ఇలా ఎందరున్నారు ?- 10
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com
angulurianjanidevi.com
(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ ఫీజు కట్టేందుకు, తగినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితురాళ్ళను అప్పు అడిగేందుకు వెళ్ళిన సంకేతను, పల్లవి బలవంతంగా బాగా డబ్బున్న అనంత్ పుట్టినరోజు వేడుకకు తీసుకు వెళ్తుంది. బాగా చదివే సంకేత తీరును ఇష్టపడి, ఆమె ఫీజును కడతాడు అనంత్. సంకేతకు అనంత్ పట్ల ఒక గౌరవ భావం కలుగుతుంది. అనంత్ కూడా సంకేతను ఇష్టపడుతూ ఉంటాడు. అనంత్ రూమ్ కు వెళ్తుంది పల్లవి. అతను ఎన్నో గాడ్జెట్ లను చూపిస్తాడు, ఒక మొబైల్ ను గిఫ్ట్ ఇస్తాడు. ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇక చదవండి... )
కిటికీ లోంచి వెన్నెల పడుతుంటే అనంత్ లేచి ట్యూబ్ లైట్ ఆపేశాడు. ఏ.సి. ఆన్ చెయ్యటంతో గది మొత్తం కూల్ అయింది.
బయట కుండీలలో పువ్వులు విరబూసి వూగుతున్నాయి. అవి తమ అసమానమైన సౌందర్యంతో అద్భుతమైన రూపు రేఖలతో వెన్నెలకు సుస్వాగతం పలుకుతున్నాయి. తాము భూమిలా మారి వెన్నెలను నదిగా మార్చుకొని తమలోకి ప్రవహింప జేసుకుంటున్నాయి. ఇంకా దాహం తీరక మోహమోహనంగా కదిలి తాము ధనస్సులా వంగితే ఆ వెన్నెల అల్లెతాడులా అల్లుకుపోతుంది... తనకు తానుగా ద్రవించిన వెన్నెల ఆ పుష్పాల్లోకి ప్రవహించి, ప్రవహించి ఒక ఉదృత ప్రవాహంలా వాటిలోకి చేరుతోంది. ఆత్మలోకి ఆత్మ చేరినట్లు... అసాధారణమైన అనుభూతిని సాధించినట్లు. ఒక్కసారిగా గాలి స్తంభించి కాంక్షను కాంక్ష మింగుతూ వుక్కిరి బిక్కిరై ఒకటి ద్రవించి ఇంకో దానిలోకి ప్రవహిస్తూ అపూర్వమైన, అద్వితీయమైన సమాగమమై మిగిలింది...
అంతలో బయట ఎక్కడో పెద్ద శబ్దం వినిపించింది అప్పటి వరకు సంకేత, తను ఏకమైనట్లు ఊహించుకుంటున్న అనంత్ వులిక్కిపడి మనలోకంలోకి వచ్చాడు. అది ఊహ మాత్రమే! సంకేత ముందు ఎక్కడ కూర్చుందో అక్కడే వుంది.
అప్పటికే బాగా పొద్దుపోయింది.
అనంత్ తన బైక్ మీద సంకేతను తీసికెళ్లి శివరామకృష్ణ ఇంటి దగ్గర దింపాడు. సంకేతకి బై చెప్పి అతను వెళ్లిపోతుంటే తనలోంచి ఓ ప్రాణం దూరమైపోతున్నట్లు అన్పించి, వెళ్తున్న బైక్ వైపు అలాగే చూస్తూ నిలబడింది సంకేత.
...బయట దూరంగా రోడ్డుమీద వీధి కుక్క మొరగటంతో దడుసుకున్నట్లై లోపలకెల్లాలని గేటుమీద చేయివేసింది.
