్రళయంలో కూడా నశించదని, ప్రతీతి. ముందుగా మావాళ్ళు కాశి దర్శనం చేసుకుని, ఆపై కేదారనాథ్ కు బయలుదేరారు.
‘కేదారే ఉదకం పీత్వా –పునర్జన్మనవిద్యతే..’ అంటారు, అంటే నిత్యం శివనామస్మరణతో మారుమ్రోగే కేదారనాథ్ లోని ‘రేత కుండం’ లోని నీటిని తాగినవాళ్ళకి పునర్జన్మ ఉండదు అని, కేదారఖండం అనే గ్రంధం ప్రమాణంగా చెబుతారు. హిమాలయాలలోని కేదార శిఖరంపై విరాజిల్లే జ్యోతిర్లింగమే కేదారనాథ లింగం. దేవతలకు విహారభూమిగా, మహర్షులకు తపో భూమిగా ప్రసిద్ధి చెందిన హిమాలయ పర్వతాలలోని ‘కేదార్‌నాథ్’లో శివుడు శ్రీకేదారేశ్వరుడుగా కొలువుదీరి భక్తుల ఆరాధనలందుకుంటూ వున్నాడు. పూర్వం బదరీకవనంలో నరనారాయణులు చేసిన తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు, వారి కోరికపై ఇక్కడ వెలిసాడు .సముద్ర మట్టానికి 3657 మీటర్ల ఎత్తున ఈ శివలింగం ఉంది.
కేదార శిఖరానికి పడమటి వైపున ‘మందాకిని ‘ తూర్పువైపున అలకనంద ప్రవహిస్తున్నాయి. మందానికి ఒడ్డున కేదారనాథస్వామి, అలంకనంద ఒడ్డున బదరీనారాయణ స్వామి వెలసియున్నారు. అలకనందా, మందాకిని నదులు ‘రుద్రప్రయాగలో’ కలసి కొంతదూరం ప్రవహించి ‘దేవప్రయాగ ‘ దగ్గర ‘భాగీరథి ‘లో కలుస్తున్నాయి. కాశీ నుంచి హరిద్వార్, అక్కడినుంచి ఋషికేశ్ వచ్చిన మావాళ్ళంతా ఒక సుమో ను అద్దెకు తీసుకుని, కేదారనాథ్ యాత్రకు వెళ్ళారు. దారిలో నాకు ఫోన్ చేసి, ఎలా ఉన్నానో అన్న క్షేమసమాచారం, పెళ్లి షాపింగ్ ఎంతవరకు వచ్చిందో ఆ వివరాలు, అన్నీ కనుక్కున్నారు కూడా !
కాని, వాళ్ళు కేదారనాథ్ చేరగానే వచ్చిన భయంకరమైన ఉప్పెనలోని నీటివడి వల్ల, మా కుటుంబసభ్యులు ఉన్న సుమో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. మొదట్లో ఎంతగా వెతికినా మావాళ్ళ ఆచూకీ దొరకలేదు వాళ్ళు ఎక్కడోఅక్కడ బ్రతికి ఉంటారని, తిరిగి వచ్చి ఫోన్ చేస్తారని, మొబైల్ వంకే పిచ్చి దానిలా చూస్తూ ఎదురుచుసాను. అప్పుడే నాకు తెలిసింది, మనిషికి నిజమైన బలం దేహబలం కాదు, “నా” అన్నవాళ్లు ఇచ్చే మనోబలమే అసలైన బలమని. నా ఎదురుచూపులకి ముగింపులా చివరికి, ఈ సంఘటన జరిగిన 25 రోజుల తర్వాత, మంచుకొండల్లో దూరంగా లభ్యమైన సుమో, అందులో చిక్కుకుని ఉన్న మా అమ్మా,బావల శవాలు దొరికాయి. అప్పుడే నిర్ధారణ అయ్యింది... అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని.
పెళ్లి జరిగి కళకళ లాడాల్సిన ఇంట్లో, సామూహిక పిండ ప్రదానాలు జరిగాయి. ‘నా’ అనుకున్న వాళ్ళు ఎవరూ నాకు ఇక లేరు. దుఃఖం, బాధ, మనసును పిండేసే వేదన. అసలు దేవుడు ఉన్నాడా ? ఉంటే, ఇంత విలయం జరగనిచ్చే వాడా ? అంతా పోయాకా, ఇక నేను మాత్రం ఎందుకు బ్రతకాలి ? ఒకటే అంతర్మధనం... ఈ లోపు ఆ కుటుంబానికి మిగిలిన ఒకేఒక్క వారసురాలిగా మా ఆస్తుల, పొలాల బాధ్యతలు, ఇటు మా బావ సాఫ్ట్వేర్ కంపెనీ బాధ్యతలు నామీద పడ్డాయి. ఎవరోఒకరు నిలబడకపోతే కాకుల్లా మా ఆస్తులు పొడుచుకు తినేందుకు, గద్దల్లా పీక్కుతిని ఎగారేసుకుపోయేందుకు చాలామందే ఎదురుచూడసాగారు.
ఆ పరిస్థితుల్లో, ఎంతోమందికి ఉపాధిని కల్పించే, తన కలలకు ప్రతిరూపమైన మా బావ కంపెనీ, పరులపాలు కాకుండా, దాని బాగోగులు చూసేందుకు, తప్పనిసరై నేను కంపెనీ నిర్వాహక బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఊళ్ళో ఉన్న ఆస్తుల బాధ్యతలు అన్నీ , అక్కడే స్థిరపడ్డ మాకు వరుసకు పెదనాన్న అయినవారికి అప్పగించి హైదరాబాద్ వచ్చాను.
నా అదృష్టం, అక్కడ బావకు ప్రాణస్నేహితుడైన కిరణ్, ప్రస్తుతం కంపెనీ చేపట్టిన ప్రాజెక్ట్ ల వివరాలను , కంపెనీ విధానాలను గురించి తెలిపాడు. అకౌంట్స్ డిపార్టుమెంటులో ఉండే నివాస్ నాకు పెట్టుబడులు, సిబ్బంది జీతాలు, రాబడులు గురించి చెప్పేవాడు. నా దినచర్య, మీటింగ్స్, అప్పాయింట్మేంట్స్ వంటివి నా పర్సనల్ అసిస్టెంట్ అయిన మనోహర్ చూసుకునేవాడు. సిబ్బంది అంతా నాపై కల సానుభూతితో, బావపై కల అభిమానంతో శ్రద్ధగా పనిచేయసాగారు. నేను పగ్గాలు చేపట్టిన ఆరు నెలలలోనే కంపెనీ లాభాల బాట పట్టింది.
కాని, ఎంతటివారైనా, స్వార్ధం బారిన పడకుండా ఉండలేరేమో! ఒంటరి ఆడది అంటే అందరికీ లోకువే ! ఒకప్రక్క ఎంతో ఆత్మీయంగా ఉంటూ, నేను పెదవి విప్పకుండానే నా అవసరాలు కనిపెట్టుకుని, సహకరిస్తున్న కిరణ్, నివాస్, మనోహర్ ల ప్రవర్తన క్రమంగా మారసాగింది. నాకు దగ్గరయ్యి, నన్ను పెళ్లి చేసుకుంటే, తద్వారా ఈ ఆస్తుల మీద, కంపెనీ మీద ఆధిపత్యం దక్కుతుందని వాళ్ళ ప్లాన్. ఎప్పుడు అవకాశం దొరికినా అతిచనువు తీసుకునేందుకు, అతి సానుభూతి వ్యక్తపరిచేందుకు ప్రయత్నించేవారు. ఒకరితో ఒకరు ఎడమొహం పెడమొహంగా ఉంటూ, నేను ఏ ఒక్కరితో కాస్త నవ్వుతూ మాట్లాడినా, మిగతావారు చిన్నబుచ్చుకుని, ‘వాడు మంచివాడు కాదు, వాడితో జాగ్రత్త,’ అంటూ ఒకరిపై ఒకరు ఏవేవో నూరిపోసేవారు. ఒకప్రక్క కంపెనీ పనులు, మరోప్రక్క ఊళ్ళో ఉన్న ఆస్తుల పర్యవేక్షణ, మరోప్రక్క వీళ్ళ గిల్లికజ్జాలు, వీళ్ళు వేసే ఎత్తుగడల నుంచి నన్ను నేను రక్షించుకోవడం, నాకు చాలా కష్టమైపోయేది. తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేదాన్ని, పైగా ఆత్మీయులు దూరమైన గాయం మనసులో ఇంకా మాయలేదాయే.
