ఈ విలాసంబులును యీ చక్కదనములును
- డా. తాడేపల్లి పతంజలి
అన్నమయ్య అలమేలుమంగమ్మ సౌందర్యాన్ని వేంకటేశునికి వివరిస్తున్నాడు ఈ కీర్తనలో.
పల్లవి
ఈవిలాసంబులును యీ చక్కదనములును
భావించి చూడ నీ పడతికే తగును
1.నలినాక్షి చెక్కులివి నవ్వు వెన్నెల పొలము
విలుసామి గరిడి బొమ్మలకు నొసలు
పలుకు జిలుకకు మోవి పంజరపు దండెంబు
నలిగుంతలముల కాణాచి పెనుగొప్పు
2.గురు కుచములివియే సిగ్గులకు బుట్టిన ఇండ్లు
సరసములకిరవు హస్తముల కదలు
సురతముల విభవముల దాపురమున నెయ్యపు బిరుదు
కరుల యానముల నిలుకడ వనము తొడలు
3.అన్నువగు నడుము గుట్టనెడి సింహపు నెలవు
తిన్నని మొగము కళలు దేరు తెంకి
మన్నించి యేలితివి మరిగి శ్రీవేంకటేశ
ఇన్ని సింగారముల నెనసె నీ లలన
(27 వ సంపుటము 591 కీర్తన 1799 రేకు)
అర్థ తాత్పర్యాలు
ఈవిలాసంబులును యీ చక్కదనములును
భావించి చూడ నీ పడతికే తగును
విలాసము =1. క్రీడ;2. ప్రియసందర్శనాదులచేతనగు యానావలోకనాది క్రియావిశేషరూపమైన స్త్రీలయొక్క శృంగారచేష్టావిశేషము. 3.ఒయ్యారము.4. సొగసు.
వేంకటేశా ! ఈ విలాసాలు, ఈ అందాలు – ఆలోచించి చూస్తే – ఈ లోకంలో నీ భార్య యైన అలమేలుమంగమ్మలోనే
ఉన్నట్లు అనిపిస్తోంది.ఇంకా వేరే ఏ స్త్రీ మూర్తిలోనూ లేవయ్యా! (ఆ విలాసాలు , ఆందాలేమిటో మూడు పాదాలలో కవి వర్ణిస్తున్నాడు.)
1.నలినాక్షి చెక్కులివి నవ్వు వెన్నెల పొలము
విలుసామి గరిడి బొమ్మలకు నొసలు
పలుకు జిలుకకు మోవి పంజరపు దండెంబు
నలిగుంతలముల కాణాచి పెనుగొప్పు
నలినాక్షి = తామరలవంటి కన్నులు గలది; సాముగరిడీ = వ్యాయామశాల ; దండెము =చెఱకుతోటలో చెరుకుగడలకు అడ్డముగా కట్టిన వెదురు. నలి= నలిగిన ;కుంతలము= వెంట్రుకలు; కాణాచి =చిరకాలస్థానము.
తామరలవంటి కన్నులు గల అలమేలుమంగమ్మ చెక్కిళ్లు - నవ్వు అనెడి వెన్నెల పొలాల వంటివి.(పైరు పెట్టు నేలపొలము. నవ్వు అనే పైరు ఆమె చెక్కిళ్లలో ఎప్పుడూ విరగ కాస్తుంటుందని కవి భావం)
ఆమె ధనుస్సులాంటి కనుబొమ్మలకు నుదురు వ్యాయామ శాల.(వ్యాయామముతో బలము, అందం వస్తాయి. నుదురు అనే వ్యాయామశాలలో కను బొమ్మలు అందం కోసం వ్యాయామం చేస్తుంటాయి.కనుబొమ్మలు అందంగా ధనుస్సులాగా వంపు తిరిగి ఉన్నాయని భావం)
అలమేలుమంగమ్మ పలుకు చిలుకలాంటిది. ఈ చిలుక ఎగిరిపోకుండా అమె పెదవి ఒక పంజరపు దండెములా ఉంది. ఆ పంజరం చెరుకుగడలకు అడ్డముగా కట్టిన వెదురుతో అల్లబడింది .( రెండు పెదవులను చెరుకుగడలతో పోల్చాడు కవి. నమో నమః)
అమ్మవారికి పెద్ద జడ ఉంది. అది నలిగిన, యోగ్యమయిన సువాసనలీనే వెంట్రుకల నివాస స్థానము.(నలిగిన వెంట్రుకలేమిటండి అని అడిగే పరిస్థితి అన్నమయ్య పాఠకులకు రాకుండు గాక!)
2.గురు కుచములివియే సిగ్గులకు బుట్టిన ఇండ్లు
సరసములకిరవు హస్తముల కదలు
సురతముల విభవముల దాపురమున నెయ్యపు బిరుదు
కరుల యానముల నిలుకడ వనము తొడలు
ఇరవు = స్థానము; కదలు = చలనము;దాపురము =దాచిన సొమ్ము; నిలుకడ =ఉనికి;వనము = సమూహము.
గొప్పవయిన ఆమె స్తనములు సిగ్గులకు పుట్టిన ఇళ్లు. అమె చేతుల కదలిక సరసాలకు స్థానము.ఆమె
నితంబములు రతి వైభవాలను దాచిన సొమ్ములు. ఏనుగు నడకలలోని అందాల సమూహాలకు ఉనికి ఆమె ఊరువులు.
3.అన్నువగు నడుము గుట్టనెడి సింహపు నెలవు
తిన్నని మొగము కళలు దేరు తెంకి
మన్నించి యేలితివి మరిగి శ్రీవేంకటేశ
ఇన్ని సింగారముల నెనసె నీ లలన
అన్నువు= పారవశ్యము. శోభ, మెరుగు;గుట్టు= మర్మము;తేరు= ముగించు ;తెంకి= స్థానము;ఎనయు= సరిపోలు; మరిగి= అలవాటయి
అందాల రహస్యమనెడి సింహానికి స్థానము – ఆమె నడుము. (సింహము నడుము వంటి నడుము గలది అని అర్థము."కడఁగిన శ్రీ వేంకటగిరి పతితోఁదడవి సింహమధ్యయు నొనఁగూడె." [తాళ్ల-7(13)-308]అని ఇంకోచోట కవి ఇలానే ప్రయోగించాడు.)
అందమైన ఆమె మొగము - కళల ముగింపు స్థానము. (అంటే ఇంక అంతకుమించి కళలు లేవు, అన్ని కళలు ఆమె మోములో ఉన్నాయని అందమయిన భావము)
శ్రీ వేంకటేశా ! ఆమెను అలవాటుగా ఆదరించి భార్యగా స్వీకరించావు.
నీ భార్య ఈ రకంగా ఇన్ని అలంకారములతో శృంగారములతో పోలికలు కలిగి ప్రకాశిస్తోంది.
(ఇద్దరూ మమ్మలిని దయ చూడండి)
స్వస్తి
No comments:
Post a Comment