ఆత్మ దృష్టి - మానసిక దృష్టులు - అచ్చంగా తెలుగు

ఆత్మ దృష్టి - మానసిక దృష్టులు

Share This

ఆత్మ దృష్టి - మానసిక దృష్టులు

- డా. వారణాసి రామబ్రహ్మం 


గమనికలో విషయము (దృశ్యము, శబ్దము లేక ధ్వని, పరిమళము, స్పర్శ, రుచి ) గాని; విషయానుభవము [పై విషయములు కలిగించే అనుభవములు - వీటినే వాసనలు (మిగిలి ఉండేవి) అని కూడా అంటారు] లేని దృష్టియే ఆత్మ. దీనినే బ్రహ్మము అని కూడా అంటారు. అయం ఆత్మా బ్రహ్మా. వట్టి గమనిక మాత్రమే అయిన విశ్రాంత దృష్టియే ఆత్మ. బ్రహ్మము.
గమనికలో ఏదేని విషయము గాని, విషయానుభవము గాని లేక ఉండడమే మనసుకు శాంతి కుదరడము. నిర్మలమైన మనసే శాంతి. శాంతి కుదరడమే మోక్షము. ఆనందము లేక మౌనము అన్నా ఇదే.
తన నామ, రూప, వ్యక్తిత్వ (అహంకార - మమకార స్పృహ) నిండుకొనిన నిండు (పూర్ణ) దృష్టియే (పూర్ణమదః  పూర్ణమిదమ్ పూర్ణాత్ పూర్ణముదచ్యతే / పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే
లోని పూర్ణము ఇదే).
శరీర, జీవ (వ్యక్తిత్వ) స్పృహ లేకపోవడమే పూర్ణ దృష్టి. విశ్రాంత దృష్టి అన్నా ఇదే. విషయయుత గ్రహింపులు గాని, తలంపులు గాని, అవి కలిగించే లేక ప్రేరేపించే వాసనలు గాని, దృష్టిలో గాని స్పృహలో గాని, లేకపోవడమే మన నిజ "మానసిక" స్థితి. ఈ స్థితిలో మనసు, ఇతర అంతఃకరణములు - బుద్ధి, చిత్తము, అహంకారము -  పని చేయక ఆత్మలో లీనమై ఉంటాయి. దీనినే ఆత్మ లేదా బ్రహ్మ స్థితి అంటారు. పరమాత్మ స్థితి అన్నా ఇదే.
ఈ భూ గ్రహము పై మనుష్య జాతి ఉనికియే ఈ మధ్యది. వ్యక్తీ ఉనికి సమయము ఇంకెంతటిది? ఆ వ్యక్తీ ఉనికి స్పృహ సమయము ఇంకెంత తక్కువది?
క్షణ భంగురమైన మనుష్య శరీరమే "నేను" అని భావించక, ఈ మనుష్య శరీరాన్ని, ఆ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్న వ్యక్తిత్వము, తత్సంబంధ అహంకార - మమకారములు, జీవ భావములు "నేను" అని అనుకోక -ఇవన్నీ అయిన సృష్టి - దృష్టిలో లేక నిలిచిన - విశ్రాంతమైన - వట్టి గమనిక మాత్రమే ఆత్మ దృష్టి. అదియే మన సహజ స్థితి. దానిపైని ఆనింపులే మన భావములు, అనుభవములు, వ్యక్తిత్వము, జీవ భావములు, అనుభవములు. ఈ భావములు, అనుభవములనె సంసారము అంటారు. సంసారము అంటే భార్య, బిడ్డలు , సంపత్తి, పేదరికము మొదలైన లంపటములు ఉండడమే కాదు. అలా దొంగ సన్యాసులకు కూడా ఈ మానసిక సంసారము బెడద తప్పదు. అందుకే చాలామంది దొంగ సన్యాసులు - సన్యాసినులు, ఆధ్యాత్మిక ప్రవచనము చేయడాన్ని వృత్తిగా, వ్యాపారముగా పెట్టుకున్న వాళ్ళు, అటువంటి ఇతరులు - కూడా ఈ మానసిక సంసార సుఖ దుఃఖములకు, సాధక బాధకములకు అతీతముగా ఉండలేక అన్ని వెధవ పనులూ చేస్తారు. " చేసేవి ఆధ్యాత్మిక ప్రసంగాలు దూరేవి దొమ్మరి గుడిసెలు " చందాన జీవిస్తారు. ఇటువంటి వారు వారిని వారే ఉద్ధరించుకొనలేరు. ఇంకా మనలని ఏమి ఉద్దరిస్తారు?
అలా విశ్రాంత దృష్టియైన ఆత్మ దృష్టి పైన ఆభాసయే (ఆనింపే) మానసిక దృష్టి. మానసిక దృష్టి అడ్డుపడి మనకు సహజమైన ఆత్మ దృష్టిని కప్పి బయటి ప్రపంచాన్ని, ఆ ప్రపంచములో కల విషయములను, విషయానుభవములను చూస్తూ (దృష్టిలో ఉంచుకొని) ఆత్మస్థితి అనుభవములోనికి రాకుండా చేస్తుంది. సహజమైన మన శాంత స్థితిని మరుగున పడేస్తుంది. మన తలపులు, అనుభవములు రూపములో ఉన్న ఈ ఆంతర  ప్రపంచము (బయటి ప్రపంచము యొక్క ప్రతి - విషయములు, విషయానుభవముల రూపములో) దృష్టికి వచ్చి తదనుగుణ సుఖ దుఃఖములను కలిగిస్తూ తలపుల సుడిగుండములో పడేస్తుంది.
