విచ్చుకుంటున్న మొగ్గలు
- తిమ్మన సుజాత
కొత్త బంగారు లోకం లో స్వేచ్చా వాయువులు పీలుస్తూ విహంగమై ఎగురుతూ... వెన్నెల మెట్లు ఎక్కుతూ.... తారలతో ఆడుకుంటున్న భావన.
రెండు సంవత్సరాల ఇంటర్, ఎమ్సెట్, ఐ . ఐ .టి . కోచింగ్ లలో రోజుకు 18 గంటలు చదువుతూ, ఎప్పుడూ క్లాసులో ఫష్ట్ వస్తూ, ఇదే జీవితం అని అమ్మనాన్నల అనునయపు మాటలను అకళింపు చేసుకున్న ముక్కు పచ్చలారని పసివాడు అయిన సాత్విక్ మనసులో మొట్ట మొదటి సారిగా ఇంజనీరింగ్ కాలెజీలో అడుగు పెట్టినప్పుడు కలిగిన భావన ఇది.
అప్పుడే విచ్చుకుంటున్న రంగు రంగుల పూలవంటి సుకుమారపు అమ్మాయిలను కళ్ళింత చేసుకుని చూస్తూ ఉండిపోయాడు కాసేపు. అలా మొదలయిన మొదటి రోజు కాలేజి జీవితం ,ప్రతీ రోజు ఒక కొత్త రోజుగా అనిపించసాగింది.
ఆరు నెలలు గడిచిపోయాయి. సుమ, శ్రీనివాస్ లు ఎంతో ఆనందపడుతున్నారు తమ ఒక్కగానొక్క కొడుకు
పెద్దవాడవుతూ ప్రయోజకుడవుతున్నాడని. మధ్య తరగతి జీవితం, జీతం. మరి ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉంటేనే ఈ పట్టణంలో డబ్బుకు వెతుక్కోకుండా బ్రతకగలుగుతారు .
ప్రభుత్వరంగ బ్యాంక్ లో శ్రీనివాస్ కాషియర్ గా వర్క్ చేస్తున్నారు. ఓ ప్రయివేటు కంపేనిలో తను కుడా పని చేస్తూ, భర్త కి చేదోడు-వాదోడుగా ఉంటుంది సుమ. అవసరాలకు మించి ఖర్చులు చేయకుండా తమ పూర్తి శ్రద్దను కొడుకు భవిష్యత్తు మీదే పెడుతూ, వాడి ఆలనా పాలనలో ఆనందాన్ని వెతుక్కుంటూ అన్యోన్యమయిన జీవితం గడుపుతున్నారు.
***************
"ఇంకెంత సుమా ! చూస్తూ ఉండగానే ఆరు నెలలు గడిచాయి. మరో మూడున్నర సంవత్సరాలు గడిస్తే, మన సాత్విక్కి మంచి ఉద్యోగం వస్తుంది, మన బాధ్యత కొంత తగ్గుతుంది.” ఎనిమిది తరువాత సిటీ బస్సులలో పోరాటం సాగించి
అలిసిపోయి వచ్చిన భార్యకి వేడి వేడి కాఫినందిస్తూ అనునయించాడు శ్రీనివాస్.
" అవునమ్మా ! నాకు ఉద్యోగం రాగానే, ముందు నీవు రిజైన్ చేసెయ్యాలి మరీ ఇక ఇలా కష్టపడకూడదు." అంటూ గారాలు పోతూ ఆర్డర్ జారీ చేసాడు సాత్విక్.
ఇద్దర్నీ మార్చి మార్చి మురిపెంగా చూస్తూ కాఫీ సిప్ చేస్తూ, ముసి ముసినవ్వులతోనే సమాధానం చెప్పింది సుమ, ఒకింత గర్వంతో.
