చలన చిత్రాలలో ఉపాధ్యాయుల పాత్ర చిత్రణ
- బల్లూరి ఉమాదేవి
"గురుర్బ్రహ్మః గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మః తస్మై శ్రీ గురవే నమః"
అని మన భారతీయులు గురువును త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులతో పోల్చారు. మాతృదేవోభవ, పితృదేవోభవ,ఆచార్య దేవోభవ అంటూ తల్లి దండ్రుల తరువాత గురువుకు ఆ స్థాన మిచ్చారు.
మనిషి పుట్టుకకు మాతాపితలు ఎంత ముఖ్యమైన వారో వారి అభివృద్ధిలో గురువు అంత ముఖ్యుడు. బ్రహ్మచర్యము,గార్హస్త్యము,వానప్రస్తము,సన్యాసము అని చతురాశ్రమాలు గలవు. మన పూర్వీకులు చతురాశ్రమ ధర్మాలను పాటించేవారు. పూర్వం గురుకుల పద్ధతిలో చదువు సాగేది. బ్రహ్మచర్యాశ్రమం మొత్తం విద్యకే కేటాయించ బడేది.ఆశ్రమంలో గురు శిష్య పరంపర కొనసాగేది. గురువు విద్యార్థుల అభిరుచిని ఆసక్తిని బట్టి వారిని ఆయా శాస్త్రాలలో దిట్టలుగా తీర్చిదిద్దేవారు. శిష్యులు కూడా గురువు పట్ల భక్తి శ్రద్ధలతో,నియమ నిష్టలతో విద్యను కొనసాగించే వారు.రామాయణాది ఇతిహాసాలలోకూడా గురుశిష్య పరంపరను చూడవచ్చు.
రామాయణంలో రాముడు విశ్వామిత్రుని వెంట వెళ్ళి నేర్చుకొన్నాడు. మహాభారతంలో ద్రోణాచార్యుడు అర్జునుని ప్రియ శిష్యునిగా భావించి అతనినిమేటి విలుకానిగా, జగదేక వీరునిగా తీర్చి దిద్దాడు.భాగవతంలో శ్రీ కృష్ణుడంతటి వాడు సాందీపుని వద్ద విద్యనభ్యసించడం కన్పిస్తుంది.
ఇక చరిత్ర విషయానికొస్తే ప్రపంచ విజేత యైన అలెగ్జాండరు వ్యక్తిత్వంపై అతని గురువు అరిస్టాటిల్ ప్రభావం వుందంటారు.మౌర్య చంద్రగుప్తుని మగధరాజుగా చేయడం వెనుక రాజకీయచతురుడైన అతని గురువు చాణుక్యుని కృషిఎవ్వరు విస్మరించరు.ఆధ్యాత్మికరంగంలో భారతదేశం గర్వించదగ్గ మేధావి తరతరాల యువతపై వివేకానందుని కీర్తి పతాకానికి నేపథ్యంగా నిలిచిన వాడు అతని గురుదేవులైన శ్రీరామకృష్ణ పరమహంసగారు.ఇలా ప్రతిభావంతులైన వ్యక్తుల విజయాల వెనుక వారి గురువుల కృషి దాగుందన్న విషయం జగమెరిగిన సత్యం.ఒక వ్యక్తి చైతన్యవంతుడైతే అతడే చైతన్య వంతుడౌతాడు.
అదే ఒక స్త్రీ చైతన్యవంతురాలైతే ఆమె కుటుంబమంతా చైతన్యవతమౌతుంది.అదే ఒక గురువు వల్ల సమాజమంతా చైతన్యమంతమౌతుంది. ఈవిధంగా వ్యక్తి వికాసంలో,అభివృద్ధిలో గురువు పాత్ర అపారమైంది.
