ధౌమ్య హితోక్తులు
- చెరుకు రామమోహనరావు
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్
'జయము' అన్న పేరు భారతమునకు గలదు. ఆజయమునకు కారణ కర్తలేవరెవరో చూతము. నారాయణ స్వరూపుడైన శ్రీ కృష్ణుడు, నరోత్తముడైన అర్జనుడు,వారి లీలలు ప్రకటించే వాణి, ఆ వాణిని గ్రంథస్థము చేసిన వేదవ్యాసునికి, (వ్రాయుటకు తోడ్పడి మనము తెలుసుకొను రీతి గావించిన వినాయకునికి ) నమస్కరించి ఈ ఇతిహాస పఠనము గావించవలె నన్నది ఆర్య వాక్కు.
వాల్మీకి వ్యాసులు జన్మించిన ఈ పుణ్య భూమిలో మనము పుట్టుటకు ఎంతయో పుణ్యము చేసియుండవలె.
వాల్మీకి
'యావత్ స్థాంస్యతి గిరియః సరితశ్చ మహీతలే
తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి
రామాయణ మహా కావ్యం శతకోటి ప్రవిస్తరం
ఏకైకమక్షరం ప్రోక్తం పుంసాం పాతక నాశనం
గిరులు తరులు ఝరులు ధరలో వరలినంత కాలం రామాయణ కథ ఈ లోకంలో ప్రచలితమై వుంటుంది. శతకోటి ప్రవిస్తరమైన ఈ మహాకవ్యములోని ఒక అక్షరం వల్లించినా జనుల పాతకములు పటాపంచలౌతాయి.
ఆయనము అంటే ప్రయాణము. అది రాముని యొక్క ప్రయాణమా రాముని కొరకు ప్రయాణమా
రాముని యొక్క ప్రయాణమైతే పరుడైన పరమాత్మ నరుడై ధర్మపరుడై పిత్రువాక్య తత్పరుడై అసురోత్పల (ఉత్పల=కలువలు) దివాకరుడై, వనచరుడై వనచరసహితుడై, జనహితుడై, జగన్మహితుడై మానవాళికి ఆదర్శప్రాయుడై నిలచిన నరుడు.'
అని అంటే
***
వ్యాసులవారు
ధర్మేచార్థేచ కామేచ మొక్షేచ భరతర్షభ
యది హస్తి తదన్యత్ర యన్నేహాస్తి తతత్ క్వచిత్
ఈ ఇతిహాస గ్రంథము కలిగినది ప్రపంచములోని ఏ గ్రంథమైనా కలిగి యుండ వచ్చును. ఇందులో లేనిది ఎందులోనూ ఉండదు. ఈ మాట చెప్పుట ఒక సాధారణ మానవునికి సాధ్యమా! ఆయన మహా పురుషుడు,దైవాంశ సంభూతుడు,సకల వేదం వేదంగా విద్యా పారంగతుడు అయి ఉంటాడో ఆలోచన చేయండి. ' అమ్మ తిథి' నాన్న తిథి' 'భాషా తిథి' రోగాల తిథులు ' ఈ విధముగా ఎన్నో జరుపుకొంటున్నామే, ఈ దేశములో పుట్టిన ఆమహనీయులపేరుతో దేశ వ్యాప్తమైన ఒక రోజును ఎందుకు ఏర్పాటు చేయలేము. ఎందుకంటే మనది ప్రజాస్వామిక దేశము. సరే ఈ దేశము ఈ ప్రజలదే కాదా. ఈ మొత్తము ప్రజల యొక్క పూర్వీకులను తీసుకొంటే వారందరూ కేవలము హిందువులు మాత్రమేకదా. మరి నేడు అనేక కారణములచేత పరమతాల పంచన చేరినవారికి, తమ పూర్వీకులను, గౌరవించమని తమ మతములు చెప్పుట లేదా. సెక్యులరిజం పేరుతో దేశాన్ని సర్వ నాశనము చేసిన నేతల, నానా జాతి బీజాళి జాతల చావు పుట్టుక దినాలను నెత్తిన పెట్టుకొని విద్యా సంస్థలలో కూడా వేడుకలు జరుపుకొంతున్నామే , ఈ దేశానికి ఒక గుర్తింపు తెచ్చిన పై మహానుభావులను గూర్చి ఎందుకు ఆలోచించాము. మనదంతా 'ఆడువారి పెళ్ళో మగవారి పెళ్ళో'గాటికాడ ఇంత వేస్తే గతికి వచ్చినామన్న చందము . అందుకే సభ్యత, సంస్కృతి,భాష, ఆత్మీయత, అనుబంధము , అన్నీ పోగొట్టుకొని విదేశీయుల గొప్పదనమును నెత్తికెత్తుకొని ఉరేగుచున్నాము. ఇంకొక ముఖ్యమైన విషయము ఏమిటంటే దాదాపు 5100 సంవత్సరాలక్రితమే psycho analysis, counseling, HR relationships అన్న ఈ ఆధునిక నామములను కలిగిన విషయముల గూర్చి రామాయణములోనూ భారతములోనూ విరివిగానూ విపులముగానూ ఈ ఆధునిక పుస్తకముల చదువనవసరములేనంత పొందవచ్చును.
