తూర్పుగోదావరి జిల్లా సినీ ప్రముఖులు -3 - అచ్చంగా తెలుగు

తూర్పుగోదావరి జిల్లా సినీ ప్రముఖులు -3

Share This

తూర్పుగోదావరి జిల్లా సినీ ప్రముఖులు -3 

-పోడూరి శ్రీనివాస్ 


గత రెండు సంచికలలో తూర్పుగోదావరి జిల్లాలోని సినీరంగ ప్రముఖుల గురించి తెలుసుకుంటున్నాము. ఈ సంచికలో గూడా మూడవభాగంగా, తూర్పుగోదావరి  నుంచి సినీరంగంలో ప్రముఖులుగా పేరొందిన మరి కొందరి గురించి తెలుసుకుందాము.
1.చిత్తజల్లు పుల్లయ్య: సి.పుల్లయ్యగా, సినీరంగం తొలిదశలోని ప్రేక్షకులకు సుపరిచితులు. 1898వ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలోని ‘కాకినాడ’లో జన్మించారు. బాల్యంనుంచీ సినీరంగం మీద మక్కువతో, సినీరంగంలో దర్శకత్వశాఖలో అనేక ప్రయోగాలు చేశారు.
ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీవారి మొట్టమొదటి భారతీయసినిమా, 1933లో నిర్మించిన ‘సతీసావిత్రి’కి తొలిసారిగా దర్శకత్వం వహించారు. తొలిప్రయత్నంలోనే, దర్శకత్వం వహించిన ‘సతీసావిత్రి’ చిత్రానికి గాను ‘వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్’లో గౌరవడిప్లోమోనుసాధించారు. ఆ మరుసటి సంవత్సరమే 1934లో పూర్తిగా బాలలతో నిర్మించిన తొలిచిత్రంగా చరిత్రపుటలకెక్కింది చిత్రం. అదే సంవత్సరం –‘లవకుశ’ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు.
దర్శకునిగా శ్రీ పుల్లయ్య చిత్రాలలో కొన్ని:1933లో మొదలుకొని రామదాసు; సతీసావిత్రి; లవకుశ; శ్రీ కృష్ణతులాభారం; అనసూయ-ధృవ; వరవిక్రయం; బాలనాగమ్మ; నారద-నారది; గొల్లభామ; మొహినీభస్మాసుర; పక్కింటి అమ్మాయి; దేవాంతకుడు; మాలతీమాధవం; అపూర్వసహోదర్ గళ్(తమిళం); వింధ్యరాణి; లవకుశ(కలర్); పరమానందయ్య శిష్యుల కథ; భువన సుందరి కథ; భామా విజయం...మొదలైనవి.
‘వరవిక్రయం’  ద్వారా మేటినటి, బహుముఖా ప్రజ్ఞాశాలి ‘భానుమతి’ని తెలుగు చిత్ర సీమకు పరిచయం చేశారు.
‘మోహినీ భస్మాసుర’ చిత్రం 1938లో నిర్మించబడినది. ఆరోజుల్లోనే ఈ చిత్రం అవుట్ డోర్ లో చిత్రీకరించబడినది.
‘అనసూయ-దృవ’ అనే సినిమా – రెండు కథలతో కూడిన రెండు సినిమాలు కలిపి, ఒకే సినిమాగా రిలీజ్ చేశారు.
1963లో విడుదలయిన ‘లవకుశ’(కలర్)’ సినిమాకు శ్రీ పుల్లయ్య, నిర్మాత – దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రం, చిత్రీకరణ 7 సంవత్సరములు పట్టిందంటే చిత్రీకరణలో ఎంత శ్రద్ధ వహించాలో తెలుసుకోవచ్చు. ‘లవకుశ’ చిత్రానికి జాతీయస్థాయిలో ఉత్తమచిత్రంగా బహుమతి లభించింది. cs rao కూడా దర్శకత్వం వహించారు. కాకినాడలో ‘సిటీ ఎలక్ట్రిక్ సినిమా’ పేరుతో ఒక సినిమా థియేటర్ నిర్మించారు, శ్రీ పుల్లయ్య. తర్వాత – ఆ థియేటర్ – మినర్వా థియేటర్ గా పేరు మార్చబడింది.
సుప్రసిద్ధ సినీదర్శకుడు, చిత్తజల్లు శ్రీనివాసరావు – cs rao ఈయన కుమారుడే!
శ్రీ పుల్లయ్య తన 69వ ఏట 06.10,1967న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తెలుగు థియేటర్ మూమెంట్ కు ఆద్యుడిగా, తండ్రిగా శ్రీ పుల్లయ్యగార్ని వ్యవహరిస్తారు.