ఇంట్లోకి వెళ్ళాలంటే భయంగా ఉంది సంకేతకి... హాస్టల్లో ఉంచితే ఎలా వుంటుందో ఏమో అని, పైగా డబ్బులు కూడా అంతంత మాత్రంగానే వున్నాయి కదా అని తన తండ్రి స్నేహితుని ఇంట్లో ఉంచితే తనేమో బాయ్ ఫ్రెండ్ గదికి వెళ్ళి అర్ధరాత్రి వచ్చింది... ఇప్పుడు ఇంట్లో వాళ్ళు లేస్తే తనేం సమాధానం చెప్పుకోవాలి? అప్పటికీ ఫోన్ చేసి కాంచనమాలతో చెప్పింది. తనకోసం డిన్నర్ దగ్గర ఆగొద్దని... అర్జంట్ రికార్డు వుంటే వ్రాసుకుంటూ ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్లో వున్నానని... కానీ ఇంత ఆలస్యం అవుతుందని అనుకోలేదు. అనంత్ కోసం రోజుకో అపద్ధం చెప్పాల్సి వస్తూంది. లేకుంటే కాంచనమాల చంపేస్తుంది.శివరామకృష్ణ ఇంట్లో వుండనియ్యదు. ఏదో తన తండ్రి మీద జాలిపడి ఇంట్లో ఉండనిస్తే తను ఇలా అనంత్ తో తిరగడం సిగ్గుగా వుంది. టెన్షన్ తో వూపిరి ఆగిపోయేలా ఉంది.
ఈ టెన్షన్ తగ్గాలంటే? ధైర్యాన్ని కూడదీసుకోవాలి. రిలాక్స్ గా ఫీల్ అవ్వాలి. అందుకోసం గట్టిగా వూపిరి పీల్చి వదిలింది. అలా ఎన్నిసార్లు పీల్చి వదిలినా లోలోన వణుకు మాత్రం తగ్గలేదు.
నిజానికి ఈ రోజు అనంత్ తో వెళ్ళకూడదనే అనుకుంది.... కానీ అతను తన మాటల సామర్ద్యంతో, సమ్మోహన పరిమళంలో ముంచి తన మనోమూలాలను పెకలించాడు. త్వరగానే వెల్దాములే అని నచ్చచెప్పాడు. అదీ కాక తను కూడా అనంత్ గది ఎలా వుంటుందో చూద్దామన్న ఆసక్తిని చంపుకోక వెళ్ళింది.
కానీ ఈ గేటు దగ్గర ఇలాంటి ఇబ్బంది వస్తుందని అప్పుడు ఊహించలేదు. ఇప్పటికే శివరామకృష్ణ, కాంచనమాల తమ గదిలో పడుకొని నిద్రపోయి వుంటారు. శ్రీహర్ష తన ఫ్రెండ్ గదిలో పడుకొని ఉంటాడు. వాళ్ళతో నో ప్రాబ్లమ్! నీలిమ ఏదో ఒక టైంలో తను వస్తుందని తలుపుతీసే వుంచుతుంది. ఆమెతో కూడా ఇబ్బందిలేదు. ఎటొచ్చి! వరమ్మనే....! ఇప్పటికే రెండు, మూడుసార్లు ఆలస్యంగా ఇంటికి వచ్చి వరమ్మకి దొరికిపోయింది... దాన్నిప్పుడు గుర్తు చేసుకుంటూ గుండె దడ పెరుగుతుండగా గేటు తీసుకొని నాలుగడుగులు వేసింది. సంకేత.
వెంటనే ‘ఎవరదీ?” అంది మెట్లకిందనే పడుకొని వున్న వరమ్మ. ఆమె కంఠం కంచు గంటలా ఖంగుమంది. ఇలాంటి సమయాల్లోనే ఈ ముసల్దాని గొంతు లోంచి చెవులు పగిలిపోయెంత ధ్వని వస్తుంది ఎందుకు? సంకేత గుండె వేగంగా కొట్టుకుంది.
గబ గబ నడవబోతుంటే చున్నీ అడ్డోస్తుంటే దాన్ని వెనక్కి పట్టుకొని, మెట్లవైపుకి పరిగెత్తి గొంతు బాగా తగ్గించి “నేనే బామ్మా! సంకేతని...” అంది. ఆమెకి అంత దగ్గరగా సంకేత ఎప్పుడూ వెళ్ళలేదు.
“సంకేతవే గాని! ఈ టైంలో ఎక్కడి నుండి వస్తున్నావు?” అంది వరమ్మ.
“నిట్ లో ప్రోగ్రామ్స్ జరుగుతుంటే వెళ్ళి వస్తున్నాను బామ్మా! నువ్వు పెద్దగా అరవకు... అందరు నిద్ర లేస్తారు. మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. ప్లీజ్!” అంటూ ఎప్పటికన్నా కాస్త ఎక్కువగానే రిక్వెస్ట్ చేసుకుంది.
“ఇప్పటికిది నాలుగోసారి నువ్వు ఆలస్యంగా రావటం... ఇంకోసారి ఇలాగే వచ్చావంటే నేనే మీనాన్నను పిలిపించి చెబుతాను. మగవాళ్ళు కూడా చీకటి పడేసరికి కొంపలకి చేరుకుంటున్నారు. ఆడపిల్లవు. ఈ తిరుగుల్లేంటి? ఇది పరువు ప్రతిష్టలు వుండే కొంప. ఏదైనా జరగరానిది జరిగితే అది మా మెడకు తగులుకుంటుంది. అది గుర్తుంచుకో....” అంది. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అన్నట్లు విసురుగా దుప్పటిపైకి లాక్కుంది.
సంకేతలో ఉక్రోషం, అసహనం పోటీ పడ్డాయి. ఒకక్షణం దుప్పట్లో వున్న వరమ్మ వైపు కోపంగా చూస్తూ “నువ్విలాగే కండిషన్స్ పెడుతుండు నేనుండే ఎమోషన్ లో ఎప్పుడో పీకనొక్కేస్తాను. పీడా పోతుంది” అంటూ పైకే గొణిగింది. వెంటనే వరమ్మవి పాము చెవులు అన్నది గుర్తొచ్చి గబగబ హాల్లో వున్న తన బెడ్ వైపు పరిగెత్తింది.
బెడ్ మీద కూర్చోబోయి కింద చాపమీద పడుకొని వున్న నీలిమను తొక్కింది.
నిద్రపోతున్న నీలిమ కదిలి పూర్తిగా కళ్ళు తెరవకుండానే “అబ్బా! “ అంది.
“సారీ నీలిమా! చీకట్లో చూసుకోలేదు” అంది నొచ్చుకుంటూ
“లైట్ వేసుకోవద్డా! చీకటి అని తెలిసి కూడా చీకట్లో తిరుగుతారా ఎవరైనా?” అంటూ గొణిగింది.
“ఏంటో! ఎవరినైనా అవకాశం అందలం ఎక్కిస్తుందంటారు. నేనిచ్చే ఈ అవకాశం వల్ల నామీద అందరికి పెత్తనాలు, దండింపులు ఎక్కువైపోతున్నాయి” అని మనసులో అనుకుంటూ బెడ్ మీద ఒరిగింది సంకేత.
సంకేతకి నిద్రరావడంలేదు.
నీలిమను నిద్రపోనిచ్చి అనంత్ ఇచ్చిన సెల్ ఫోన్ లోంచి అనంత్ కి కాల్ చేసింది. ఆ రాత్రంతా అతనితో మాట్లాడుతూ నిద్రపోకుండా గడిపింది.
తెల్లవారి సంకేత కాలేజీకి వెళ్ళగానే సంకేతను చూసి హిందూ ఆశ్చర్యపోతూ “సంకేతా! నీకళ్ళు ఏంటి ఎర్రగా వున్నాయి. నిద్రపోలేదా? నువ్వు కూడా శివానిలాగే నైట్ షోలు ఏమైనా చేస్తున్నావా లాప్ టాప్ ముందు కూర్చుని....?” అంది.
