శ్రీధరమాధురి – 17 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి – 17

Share This

శ్రీధరమాధురి – 17

( పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు...)

మీరు ఎవరికైనా మంచిని చేసేటప్పుడు, ఎవరు చేసారో అది ఆ వ్యక్తికి తెలియనివ్వకుండా చూసుకుని, చాలా సాధారణంగా చెయ్యండి. పిల్లలకు నచ్చిన బొమ్మలు పెద్దవారు కొని, అది పిల్లలే చూసి తీసుకోగలిగిన చోట చెప్పకుండా పెట్టినట్లు, ఒకరికి ఉపకారం చేసేటప్పుడు మీ పేరు తెలియనివ్వకండి. ఒకవేళ వారికి మంచి చేసింది మీరే అని తెలిసిపోయినా, ఏమీ తెలియనట్లే నటించండి. దేనికీ మనం కర్తలం కాదు కదా, దైవమే కర్త.

దైవం ఎంతో అద్భుతమైనవారు...
ఆయన మేఘాల్ని విచ్చిన్నం చేస్తే  వానొస్తుంది...
ఆయన మట్టిని విచ్చిన్నం చేస్తే పంటలు పండుతాయి...
ఆయన పంటల్ని విచ్చిన్నం చేస్తే గింజలు వస్తాయి.
ఆయన గింజల్ని విచ్చిన్నం చేస్తే ఆహారం వస్తుంది...
కాబట్టి, మీరు మనసు విరిగి ఉన్నట్లయితే, దానికి అర్ధం ఆయన మిమ్మల్ని ఏదో గొప్ప పనికి ఉపయోగించబోతున్నారని...
అంతా దైవానుగ్రహం, దయ.

మీరు ఏదైనా మంచి పని చెయ్యాలని అనుకున్నప్పుడు, ప్రతికూల శక్తులు మిమ్మల్ని ఆపేందుకు . కాని, మీరు పట్టు విడవకుండా ప్రయత్నిస్తే, చెడుని మంచి అధిగమించి, మీరు అనుకున్నది సజావుగా పూర్తవుతుంది.
    
మీరు ఇంజనీర్ అయినా , డాక్టర్ అయినా , ఆర్కిటెక్ట్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, మేనేజర్, ఎవరైనా సరే... పాడేందుకు కాస్త సమయం, కవిత్వానికి కాస్త సమయం, బొమ్మలు వేసేందుకు కాస్త సమయం, నాట్యం చేసేందుకు కాస్త సమయం కేటాయించుకోండి. మీరేదో గొప్పగా పాడేవారు, కవి, నర్తకుడు కానక్కర్లేదు. ఇది దైవానికి, మీకూ మధ్య ఒక ఆనందమయమైన క్షణం అంతే. ప్రత్యేకించి మీకూ, దైవానికి మధ్యనే ఉండే క్షణం. ఆయన దాన్ని ఆస్వాదిస్తారని, ప్రేమిస్తారని మీరు తెలుసుకుంటారు. ఒకసారి మీ ఆఫీస్ నుంచి, క్లినిక్ నుంచి లేక పనిచేసే చోటు నుంచి బయట పడ్డాకా, మీ ఆఫీస్ లో ఉన్న సమస్యలనుటెన్షన్ ని గురించి ఇంట్లో మాట్లాడకండి. ఆఫీస్ ను ఇంటికి, ఇంటిని ఆఫీస్ కు తీసుకురాకండి. నిజానికి, నేడు అంతా ‘వర్క్ ఫ్రొం హోం’ అంటూ పనిచేస్తున్నారు. ఇది అనర్ధాలకు ఆరంభం వంటిది. మిమ్మల్ని చూసి జాలి పడుతున్నాను. మీకోసం, మీ నిజస్థితి అయిన ‘దైవం’ కోసం కాస్త సమయాన్ని కేటాయించండి. ఆయనతో మాట్లాడండి. మీలోని ప్రతి ఒక్కరితో మాట్లాడడం ఆయన ఎంతగానో ఇష్టపడతారు. దైవంతో ఆ అమూల్యమైన క్షణాల్ని కోల్పోకండి. అంతా దైవానుగ్రహం.