  1. చిత్తజల్లు శ్రీనివాసరావు (C.S.RAO): నటుడు, రచయిత, దర్శకుడు – సి.ఎస్.రావ్ గా పేరెన్నికగన్న శ్రీ చిత్తజల్లు శ్రీనివాసరావుగారు ప్రసిద్ధ దర్శకుడు, అనేకప్రయోగాలు చేసిన దర్శకుడు శ్రీ చిత్తజల్లు పుల్లయ్యగారి కుమారుడు.
1924వ సంవత్సరంలో కాకినాడలో శ్రీ cs రావు జన్మించారు. తన తండ్రితో బాటు ‘లవకుశ’ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను వహించారు.
1953లో తమిళంలో ‘పోనీ’చిత్రం ద్వారా దర్శకునిగా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగులో దర్శకత్వం వహించిన తొలిచిత్రం 1955లో విడుదలైన ‘శ్రీ కృష్ణతులాభారం’
శ్రీ csరావు దర్శకత్వం వహించిన చిత్రాల్లో ప్రముఖమైనవి: దేశమంటే మనుషులోయ్; లవకుశ; మంచి మనసుకు మంచి రోజులు; శ్రీ కృష్ణ తులాభారం; శాంతినివాసం; అభిమానం; టైగర్ రాముడు; వాల్మీకి; కంచుకోట; గోవులగోపన్న; ఏకవీర; జీవితచక్రం; ధనమా?దైవమా?; శ్రీ కృష్ణార్జునయుద్ధం;యశోదకృష్ణ; మహాకవి క్షేత్రయ్య; సత్య హరిచ్చంద్ర; గృహలక్ష్మి; నిలువుదోపిడి; నిండు సంసారం; బంగారు గాజులు... మొదలైనవి.
సుమారు 70 చిత్రములకు తెలుగు;తమిళం;మలయాళం; ఒరియా భాషల్లో – దర్శకత్వం వహించారు;
లవకుశ చిత్రానికి 1963వ సంవత్సరంలో; 1970వ సంవత్సరంలో దేశమంటే మనుషులోయ్ చిత్రానికిగానూ 2 సార్లు జాతీయ చలన చిత్ర అవార్డ్ లను గెలుచుకున్నారు. సినీ ప్రముఖులైన శ్రీమతి కన్నాంబ, శ్రీ కడారు నాగభూషణం గారి కుమార్తెను వివాహం చేసుకున్నారు. అనంతరం అమెకు విడాకులిచ్చారు. తరువాత నాట్యతార, కథానాయిక అయిన ‘రాజసులోచన’ను వివాహం చేసుకున్నారు. వీరిరువురికి కవలలు ఉదయించారు. 08.12.2004న చెన్నైలో శ్రీ csరావుగారు మరణించారు.
3.శ్రీమతి కృషవేణి: నటి, గాయని, నిర్మాత, దర్శకురాలు అయిన కృష్ణవేణి 26.12.1924న రాజమండ్రిలో జన్మించారు.
          బాల్యంలో బాలనటిగా నాటకాల్లో నటించారు. బాలతారగా 1936లో ‘సతీ అనసూయ – దృవ’ తో చలనచిత్రరంగ ప్రవేశం చేశారు. సుమారు 15 తెలుగు చిత్రాల్లోనూ, కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లో కథానాయికగా నటించారు. తెలుగు చిత్రనిర్మాత శ్రీ మీర్జాపురం రాజాను వివాహమాడారు. శ్రీ రాజావారు అనేక తెలుగుచిత్రాలు నిర్మించారు 1949లో వారు నిర్మించిన ‘మనదేశం’ సినిమాతోనే ప్రసిద్ధ కథానాయకుడు శ్రీ యన్.టి.రామారావుగారు చలన చిత్ర రంగ ప్రవేశం  చేశారు. అదే సినిమాతో ప్రసిద్ధగాయకుడు, సంగీత దర్శకుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు గారిని సంగీత దర్శకునిగా పరిచయం చేశారు. ఎంతోమంది నటులను, గాయకులను, సంగీత దర్శకులను తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయం చేసిన ఘనత శ్రీమతి కృష్ణవేణి – శ్రీ మీర్జాపురం రాజావారి సంస్థదే. 1957వ సంవత్సరంలో ప్రసిద్ధ సంగీతదర్శకుడు శ్రీ రమేష్ నాయుడుగార్ని చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.
