శతతంత్రీ వాయిద్య శిరోమణి - పండిట్ శివకుమార్ శర్మ
- మధురిమ
65సంవత్సరాలుగా "సంతూర్" వాయిద్య సాధనా యజ్ఞం చేస్తూ తన శిష్యులతో చేయిస్తున్న అపర ఋత్వికులు పండిట్ శివకుమార్ శర్మగారు. అసలు 60సంవత్సరాల ఆరోగ్యంతో కూడిన ఆయుష్షే కలియుగంలో ఓపెద్ద వరం,మరి అలాంటిది 65ఏళ్ళగా వాయిస్తూ, ఆ వాయిద్యానికి మారుపేరుగా మరిన ఆయన గురించి కొన్ని అమూల్యమైన విశేషాలు.
అసలు ఆయనగురించి తెలుసుకునేముందు సంతూర్ వాయిద్యం గురించి కొన్ని విషయాలు అనగా దాని పుట్టుపూర్వోత్తరాలు,దాని సృష్టికర్త గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
అసలు పూర్వం సంతూర్ ని శతతంత్రీ వీణ అనేవారట.వీణ అంటే ఇప్పుడు మనందరికి తెలిసినది సరస్వతి అమ్మవారి చేతిలోఉన్న వాయిద్యం మాత్రమే. కాని పూర్వం తంత్రులన్న అంటే తీగలద్వార ధ్వనిని ఉద్భవింపచేసే ఏవాయిద్యాన్నైనా వీణ అనేవారట. ప్రపంచంలో మొట్టమొదటి తంత్రీ వాయిద్యాన్ని పినాకవీణ అన్నారు.
పినాకము అంటే సంస్కృతంలో ధనుస్సు. అంటే ధనుస్సు నుండీ బాణాలను వదలడంవల్ల ఉద్భవించిన ధ్వనిని బట్టి తంత్రీ వాయిద్య ప్రక్రియ మొదలైందని చెప్పవచ్చును.
పాశ్చాత్యదేశాలలో ఈతంత్రీ వాయిద్యాన్నే మొదట హార్ప్ అన్నారు. ఈ హార్ప్ నే స్వరమండల్ అని హిందుస్థానీ సంగీతంలో ఇప్పటికీ వాడుతూ ఉంటారు.తరవాత వీణలలో చాలమార్పులు వచ్చి కాత్యాయినీ వీణ,రుద్రవీణ,సరస్వతి వీణ, తుంబుర వీణ, శతతంత్రీ వీణ ఇలా ఎన్నో వీణలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వాయిద్యం విశేషంగా ప్రాచుర్యం పొందింది.
శతతంత్రీ వీణ భారతదేశంలో కాశ్మీర్ ప్రాంతంలో "సంతూర్" అన్న పేరుతో పిలవబడుతూ ఉందేది.ఈపేరు రావడానికి గల కారణం పర్షియన్ భాషయొక్క ప్రభావం అక్కడ ఎక్కువగా ఉండడం.1940 వరకు కాశ్మీర్లో "సూఫియాన మౌస్కి" అనే ప్రత్యేక సూఫి తత్వ సంగీత ప్రక్రియలలో ఎక్కువగా వాడేవారు.కాశ్మీర్లో తప్ప బయట ప్రపంచంలో దీన్ని ఎవ్వరూ చూసికూడా ఎరుగరు.ఇక శాస్త్రీయ సంగీత ప్రక్రియలకు దీన్ని అప్పటివరకు ఎవ్వరు ఉపయోగించనుకూడా లేదు.
ఇలాంటి సమయంలో 1950వ సంతూర్ వాయిద్యం పండిట్ ఉమాదత్త్ శర్మ గారి కంట పడింది. ఉమాదత్త్ శర్మగారు సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు,పండిట్ బడే గులాం అలీఖాన్ మరియు బెనారెస్ బడే రాందాస్ గారి శిష్యులు. జమ్ము ఆకాశవాణిలో శాస్త్రీయ సంగీత పర్యవేక్షకులు.ఈ వాయిద్యాన్ని చూసి ముగ్ధులైన ఆయన దానిపై చాలా సంవత్సరాలు పరిశోధన చేశారు.
