రుద్రాణి రహస్యం – 5
- వేద సూర్య
(జరిగిన కధ : రుద్రాణి కోనలో ఉన్న శక్తిని వశం చేసుకోవాలని చూస్తుంటాడు ఫ్రెడ్రిక్. ఈ ప్రయత్నంలో భాగంగా అతను పంపిన ఇద్దరు విదేశీయులు, కొనలో అకస్మాత్తుగా కనిపించిన వెలుగుతో మాడి మసైపోతారు. ఇది ప్రొజెక్టర్ పై చూసిన ఫ్రెడ్రిక్ విస్తుపోతూ ఉండగా, విలియమ్స్ అతన్ని క్షుద్రపూజలు చేసే అత్రిక వద్దకు తీసుకువెళ్తాడు. ఆ శక్తి అత్రికకు అందక, ఆమె వారిని భారత్ లో ఉన్న తన గురువు తంత్రిణి వద్దకు వెళ్ళమని పంపుతుంది. గండరుడి కోసం పూజలు చెయ్యాలని నిశ్చయించుకుంటుంది తంత్రిణి. రుద్రాణి కోనకు ఆర్కియాలజి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రవల్లికకు బదిలీ అవుతుంది. సృష్టి, అధ్భుత్ కలిసినప్పుడల్లా ప్రమాదాలు తప్పిపోతుంటాయి. ప్రవల్లిక వెళ్తున్న జీప్ పంక్చర్ అయితే, ఆ అడవిలో తిరుగుతున్న దేవ్ రిపేర్ చేస్తాడు. తంత్రిణి హోమానికి ప్రసన్నుడైన గండరుడు రుద్రాణి కోన రహస్యం గురించి చెప్తూ ఉంటాడు. కృష్ణుడి వద్దనుంచి ప్రద్యుమ్నుడికి వచ్చిన శమంతకమణిని రుద్రాణి కోటలో ఉంచి అతడు పూజిస్తూ ఉంటాడు. తరతరాలు మారి అది అప్పుడు కోటను పాలిస్తున్న వీరసింగడి చేతికి వస్తుంది. దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నంలో సింగడి కూతురైన జాబిల్లి, ఆమె ప్రేమికుడు సూరీడులను హతమారుస్తాడు కింకాసురుడు. రుద్రాణి వద్ద బందీగా నిలుస్తాడు. ఇక చదవండి...)
కోనలో రుద్రాణి కోనకు సంబంధించిన విషయాలపై ప్రవల్లిక తన టీంతో రీసెర్చ్ ను మొదలు పెడుతుంది. ప్రవల్లిక టీంకు కోయ గుంపు మర్యాదలు చేస్తుండటం చూసిన యామిని, టెంట్ లో భూతద్దంతో అడవిలో దొరికిన ఒక వస్తువుని చూస్తూ...
“మేడం ఈ కోన గురించి విన్నంత భయంగా ఇక్కడేం కనిపించటం లేదు కదా !” అంది.
“మనకి కనిపించేది అంతా నిజం కాదు, ప్రమాదాన్ని కనిపించనివ్వకుండా ప్రకృతి తన అందంతో మాయ చేస్తుంది” అని చెప్తూ, రుద్రాణి కోన పుస్తకాన్ని చేతులోకి తీసుకుంది ప్రవల్లిక.
మొదటి పేజ్ ను తిప్పగానే వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి. పేజ్ లో ఏం కనిపించక పోవటం చూసి దానికేసి ఆశ్చర్యంగా చూడసాగింది ప్రవల్లిక. ఇంతలో ఒక్కసారిగా ఎక్కడినుంచో సింహం గర్జన వినిపించింది.
యామిని భయంతో ఉలిక్కిపడి, భూతద్దాన్నివదిలేసింది.
“అడవి కదా, అరుపులు కామన్” అని ప్రవల్లిక సింపుల్ గా అంది.
“అరుస్తుంది సింహం కదా మేడం”, ఒణుకుతూ అంది యామిని.
“సరే రేపు చేసుకుందాం, వెళ్లి పడుకో” అని ప్రవల్లిక అనగానే, యామిని పనిని వదిలేసి పరుగున బెడ్ మీద పడుకుని ముసుగు పెట్టేసుకుంది.
యామినిని చూసి నవ్వుకుంటూ, ఆమె వదిలేసిన భూతద్దం తన ముందు ఉన్న పుస్తకం మీద పడటంతో, భూతద్దాన్ని చేతుల్లోకి తీసుకుని పక్కన పెట్టబోతూ, ఏదో కనిపించినట్లు అనిపించటంతో భూతద్దం నుండి పేజిని చూసింది ప్రవల్లిక. పేజ్ లో ఎపిగ్రఫితో రాసి ఉన్నది కనిపించటం చూసి అద్దాన్ని తప్పించి పేజ్ వైపు చూసింది. ఖాళీగా ఉన్న పేజ్ ని చూసి అద్దం నుండి మరలా చూసింది. భూతద్దం మీద పడ్డ కాంతి వల్ల ఏర్పడిన వెలుగులో మాత్రమే రాసింది కనిపించేలా రాసిన తండ్రి ప్రతిభను మనసులోనే మెచ్చుకుంది ఆమె.
