అరువు పండుగలు
- భావరాజు పద్మిని
సండే , మండే లు వచ్చినప్పుడే, ఈ 'డే' లు కూడా డాలు వెనుక దాక్కున్న సైనికుడిలా ,వాటివెనుక నక్కి, దాక్కుని మన దేశంలోకి చొరబడి వచ్చేసాయి. అయితే ఏంటి ? - మనకున్న బోలెడన్ని పండగలలో, మరికొన్ని పండగలు కలిసాయి - అంటారా, అయితే చదవండి...
గత కొన్ని రోజులుగా మా చిన్నమ్మాయికి, పెద్దమ్మాయికి రహస్య మంతనాలు జరుగుతున్నాయని, నేను కనిపెట్టేసాను. 'ఏవిటే , సంగతి...?' అని నిలదీస్తే, సీక్రెట్, చెప్పకూడదు. సండే ఒక స్పెషల్ ఉంది, అన్నారు.
మీరు చెప్పకపోతే, గూగులమ్మ లేదూ, అమాయకప్పక్షుల్లారా ! అనుకుని, 'చెప్పవే గూగుల్ దర్పణమా ? ఆదివారము విశేషము ఏమి ?' అని అడగ్గానే... ఎంసెట్ పరీక్షలో లాగా ఓ నాలుగు ఆప్షన్ లు ఇచ్చి, 'నచ్చింది తీస్కో పో,' అంది.
అందులో అనుమానాస్పదంగా ఉన్న 'పేరెంట్స్ డే' నే ఖరారు చేసుకున్నాను. ఇటువంటి పండుగలు తల ఒక్కింటికీ 2, 3 అమ్మలూ, నాన్నలూ ఉండి, అందరినీ సామూహికంగా గుర్తుచేసుకోడానికి ఒక అవకాశంగా భావించే విదేశీయుల సంస్కృతి అని నాకు నమ్మకంతో కూడిన సందేహం .అయినా, చిన్నపిల్లలు కదా , వాళ్ళ ముచ్చట ఎందుకు కాదనడం 'చూద్దాం, ఏం చేస్తారో, ' అని మౌనంగా ఉన్నాను.
ఇవాళ ఉదయమే మొదలయ్యింది తుఫాను...
ఆదివారం కదా, అని హాయిగా ఆదమరచి నిద్రపోతూ, నిద్దర్లేస్తే చచ్చినా గుర్తుకురాని ఏదో కలకంటూ ఉండగా.. ' పద్మినీ, వంటిల్లు తాళం పెట్టావా ?' అన్న మా అత్తగారి స్వరం వినబడింది. 'అదేంటి ?' అనుకుని, 'అవాక్కయ్యారా ?' ప్రోగ్రామ్లో ఆంకర్ లాగా అవాక్కై, 'గాలికి తలుపు పడిపోయి ఉంటుంది, గట్టిగా లాగి చూడండి...' అని మళ్ళీ దిండులో తలదూర్చాను.
"తాళం వేసినట్టే ఉంది, పద్మినీ... చూడు..." మళ్ళీ వచ్చారు అత్తగారు.
లేచి చూద్దును కదా, వంటింటి తలుపు లాగి, ఏదో చిన్న తాళం వేసుంది. పొరపాటున వేరే వాళ్ళు వచ్చుంటారా, అంటే, వీధిగుమ్మం తాళం అలాగే ఉంది. అసలు ఆ సమయానికి ఏ దొంగాడన్నా పొరపాటున మా ఇంట్లోకి జొరబడి, ఆకలేసి, వంటిల్లు తెరవాలి అని ప్రయత్నిస్తే... వాడి దొంగ తాళాలు అన్నీ అరిగిపోయి, అసలు ఆ తాళం ఎలా వేసారో అర్ధం కాక, రాత్రంతా జుట్టు పీక్కుని, తెల్లారి బోడిగుండుతో తనంతట తానే పోలీసులకు ఫోన్ చేసి, లొంగిపోయి... జన జీవన స్రవంతి లో కలిసిపోయే అవకాశాలు ఆ తాళం వేసిన తీరు చూస్తే, నాకు అర్ధమైపోయింది. ఇంతటి వైపరీత్యం చెయ్యగలిగింది నా చిన్నకూతురే అని, నాకు నేనే నమ్మబలుక్కుని, తాళం లాగేందుకు, గడియ తీసేందుకు సర్కస్ కళాకారుల్లా కష్టపడ్డాను. తర్వాత, ఆ తాళం నేను తియ్యగలను అన్న భ్రమ తొలగిపోయి, నిద్రమత్తు పూర్తిగా ఎగిరిపోయి, మా చిన్నదాన్ని శరణాగతి వేడాను.
'ఓహ్, తాళమా ? నేనే వేసానమ్మా, వస్తున్నా...' అని, దాచిన తాళం వెతికి తెచ్చి, తాళం తీసింది. "ఇంతకీ తాళం ఎందుకు పెట్టావే ?" అని అడిగితే... అప్పుడు నా అజ్ఞానం అంతా ఆవిరైపోయేలా బుల్లి కృష్ణుడుగా మారి ఇలా చెప్పింది.