1938వ సంవత్సరంలో పండిట్ ఉమాదత్త్ శర్మగారికి జన్మించారు పండిట్ శివకుమార్ శర్మ.వారి మాతృ భాష డోగిరీ.అక్కడ పర్వత ప్రాంతాలలో ప్రజలు మాట్లాడుకునే భాష ఇది. సాంప్రదాయ సంగీతానికి నిలయమైన ఇంటిలో పుట్టిన ఆయనకు స్వరఓనమాలు దిద్దించిన వారు తండ్రిగారే మరి.ఐదేళ్ళ చిరుప్రాయమ్నుంచే గాత్రం,తబలా వాయిద్యంలో ఆయనే శిక్షణ ఇచ్చేవారట. ఈవిధంగా శాస్త్రీయ సంగీతం అభ్యశిస్తున్న శివకుమార్ కు ఈ వాయిద్యం ఎంతో సుమధురంగా పలుకగలదనీ కాని దానికి ఎంతో నైపుణ్యం కావాలనీ ఈ వాయిద్యాన్ని తన తండ్రిగారే ఇతనికి నేర్పించి ,ఈ వాయిద్యానికి శాస్తీయ సంగీతంలో కచేరి స్థాయి గుర్తింపు తెచ్చే బాధ్యతని కుమారుని భుజస్కందాలపై పెట్టేరు.
ఇలా శతతంత్రీవీణ లేదా సంతూర్ ఉమాదత్తుడి చేతులమీదిగా శివకుమారుని చేతికి వచ్చిందన్నమాట.
ఈవిధంగా 1950వ సంవత్సరంలో పదమూడుసంవత్సరాల వయసులో తండ్రిగారి ఆజ్ఞని ఆశీర్వాదంగా భావించి, శిరసా వహించి,సంతూర్ శిక్షణ ప్రారంభమయ్యి ఎంత అభివృద్ధి చెందిందో ,పరిపూర్ణమైన విజయం సాధించిందో యావత్ప్రపంచం ఇవాళ కళ్ళారా చూస్తోంది కదా మరి.
కానీ ఈ విజయం ఆయనకి సులువుగా రాలేదు,ఆయన విజయమార్గం పూలమార్గం కాక మొదట ముళ్ళబాటగానే నడిచింది.
రెండేళ్ళలోనే సంతూర్ ను అవపోశన పట్టినా ప్రతిభాశాలి,వెంటనే జమ్మూ ఆకాశవాణిలో బాలలకార్యక్రమాలలో వాయిస్తూ ఉండేవారట. రేడియోలో ఎన్నో ప్రసారాల తరువాత మొట్టమొదట 1955లో "హరిదాస్ సంగీత సమ్మేళన్ " అనే కార్యక్రమంలో వాయించడానికి 17ఏళ్ల వయసులో బొంబాయికి వచ్చారు,ఆ కచేరి ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన దైనా ఆ కచేరీలో ప్రశంశలతో పాటు కఠినమైన విమర్శ లు కూడా వచ్చాయట.
సంగీతాభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తే అసలు సంతూర్ వాయిద్యం శాస్త్రీయ సంగీతానికి పనికిరాదని కొందరు ఛాందశులు కఠిన విమర్శల జడివానని కూడా కురిపించారట.
కానీ శర్మగారు ఆ ప్రశంశలకి పొంగిపోలేదు,విమర్శలకి కృంగిపోనూ లేదు.ఆ విమర్శలను కూడా విజయాలుగా మార్చుకోవడానికి తనదైన రీతిలో శ్రమించారు.
ఆ వాయిద్యంపై తండ్రిగారి వలె ఎనలేని పరిశోధన చేసారు. తీగలను అమర్చడము నుండీ ఎన్నో మార్పులు చేసారు. వాయిద్యపు స్థాయిలలో మార్పు తెచ్చారు. సంతూర్ ను వాయించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని, బాణీని సృష్టించారు. దీర్ఘకాలం ధ్వనిని వినిపింపజేసేలా సుమారు పదిసంవత్సరాల కాలం సంతూర్ వాయిద్య పునః నిర్మాణానికి కష్టపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా సంతూర్ కు ఇంత గుర్తింపు రావడానికి దానికి పునః ప్రాణప్రతిష్ట చేసారు అనడంలో ఏసందేహం అవసరంలేదు. ఈ కష్టాలలో వారు ఆర్ధికంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. తండ్రిగారి వద్దనుండి సంగీతసంపద తప్ప ఇంకేమీ పొందలేదు,బొంబాయి మహా నగరంలో జీవనం సాగించాలి.అప్పుడప్పుడు చేతిలో ఒక్క అణా ఉండి ఖాళీ కడుపుతో పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి పాపం.అలాంటప్పుడు కూడా తాను బాగానే ఉన్నానని తండ్రిగారికి ఉత్తరం రాసేవారట. ఎంత శ్రమించాలిసి వచ్చినా సాధనని మాత్రం మానేవారుకాదట,అందుకే ఆ అఖండ సాధనా దీక్షతోనే ఈ ప్రావీణ్యం,నైపుణ్యం సంపాదించుకోగలిగారు. ఒక వాయిద్యం ఒక మనిషికి చాల గుర్తింపు తేవచ్చు కాని ఇన్ని కష్టాలు పడి, తన ద్వారా వాయిద్యానికే ఒక ఉనికిని తెచ్చిపెట్టిన మనీషి ఆయన.