మన స్నేహితుల్లో ఎవరితోనైనా నా బాధ పంచుకుంటే, కాస్త ఊరటగా ఉంటుందని, ఒక పేస్ బుక్ ఖాతా తెరిచాను. ఎవరో ఒకరిద్దరు తప్ప, మిగతా స్నేహితులు అంతా తలోదిక్కూ అయిపోయారు. వాళ్ళతోనే మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇలా ఉండగా, ఒకరోజు ‘శ్రీరాం’ అనే పేరున్న కొత్త వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ప్రొఫైల్ ఫోటో చూస్తే, వెనక్కు తిరిగి, పార్క్ లో బెంచ్ పై కూర్చుని, చెరువులోని అలలవంక చూస్తున్న యువకుడి ఫోటో ఉంది. ఇంకే ఫోటోలు లేవు. ఆ ప్రొఫైల్ లో నన్ను ఆకర్షించిన విషయం, అతను మన కాలేజీ లోనే ఎం.సి.ఏ చదువుకున్నట్లు ఉంది. ఎవరో మన సీనియర్ లేక జూనియర్ అయి ఉంటారులే, అన్న ధైర్యంతో ఆక్సెప్ట్ చేసాను.
మర్నాడే ఫేస్బుక్ మెసెంజర్ లో ఒక కాల్ వచ్చింది. ఎవరో చూద్దాం అనుకుంటూ తియ్యగానే...
“ఏమే, ఒక ముద్దు పెట్టవే...” అంది అవతలి కంఠం .
నాకు షాక్... అరె, నిన్నేగా ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేసాను. ఇంతలోనే అంత అతివాగుడా ? అసలే చుట్టూ ఉన్న కీచకులతో చస్తుంటే, మళ్ళీ కొత్తగా వీడోకడా ? ఒళ్ళు మండిపోయింది నాకు.
“మిష్టర్, వాట్ ద హెల్... ఒళ్లెలా ఉంది ? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా ?”
“ఒళ్ళు బాలేదే బాబూ, అందుకే చేసాను. ఐ.సి.యు లో ఉన్నా. మళ్ళీ ఆ నర్స్ చూస్తే, నా ఫోన్ లాగేసుకుంటుంది. నువ్వు త్వరగా ముద్దు పెట్టావే అనుకో, నేను బ్రతుకుతా... లేకపోతే నా ప్రాణాలు నీ ప్రేమ లేక అనంత వాయువుల్లో కలిసిపోతాయ్. అన్యాయంగా ఒక మనిషిని చంపిన పాపం నీకేందుకుగాని, ప్లీసే, త్వరగా ఒక ముద్దు పెట్టు...”
“ఓయ్, చెప్తుంటే నీక్కాదూ ! ఎవరనుకుని ఎవరికి ఫోన్ చేసావో, నేను నీకు ముద్దు పెట్టడం ఏంటి, మతుండే మాట్లాడుతున్నావా ?”
“ఆ, మతొక్కటే మిగిలింది ప్రియా ! చూడు, మొహమంతా బండేజిలు, ఆక్సిజన్ మాస్క్, చేతులు కాళ్ళు, ఆకారాలు ఉన్నాయి. ఈ ఫోటో చూడు... ఇక ఎక్కువకాలం బ్రతకను. నేను ప్రాణంగా ప్రేమించిన నువ్వు ఒక్క ముద్దు పెట్టేస్తే, నా ఆఖరికోరిక తీరి తృప్తిగా వెళ్ళిపోతాను, ఆలస్యం చెయ్యకు ప్లీజ్...” ఈ సందేశం వెంటనే వచ్చింది ఒక ఫోటో.
అందులో మొహమంతా బాండేజ్ లతో హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న ఒక కుర్రాడి ఫోటో. చూడబోతే, నిజంగానే చచ్చేట్టు ఉన్నాడు. అరె, ఇదేంటి కొత్త సమస్య ? ఇప్పుడు ఏమిటీ చెయ్యడం ? నా వాళ్ళంతా చనిపోయినప్పుడు నేను పడ్డ మనోవేదన గుర్తుకు వచ్చింది. సందిగ్ధంలో పడి, ఒక్కక్షణం మౌనంగా ఉండిపోయాను.
“చంద్రా, ప్లీజ్ రా... క్విక్...” ఆత్మీయంగా పిలిచింది మళ్ళీ అతని గొంతు. కొన్నాళ్ళుగా ప్రేమగా పలకరించేవారే కరువయ్యారేమో... ఆ పిలుపు నా మనసులోతుల్ని స్ప్రుశిస్తోంది. మర్చిపోయిన మమతల్ని గుర్తుచేస్తోంది.
*********
“అయితే ఏం చేసావ్, ముద్దు పెట్టేసావా ?” చంద్రిక చెప్పేది శ్రద్ధగా వింటున్న శరత్ ఆత్రంగా అడిగాడు.
“హమ్మో, అసూయ...” పకపకా నవ్వింది చంద్రిక. ఆమె చేదు జ్ఞాపకాల్లోంచి బయటపడి, నవ్వినందుకు లోలోపల ఆనందిస్తూ, “అసూయ స్వచ్చమైన ప్రేమకు కొలమానం అని, పెళ్ళిపుస్తకం సినిమాలో రాజేంద్రప్రసాద్ చెప్పాడులే ! ఇక సస్పెన్స్ లో పెట్టక చెప్పు, ఇంతకీ ముద్దు పెట్టావా లేదా ?” పడవ తెడ్డు వెయ్యడం కూడా ఆపేసి, ఆమె మొహంలోకి వంగి చూస్తూ అడిగాడు శరత్.
“చెప్తా కాని, ముందు నువ్వు పడవ పోనీయ్... ఇలా తెడ్లు వెయ్యడం ఆపేసి, నోరుతెరుచుకు నన్నే చూస్తూ కూర్చుంటే, మనం మధ్యాహ్నానికి పేరంటపల్లి ఆలయం చేరుకోలేము.” తనూ ముందుకి వంగి అంది చంద్రిక.
“సరే అయితే, నేను సవ్యసాచి లాగా ఎడాపెడా పడవ నడపాలంటే నాకు ముందు ఎనర్జీ కావాలి. ఓ సారి దగ్గరకొచ్చి, గట్టిగా కౌగలించుకుని, ‘భేష్, నీ అంతటి పడవవాడు లేడోయ్,’ అని భుజం తట్టి, ఒక ముద్దు కట్నంగా ఇచ్చావనుకో, గంటకు వెయ్యి మైళ్ళ వేగంతో పడవ నడిపేస్తా. నువ్వు టార్టాఇస్ కాయిల్ చేతిలో పుచ్చుకుని, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోవచ్చు.” అన్నాడు శరత్ చేతులు చాపి.
వెంటనే వెళ్లి అతన్ని కౌగలించుకుని, నుదుట సుతారంగా చుంబించింది చంద్రిక... చంద్రిక జ్ఞాపకాల అలలను చీల్చుకుంటూ వెళ్తున్నట్లుగా పడవ ముందుకు సాగుతోంది.
**********
ఆలోచించాను... క్లిష్ట పరిస్థితిలో ఉన్న అతను బ్రతకాలంటే ఒక ముద్దు కావాలి. అతను పొరపాటున ఫోన్ చేసినా, నన్ను ఎవరో తన ప్రేయసి అనుకుంటున్నాడు. అయినా, నేను ముద్దు పెట్టినా, పెట్టేది ఫోన్ కే గాని, అతనికి కాదు కదా ! కాస్తంత ధైర్యం, మాటసాయం మనిషికి కొత్త ఊపిరి పోస్తుంది. నిశ్చయంగా, ఆపత్కాలంలో ఇలా చెయ్యడంలో తప్పేం లేదు. నా ఆలోచనల పరంపర ఇంకా కొనసాగుతోంది.
