వెనక్కు తిరిగి చూస్తే....
- శ్రీపాద స్వాతి
ఎంత వద్దనుకున్నా ఎంత వద్దని అన్నా
ఎప్పటికప్పుడు వెనక్కు తిరిగి చూడాలనే అనిపిస్తుంది.
చరిత్రో, గతమో,
చేతులు జోడించిన మంచితనమో
చెక్కు చెదరని పురాగమనమో
వలయాలు వలయాలుగా సర్దుకున్న
ఆది మానవ తిరోగమనమో
ఎరవేసి లాగినట్టు
బరువేదో భుజాల మీద వాలి వెనక్కు గు౦జినట్టు
ఓపలేని క్షణమేదో వెనకాల వెనకాలే
రొదపెడుతున్నట్టు
వెనక్కు తిరిగి చూడాలనే ఉ౦టు౦ది
తీరా వెనక్కు తిరిగాక ...
అమా౦త౦ నేలను తాకేలా ఒ౦గి
కొమ్మ కొమ్మనా ఆశలను
మొగ్గలు మొగ్గలుగా అమర్చుతూ
బాల్యపు నీలాకాశం ‘
క్షణం చిత్తరువులై చిరుజల్లులై
అటూ ఇటూ పరుగులు తీసే
తెల్ల మేఘాల కుందేలు పిల్లల మధ్య
సజీవంగా యవ్వన శకలాలు
రాత్రికి రాత్రి విరిసి కురిసిన
పారిజాతాలై రోజులు వారాలూ నెలలూ
దాటుకుంటూ దాచుకుంటూ
ఈ చివర
ఒక్కసారి వెనక్కు తిరిగామా
శిఖరాగ్రం అంచున
జారిన ఊహలు గతం అగాధాల్లోకి
అయినా వెనక్కు ఇరుగుతూనే ఉంటాం
మళ్ళీ మళ్ళీ ఎగబ్రాకి
ఇప్పటి అంచులు చేరుతూనే ఉంటాం.
No comments:
Post a Comment