షార్ట టర్మ్ పరీక్షలయి సెలవులు ఇచ్చారు సాత్విక్ కి. అమ్మానాన్న ఇద్దరూ ఉద్యోగాలని వెళ్ళిపోయాక ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. చదువుకునేది ఎక్కువగా లేక పోవటం చేత ఖాళీ సమయం దొరుకుంతుంది. ఇంటర్ నెట్ లో చాటింగ్ చేస్తూ సమయం గడుపుతున్నాడు. వయసు చేస్తున్న అల్లరులు, స్నేహితుల చిలిపి మాటలు, సీతాకోక చిలకల్లాంటి అందమయిన అమ్మాయిలు, వారి మొలక నవ్వులు, ఎదలో ఏదో గిలిగింతలు అలజడి చెయ్యసాగాయి.
**************
"అమ్మ గారు! మా అత్త వచ్చింది. ఆమెకు పెయ్ బాగలేదు. ఆమెను జర చూస్కొని నేను మెల్లగ వస్తా. చినబాబు ఇంట్లనే ఉంటాడుగదా...!" బతిమిలాడుతూ చెప్తున్న పనిమనిషి బద్రి మాటలకి వంట పనిలో హడావిడి పడుతున్న సుమ బైటికి వచ్చి,
“సరి...సరే...! నాగాపెట్టకు మరి. తెలుసు కదా! నాకు చాలా కష్టమవుతది.”అర్డరేస్తూనే చెప్పింది సుమ.
"లేదమ్మా! నాకు తెల్దా...తప్పకొస్తా.." అని చెప్పి వెళ్ళిపోయింది బద్రి.
"నాన్నా సాత్వి! బద్రి వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా చూస్తుండు. పనిలో కటింగ్లు చేసేస్తుందిరా..."
"అలాగే మమ్మీ! నువ్వేమీ వర్రీ అవ్వకు...."
"నాన్నా.. మరి నే వెళుతున్నా! జాగ్రత్త !" కదలని మనసును పట్టుకుపోతూ అడుగు బయట పెట్టింది సుమ.
కొడుకు గడ్డాలవాడయినా...ఇంకా అడ్డాలబిడ్డడే కదామరి, ప్రతి తల్లికి.
పదకొండు తరువాత తన అయిదేళ్ళ కూతురు చిట్టిని తీసుకొని వచ్చింది బద్రి .
చిట్టి తెల్లగా బొద్దుగా, ఎంతో ముద్దుగా ఉంటుంది. సాత్విక్ కి ఆ పిల్లంటే చాలా ఇష్టం .
వస్తూనే..."అన్నా!" అంటూ సాత్విక్ పక్కన చేరింది.
"స్కూల్ కి పోలేదా చిట్టీ!" అనడిగాడు.
“లేదన్నా! సెలవులు " ముద్దగా జవాబు చెప్పింది చిట్టి.
"ఏంటన్నా... ఇవన్నీ..." లాప్టాప్ లో తొంగి చూస్తూ అడిగింది.
"నీకు పోయంస్ పెట్టనా ..."అంటూ రకరకాల పిల్లల పాటలు పెట్టాడు.
వాటినే చూస్తూ ఒకటే ముచ్చట పడిపోతూ, పడీ..పడీ నవ్వుతుంది చిట్టి.
ఇలా నాలుగు రోజులూ వస్తూనే ఉంది చిట్టి వాళమ్మతో పాటు. చనువుగా అన్నాఅన్నా ! అంటూ మీద పడుతూ, చిన్నపిల్ల చేసే అల్లరంతా చేస్తుంది.
బద్రి చిన్న పిల్లే కదా అని వెయ్యవలసిన చోట సరి అయిన బట్టలు వెయ్యదు దానికి. ప్రయత్న పూర్వకంకాని చూపులయినాఅ రిచేతులు చెమటలు పట్టించేస్తున్నాయి సాత్విక్ కి... "ఆడపిల్ల" అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని అమాయకత్వం సాత్విక్ ది.
పనంతా అయిన తరువాత " మా అత్తని ధవకానకు తీసుకొని పోవాల ...చినబాబూ! చిట్టి ఓ గంట సేపు ఈడనే ఉండనియ్యనా..... లేకుంటే..బయిట తిరుగుతావుంటది..బాబూ...ఆడికి తీస్కపోతే మంచిదిగాదు”...బతిమిలాడుతూ చెప్పి, .ఆ పిల్లని అక్కడే వదిలివెళ్ళింది బద్రి.