“ఏమేవ్... ‘సాహసం చేస్తే రాకుమారి లభిస్తుందన్న’ పాతాళభైరవి సినిమాలో ఎస్.వి.ఆర్ మాటలు విని, నీ ప్రేమకోసం వలలో పడి, ఏదో లారి గుద్దేస్తే, ఇలా ఒడ్డున పడేసిన చేపలా గిలగిలా కొట్టుకుంటున్న నాకు జస్ట్ ఒక్క ముద్దు పెట్టి, బ్రతికించమని అడిగితే... అదేదో రాష్ట్రవిభజన కోసం ఆలోచించే ప్రధానమంత్రిలా ఇంత ఆలస్యం చేస్తావా ? అన్యాయం అధ్యక్షా !” అంది, ఫోన్ లో అవతలి స్వరం.
అతని మాటలకు నవ్వుకుని, నెమ్మదిగా పెదవులతో నా ఫోన్ ను స్ప్రుశించాను. ‘ఏం పర్వాలేదు, మీరు కోలుకుంటారు... మళ్ళీ మామూలు జీవితం గడుపుతారు. ధైర్యంగా ఉండండి,’ అన్నాను.
“హమ్మయ్య, ఇప్పుడు ఎన్ని ఆపరేషన్ లు అయినా నవ్వుతూ చేయించేసుకుంటానే. అయినా మీరు ఏంటే... కొత్తగా, ప్రేమలో ఫార్మాలిటీస్ దగ్గరితనాన్ని చంపేస్తాయి అనికదా మనం ఒప్పందం కుదుర్చుకున్నాము ? ప్రపంచం మొత్తం మీద ఒక్క మనిషితోనైనా అరమరికలు లేకుండా చనువుగా ఉండకపోతే, జీవితం బోర్ కొట్టేస్తుంది కదా ! బాబోయ్, నర్స్ వచ్చేసింది... బై...” లైన్ కట్ అయిపొయింది.
అంతే, తర్వాత వారం గడిచిపోయింది. ఈ వారం రోజులూ అతను ఎవరో, ఎక్కడుంటాడో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను. తెల్సిన వాళ్ళను కనుక్కున్నాను. అసలు చచ్చాడో, బ్రతికాడో తెలుసుకోవాలని, మళ్ళీ మెసెంజర్ లో కాల్ వస్తుందేమోనన్న ఉద్వేగంలో, పగలూ, రాత్రీ నెట్ ఆన్ లో ఉంచాను. ఏ సమాచారం లేదు. అతని మాటలు నా చెవుల్లో మ్రోగుతున్నాయి. “ప్రపంచం మొత్తం మీద ఒక్క మనిషితోనైనా అరమరికలు లేకుండా చనువుగా ఉండకపోతే, జీవితం బోర్ కొట్టేస్తుంది కదా !” అటువంటి వ్యక్తి నాకు ఒక్కరూ లేరే ! అంతా ఏదో ఒక హోదాలో మహారాణిలా నన్ను చూసేవారే!
పది రోజులు దాటుతుండగా, ఒకరోజు నేను ఫారన్ డెలిగేట్స్ తో ముఖ్యమైన మీటింగ్ ముగించుకుని కార్ లో ఇంటికి తిరిగి వెళ్తుండగా, మళ్ళీ మెసెంజర్ లో అతని నుంచి కాల్ ఫ్లాష్ అయ్యింది. వెంటనే కార్ ను రోడ్డు పక్క ఆపి,
“అసలు నీకు బుద్ధుందా లేదా ? నువ్వెవరో , ఎందుకు ఫోన్ చేసావో నాకు తెలీదు. ఐ.సి.యు లో ఉన్నాను అని చెప్పావు, ఉన్నవో, పోయావో తెలీక ఎంత మధనపడ్డానో తెలుసా ?” గట్టిగా కోప్పడింది.
“మేడం. మీ కోపంలో అర్ధం ఉంది. కాని, నేను చెప్పేది కూడా వినండి. ముందుగా మీకు సారి చెప్పాలి. ఎందుకంటే, ఫేస్ బుక్ లో అచ్చంగా మీరు పెట్టిన గులాబి ప్రొఫైల్ ఫోటో తో, మీ పేరుతోనే ఇంకో ప్రొఫైల్ ఉంది. అది నా మాజీప్రేయసిది. ‘మాజీ’ అని ఎందుకు అంటున్నాను అంటే... నాకు ఆక్సిడెంట్ అయిన మరుక్షణం ఆమె నా స్థితి తెలుసుకుని, తెరమరుగయ్యింది. కోలుకున్నాకా ఫేస్ బుక్ చూస్తే, ‘అవిటి వాడితో జీవితం గడపలేను. ప్రస్తుతం బ్రతుకుతావో, చస్తావో, బ్రతికినా కనీసం సరిగ్గా నడవగలుగుతావో లేదో, ఎన్నాళ్ళకు కోలుకుంటావో చెప్పడం కష్టమని, డాక్టర్ లు చెప్పారు. పచ్చడైన నీ ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చెయ్యాలని కూడా చెప్పారు. నీవంటి బాధ్యతారహితమైన వ్యక్తితో జీవితం గడపలేను. నన్ను క్షమించు.’ అన్న మెసేజ్ ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది, మరి నేను ఫోన్ చేసింది ఎవరికి... చూస్తే, తనలాంటి ప్రొఫైల్ ఫోటో ఉన్న మీరు !”
“మీరు చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఉండండి, చూస్తాను,” అంటూ తనవద్ద ఉన్న ట్యాబు నుంచి ఫేస్ బుక్ తెరిచి చూసింది, నిజమే, అటువంటి ప్రొఫైల్ ఫోటో, అదే పేరుతో ఉన్న మరో అమ్మాయి!
“ఆశ్చర్యంగా ఉందండి. ప్రస్తుతం ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది ?” అడిగింది చంద్రిక.
“నాకు ఈ లోకంలో ఎవరూ లేరండి. అందుకే ప్రాణాలు అన్నీ ప్రేయసి పైనే పెట్టుకున్నాను. అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల ఆమె కూడా దూరమయ్యింది. శారీరక ఆరోగ్యం ఓ నెల రోజుల్లో చేకూరుతుంది అని డాక్టర్ లు చెప్పారు. కాని, ఆమె ప్రవర్తన వల్ల మానసికంగా తగిలిన గాయం ఎప్పటికి మానుతుందో తెలీదు. మా కంపెనీ వారు నన్ను ప్రాజెక్ట్ పనిమీద అమెరికా పంపి, ఈ మధ్యనే ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం వల్ల, ఒకరిద్దరు తప్ప ఇక్కడ కూడా ఆప్తులు ఎవరూ లేరు. ఉన్నవారు కూడా ఎవరి బిజీలో వాళ్ళు. ఎందుకో, ఒక్కసారిగా ప్రపంచమంతా శూన్యం అయిపోయినట్లు తోస్తోంది. మీరు నన్ను మనస్పూర్తిగా క్షమిస్తే, మధ్యమధ్య నన్ను పలకరిస్తూ ఉంటారా ప్లీజ్...” అవతల మౌనంగా ఏడుస్తున్న శబ్దం.
నా గుండె ద్రవించిపోయింది. ఆప్తులంతా ఒకేసారి దూరం అయినప్పుడు, నా స్థితి నాకు గుర్తుకు వచ్చింది. అంత సరదాగా మాట్లాడిన వ్యక్తి, ఈ విధంగా ధైర్యం కోల్పోకూడదు. అతనికి సాయం అందించాలి, అని ధృడంగా నిశ్చయించుకున్నాను. “ముందు మీరు ఏ హాస్పిటల్ లో ఉన్నారో చెప్పండి, ఇప్పుడే వస్తాను.”
“నేను పంజాగుట్టలోని యశోదా హాస్పిటల్, రూమ్ నెం. 303 లో ఉన్నానండి, అయినా మీకు శ్రమ...” అంటూ ఉండగానే లైన్ కట్ చేసి, కార్ ను అటువైపు మళ్ళించాను.