ఈ మానసిక దృష్టి రెండు రకాలు.
1. బహిర్ముఖ దృష్టి:
జ్ఞానేంద్రియములతో అనుసంధానమైన మనసు బయటి ప్రపంచములోని విషయములతో అల్లుకుపోతుంది. మనసు దృష్టి అంతా బయటి ప్రపంచపు విషయములతో మమేకమవుతుంది.
2. అంతర్ముఖ దృష్టి:
అదే మనసు ఈ బయటి ప్రపంచపు విషయ సముదాయాన్నంతా ప్రపంచముగా మస్తిష్కంలో భద్రపరుస్తుంది. దీనిని అంతర జగత్తు అంటారు. ఈ జగత్తులోని విషయాలను మనసు మరల గ్రహిస్తే అవే మన భావములు, తలపులు, ఆలోచనలు అవుతాయి. "జగత్ - కదిలేది" అంటే ఇదే. "బ్రహ్మా సత్ జగత్ మిథ్యా" లోని "జగత్" ఇదే.   ఈ విషయములు అదే సమయములో కలిగించే అనుభవములను చిత్తము వాసనలుగా, జ్ఞాపకములుగా భద్రపరుస్స్తుంది. మరల చిత్తమే ఈ వాసనలను జాగృత పరుస్తుంది. అవే మన చిత్త స్థితులు. సంకల్పము కలిగినప్పుడు చిత్తము తదనుగుణ మానసిక స్థితి ఏర్పరస్తుంది. అనుభవము మానసిక స్థితి. తలపు,  భావము, ఆలోచన - మానసిక గతి. వ్యక్తిత్వ సంబంధమైన తలపులను కలిగించే మనసుని (అంతః కరణాన్ని) అహంకారము అంటారు. గర్వము అనే ఉద్దేశములో ఇక్కడ ఈ అహంకార పదాన్ని ఆర్ధము చేసికోకూడదు. వ్యక్తి  భావముల - అహంకార మమకార భావ సముచ్చయము- అని అర్ధము చేసుకోవాలి. బుద్ధి విచక్షణను, తార్కిక జ్ఞానాన్ని అందిస్తుంది. అంతఃకరణములు అంతర జగత్తును చూస్తున్నప్పుడు అంతర్ముఖ దృష్టి ఏర్పడుతుంది. ఈ దృష్టియే బయటి ప్రపంచపు గ్రహిత విషయములకు, లోపలి తలపులకు అనుగుణముగా కర్మేన్ద్రియములను మనసుద్వారా పని చేయిస్తుంది.
అంతర్ముఖ, బహిర్ముఖ దృష్టుల ద్వారా మనసు అన్ని గ్రహణములూ చేస్తుంది. తదనుగుణ ప్రతి క్రియలూ చేయిస్తుంది.
మానసిక దృష్టులైన బహిర్ముఖ, అంతర్ముఖ దృష్టులు రెండూ విరమింప బడినప్పుడు విశ్రాంత దృష్టి నిండుగా భాసిస్తుంది - మబ్బు తెర తీసిన తరువాత సూర్య భగవానునిలా. ఈ సూర్య భగవానుడే ఆత్మ. బ్రహ్మము. అసలు నేను. (అసలు మనము; అసలు మనసు). నిర్మల మానసిక స్థితి. అసలు జ్ఞాన స్థితి. జ్ఞానుల నిరంతర స్థితి. జ్ఞానులు, మునులు, ఋషులు, బ్రహ్మ విదులు, బ్రహ్మ వేత్తలు, సదా ఈ స్థితిలో రమిస్తూంటారు - వేదాంత వాక్యేషు సదా రమన్తి - వేదాంత వాక్య తాత్పర్య తత్పర స్థితిమ్ అనుభవరూపేణ సదా వహన్తి. ఇప్పుడు మనసు తన పుట్టుక స్థానము అయిన ఆత్మలో లీనమైపోయి తెలుకుకునేది, తెలియబడేది లేని తెలివి మాత్రముగా ఉంటుంది.
ఇట్టి స్థితిలో నున్న జ్ఞానులకు ఆత్మయే మనసుగా వర్తిస్తుంది. మనసు మనకు నౌకరు. వంటవాడు. తోటమాలి. ఇవన్నీ అయిన మనసు తన పనులను సరిగా చేయక యజమానులమైన మన నెత్తిన ఎక్కి, తన పనులు మానేసి నపుడు, మన అదుపులో ఉండక వెర్రి వేషాలు వేస్తున్నప్పుడు, ఆ నౌకరును తీసి పారేసి అన్ని పనులూ మనమే చేసికున్నట్టు మునులు, జ్ఞానులు, ఋషులు, తత్త్వ వేత్తలు, బ్రహ్మ విదులు తమ లౌకిక వ్యవహారములను మానసాతీతముగా నిర్వర్తించుకుంటారు. మనసు వారికి పెంపుడు కుక్క. చెప్పినట్టు వింటుంది. అందుకని జ్ఞానులకు సంసార - సుఖ దుఃఖానుభవయుత - బాధలు కలుగవు.
ఆత్మయే మనసుగా వర్తింప చేసికునే నేర్పు సాధించడమే ఆధ్యాత్మికత పరమార్ధము.పరమోద్దేశము.
అంతర్ముఖ, బహిర్ముఖ  దృష్టులకు అతీతముగా విశ్రాంత దృష్టియై విధి విహిత, నియమిత వ్యవహారములను గృహస్తులుగా నిర్వహిస్తూ, భగవన్నామ స్మరణము చేసికుంటూ - జీవించడమే మానవ జీవిత లక్ష్యము. విధి. ఇంక దేనిని ఉపనిషత్తులు గాని, వాటి స్రష్టలుగాని చెప్పలేదు.

No comments:

Post a Comment

Pages