          చలనచిత్ర పరిశ్రమకు శ్రీమతి కృష్ణవేణి చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు 2004వ సంవత్సరంలో ప్రఖ్యాత రఘుపతి వెంకయ్య అవార్డ్ ప్రదానం చేయడం జరిగింది.
90వ సంవత్సరాల వయసులో కూడా శ్రీమతి కృష్ణవేణిగారు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటూ చలన చిత్ర సంబధిత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
4.పేకేటి శివరాం : నటుడు, దర్శకుడు శ్రీ పేకేటి శివరాం 08.10.1918వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోగల ‘పేకేరు’ అనే గ్రామంలో జన్మించారు.
          తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో సుమారు 80 చిత్రాల్లో నటుడిగా కనిపించారు. సుమారు 9 చిత్రాలకు దర్శకత్వం వహించారు (తెలుగు, కన్నడ చలనచిత్రరంగంలో)
          వీరు మొదట ప్రభావతిని, తరువాత నటి జయంతిని వివాహం చేసుకున్నారు. వీరి కుమారుల్లో శ్రీ పేకేటి రంగా ప్రసిద్ధ కళాదర్శకుడు. అల్లుడు శ్రీ త్యాగరాజన్, తమిళచిత్రరంగంలో పేరొందిన నటుడు, దర్శకుడు. శ్రీ త్యాగరాజన్ కొడుకు ప్రశాంత్ (పేకేటి శివరాం మనుమడు) నేటికీ తమిళ చిత్రరంగంలో నటుడిగా వెలుగొందుతున్నాడు.
          శ్రీ పేకేటి శివరాం, శ్రీ నాగేశ్వరరావు నటించిన ‘దేవదాసు’ సినిమాలోని దేవదాసు స్నేహితుడు –‘భగవాన్’ పాత్ర ద్వారా గొప్పపేరు సంపాదించారు.
          88 సంవత్సరాల వయసులో 30.12.2006నాడు చెన్నైలో మరణించారు. 2002వ సంవత్సరంలో శ్రీ పేకేటి శివరాంగారికి HMరెడ్డి అవార్డ్ ప్రదానం చేయడం జరిగింది.
5.మామిడిపల్లి వీరభద్రరావు (సుత్తి వీరభద్రరావు): హాస్యబ్రహ్మ జంధ్యాల సినిమాలతో ‘సుత్తి జంట’గా పేరు పొందిన వేలు-వీరభద్రరావు ద్వయంలో ఒకడైన సుత్తి వీరభద్రరావు అసలు పేరు మామిడిపల్లి వీరభద్రరావు. వీరు తూర్పుగోదావరి జిల్లాలోని ‘అయినాపురం’ అనే గ్రామంలో 06.06,1947న జన్మించారు. వీరు రేడియో మరియు థియేటర్ ఆర్టిస్టుగా పేరు గావించారు.
1981 లో విడుదలైన ‘జాతర’ శ్రీ వీరభద్రరావు తెరపై కనిపించిన మొదటి సినిమా. 1982లో జంధ్యాల దర్శకత్వంలో విడుదలైన “నాలుగు స్తంభాలాట”తో శ్రీ వీరభద్రరావు బాగా ప్రసిద్ధి పొందారు.
శ్రీ జంధ్యాల, వీరభద్రరావుగారికి విజయవాడ ssrకాలేజ్ లో సహాధ్యాయి, శ్రీ వీరభద్రరావుగారు, హాస్యపాత్రలకు పేరు పొందారు. వారెక్కువగా శ్రీ జంధ్యాల, రేలంగి నరసింహరావుగారి చిత్రాల్లో నటించారు.
1982 నుంచి  1988 వరకు 200కు పైగా చిత్రాల్లో శ్రీ వీరభద్రరావు నటించారు. వారు నటించిన చిత్రాల్లో ముఖ్యమైనవి:
జాతర, నాలుగుస్తంభాలాట, రెండురెళ్లుఆరు, మూడుముళ్లు, పుత్తడిబొమ్మ, శ్రీ వారికి ప్రేమలేఖ, ఆనందభైరవి, బాబాయి – అబ్బాయి, ఒక రాధ-ఇద్దరు కృష్ణులు, జీవనపోరాటం, చంటబ్బాయి, అః నా పెళ్ళంట, నీకు-నాకూ పెళ్లంట,వివాహభోజనం, చూపులు కలిసిన శుభవేళ..మొదలైనవి.