విశాలమైన హాస్పిటల్ ఆవరణలో అటు, ఇటు హడావిడిగా తిరుగుతున్నారు నర్స్ లు, డాక్టర్లు, కంపౌడర్లు. ఇంకా విసిటింగ్ అవర్స్ కావడంతో ఎవరూ నన్ను అడ్డగించలేదు. నేరుగా ఆ రూమ్ కు వెళ్లాను. బెడ్ మీద ముక్కు భాగమంతా బాండేజ్ లతో ఉన్న ఆ యువకుడి మొహం స్పష్టంగా తెలియట్లేదు. నెమ్మదిగా దగ్గరికి వెళ్లి, పక్కనున్న కుర్చీ లాక్కుని, అతని చెయ్యి, నా చేతిలోకి తీసుకున్నాను.
“ మీ పేరు ?” అడిగాను.
“ఏవిటి, పేరు తెలియకుండానే చూసేందుకు వచ్చారా ?” ఆశ్చర్యంగా అడిగింది నర్స్. ఆమెను కాసేపు బైటికి వెళ్ళమని కళ్ళతోనే సైగ చేసాను.
“నా పేరు ... నా పేరు... శ్రీ... శ్రీరాం అండి.” అతని కళ్ళు కొండంత ఆశ్చర్యంతో విప్పారి, రెప్ప వెయ్యటం కూడా మరిచి నన్నే చూస్తున్నాయి. కొత్తగా పరిచయమైన నేను ఇలా రావటం అతనికి దిగ్భ్రమ కలిగించింది.
“నా పేరు చంద్ర, చంద్రిక. స్పూర్తి ఇన్ఫోటెక్ అనే కంపెనీ అధినేత్రిని. కోట్లకు వారసురాలైన ఒంటరిని. కాని, చుట్టూ ఎంత డబ్బున్నా, బిజీ పనులున్నా, నాలోని మనసు ఇంకా బ్రతికే ఉంది. అదే మీ మాటల్లోని నిజాయితీకి ద్రవించి, మీవద్దకు నన్ను వచ్చేలా చేసింది. మీకు నా కధ చెబుతాను. విన్నాకా, బ్రతుకు మనల్ని సవాలు చేసినప్పుడు, చావో రేవో తెల్చుకునేలా ఏటికి ఎదురీది అయినా పోరాడాలో, లేక మధ్యలో ఈత మాని, నిస్పృహతో మునిగిపోవాలో మీరే నిర్ధారించుకోండి...” అంటూ అతనికి నా కధ వినిపించాను.
అంతా విన్న అతని కళ్ళలో నీళ్ళు. అతని చెయ్యి, నా చేతిని చాలా బలంగా పట్టుకుంది. అలా పట్టుకోడంలో మళ్ళీ అతనిలో చిగురించిన బ్రతకాలన్న ఆశ నాకు స్పష్టమయ్యింది.
“ శ్రీరాం గారు, ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే వెళ్లిపోతాము. మధ్యలో మనం ఒంటరితనాన్ని అనుభూతి చెందకూడదు అనేమో, భగవంతుడే ఇన్ని బంధాలుగా మారి మనల్ని అలరిస్తూ ఉంటాడు. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ, ఈ నర్స్ తో సహా, ఆయన ప్రతిరూపాలే. మీరు మళ్ళీ కళకళ లాడుతూ తిరగాలని కోరుకునేవారే. మీరు కోలుకునేదాకా, మధ్యమధ్య వస్తూనే ఉంటాను. మీ బాగోగులు చూసేందుకు ఒక మనిషిని మాట్లాడాను. అతను, ఈ పాటికి వస్తూనే ఉంటాడు.”
“నాపై ఎందుకింత దయ చూపుతున్నారు ? దీనికి బదులుగా నేను మీకు ఏమివ్వగలను ? నాకు ఆసరాగా దివి నుంచి దిగి వచ్చిన దేవతా మీరు...”
“అలాగే అనుకోండి. అనుకుని, నాకు చిన్న నైవేద్యం కూడా పెట్టాలి. మీరు ఇదివరకు లాగా నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి. నన్ను నువ్వు అంటూ ఏకవచనంతోనే పిలవాలి, ఒక మంచి స్నేహితురాలిగా నన్ను భావించాలి. ఏ సమయంలో మీకు ఏ అవసరం వచ్చినా, ఏ సాయం కావాల్సినా, మాట్లాడాలి అనిపించినా, నాకు ఒక్క మెసేజ్ పెట్టండి. వీలవ్వగానే ఫోన్ చేస్తాను. ప్రతి ఆదివారం మిమ్మల్ని కలిసేందుకు తప్పకుండా వస్తాను.” అన్నాను, అతని చేతిని నొక్కి వదులుతూ.
ఇంతలో అక్కడకు వచ్చాడు తెలుపు ప్యాంటు, షర్టు వేసుకున్న ఒక నడివయసు వ్యక్తి. నుదుట విభూతి రేఖలు. “వీరి పేరు సాయిబాబా. సాయి బంధువు, భక్తులు. అవసరంలో ఉన్నవారికి అపరిమితమైన సేవ చేసేందుకు తన జీవితం అంకితం చేసారు. ఇటువంటి వారు ఇంకా ఉన్నందుకేనేమో ఈ భూమి ఇంకా నిలబడుతోంది. వీరు మిమ్మల్ని సొంత తమ్ముడిలా చూసుకుంటారు. ఇక చింతించకండి, మీకు మేమున్నాము అన్న ధైర్యంతో కోలుకోండి.” అని చెప్పి, కృతజ్ఞతతో చూస్తున్న అతని కళ్ళకు నవ్వుతూ బదులిచ్చి, నర్స్ కు నా వివరాలు అందించి, జాగ్రత్తలు చెప్పి, తిరుగుముఖం పట్టాను.
ఎందుకో ఆ రాత్రి ఒక మంచి పని చేసానన్న తృప్తితో, చాలా రోజుల తర్వాత నిద్రమాత్ర వేసుకోకుండానే, హాయిగా నిద్రపట్టింది నాకు.
చంద్రిక మాట్లాడుతూ ఉండగానే, శరత్, చంద్రికప్రయాణిస్తున్న పడవ పాపికొండలు దాటి, సుమారు ఒకగంట ప్రయాణించాకా, ప్రకృతి అందాలకు నెలవైన పేరంటాలపల్లి అనే ఊరికి చేరుకుంది. ఒడ్డున పడవకు లంగరు వేసి, ఇద్దరూ పైకి నడవసాగారు.
“చంద్రా, ఇక్కడ ఏముంది ? ఇంతమంది చూసేందుకు వెళ్తున్నారు. నీకేమైనా తెలుసా ?” అడిగాడు శరత్.
“ఎన్నో ప్రకృతి అందాలకు పెట్టింది పేరు, ఈ పేరంటపల్లి గ్రామం. ఇక్కడ 36 కొండ రెడ్ల కుటుంబాలున్నాయి. వీరంతా వెదురు వస్తువుల తయారీతో తమ జీవనాన్ని సాగిస్తున్నారు. పనస, జీడిమామిడి తోటలతో పాటు దట్టమైన చెట్లతో నిండిన పచ్చని కొండల నడుమ, ప్రశాంతతకు ఆలవాలంలా ఉంటుందీ గ్రామం. రహదారి మార్గంలేని ఎన్నో గిరిజన గ్రామాలను, అభయారణ్యాలను కలుపుకొని, మూడు జిల్లాల సంగమమైన పాపికొండలలతో మిళితమైన పేరంటాలపల్లి గ్రామంలో బాలానంద స్వామి కొలువుతీరిన శ్రీరామకృష్ణ మునివాటం ఉంది. నిష్టా నియమాలతో గ్రామంలోని కొండ రెడ్ల మహిళలే ఆశ్రమ బాధ్యతలు నిర్వహిస్తారు. ఎలాంటి కానుకలూ స్వీకరించరు. ఇక్కడ నిశ్శబ్దాన్ని పాటించాలి.”
“అదేంటి చంద్రా... కొన్ని ఆశ్రమాలలోకి స్త్రీలను రానివ్వరు కదా, మరి స్త్రీలే ఆశ్రమం చూడడం ఏమిటీ, కానుకలు తీసుకోకపోవడం ఏమిటి?”