మీ జీవితంలోని రోజులు ఆకాశంలోని మబ్బుల్లా వెళ్ళిపోతుంటాయి. అందుకే, మీరు ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తూ, మంచిని చేస్తూ ఉండండి.

దైవాన్ని మీ కేంద్రస్థానంలో, అంటే, హృదయంలో ఉంచండి. ఆయన ఎంతటి దయామయులంటే, మీలో భయమన్నది ఏ కోశానా లేకుండా చేస్తారు. మీరు భయపడినట్లయితే, దైవంపట్ల మీకున్న అచంచలమైన విశ్వాసం ఎక్కడో చంచలమవుతోంది అని అర్ధం.

మీరు ఏ పనిని చేసినా, దాన్ని ప్రార్ధనగా మార్చుకోండి. అది ఆఫీస్ లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేక వేరే చోట కావచ్చు, ఏది చేసినా, దాన్ని పూర్తి అంకితభావంతో, కర్తృత్వం వహించకుండా చెయ్యండి. కర్తృత్వం తెలివితేటల నుంచి వస్తే, కర్తృత్వం వహించకపోవడం అనేది హృదయం నుంచి వస్తుంది. అలా చేసిన ప్రార్ధన(పని) కొన్నాళ్ళకి ధ్యానంగా పరిణమిస్తుంది. చాలాసార్లు మీరు నిర్వికల్ప సమాధిని అనుభూతి చెందుతారు, ఆలోచనలు లేని శూన్యాన్ని చూస్తూ, జాగృత స్థితిలో స్వచ్చమైన బ్రహ్మానందాన్ని పొందుతారు. అంతా దైవానుగ్రహం.

నా పరంగా ప్రార్ధిస్తూ ధ్యానించినా, ధ్యానిస్తూ ప్రార్ధించినా ఒకటే. ఒకరు తమ అహాన్ని మరచి, విశ్వ చైతన్యంతో మిళితం కాగలిగారా, లేదా అన్నదే ఇక్కడ ముఖ్యం. హృదయంలో ఉన్న దైవంతో ఆటపాటల్లో మునిగి, తమను తాము కరిగించుకోగలగాలి. ఒకవేళ మనం ఇలా చెయ్యలేకపోతే, ప్రార్ధన, ధ్యానం రెండూ శుద్ధ దండగ. మీరు ఎవరినో మోసం చెయ్యట్లేదు, ఇక్కడ జాలిపడాల్సింది ఏమిటంటే, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. కొంతకాలానికి, మీరు నిరాశకు గురై, నిరర్ధకంగా మారతారు. దైవం యొక్క గీతాన్ని వింటూ, అలౌకిక ఆనందంతో ఆయనతో నాట్యం చెయ్యాలంటే, వారు ఆయన్ను ప్రార్ధించేందుకు, ధ్యానించేందుకు ఆయన దీవెనలు కావాలి. అంతా దైవానుగ్రహం.

 మనసారా జీవించండి... అలా అక్కడే ఉండండి, మీ కేంద్రమైన హృదయంతో ఆలోచించండి. నియంత్రించవలసినది ఏమీ లేదు, నిర్వహించవలసినది ఏమీ లేదు, పోటీ పడాల్సినది ఏమీ లేదు. అలా ఉండటమే ! అసలు సమస్య ఎప్పుడు మొదలౌతుంది అంటే, మీరు నియంత్రించడం, నిర్వహించడం, పోటీపడటం మొదలుపెట్టాకే. అప్పుడు మీరు కేంద్రం నుంచి దూరంగా విసిరేయబడి, కక్ష్యలో తిరుగుతూ ఉంటారు. అంతా దైవానుగ్రహం.

