ప్రేమతో నీ ఋషి – 5 - అచ్చంగా తెలుగు

ప్రేమతో నీ ఋషి – 5

Share This

ప్రేమతో నీ ఋషి – 5   

- యనమండ్ర శ్రీనివాస్


( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కార్పొరేట్ ప్రపంచాన్ని కొన్నేళ్ళపాటు కుదిపెయ్యగల ఆ సందేశం గురించి తెలియాలంటే... మనం కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో ఏమి జరిగిందో తెలుసుకోవాలి... గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుండగా, జరిగినదానికి సంజాయిషీ ఇవ్వబోయిన ఋషిని పట్టించుకోదు  స్నిగ్ధ.  అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటాడు...  ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’ కోసం పనిచేసేందుకు  మాంచెస్టర్ వచ్చి, ముందుగా ఆర్ట్ గురించిన అవగాహన కోసం ప్రయత్నిస్తున్న ఋషి, ఫేస్బుక్ లో స్నిగ్ధ ప్రొఫైల్ చూసి, అచ్చెరువొందుతాడు. స్నిగ్ధకు మహేంద్ర కంపెనీ లో ఉద్యోగం వస్తుంది... ఇక చదవండి...)
“కంగ్రాట్స్ ...” మహేంద్ర విభాగంలో తన కొత్త ఉద్యోగం గురించి చెప్పిన స్నిగ్ధను అభినందించింది ఏంజెలా. ఆమె మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ లో క్యురేటర్ గా పనిచేస్తోంది. క్యురేటర్ లు మ్యూజియం, ఆర్ట్ గేలరీ వంటి వారసత్వపు స్థానాల్లో పనిచేసే కంటెంట్ నిపుణులు. వారిది ఆర్ట్ ప్రపంచంలో మౌలికమైన ఉద్యోగం. ఆర్ట్ మార్కెట్ ను తమ వృత్తిగా స్వీకరించాలని స్థిరంగా అనుకునే వారిని, అత్యంత నిపుణత కలిగిన ఈ వృత్తి ద్వారాలు తెరిచి స్వాగతిస్తుంది.
“థాంక్ యు వెరీ మచ్ ఏంజెలా”, మ్యూజియం లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కాంటీన్ లోని కుర్చీలో కూర్చుంటూ అంది స్నిగ్ధ. ఆమెకు ఉద్యోగం లభించినందుకు ఆమె చాలా సంతోషంగా ఉంది. ఆమెకు గేలరీ వదిలి వెళ్తున్నందుకు కాస్త బాధగా ఉన్నా, ఒక ప్రతిష్టాత్మకమైన భారతీయ ప్రాజెక్ట్ లో పనిచెయ్యబోతున్నాను అన్న ఉత్సాహం దాన్ని కాస్త తగ్గిస్తోంది. “ప్రకృతి నియమం ప్రకారం ఏదైనా కొత్తగా ఆరంభించాలంటే, పాతది వదిలెయ్యాలి కదా,” సాలోచనగా అనుకుంది ఆమె.
“ అయితే, నువ్వు రోజంతా నీ రిలీవింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవడంలో బిజీ గా ఉంటావు కదా ? కాని, అవి చేసేముందు నీకో సంగతి చెప్పాలి. ఉదయం నుంచి ఇండియన్ లాగా కనిపిస్తున్న ఒక యువకుడు నీకోసం వేచిఉన్నాడు. నేనతనికి మ్యూజియం చూపిస్తానన్నా, నీతో వెళ్లేందుకే అతను ఆసక్తి చూపుతున్నట్లు అనిపించింది,” అంది ఏంజెలా కొంటెగా నవ్వి, కన్ను గీటుతూ.
“హ్యాండ్సం గా ఉన్నాడు, నీ అదృష్టాన్ని పరీక్షించుకో ! ఒకేరోజు నీకు కొత్త ఉద్యోగం, కొత్త జోడీ దొరుకుతుందేమో..” అంటూ ఆంజిలా నవ్వుతూ అక్కడినుంచి లేచి, స్నిగ్ధకు ఆ యువకుడు వేచిఉన్న ప్రదేశాన్ని చూపించింది.
