'ఇండియన్ ఐడల్ -5' శ్రీరామచంద్రతో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

'ఇండియన్ ఐడల్ -5' శ్రీరామచంద్రతో ముఖాముఖి

Share This

ఇండియన్ ఐడల్ -5 శ్రీరామచంద్రతో ముఖాముఖి

- భావరాజు పద్మిని


రాముడు ఎలా ఉంటాడో మనకు తెలీదు. కాని, నడతలో, మాటలో, పాటలో, రూపంలో ఆ శ్రీరాముడిని తలపిస్తూ, 2010 లో కోట్లాది మంది తెలుగు ప్రజలు ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకుని, ‘ఇదిగో మా రాముడు’ అంటూ ఇండియన్ ఐడల్ గా ఎన్నుకున్న రాముడు – మన శ్రీరామచంద్ర గారు. ఇవాళ మనతో ముచ్చటించేందుకు సిద్ధంగా ఉన్నారు.
శ్రీరాం గారు, ‘రాముడు మంచి బాలుడు’ అంటారు కదా. మరి మీరు చిన్నతనంలో మంచి బాలుడేనా ?
ముందుగా మీరు చెప్పిన వాక్యాలకి కృతఙ్ఞతలు. నేను స్కూల్ లో చదివేటప్పటి నుంచి కొంచెం అల్లరి పిల్లాడినే. అంటే, అందరూ చిన్నతనంలో చేసే అల్లరే – స్కూల్ లో, ఇంట్లో అల్లరి, అమ్మ చేతుల్లో తన్నులు తినటం వంటివి ఉండేవి. కాస్త తుంటరి పిల్లాడిని. కాని, నేను బాగా క్రమశిక్షణ కలిగి ఉండేవాడిని. ఇక నా పేరు మా తాతగారు (అమ్మగారి నాన్నగారు) పెట్టారు. మా స్కూల్ లో అందరి పేర్లు శ్రీధర్, అల్ఫ్రెడ్, కిరణ్ ఇలా ఉండేవి. నా పొడుగైన పేరును ‘శ్రీరామచంద్రా..’ అని పిలుస్తుంటే కాస్త ఇబ్బందిగా ఉండేది. ‘నన్ను శ్రీరామ్ అని పిలవండి టీచర్’ అనేవాడిని. అది చిన్నతనం వల్ల తెలియక అన్నది. ఇప్పుడు అటువంటి అద్భుతమైన పేరు ఉన్నందుకు నాకు గర్వంగా ఉంటుంది.
మీ కుటుంబ నేపధ్యం గురించి చెప్పండి. మీ కుటుంబంలో సంగీతం పట్ల అభిరుచి ఉన్నవారు ఎవరైనా ఉన్నారా ?
మా స్వగ్రామం అద్దంకి, ప్రకాశం జిల్లా. మా నాన్నగారు అక్కడే చదువుకున్నారు. మా తాతగారు (నాన్నగారి నాన్నగారు) అక్కడ ఉండేవారు. ఆయనకి ఆటల్లో క్రికెట్ అన్నా, సంగీతం అన్నా చాలా ఇష్టం. ఆయన 2001 లో గతించారు. మా నాన్నగారు హై కోర్ట్ అడ్వకేట్. మా నాన్నగారు స్టేజి మీద సినీగీతాలు పాడేవారట. కాని, శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు. సంగీతం పట్ల మక్కువ నాలో సహజంగానే ఉంది, అలాగే పాడే వాడిని కూడా. రెండో ఏట నేను ఏడుస్తున్నప్పుడు మా అమ్మ ట్రాన్సిస్టర్ ఆన్ చేస్తే, ఏడుపు ఆపేసేవాడినట. నేను ఏకసంధాగ్రాహి లాగా రేడియో లో పాటలు విని పాడేవాడిని.
చిన్నప్పటి నుంచి గాయకుడు కావాలని అనుకునేవారా ?