గంటని రెండు గంటల పైనే అయ్యింది. అప్పుడొచ్చింది బద్రి .
తల్లిని చూస్తూనే..కాళ్ళకు చుట్టూకొనిపోయింది వెక్కి వెక్కి ఏడుస్తూ....చిట్టి .
"ఏమయిందే..! దవకాన్ల చానామంది ఉండ్రు...ఊరుకో..వచ్చినగా..." ఆలస్యంగా వచ్చినందుకు ఏడుస్తుందనుకుని బుజ్జగిస్తూ ఎత్తుకొని పోయింది బద్రి .
********
మాటపలుకు లేక అచేతనావస్థలో సాత్విక్ .
"ఏం చేసాన్నేను...? అసలు నాకేమయింది...? అసలు...చిట్టి! చిట్టి! దాన్ని అలా చేతుల్లోకి తీసుకోవచ్చా....! అలా బుగ్గమీద గట్టిగా ముద్దు పెట్టుకోవచ్చా...! పిచ్చి పిల్ల ఎంత బయపడిపోయింది... నా వంట్లో ఏమవుతుంది...? ఎందుకు... ఎందుకు... ఇలా... అలా... ఒళ్ళంతా తడిమేసాను...!"
గుండె కొట్టుకు పోతుంది అతి వేగంగా.... తను ఏమయిపోతున్నాడో తెలుసుకోలేని తనంలో పిచ్చివాడిలా తనలొతనే
మాట్లాడుకుంటూ ఉండిపోయాడు సాత్విక్.
************
కాలింగ్ బెల్ చప్పుడు విని వెళ్లి తలుపు తీసాడు సాత్విక్. ఎదురుగా మావయ్య శ్రీహరి... హరిని చూడగానే సాత్విక్ మొహంలో ఆనందం తిరిగివచ్చింది. వారిద్దరికీ వయసులో ఎనిమిదేళ్ళు తేడా. అందుకే సాత్విక్ తో ఒక స్నేహితునిలా ఉంటాడు శ్రీహరి. ఆ చనువుతో ఏదైనా మనసులో ఉన్నది అతనితో పంచుకోగలడు సాత్విక్.
“ఏంట్రా సాత్వి ! అలా ఉన్నావ్ ! హాలీడేస్ ఎంజాయ్ చెయ్యకుండా" అంటూ లోపలికి వచ్చాడు శ్రీహరి. తన ధోరణిలోమవునంగా ఉండిపోయాడు పేలవంగా ఓ నవ్వు నవ్వి సాత్విక్.
“ఒంట్లో బాగా లేదా ! చలి జ్వరం వచ్చినాల్రోజులు లంకణాలు చెసినట్టున్నవ్ ... "దగ్గరగా వచ్చి, నుదురుకు చేయి తాకింఛి చూసాడు శ్రీహరి.
"అబ్బె.. అదే మీ లేదు మావయ్యా ... "తడబడ్డాడు సాత్విక్.
"ఈవినింగ్ షో కెళదాము సాత్వి... టికెట్స్ బుక్ చేశాను. మన గురువుగారి సినిమా రిలీజ్ అయింది కదా పర్మిషన్ తీసుకొని వచ్చా ... అందుకే ...." టేబుల్ మీది ఆపిల్ తీసుకొని ముక్కలు కోస్తూ అడిగాడు సాత్విక్ పక్కన కూర్చుంటూ.
కాస్త రిలీఫ్ గా ఉంటుందనిపించింది సాత్విక్ కి " అలాగే మావయ్యా " అన్నాడు సాత్విక్ .
మనసులో మధన పడుతూనే.... “ఏమయితే అయిందిలే, మావయ్యనే అడుగుతా ఇలా ఎందుకవుతుందో, అనుకుంటూ ,మెల్లగా ఈ విషయం చెప్పాడు సాత్విక్. ఒక్క క్షణం స్థాణువై పోయాడు శ్రీహరి .