స్నిగ్ధ లంచ్ ముగించుకుని, తనను కలిసేందుకు వచ్చిందెవరో చూద్దామని, వెయిటింగ్ హాల్ వైపు వెళ్ళింది. హాల్ లో అతను ఒక్కడే ఉండడంతో ఆమె అతన్ని తేలిగ్గానే పోల్చుకుంది. అతను అందంగా, పొడవుగా, చక్కటి చిరునవ్వుతో ఉన్నాడు. అతను ముదురునీలం రంగు సూట్, తెల్ల చొక్కా, ఎర్ర టై తో ఉన్నాడు. అతను చాలా ప్రొఫెషనల్ గా కనిపించాడు. స్నిగ్ధను చూడగానే అతను లేచి నిలబడి, ఆమెతో కరచాలనం చేసేందుకు చెయ్యి చాచాడు.
“హాయ్, నేను ఋషి, బాంక్ ప్రైమ్ సూయిస్ ‘ నుంచి అన్నాడు ఋషి ప్రసన్న వదనంతో. గతరాత్రి ఫేస్బుక్ లో చూచినదానికంటే, స్నిగ్ధ మరింత అందంగా ఉందని, అతను గుర్తించాడు.
“యా మిష్టర్ ఋషి, మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ కి స్వాగతం. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ?” స్నిగ్ధ ఋషితో మర్యాదపూర్వకంగా సంభాషణ మొదలుపెట్టింది.
“నేనిక్కడకు చిన్న అధ్యయనం కోసం వచ్చాను. నేను మా బ్యాంకు వారి ‘ ఆర్ట్ ఫండ్’ లో పనిచేస్తున్నాను. అందుకే నేను ఆర్ట్ ప్రపంచాన్ని అనుభూతి చెందేందుకు ఈ గేలరీ ను చూడాలని అనుకుంటున్నాను. “ అన్నాడు ఋషి.
మ్యూజియం గోడలపై వేళ్ళాడదీసిన అత్యంత సుందరమైన పోర్ట్రైట్ లను స్నిగ్ధ అతనికి చూపింది.
స్నిగ్ధ తనకు చేరువలో ఉంటే, అతనికి ఒకేసారి రెండు పోర్ట్రైట్ లను చూసిన భావన కలుగసాగింది – ఒకటి ప్రాణం లేకుండా గోడకి వెళ్లాడగట్టి ఉన్నది, మరొకటి తన ప్రక్కనే ఉన్న సజీవ శిల్పం.
ఆమె సంస్కారవంతంగా, మర్యాదగా, కాస్తంత భారతీయత మేళవించి ఉండడంతో, పశ్చిమ దేశాల్లోని స్త్రీలకంటే కాస్తంత విభిన్నంగా ఉందని ఋషి గుర్తించాడు. ఆమె యాస ఆమె UK నివాసాన్ని ప్రతిబింబిస్తూ ఉంటే, ఆమె మాటల్లోని భారతీయ ప్రస్తావనలు ఆమె సంస్కృతిక అంశాలను కూడా బాగా అధ్యయనం చేసిందని చెబుతున్నాయి.
“అయితే, మిష్టర్ ఋషి, మీ స్వస్థలం ఏది ?” ఋషి పెయింటింగ్ కు సంబంధించిన నోట్స్ తీసుకుంటూ ఉండగా, కాలక్షేపం కోసం అడిగింది స్నిగ్ధ.
“వైజాగ్, మీకు ఈ ఊరు తెలుసా ? ఆంధ్రప్రదేశ్ లో దీన్ని విశాఖపట్నం అని కూడా అంటారు. నేను అక్కడికి చెందినవాడిని, కాని, ఇక్కడే స్థిరపడ్డాను. నేను UK లో గత 4 ఏళ్ళుగా ఉంటున్నాను, “ బదులిచ్చాడు ఋషి.
“యా, నీకు వైజాగ్ తెలుసు ; కాలేజీ లో ఉన్న నా కొలీగ్ ఒకామె అక్కడినుంచే వచ్చింది. ఈ ఊరిని గురించి ఆమె నాకు ఎన్నో ఆసక్తికరమైన అంశాలను చెప్పింది,” అంటూ నవ్వింది ఆమె.
ఋషి ఆమెకు అడ్డు వస్తూ, “ఆసక్తికరమైన అంశాలా ? అంటే ఎలాంటివి? వైజాగ్ ప్రశాంతంగా, పవిత్రంగా, అందమైన బీచ్ లతో కాలుష్య రహితంగా ఉంటుందనే నాకు తెలుసు. ఇవి కాకుండా మీకు తెలిసిన ఆసక్తికరమైన అంశాలు ఏమిటి ?” అంటూ అడిగాడు.