అలాగేమీ లేదండి. అసలు ఏమవ్వాలో అన్న అవగాహన కూడా లేదు. మాదొక మామూలు మధ్యతరగతి కుటుంబం. నాన్నగారు అడ్వకేట్, అమ్మ ఎల్.ఎల్.బి చేసారు కాని, హౌస్ వైఫ్ గానే ఉండేవారు. నేను, నాన్నగారు, అమ్మ,చెల్లి ఇదే మా కుటుంబం. మా చెల్లికి గత ఏడాది పెళ్లి అయ్యింది. మాది చాలా పెద్ద కుటుంబం. నేను సెలవలకు అద్దంకి వెళ్ళినప్పుడు, మా తాతగారు అందరినీ చుట్టూ కూర్చోపెట్టుకునేవారు. మా పెద్దమ్మ కూతురు, మేనత్త కూతురు, కొడుకులు, ఇలా అందులో ఇద్దరు ముగ్గురు బాగా పాడేవాళ్ళు ఉన్నారు. అలా మా ముగ్గురినీ కూర్చోపెట్టి తలోపాటా పాడించేవారు. అక్కడ నాకు ‘నేను పాడగలను, తాతయ్యకు నా పాట ఇష్టం’ అన్న అవగాహన వచ్చింది. అప్పట్లో ‘కొండలలో నెలకొన్న’ అనేపాట, ‘కదిలే కాలమా’ అనేపాట, ఇలా అప్పట్లో ఫేమస్ అయిన ఈ పాటలు పాడేవాడిని. దాని తర్వాత మా మేనత్త గారి భర్త వేంకటాచలం గారని, మంచి గాయకులు ఉన్నారు. ఆయన ఇప్పటికీ స్టేజి షో లు చేస్తూ ఉంటారు. ఆయన కూతురు, నేను కలిసి రవీంద్రభారతిలో నా 8 వ ఏట ‘సిటి కేబుల్’ అనే ఛానల్ లో ఆయన ఏర్పాటు చేసిన లైవ్ టెలికాస్ట్ కార్యక్రమంలో ఒక 3,4 పాటలు పాడించారు. అలా మా మావయ్య ద్వారా మొదట స్టేజి కి పరిచయం అయ్యాను. అలా చదువుకుంటూ పాటలంటే ఇష్టం కనుక మధ్యమధ్య పాడేవాడిని. ఇది వృత్తిగా తీసుకోవాలని ఆలోచించలేదు. శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేదు.
మరి శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ఎప్పుడు మొదలుపెట్టారు ?
నేను ఇంటర్ విజయవాడ శ్రీచైతన్య లో చదివాను. అక్కడ అసెంబ్లీ లో పాడటం, ఆగష్టు 15 కి, గణతంత్రదినానికి పాడటం వంటివి చేసేవాడిని. అలా అందరికీ నేను పాడతానని తెలుసు. నా 17 వ ఏట, నేను ఇంజనీరింగ్ చదువుతూ ఉండగా,సంగీతం నేర్చుకోవాలన్న కోరిక కలిగింది. అప్పుడు ‘శ్రీ భక్త రామదాస మ్యూజిక్ కాలేజీ’ లో చేరి, శాస్త్రీయ సంగీతం అభ్యసించడం మొదలుపెట్టాను. అక్కడ ఇంజనీరింగ్ చదువుతూనే ఒక ఐదేళ్ళు కోర్స్ చేసాను. అలా మెల్లిమెల్లిగా టీవీ షోస్ కు వెళ్లాను. ఈ టీవీ లో సై –సింగెర్స్ ఛాలెంజ్, ఒక్కరే, వంటి పోటీల్లో పాల్గొంటూ నా కెరీర్ మొదలుపెట్టాను. తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు పాడాను.
మీరు కచేరీలు చేసారా ?
మా గురువుగార్లు ఇద్దరు లలిత – హరిప్రియ గార్లు. సికింద్రాబాద్ కాలేజీ లో హరిప్రియ గారు, కోటి కాలేజీ లో లలిత గారు నేర్పించేవారు. నేను హరిప్రియ గారి వద్ద నేర్చుకున్నాను. పెద్దపెద్ద కచేరీలు కాదు కాని, వినాయకచవితి సమయంలో సంప్రదాయ కార్యక్రమాలకు మా మేడం ను అడిగేవారు. ఆవిడ మమ్మల్ని పంపితే ఒక తంబుర, మృదంగం పెట్టుకుని, కొన్ని కృతులు, కీర్తనలు, వర్ణాలు అలా పాడేవాడిని.
ఇండియన్ ఐడల్ -5 లో విజయం పొందినప్పుడు మీరు ఎలా అనుభూతి చెందారు ?
