భార్య
- చెరుకు రామమోహనరావు
నేను వ్రాసిన ఈ పద్యాన్ని కొంచెము మనసు పెట్టి చదవండి.
ఫ్రిజ్జ గృహము, పవరు ప్రియమైన భార్యౌను
భర్త అందులోని పాయసమ్ము
పవరు లేని ఫ్రిజ్జి పాయసమ్మునకెట్లు
ఉనికినిచ్చదెట్లు పనికి వచ్చు
పెద్దలీవిధంగా చెప్పినారు.
పుత్రపౌత్ర వధూ భ్రుత్యైః ఆకీర్ణ మాపి సర్వతః
భార్యాహీన గృహస్తస్య శూన్యమేవ గృహం భవేత్ (మహా భారతము)
కొడుకులు కోడళ్ళు మనమలు మనవరాళ్ళు దాసదాసీ జనము ఎంతమంది ఉన్నా భార్యలేని వారి బ్రతుకు దుర్భరము.ఎంత నిజమైన మాటో చూడండి. ఇది మన సంస్కృతి. దీనినిపునరుద్ధరించండి.
ధర్మాన్ని కాపాడండి. వయసు ఒకే విధంగా వుండదు.నిన్నటి యువకులము నేటి వృద్ధులము. నేటి యువకులు రేపటి వృద్ధులు. అంతే తేడా. అనురాగము పెంచండి పంచండి.స్త్రీ ని అర్థము చేసుకోండి.
ఇది బ్ర. శ్రీ. వే. జటావల్లభుల పురుషోత్తం గారి 'మౌక్తికము'
గంగా సమానః ఖలు శుద్ధ ధర్మః
సత్ కామ ఏవం యమునోపమశ్చ
తన్మేళనం యత్ర తదేవ పూతం
క్షేత్రం ప్రయాగాస్య మహో గృహేస్తి
ధర్మం అనే గంగ ,కామం అనే యమున ,దాంపత్యమనే అంతర్వాహినియైన సరస్వతితో కలిసి త్రివేణీ సంగమమై తనరారే ప్రయాగనే భార్య అట. ఎటువంటి సద్భావనో గమనించండి .
నీతి శాస్త్రము నుండి మనమెప్పుడూ వినే ఈ సూక్తి ఒకసారి తిరిగీ గుర్తు తెచ్చుకోండి.
కార్యేషు దాసీ కరణేషు మంత్రీ రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి
భోజ్యేషు మాతా శయానేషు రంభా షట్కర్మ యుక్తా సహధర్మ పత్ని
ఇన్ని గుణాలు కలిగినది స్త్రీ. ఒకవేళ తనలో తప్పులేవైనా వున్నా మచ్చికతో మార్దవముతో చెబితే అర్థము చేసుకొంటారు. అహంకారానికి ఇరువురు తావివ్వకుంటే జీవితమూ పూవులబాటే.divorce, తలాక్ మన సాంప్రదాయము లో లేని విషయాలు.
'ప్రాణం వాపి పరిత్యజ్జ మానమే వాభి రక్షతు' అన్న సంస్కృతి మనది. ఒక్కసారి ఆ మహనీయ సంస్కృతిని గూర్చి పునశ్చరణ చేసుకొందాము.
ప్రపంచంలో ఏ మతమూ, దేశమూ ఇవ్వనంత గౌరవం, మర్యాద, పూజనీయత కేవలం సనాతన ధర్మంలోమాత్రమే స్త్రీకి ఇవ్వబడింది. అసలు ఇంకాచెప్పాలంటే, పురుషునికన్నా స్త్రీనే ఒకమెట్టు ఎక్కువ అని ఎన్నసార్లుచాటిచెప్పిది
ఈధర్మం, ఈ దేశం. ఒక అప ప్రథ ఈ అత్యాధునిక కాలం లో ప్రాచుర్యములో వుంది నేను క్రింద పొందుపరచే ఈ మనుస్మృతిలోని శ్లోకము మీద:
‘’పితారక్షతి కౌవరే భర్తారక్షతి యౌవనే
రక్షంతి స్థావిరే పుత్రానస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’’ (మనుస్మృతి-9-3)
బాల్యంలో తండ్రి స్త్రీలను రక్షిస్తాడు. యౌవనంలో మగడు రక్షిస్తాడు. ముసలితనంలో పుత్రులు రక్షిస్తారు. కావున స్త్రీలు స్వతంత్రులు కారు అని ప్రకటించింది మనుస్మృతి. కావున స్త్రీ స్వతంత్రురాలిగా ఉండటానికి వీల్లేదు.