నిర్గుణ స్వరూపాయ నమః
దైవం గుణాలకు అతీతమైనవారు. ఇందులోని అంతరార్ధం, మీ మేధస్సు ఆయన్ను గుర్తించలేదు. బుద్ధి కేవలం గుణాలు ఉన్నవాటినే గుర్తిస్తుంది. అది గుణరహితమైన వాటిని గ్రహించలేదు. కాబట్టి, మనం బుద్ధితో ఆలోచిస్తాం కనుక, దీనికి అతీతమైన దైవాన్ని గ్రహించలేము. అందుకే ఒకరు మేధస్సును అధిగమించి ప్రయాణించాలి. గుణాలతో జీవిస్తూనే నిర్గుణ స్థితికి చేరుకోవాలి. అప్పుడే సర్వోత్క్రుష్ట స్థితి ప్రాప్తిస్తుంది.  బుద్ధి నుంచి తప్పుకు తిరుగుతూ నిర్గుణ స్థితికి ఎవరైనా చేరుకూవాలని ప్రయత్నిస్తే,  శ్రేష్టత ప్రాప్తించదు. శ్రేష్టత తప్పించుకు పోవడం ద్వారా సాధించలేము, దానితో బ్రతికే ధైర్యం ఉండడం ద్వారా ప్రాప్తిస్తుంది. బుద్ధి(తెలివితేటలు ) జారిపోయిన రోజున, మనకు దైవం యొక్క నిర్గుణ స్వరూపం గోచరిస్తుంది. అంతా దైవానుగ్రహం, ఆనందంగా ఉండండి.

   మాతృ హస్తేన భోజనం...
భార్యా హస్తేన తాంబూలం...
అమ్మ మాతృత్వానికి ప్రతీక. సాక్షాత్ అన్నపూర్ణ. ఆమె బిడ్డను గురించి అత్యంత శ్రద్ధ వహిస్తుంది. బిడ్డకు అన్నం అమ్మే తినిపించాలి. అమ్మ చేత్తో అన్నం పెడితే, అది బిడ్డను ఎన్నో విధాలుగా రక్షిస్తుంది.... దృష్టి దోషం వంటి వాటి నుంచి కూడా. అంతేకాక, అమ్మచేతి భోజనం బిడ్డ మనసును తేలిక పరచి, మంచి వ్యక్తిగా ఎదిగేలా చేస్తుంది. అందుకే మాతృ హస్తేన భోజనం ... అన్నారు.
బిడ్డ పెరిగి పెద్దవాడు అవుతాడు. అన్ని చోట్లా ఆహారం తీసుకుంటాడు. ఇంట్లో, ఆఫీస్ లో, హోటల్ లో, ఫ్రెండ్స్ ఇళ్ళలో, ఇలా... అనేక చోట్ల తింటాడు. ఇంట్లో తిన్నప్పుడు భార్యో, తల్లో వండి పెడతారు. కాని, బయట తిన్నప్పుడు అది సరిగ్గా వండకపోయే అవకాశం ఉంది. వడ్డించే వ్యక్తి మనసులో ఏవో ప్రతికూల ఆలోచనలు ఉండవచ్చు, అవి ఆహారం ద్వారా తినేవారి పొట్టలోకి దారి వెతుక్కుని, దృష్టి దోషానికి దారి తీస్తాయి. అవి ఆ వ్యక్తిపై ప్రభావం చూపుతాయి. అందుకే, భార్య తన ప్రేమనంతా కలబోసి, తమలపాకులు, వక్కా, సున్నం వేసిన తాంబూలం ఇవ్వాలి. అది ఆహారం ద్వారా కలిగిన చెడు ఫలితాలను తొలగిస్తుంది. అందుకే... భార్యా హస్తేన తాంబూలం అన్నారు.

*******

No comments:

Post a Comment

Pages