బుడుగు బిస్టిక్స్
- యనమండ్ర శ్రీనివాస్
“ఇదిగో బుడుగు, కాసిని బిస్టిక్స్ తిను” అంది అమ్మ ఇవాళ నేను స్కూలు నుండీ రాగానే.
నాకు భలే ఇష్టం కదా బిస్టిక్స్ అంటే. కరాచి బేకరికి నాన్న తీసుకుల్తే ఆల్మండ్ తో చేసిన బిస్టిక్స్ కొనుక్కోకుండా రానంటే రానుగా. అందుకే ఘబుక్కున పరిగేఠుకెళ్ళి అమ్మకి ఓ ముద్దు పెట్టేసి గుప్పెడు బిస్టిక్స్ తీస్కుని టి వీ చూస్తూ కూర్చున్నా.
“అమ్మా, నాన్న తెచ్చారా ఇవి? పొద్దున్నెందుకు పెట్టలేదు. స్కూలుకి తీసుకెళ్ళేవాడిని కదా?” అని అడిగా.
“లేదురా. పక్కన పిన్నిగారి చుట్టాలమ్మాయి లేదూ, రాధిక అంటారే. ఆ పిల్ల తీసుకొచ్చి ఇచ్చింది” అంది అమ్మ.
“రాధిక అంటే ఈ మధ్య పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది కదా, ఆ పిల్లేనా?” ఆ రాధిక అయితే రెండు జళ్ళ సీత కన్నా చాలా ఖబుర్లు చెప్పేది. బాబాయి వాళ్ళ ఫ్రెండు సూరికి బాగా క్లోజు. బాబాయి చెప్తూ ఉండేవాడు తన గురించి. చాలా సార్లే కలిశాను నేను తనని. ఏ పార్కులో చూసినా సూరితోనే, ఏ సినిమాలొ చూసినా సూరితోనే వుండేది తను. కానీ పెళ్ళిలొ మటుకు కటీఫ్ చెప్పేసినట్టుంది. సూరి కాకుండా రాధిక పక్కన ఇంకో అబ్బాయి కూర్చున్నాడు, ఆ పిల్ల పెళ్ళి చేసుకున్న రోజు. పెళ్ళిలో సూరి అన్నావంటే చంపేస్తా అన్నాడు బాబాయి. అంతే. ఆ తర్వాత రాధిక గురించి ఇప్పుడే వినడం.
“ఏమైంది. పరీక్ష పాసైందా వదినా? ఆ రాధిక?” అంటూ అందుకున్నాడు బాబాయి మధ్యలో కంప్యూటర్ లో నుంచీ తల బయటకి పెట్టి. అసలు ఆడపిల్లల టాపిక్ వొస్తే ఎక్కడున్నా ఇట్టే ఒచ్చేస్తాడుగా.
“లేదు బాబు. పెళ్ళయిందిగా. నెల తప్పిందిట. ఆనందం ఆపుకోలేక, ‘పిన్నిగారూ. మీకు మాత్రమే చెప్తున్నా’ అని ఈ బిస్టిక్స్ డబ్బా ఇచ్చింది” అంది అమ్మ.
“ఏమిటో మేమైతే పరీక్ష పాసైతే కానీ, స్వీట్స్ పంచి పెట్టం. ఈ ఆడపిల్లలు ఏం తప్పినా పంచిపెడుతున్నారు” అన్నాను బాబాయికి మాత్రమే వినపడేలాగా.
“ఏడిశావులేవొయ్. నెల తప్పటం అంటే ప్రెగ్నెంట్ అవటం.” అన్నాడు బాబాయి అంతే నెమ్మదిగా. తన కంప్యూటర్ పనేదో తను చూస్కుంటూ.
“ఓ ప్రెగ్నేంటా. అర్ధమయిందిలే. ఇవాళ క్లాసులో డిస్కషన్ దానిగురించే” అన్నా.
ఘబుక్కున ఇటు తిరిగి బాబాయి, “ఏమర్ధమయిందోయి. ఏంటా డిస్కషన్ మీకు దాని గురించి” అన్నాడు. కొన్ని కొన్ని విషయాలకి భలే ఖంగారు పడతాడు బాబాయి. మీకు తెలుసా?
“ఏమీ లేదు. వైజాగ్ మాస్టారు ఫైర్ మేన్ గురించి కొన్ని వివరాలు చెప్తూ నేను ఎపుడైనా ఫైర్ మేన్ ని చూసి వుంటే, ఆ విషయం చెప్పమన్నారు. నేనైతే టక టకా చెప్పెశా. I saw a fireman when my neighbor's house is on fire. He came in fire engine vehicle and sprayed water on fire. Then he went inside the house with water pump and came out pregnant” అని.” భలే భలే. ఇంత ఇంగ్లీషు మాట్లాడే సరికి ఇవాళ వైజాగ్ మాస్టారుకి కళ్ళు తిరిగి నోట మాట రాలేదు. తెలుసా?
