సమస్య : ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలకు గురికానివారేవరైనా ఉంటారా? వారికి మోక్షమబ్బుతుందంటారా ?
సలహా : గురికానివారుంటారు. వారు ఆవిధముగా ఉండుటకొరకు అకుంఠిత మైన సాధన చేసినవారు. నీవు ఆ దీక్ష వహించితే నీకూ మోక్షపదము తప్పదు. నిజము చెప్పవలసి వస్తే ఇవి లేనివారెవ్వరు. తేడా అంతా అవి సహించడములోనే. లోహములు అనేవంతా ఒక వర్గముగా తీసుకొంటే ఒక్కొక్క లోహము ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద ద్రవీభవించుతుంది . అంటే సహన శక్తి మారుతూ వుంటుంది ఒక్కొక్క లోహానికి. అవి నిర్జీవాలు . వాని గుణములు మారవు . మనము జీవులము మనలో వయసు పెరిగే కొద్దీ శారీరిక మానసిక మార్పులు కుప్పలు తెప్పలు. మన పురోగమనము పరమాత్ముని వైపే అయితే మన సహన సౌశీల్యములను పెంచుకొంటేనే కదా, పోగలిగేది. కాబట్టి
కార్య ఫలితములకు పొంగక క్రుంగక ఉండటమే ధీర లక్షణము . అదే అమృతత్వపు దారిని జేర్చేది క్షణక్షణము. భగవానుడైన శ్రీ కృష్ణుడు ఈ విషయమై ఏమంటున్నాడో గమనించండి :
యంహినః వ్యతయన్త్యేతే పురుషం పురుషర్షభ
సమదుఃఖ సుఖం ధీరం సో'మృతత్వాయ కల్పతే 2 -- 15 సుఖ దుఃఖమ్ములు సోదర జాతలు స్థిరములు కావవి స్థిమితము పొందుము సమ దృక్పథమే సాధన సుపధము దివ్యత్వమ్మును ధీరుడు పొందగ 2 -- 15 కృష్ణుడు ఎక్కడా ద్వంద్వా తీతము, అంటే సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, శీతోష్ణాలు , మమకారవికారాలు, బంధ విబంధాలు మొదలయిన దేనికీ అతీతముగా వుండమనుట లేదు. వానిని అనుభవించుతూనే నీటిపై తేలే నేతిచుక్క లా ఉండమని ఉపదేశము. నేతిచుక్కే ఎందుకు అంటే కరిగిన నేతిబొట్టు నీటిలో పడుతూనే నీటితో కలిసినట్లుంటుంది. కాసేపటి తరువాత గనీభవించి అంటియుంటూ కూడా అంటనట్లే వుంటుంది. మనము కూడా నేర్చుకోవలసినది అదే. 'కృషితో నాస్తి దుర్భక్షం' 'సాధనమున పనులు సమకూరు ధర లోన' అన్నారు పెద్దలు . శుభస్య శీఘ్రం.
****************************** ************************
సమస్య మనది -- సలహా గీతది -- 8 సమస్య : లోకములో ఒకడు వేరోకడిని చంపుతూ వున్నట్లు వ్యవహారము వుంది.ఇది నిజమా ? ఆత్మకు చావు లేదంటారు కదా ? సలహా : ఆత్మకు చావు వున్నదని ఎవరన్నారు? ఆత్మే పరమాత్మ యని అందరిలో అదే వుండేదియని గ్రహిస్తే ఈ కక్షలు కార్పణ్యాలు వైషమ్యాలు వైరుధ్యాలు ద్వేషానురాగాలు అన్న ద్వంద్వాలకు అతీతమై శాంతియుత సహజీవనము కొనసాగించరా ! ఆత్మ దేహి నుండి విడిపడటానికి కారణము కావలె కదా! నిందే లేనిదే బొందె పోదంటారు కదా ! కర్మ ఫలితముల ననుభవించుతూ ఏర్పడిన బొందె తదనుగుణముగానే ఆత్మను విడుదల చేస్తుంది. అసలు అందరిలో వుండేది అదే ఆత్మ అన్న ఒక్క నిర్ధారణ ఈ విశ్వాన్నే ఎంతో సురక్షితముగా ఉంచ గలుగుతుంది. ఇది లౌకికమైన ఆలోచన. నీటిలో ఏర్పడే నీటి బుడగలు ఒక్కొక్కసారి ఒకదానితో నొకటి తగిలి పగిలి పోవుట గమనించుతాము. పగలనంత వరకు అవి విడి విడిగానే వుంటాయి. విడిగా ఉంటూ కూడా పగిలి పోతాయి. పగిలిన పిదప ఎక్కడికి పోతున్నాయి . తిరిగీ నీళ్ళలో నికే గదా . వేరు వేరు అనుకొనే ఈ ఆత్మలు కూడా అంతే. గాజు పట్టకము గుండా పోయే వెలుగు రేఖ ఒకటే . కానీ అదే ఏడు రంగులుగా మారుతూ వుంది. మరి పట్టకము తీసివేస్తే వెలుగు రేఖ ఒకటే. ఆత్మా కూడా అంతే. ఈ విషయాన్ని శ్రీ కృష్ణుడు ఈ విధముగా చెబుతున్నాడు: య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మాన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే చచ్చేదెవ్వరు చంపేదెవ్వరు ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన ఆత్మయే కదా అందున వున్నది అది తెలియుము అపుడంతా సుఖమే తనను హతునిగా నొకడు భావించితే తనను హంతకునిగా వేరొకడు భావించుచున్నాడు. రెండూ అస్మంజస భావనలే. రెండు శరీరలనుండి ఆత్మ విడి పడుతూ వుంది. కక్షలు కాయమునకే గానీ కనిపించని ఆత్మకు కాదు. ఆ ఆత్మను గుర్తించితే అంతకు మించిన ఆనందమేముంటుంది.
****************************** ************************
No comments:
Post a Comment