“హా, వైజాగ్ లో యూనివర్సిటీ పక్కనే మెంటల్ హాస్పిటల్, బస్సుస్టాండ్ సెంట్రల్ జైలు పక్కన ఉండేవని, ఆమె గతంలో నాకు చెప్పింది. అవసరమైనప్పుడు ఎవరైనా ఒక బిల్డింగ్ నుంచి మరొకదానికి గోడ దూకి వెళ్లేందుకు ఇది చాలా అనువుగా ఉంటుంది కదా ?” గట్టిగా నవ్వుతూ అంది స్నిగ్ధ.
ఋషి కూడా నవ్వాపుకోలేక, ఆమెతో శృతి కలిపాడు. ఇది వాస్తవమే అయినా, ఈ రెండిటి కలయికను గురించి, ఆమె చెప్పిన విధంగా అతను ఎప్పుడూ ఆలోచించలేదు.
“ బాగా చెప్పారు, నేనూ అంగీకరిస్తున్నాను. మీ ఫ్రెండ్ కూడా నాలాగే సరదాగా ఉండటాన్ని ఇష్టపడుతుందనుకుంటాను,” సంభాషణ పొడిగించేందుకు ప్రోత్సహిస్తూ అన్నాడు ఋషి. అతను ఆమె సాహచర్యాన్ని ఇష్టపడసాగాడు.
వారు ముందుకు సాగుతూ పెయింటింగ్స్ ను చూడసాగారు. ఆమె ప్రతి పెయింటింగ్ వెనుక ఉన్న నేపధ్యం, చారిత్రిక అంశాల్ని గురించి అతనికి వివరించింది. తన ప్రైవేట్ కలెక్షన్ కోసం ఆర్ట్ కలెక్టర్ ఆలోచనా విధానం ఎలా ఉంటుందో అర్ధం చేసుకునేందుకు ఋషి ఆమెను ఎన్నో ప్రశ్నలు అడిగాడు.
నిజానికి, చాలామంది సేకరణకారులు పూర్వకాలంలోని చక్కటి చిత్రకారుల బొమ్మలను గురించి మరింత అవగాహన కోసం మ్యూజియం లను దర్శిస్తారు. ఒక ఆర్ట్ వర్క్ కు ఉన్న విశ్వసనీయత ను రూడి చేసుకోడానికి వారు క్యురేటర్ ల సాయం తీసుకుంటారు. మరికొందరు సేకరణకారులు , తమ ముందు తరాల జ్ఞాపకచిహ్నంగానో లేక కళాపోషణ కొరకో,  తమ సేకరణలను మ్యూజియం కు దానం చేసేందుకు వస్తారు.
“వ్యాపార దృక్పధం కాకుండా, మిమ్మల్ని పెయింటింగ్స్ వైపు ఆకర్షించే అంశాలు ఏంటి ?”స్నిగ్ధ ఋషిని యధాలాపంగా అడిగింది.
“ఒక చిత్రంలోని సూక్ష్మమైన అంశాలను స్పష్టంగా చిత్రీకరించటంలో ఆర్టిస్ట్ చూపే అమితమైన ఓర్పు నాకు చాలా ఇష్టం. ఒకరకంగా అది తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు పడే ప్రసవవేదన కంటే కష్టం. బిడ్డ పుట్టుకకు బీజం పడేది క్షణికానందం వల్లనే. కాని, అమ్మ కడుపులో బిడ్డను మోసేటప్పుడు, ప్రసవ సమయంలో మాత్రమే వేదన అనుభవిస్తుంది. కాని, ఒక ఆర్టిస్ట్ ఆరంభదశ నుంచి భావోద్వేగాల బరువును మొయ్యాలి. అటువంటి సమయంలో అతనికి సాయంగా ఎవరూ ఉండరు, అతనొక్కడే ఒంటరిగా పనిచెయ్యాలి. ఆలోచనలు ఆకృతిదాల్చిన తర్వాత కూడా, అది కాన్వాస్ పై చక్కగా ఆవిష్కరింపబడే దాకా, ఈ భారం కొనసాగుతుంది. “
పెయింటింగ్ లు వెయ్యటం బిడ్డపుట్టుక కంటే సమున్నతంగా పోల్చి అతను చెప్పిన విధానం స్నిగ్ధకు బాగా నచ్చింది. అతను సంభాషణ కొనసాగిస్తూ ఉండగా, ఆమె నవ్వుతూ ఋషి వంక చూడసాగింది.