వ్యక్తి అభివృద్ధితోసమాజాభివృద్ధి,సమాజాభివృద్ధితొ దేశాభివృద్ధి జరుగుతుంది.అంటే దేశాభ్యుదయానికి గురువు పాత్ర ఎంతో కీలకమైనదని చెప్పవచ్చు.విద్యార్థుల్లో భయాలను సందేహాలను నివృత్తి చేసి వారిలో ధైర్యాన్ని కలిగించి,ఆత్మస్థైర్యాన్ని వెలిగించి చైతన్యాన్ని చిగురింప జేసి ఒక కొత్త విజ్ణాన పథంలో వారిని ముందుకు నడిపే మహాశక్తి పేరే గురువు.పాఠాలే కాకుండా జీవిత పాఠాలను కూడా వారికి బోధించి సంఘాన్ని పట్టిపీడిస్తున్న సాంఘీక దురాచారాల పట్లవిద్యార్థులకు అవగాహన కలిగించి వాటి నిర్మూలనకు తోడ్పడే వాడు గురువు."అజ్నానమనే చీకటినుండి జ్నానమనే వెలుగులోనికి విద్యార్థులను నడిపించే వాడు గురువు.వారిపై చెరగని ముద్రవేసి మార్గదర్శిగా నిలిచేవాడు గురువు.
సినిమాలలో ఉపాధ్యాయ పాత్రలు
తెలుగు చలనచిత్రరంగంలో మంచితనం,సంస్కారం,సహృదయత,ఆదర్శవంతమైన ఉపాధ్యాయ పాత్రలతో అనేక చిత్రాలొచ్చాయి.కొన్నింటిని చూద్దామా!
నందమూరి తారకరామారావు నటించిన "బడిపంతులు" సినిమాలో రాఘవరావు అనే(పంతులు) ఉపాధ్యాయుడుదొంగతనం చేసిన విద్యార్థిని దండించకుండా మెత్తని మాటలతో అతనిలో పరివర్తన తీసుకొస్తాడు. మాస్టారు సందేశంతో మంచి మనిషిగా మారిన ఆ విద్యార్థి ప్రయోజకుడిగా మారడం వెనుక మాస్టారి మాటల ప్రభావం కనిపిస్తుంది.ఈ చిత్రానికి "బడిపంతులు" అని పేరు పెట్టడం వెనుక ఆరోజుల్లో ఉపాధ్యాయులకు ఉన్న గౌరవాభిమానాలు ఎటువంటివో అర్థమౌతుంది.
౨ఇదే విధంగా కృష్ణంరాజు నటించిన "త్రిశూలం "చిత్రంలో ఉపాధ్యాయుడైన రాము పాత్ర గ్రామాభ్యుదయానికి పాటు పడుతుంది. ౩టి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన "వందేమాతరం "చిత్రంలో నాయికా నాయకులు ఉపాధ్యాయులే. వారు తమ సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా గ్రామ చైతన్యానికి తోడ్పడతారు. ౪.విజయశాంతి నటించిన "ప్రతిఘటన" చిత్రంలో ఆమె పోషించిన లెక్చరర్ ఝాన్సీ పాత్ర విద్యార్థుల్లో తీసుకొచ్చిన మార్పు వల్ల రాజకీయ చైతన్యం కూడా కలుగుతుంది. ౫. ఇక "రేపటి పౌరులు"చిత్రంలో విజయశాంతి పోషించిన ఉపాధ్యాయిని పాత్ర పిల్లల్లో చైతన్యం కల్గించి తద్వారా సామాజిక చైతన్యానికి దారి తీయిస్తుంది. ౬.కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన "శంకరాభరణం" చిత్రంలో సంగీత విద్వాంసుడైన శంకరశాస్త్రి తన సంగీతానికి శిష్యుడైన చిన్నారి శంకరాన్ని వారసుడిగా చేస్తాడు. ౭."సాగరసంగమం"చిత్రంలో కమల్ హాసన్ పోషించిన "బాలు" అనే పాత్ర ఒక నృత్య కళాకారుడిది. అతడు నిజ జీవితంలో వ్యక్తిగా ఓడిపోయినా జీవిత చరమాంకంలో తన నృత్య కళను శిష్యురాలికి నేర్పి గురువుగా విజయవంతమౌతాడు. ౮. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన "ఆనందభైరవి"చిత్రం గురువు తలచు కొంటే ఏదైనా చేయగలడనే విషయాన్నిస్పష్టం చేస్తుంది.ఈ చిత్రంలో నృత్యకళాకారుడైన శాస్త్రి భార్యతో పందెం కట్టి ఒక దొమ్మరి అమ్మాయికి నాట్యం నేర్పి ఆమెను భైరవిగా తీర్చిదిద్దుతాడు. ఈ చిత్రంలో గురువు పాత్ర పోషించిన గిరీష్ కర్నాడ్ నటన చిత్ర విజయానికి వెన్నెముకగా నిలిచిందని చెప్పవచ్చు. ౯. ఉషా కిరణ్ సంస్థ నిర్మించిన "అశ్విని" చిత్రంలో అశ్విని విజయం కోసం అహరహం శ్రమించే "కోచ్" గా భానుచందర్ పాత్రను తీర్చిదిద్దిన తీరు అమోఘం అని చెప్పవచ్చు. ౧౦. ఈ మధ్య కాలంలో వచ్చిన "టాగూర్"చిత్రం లంచమనే సాంఘీక దురాచారాన్ని రూపుమాపడానికి ప్రయత్నించింది ఇందులో టాగూర్ పాత్రను దర్శకులు అద్భుతంగా తీర్చిదిద్దారు.