ఇది ఇలా ఉండగా 1955వ సంవత్సరంలో ప్రఖ్యాత హిందీ చలనచిత్ర దర్శకులు శ్రీ శాంతారాం గారు నిర్మించిన "ఝనక్ ఝనక్ పాయల్ బాజె" చిత్రానికి గాను ప్రఖ్యాత సంగీత దర్శకులు వసంత్ దేశాయ్ గారితో కలిసి పని చేసే అవకాసం వచ్చింది. మొట్ట మొదటి సారిగా సంతూర్ ను చలన చిత్రాలలో ఉపయోగించారు.
ఈ చిత్రం ఆయనకు చాల మంచి పేరు తెచ్చిపెట్టినా ఆర్ధికపరంగా ఎదగడానికి ఆయనకు ఎన్నో చలన చిత్రాలలో అవకాశాలు వచ్చినా ఆయన వాణిజ్య పరంగా అలోచించక తన ఆర్ధిక పురోగతి కన్నా తండ్రిగారి కల అయిన సంతూర్ వాయిద్య అభివృద్ధిపైనే దృష్టి సారించారు. సంతూర్ వాయిద్యాన్ని వాణిజ్యప్రయోజనాలకు ఉపయోగించక వాగ్దేవీ ఉపాశనకే వినియోగించారు కాబట్టే అంత విద్వత్తు ఆయన సొంతం అయ్యిందిమరి.
1960లో హెచ్.ఎం.వి సంస్థ శర్మగారి మొట్ట మొదటి ఆల్బం విడుదల చేసింది.ఈ విధంగా మహాప్రస్థానాన్ని అలా కొనసాగిస్తూ 1967వ సంవత్సరంలో ప్రసిద్ధ వేణువు విద్వాoశులు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారితో,బ్రిజ్ భూషణ్ కాబ్రా అనే గిటార్ వాదకుడితో కలిసి "కాల్ ఆఫ్ థ వేలీ" అనే సంగీత ఆల్బం విడుదల చేశారు.ఈ ఆల్బం ఇప్పటికీ అత్యాధికంగా అమ్మబడిన శాస్త్రీయసంగీత ఆల్బంగా చరిత్ర సృష్టించింది.
ఈయనను,హరిప్రసాద్ గారిని కలిపి శివ-హరి అనిపిలుస్తారు.హిందుస్తానీ సంగీతప్రక్రియల్లో ఒకటైన జుగల్బందీలలో వీరివురువీ చాల ప్రసిద్ధి చెందినవి. వీరిరువురూ కలిసి 1980వ సంవత్సరంలో "సిల్సిలా" అనే హిందీ చిత్రానికి పూర్తి స్థాయిలో సంగీత దర్శకత్వం వహించి చాల ప్రఖ్యాతి గణించారు,ఆతరువాత వీరిరువురూ కలిసి "డర్,లమ్హే,విజెయ్,చాందినీ, పరంపరా" మొదలైన ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం చేసారు.
చక్కని శాస్త్రీయ సంగీత పునాదులు ఆయనలో ఉన్నాయి కాబట్టే సాధారణ జనాధరణ పొందగలిగే సినిమా సంగీతాన్ని కూడా జనరంజకంగా అందించగలిగారు. సినిమా సంగీత దర్శకత్వంలో కొనసాగడం గురించి ఆయనను అడిగినప్పుడు,ఆయన ఏమన్నారంటే "సినిమా సంగీతం పూర్తిగా నిర్మాత ,దర్శకుల అభిరుచిపై ఆధారపడి ఉంటుంది,మంచి అభిరుచిగల అలాంటివారు తారస పడినప్పుడు, సమయానుకూలంగా తప్పకుండా మంచి సంగీతాన్ని ప్రజలకు అందించగలను"అన్నారు.
