బుజ్జిగాడు - అచ్చంగా తెలుగు

బుజ్జిగాడు

Share This

బుజ్జిగాడు

- వేద సూర్య


తూరుపు తెల్లవారి, గడియారం 7 గంటలు కొట్టింది. కాలింగ్ బెల్ శబ్దం విని పేపర్ చదువుతున్న నాన్న తలుపు తెరచారు.
"నాన్నా! వచ్చింది పాలవాడయితే నీళ్ళు ఎక్కువ కలుపుతున్నాడు , అలా అయితే వాడుక మానేస్తాం అని చెప్పండి," అంటూ  వంట గది నుండి అరిచాను. నాన్న నుండి ఎటువంటి సమాధానం లేకపోవటంతో "ఎవరు నాన్నా?" అంటూ హాల్ కు వెళ్ళి తలుపు అవతల నిలబడిన వ్యక్తిని చూసి మాట్లాడలేక పోయాను.
జీవితం లో కొన్ని సంఘటనలు జ్ఞాపకాలను ఇస్తే, మరి కొన్ని గాయాలను అందిస్తాయి. ఎప్పటికీ తలుచుకోకూడదు అనుకున్న గతం పొరలు పొరలుగా తెరుచుకోసాగింది .
"ఎందుకొచ్చావ్ ?" అని కటువుగానే అడిగారు నాన్న.
ఇంటికి వచ్చిన వారిని ఎపుడోచ్చావ్ అని అడగకుండా ఎందుకొచ్చావ్ అని నాన్న అడగటంలో అర్ధముంది .కొందరు మన జీవితంలోకి వస్తూ ఆనందాలను తీసుకొస్తే, మరికొందరు అగాధాలను మోసుకోస్తారు.
అతడు నా జీవితం లో కి కొన్నేళ్ళ క్రితం నూరేళ్ళ ప్రమాణాలు చేస్తూ ,ఏడు అడుగులు వేస్తూ మొగుడిగా వచ్చిన మగాడు..!
నా చేతికి  గోరింటాకు పెట్టుకుంటే  త్వరగా పండేది, కాని నా కడుపు పండటానికి మూడేళ్ళు పట్టింది. పురిట్లో పిల్లాడిని చూసిన మా అత్తింటి వారి ఆశల పుట్టి, మూతి విరుపుల నైరాశ్యం లో మునిగిపోయింది. కారణం పుట్టిన వాడు తన తలను మోసుకోలేడు , వాడి నడుము నుండి మెడను కలిపి ఉంచే వెన్నుకి బలం లేదని డాక్టర్ లు చెప్పిన ఆ మాటకు ఇంకెవరూ మాట్లాడలేక పోయారు.
ఈసడింపులు చీదరింపుల మధ్య బుజ్జిగాడు మూడేళ్ళు పూర్తి చేసాడు. వాడి పుట్టిన రోజున చేసిన వేడుక చూసిన నా పెనిమిటి అడిగాడు , "ఏం నిర్ణయించుకున్నావ్ ?" అని . మోయలేనని వదిలేయటానికి బుజ్జిగాడు బరువు కాదు నా భాధ్యత అని చెప్పాను.
"అయితే నిన్ను కూడా వదులుకోవటం తప్ప నాకు వేరే మార్గం లేదు. "పరిగెత్తితే అలుపు వస్తుందని అడుగులే వేయనంటే అది మూర్ఖత్వమే అవుతుంది. నీ అంత వివేకం నాకు లేదు, ఎంతయినా టీచర్ వి కదా," అన్నాడు ఉక్రోషంగా .. టీచర్ లది మరి అదృష్టమో దురదృష్టమో తెలీదు కాని ఏం మాట్లాడినా పాఠం చెప్పినట్లుగానే అనిపిస్తుంది. అత్మాభిమానమో అహమో నన్ను ఎక్కువ సేపు ఆలోచించనివ్వలేదు ,ఆ ఇంటి నుండి బుజ్జిగాడితో బయటకి వచ్చేసాను.
సింహాద్రి ఎక్స్ప్రెస్ లో కూర్చున్న నా ఆలోచనలు రైలు కంటే వేగంగా పరిగెడుతున్నాయి. అసలు నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా , గద్దించింది నా అంతరాత్మ. ఇప్పటికే ఆలస్యం అయింది అన్నాను .ఆడదానికి ఇంత అహం పనికిరాదు ,చీర బాలేదని నిప్పు పెట్టుకోవాలనుకోవటాన్ని ఆత్మాభిమానం అనుకోవటం ఎంతవరకు సమంజసం అని రెట్టించింది. నాతో ప్రయాణం చేయలేను అన్నవాడి చేయి పట్టుకునే ఉండాలనుకోవటం పిచ్చితనమే అవుతుంది, అన్నాను. నా సమాధానం నచ్చలేదో ఏమో , ఈ ఒంటరి ప్రయాణం ఎక్కడికో ? అని అడిగింది. నాన్న దగ్గరకి .. చెప్పాను. నువ్వే లోకంగా బ్రతికిన నాన్నకి ఏకాకిగా మిగిలానని చెప్పగలవా ? నిన్ను ఎన్నో ఆశలతో పెంచిన ఆయన శ్వాస నిన్నిలా చూసి తట్టుకోగలదా? అంటూ ప్రశ్నలను సంధించింది. నిజమే అమ్మ లేని లోటును తెలియకుండా పెంచిన నాన్న నన్నిలా చూసి తట్టుకోలేరు , ఇప్పుడు నాకేది దారి అనుకుంటున్న నేను రైలు ఆగిన కుదుపుకి ఉలిక్కిపడిన బుజ్జిగాడి ఏడుపుకి ఈ లోకంలోకి వచ్చాను. పాలు తాగటానికి బుజ్జిగాడు పడుతున్న అవస్థ చూసిన మిగిలిన ప్రయాణికులు , "అయ్యో పాపం ఆ తల్లిది ఎంత కష్టం .. ఇప్పుడే ఇలా తల వాల్చేస్తున్నాడు ఇంకా పెద్దై ఏమి చేస్తాడు," అనుకుంటూ మాట్లాడుకుంటున్నారు. కొద్ది సేపటికి బుజ్జిగాడు ఆ బోగీకి వింత అయ్యాడు. రైలు మరలా కదిలింది .. ఆగిన నా ఆలోచనల ప్రయాణం మరలా మొదలైంది. ఇప్పుడు నీకేది దారి .. మరలా ప్రశ్నించింది .. అవును నాకేది దారి .. వీడి కష్టం చూడలేను , నాన్నని కష్టపెట్టలేను .. మరేం చేస్తావ్ .. తెలియదు .. నీకిప్పుడు ఒకటే దారి .. ఏంటది .. ? గోదారి .. గోదారా ..? అవును ఏ దారి లేని వాళ్ళకి దేవుడిచ్చిన దారి .. నిజమే .. నడవటానికి ఏ దారి కనిపించని నాకు నా అంతరాత్మ చూపించిన దారే కరెక్టనిపించింది. రైలు గోదావరి బ్రిడ్జ్ పై వెళుతుంది . బుజ్జిగాడిని చేతుల్లోకి తీసుకుని డోర్ దగ్గరకి వెళ్లాను. ఒక్క ఉదుటులో దూకపోతుంటే ఆగమ్మా .. అనే అరుపుతో ఆగాను. తలుపు వెనక గా ఉన్న సీట్ లో కూర్చున్నారు ఒకాయన .. వయసు 40 నుంచి 50 మధ్యలో ఉంటుంది . "ఏం చేస్తున్నావమ్మా ?" అడిగాడు ఆయన .. జరిగింది చెప్పాను. అంతా విన్న ఆయన చిరు నవ్వు నవ్వి , "జన్మ అనేది కష్టంతో మొదలవుతుంది . కష్టమే లేని జీవితం ఉండదు . అలా అని జీవితమంటేనే  కష్టం కాదు .. నీకు నచ్చినట్లు ఇప్పటివరకూ నీ జీవితాన్ని గడిపావ్ , నీ జీవితం అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి సమాప్తం చేయాలనుకుంటున్నావ్ , అది నీ ఇష్టం కాని అసలు ఏ రుచి ఎరుగని ఈ పసి ప్రాణం ఏం చేసింది ? ఆ ఆయువుని ఆపే హక్కు నీకెవరు ఇచ్చారు. ఉసురు ఇచ్చావని ఊపిరి తీయాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్ ?" అడిగిన ఆయన ప్రశ్నలకి ఏం చెప్పాలో అర్ధం కాలేదు . "ఓర్పుతో ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది .. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇచ్చిన బ్రతుకుని అతుకులతో గతుకుల్లో మనమే పెట్టుకుంటాం. తరచి అడుగులేస్తే  రాత మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. నలుగురూ నవ్విన వాడి తలరాతను నువ్వు మార్చిరాసే ప్రయత్నం చెయ్యి. " అన్నారు ఆయన.రైలు కొవ్వూరు స్టేషన్ లో ఆగటం తో ఆయన తన సీట్ కింద ఉన్న జైపూరు కాలుని సగమే ఉన్న తన కాలుకి తగిలించుకుని రైలు దిగాడు. వెళుతున్న అతడిని చూస్తే నాకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. ఆలోచిస్తే అప్పటి వరకు నా ఆలోచనలను కమ్ముకున్న అజ్ఞానం ఏమిటో అర్ధమయింది. నేనెంత మూర్ఖంగా ఆలోచించానో అర్ధమయ్యి నన్ను నేనే తిట్టుకున్నాను. చేతుల్లో ఉన్న బుజ్జిగాడికి సారీ చెప్పాను ,వాడిదైన ప్రపంచంలో పచార్లు చేస్తున్నాడేమో ఊ .. అంటూ చిరు దరహాసం చేసాడు. నా బాధ్యత ఏమిటో తెలిసింది .. ఇకపై నా బుజ్జిగాడికి నేనే మదరు , ఫాదరు , టీచరు .. అనుకుని  నా మదరు, ఫాదరు, టీచరు అయిన నాన్న దగ్గరకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అన్నీ తెలిసిన నాన్నే నా వెన్ను.. దన్ను ..!
