ఋణానుబంధం - అచ్చంగా తెలుగు

ఋణానుబంధం

Share This

  ఋణానుబంధం

- సుప్రీత


విఖ్యాత్ ఇప్పటికి నాలుగు  కప్పుల కాఫీ తాగాడు, గీతాంజలికి అతని కంగారు చూసి నవ్వొస్తుంది. ఇవాళ వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో  చెప్తా అన్నాడు, అందుకే ఎలా చెప్పలా ఎమిటా అని ఈ కంగారు అంతా. విఖ్యాత్, గీతాంజలి, ఇద్దరూ ఒకే కంపెని లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ గా  పని చేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. గీతాంజలికి ఎవరు లేరు. తల్లి నాలుగు సంవత్సరాల కింద చనిపోయింది. తండ్రి ఎవరో తనకి తెలియదు. ఎన్ని సార్లు అడిగినా తల్లి చెప్పలేదు. ఫ్రస్తుత్తం హాస్టల్ లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటుంది. చాలా చురుగ్గా అందం గా ఉంటుంది, తన గడ్డం మీద ఉన్న చిన్న పుట్టుమచ్చ తన అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ అందర్ని నవ్విస్తూ ఎంతో ఉల్లాసం గా ఆత్మ విశ్వాసంతో ఉంటుంది. ఆ అల్లరికే, విఖ్యాత్ పడిపోయాడు. ఇప్పుడు వాళ్ళ ప్రేమ గురించి ఇంట్లో చెప్పి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు.
విఖ్యాత్, కౌసల్య రాజశేఖరం ల పెద్ద కొడుకు. చిన్న కొడుకు ఢిల్లీ లో చదువుకుంటున్నాడు. అమ్మా నాన్నలు  ఇద్దరూ పిల్లల్ని ఎంతో క్రమశిక్షణ గా విలువల తో పెంచారు. కౌసల్య, రాజశేఖరం ఇద్దరూ ఎంతో అన్నోన్యం గా ఉంటూ పిల్లలతో స్నేహం గా మెలుగుతారు. విఖ్యాత్ కి తన తల్లితండ్రుల మీద పూర్తి నమ్మకం పెళ్ళికి ఒప్పుకుంటారు అని. కాని, కొంచెం కంగారు గా ఉంది. గీతాంజలిని హాస్టల్ దగ్గర దింపి ఇంటికి బయలుదేరాడు ఎలాగైనా పెళ్ళి విషయం మాట్లాడాలని.  ఇంటికెళ్ళేసరికి తల్లితండ్రులు ఇద్దరూ విఖ్యాత్ తో కలిసి భోజనం చేయటం కోసం ఎదురు చూస్తున్నారు. తను స్నానం చేసి రాగానే తల్లి అందరికీ భోజనం వడ్డించింది. అప్పుడు విఖ్యాత్ తన మనసులో మాట, తను గీతాంజలి ని ప్రేమిస్తున్నానని అమ్మ నాన్నలకి చెప్పాడు. కౌసల్య, రాజశేఖరం విఖ్యాత్ మాటలు వినాగానే అశ్చర్యపోయారు. కౌసల్య వేంటనే గీతాంజలి వివరాలు అన్నీ తెలుసుకుంది.
విఖ్యాత్  తన గదిలోకి వెళ్ళిపోయాక ఇద్దరూ మేడ మీద వెన్నల కింద కుర్చున్నారు . కౌసల్య అంది రాజశేఖరం తో.. ‘మన అబ్బాయి ప్రేమించటం నాకు బాధగా లేదు. మనకి ఆడపిల్లలు లేరు కాబట్టి కూతురైనా, కోడలైనా ఆ అమ్మాయే. ఆ అమ్మాయి కులం, గోత్రం, ఆస్తి  వీటితో మనకి సంబంధం లేదు. తల్లితండ్రులు లేకపోయినా మనం ఆ  అమ్మాయిని కన్న కూతురి లాగా చుసుకుంటాం. కాని కనీసం ఆ అమ్మాయి తండ్రి ఎవరో తెలియదు.. అది ఒక్కటే నా ఆలోచన. మీరెమంటారు?’ అని అడిగింది. రాజశేఖరం కి కూడా అదే ఆలోచన. విఖ్యాత్ ఇష్టపడ్డాడు అంటే ఆ అమ్మాయి ఉత్తమురాలు అన్న నమ్మకం వాళ్ళకి పూర్తిగా ఉంది. పిల్లల పెళ్ళి నిర్ణయం వాళ్ళకే వదిలిపెట్టాలని వాళ్ళు ఎప్పుడో అనుకున్నారు. ఇద్దరూ బాగా ఆలోచించి ఒకసారి ఆ అమ్మాయిని కలిస్తే బాగుంటుంది అనుకున్నారు. తెల్లారగానే వాళ్ళ అభిప్రాయం ఒకసారి గీతాంజలిని కలవాలనుకుంటున్నట్లు చెప్పారు. విఖ్యాత్ ఎంతో సంతోషించాడు. గీతాంజలితో మాట్లాడి, వచ్చే శనివారం గుడి లో పరిచయం చేసే  ప్రోగ్రాం పెట్టాడు.
శనివారం సాయంత్రం అయిదు గంటలకల్లా గుడికొచ్చేసింది గీతాంజలి. నీలం రంగు చీరలో అందంగా ఉంది. విఖ్యాత్ తన తల్లితండ్రులతో వచ్చాడు. దూరం నుంచి గీతాంజలి ని చూసి చేయి ఊపాడు. గీతాంజలి వీళ్ళని చూడగానే దగ్గిరకొచ్చి కౌసల్య, రాజశేఖరం ల కాళ్ళకి  దణ్ణం పెట్టింది. కౌసల్య గీతాంజలి ని చూసింది. నీలం రంగు చీర, పెద్ద కళ్ళు, చక్కటి ముక్కు, పెదవులు మీద చిరునవ్వు, చిన్న గడ్డం ఎంతో  అందంగా ఉంది. తనని చూస్తూ, గడ్డం  మీద చిన్న పుట్టు మచ్చ గమనించింది. ఒక్క క్షణం నివ్వెరబోయింది అవును అదే గడ్డం, అదే మచ్చ. తనని దగ్గరగా చూస్తే, ఆ కళ్ళు, ముక్కూ, అంటే తను.. తను....... ఒకవేళ…… ఆ ఆలోచన రాగానే ఒక్కసారి మనస్సులో సుడిగుండాలు రేగాయి. గీతాంజలి ని తదేకంగా చూస్తూన్న తల్లిని విఖ్యాత్ గట్టిగా తట్టటంతో ఈ లోకం లోకి వచ్చింది. అందరూ కలిసి దైవ దర్శనం చేసుకున్నారు . దర్శనం చేసుకుంటున్నంత సేపు కౌసల్య అన్యమస్తకంగా ఉంది. తన మనస్సు పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఇన్నేళ్ళ నుంచి తమకి సమాధానం దొరకని ప్రశ్నలకి జవాబేనా గీతాంజలి?
అందరూ దర్శనం చేసుకొని అలా పక్కకి కుర్చోగానే, కౌసల్య గీతాంజలి తల నిమిరి తన తల్లితండ్రుల  వివరాలు అడిగింది. గీతాంజలి తన తండ్రి ఎవరో తెలియదు అని, తన తల్లి తనని కష్టపడి ఉద్యోగం చేసి పెంచి చదివించిందని, తను ఆఖరి సంవత్సరం చదువుతుండగా మరణించిందని చెప్పింది. తన తండ్రిని మాత్రం ఎప్పుడూ చూడలేదని, కాని చాలా మంచివాడని తల్లి చెప్పిందని చెప్పింది. తన తల్లి పేరు రాజీ అని విశాఖపట్నంలో పుట్టి పెరిగిందని, తర్వత హైదరాబాదు లో ఉద్యోగం చేసేదని, ఇద్దరూ కలిసి ఉన్న ఫొటో ఒకటి చూపించింది. ఫొటో చూడగానే తన ఊహ నిజమే అని, వెంటనే ఒక నిర్ణయానికి వచ్చింది. ఇంటికెళ్ళి రాజశేఖరం తో అంతా మట్లాడాక ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు.