“ఆ కధనూ, చెబుతాను విను. ఇక్కడ పూర్వం బాలానంద స్వామి అనే ఒక సాధువు ఉండేవారు. ఇక్కడ ‘శ్రీరాముని వాకిటం’ అనే ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్ధంలో రాజమండ్రి నుంచి బాలానంద స్వామి లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు. ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు.
పేరంటపల్లి స్వామిగా ప్రసిద్ధికెక్కిన బాలానందస్వామి జీవితంలో జరిగిన ఓ సంఘటన ఎంతైనా చెప్పుకోదగ్గది... కొండమీద పానపట్టంతో కూడిన శివలింగం సమీపంలో కుటీరం ఏర్పరచుకొని తపస్సు చేసుకుంటున్నారు స్వామి. ఆయనొక రోజు కుటీరానికి కొంతదూరంలో ఉన్న మామిడి చెట్టు వద్దకు పండ్లు కోసం వెళ్ళారు. కొంచెం ఎత్తులో ఉన్న కొమ్మకు మగ్గిన పండ్లు వ్రేలాడుతున్నాయి. అక్కడున్న దిమ్మపై కాలు వేసి పండ్లు కోయబోతున్న స్వామికి పెద్ద బిలం కనపడింది. అది అడవి పంది ఉండే బిలమని, బిలం నుండి పంది బయటకు వస్తే చావు తప్పదనీ అనుకున్నారు. అంతే- అంతవరకూ నిర్భీతమైన ఆయన హృదయంలో హఠాత్తుగా ఏ మూలనుంచో భయం బయలుదేరింది.
అది తనలోని సర్వాంతర్యామి యందు ఉండే అవిశ్వాసానికి చిహ్నం అనిపించింది. భగవానుని యందు సంపూర్ణ విశ్వాసం ఎలా స్థిరపరచుకోవాలా అన్న ఆలోచన తలెత్తింది. కొండమీద ఉండే జంతువులు ఆ మామిడి చెట్టు ప్రక్కగా ప్రవహించే వాగువద్దకు వచ్చి నీరు త్రాగుతాయి. ఆ సంగతి స్వామికి బాగా తెలుసు. తనలో దాగొనివున్న అవిశ్వాసాన్ని పోగొట్టుకోవాలనుకున్న ఆయన- ఏది భయానికి కారణమైందో ఆ ప్రమాదాన్నే కోరి తెచ్చుకోవాలనుకున్నారు. జంతువులు నీరు త్రాగడానికి వచ్చే దారికి అడ్డంగా పడుకొని, సర్వాంతర్యామి భావనలో లీనమై అలాగే నిద్రపోయారు. అలవాటు ప్రకారం జంతువులు నీరు త్రాగడానికి ఆ ప్రదేశానికి వచ్చాయి. దారిలో పడి వున్న మనిషి శరీరాన్ని చూసి ఠక్కున ఆగిపోయాయి. అక్కడి నేల వాసన చూశాయి. వాటికేమర్థమైందో వెనుదిరిగి వెళ్లిపోయాయి. వసించే జీవుల ప్రవర్తనలోగల దివ్య చైతన్యమే వాసుదేవుడు.ఆయనా సమయంలో జంతువుల్లోని క్రౌర్యాన్ని మాయం చేశాడో, అసలు వాటికి దప్పికే లేకుండా చేశాడో తెలీదు. వాటివల్ల స్వామివారికి ఎలాంటి కీడూ జరగలేదు. అచంచల విశ్వాసంతో ఏకైక లక్ష్యతత్పరులై వారు తపస్సు కొనసాగించి, సర్వాంతర్యామితో ఏకత్వానుభూతినే సాధించగలిగారు బాలానంద స్వామివారు.
బాలానంద స్వామి గిరిజనులకు ఎంతో సేవ చేశారు. గోదావరి జిల్లా గ్రామాల వారందరికీ ఆయనమీద భక్తి. ఆయన వృద్ధాప్యంలో అస్వస్థులై రాజమండ్రిలో కాలం చేసినప్పుడు భౌతికకాయాన్ని లాంచీలో రాజమండ్రి నుంచి పేరంటపల్లి తీసుకెళ్లారు. లాంచీ వస్తున్న సంగతి తీరగ్రామాల వాళ్ళందరికీ తెలిసింది. ప్రతి ఊరి రేవులోనూ లాంచీ ఆపారు. ఊళ్ళకు ఊళ్ళు పిల్లా పాపాతో గోదావరి గట్టుకు కదలి వెళ్ళి భౌతికకాయాన్ని దర్శించుకుని కన్నీటి తర్పణం విడిచి వచ్చాయి. ఇప్పటికీ ఇక్కడివారికి స్వామివారంటే అపారమైన భక్తి, ప్రేమ. ఆ ప్రేమతోనే వారు సేవ చేస్తారు.” అంటూ నడక ఆపి అతన్నే చూస్తూ , “ శరత్, మనం కష్టపడితే ఎంతో డబ్బు సంపాదించవచ్చు, కాని, ఒక్క మనిషి మనస్సులో స్థానం సంపాదించుకున్నా, అది ఎన్నో కోట్ల రూపాయిలకంటే విలువైనదని, నేను భావిస్తాను. తాను దేహం విడిచినా, అమాయకులైన ఈ గిరిజనుల మనస్సుల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు స్వామివారు, ఇన్ని తరాల తర్వాత కూడా వారి సేవ చెయ్యడం గొప్ప సంగతి కదా !” అంది చంద్రిక.
“నిజమే చంద్రా... నువ్వు స్వామివారి చెబుతుంటే, నా మనసు భక్తితో ఆర్ధ్రమయింది. చాలా మహనీయులు ఆయన. అది సరేగాని, మరి ఈ గిరిజనులకు సంపాదన, భుక్తి ఎలాగ ? ఆశ్రమ ఖర్చులు ఎలా నడుస్తాయి ?” సందేహంగా చూసాడు శరత్.
“ఇక్కడివారికి సహాయం చేసే ఉద్దేశ్యం వుంటే, ఆశ్రమ ప్రచురణలు కొనాలి తప్ప వేరే డబ్బు, వస్తువులు ఇస్తే వాళ్ళు చాలా బాధపడతారు. ఆ ఆలయం చాలా శక్తివంతమైనదవటంవల్ల అక్కడ తగుమాత్రమే మాట్లాడాలి అదీ మంచిమాటలే. ఇక్కడ పూజారి వుండడు, పూజకు సంకల్పం కూడా ఎవరూ చెప్పకూడదు. సంకల్పం వల్ల సూర్య చంద్రాదుల సాక్షిగా కోరికలు వెలిబుచ్చటమవుతుందని వీరి నమ్మకం. జన్మ రాహిత్యానికి ఈ సంకల్పము ప్రతిబంధకమని వీరు భావిస్తారు. దేవునికి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పూజ చేసుకోవచ్చు. నైవేద్యం మాత్రం ఆశ్రమంలో వండిన పదార్ధాలే పెట్టాలి. శుచి, శుభ్రత కోసం ఈ నియమం పెట్టారు.ఈ దేవాలయం చేరుకోవటానికి మనం కొంచెం దూరం కొండమీదకి ఎక్కాలి.” అంటూ చెప్పసాగింది చంద్రిక.
“అరె, ఈ వెదురు పూలు, చక్కటి వస్తువులు యెంత బాగున్నాయో కదా...” దారిలో అటూఇటూ నిల్చుని, గిరిజనులు అమ్ముతున్న పువ్వుల్ని చూస్తూ అన్నాడు శరత్.
“గిరిజన మహిళలు చక్కటి వెదురు బొమ్మలు అద్బుతంగా ఉంటాయి శరత్, ఇవే వారికి సంపాదన మార్గాలు. ఆ ఉన్నంతలోనే మళ్ళీ భక్తిగా ఆశ్రమానికి వాడతారు. వెళ్ళేటప్పుడు కొనుక్కుని వెళ్దాం, పద... అదిగో ఆ కనిపించేదే బాలానంద స్వామి ఆశ్రమం.” అంటూ చూపింది చంద్రిక.