ఒక్క భారతదేశంలోనే, ఒక స్త్రీ మూర్తిని చూస్తే మాతృమూర్తిగా గౌరవిస్తాం, ఏంటమ్మా అని పలకరిస్తాం.
ఒక స్త్రీ మూర్తిని చూస్తే అక్కగానో, చెల్లిగానో, పిన్నిగానో, వదిన గానో, అమ్మగానో, అమ్మమ్మగానో వరస కలిపిగౌరవించి మాట్లాడడం ఒక్క భారతీయజాతికి మాత్రమే తెలుసు.
ఒక స్త్రీ మూర్తి భారత దేశంలో కేవలం మనిషి కాదు, దైవం, పరాదేవత. సుహాసినీ పూజ చేసినా ఆమెకే, బాలపూజ చేసినా ఆమెకే.
ఒక స్త్రీ మూర్తి వివాహానంతరం భార్యాభర్త ఇద్దరూ సమం, అసలు ఆమెయే ఎక్కువ కూడా, మా వేదాలు, శాస్త్రాలు,ప్రమాణ గ్రంథాలు అలానే చెప్పాయి. ఆమెయే గృహం, అందుకే ఆమె గృహిణి, ఆమె ఇంటిలో ఉంటున్నందుకుఅతడు గృహస్థు. పెళ్ళి అయ్యీ అవ్వగానే, ఆ వ్యక్తికి సంబంధించిన సమస్తమునకూ ఆమె యజమానురాలు. అందుకు భిన్నంగా స్త్రీని ఒక భోగ వస్తువుగా చూడడం, ఆనక వదిలేయడం అవైదికమూ, భారతీయతాకాని, అనాగరికులు సంస్కార హీనులైన అన్య జాతులు, పాఖండ మతస్తుతల సంప్రదాయం.
రాజకీయములైన అనేక దండయాత్రల వలన స్త్రీ యొక్క యునికి మధ్యయుగమున క్షీణించినదని చెప్పక తప్పదు. సమాజమున స్త్రీ పురుషు లిరువురు సమానులే. ఒకరి యెక్కువగాని మరియెకరి తక్కువగాని యుండదు.
భారతదేశమున మహిళకు లభించినంత గౌరవము ప్రపంచములో మరియే యితర దేశమునందునలేదని ప్రఖ్యాతిగాంచిన అనిబిసెంటు అభిప్రాయమును వెలిబుచ్చియున్నారు. సాహిత్య ప్రపంచమునకూడ నింతటి గౌరవము స్త్రీలకు లభించినది. ప్రపంచ సాహిత్యం యావత్తూ పరికించిచూస్తే భారతీయ సాహిత్యంలో కనబడే స్త్రీత్వం మరెక్కడా కనబడదు అని అనిబిసెంటు వ్యక్తముచేసిన భావమును విజ్ఞానవంతులెవ్వరును ఖండింప సాహసింపరు.