“ప్రెగ్నెంటా? ఫైర్ మేన్ ప్రెగ్నెంటా? ఆ పదానికి అర్ధం తెలుసురా బడుద్ధాయి?” అన్నాడు బాబాయి. మా మాస్టరు కూడ ఇంతే. ముందర నోట మాట రాలేదా. ఆ తర్వాత కోపంగా ఇలానే అడిగారు. ఏమిటో ఈ పెద్దవాళ్ళకి కొన్ని కొన్ని చిన్న పదాల అర్దమే తెలిసి చావదు.
“ఎందుకు తెలీదు బాబయి. ప్రెగ్నెంట్ అంటే carrying child. మొన్న ఎదురుగా సుందరం అంకుల్ వాళ్ళ ఇంట్లొ ఫైర్ వచ్చినపుడు ఫైర్ మేన్ వొచ్చాడుగా ఫైరింజెను తీసుకుని. లోపలకి నీళ్ళు స్ప్రే చేసి, బయటకి వస్తూ వాళ్ళ పిల్లాడు బబ్లూని ఎత్తుకుని బయటకి తీసుకురాలేదా? Carrying child is pregnant. అదే గుర్తొచ్చి చెప్పా” అని బిస్టిక్స్ తినేశా.
ఈ బిస్టిక్స్ భలే కరిగిపోతాయిలే నోట్లొ. ఒకదాని తర్వాత ఒకటి. అందుకే అమ్మ దగ్గరకి వెళ్ళి అడిగా. “అమ్మా, రాదిక మనకి ఒక డబ్బా ఇచ్చిందా? రెండు డబ్బాలు ఇచ్చిందా?” అని.
“వెధవకాన. అలా అడగకూడదు. సంతోషంగా ఎవరైనా ఇచ్చినపుడు ఇంకా కావాలి అనకూడదు. వీలైతే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించెయ్యాలి సరేనా” అంది అమ్మ.
“ఈసారి మనం బయటకి వెళ్ళినపుడు తెచ్చుకుందాంలే బుడుగూ” అన్నాడు బాబాయి.
“నువ్వు అన్నీ ఇలానే అంటావ్ బాబాయ్. తర్వాత రెండు జళ్ళ సీత అడిగితే నా డబ్బా కూడ ఇచ్చేస్తావ్” మొన్నోసారి జరిగింది గుర్తొచ్చి అనేశా.
వెంఠనే బాబాయి నా నోరు మూసేసి, “పదరా బయటకి. ఇప్పుడే తెచ్చుకుందాం” అన్నాడు.
ఇద్దరం బయటకి వస్తుంటే, రాదిక కనిపించింది. “ఏవిటోయి బుడుగూ. ఎక్కడకి వెళ్తున్నారు?” అని అడిగింది.
“బిస్టిక్స్ కొనుక్కోడానికి” ఠక్కున చెప్పేశా “నువ్వు ఒక్క డబ్బానే తెచ్చావుగా. సరిపోలేదు.” అని.
వెంఠనే బాబాయి జెల్లకాయ ఒకటిచ్చాడు, ‘అమ్మ చెప్పింది మర్చిపోయావా?’ అన్నట్టు.
మరచేపోయా. మనకి హాపీ న్యూస్ చెపినపుడు వాళ్ళకి మంచి విషయాలు చెప్పాలి అంది కదూ అమ్మ. అందుకే రాధికని పిల్చాను వెనక్కి తిరిగి.
“ఒసేయ్ రాధికా. ఇటు రావె” అని. తను వచ్చాక “కంగ్రాట్స్. ప్రెగ్నెంట్ ట కదా. అమ్మ బాబాయికి చెప్తుంటే విన్నాలే” అన్నా.
ముసి ముసిగా నవ్వింది రాధిక. “కానీ ఈ విషయం మీ నాన్నకిగానీ చెప్పావుటే” అన్నా.
“నీకెందుకురా బోడి వెధవాయి” అంటూ పొడిచాడు బాబాయి వెనకనుండీ.
ఎందుకంటాడేంటీ. ఆ పిల్లకి మంచి విషయాలు చెప్పద్దూ. “ఇదిగో మీ నాన్నకి మటుకూ ఈ ప్రెగ్నెంట్ విషయం చెప్పకేం. ఇదివరకోసారి పెళ్ళి కాక ముందు, సూరితో నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అని ఇలానే చెప్తుంటే, మీ నాన్న విని నీ వీపు చితక్కొట్టాడు. గుర్తుందిగా. జాగ్రత్త. ఆయనకి అసలే కోపమెక్కువ. అందుకే చెప్పద్దు అంటున్నా” అనేశా.
అపుడు సూరితో ఆ రాధిక చెప్తున్న విషయం నేనూ, బాబాయి పక్కనే వుండి వినేశాం కదా. నాకు అదే గ్నాపకం వొచ్చి తనకి చెప్పి మంచిగా వాళ్ళ నాన్న తన్నుల నుండీ తనని రష్షించేశా. బాబాయికేసి చూసి కళ్లెగరేశా. చూశావా? అన్నట్టు.
ఇంకెక్కడ బాబాయి. నా పక్కనుంటేగా. ఆ మాట వినగానే సందు చివరకి పరిగెత్తినట్టున్నాడు.
“అమ్మో నా బిస్టిక్స్” నేనూ పరిగెత్తాలి బాబాయి వెనకాలే. ఉంటానే మరి.
No comments:
Post a Comment