ఇద్దరూ లోపలకు వెళ్లి, నిండు మనసులతో తమ జంటను దీవించమని, ప్రార్ధించారు. గుడి బైటికి రాగానే దేవాలయానికి వడ్డాణం లాగా కొండలనుండి ప్రవహించే జలపాతం కనిపించింది. అక్కడ పిల్లలూ, పెద్దలూ అంతా చేరి కేరింతలతో ఆడుతున్నారు. నీళ్ళల్లోకి చెయ్యి పెట్టగానే చల్లగా తగిలి జివ్వుమంది శరత్ కి.
“ ఎక్కడో కొండల్లో నుంచి జాలువారే ఈ జలపాతం మండు వేసవిలో సైతం మంచును తలపిస్తుంది.” ఇంత ఎండలోనూ చేతికి షాక్ కొట్టినట్టు అయ్యింది కదూ !భలే, భలే... అంది చంద్రిక ఉడికిస్తూ.
“అవును, కాని నువ్వు నా అర్ధాంగివి కనుక, న్యాయంగా ఈ షాక్ లో సగభాగం నీది...” అంటూ ఆమెపైకి నీరు చిమ్మాడు శరత్.
“ష్... ఇక్కడ అట్టే అల్లరి చెయ్యకూడదు అని చెప్పానా, కాసిన్ని నీళ్ళు త్రాగుదాం, ఇటురా శరత్”పిలిచింది చంద్రిక.
శరత్ అటు వెళ్ళగానే తన దోసిట్లోకి తీసిన నీళ్ళు అతని నెత్తిన పోసేసి, మౌనంగా నిల్చుంది. ఇద్దరూ కాసేపు అలాగే నీళ్ళలో ఆదుకుని, ఆ నీళ్ళు తాగి, అక్కడున్న చిన్న హోటల్ లో టిఫిన్ తిని, క్రిందికి దిగుతూ వెదురు బొమ్మలు కొనుక్కుని, మళ్ళీ పడవలో ప్రయాణం కొనసాగించారు.
“సరే, ఆ శ్రీ కధ సస్పెన్స్ లో ఆపావు, చెప్పవూ...” అడిగాడు శరత్.
“ఉహు, చెప్పాలంటే, నేను చెప్పినట్టు అనాలి, దేవిని ప్రసన్నం చేసుకోవాలి.... అని డిమాండ్ చేస్తా ఉన్నాం అజ్జక్షా...”
“అగ్రీడ్... మీ డిమాండులు చెప్పండి మేడం...”
“ఆ నాతో పాటు చెప్పు... ఓ దేవుడా, ఓ మంచి దేవుడా...”
“ఓ దేవుడా, ఓ మంచి దేవుడా...”
“నాకు... ప్రపంచంలోకే...” ఆ ఆ, చెప్పు చెప్పు...
“నాకు... ప్రపంచంలోకే...”
“అందమైన, తెలివైన, గుణవంతురాలైన భార్యను ఇచ్చావు...”
“ఆ చెప్పినట్టేలే...”
“అలా కుదరదు, ఒప్పందం ఒప్పందమే...”
“అందమైన, తెలివైన, గుణవంతురాలైన భార్యను ఇచ్చావు...”
“కాని...”
“కాని ???”
“అందరూ మా జంటను చూసి... దొండపండు లాంటి నన్ను ఈ కాకిముక్కుకు తగిలించాడే దేవుడు... అంటే, పాపం మా శరత్ ఫీల్ అవకుండా చూడు.”
“నిన్నూ...”
“సర్లే, సర్లే... నీ కాల్ మొక్తా బాంచన్, నవుతానికన్నా, మాఫ్ జేయ్యరాదే...” అంది, చంద్రిక తన చెవులు పట్టుకుని.
“మాఫీ జేసినా, మరి శ్రీ గురించి చెప్పు... “ అన్నాడు శరత్.
కనుమరుగవుతున్న పేరంటాలపల్లి ఆలయం వంక చూసి, మరొక్కమారు నమస్కరిస్తూ, ఇలా చెప్పసాగింది చంద్రిక...
ఆసుపత్రిలో ఉన్న ‘శ్రీ’ నెమ్మదిగా కోలుకోసాగాడు. ప్రతి రోజూ ఉదయం నేను నిద్ర లేచే ముందే అతని నుంచి మంచి సందేశం వచ్చేది. నేనూ బదులిచ్చేదాన్ని. అనేక విధాలుగా ధైర్యం చెప్పేదాన్ని. అతని యోగక్షేమాల గురించి సాయి బాబా గారిని కనుక్కునేదాన్ని. ప్రతి ఆదివారం శ్రీ ని కలిసి, కాసేపు గడిపి వచ్చేదాన్ని. మేమిద్దరం ఎన్నో విషయాలు చనువుగా మనసువిప్పి మాట్లాడుకునే వాళ్ళం.
“జీవితంలో ఎప్పుడూ ఇలా ఒక్క చోట కుదురుగా కూర్చుంటే ఒట్టు. పది మంది పవన్ కళ్యాణ్ లు కలిసినట్టు ఎగురుతూ, దూకుతూ ఉండేవాడిని...” అన్నాడు శ్రీ.
“అవును పాపం, అందుకే దేవుడు నీ కళ్ళు, చేతులు విరగ్గొట్టి ఇలా కూర్చోపెట్టాడు. తిక్క కుదిరింది.” చంద్రిక మాటలు విని నవ్వసాగింది, అతనికి ఇంజక్షన్ ఇచ్చేందుకు వచ్చిన నర్స్.
“బోలెడు కబుర్లు చెప్పి, మమ్మల్ని కూడా నవ్విస్తూనే ఉంటారండి. శ్రీ గారికి మా డాక్టర్లు, స్టాఫ్ అంతా ఫాన్స్ అయిపోయాము.” అంది నర్స్.
“ఓహో, ఇక్కడా నెట్వర్కింగ్ చేసావన్నమాట. ఎంతైనా అసాధ్యుడివి శ్రీ. సాయి బాబా గారు, పోస్టల్ డిపార్టుమెంటు వారి పార్సెల్ లాగా ఉన్న ‘శ్రీ’ ని ఎయిర్ మెయిల్ లో వచ్చిన కొత్త కవర్ లాగా చేసి, ఇలా వీల్ చైర్ లో కూర్చోబెట్టగలిగారంటే గొప్ప సంగతేనండి.” కవ్విస్తూ అంది చంద్రిక.
“ అయ్యో, ఎందుకు అడుగుతావు తల్లీ నా తిప్పలు. బొత్తిగా మాట వినడు, చిన్న పిల్లలను బుజ్జగించినట్టు బుజ్జగించి, మందులు వెయ్యాల్సిందే. చిటికెలో మనుషుల్ని ఏమార్చే మాయగాడు.”
“అయితే, మీరూ నేనూ ఒక పార్టీ అండి, సాయిబాబా గారు. మీపై వచ్చిన ఈ అభియోగానికి మీ సంజాయిషీ ఏమిటి శ్రీ ?” స్వరం గంభీరంగా మార్చి అడిగింది చంద్రిక.
“అధ్యక్షా ! ఏదో ఆక్సిడెంట్ లో కాళ్ళు, చేతులు విరిగినంత మాత్రాన మనిషి, ఏడుస్తూ కూర్చోవాలన్న రూల్ ఏమీ లేదు. అయినా దెబ్బలు తగిలింది నా ఒంటికే తప్ప, నా సెన్స్ ఆఫ్ హ్యుమర్ కి కాదు. అందరూ ఇలాంటి స్థితిలో డిప్రెషన్ కి గురవుతారు. కాని నాకు దేవుడు ఈ వెన్నెల దేవతను పంపాడు కనుక, నేను ఎక్స్ప్రెషన్స్ తో ఈ డిప్రెషన్ ను చాకిరేవు పెడుతున్నాను. నాతోపాటు నలుగురినీ నవ్విస్తున్నాను. డిప్రెషన్ కి ఎక్స్ప్రెషన్ కి జరిగిన ఈ సమరంలో, బాధలకీ ఎడుపుకీ జరిగిన సంగ్రామంలో... తప్పా, తప్పా, తప్పా... నో..” అంటూ ఎన్. టి.ఆర్. ‘ధర్మానికి న్యాయానికి జరిగిన...’ పాటని అనుకరించాసాగాడు శ్రీ. అందరం పడీపడీ నవ్వసాగాము.