విఖ్యాత్, గీతాంజలి చాలా ఆనందంగా ఉన్నారు. రేపే వాళ్ళ నిశ్చితార్ధం. అదొక్కటే కాదు, చాలా సంవత్సరాల తర్వాత మామయ్య ప్రకాష్ లండన్ నుంచి ఇండియా వస్తున్నాడు. మామయ్య కి తనంటే ఎంతో ఇష్టం. కారణం తెలియదు కాని, తను పెళ్ళి చెసుకోలేదు. ఎప్పుడో లండన్ వెళ్ళి స్థిరపడిపొయాడు. ఎప్పుడో చిన్నప్పుడు చుసాడు. అప్పుడప్పుడు ఫోను లో మాట్లాడతాడు. ఇప్పుడు తన నిశ్చితార్ధం కోసం వస్తున్నాడు. కౌసల్య నిశ్చితార్ధానికి కావాల్సిన ఎర్పాట్లు అన్నీ చేసేసింది. గీతాంజలి కూడా అన్నీ సిద్ధం చేసుకుంది. తన వైపు నుంచి తాంబూలాలు తీసుకోవటానికి తన స్నేహితురాలు లత వాళ్ళ అమ్మ నాన్నల్ని తీసుకుని వచ్చింది. ప్రకాష్ కూడా అనుకున్న సమయానికే వచ్చేసాడు. అన్నయ్యని చాలా సంవత్సరాల తర్వాత చూడగానే కౌసల్య కళ్ళు చెమర్చాయి.
నిశ్చితార్ధ కార్యక్రమం మొదలైంది. అందరు స్నేహితులు, బంధువులు వచ్చేసారు. లత వాళ్ళ అమ్మ నాన్న లకి ముందే కౌసల్య అంతా చెప్పి ఉంచింది. సరిగ్గా తాంబూలాలు మార్చుకునే టైం కి వాళ్ళు పక్కకి జరిగారు. ప్రకాష్ తాంబూలాలు ఇచ్చాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు. విఖ్యాత్, గీతాంజలి అందరు అశ్చర్యపోయారు. వెంటనే కౌసల్య, గీతాంజలి దగ్గిరకి వచ్చి, మీ నాన్న ఎవరో తెలియదు అన్నావు కదా.. నా అన్నయ్య ప్రకాషే నిన్ను కన్న తండ్రి అని చెప్పింది. పాతిక సంవత్సరాల క్రితం జరిగింది మొత్తం చెప్పసాగింది.
కౌసల్య తల్లి తండ్రులకి, కౌసల్య మరియు ప్రకాష్ ఇద్దరే సంతానం. వాళ్ళ పక్కన ఇంట్లో ఉండేవాళ్ళు రాజీ వాళ్ళు. తనూ, రాజీ కలిసి మెలిసి పెరిగారు, చదువుకున్నారు. రాజీ, చాలా చురుకుగా ఉండేది. అమ్మా నాన్నల గారల పట్టి. రెండు కుటుంబాలు అత్యంత సన్నిహితంగా ఉండేవి. తన కోసం రాజీ తరచుగా వాళ్ళ ఇంటికి వచ్చేది. కౌసల్య డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉండగానే పెళ్ళి అయిపోయి భర్త ఉద్యోగ రీత్యా ఢిల్లీ వెళ్ళిపోయింది. ఇద్దరూ తరచూ ఉత్తరాలు రాసుకునే వాళ్ళు. ఫొను లో మట్లాడుకునేవాళ్ళు. తను వెళ్ళాక రాజీ పి.జి లో చేరిపోయింది. ఆ సమయం లో రాజీ, ప్రకాష్ ఒకర్నొకరు ఇష్టపడ్డారు. ఆ సంగతి ఎప్పుడూ రాజీ కౌసల్య కి చెప్పలేదు. ఏడాది తిరగకుండా తనకి విఖ్యాత్ పుట్టాడు. పురిటి కోసం పుట్టింటికి వచ్చినప్పుడు తనకి వాళ్ళ ప్రేమ విషయం తన తల్లి తండ్రుల ద్వార తెలిసింది. కులాలని, ఆస్తులని, చాలా కారణలు చెప్పి పెళ్ళికి ససేమిర అన్నారు తన అమ్మ నాన్న. తను ఎంత నచ్చచెప్పినా అమ్మనాన్నలు వినలేదు. అన్నయ్య, రాజీ ల బాధ తను చూడలేకపోయింది. తరువాత కొన్ని రోజులకి పసిబిడ్డతో తను ఢిల్లీ వెళ్ళిపోయింది. ఆ తరువత వారం రోజులకి రాజీ ఉత్తరం రాసింది. అదే తన నుంచీ వచ్చే ఆఖరి ఉత్తరం అని ఊహించలేదు. అందులో రాజీ, తను తల్లి కాబోతున్నాననీ పెద్దవాళ్ళు పెళ్ళికి ఒప్పుకోవట్లేదని, తను ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోతున్నానని రాసింది. వెంటనే తను విశాఖపట్నం వెళ్ళింది. అప్పటికే అంతా అయిపొయింది. రాజీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారని తెలిసింది.
ప్రకాష్ అన్నయ్య బాధపడని క్షణం లేదు. అనుక్షణం తను చేసిన తప్పుకి పశ్చాత్తాప పడేవాడు. నాకు రాజీ మనస్తత్వం తెలియటంతో నమ్మకం ఉండేది. తను ఏ తప్పుడు నిర్ణయం తీసుకోదని, తను చాలా ధైర్యవంతురాలని. ఆ తర్వాత తనకోసం చాలా వెతికించాము కానీ దొరకలేదు. ప్రకాష్ అన్నయ్యకి జీవితం మీద విరక్తి కలిగింది. రాజీని మర్చిపోవటం తన వల్ల కాదని.. అసలు పెళ్ళే చేసుకోనని చెప్పి లండన్ వెళ్ళిపోయాడు. తన తల్లి తండ్రులు అనుక్షణం అన్నయ్యని చూసి బాధపడేవారు. అప్పుడే తను నిర్ణయించుకుంది.. తన పిల్లలు ఎవర్ని ఇష్టపడితే వాళ్ళకిచ్చి చేయాలని. తనకి జీవితంలో ఏ లోటు లేదు. ఎప్పుడూ అన్నయ్య బాగుండాలనుకునేది. రాజీ గుర్తొచ్చిన్నపుడల్లా, తమ కుటుంబం చేసిన అన్యాయం గుర్తొచ్చి మనస్సు కలుక్కు మనేది. ఇన్ని సంవత్సరాలకి రాజీ, గీతాంజలి రూపంలో కనిపించింది. చాలా ఆనందం వేసింది. ఇప్పుడు రాజీ తమ మధ్యలేదన్న భాద ఉన్నా, తన అన్నయ్య జీవితానికి ఒక గమ్యం దొరికిందని సంతోషంగా ఉంది. వెంటనే ప్రకాష్ కి ఫొను చేసి చెప్పింది. తనకొక కూతురు ఉంది అని తెలిసిన వెంటనే ఎంతో ఆనందంగా వచ్చాడు.
గీతాంజలి చాలా ఆనందంగా ఉంది.. ఇన్ని సంవత్సరాల భాద ఒక్కసారి ఎగిరిపోయింది. ఇనేళ్ళు తనకి తన తల్లి తప్ప ఎవరు లేరు అనుకుంది. తన తల్లి వెళ్ళిపోయాక ఒంటరిగా మిగిలిపోయింది. నిన్నటివరకూ తను పెళ్ళితో అత్త మావల రూపం లో తల్లి తండ్రులని చుసుకోవాలనుకుంది. కాని ఇవాళ తనకి అందరు ఉన్నారు తను అనాధ కాదు. ప్రకాష్ వచ్చి ఆనందంగా గీతాంజలిని దగ్గిరకి తీసుకున్నాడు. తను కూడా ప్రేమగా నాన్న అని పిలుస్తూనే ఉంది. విఖ్యాత్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. గీతాంజలి తన మామయ్య కూతురు అని తెలియటంతో. తరువాత అందరి సమక్షం లో ఘనంగా నిశ్చితార్దం, ఆ తరువాత నెల రోజులకి వాళ్ళ పెళ్ళి జరిగిపోయాయి.
కౌసల్య, రాజీని తలుచుకొని మనసులో ఆనందంగా అనుకుంది, ‘ఇన్ని సంవత్సరాలుగా నీకు మేము రుణపడిపోయాము అనుకున్నాం రాజీ, ఈ విధంగా మన రుణానుబంధం ముడి పడింది’ అని.
******

No comments:

Post a Comment

Pages