చలన చిత్రాలలో ఉపాధ్యాయుల పాత్ర _ ప్రబోధ గేయాలు. ముఖ్యంగా మన పాత సినిమాల్లో గురువు యొక్క ఆదర్శ భావాలను,మంచి వ్యక్తిత్వాన్ని వివరిస్తూ ఎన్నో సినిమాలొచ్చాయి.అందులో ఉపాధ్యాయుల బోధనాపద్ధతిని,ప్రబోధాలను, దేశభక్తిని గురించి అనేక గీతాలొచ్చాయి.అందులో కొన్నింటిని చూద్దాం.
తరగతి గదిలో పాఠం చెప్పేముందు ఉపాధ్యాయుడు ఆ విషయంపైవిద్యార్థులకు ప్రశ్నలు వేసి వారి నుండి సమాధానాలు రాబట్టడం అనేది బోధనలో ముఖ్యమైన అంశం.ఇలాంటి పాటలు మన తెలుగుసినిమాలలో చాలా వచ్చాయి.
"ఉయ్యాలా_జంపాల" అనే చిత్రంలోని ఈ పాటను చూడండి.ఇక్కడ ఒక ఉపాధ్యాయని తన విద్యార్థులకు ,భారతీయులందరికి ఆదర్శవంతుడైన రాముని గురుంచి బోధించాలనుకొంది. అందుకు విద్యార్థులకు రాముని గురించి ఎంతవరకు తెలుసో ఆ విషయాన్ని రాబట్టడానికి ఇలా ప్రశ్నిస్తుంది. ఉపా:_ అందాలరాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ద్ధి సోముడు ఎందు వలన దేవుడు ? విద్యా ౧:_తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను వి ౨ అనుభవించ దగిన వయసు అడవి పాలు చేసెను విద్యా౩:_ అడుగు మోపినంత మేర ఆర్య భూమి చేసెను విద్యా :_౪ తన తమ్ముని బాగుకై తాను బాధ నొందెను సమా:_ అందాల రాముడు అందువలన దేవుడు. అంటూ ఉపాధ్యాయిని వేసిన ప్రశ్నలకు విద్యార్థులు ఒక్కొక్కరు రాముని ఒక్కొక్క లక్షణాన్ని వివరించారు.ఇలా ఆమె తాను చెప్ప దలచు కొన్న విషయాన్ని ప్రశ్నల ద్వారా అడిగి వారిలో ఆసక్తిని రేపి సమాధానాలు చెప్పించింది.
మరో ఉదాహరణ చూద్దామా ! "కోడలు దిద్దిన కాపురం" చిత్రంలోఉపాధ్యాయురాలు పాత్ర వేసిన మహానటి సావిత్రి తన విద్యార్థులకు ధర్మం గురించి చెప్పాలనుకొని వారిని ఏ విధంగా ప్రశ్నిస్తుందో చూద్దామా!
ఉపా:- నీ ధర్మం నీ సంఘం నువు మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు ఇక్కడ ఉపాధ్యాయని ప్రశ్నలడిగే తీరు ఉపా:_ సత్యం కోసం సతినే అమ్మినదెవరు ? విద్యా:_ హరిశ్చంద్రుడు ఉపా : తండ్రి మాటకై కానల కేగిన దెవరు ? విద్యా :శ్రీరామచంద్రుడు. ఉపా: అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా ? విద్యా: లక్ష్మన్న. ఉపా :పతియెదైవమని తరించి పోయినదెవరమ్మా ? విద్యా: సీతమ్మ. ఉపా :ఆ పుణ్య మూర్తులు చూపిన మార్గం అనుసరించుటే నీ ధర్మం నీ ధర్మం మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. ఈ విధంగా ధర్మం గురించి చెప్పాలని విద్యార్థులను రకరకాలుగా ప్రశ్నించి వారి ద్వారానే సమాధానాలు రాబట్టింది.