"పేరెంట్స్ డే రోజున విదేశాల్లో ఎవరూ అమ్మానాన్నల్ని కష్టపెట్టరుట. నువ్వు లేచే టైం కి నీకు టీ పెట్టి ఇవ్వాలని, ప్లాన్ చేసాము. కాని, మాకంటే నువ్వు ముందే లేస్తావు కదా, అందుకే, వంటింటికి తాళం వేసి పారేసాము..."
"ఓసి మీ అసాధ్యం కూలా, కానివ్వండి..." అనుకుని, నాపనుల్లో పడ్డాను. కాసేపటికి దోసెలు వెయ్యబోతూ ఉండగా... "అమ్మా, ఆగాగు..." అన్న అరుపు వినబడింది.
"ఏవిటే, పడ్డారా, ఏంటా గోల ?" అని అడిగితే... " నీకు దోశలు నేనే వేసి పెడతానమ్మా, " అంటూ వచ్చింది 8 వ తరగతి చదివే నా పెద్దకూతురు. అంతకుముందే ఇంటిపనుల్లో, కాస్త వంటలో దానికి శిక్షణ ఇచ్చి ఉండడంవల్ల, "కానివ్వు, నీ ముచ్చట ఎందుకు కాదనాలి ?" అంటూ తప్పుకుని, వేరే గదిలో పనిచేసుకోసాగాను.
"అమ్మోయ్... దోస పెనం మీద ఇరుక్కుపోయింది, రా !" ఇంకో పొలికేక. నవ్వుకుంటూ వెళ్లి చూద్దును కదా, వంటిల్లు కురుక్షేత్ర సంగ్రామం తర్వాత యుద్ధభూమిలా ఉంది. దోస పిండి పెనం మీద తప్ప, గట్టు మీద, స్టవ్ మీద, మా అమ్మాయి మోహం మీద... అలుక్కుని ఉంది. పెనం మీద అతుక్కున్న దోశ, నాయకులను వీడని స్కాం లాగా, రానని మొరాయించింది. ప్రక్కన అంతకు ముందు వేసిన దోస ముక్కలు, భూగోళం మీది ఖండాల్లా అక్కడక్కడా పడున్నాయి. వంటిల్లు పరిస్థితి చూస్తూ, 'ఏమే, తప్పుకో, దోస నేను వేస్తాలే... ' అన్నాను దీనంగా.
'సరే, అయితే వంట మమ్మల్నే చెయ్యనివ్వాలి... ప్రామిస్...' అంటూ చెయ్యి చాపింది చిన్నది. పాపం చిన్నపిల్లలు, ఏదో విదేశీ పోకడల్ని చూసి, తోకలు కాల్చుకుని ముచ్చట పడుతున్నారు, పోనిలే, అనుకుని... అలాగే... 'ప్రామిస్ టూత్ పేస్టు...' అన్నాను.
స్నానం చేసి బైటికి వచ్చి చూద్దును కదా, చిన్నది, 'జై బాల్ వీర్...' అనుకుంటూ దేనిమీదో ఎక్కి కూర్చుని తొక్కుతోంది... ఏవిటా అని చూస్తే, తొక్క తీసిన బంగాళాదుంపను కూరలు సన్నగా కొట్టే కట్టర్ లో మొత్తం పెట్టి, అది తరగబడక దాని మీద కూర్చుని స్వారీ చేస్తోంది. 'ఒసేవ్... కట్టర్ విరిగిపోతుందే... ' అనే లోపలే 'టక్...' మన్న శబ్దం వినిపించింది... ఏడవలేక నవ్వుతూ... పెద్దది ఏమి చేస్తోందో చూద్దాము... అని వంటింట్లోకి వెళ్లాను.
అక్కడ మరో విపరీతం... 'అమ్మోయ్... ఈ బెండకాయలు తరుగుతుంటే, హై జంప్ చేస్తున్నాయి. ఇక పొయ్యి మీద పెట్టిన నూనె, చాలా కోపంగా ఏవో శబ్దాలు చేస్తోందే...' అంటూ నానా అవస్థలూ పడుతుంటే, 'పర్లేదమ్మా... నేను చేస్తాను... మీరు వెళ్లి మీ గది సర్దండి, చాలు, ' అంటూ దానికి విముక్తి కల్పించాను.
రణరంగంలా ఉన్న పరిస్థితిని కాస్త సాత్వికంగా మార్చాకా... గదిలోకి వెళ్లి చూస్తే... రోజూ బొమ్మలతో, పుస్తకాలతో చిందరవందరగా ఉండే వాళ్ళ గది, శుబ్రంగా సర్ది కనిపించింది. హమ్మయ్య, ఇక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు... అనుకునేలోపల మా చిన్నది అడిగింది ఓ పిడిగుపాటు లాంటి క్లిష్ట ప్రశ్న.
"అమ్మా, నీ ఫేవరేట్ డిష్ ఏంటి ? రాత్రికి మేము చేసి పెడతాం..."
"ఉపవాసం..." బదులిచ్చి, మౌనంగా నవ్వుకోసాగాను నేను - అరువుచ్చుకున్న పండుగ తెచ్చిన అనర్ధాల్నిఆస్వాదిస్తూ.
అన్నట్టు, మీక్కూడా... హ్యాపీ పేరెంట్స్ డే !!!
No comments:
Post a Comment