“అంతేకాక, కొన్ని ఇండియన్ పెయింటింగ్స్ చూస్తున్నప్పుడు వాటి వెనుక ఉన్న భావనను నేను ఆరాధిస్తాను. ఆర్టిస్ట్ లు మేదావులైతే తప్ప, అంతలా ఊహించడం కష్టం. మనసులో వారు కూడగట్టుకోవలసిన అంశాలు చాలా క్లిష్టమైనవి – దుస్తులు, డిజైన్స్, పరిసరాలు, లోపలి అంశాలు – ఇటువంటివన్నీ అతను కాన్వాస్ పై పెయింటింగ్ వేసేముందే నిర్ణయించుకోవాలి. నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ, ఇండియన్, వెస్త్రెన్ ఆర్టిస్ట్ ల రంగుల మేళవింపు లో కాస్త తేడా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది.”
అతని పరిశీలన స్నిగ్ధకు చాలా సబబుగా అనిపించింది. ఆమె ఇలా వివరించింది – “మీరన్నది నిజమే, మిష్టర్ ఋషి. నేను దీనిగురించి ఇంకా చెప్తాను, మీకు బోర్ కొడితే తెలియచెయ్యండి. మామూలుగా రంగుల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు, నేను లెక్చర్ ఇవ్వకుండా ఉండలేను.” అంటూ ముఖం ప్రక్కగా జారిన కురులని చెవి వెనక్కు సర్దుకుంది ఆమె. స్నిగ్ధ ప్రశ్నిస్తున్నప్పుడు, ఋషి ధ్యాస వదులుగా జారిన ఆమె కురులపైనే ఉంది. వెంటనే అతను తన ధ్యాసను ఆమె అడిగిన ప్రశ్న వైపు మరల్చాడు.
“పర్వాలేదు, చెప్పండి,” అంటూ ప్రోత్సహించాడు ఋషి. ఆమె అందంగా , సంస్కారవంతంగా ఉండడంవల్ల స్నిగ్ధ తో మాట్లాడటం అతనికి మరింత ఆసక్తికరంగా ఉంది.
“ సాధారణంగా రంగులు రెండు రకాలు – ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ కలర్స్ అంటే, వేరే రంగుల్ని కలపడం ద్వారా తయారు చెయ్యలేనివి. అవి ఎరుపు, పసుపు, నీలం. కాని ఇంకో మూడు రంగులున్నాయి – నారింజ, ఆకుపచ్చ, వంకాయ రంగులు – ఇవి సెకండరీ కలర్స్, వీటిల్ని ప్రైమరీ కలర్స్ కలిపి, తయారుచెయ్యవచ్చు. ఆకుపచ్చాను పసుపు, నీలం కలిపి, వంకాయ రంగును ఎరుపు , నీలం కలిపి తయారుచెయ్యవచ్చు. “
ఋషికి ఈ సమాచారం ఆసక్తికరంగా అనిపించింది. జీవితంలో కలిసే రంగులను అతను గమనించాడు కాని, కాన్వాస్ పై వాడే రంగులని గురించి అతనికి తెలీదు. అతనికి స్నిగ్ధ పట్ల ఒక ఆరాధనాభావం కలిగింది, స్నిగ్ధ సంభాషణ కొనసాగించింది...
“ఎరుపు, పసుపు, నీలం వంటి ప్రైమరీ కలర్స్ కలయిక పెయింటింగ్స్ కు, డై ల తయారీకి మామూలుగా వాడతారు. కాన్వాస్ పై ఏ రంగులూ లేనప్పుడు అది తెల్లగా ఉంటుంది. అదే అన్ని రంగుల్ని కాన్వాస్ పై కలిపితే, తెలుపు రంగు వస్తుంది.”
ఋషికి ఆమెతో ఎంతసేపైనా అలా మాట్లాడుతూ ఉండిపోవచ్చు అనిపించింది. పెయింటింగ్స్ పట్ల ఆమెకు ఎంతో మక్కువ ఉన్నట్లు అనిపించింది, అతనికి కూడా ప్రస్తుతం తన చెయ్యి పట్టుకుని, విస్తృతమైన ఆర్ట్ ప్రపంచాన్ని చూపే మార్గదర్శి చాలా అవసరం.