దీనిబొంద అసలు రాత్రి తను అనంత్ గదికి వెళ్లానని తెలిస్తే వురేసుకోదూ! ఆ పాపం తనకెందుకు! అందుకే సంకేత మౌనంగా వుంది. ఈ మధ్యన హిందూకి సాధ్యమైనంత దూరంగా వుంటోంది. కావాలనే పక్క బెంచీలోకి వెళ్ళి కూర్చుంటోంది. ఎక్కువగా పల్లవితోనే కూర్చుంటుంది. పల్లవితో ఒకరోజు “పల్లవీ! నేను అనంత్ ని ప్రేమిస్తున్నట్లు హిందూతో చెప్పకు. దానికి ఇలాంటివి నచ్చావు. తర్వాత తెలిసినా ఏమికాదు కాని ముందే చెబితే అది వాదిస్తుంది. పిచ్చితిట్లుతిడుతుంది. నేను తట్టుకోలేను. స్నేహితురాలివి కదా ఆమాత్రం సహాయం చెయ్యవా?” అంది.
పల్లవి చాలా సిన్సియర్ గా “నాక్కూడా నచ్చట్లేదు నువ్వు చేస్తున్నది. కానీ ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నా నోట్లోంచి ఒక్క వర్డ్ కూడా బయటికిరాదు. ఎవరి ద్వారా అయినా తెలిస్తే దానికి నేను కారణం కాను... తర్వాత నన్ను అనొద్దు. ఎంతయినా ఇలాంటివి దాగవు” అంది పల్లవి మాటంటే మాటే! ఎంతనచ్చకపోయినా ఇచ్చిన మాటని తిరిగి తీసుకోదు.
హిందూ పరధ్యానంగా వున్న సంకేత గడ్డం పట్టుకొని మెల్లగా తనవైపుకి తిప్పుకుని “చెప్పవే!” అంది.
“ఏం చెప్పను... మార్నింగ్ హెడ్ బాత్ చేస్తుంటే షాంపూ వచ్చి కంట్లో పడింది. అదికూడా జోకేనా నీకు? లాప్టాప్ అంటావ్! శివానీ అంటావ్! అసలు నేనెలా కనిపిస్తున్నానే నీకు....? ఏమైనా నువ్వు చాలా మారిపోయావ్ హిందూ!” అంది కాస్త దబాయింపుగా. ఆ తర్వాత ముఖం అదోలా పెట్టుకుంది.
హిందూ నవ్వి “నేనేం మారానే! నువ్వే కదే నన్ను తప్పించుకు తిరుగుతున్నావ్! అదే అంటే పల్లవి మొబైల్ లో గేమ్స్ ఆడుకుంటున్నాను అంటావ్! ఆడితే ఆడావ్ కాని.. కళ్ళు ఎర్రగా అయ్యేంతగా షాంపూని కళ్లలో పోసుకోవాలా..? అదేదో ఈరోజే కొత్తగా హెడ్ బాత్ చేస్తున్నట్లుంది నిన్ను చూస్తుంటే...” అంది.
“నన్ను చూస్తుంటే ఇదే కాదు. ఏదైనా నీకు కొత్తగానే అన్పిస్తుంది. మనిషి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఎక్కువైతే అలాగే వుంటుంది. ఆ కొత్త చూపేదో పెట్టాల్సినచోట పెట్టు...” అంది సంకేత.
“సరే! తల్లీ! నీమీద కొత్తచూపే కాదు. ఏ చూపూ పెట్టను. క్లాసువిను. లెక్చరర్ వస్తున్నారు” అంటూ సర్దుకుని కూర్చుంది హిందూ.
“హమ్మయ్య! ఇది ఇక మాట్లాడదు. క్లాసు వినటంలో పడిపోతుంది” అని సంబరంగా మనసులో అనుకుంటూ “నువ్వు ప్రశాంతంగా కూర్చేవే! వెనక సీటు ఖాళీగా వుంది. నేనక్కడ కూర్చుంటాను” అంటూ హిందూ తిరిగి చూసే లోపలే వెనక సీట్లోకి మారింది సంకేత.