ఆయన ఎన్నో సుమధురమైన సంగీత సేకరణలు(కలక్షెన్స్) విడుదల చేసారు.అందులో బహుళజనాదరణపొందినవి వర్ష,సాంప్రదాయ,రసధార,సంగీత్ సర్తాజ్, ఆనందా(జాకీర్ హుస్సేన్)గారితో కలిసి,తరంగ్ మొదలైనవి.
ఆయన రూపొందించిన "ఫీలింగ్స్" అనే సంగీత ఆల్బమ్ను అమెరికాలో డాక్టర్లు నొప్పిని పోగొట్టడానికి మ్యూజిక్ థెరపీలో వాడుతున్నారంటే వారి వాయిద్య నైపుణ్యానికి ఎంత దివ్యత్వశక్తి ఉందో మనకు అర్థం అవుతుంది. డా. బాలచంద్ర అనే ఆయన శిష్యులు ఈ మ్యూజిక్ థెరపీపై పరిశోధన కూడా చేస్తున్నారు.
"అంతర్ధ్వని" ఇది శివకుమార్ శర్మ గారు సృష్టించిన ఒక అనూహ్యమైన రాగం.ఈరాగంలో విడుదలైన ఆల్బమ్ను మెడిటేషన్,యోగా ప్రక్రియల సాధనలకు ఎక్కువగా వాడుతూ ఉంటారు.
వివిధ ఉపనిషత్లలో నుండీ సంగ్రహించిన పది శ్లోకాలను ప్రముఖ గాయకుడు శ్రీ శంకర్ మహాదేవన్ గారు పాడగా , స్వామి చిన్మయానందగారు వ్యాఖ్యానం చెప్పగా శివకుమార్ శర్మగారు సంతూర్ వాయించిన ఈ ఆల్బంపేరు "ఉపనిషత్ అమృత్".ఇది కూడా విశిష్ట జనాదరణ పొందినది.
ఇక ఆయన ఎలా ఐతే వారి తండ్రిగారి వద్ద శిష్యునిగా సంగీతాభ్యాసం చేశారో, వారి అబ్బాయి రాహుల్ శర్మ కూడా తండ్రి శివకుమార్ శర్మ అడుగుజాడలలోనే నడిచి తన తండ్రి వద్దనే స్వరాభ్యాసం చేశారు..వారి కుటుంబంలో మూడవ తరానికి ఈ స్వర సంపద, కళా వారసత్వం నిస్సందేహంగా పరమేశ్వరుడు ప్రసాదించేడూ అనుటకు నిదర్శనాలు ఈనాడు రాహుల్ శర్మ గారు ప్రదర్శిస్తున్న ప్రతిభా పాఠవాలు. కాని శివకుమార్ శర్మ గారు ఈవిషయంపై ఏమంటారంటే "నేను నా ఇద్దరు పిల్లలని ఎప్పుడూ సంగీతం నేర్చుకోమని బలవంత పెట్టలేదు ఇది వారసత్వంగా వచ్చే సంపద కాదు సాధన తో పెంపొందించుకోవలిసినదే, కాన్ని భగవంతుడు కొందరికి పుట్టుకతోనే ప్రతిభ,జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు,అది నేను రాహుల్ లో చూసి ఆశ్చర్యపోయా, భగవంతుడు వాడిని నాకిచ్చిన వరంగా స్వీకరించా ." అవును మరి నిరంతరం తన సంతూర్ నాదంతో ఆహరి ని అర్చిస్తున్న ఈ హరునికి ఇంతకనా గొప్పవరం ఇంకేముంటుంది.
అతనిలో ప్రతిభ ఉన్నా కానీ రాహుల్ ని ఎప్పుడూ బలవంతంగా ఇందులోకి తీసుకురాలేదట.తన కళాశాల చదువుపూర్తి చేసుకుని కొన్ని తర్జన భర్జనలు పడ్డాక పరిపూర్ణమైన,నిస్సందేహమైన మనసుతో రాహుల్ స్వయంగా సంగీతమనే సన్మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాప్పు డు,పుత్రవాత్సల్యంతో శిష్యునిగా స్వీకరించారు.