“ఇంకా, ఒక బొమ్మ వేసేందుకు ఒకరికి ప్రైమరీ, సెకండరీ కలర్స్ గురించి మాత్రమే తెలిస్తే సరిపోదు, వాటి విలువ కూడా తెలియాలి. ఈ విలువలు రెండు రకాలు . మొదటిదాన్ని టింట్స్ అంటారు – తెలుపురంగుని ఇతర రంగుల్లో కలిపితే వచ్చే ప్రభావం, ఉదాహరణకి గులాబి రంగు ఎరుపు యొక్క టింట్. రెండోదాన్ని షేడ్స్  అంటారు – నలుపుని ఏదైనా రంగులో కలిపితే వచ్చే ఎఫెక్ట్, ఉదాహరణకి మెరూన్ అనేది రెడ్ యొక్క షేడ్.
ఋషి నడక ఆపి, ఆమెనే చూడసాగాడు. మామూలుగా అతను ఎవరినీ 5 నిముషాలకంటే ఎక్కువ మాట్లాడనివ్వడు, కాని స్నిగ్ధ దీనికి అతీతమని నిరూపించుకుంది. ఆమె అందమే కాదు, మాట్లాడే విషయాలు కూడా అతనికి ఊపిరి సలపనివ్వట్లేదు. ఆమెతో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కూడా భవిష్యత్తులో అనుబంధం కొనసాగించాలని అతను బలంగా అనుకున్నాడు.
అప్పటిదాకా అతను అక్కడికి ఒక ప్రయోజనం కోసం వచ్చాడని, స్నిగ్ధ అందుకు ఒక సాధనంగా ఉపయోగిస్తోందని  మాత్రమే ఆలోచించాడు. కాని ఇప్పుడు, ఏదో వెచ్చని ఆత్మీయత అతన్ని అల్లుకున్నట్లు అనిపిస్తుండగా స్నిగ్ధ తిరిగి “
“చివరగా, పెయింటింగ్స్ పరంగా మనం వార్మ్ కలర్స్, కూల్ కలర్స్ మధ్య ఉన్న తేడాల గురించి తెలుసుకోవాలి. వెచ్చనైన సూర్యకాంతి రంగుల్ని సూచిస్తున్నందున ఎరుపు, పసుపు, నారింజ రంగుల్ని వార్మ్ కలర్స్ అంటారు. ప్రశాంతమైన చల్లదనంతో ఆవరించబడి, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నందున నీలం, ఆకుపచ్చ, వంకాయ రంగుల్ని కూల్ కలర్స్ అంటారు. వెస్త్రెన్ కళాకారులు ఎక్కువగా కూల్ కలర్స్ ను వాడతారు. ప్రద్యుమ్న వంటి భారతీయ చిత్రకారుల పెయింటింగ్స్ ఎక్కువగా వార్మ్ కలర్స్ తో నిండి ఉంటాయి.” ముగించింది స్నిగ్ధ.
ఇండియన్ , వెస్త్రెన్ పెయింటింగ్స్ మధ్య ఉన్న వ్యత్యాసం వివరిస్తూ, స్నిగ్ధ రంగుల గురించి చెప్పిన విధానాన్ని ఋషి అభినందించాడు. ప్రద్యుమ్న – అన్న పేరు వినగానే అతను అప్రమత్తం అయ్యాడు.
“ప్రద్యుమ్న ? మైసూరు మహారాజా సంస్థానంలో ఉండే గొప్ప భారతీయ చిత్రకారుడా ? మేనకా విశ్వామిత్రా పెయింటింగ్ వేసింది అతనేగా ?” వెంటనే అడిగాడు ఋషి. ఉన్నట్టుండి అతని స్వరంలో ధ్వనించిన ఉత్సాహాన్ని స్నిగ్ధ గమనించింది. ఆమె కూడా ప్రద్యుమ్న పెయింటింగ్స్ కు వీరాభిమాని కనుక, అతని భావనలు అర్ధం చేసుకోగలిగింది.
“అవును, నేను అదే ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నాను, ప్రద్యుమ్న – తైలవర్ణచిత్రాల కళాఖండాలు సృష్టించేందుకు పౌరాణిక పాత్రలను నేపధ్యంగా వాడిన చిత్రకారుడు. నేనతని పెయింటింగ్స్ కి వీరాభిమానిని. “ బదులిచ్చింది స్నిగ్ధ.