***********
"ఎందుకొచ్చావ్ ..?" అడిగిందే నాన్న మరలా అడిగారు . "సార్ తో ముఖ్యమైన పనుంది," అన్నాడు ఆయన . "నా కొడుకుతో మాట్లాడాలి," అంటాడేమో అనుకున్న నాకు ఆ మాట విని ఆశ్చర్యమేసింది. "ఎవరు తాతా ..?"  అని అడిగిన బుజ్జిగాడి మాటను విని , "నీతో ఏదో మాట్లాడాలట నాన్నా .." చెప్పారు నాన్న . వాడి నడుముకి మెడకు సపోర్ట్ గా చేసిన బెల్ట్ ని పెట్టుకుని , ఎలక్ట్రానిక్ కుర్చీలో కూర్చుని , కుర్చీని మూవ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాడు. వాడిని చూడగానే అతను లేచి నమస్కారం చేసాడు . వాడిని చేతుల్లోకి తీసుకోడానికి వీలు కాదన్న వాడు  చేతులెత్తి మొక్కటం చూసి గర్వంగా  అనిపించింది.
"చెప్పండి ," అని బుజ్జిగాడు అనగానే , "సార్ నా పేరు సురేంద్ర . స్టీల్ ప్లాంట్ లో మేనేజర్ గా రిటైర్ అయ్యాను. పి.ఎఫ్ , గ్రాట్యుటీ అన్ని కలుపుకుని వచ్చిన సొమ్ముతో నా కొడుకు పేరున సీతమ్మ దారలో స్థలం కొన్నాను. ఇప్పుడు సెజ్ పేరుతో కొందరు మా స్థలాన్ని మాకు కాకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.  అదే జరిగితే నేను నా కుటుంబం రోడ్డున పడతాం .చావు తప్ప మరొక దారి లేదు." అంటున్న అతని మాటలు విని మనిషిని చావు తన వైపుకి ఎంతగా తిప్పుకుంటుందో తెలుస్తుంది.
"ఆఫీస్ ల చుట్టూ తిరిగి అర్జీలు పెడితే ఆయాసం తప్ప ఏ సాయం దొరకట్లేదు .. అందుకే అప్పాయింట్మెంట్ లేకపోయినా వెతుక్కుంటూ ఇక్కడి వరకూ వచ్చాను .". అనడంతో , "మీకేం కాదు నిశ్చింతగా ఉండండి," అని అతనికి ధైర్యం చెప్తుంటే నేను పొందినది అతను కోల్పోయింది ఏమిటో అర్ధమైంది .. పుత్రోత్సాహం .. !
*******
ఈ రోజు బుజ్జిగాడికి సత్కారం .. కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్న వారి ఆశలను సజీవంగా ఉంచినందుకు కృతజ్ఞతగా వారు ఇస్తున్న బహుమానం ..
బుజ్జిగాడిని సత్కరించటానికి వచ్చిన ఆత్మీయ అతిధిని నాన్న నాకు పరిచయం చేసారు .. ఆయనే ...గాడి తప్పుతున్న నా బ్రతుకు బండికి దారి చూపిన మార్గదర్శి .. తన ప్రయోగాలతో పచ్చని నేల తల్లికి ఆయువును ఇచ్చి పంట ఫలాన్ని పెంచి ఎందరో రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన శాస్త్రవేత్త శ్రీ జయకాంత్ శర్మ . జైపూరు కాలుతో నడిచినా జై జైలు కొట్టించుకున్న జగజ్జేత ..!
బుజ్జిగాడికి శాలువా కప్పిన ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవటం చూసిన నాకు కళ్ళు చెమ్మగిల్లాయి ..!
బరువు అవుతాడు అనుకున్న వాడు అందరికి తెరువుగా నిలిచాడు.. తల నిలబెట్టుకోలేని వాడు  నా పరువుని నిలబెట్టాడు..నా బుజ్జిగాడు ..శ్రీ ఆదిత్య I. A. S.!

No comments:

Post a Comment

Pages