భారతీయ సాహిత్యము వేదములతో ప్రారంభమయినది కనుక వేదకాలముయొక్క స్త్రీ పరిస్థితి యెట్లున్నదో తెలిసికొనవలసియుండును. కొన్ని ధర్మములు, కొన్ని నీతులు, కొన్ని కట్టుబాట్లు, కాలమాన పరిస్థితులనుబట్టి మారుచుండును. మారవలెనుకూడా. ఇట్లు మారుట కాల ప్రభావము వలన జరుగుచుండెను. యుగముగములకు ధర్మము కొన్ని కొన్ని మార్పులకు లోనయినందుచేతనే యుగధర్మమన్న మాట ప్రభవించినది. భారతీయుల హృదయవాదులు, ఆత్మవాదులు నగుటచేత స్త్రీలనొక విధముగ పురుషుల నొక విధముగ చూడలేదనియే చెప్పవలెను. మిగిలిన ప్రపంచ సంస్కృతికిని భారతీయ సంస్కృతికినిగల ముఖ్య భేదమిచ్చటనే శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనము భారతీయ, పాశ్చాత్యభావములలోని భేదమునిట్లు చెప్పియున్నారు. భారతీయుల ఎక్కువగా హృదయవాదులు. పాశ్చాత్యులు బుద్ధిపరులు. మవానరు కర్మబుద్ధులు. దైవమునే బలముగా నెంచువారు. పాశ్చాత్యులు కర్మసిద్ధాంతము నొప్పుకొనరు. పురర్జన్మను వారంగీకరింపరు. భారతీయమైన సమస్త కళలును ఈ సిద్ధాంతము నాధారముగ జేసికొని పాలింపబడినవే. భారతీయ సిద్ధాంతము ప్రకారము మానవులు శాంతియుతముగ జీవించుటకు ఒక చక్కని ప్రణాళికవంటిది ఏర్పడియున్నది. సుఖదుఃఖములను ఒక్క రకముగ చూచుచు కర్తృత్వమును దైవముపై వదలి కర్మను చేయుటయే వ్యక్తి యొక్క విధిగ చెప్పబడినది. మోక్ష ప్రాప్తికై భక్తి, జ్ఞాన, కర్మయోగి మార్గములలో నొకదానిని నిర్ణయించుకొని తన్మార్గగామి యగుటయే భారతీయ జీవన విధానములోని ముఖ్యాంశము. ఈ విధానమున స్త్రీ పురుష విభేదము చెప్పబడలేదు. ఆత్మయనునది యిరువురికి నొక్కటియే. కాని యిరువురకును కొన్ని కొన్ని హద్దులు ఋషులచే నిర్ణయింపబడియున్నవి.
బృహదారణ్యకోపనిషత్తులో పురుషుడు తన ఏకాకి తనమును చూచి భయముచెంది ఆనందముకొరకు భయనివారణము కొరకు స్త్రీని సృష్టించెననియున్నది. ఏకాకీ నవైరమతా. ప్రకృతి పురుషులే స్త్రీ పురుషులు రాముడు సూర్యవంశమునను సీత పృధ్వినుండియు జనించిరి. ఇచట రాముడు ఆకాశతత్త్వముగను సీత పృధ్వీతత్త్వముగను భావింపబడిరి. కర్తృత్వ భర్తృత్వములలో మార్పులున్నను విది నిర్వహణమున స్త్రీ పురుషులిరువురును సమానులేయైయుండిరి.
భారతీయ తత్త్వమునకు అర్ధనారీశ్వర భావము ముఖ్యాధారమైన విషయము. ప్రకృతి పురుషుల సమానత్వ మిచట నిరూపింపబడినది. ప్రాచీన కాలములో మాతృస్వామ్యముండెడిదని చరిత్రకారులు చెప్పుచున్నారు. మాతృస్వామ్యమున్నను పితృస్వామ్యమున్నను మాతృదేశము అనగా మాతృదేవతకు ప్రథమ స్థానమీయబడుట మాత్రము సర్వకాలములలోను వ్యక్తమగుచున్న విషయము. ఇది నేటికి నవిచ్ఛిన్నముగ పరిపాలింపబడుచునే యున్నదనుట నిస్సంశయము. ధర్మపత్ని భావమును యజుర్వేదములోని శ్లోకము ఇట్లు తెలుపుచున్నది.