మరో ఉదాహరణం చూద్దాం: ఇక్కడ కొందరు అల్లరి పిల్లలున్నారు. తల్లి కూడా లేదేమో పెంకి ఘటాలుగా తయారయ్యారు.పాఠాలు చెప్పాలని వచ్చిన మాస్టార్ల నందరిని నానావిధాలుగా భయపెట్టి వారిని పారిపోయేట్టు చేస్తుంటారు.ఇప్పుడు వీళ్ళకు ఒక కొత్త పంతులమ్మవచ్చింది.వీళ్ళ అల్లరంతా కనిపెట్టి వీళ్ళను దారికి తేవడానికి తాను కూడావారి లాగే అల్లరి పిల్లలాగా మారిపోయి స రి గ మల ఆటతో వారిని దారికి తేవడానికి ఇలా ప్రయత్నిస్తుంది అదేంటో చూద్దామా! "రావు గారిల్లు" సినిమాలోనిదీ పాట: స_సరాగాలాడాలి :రి_రిగం మరచి ప _ పసి వయసులో:గ _ గడుసు విడిచి మ_ మనమంతా ఆట పాటల్లోనా>>> ఇలా ఆటపాటలతో ఆ అల్లరి పిల్లలకు దగ్గరవ్వడానికి ఆ పంతులమ్మ పడే తిప్పలివి.ఈ విధంగా పాఠాలు బోధించే గురువులు పిల్లల అభిమానాన్ని తప్పకుండా పొందగలుగుతారు.ఆ కోవలోని మరో పాటను చూద్దామా సరిగమపా పాట పాడాలి పాటలోనే పాఠాలన్ని నేర్చుకోవాలీ అంటూ పాటల ద్వారా పాఠాలు నేర్చుకొనే దృశ్యం మనకిక్కడ కనుపిస్తుంది.
రైతు బిడ్డ చిత్రంలో గురువు శిష్యులతో పాఠాన్నిపాటగా మలచి వారితో వల్లే వేయిస్తూ సాగే పాట ఇది. అ--- అమ్మా, ఆ ---- ఆవు అమ్మ వంటిదే ఆవు అది తెలుసుకో నీవు ఇ----- ఇల్లు, ఈ -----ఈశ్వరుడు ఇంటిని ఇలను కాచేదెవరు ఈశ్వరుడు పరమేశ్వరుడు.
ఇంతే కాదు విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీసే గురువుల పాత్రలు కొన్ని చిత్రాల్లో వున్నాయి.దీనికి చక్కని ఉదాహరణగా బాలమిత్రుల కథలో గురువుగా జగ్గయ్య నటించిన పాత్రను చెప్పుకోవచ్చు.అందులో ఆయన కుల మత వర్గ భేదాల కతీతంగాతన విద్యార్థులను తీర్చిదిద్ది వారిని ప్రోత్సహించడం గమనించవచ్చు.
లేత మనసులు చిత్రంలో " పిల్లలు దేవుడు చల్లని వారే" అనే పాటలో కల్లాకటం లేని పిల్లలు దేవుళ్ళతో సమానమని కానీ పెరిగే కొద్ది ఈర్ష్యాసూయలు పెరుగుతాయని వాటిని లేతగా వున్నప్పుడే తుంచాలనే సందేశం కన్పిస్తుంది.
ఈ విధంగా పాఠాలు బోధించడానికి అనేక పద్ధతు లుంటాయని వాటిని అనుసరిస్తే పిల్లలు కూడా అందులో లీనమవుతారని,ఆయా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారని మన చలన చిత్రాలలో చూపడం జరిగింది.