..అనంత్ రాత్రి ఇచ్చిన మొబైల్ బయటికి తీసింది. దాన్ని ఎవరూ చూడకుండా బెంచీచాటుగా పెట్టుకొని అనంత్ కి వెంట వెంటనే మెసేజ్ లు ఇచ్చింది. అటునుండి కూడా అలాగే మెసేజ్ లు వచ్చాయి. ఆ తర్వాత మొబైల్ ని ఖర్చీఫ్ లో పెట్టుకొని పైకి కనిపించకుండా అనంత్ తో మాట్లాడింది. ఇక లెక్చరర్ చూస్తే లేపి బెంచీపై నిలబెడతాడని వెంటనే మొబైల్ ని బ్యాగ్ లో పెట్టుకుంది. క్లాసులో కూర్చుందన్న మాటేకాని మనసంతా అనంత్ ఇచ్చిన మెసేజ్ మీదనే వుంది. లెక్చరర్ వైపు బ్లాంక్ గా చూడటం తప్ప ఆయన చెప్పేది ఒక్కముక్క కూడా ఎక్కటంలేదు.
*****
రోజులు గడుస్తున్నాయి.
కాంచనమాల పర్యవేక్షణ తన కొడుకు శ్రీహర్ష మీద కన్నా సంకేత మీదనే ఎక్కువగా వుంది. ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు ఎప్పుడు వచ్చినా “సంకేతకి చదువు తప్ప మరోదారి లేదు. దానికి చదువే జీవితం. ఈ సౌకర్యం కూడా దానికి మీవల్లనే దొరికింది. శివరామకృష్ణతో పాటు మీరు కూడా పెద్ద బుద్ధితో దాన్ని మీ ఇంట్లో ఉంచుకున్నారు.
ఇక్కడ మీరు తప్ప దానికి ఎవరూ లేరు. నాలుగు ముద్దలు తిన్దిపెట్టినా, నాలుగు మంచి మాటల చెప్పినా మీరే! చిన్నపిల్ల. దాన్ని ఓ కంట కనిపెట్టి వుండండి! మీ బిడ్డే అనుకోండి!” అంటూ ఆమె చేతులు పట్టుకుని బ్రతిమాలుతుంటారు.
ఎంతయినా సంకేత ఆడపిల్ల! తన మీద వున్న నమ్మకంతోనే ఆమె తల్లిదండ్రులు ధైర్యంగా వదిలి వెళ్ళారు. వాళ్ళు ఆ పల్లెటూరు నుండి వచ్చి రోజూ చూడాలంటే చూడలేరు... తల్లి అయినా, స్నేహితురాలు అయినా ప్రస్తుతం తనే. అందుకే గట్టి నిఘా పెట్టి వుంది.
“బాగా చదువుతున్నావా సంకేతా?” అడిగింది కాంచనమాల.
సంకేత ముఖం అదోలా పెట్టుకొని “అంకుల్ కూడా నిన్న ఇలాగే అడిగారు ఆంటీ! కానీ చదువు విషయంలో వెనకటి రోజులు కావు ఇవి ... పోటీ పెరిగింది. ఈ పోటీని పెద్ద పెద్ద ర్యాంకర్సే తట్టుకోలేకపోతున్నారు. నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లో కదా! అందుకే కొంచెం కష్టంగా వుంది. మీరు చూస్తున్నారుగా ఎంతపట్టుదలగా చదువుతున్నానో... ఎంతయినా చిన్నప్పటి నుండి కార్పోరేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి నాలాగ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి తేడా ఉండదా? ఇది నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది...” అంది. అలా అంటున్నప్పుడు మనసును బాగా చంపుకొని మాట్లాడుతున్నట్లు, అపద్దంచెబుతున్నట్లు అన్పించినా దాన్ని తన ముఖంలో కనబడనీయలేదు.
“నువ్వు బాగా చదువుతావని ఏకసందాగ్రాహివి అని శ్రీహర్ష నిన్ను మెచ్చుకున్తుంటాడు. సంకేతా! అది మీ అమ్మ వచ్చినప్పుడు చెబితే ఆనందం ఎక్కువై ముఖాన్ని దోసిట్లో వుంచుకొని ఏడ్చింది తెలుసా!” అంది కాంచనమాల.
