ధర్మ బద్ధ కామము-ఆవశ్యకత
పప్పు కౌసల్య
నేటి మహిళామణులు మన కట్టు-బొట్టులకు ఎందుకనో ప్రాద్ధాన్యమివ్వడం లేదు . నుదిటన బొట్టు ,కళ్ళకు కాటుక ,మెళ్ళో తాళి ,చేతికి గాజులు వీటి వైశిష్ట్యం తెలియక /అక్ఖర్లేదనుకొని వదిలేస్తున్నారు . ముత్తైదువులు ఇవి పెట్టుకోడానికి బాధ పడుతుంటే, అవి వాడకూడని వాళ్ళు విరివిగా వాడుతున్నారు . మరి కలికాలం అంటే బహుశః ఇదేనేమో! మన పురాణాలలో చూస్తే మహాపతివ్రతలు అనేకులున్నారు. వారిలో ఒకరయిన సుకన్య ఒక మహావ్రుద్ధుడిని వివాహమాడి అతనికే సపర్యలు చేస్తూ(ఒక మహారాజు పుత్రిక అయి ఉండి కూడా) అశ్వినీ దేవతలు సైతం అబ్బురపడేలా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది . అది నేటి సమాజానికి అనువర్తిస్తే భర్త అందగాడు కాదు, ఆశ్రమంలో ఉన్నాడు , తన కనీస కోరికలు విని చూసే పరిస్థితి కూడా కాదు. అయినా ఆ అమ్మవారిని నమ్ముకుని అన్య ఆలోచన లేకుండా భర్తే దైవంగా భావించి పూజించినందులకు ఆ వ్రుద్ధుడే యవ్వనుడిగా మారి తనకు ఆనందాన్ని పంచాడు . ఇక్కడ భర్త ప్రేమ పొందడం ముఖ్యం గాని మన పుట్టింటి సిరుల గూర్చి తలంపే అనవసరం . భార్య భర్తల మధ్య ప్రేమ-అనురాగాలు వెల్లివిరియాలంటే అందం ,ధనమ్, హోదా , నివసించే ఇల్లు ఇవేమీ ముఖ్యం కాదు . ఒకరిపై ఒకరికి అనంత మయిన నమ్మకము ప్రేమలు పెంపొందించుకోవాలి . సుకన్య కి కూడా తల్లి తండ్రీ అతనిని వదిలి వచ్చేయమని చెప్పారు . కాని ఆవిడ అలా వినలేదు కనుకనే, ఇవాళ మహా పతివ్రతగా చరిత్రలో నిలిచిపోయింది . ఆడవారు కనీసం ఓర్పు వహించకపోతే కాపురాలు నిలవవు . దీనికి పెద్దవారు తోడుగా ఉంది వారిని కలిపే ప్రయత్నం చేయాలి తప్ప విడదీయడం మహా పాపం . ఆడది ఎంత చదువుకున్నా, ఎంత సంపాదిస్తున్నా భర్త అభిమానాన్ని చూరగొనలేక పోతే అవన్నీ వ్యర్ధం, నేటి మహిళలకి తాము కూడా మగ వారితో సమానముగా సంపాదన, చదువు ఉంటున్నాయి అనే ఒక అహంకార ఆలోచనలతో వారిలో సహజ సిద్ధంగా ఉండే ప్రేమ మాయమైపోతోంది . ఈ ప్రేమ అన్న పదార్ధం కరువయితే ఆడదానిలో ఇక సృష్టి అంతమయిపోతుంది . ఆడతనం, అమ్మతనం మన సొత్తు . ఇంకొక జీవికి జన్మనిచ్చే గొప్ప వరం ఆడదానికే ఉంది . అది భర్త ప్రేమానురాగాలకి ఒక నిదర్సనం . అలాగే భర్త కూడా భార్యకి ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉండాలి . ఒక వంశం నుండి వచ్చి ఇంకొక వంశాన్ని ఉద్ధరించే మహత్కార్యాన్ని ఆడది తన పై వేస్కుంది . ఈ వివాహ వ్యవస్థ గట్టిగా ఉన్నంతకాలం మనకు వానలు కురుస్తాయి . అన్నం పుడుతుంది . దానిని కాపాడుకునే బాధ్యత నేటి యువతీ యువకులు తీస్కొవాలి. వివాహానంతరం ప్రేమ చిగురింప చేస్కోవాలి . ముందు ప్రేమ తరువాత పెళ్లి అంటే ఆ బంధానికుండే పవిత్రత కోల్పోయి సంసారం స్వర్గ తుల్యంగా మలచు కోలేక పోతున్నారు . రండి, నేటి యువత ఇదే మీకు ఆహ్వానం . మీ వైవాహిక జీవనం సుఖ సంతోషాలతో నింపుకోడానికి మన పూర్వులు మనకిచ్చిన అపూర్వ సంపద ఈ పురాణాలు . వాటిని త్రవ్వి ఆవిష్కరిద్దాం ,ఆ రతనాలని అందుకుందాం , ఆనందమయ జీవనం గడుపుదాం . ధర్మ బద్ధ కామాన్నే ఉపయోగిస్తూ సుఖిద్ధామ్.
No comments:
Post a Comment