"సంతూర్ విరాసత్" అన్నపేరు తో గురుశిష్యులు మరియు తండ్రీకొడుకులైన వీరిద్దరూ ఇచ్చే ప్రపంచవ్యాప్త ప్రదర్శనలకు చాలా జనాదరణ లభించింది.1996వ సంవత్సరం నుండీ వీరిద్దరూ కలిసి వాయిస్తున్నారు..రాహుల్ కూడా "జన్నత్" అన్న పేరుతో చేసిన ఆల్బం హరిప్రసాద్ చౌరాసియా వంటి వారి పెద్దలెందరో మన్ననలను సంపాదించుకుంది.
ఇక వారి జీవిత భాగస్వామి శ్రీమతి మనోరమ.నిజంగా ఈమె ఇతని మనసును గెలిచిన రమే...ఆమె గురించి ఆయన ఏమంటారంటే "నేను నాగురువు ,తండ్రి తరువాత ఎవరికైనా ౠణపడి ఉంటే అది నా భార్య ఎందుకంటే నా కష్టకాలంలో కూడా నా వెన్నంటి ఉండి,నా సాధనకు అంతరాయం కలగకుండా కుటుంబ భాద్యతలను సక్రమంగా నిర్వర్తించి,పిల్లలను తీర్చిదిద్దిన ఆమె సహాకారం నేను ఎన్నటికీ మరువలేనిది." నిజంగా సహధర్మచారిణీ అన్న పదానికి చక్కటి అర్థం వీరి అర్ధాంగి. సుమారు 50సంవత్సరాలు వారితో సహజీవనం చేసిన ఆవిడ ఆయన గురించి ఏమంటారంటే "అసలు శివకుమార్ గారికి జీవితంలో ఆజ్ఞాపించడమే తెలియదట,చిన్న చిన్న విషయాలకు సంతోషపడుతూ,సాధారణం జీవితన్ని గడపడమే ఆయనకి ఇష్టం. ఇంత పేరు,ప్రఖ్యాతలున్న కళాకారులైనా ఎంతో సాధరణ జీవనశైలి ఆయనది."కానీ ఏపని చేసినా పరిపూర్ణంగా చెయ్యాలీ అంటారుట.అందుకే ఆయనకు పెట్టే భోజనం కూడా సాధారణం గానే ఉండాలి కానీ ఆరోగ్య పరంగా పరిపూర్ణంగా ఉంటుంది అంటారు.ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటున్న వారి వ్యక్తిత్వం సదా అభినందనీయం ఏతరం వారికైన ఆచరణీయం.
ఇక వారి సన్మాన,సత్కార పురస్కారాల విషయానికొస్తే వారు ఈ విషయంపై ఏమన్నారంటే అవి లభిస్తే ఆనందంగానే ఉంటుంది కానీ లభించకపోయినా ఫరవాలేదు కానీ శ్రోతల కరతాళధ్వనులే నాకు సన్మానాలు, వారి ప్రతిస్పందనే నాకు పెద్ద పురస్కారం అన్నారు.అలా అనడం అంబరాన్ని అంటిన వారి నిరాడంబరతకి నిదర్శనం కానీ అవార్డులు మాత్రం వాటికి వన్నె తెచ్చుకోవడానికి వారిని వరిస్తూనే వస్తున్నాయి.
1986లో ప్రతిష్టాత్మక సంగీత -నాటక అకాడమీ అవార్డ్.
1987లో శాస్తీయ సంగీతంలో చేసిన కృషికి గాను అమెరికా అమీర్ ఖుస్రో సంఘం వారిచే "నాజెర్-ఏ-కుస్రో" బిరుదు ప్రదానం.
1990లో మహారాష్ట్ర ప్రభుత్వంచే గౌరవ పురస్కారం,జోద్పూర్ లొ శతతంత్రీ శిరోమణి అన్న బిరుదు.
1991లో భారత ప్రభుత్వం చే పద్మశ్రీ.
1994లో జమ్మూ విశ్వవిద్యాలయం నుండీ గౌరవ డాక్టరేట్.
1996లో ఉస్తాద్ హఫీజ్ అలీ ఖాన్ అవార్ద్
2001వ సంవత్సరంలో భారత ప్రభుత్వంచే పద్మవిభూషణ్.
2004లో తాన్సేన్ సన్మాన్ అవార్ద్
2005లో దీనానాధ్ మంగేష్కర్ అవార్ద్... ఇంకా ఎన్నో ఎన్నెన్నో .