ఋషి మౌనంగా ఏవో ఆలోచనల్లో మునిగిపోయినట్టు కనిపించాడు. ఏదో విషయం గురించి తీవరంగా ఆలోచిస్తున్నాడని స్నిగ్ధకు తెలిసింది. అతను కాస్త అసహనంగా కదిలి, ప్రద్యుమ్న పేరును ఉచ్చరిస్తూ ఏదో లోకంలో ఉన్నట్లు కనిపించాడు.
తిరిగి అతన్ని ప్రస్తుతానికి తెచ్చేందుకు స్నిగ్ధ ఇలా అంది, “ మీకు మరొక ముఖ్యమైన విషయం తెలుసా ? తైలవర్ణచిత్రాలలాగే ఇటీవల పెయింటింగ్స్ వేసేందుకు వివిధ మాధ్యమాలను వాడుతున్నారు. ఉదాహరణకి, క్రిస్ అఫిలి అనే ఆర్టిస్ట్ ఏనుగు పేడను పెయింటింగ్ కోసం వాడి, 1998 లో టర్నర్ ప్రైజ్ ను గెల్చుకున్నాడు. బురద పెయింటింగ్స్ లో , అంటే బురదతో పెయింటింగ్ లు సృష్టించే నిపుణులైన ఆర్టిస్ట్ లు అనేకమంది ఉన్నారు.”
స్నిగ్ధ చెప్పింది విన్న వెంటనే ఋషి ఆలోచనల్లోంచి వెనక్కు వచ్చి, నవ్వేసాడు. గతరాత్రే అతను తాజా పెయింటింగ్ మాధ్యమాల గురించి చదివాడు. అతని అధ్యయనంలో అతన్ని ఆకర్షించిన మరొక మాధ్యమం ఉంది – సెమెన్ పెయింటింగ్. లేక మగవారి దేహద్రవాలను పెయింటింగ్ కోసం వాడటం. మార్టిన్ వాన్ ఆస్ట్రోవిస్క్స్ అనే జర్మన్ ఆర్టిస్ట్ ఇటీవల తన స్వంత వీర్యంతో సృష్టించిన దాదాపు 30 పెయింటింగ్స్ ఎక్సిబిషన్ ఒకటి ఏర్పరిచాడని చదివి, ఋషి ఆశ్చర్యపోయాడు.
ఆర్టిస్ట్ వాడిన మాధ్యమం కాక, పెయింటింగ్స్ కోసం వీర్యం సేకరణకు, దాన్ని నిల్వ ఉంచేందుకు అతను ఎన్నిసార్లు కష్టపడి ఉంటాడో మనసులోనే వేసుకున్న లెక్కలు ఋషిలో ఆసక్తిని రేపాయి.  అతని వదనంలో సన్నటి చిరునవ్వును గమనించిన స్నిగ్ధ కారణం అడిగింది. ఋషి మర్యాదగా మాటమార్చి, ఆమె వెంట వెళ్ళాడు.
వారు మొత్తం పర్యటన ముగించగానే, అతను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కు వెళ్లి, కొంత సొమ్మును మ్యూజియం కు విరాళంగా రాసిచ్చాడు. ఇచ్చేముందే అతను కళాపోషకుల స్థితిని , అది స్నిగ్ధ దృష్టిలో పొందే విలువను ,తద్వారా మున్ముందు స్నిగ్ధతో తరచుగా తాను కొనసాగించబోయే సంబంధాన్ని గురించి అతను ఆలోచించాడు.
“కృతఙ్ఞతలు స్నిగ్ధ, మీనుంచి ఇవాళ ఎన్నో విషయాలను నేర్చుకున్నందుకు ఆనందంగా ఉంది,’  షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు ఋషి.
“ లౌవ్రే మ్యూజియం కు ప్రతిరోజూ వచ్చే 20,000 మంది సందర్శకులలో దాదాపు 80 % మంది మొనాలిసా చిత్రం చూసేందుకు వస్తారని, నేను విన్నాను. ఇది ఎంతవరకు నిజమోకాని, కేవలం ఆ చిత్రాన్నే చూసేందుకు మ్యూజియంకు వచ్చే అటువంటి సందర్శకుల కోసం ఒక ప్రత్యేక ద్వారాన్ని ఏర్పరచిందట. మీవంటి వ్యక్తి ఇక్కడ క్యురేటర్ గా మరికొంతకాలం కొనసాగితే, మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ కి కూడా అటువంటి సదుపాయాలే ఏర్పరచాలేమో, “ స్నిగ్ధను పొగిడే అవకాశాన్ని తీసుకుంటూ అన్నాడు అతను.
