శ్రీశ్రీ 'సిరిసిరిమువ్వ శతకం ' - అచ్చంగా తెలుగు

శ్రీశ్రీ 'సిరిసిరిమువ్వ శతకం '

Share This

శ్రీశ్రీ 'సిరిసిరిమువ్వ శతకం '

- భావరాజు పద్మిని 


వ్యంగ్య ధోరణిలో శ్రీశ్రీ రచించిన సిరి సిరి మువ్వ శతకం యాభై కందాలతో కూడి, సామాన్య హృదయాలను దోచు కుంటుంది. సిరి అంటే సంపద. సమాసాల్లోనో, సామెతల్లోనో, జాతీయాల్లోనో మిగిలిఉంది. సిరిసంపదలు , నడమంత్ర పు సిరి మొదలైన విధంగా శతకాలలో మకుటం ఉంటుంది కాబట్టి శ్రీశ్రీ తన పేరు మీదనే ‘సిరిసిరి మువ్వ’ అని ప్రయోగించాడు.
కలలో శ్రీశ్రీకి చక్రపాణిగారు కలలోకనిపించి ,ఒకశతకం రాసి తనకంకితకీయమని అడిగాడట .శతకకన్యను పుచ్చుకొని కన్యాశుల్కంగా ఒక సిగరెట్టిస్తానన్నాడట .
నీకో సిగరెట్టిస్తా
నాకో కావ్యమ్ము రాసి నయముగనిమ్మా
త్రైకాల్య స్థాయిగ నీ
శ్రీకావ్యము వరలునోయి సిరిసిరి బాయీ ! 
సిరిసిరి మువ్వా ,సిరిసిరి మురళీ ,సిరిసిరి మౌనీ ,సిరిసిరి బాయీ ,సిరిసిరి గాగూ ,సిరిసిరి నేస్తం ,సిరిసిరి రావూ అనేవి మకుట స్థానంలో కనిపిస్తాయి (మకుట నియమోల్లంఘనం + మణిప్రవాళం అనే ప్రక్రియలకు ఆద్యుడు శ్రీశ్రీ.)
నాలాగ కంద బంధ
జ్వాలా జాలాగ్ర సంవసత్‌ సద్గీతా
లాలాపించే కవితా శ్రీ
లోలుడు నహినహీతి సిరి సిరి మువ్వా!
నాలాగ కందాలు రాయగలిగిన వాళ్ళు సాహిత్యంలో అరుదు సుమా అని కూడా అనేశా డాయిన.
శుష్క చ్ఛాందస కవి జన
ముష్కరులకు సొంటి పిక్క, మూర మ్మునకా
యుష్కర్మము, తదుపరి శో
చిష్కే శున కప్పగింత సిరి సిరి మువ్వా!
ఉత్తుత్తి కవులకు తొడ పాశం పెడతాను, గుండు గీయిస్తాను... నిప్పుల్లోత్రోసేస్తాను... అక్కడుంది అసలు చమత్కారం! సాదా సీదా కవులను నిప్పుల్లో తోసేస్తాను జాగ్రత్త! అనడంలో ఉంది మహా కవి ధిక్కారం!
“కందం వ్రాసినవాడే కవి, పందిని చంపినవాడే బంటు” అని ఒక తెలుగు సామెత. దాన్నే ఇంకెవరో కసిగా “పందిని చంపినవాడే కందం వ్రాయాలి” అని మార్చారు. కందం వ్రాయక పోతే పోయారు గానీ దానికోసం పాపం పందిని చంపడం ఎందుకో మరి! ఈ భావం పలికేలా వ్రాసిన శ్రీశ్రీ పద్యం...
“పందిని చంపినవాడే
కందం రాయాల” టన్న కవి సూక్తికి నా
చందా యిస్తానా? రా
సేందు కయో షరతులేల ? సిరిసిరి మువ్వా!
'జరూక్ శాస్త్రి ' గారిపై వ్రాసిన పద్యమట , చదవండి...
రుక్కునకు, ఆగ్రహము గల
ము క్కునకున్‌, తెగవాగెడి
డొక్కునకున్‌ వాణీ ముఖరిత వీణా
భాక్కునకున్‌ సాటి లేని డబుడుక్కునకున్‌!
భావ కవిత్వంపై శ్రీశ్రీ విసిరిన వ్యంగ్య భాణం సిరిసిరి మువ్వ పద్యాలలోనే ఉంది-
“ఉగ్గేల తాగుబోతుకు?
ముగ్గేల తాజ్ మహలు మునివాకిటిలో?
విగ్గేల కృష్ణ శాస్త్రికి?
సిగ్గేల భావకవికి?సిరిసిరిమువ్వా!”
నేటి మనుషుల తీరుపై సంధించిన వ్యంగ్యాస్త్రం...
ఈ రోజులలో ఎవడికి
నోరుంటే వాడె రాజు, నూరుచు మిరియాల్
కారాలు, తెగ బుకాయి
స్తే రాజ్యా లేలవచ్చు సిరిసిరి మువ్వా!
హాస్య ధోరణిలో సాగిన క్రింది పద్యాలు చూడండి...
కోయకుమీ సొరకాయలు
వ్రాయకుమీ నవలలని అవాకు చెవాకుల్
డాయకుమీ అరవ ఫిలిం
చెయకుమీ చేబదుళ్ళు సిరిసిరి మువ్వా !
బారెట్లా అయితే సాం
బారెట్లా చెయ్యగలడు ?భార్యయెదుట తా
నోరెట్లా మెదిలించును
చీరెట్లా బేరమాడు ? సిరిసిరి మువ్వా !
సిరిసిరిమువ్వ శతకాన్ని పరిశీలిస్తే అభ్యుదయభావాలు,ఆడునిక విషయాలు కనిపిస్తున్నా, రచనమాత్రం ప్రాచినపంథాలోనేసాగింది. చాటువులలోభాగంగా చివర ఫలశృతినికూడా చెప్పాడు ...
ఈశతకం యెవరైనా 
చూసి,చదివి,వ్రాసి ,పాడి .సొగసిన సిగరెట్ 
వాసనలకు కొదవుండదు 
శ్రీశు కరుణ బలిమివలన సిరిసిరి మువ్వా !
అంతా చదివారు కదా... ఇక సిగరెట్ వాసనా ప్రాప్తిరస్తు!
 **************

No comments:

Post a Comment

Pages