“ఇక్కడ ఉన్నది వెలుగులోకి వస్తే ఎందరికో వెలుతురుని ఇస్తుంది. ఇక్కడి సంపద అమ్మ సొంతం అని కొందరి వాదన... మరి అమ్మనే మొక్కుతున్న అడవి బిడ్దల సంగతేంటి? ఈ అడవిని మింగేయాలని కొన్ని గుంట నక్కలు కాచుకుని కూర్చున్నాయి, ఆ నక్కల అంతు చూసేది ఎవరు?” అని పుస్తకంలో ఉన్నది చదువుతుండగా, ఆమెకు ఉన్నట్టుండి గజ్జెల శబ్దాలు వినిపించాయి.
ఆ శబ్దాలకు టెంట్ బయటకు వెళ్ళిన ప్రవల్లిక కనిపిస్తున్న అడవిని చూడసాగింది.
“లచ్చిమీ... అమ్మొచ్చే ఏల అయినాది... సద్దె సల్లారిపోద్ది రా తల్లీ... “ అని పిలుపులు వినిపించి, ఆమె ఆ పిలుపుల వస్తున్న వైపు వెళ్ళింది. అక్కడి చీకటి అడవిలో కమ్ముకుంటున్న వెలుగు వల్ల మరుగైపోతోంది. ప్రవల్లిక కనిపిస్తున్న వెలుగు వైపుకు వెళ్ళసాగింది.
ఆమెను దాటుకుంటూ ఒక పిల్లాడి రూపం వెళ్ళసాగింది, “సిన్నోడా ఆగరా అలుపోత్తాంది”, అంటూ పిల్లాడి వెనకనే వెళుతున్న ఒకామెని చూసి ఆమెనే షాకింగ్ గా చూస్తూ ఉండిపోయింది. కారణం ఆమెకు వేరొక రూపంలో తన ప్రతిబింబమే, కళ్ళ ఎదురుగా కనిపిస్తోంది. హఠాత్తుగా ఒక భయంకర జంతువు వారిపై దాడి చేసింది. అది చూసి ప్రవల్లిక కెవ్వుమని అరిచి మైకంతో పడిపోయింది.
****************
ఫ్రెడ్రిక్, తలకోన కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీలేరు దగ్గరలో తన మకాంని ఏర్పాటు చేసుకున్నాడు. 50 కిలోమీటర్ల వరకు సిగ్నల్స్ రిసీవ్ చేసుకోగలిగిన శాటిలైట్ లను ఏర్పాట్లు చేయమని, అడవికి చుట్టుపక్కల ఏమి జరిగినా తనకు తెలియాలని, తన బృందానికి చెప్పాడు. తంత్రిణి, అత్రికలు వారి అనుచరగణాలతో కలిసి గండరుడుని పునః శక్తి వంతుడిని చేయటానికి హోమాలు చేయసాగారు. గండరుడు చెప్పిన పునర్వసు నక్షత్ర జాతకుడు ఎవరా అని ఫ్రెడ్రిక్ ఆలోచనలో పడ్డాడు.
*****************
కర్ణాటక సరిహద్దులలో ఎర్ర చందనం స్మగ్లింగ్ సామ్రాజ్యానికి రాజుగా పిలవబడే సాల్మన్ రాజు దృష్టి తలకోన అడవులఫై పడింది. సాల్మన్ రాజు అతనికి అడ్డు వచ్చిన వారిని రక్తం వాసన తెలియకూడదని, గంధం చెక్కల మధ్యలోనే అంతం చేస్తాడు. అనుమతులు లేకుండా అతను నరికేసిన చెట్లకు, తలలకు లెక్క లేదు. చెట్టైనా, మనిషైనా అతని కత్తికి పెద్దగా తేడా ఉండదు. తలకోనలో పాగా వేయటానికి కోనకు 120 మైళ్ళ దూరంలో బయలుదేరిన పునర్వసు నక్షత్ర జాతకుడు సాల్మన్ రాజు కు రుద్రాణి కోన రహస్యం గురించి ఏమి తెలియదు కాని ఆ రహస్యం ప్రపంచానికి తెలియటానికి అతను కూడా ఒక కారణం అవ్వాలనేది విధి.
***********
“మేడం! మేడం!” పిలుస్తున్న యామిని పిలుపులకి మెలకువ వచ్చింది ప్రవల్లికకు.
ఆమె కళ్ళు తెరచి చూస్తుంటే, “ఏంటి మేడం అంతలా నిద్రపోయారు?” అని యామిని అడిగింది. ప్రవల్లికకు రాత్రి జరిగింది గుర్తొచ్చి,” నేనిక్కడికి...” అని అడగబోతూ, తనని రాత్రి ఎవరో చేతుల్లో మోసుకొచ్చింది తెలుస్తున్నాకదలలేకపోయినది గుర్తొచ్చి, రుద్రాణి పుస్తకానికి కనిపిస్తున్న ఆకుని చూసి, ఆశ్చర్యంగా చేతుల్లోకి తీసుకుంది.