వెంటనే తేరుకొని " ముద్దు వరకేనా .. ఇంకా .... ఏమైనా ..... " సాత్విక్ చేతిని తన చేతిలోకి తీసుకొని అనునయంగా నొక్కుతూ అడిగాడు శ్రీహరి .
"ఇంకా ఏమైనా అంటే .... ? " ప్రశ్నార్దకంగా అమాయకపు మొహంతో అడుగుతున్న సాత్విక్ కి జవాబు చెప్పలేని స్థితిలో, " అరె ! టైం అవుతుంది... ఇక లే ... త్వరగా ఫ్రష్ అవు ... ముందే ట్రాఫిక్ ఎక్కువ ఈ రూట్ లో..” అంటూ తొందర పెట్టాడు శ్రీహరి.
ఇక మరీ అడిగితే బాగుండదని తన తడబాట్లను దాచుకుంటూ, రెడీ అవడానికి లేచాడు సాత్విక్.
ఆ సమయానికి ఆ విషయం అక్కడ వదిలేసినా, ఆలోచనల ముసురులో నుంచి తేరుకునే సమయానికి ," అంకుల్ కోదండరాం” దగ్గర కవున్సిలింగ్ ఇప్పించాలి సాత్విక్ కి అని ఒక గట్టి నిర్ణయానికి వచ్చాడు శ్రీహరి.
***********
“కోదండరాం గారు మంచి వక్త ....సైక్రియాటిష్ట్ ...పెర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు నిర్వహిస్తూ, యువతరంలో ఉత్సాహాన్ని, సమయస్పూర్తినీ, కలుపుగొలుతనాన్ని (కమ్యునికెషన్) మానసిక వికాసాన్ని, పెంపొందించుకునేందుకు దోహదంచేస్తున్నారు. పరిస్థితి చెయ్యిదాటకముందే ఒక్కసారి ఆయనవద్దకు వెళ్దాం సాత్వి... “ అనునయంగా చెప్పి, సాత్విక్ ను ఒప్పించాడు శ్రీహరి.
**********
అపాయింట్ మెంట్ లేకిండానే వెళ్ళగలిగే చనువు ఉంది కోదండరాం గారి దగ్గర శ్రీహరికి. వాళ్ళ అబ్బాయి,తను ఒకే స్కూల్, ఒకే క్లాస్ లో చదివారు. ఇద్దరు మంచి మిత్రులు కుడా ! వాళ్ళబ్బాయి ఇప్పుడు యు.యస్. లో ఉన్నాడు.
" నమస్తే ... ! అంకుల్ ! " అంటూ లోనికి వెళ్ళాడు శ్రీహరి.
"హలో హరీ, నమస్తే..! చాలా రోజులకు కనిపించావు.ఎలా ఉన్నావు? అంతా కులాసాయేనా ? "అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కోదండరాం గారు. ఎవరినైనా నవ్వుతూ పలకరించే స్వభావం వారిది . ఆయన పలుకులు వింటూఉంటే మనసులో ఏ విధమైన వేదనలయినా ఇట్టే తొలగిపోతాయి. అది వారి మృదు మధుర భాషణ లోని గొప్పతనం .
ముందు తానొక్కడే వెళ్ళి సమస్యని చర్చించాలనుకున్నాడు శ్రీహరి... అందుకే ఒక్కడే వచ్చాడు .
"అంతా బాగున్నారంకుల్ ...! మీతో ఒక సమస్య గురించి మట్లాడదామని వచ్చాను".అంటూ సాత్విక్ విషయం గురించి చెప్పాడు.
"వినడానికి చిన్న సమస్యలాగా కనిపించినా, ప్రస్థుతం యవ్వనంలోకి అడుగుపెడుతున్న పసి హృదయాలలో ఆవేదన ఇదే.. హరీ....!!" అంటూ ఇలా కొనసాగించారు ఆయన.
