అలకపాన్పు
- ఆచంట హైమవతి.
అలక పాన్పు ఎక్కారు అల్లుడుగారు!
అసహాయుడై దిగులందె ఆ మామగారు!
బంధువులు - మిత్రులు - వరసైనవారు...
గుమిగూడి సలహాలనివ్వసాగిరంత...!
స్కూట రడుగు - మోటర్ సైకిలడుగు
రేడియో అడుగు - రేడియంవాచీ అడుగు,
వీడియో అడుగు - ష్టీరియో అడుగు,
టేకు మంచాలడుగు - పట్టు పరుపులదుగు,
స్వంత ఇల్లడుగు - స్వర్ణమాలలడుగు...అనుచుండ-
' వరుడు' గారు చిరునవ్వు చిల్కుచుండ -
చెలగాటమాడు 'పిల్లి' పక్క ఎలుక వోలె...
సంకట పడుచుండె కన్యాదాతగారు.. !?
ఈ స్థితి గమనిం చిన 'వధూమాత'కు -
తన పెళ్లి గుర్తొచ్చి....తాపమ్ము హెచ్చె!
కళ్లెఱ్ఱ్రజేసి మగని వైపుకి తిరిగి...
దగ్గరకు వెళ్లి 'దర్పముగ' చూసి,
మూతి తిప్పె ముప్పది మూడు వంకరల.
అ డి(లి)గితిరి ఆనాడు... తీర్చుడనె-ఈ నాడు!!
గుర్తొచ్చి... మారు పల్కలేక మిన్నకున్న-
'నాటి' గర్విష్టి అల్లుడే - నేటి కన్యాదాత!
పరికించుచుండిరి పెళ్ళివారంత....
కుతూహలమ్ము హెచ్చ- వింతగాను!
'కన్యాగ్రహీతను'...మరియు...కన్ యాదాతను.
స్థితి 'విరసము' కాకుండగనె----
వక్కాణించె 'వరుడు' బహు సరసుండై!
నా కాంత నా చేతికి మనసార ముద్దిడిన...
నా 'అలక' చాలింతునిది నిక్కమనెను!
'పతి' మంచితనమెరిగి - బహు సంతసిల్లి,
సిగ్గుల మొగ్గాయె శింగారి శ్రీగౌరి...!
ముద్దిడె 'పతి' చేతిపై ముగ్ధ మోహినియై!!
No comments:
Post a Comment