“ఎంచుకున్న చోటులో పొంచి ఉండే ప్రమాదాలు కూడా ఉంటాయి మిస్ పజిల్,” అని రాసి ఉంది దానిమీద.
అది చదివి, “ అంటే నన్ను రాత్రి తీసుకొచ్చింది ఆ దేవ్ నా? అసలు అతనెవరు? రాత్రి నాకు కనిపించింది ఎవరు? కారులో వస్తున్నపుడు కనిపించినది ఎవరు? నాకే ఎందుకు కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు?” అని ఆలోచిస్తూ ఉండిపోయింది ప్రవల్లిక.
“మేడం! ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు?” అని యామిని అడగటంతో “ఏం లేదు, నేను రెడీ అయి ,వస్తాను. కాసేపట్లో అడవిలోకి వెళదాం”, అని చెప్పి లోనికి వెళ్ళిపోయింది ఆమె.
“సరే మేడం” అని యామిని టెంట్ నుండి బయటకు వెళ్ళింది. ఆకుని పుస్తకంలో ఉంచి, “ఈ దేవ్ ని ఎలా కలవాలి?” అనుకుంటూ బెడ్ పై నుండి లేచింది.
టెంట్ బయటకు వచ్చిన యామినిని,” ఏమంటోంది మేడం?” అడిగాడు తేజ.
“ఏమంటుంది, ఏదైనా అడిగితే ఏమి లేని ఆ పుస్తకాన్నిఅనుమానంగా చూస్తుంది. మనకి కనిపించనిది ఆవిడకేం కనిపిస్తుందో మరి,” అంది యామిని.
“అయినా ఏ అజంతాకో ఎల్లోరాకో వెళ్ళకుండా ఈ ఆకులు అలములు వెతుక్కుంటూ అడవికి రావడమేంటో?” నిరుత్సాహంగా అన్నాడు తేజ. చెట్టు ఆకులు పైకి చేతిలోని కర్రని విసిరాడు. చెట్టు రూపంలో ఉన్న కాలసర్పం, కోపంగా గాలిని ఊదటంతో యెగిరి అవతల పడ్డాడు.
అది చూసి అందరూ నవ్వుతుంటే, “ఏమైంది ఇలా పడిపోయాను,” అనుకుంటూ తత్తర పడుతూ లేచాడు. “వెళదామా?”, అంటూ ప్రవల్లిక రావటంతో, అందరూ తమ తమ మెటీరియల్స్ ని తీసుకుని ప్రవల్లికతో అడవిలోకి బయలుదేరారు.
*****************
బెంగళూరు ఐ ఐ ఎస్ సి లో జరగబోయే యూత్ మీట్ కు అద్భుత్, సృష్టి లు ఇద్దరూ సెలెక్ట్ అయ్యారు. “నువ్వు కూడా ఆ బస్ లో వెళ్ళడం ఎందుకురా, మన కార్ తీసుకెళ్ళు,” అన్నాడు కృష్ణరాజ్.
“డాడ్! నేను వెళ్ళేది యూత్ మీట్ కి, ఫ్రెండ్స్ అందరూ బస్ లో ఎంజాయ్ చేస్తూ వెళుతుంటే నేను ఒక్కడిని కార్ లో వెళితే ఏం బాగుంటుంది?” అడిగాడు అద్భుత్.
“ఓహో నీ సృష్టి బస్ లో వస్తుందా?” అర్ధోక్తిలో సాగదీస్తూ అన్నాడు కృష్ణ రాజ్.
“డాడ్!!!!” అని అద్భుత్ నవ్వుకోవటం చూసి, “ఆ సృష్టి ని మాకు పరిచయం చేసేదేమైనా ఉందా?” అని అడిగాడు.
“మీకేంటో అంత తొందర?” అడుగుతూ రాధిక ఇద్దరి మధ్యకు హారతి తీసుకెళ్ళింది.
“అదేమిటోయ్ కాబోయే కోడలుని చూడాలనుకోవటంలో ఆ మాత్రం తొందర లేకపోతే ఎలా?” అన్నాడు కృష్ణ రాజ్, హారతి కళ్ళకు అద్దుకుంటూ.
“ఏరా నాన్నా, మీ నాన్న చాలా దూరం వెళ్ళిపోతున్నారు, ఇంతకి నువ్వెంత దూరం వెళ్ళావ్?” అని అద్భుత్ కళ్ళకి హారతి అద్దుతూ అడుగుతుంది రాధిక.
“తనతో ఎంత దూరమైనా వెళ్ళిపోవాలనిపిస్తుందమ్మా, “ ఆలోచిస్తూ అన్నాడు అధ్భుట్.
“సారూ, త్వరగా మన భాద్యత పూర్తి చేస్తే మాట దక్కుతుంది మరి,” కొంటెగా అంది రాధిక భర్తతో.
“చిత్తం శ్రీమతి గారూ, ఇకపై అదే మన కర్తవ్యం,” అన్నాడు కృష్ణరాజ్.
(సశేషం...)
No comments:
Post a Comment