చాలా దూరము వచ్చివేసినాము . ఇక అసలు విషయానికి వద్దాము. భారతమును తెనిగించిన నన్నయ తిక్కన ఎర్రనలు తక్కువ వారుకాదు.వారు పుట్టిన ఈ గడ్డ పై పుట్టుట మన సుకృతము. వారు రచించిన ఇతిహాస కావ్యము చదువలేకపోవుట మన దుష్కర్మము.దీనికి కారణము ఆ తల్లి బిడ్డలుగా జన్మించి తల్లి రోమ్ములనే తన్నిన మహనీయులకు చెందుతుంది.నన్నయ భారతమును 11వ శతాబ్దములో ప్రారంభించి ఆది సభా పర్వములను అరణ్యపర్వములో కొంత భాగమును నారాయణ భట్టు సహాయముతో వ్రాసినారు. ఆపై ఎలా వ్రాయలేక పోయినారన్నది మనకు అప్రస్తుతము. ఆ పిదప రెండు శతాబ్దములు ఆ గ్రంథమును తాకి తలచిన వారు లేరు.కారణము కడు జుగుప్సాకరము. ఆ రెండు శతాబ్దములలో వీరశైవ వీర వైష్ణవ విజృంభణము అతిపెద్ద కారణము . దానిని దైవసంకల్పమనుకొంటే అది మనకిచ్చిన ఫలితము అత్యద్భుతము. సోమయాజియై,హరిహర తత్వాన్ని నమ్మి,ఆచరించి బోధించి ఆ పరతత్వమునకే తన రచననంకితము చేసిన తిక్కన గారి ,భారతములోని 15 పర్వములు (చెరుకు గడలు ) మనకు దొరికేవి కావేమో ! తెనుగు తేటను తేట తెల్లము చేసిన మహానీయుడాయన. వ్యాసుల వారి మనసెరింగి వ్రాయుటయేకాక తన మనసు బుద్ధిని ఒకటిచేసి మన చేతికి చెరుకు రసమునిచ్చిన మహనీయుడు.
***
ఇక ఈ ధౌమ్యులవారు ఎవరు ఎక్కడనుండి వచ్చినారు . ఏవిధముగా పాండవులకు పురోహితులైనారు అన్న విషయాన్ని కొంత పరిశీలింతము. పాండవులు కాలిపోయే లక్క ఇంటినుండీ బయట పడిన తరువాత బ్రాహ్మణ వేష ధారులై ఏకచక్రపురము చేరుకొని ఒక బ్రాహ్మణుని ఇంట్లో అతిథులుగా వుంటారు వ్యాసులవారి సలహా సహాయాలతో. ఇది ఇప్పుడుకూడా పశ్చిమ బంగాళమున భీర్బం (వీర భీమ నేమో) జిల్లా ఉన్నదని విన్నాను. ఆత్మ హత్య మహా పాపము. బ్రాహ్మణుడు ఉంఛ వృత్తి (భిక్షాటనము) తోనైనా తన జీవిక కొనసాగించవలె.ఇది శాస్త్ర వచనము.ఇక అక్కడ బకాసుర వధ జరిగిన తరువాత పాంచాల నగరమున ద్రౌపది స్వయంవరము జరుగుచున్నాదని ఎరింగి బ్రాహ్మణ కుటుంబము వద్ద శెలవు తీసుకొని అటువైపుగా ఉత్తరాదిషణ బయలుదేరుతారు. ఒక పగలు గడిచిపోయింది. రాత్రి పూట గూడా అర్జనుడు కాగడా పట్టుకొని ముందు నడుస్తూవుండగా తల్లికి కష్టము కలిగించకుండా గంగా తీరమున నడుస్తూ వుంటారు. గంధర్వులకు అది క్రీడా సమయమగుట వలన 'అంగారపర్ణుడు' అను గాంధర్వ రాజుతన భార్యలతో క్రీడిస్తుంటాడు.