ఇన్ని పురస్కారాలను సంపాదించుకున్నా నిండుకుండ తొణకదన్నట్లు ఆయన, వారి జీవితం గురించి చెప్పిన మాట"నా జీవితాన్ని ఇప్పుడు పునః పరిశీలించుకంటే నాకు ఒకటి అర్థం అవుతుంది ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది, నేను సంగీతజ్ఞుని కాను సరస్వతీ మాత నన్ను తన నాదాన్ని వినిపించడానికి ఒక మాధ్యమంగా వాడుకుందంటాను. సంతూర్ నాచేతిలోకి తీసుకోగానే ఎవరో నాచేతుల్లొంచి తీసుకుంటున్నట్లుగా,లేక నాచేత వాయింపజేస్తున్నట్లుగా అనిపిస్తుంది. నాకు ఎలాంటి సంగీతం శ్రోతలకి వినిపించాలని ఉందంటే.. వారు ఆ సంగీతంతో మమేకమై చప్పట్లుకొట్టడం కూడా మరిచిపోవాలి,నిశ్చలానందంతో నిశ్చేష్టులవ్వాలి. ఓసారి నేను ఓరాగం వాయించినప్పుడు నా శ్రోతలందరూ ధ్యానంలోకి వెళ్ళిపోయారు,మరినేను ఏ అలోచనా లేని వాడనై నావాదనలో నిమగ్నుడనయ్యాను,అంతా నిశబ్దం... ఆ నిశబ్దం అందరిచేతా ఆత్మావలోకనం చేయించి అంతరాత్మ సందర్శనం చెయించింది.ఈ మాటలనిబట్టి మనకి ఏమర్థమౌతుందంటే మనం వారి కచేరికి వెళితే ఓ ధ్యానమందిరానికి వెళ్ళినట్లే.అందుకే వారి శశాస్త్రీయ సంగీతం శ్రోతలను భక్తి భావాలలో అలా ఓలలాడిస్తుంది.
నేడు శాస్త్రీయ సంగీతాభ్యాసం చేస్తున్న నేటి విద్యార్ధులందరికీ ఆయన ఇచ్చే సందేశం"శాస్త్రీయ సంగీతం అనేది ఒక వ్యాకరణం కాదు,మనసులోని మధుర భావాలను రాగ తాళాలతో వ్యక్తీకరించే ఓ అనూహ్య ప్రక్రియ.ఈ ప్రణవ నాదాన్ని గళంతో కాక ఆత్మతో వినిపించగలగాలి.అందుకేనేమో ఆయన సంతూర్ వాయించిన ప్రతీసారీ ఆయనకు ఆ అంతరాత్మ సందర్శనం కలుగుతోంది.
ఇలాంటి వ్యక్తిత్వ సంపద గలిగిన విద్వత్ శిఖామణుల జీవితాలను పరిశీలిస్తే ఒకటే సత్యం అవగతమౌతుంది శాస్త్రీయ సంగీతం కేవలం ఆహ్లాదానికి కాదు.భక్తి భావం,శాస్త్రీయ సంగీతం జీవితమనే నాణానికి బొమ్మ, బొరుసు లాంటివి.భారతీయ సంస్కృతిలో ఇవి యుగ యుగాలుగా అంతర్లీనమై ఉన్నవి. అందుకే త్యాగరాజ స్వామి సంగీత జ్ఞానము భక్తివినా సన్మార్గము కలదే మనసా... అన్నారు. పాశ్చాత్యపు పైమెరుగులకు ఆకర్షితులవుతున్న మన యువతకు ఇలాంటివారి జీవితాలను తెలుసుకునేలా చెయ్యాలి,దీనికై వారి తల్లితండ్రులు,గురువులు,సమాజం అందరూ వారి వారి కృషి తప్పక చేస్తే.. జ్ఞానమున్నా అప్పుడప్పుడూ దారితప్పుతున్న మన యువత భక్తితో సన్మార్గాన్ని చేపట్టే రోజు తప్పక వస్తుంది. ఇప్పటికీ నిరంతర సంగీత సాధనలోనే కాలాన్ని సద్వినియోగం చేస్తున్న ఈ శతతంత్రీ వీణా విద్వాంసులు శివకుమార్ శర్మ గారు శత సంవత్సరాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ పరమేశ్వరుని ప్రార్దిద్దాం.
శివకుమార్ గారి వాద్య వైభవాన్ని, క్రింది లింక్ లలో చూడండి...
No comments:
Post a Comment