"ప్రతీ మొగ్గా విచ్చుకుంటూ మనసారా నవ్వగలుగుతుంది...పూర్తిగా, స్వేచ్చగా విచ్చుకొని స్వతంత్రంగా తలలూపుతూ కనులవిందు చేస్తుంది .కానీ, నేటి ఈ కసిరి మొగ్గలవంటి యువతరం ఆ స్వేచ్చని కోల్పోతుంది. అమ్మా! అంటూ అడుగులేసిన దగ్గరనుండే, పిల్లలను " చదువు " అనే చట్రంలో బిగించి అదే మూసలో తిప్పుతున్నారు తల్లిదండ్రులు. వారికి వేరే లోకం తెలియకుండా పెంచుతున్నారు. యవ్వన దశలో అమ్మాయిలూ అబ్బాయిలూ...వారిలో జరిగే మార్పులకు, తెలియనితనంతో సమాధానం దొరకని ప్రశ్నలతో సతమతమవుతూ ఉన్నారు. ఇక లేబర్ క్లాస్ వాళ్ళ విషయానికి వస్తే, చిన్న పిల్లలే కదా... అని వారికి సరైన దుస్తులు వెయ్యరు. పగలంతా కష్టపడి సంపాదిస్తారు. రాత్రి కాగానే "తాగుడు" కి తగలేస్తారు డబ్బును .కానీ పిల్లలు ఎలా తిరుగుతున్నారు? ఏం చేస్తున్నారు ? అని ఆలోచించరు. అందుకే పసి పిల్లల మీద "రేప్" కేసులు రోజుకు ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. వారిలో అవగాహన కల్పించాలి. ఎవరికి వారు తమ ఇళ్ళలో చేసే పనివాళ్ళకు, తమ పరిధిలోని వాళ్ళకు ఈ విషయం వివరంగా అర్ధమయే విధంగా తెలియచెప్పాలి. చిన్న పిల్లలే కదా అని ఎక్కడ పడితే అక్కద మల మూత్ర విసర్జన కార్యక్రమాలు కూడా చేయిస్తూ ఉంటారు వీళ్ళు. వీటన్నిటినీ నిరోధించాలి." అనర్గళంగా, కించిత్ ఆవేశంగా చెప్పుతూ ఉన్నారు కోదండరాం గారు.
అన్నీ వింటూ " మీరు చెప్పింది నిజమే అంకుల్ !" అన్నాడు శ్రీహరి.
"ప్రతీ తల్లితండ్రులు కూడా తమ పిల్లలకి యవ్వన దశలో స్నేహితుల వలె అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే , వారు తమని తాము తెలుసుకోగలుగుతారు. ఒట్టి చదువులేకాకుండా వారికి మనుషుల మద్యన గడపడంకూడా అలవాటయితే కొంతలో కొంతైనా వారు వికసించటానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే చెడు స్నేహాల ప్రభావంతో వారుదారి తప్పి, జీవితాలను బలి తీసుకోవడానికి దోహదమవుతారు." టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ ని కుడిచేత్తో తిప్పుతూ శ్రీహరి వంక చూస్తూ, చెప్పటం ఆపారు కోదండరాంగారు.
"యస్ అంకుల్ ! నా వంతు చర్యగా నేనూ ఈ విషయాన్ని గమనించి మీ సూచన తప్పకుండా పాటిస్తాను...." అంటూ తల ఆడించాడు శ్రీహరి .
"రేపు సాయంత్రం ఇదే టైముకు సాత్విక్ని తీసుకొనిరా హరీ .అతనితో నేను మాట్లాడుతా డొంట్ వర్రి ! " అంటూ చేయి కలిపారు కోదండరాం గారు .
"తప్పకుండా అంకుల్! థాంక్స్ అంకుల్ ! " అంటూ గది బయిటికి నడిచాడు శ్రీహరి .
( సమస్యలా కనిపించదు కాని..ఇదీ ఓ పెద్ద సమస్యే....కథ చదివి ఒకసారి పునరావలోచనం చేస్తారని భావిస్తూ... సుజాత )
No comments:
Post a Comment