అర్జనాదులకు గంధర్వునికి వాగ్వాదము జరిగినపిమ్మట తన చేతి కోరివినే అస్త్రము చేసి అర్జనుడు అతని రథమును కాల్చి అతనిని ఓడించుతాడు. అయినా తనకు అత్యంత ఆప్త మిత్రుడైన కుబేరుని వలన చిత్ర విచిత్రముగా అలంకరిపబడిన రథాన్ని పొందుతాడు. ఆయన అపుడు అర్జనునితో ఈ విధంగా చెబుతాడు. " అర్జునా నీతో ఓడితిని కావున ఇకపై అంగారపర్ణుడన్న నా పేరును విసర్జించెదను. 'చిత్ర రథుడు' అన్న పేరున పేరు నాకు సార్థక మగును.నీ విలువిద్య అనన్య సామాన్యము. నాకు నీ ఆగ్నేయాస్త్ర ప్రయోగ ఉపసంహారములను అందుకు ప్రతిగా నా నుండి అనేక
గాంధర్వాశ్వములు మరియు మూడులోకములలోఎక్కడ ఏమి జరుగుచున్నది అని తెలుసుకోగలిగే చాక్షుసీ విద్యను బహూకరించెద"నంటాడు. అందుకు అర్జనుడు "విద్యను గురువులనుండియు మరియు బ్రాహ్మణుల నుండియు మాత్రమె పొందెదను.గుర్రములను గ్రహించి అస్త్రకౌశాలము నేర్పెదననెను. అందుకా గంధర్వుడు కూడా వల్లే యనెను.ఇంతలో అర్జనునకొక అనుమానము పొడచూపినది, "చిత్ర రథా నీవు చాక్షుసీ విద్య నెరిగిన వాడివి కదా మరి మేమేవారని గుర్తించలేక పోయితివా" అనెను. అందులకు చిత్రరథుడు "నాకు మీరెవరన్నది తెలియుటయేకాక మీరు అగ్ని కార్యము లు చేయుటలేదనియు, ముందు పెట్టుకొని నడచుటకు మీవద్ద పురోహితుడు లేడనియు కూడా గ్రహించితిని. అందుకే మిమ్ము నిలువరించ దలచితిని. అర్జనుని అస్త్ర విద్యా కౌశలమునూ చూడ నపెక్షిన్చితిని" అనెను.అప్పుడు పాండవులు సంతసించి తమ మైత్రీ హస్తమును ముందుకు చాపిరి. మిత్రులైన పిదప ఆ యక్షుడు వారికి అగ్నికార్యముల ఆవశ్యకత,అందుకు పురోహితుని యొక్క అవసరమును గూర్చి వివరించి, గంగకు ఆవలి ఒడ్డునగల ఉత్కూచమను పర్వతమున దౌమ్యుడను మహర్షి వున్నాడు. ఆయన దేవల మహర్షి సోదరుడు.మీరు ధౌమ్యుని వద్దకుపోయి వారిని మీ పురోహితుడగుటకు అభ్యర్థించండి అని సలహా ఇస్తాడు. ఈ దేవల మహర్షి భాగవతమున గజేంద్ర మోక్ష ఘట్టములో వస్తాడు.హూహూ అన్న గంధర్వుడు, సరస్సులో క్రీడించుచు, అనుష్టానమునకు మున్ను స్నానము చేయదలచి మడుగులో దిగిన ఆయన కాలు పట్టుకొని లాగితే ఆయన ఆ గంధర్వుని మోసలియై పోయి ,ఇదేవిధముగా కాలు పట్టుకొనుట చేతనే మరణము పొందునట్లు శపించుతాడు. అంతటి మహర్షి యొక్క తమ్ముడు ఈ ధౌమ్యులవారు. పాండవులు తమ లోపమును గుర్తించి దౌమ్యునివద్దకు వెళ్లి ఆయనను అర్థించి తమ గురువుగా చేసుకొంటారు.
******************
No comments:
Post a Comment