ఆ మాటతో సంకేత ముఖం నల్లబడింది.
తనకి థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో రెండు సబ్జెక్టులు తన్నేశాయని తెలిస్తే తన తల్లి నిజంగానే ఏడుస్తుంది. అందుకే తనకి రెండు సబ్జక్టులు పోయాయన్న విషయం తన పేరెంట్స్ కి తెలియనివ్వలేదు. అదే శ్రావ్య వాళ్ళ మమ్మీ కాని, శివాని వాళ్ల మమ్మీకాని తన తల్లిలాగ ఏడవరు... దేన్నైనా చాలా తేలిగ్గా తీసుకుంటారు. బి.టెక్ లో సబ్జెక్టులు పోవటం అనేది ఇప్పుడు వెరీ కామన్ అనుకుంటారు. కాకపొతే ప్యాకెట్ మనీని ఎక్కువగా అడిగితే మాత్రం ఎవరూ చూడకుండా పక్కకి వెళ్లి కళ్ళు తుడుచుకుంటుంటారు. వాళ్లు ఏది చేసినా అంతే! తన తల్లి అలా చెయ్యలేదు. ఏడ్చినా, నవ్వినా పదిమందికి తెలిసేలా చేస్తుంది. ఆమెకు చదువు లేదు పైగా పల్లెటూరు. వూరికే కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది... ఎవరైనా చూస్తారేమో! చూస్తే చీప్ గా వుంటుందేమోనని అసలు అనుకోదు.
ఈ ఏడుపుకి కూడా ఓ రేటు అనేది వుంటే బావుండేది. డబ్బుల్లేవని ఏడవటం మానేసేది. ఎంత ఫ్రీ అయితే మాత్రం ఎవరిముందుపడితే వాళ్ళముందు లొడలొడ ఏడవటమేనా? తల్లి మీద కోపం వచ్చింది. సంకేతకి.
“మా అమ్మ పిచ్చిది ఆంటీ! నా గురించి ఏం తెలిసినా ఏడుస్తుంది. నాకది చిన్నప్పటినుండి తెలుసు. అదో ఆనందం ఆమెకి....” అంది.
వెంటనే కాలేజి బ్యాగ్ తగిలించుకొని “కాలేజీకి వెళ్లొస్తాను ఆంటీ!” అంటూ కాంచనమాలతో చెప్పి ఇంట్లోంచి బయటికి నడిచింది. “సంకేత మంచిపిల్ల” అని కాంచనమాల పైకే అనుకుంది.
కొద్దిదూరం వెళ్లగానే కాలేజీకి వెళ్లకుండా బ్యాగ్ భుజానికే వుంచుకొని, వేరే రూట్ కి వెళ్లింది... తనెప్పుడు బయటికెల్లినా. ఇంట్లోంచి బయటికి రాగానే బ్యాగ్ లో రహస్యంగా స్విచ్ ఆఫ్ చేసిపెట్టుకొని వున్న సెల్ ఫోన్ ని బయటికి తీస్తుంది. స్విచ్ ఆన్ చేసి హియర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూనో, అనంత్ తో మాట్లాడుతూనో నడుస్తూ వుంటుంది. ఇప్పుడు కూడా అలాగే చేసి, పాటలు వినటం ఆపి ఓ చోట ఆగింది.
అనంత్ కి కాల్ చేసి, తనున్న ఏరియా పేరు చెప్పింది. అతను వెంటనే బైక్ మీద వచ్చి సంకేతను కలిశాడు.
ఈమధ్యన వాళ్ళు అలా కలవని రోజంటూ లేదు. కాలేజీకి వెళ్ళినా కాలేజీలో వుండేది తక్కువ. బయట గడిపేది ఎక్కువ. ఒకరిని ఒకరు ఒకక్షణం కూడా వదిలి వుండటంలేదు.
(సశేషం...)
No comments:
Post a Comment