ఆట పాటలతో విద్యార్థులకు పాఠాలపై ఆసక్తి కలిగేటట్లు చేయడం ఉపాధ్యాయుల కర్తవ్యం.కొన్ని చిత్రాలలో ప్రత్యక్షంగా గురువు కనిపించక పోయినా సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులచే మన సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలు చేయించి నట్లు చిత్రీకరించారు. ఇలా ఉపాధ్యాయులు బోధనా వివరించే గీతాలు మన చలన చిత్రాలలో చాలా కనిపిస్తాయి.
ప్రబోధ గీతాలు :ఉపాధ్యాయులు తమ మాటలనేప్రబోధాలుగా చేసి పిల్లలను చైతన్య వంతులను చేయాలి.ఇటువంటి ప్రబోధ గీతాలు మన సినిమాలలో అనేకం కనిపిస్తాయి.వీటిని రెండువిభాగాలుగా విభజించ వచ్చు.
౧ చారిత్రిక ప్రబోధ గీతాలు. ౨సాంఘీక ప్రభోధ గీతాలు.
౧.చారిత్రిక ప్రబోధ గీతాలు :--ఉపాధ్యాయుడు ఎప్పుడు పాఠాలు మాత్రమే బోధించి విద్యార్థులను తరగతి గదులకే పరిమితం చేయకుండాఅప్పుడప్పుడు విద్యార్థులను వినోద విహార యాత్రల పేరుతో ఇతర ప్రాంతాలకుతీసుకెళ్ళి చారిత్రిక కట్టడాలను చూపించడం చేయాలి. విద్యార్థులను విహార యాత్రలకు తీసుకెళ్ళినప్పుడు ఉపాధ్యాయుడు అక్కడ "గైడు"గా మారి పిల్లలకు చారిత్రిక కట్టడాలకు సంబంధించిన విశేషాలను వారికి అర్థమయ్యే భాషలో చెప్పాలి. అలాంటి సన్నివేశాన్ని ఇక్కడ ఓ ఉపాధ్యాయుడు మలచుకొన్నాడు. విహార యాత్రలో భాగంగా విద్యార్థులను భాగ్య నగరానికి తీసుకొచ్చాడు. ఈ భాగ్య నగరం గొప్పదనాన్ని గురించి,అందాలను గురించి ఈ విధంగా వర్ణిస్తున్నాడు. "ఇదేనండి ఇదేనండి భాగ్య నగరము మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్య పట్టణం:; ౧ అది పాడు బడిన గోలకొండ కోట శ్రీరాముడు కనిపించే తానీషాకీచోట భద్రాద్రి రామదాసు బందీ ఖానా ఇదిగో చూడండి ఈ కోటలోన :: ౨అలనాడు వచ్చెనిట మహమ్మారి అల్లా దయ వల్లాఅ గండం గడిచిందని గురుతు నిలిపినారు ఆగురుతే అందమైన చార్మినారు ::
అదే విధంగా మరో ఉదాహరణ చూద్దాం.ఇక్కడ మరో ఉపాధ్యాయుడు తన విద్యార్థులను చంద్రగిరికి తీసుకు వచ్చి చంద్రగిరి గొప్పదనాన్ని చారిత్రిక నేపథ్యాన్ని ఎలా వివరిస్తున్నాడో చూడండి. "ఇదే ఇదే చంద్రగిరీ" శౌర్యానికి గీసిన గిరి" అంటూ చంద్రగిరి ప్రాశస్థ్యాన్ని వివరించాడు గురువు.
ఈ విధంగా అనేక ఉదాహరణలు మనకు చలన చిత్రాలలో కనిపిస్తాయి. మన పెద్దలు జ్నానార్జనకు నాలుగు మార్గాలున్నాయని చెప్పారు. ౧ గురు బోధ ౨గ్రంథ పఠనం ౩దేశాటనం ౪లోకానుభవం. వీటిలో జ్నానార్జన పద్ధతి గురువుదే.గురుబోధ లేనిదే మిగిలిన ఆ మూడూ రాణించవని పెద్దల భావన.
సాంఘీక ప్రబోధ గేయాలు : ఉపాధ్యాయుడు విద్యార్థులకు సత్యాన్ని గురించి, ధర్మాన్ని గురించి, మంచి నడవడిని గురించి అవగాహన కలిగించిమంచి మార్గంలో పెట్టడానికి సహకరించాలి.దీనికొక ఉదాహరణ చూద్దాం.