అతను అన్నది వెంటనే ఋషికి అర్ధం కాలేదు. అర్ధం కాగానే, ఆమె ముఖంలో చిరునవ్వు మెరిసింది. “ ఇకపై ఇక్కడ ఉండడం కుదరదు, నేను గేలరీ ని విడిచి వెళ్తున్నాను,” బదులిచ్చిందామె. ఆమె ఎక్కడికి వెళ్ళనున్నదో చెప్పకపోవడం వల్ల, ఋషి నిరాశకు గురయ్యాడు. మొదటి పరిచయంలోనే అది అడిగితే బాగోదని అతను భావించాడు.
స్నిగ్ధ మోనాలిసా గురించి ఉదయం మృణాల్ కు చెప్పిన కధ, మళ్ళీ చెప్పదల్చుకోలేదు. మృణాల్ తీరు మొరటుగా అనిపిస్తే, ఆమె ఉద్దేశపూర్వకంగా అలా ఆలోచించకపోయినా, ఋషి సాహచర్యం ఆమెకు బాగా నచ్చింది. వారు కలిసింది అదే మొదటిసారి. అయినా, ఆమెకూ అతన్ని తిరిగి కలవాలనే ఉంది.
ఋషి బైటికి వెళ్ళిపోగానే, స్నిగ్ధ తన గదికి వెనక్కు వెళ్లి, పనిని కొనసాగించింది. పగటిసమయంలో ఆమె ఆన్లైన్ లో ఉండగా, ఆమె ఫేస్బుక్ ఎకౌంటు లో ఋషి పంపిన ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ ను చూసింది. ఆమె నవ్వుకుని, వెంటనే దాన్ని ఆక్సెప్ట్ చేసింది. దానితో ఆమె ఫ్రెండ్స్ సంఖ్య 150 కు చేరుకుంది. ఆమె మళ్ళీ ఒకసారి సరిచూసుకుంది. ఆమెకు తెలిసినంతవరకూ, దీన్ని డంబార్స్ నెంబర్ అంటారు, ఇది సాంఘిక సంబంధాలలో ఒక వ్యక్తి  అనుబంధం కలుపుకోగల గరిష్ట సంఖ్య. మామూలు స్థితిలో మానవ మేధస్సు పరిమితుల్ని దృష్టిలో ఉంచుకుంటే, ఇది బాహాటంగా ఒకవ్యక్తి నడపగలిగిన బాంధవ్యాల సంఖ్య. దీనికంటే ఎక్కువైతే, బంధాల్లో కొన్ని బలవంతపు నిబంధనలు, నియమాలు విధించుకోవాలి.
“ దీనికి అర్ధం బాహాటంగా, ఎటువంటి నిబంధనలు లేకుండా తనకు ఉన్న అనుబంధాల్లో ఋషి, చివరి స్నేహితుడా ?” ఒక ప్రశ్న మౌనంగా ఆమె తుంటరి మనసుగుండా వెళ్ళింది. మిగతా 149 మంది, ఇప్పటివరకు తనకు వ్యక్తిగతంగా తెలిసినవారు. ఫేస్బుక్ లో అనామకుల నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ లను ఆమె అంగీకరించదు.
ఇప్పటివరకూ తనకు ఉన్న ఫ్రెండ్స్ అందరితోనూ మంచి సంబంధాలను కలిగిఉండాలనే ఆమె అనుకుంది. సరైన జోడీ దొరికాకా, తనకున్న సమయాన్నంతా ఆమె అతనికే కేటాయించాలని అనుకుంది.
“లేక, దీనికి అర్ధం ఋషి తనకు సరిజోడు అనా ? ఇది రాంగ్ ఛాయస్ కాదు, ” స్నిగ్ధ తన ఆలోచనలకు తానే నవ్వుకుంటూ తన కంప్యూటర్ షట్ డౌన్ చేసి, గేలరీ నుంచి బైటికి వెళ్ళేటప్పుడు పాటించే నియమాలను పూర్తిచేసింది.
(సశేషం)

No comments:

Post a Comment

Pages