“అమ్మా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేనలా వెళ్లి, ఇతని దెబ్బకు మాసిపోయిన ఈ గడ్డం చేయించుకు వస్తాను.” అంటూ నిష్క్రమించారు సాయిబాబా గారు. ఇంజక్షన్ ఇచ్చి, నర్స్ కూడా వెళ్ళిపోయింది.
ఆ రోజు నా మనసులోని దిగులును కనిపెట్టనే కనిపెట్టాడు శ్రీ. వెంటనే నా చెయ్యి పట్టుకుని...
“ఏమైంది చంద్రా ! ఈ రోజు చాలా డల్ గా ఉన్నావు. నువ్వు నవ్వుతున్నా, నీ మనసు నాకు తెలుస్తూనే ఉంది. నాతో చెప్పకూడదా ?” లాలనగా అడిగాడు వీల్ చైర్ లో ఉన్న శ్రీ.
“నీతో కాకపొతే ఇంక చెప్పుకోడానికి కూడా నాకెవరు ఉన్నారు శ్రీ... మా బావ కుటుంబం చనిపోయిన దగ్గరినుంచి ఈ కంపెనీ భారమంతా నామీద పడింది. మొదట్లో ఆ పనులు చక్కబెట్టేందుకు నాకు సహకరించిన ముగ్గురు, ఈ రోజు గుంటనక్కల్లాగా నా చుట్టూ చేరి, నన్ను, నా ఆస్తిని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళ అతి మర్యాదలు, దాహపు చూపులు, కల్లబొల్లి ప్రేమలు నాకు జుగుప్స కలిగిస్తున్నాయి. అసలు ఆఫీస్ కి వెళ్ళాలంటేనే అసహ్యంగా ఉంది.”
“ఎవరా ముగ్గురూ, ఏం చేస్తున్నారు... కాస్త వివరంగా చెప్పరాదూ...”
“బావ ఫ్రెండ్ కిరణ్, నా పర్సనల్ అసిస్టెంట్ మనోహర్, అకౌంట్స్ డిపార్టుమెంటు నివాస్... వీళ్ళు ముగ్గురూ నాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. చనువు తీసుకోవాలని, దగ్గరవ్వాలని, చూస్తున్నారు. నేను పట్టీపట్టనట్లు ఉన్నా, ‘మీరంటే నాకెంతో ప్రేమ మేడం. మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను మేడం...’ అంటూ ఏవో కబుర్లు చెప్తున్నారు. ఒక్కోసారి చుట్టుపక్కల ఎవరున్నారో కూడా చూడకుండా అతిచనువు చూపిస్తూ, ఇతరుల ముందు, నేను వారికే స్వంతం అన్న అభిప్రాయం వచ్చేలా ప్రవర్తిస్తున్నారు. వారి చూపుల్లో, మాటల్లో ఎక్కడా నాకు నిజాయితీ తో కూడిన ప్రేమ కనిపించట్లేదు. చాలా బాధగా, ఇబ్బందిగా ఉంది శ్రీ. వీళ్ళ నక్కజిత్తుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదు.”
“చంద్రా ! నీ బాధ నాకు అర్ధం అవుతోంది. నువ్వు వాళ్ళతో కాస్త కటువుగా ఉండు. వాళ్ళు ఇతరుల ముందు చనువు తీసుకోవాలని చూస్తే, అందరిముందే, కాస్త స్వరం పెంచి, గదమాయించు. మరీ ఇబ్బంది కలిగిస్తే... ‘ బిహేవ్ యువర్ సెల్ఫ్’ అని సూటిగా కళ్ళలోకి చూస్తూ చెప్పు. సూటిగా కళ్ళలోకి చూసి మాట్లాడితే మనసులో కల్మషం ఉన్న ఏ మగాడైనా తల దించాల్సిందే ! ప్రస్తుతానికి ఇలా చేసి చూడు.” అన్నాడు అనునయంగా.
“నా బాధ ప్రస్తుతం గురించే కాదు, భవిష్యత్తు గురించీ కూడా. మరో రెండు రోజుల్లో నేను ఒక ముఖ్యమైన కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వెళ్ళాలి. నాతో ఈ సారి మనోహర్ ఒక్కడే వస్తున్నాడు. ఫ్లైట్ లో, హోటల్ లో మేము ప్రక్కప్రక్కనే ఉండాలి. అతనితో వెళ్ళాలి అంటేనే ఏదోలా ఉంది.”
“ఒక్కోసారి ఊహలు వాస్తవం కంటే భయపెడతాయి చంద్రా. ధైర్యంగా ఉండు, నువ్వు బేలవి ఏమీ కాదు. నీ కరాటే లో బ్లాక్ బెల్ట్, మార్షల్ ఆర్ట్స్ ఏమయ్యాయి ? మునుపు యెంత ధైర్యంగా ఉండే నువ్వు, ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నావేంటి ? నువ్వు నేటి తరం యువతివి. భయమే మరణం, ధైర్యమే జీవనం అని నమ్మేదానివి.”
ఒక్కసారి విప్పారిన నయనాలతో శ్రీ నే చూస్తూ ఉండిపోయింది చంద్రిక. “ఇవన్నీ నీకు...”
“సాయి బాబా గారు చెప్పార్లే. కంగారు పడకు. నాకు ఇంత సాయం చేసిన నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది కదా... నీకు ప్రత్యుపకారం చేసే ఒక్క అవకాశాన్ని ఇమ్మని ఆ దేవుడిని రోజూ ప్రార్ధిస్తున్నాను. అన్నట్టు, రేపు నా ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చెయ్యబోతున్నారు. ఒక వారంలో నన్ను డిశ్చార్జ్ చేస్తారు. నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు ?”
“అయ్యో, అలాగా... నేను తిరిగి వచ్చేందుకు పది రోజులు పడుతుంది. మరో మూడు రోజులు ఊరి చివర హోటల్ లో ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్. నిన్ను చూసేందుకు రావడం కుదరదు. నాకు చాలా బాధగా ఉంది.”
“పర్లేదు చంద్రా, బాధపడకు. నీ దయవల్ల, సాయి బాబా గారి దయవల్ల, చాలా మటుకు కోలుకున్నాను. డిశ్చార్జ్ అవగానే నా చిన్ననాటి మిత్రుడి ఇంటికి వెళ్తాను. మా కంపెనీ వారికి కూడా కనిపించి రావాలి. నువ్వొచ్చాకా, నాకు మెసేజ్ ఇవ్వు. ఇప్పటిదాకా ముక్కు లెస్ గా చూసిన నా మొహం ఓ తోలు ముక్కేసి అతికితే ఎలా ఉంటుందో చూద్దువు గాని...”
ఫక్కున నవ్వేసి, ‘మళ్ళీ మొదలెట్టావా ? నువ్వు బాగుపడవ్ ... సరే, నాకు టైం అవుతోంది. నేను మళ్ళీ వచ్చాకా కలుస్తాను. మధ్య మధ్య మెసేజెస్ ఇవ్వు. ఎల్లుండి ఉదయం ఫోన్ చేస్తాను.” అంటూ, అప్పుడే వచ్చిన డాక్టర్ తో... “ డాక్టర్ గారు సర్జరీ చేసేటప్పుడు ఇతనితో జాగ్రత్త ! ఇతని ముక్కుకి రాబోయే పెళ్ళాం ముక్కుతాడు వేసేటట్లు తయారుచెయ్యండి ఇతని ముక్కు,” అంది చంద్రిక.
“అలాగేనమ్మా, కిక్కురుమనకుండా, మత్తిచ్చి పడుకోబెట్టేస్తాము కదా, దిగులుపడకండి.” నవ్వుతూ అన్నారు డాక్టర్.
తిరిగివచ్చిన సాయిబాబా గారికి అన్ని జాగ్రత్తలు చెప్పి, శ్రీ కి వీడ్కోలు పలికుతూ, కళ్ళలో ఒక బెంగ దోబూచులాడుతూ ఉండగా వెనక్కి మరలింది చంద్రిక.