ఇక్కడ కొంతమంది పిల్లలున్నారు. వారంతా ప్రేమను పంచే తల్లి దండ్రులు లేక, భోజనం పెట్టే ఆత్మీయులు లేక ఆకలితో అన్నం కోసం దొంగతనం చేసి జైల్లోకి వచ్చారు. వారిని మంచి దారిలో నడపడానికి ఓ పంతులమ్మ చెబుతున్న మంచి మాటలను ఈ పాటలో చూద్దామా ! " చెడు అనవద్దు చెడు కనవద్దు చెడు వినవద్దు ఇది బాపూజీ పిలుపు ఇదే మేలుకొలుపు ఇదే మేలుకొలుపు".ఇలా బాపూజీ మాటలతో ఆ పిల్లల్లో మంచితనాన్ని మేలుకొలిపే ప్రయత్నాన్ని చేస్తుంది. ఇలాంటి పాటలు మన కవులెందరో వ్రాసి పేరు పొందారు.
దేశభక్తి గీతాలు: విద్యార్థుల్లో దేశభక్తిని కలిగించిదేశాభిమానాన్ని పెంచడం ఉపాధ్యాయుల మరొక విధి. జననీ జన్మభూమిశ్చ" అన్నారు పెద్దలు.అంటే జననితో పాటు జన్మభూమిని కూడా ప్రేమించాలని అర్థం. ప్రతి పౌరుడు తనమాతృ మూర్తి పట్ల ఎంతగౌరవాన్ని ప్రదర్శిస్తాడో అంతే గౌరవాన్ని,బాధ్యతను మాతృదేశం పట్ల చూపాలి.ఉపాధ్యాయుడు చిన్నతనం నుండే విద్యార్థుల్లో ఈ విధమైన జాతీయ భావాలను పెంపొందించడానికి కృషి చేయాలి. ఇక్కడ ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు భారత దేశము యొక్క గొప్పదనాన్ని ఏ విధంగా వర్ణిస్తున్నాడో చూడండి. " భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికే జేజేలు" అంటూ భారతమాతకు వందనాలర్పిస్తూ హిమాలయాల దాకా విస్తరించిన భూముల్లో బంగారు పంటలు పండించిప్రజలందరికి జీవనాధారమైన భూమి గొప్పదనాన్ని వివరిస్తున్నాడు.
మరో ఉదాహరణ: "జయజయ జయ ప్రియ భారతి జనయిత్రీ దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి" భారత మాతకు జయం పలుకుతూ భరతభూమి పాడి పంటలతో సస్యశ్యామలంగా విరాజిల్లుతూ కోట్లమంది భారతీయుల హృదయాల్లో భారత మాత కొలువై వుందని తెలుపుతుంది.ఇలా దేశభక్తిని వివరించే గీతాలు మన చలనచిత్రాలలో కో కొల్లలుగా కనిపిస్తాయి.
ఇవన్ని ఒకప్పటి చిత్రాలలోని ఉపాధ్యాయుల పాత్ర చిత్రణ.అల్నాడు ఆదర్శభావాలతో సంస్కరణాభిలాషతో ,ఎంతో ఉదాత్తంగా ఉపాధ్యాయ పాత్రలు తీర్చిదిద్ద బడినవి. నాటి చిత్రాలలో నాయకులైన రామారావు,నాగేశ్వరరావు, శోభన్ బాబు, ,కృష్ణం రాజు,రామకృష్ణ,కృష్ణ మొదలైన వారు ఉపాధ్యాయ పాత్రలు పోషించి ఉపాధ్యాయుల గౌరవాన్ని ఇనుమడింప చేశారు. నేటి చిత్రాలలో గౌరవప్రదమైన ఆ పాత్రలను బ్రహ్మానందం, బాబూ మోహన్, మొదలైన హాస్యనటులు తమ "కమేడియన్" ఇమేజ్ కు తగ్గట్టుగా తాము పోషిస్తున్న ఉపాధ్యాయ పాత్రలను ధరిస్తున్నారు.
మరల చలనచిత్రాలలో పుర్వ ప్రాభవంతో ఉపాధ్యాయులు అలరాలాలని ఆకాంక్షిద్దాం. (తెలుగు పునశ్చరణ తరగతిలో సమర్పించిన సామూహిక వ్యాసం కొద్దిగా మార్పులతో)
No comments:
Post a Comment