సురీయో దేవీయుషసగ్ం
యోచమునా మరీయః
నయోషా యభ్యేతు పశ్చాత్
పురుషుడు స్త్రీని ఎలా అనుసరిస్తున్నాడో అలాగే సూర్యుడు ఉషాదేవిని అనుసరిస్తున్నాడని భావన స్త్రీ పురుషు లొకరికొకరు సహకరించుకొనుట ఇట్లు వెల్లడియగుచున్నది. భార్యను తనకన్ని కార్యములలోను సహకరింపవలసినదిగ అభ్యర్ధించు వివాహ మంత్రములున్నవని శకుంతలారావుగారు వ్రాసియున్నారు. అవి లేనందున హృదయ బుద్ధులకు ప్రాముఖ్యమీయబడినదని తెలియుచున్నది. మరియును శరీరము అశాశ్వతమైనదని గ్రహించిన ఋషులు శాశ్వతమైన మోక్షసాధనకు శరీరమునే పరికరము గావించుటకు మార్గము నన్వేషించిరేగాని ఇంద్రియలోలలత్వమును ప్రోత్సహింపలేదు. శరీర ధర్మములైన వాంఛలను ధర్మబద్ధముగ పొందుచుండవలెనని ఆదేశించియున్నారు. ధర్మార్ధ కామమోక్షములను, పురుషార్థములని యందురు. ధర్మకామము, మోక్షకామము, ధర్మార్థ మోక్షార్థము, ఇట్లొక దానికొకటి ముడిపడియున్నవి. ధర్మమును మోక్షము పరమునకును అర్ధమును కామమును ఇహమునకును నిర్ణయించిరి. అన్ని అర్థములకును ధర్మమే పరమార్థమైయున్నది.
పాతివ్రత్యమును విషయము మన దేశమున ప్రస్తుతింపబడుచుననూ చానముగ వచ్చుచున్న విషయము. పాతివ్రత్యమనగా పతిచేయు ధర్మ కార్యములలో, దైవకార్యములలో తోడ్పడుటయేగాని, మూర్ఖముగ నేడు భావించుచున్నట్లు కనులు మూసికొని దుర్మార్గుడైన భర్తతో కాలము గడుపుటకాదు. భర్తతోపాటుగ నామె బ్రతుకుకూడ నరకప్రాయము అగుట సంభవింపవచ్చును. భక్త జ్ఞానదేవ్ వ్రాసిన జ్ఞానేశ్వరియను గ్రంథమున పాతివ్రత్యమననేమో తెలియజేయుచు నిట్లు వ్రాయబడినది. పతిబియామతా అనుసరోనీ అని యున్నది. అనగా పతి యొక్క అభిప్రాయము ననుసరించుటలో పతివ్రతయగు స్త్రీకి శుభముగలదు. పతి యొక్క వ్రతము నకు పోషణ యిచ్చునది పతివ్రత ఇచట వ్రతమునకు బదులు అభిమతమునకు ప్రాధాన్యమీయబడినదని వినోబా భావించుచున్నారు. నిజమునకు వ్రతయే సరియైనది. ఎందుచేతననగా యజ్ఞయాగాది క్రతువుల సమయమున భార్యలేనివాడు యజ్ఞాది క్రతువులను చేయుటకనర్హుడు. కర్మచేయునప్పుడు భార్య యతని ప్రక్కనే యుండవలయును. ఇదియే ధర్మపత్ని భావమునకు మూలాధారము. ఈ విషయముతోడనే పతివ్రతయనునది వచ్చియుండవచ్చును. పతితోగూడి వ్రతములు చేయునది గావున పతినే దైవముగ నమ్ముకొనుటవలన పతివ్రతయన్న పదము పుట్టినది.
సంస్కృత భాషలోనే పదము వ్యుత్పత్యర్ధము లేక యుండదు. స్త్రీ యనగా గర్భమును ధరించునది అని అర్ధము. మహిళ యనగా మహీమ్ లాతీతి మహిళా. మహియనగా భూమి (పృధ్వీత్వము) క్షేత్ర స్థానమందున్నది. రాముడు సూర్యవంశమునను సీత పృధ్వినుండియు జనించిరి. ఇచట రాముడు ఆకాశతత్త్వముగను సీత పృధ్వీతత్త్వముగను భావింపబడిరి. కర్తృత్వ భర్తృత్వములలో మార్పులున్నను విది నిర్వహణమున స్త్రీ పురుషులిరువురును సమానులేయైయుండిరి.
ఈ విషయాన్ని గ్రహించి భార్యాభర్తలు ఒకరికొకరుగా వుంటే కుటుంబమునకంతకన్నా కావలసినది వేరేమైనా వుంటుందా!
No comments:
Post a Comment