ఢిల్లీ లో విలాసవంతమైన ఒక ఫైవ్ స్టార్ హోటల్ అది. పైన అలంకరించే శాండ్లియార్ నుంచి నేలపై పరచిన కార్పెట్ ల వరకూ ఆ హోటల్ స్థాయిని తెలియచేస్తున్నాయి. ప్లాస్టిక్ నవ్వులు పులుముకున్న హోటల్ స్టాఫ్, అడుగడుగునా స్వాగతాలు పలుకుతున్నారు. ఆ హోటల్ ఐదవ అంతస్తులో ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఉంది. నాలుగవ అంతస్తులో పెద్ద రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉంది, దాని ప్రక్కనే జిం. ఇక మూడవ అంతస్తులో, ప్రపంచంలో ఉన్న అన్నిరకాల వంటకాలూ కలగలిపి, నోరూరించేలా అనేక టేబుల్స్ పై అలంకరించి, ఉంచారు. ఎక్కడ నుంచో వచ్చిన విదేశీయులు అనుకుంటా, బ్రెడ్, డో నట్స్ తిని, వెంటనే కాలరీలు పెరిగాయని, పై అంతస్తులో ఉన్న జిం కు వెళ్లి వ్యాయామం చెయ్యాలని, మాట్లాడుకోసాగారు. వాళ్ళనే గమనిస్తున్న చంద్రిక, తనలో తానే నవ్వుకుంటూ, భోజనం చెయ్యసాగింది. ఆమె ఎదురుగా ఉన్న మనోహర్, ఇలా అన్నాడు.
“మేడం, సాయంత్రానికి ఫారన్ డెలిగేట్స్ ఇక్కడికి చేరుకుంటారు. ఈ లోగా మీతో చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. కళ్ళు తిప్పుకోలేని అందం, ఆ అందాన్ని మించిన వ్యక్తిత్వం, అన్నింటినీ మించి, బోలెడంత ఆస్తితో ఒంటరిగా బ్రతుకుతున్న మిమ్మల్ని చుస్తే, నాకు ఎంతో జాలి, ప్రేమ. మగతోడు లేకుండా ఎన్నాళ్ళు బ్రతుకుతారు చెప్పండి ? మీ అవసరాలు, పని వేళలు, మీటింగ్స్, వ్యాపార వ్యూహాలు అన్నీ తెలిసిన నాకంటే, మీకు మంచి జోడీ దొరుకుతుందా ? నన్ను పెళ్లి చేసుకోండి, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఏమంటారు ?”
నాకు అతని మాట తీరుకు చిర్రెత్తుకు వచ్చింది. నేను అతని మాటలకు జవాబు ఇవ్వబోయేలోగా, ఆమె మొబైల్ మ్రోగింది. వెంటనే తీసి, “చెప్పండి, సాయి బాబా గారు...” అన్నాను. ఆయన చెప్పిన విషయాలు విని, ఒక్క క్షణం షాక్ అయ్యి, అలా మౌనంగా ఉండిపోయాను.
“ఏంటి మేడం ? అనుకోకుండా, ఆక్సిడెంట్ అయ్యి మీ బావ ఫ్రెండ్ కిరణ్, అకౌంట్స్ డిపార్టుమెంటు నివాస్ హాస్పిటల్ లో చేరారని చెప్పారా, మీ సాయిబాబా గారు?” మొహం మీద ఒక విషపు నవ్వు మెరుస్తూ ఉండగా అడిగాడు మనోహర్.
“ఇది మీకు...” అర్ధోక్తిలో చూస్తూ ఉండిపోయాను.
“చూడు, చంద్రికా ! నన్ను తక్కువ అంచనా వెయ్యకు. రాయలసీమ ఫ్యాక్షన్ బాక్గ్రౌండ్ ఉంది నాకు. నీకోసం కిరణ్, నివాస్ ప్రయత్నిస్తూ ఉన్నారని, నాకూ తెలుసు. మర్యాదగా చెప్తే వినలేదు. అందుకే, చావుదెబ్బ కొట్టి, వాళ్ళ అడ్డు తొలగించాను. వాళ్ళు ఇకపై నీవంక కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించరు. ఇక నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఒక్కటే గతి. నేను నీ ‘దీనజనోద్ధారణ’ కు, సేవలకు అడ్డు రాను. అలాగే, నువ్వు నీ ఇష్టమొచ్చిన వాళ్ళతో తిరగచ్చు. అన్నట్టు, ఈ మధ్య ఎవరో ఆక్సిడెంట్ అయిన వాడి కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నావట ? అయినా నాకెందుకు – ఒక మాట చెప్పనా, పెళ్ళైనా, నీ జీవితం నీది, నా జీవితం, విలాసాలు, తిరుగుళ్ళు నావి. నీ ఆస్థి మాత్రం మన ఇద్దరిదీ ! బాగా ఆలోచించుకుని, “ఒంటరి ఆడదానివి” జాగ్రత్తగా నిర్ణయం తీసుకో !” ఆమె కళ్ళలోకి సూటిగా, క్రూరంగా చూస్తూ, ఒంటరి ఆడదానివి – అన్న పదాన్ని నొక్కి పలుకుతూ అన్నాడు మనోహర్.
“వాట్ ద హెల్ ? ఏంటి ఈ ఏకవచన ప్రయోగాలు. పోలీస్ లకు ఇదంతా చెప్పానంటే, ఐదు నిముషాల్లో ఊచలు లెక్కపెడతావ్ ? అంత చేతకాని దాన్ని అనుకుంటున్నావా ? ఇష్టమొచ్చినట్టు వాగుతున్నావ్ ? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు.” , అంతా తమనే చూస్తే బాగోదని, మామూలు స్వరంతోనే గంభీరంగా పలికాను నేను.
“చూడు పాపా ! ఆవేశపడకు. నన్ను ఎదుర్కోవడం అంత తేలిక కాదు. నేను చిటికేస్తే, నిన్ను క్షణాల్లో ఇక్కడినుంచి మాయం చేసి, పీక మీద కత్తి పెట్టి మరీ, నీ మెళ్ళో తాళి కట్టించే ఏర్పాట్లు జరిగిపోతాయి. అసలే అనుకోకుండా అంతా చచ్చి, కూలబడ్డావు. తొందరపడి, ఉన్నవాళ్ళను కూడా ఎందుకు పోగొట్టుకుంటావు ? నాకు తొందర ఏమీ లేదు. మనం తిరిగి వెళ్ళేదాకా, బాగా ఆలోచించి, నిర్ణయం తీసుకుని చెప్పమ్మా, వస్తా !” అంటూ వికృతమైన చూపులతో, చంద్రిక ఒళ్ళంతా తడుముతూ చూసి, వెళ్ళిపోయాడు మనోహర్.
ఒక్క క్షణం స్థాణువయ్యాను. అనుకోని ఈ సంఘటన నన్ను కుదిపేసింది.
“మేడం, షల్ ఐ సర్వ్ యు సంథింగ్ ?” వెయిటర్ వచ్చి పిలవడంతో తేరుకుని, నెమ్మదిగా నా రూమ్ కు వెళ్లాను.
కాసేపు రిలాక్స్ అయ్యి, హోటల్ నెంబర్ నుంచి, సాయి బాబా గారికి ఫోన్ చేసి, శ్రీరాం కు ఇవ్వమని, అతనితో మాట్లాడాను. అతనితో సుమారు ఒక గంట మాట్లాడాకా, అతను చెప్పిన ఉపాయం విన్నాకా, మబ్బులు వీడినట్లుగా నా మనసు తేలికపడింది. సాయంత్రానికి రిలాక్స్ అయ్యి, కాన్ఫరెన్స్ హాల్ కు వెళ్లాను. వ్యక్తిగత ఒత్తిడులు నా వృత్తిలో చూపకూడదన్నది, నాకు అనుభవం నేర్పిన పాఠం. అందుకే చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ, మనోహర్ వంక చూసాను. అతను అంతకంటే మామూలుగా నటిస్తున్నాడు. నెమ్మదిగా మీటింగ్ మొదలయ్యింది.
(సశేషం...)
No comments:
Post a Comment