చూపులు కలిసిన శుభవేళ, శ్రీ వీరభద్రరావు నటించిన ఆఖరు సినిమా.
శ్రీ వీరభద్రరావుగారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె – సంతానం. 30.06.1988 న గుండెపోటుతో చెన్నైలో శ్రీ వీరభద్రరావు కన్నుమూశారు. చనిపోయేటప్పటికి శ్రీ వీరభద్రరావు వయస్సు కేవలం 41 సంవత్సరాలు. సుమారు నవ్వులరేడు ప్రేక్షకులను దుఃఖసాగరంలో ముంచి దివికేగాడు.
  1. లంక భద్రాద్రి శ్రీరాం (LB శ్రీరాం): తూర్పుగోదావరిజిల్లా నేదునూరు గ్రామంలో పుట్టిన లంక భద్రాద్రి శ్రీరాం భవిష్యత్తులో గొప్పనటుడిగా, స్క్రీన్ ప్లే రైటరుగా ఖ్యాతి పొందుతాడని, చిన్నతనంలో ఎవరూ ఊహించి ఉండరు. లంక భద్రాద్రి శ్రీరాం అంటే ఎవరికీ తెలియదు – అదే LB శ్రీరాం అంటే తెలియని వారుండరనేది అతిశయోక్తి కాదు.
          పలుసిన్మాల్లో అతిథి పాత్రాలు ధరించినప్పటికీ, 2000వ సంవత్సరంలో EVV సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘చాలా బాగుంది’ సినిమాతో శ్రీ LB శ్రీరాం బాగా గుర్తింపు పొందాడు. ఒక ప్రత్యేకమైనయాసతో డైలాగులు చెప్పడంతో శ్రీ LB శ్రీరాం నలుగురి దృష్టిని ఆకర్షించాడు.
          శ్రీ LB శ్రీరాంలో చక్కటి నటుడే గాక, ఎంతో ప్రతిభగల స్క్రీన్ ప్లే రచయిత కూడా దాగున్నాడు. అనేక విజయవంతమైన సినిమాలకు LB శ్రీరాం స్క్రీన్ ప్లే అందించాడు.
          నటుడిగా చాలా బాగుంది, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, మృగరాజు, బడ్జెట్ పద్మనాభం, అమ్మాయి నవ్వితే,హనుమాన్ జంక్షన్, తప్పుచేసి పప్పుకూడు, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, మిస్సమ్మ, దిల్, రాధాగోపాళం, సుభాష్ చంద్రబోస్, శివరామరాజు, బన్నీ, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, గమ్యం, పాండురంగడు, స్టాలిన్, రచ్చ, కృష్ణం వందే జగద్గురుమ్, లెజండ్, దరువు, సింహా, బలాదూర్...మొదలైన సినిమాల్లో నటించాడు.
​          రచయితగా ఏప్రిల్ 1 విడుదల​, ​భాగ్యలక్ష్మి బంఫర్ డ్రా , అరుంధతి​,  హిట్లర్, హలో బ్రదర్, అప్పుల అప్పారావు ​, కిష్కిందకాండ , వారసుడు ....​ఇత్యాది సినిమాలకు పనిచేశారు. ఇవన్నీ ఎంత గొప్ప విజయాన్ని సాధించాయో, ప్రేక్షక హృదయాలను ఎంతగా దోచుకున్నాయో తెలియనిది కాదు.
          అమ్మో ఒకటో తారీఖు’ అన్న సినిమా శ్రీ LB శ్రీరాం రచించిన ‘ఒంటెద్దు బండి’ అనే నాటిక ఆధారంగా తీయబడింది- నటనాపరంగా ఈ సినిమాలో శ్రీరాం విశ్వరూపం చూడవచ్చు.
          శ్రీ LB శ్రీరాంను నాలుగు నందులు వరించాయి. 1999లో విడుదలైన రామసక్కనోడు సినిమాకు బెస్ట్ డైలాగ్ రచయితగా, 2000లో విడుదలైన చాలా బాగుంది సినిమాకు బెస్ట్ మెల్ కమెడియన్ గా, 2009లో విడుదలైన సొంతఊరు సినిమాకు బెస్ట్ డైలాగ్ రచయితగా, బెస్ట్ కేరెక్టరు ఆర్టిస్ట్ గా శ్రీ LB శ్రీరాం రాష్ట్రప్రభుత్వం నుంచి నందులు స్వీకరించారు.

No comments:

Post a Comment

Pages