అది వర్ణనాతీతం అండి. నా జీవితంలో మర్చిపోలేని క్షణం. ఇప్పటికీ నన్ను అదే పేరుతో గుర్తుపడతారు. ప్రతివ్యక్తికి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందని నేను నమ్ముతాను. నాకు ఇండియన్ ఐడల్ అనేది ఒక టర్నింగ్ పాయింట్. అంతకు ముందు కూడా నేను మ్యూజిక్ ఫీల్డ్ లో ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడిని. చాలా సినిమాల్లోనే పాడాను. కాని, దాన్ని అప్పటికి నేను ప్రవృత్తిగానే తప్ప, వృత్తిగా స్వీకరించలేదు. వచ్చిన అవకాశాలు వినియోగించుకునే వాడిని. కాని పూర్తిగా అదే వృత్తిగా స్వీకరించేందుకు తగిన ప్లాట్ఫారం నాకు లేదు. నాకు చిన్నప్పటి నుంచి హిందీ టచ్ బానే ఉండేది. స్కూల్ లో, అసెంబ్లీ లో హిందీ పాటలు బాగా పాడేవాడిని. అలా నాకు ఇండియన్ ఐడల్ కు వెళ్లి ట్రై చేద్దాం అనిపించింది. ఇంజనీరింగ్ 3 వ సం. లో ఉండగా నాన్నగారు, ‘ఇంకో ఏడాది ప్రయత్నించు, లేకపోతే వదిలేయ్’ అన్నారు. నిజానికి ఒక ఏడాదిలో అయ్యేది కాదనుకోండి. అయినా, నాన్నాగారు నామంచి కోరి అలా చెప్పారు. ఇండియన్ ఐడల్ నాకు లాస్ట్ ఛాన్స్ వంటిది. దీనితర్వాత నాకు ఏమీ దారి కనపడకపోతే ఇక జాబ్ లో చేరాలని అనుకున్నాను. అది నాకు ‘లాస్ట్ షాట్’ వంటిది. అక్కడికి వెళ్ళాకా నా కృషి, కష్టం అంతా చూసారు. నాకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైనది మ్యూజిక్, దీనికి యెంత కృషి చెయ్యగలిగితే అంత చెయ్యాలి, ఇది నాకు చివరి అవకాశం అనుకుని, ప్రతి ఎపిసోడ్ లో పెర్ఫోం చేసాను.
ఇండియన్ ఐడల్ తర్వాత మీ ప్రస్థానం ఎలా కొనసాగింది ?
బానే కొనసాగిందండి. నాకు ఎవరూ ఎక్జాంపుల్ కూడా లేరు. అదొక కొత్త బాట. ఒక గాయకుడు అనేవాడు హిందీ, తెలుగు పాట ఏదైనా పాడాలి అని నేను అనుకుంటాను. కర్ణాటక సంగీతంతో పాటు ఇండియన్ ఐడల్ ముందు చెన్నై వెళ్లి వెస్త్రెన్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను. ఒక ప్లే బ్యాక్ సింగర్ కు ఏ ఫీల్డ్ కు తగ్గట్టు అలా గొంతును మార్చుకునే టాలెంట్ ఉండాలి. ప్లే బ్యాక్ సింగర్ గా మొదలుపెట్టాను కనుక, నాకు అవగాహన ఉంది, కాని ఇప్పుడు కూడా నేను దాన్ని పర్ఫెక్ట్ చేసుకుంటున్నాను. 5,6 నెలలుగా బొంబాయిలో హిందుస్తానీ సంగీతం ‘గులాం ఉస్తఫా ఖాన్’ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అనుకోండి. కాని, ఇండియన్ ఐడల్ నాకు మంచి పేరును తీసుకువచ్చింది. దాన్ని నిలబెట్టుకునేందుకు నేను ఎప్పుడూ కృషి, సాధన, ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఏ రికార్డింగ్ వచ్చినా వెళ్లి పాడుతూ ఉంటాను. ఇప్పటికి బాలీవుడ్ లో 5,6 పాటలు పాడాను. అందులో 2,3 పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని పాటలు తెలుగులో కూడా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి 30, 40 పాటలు పాడాను. ఇప్పటికీ ఈ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. ఈమధ్య నేను మొట్టమొదట కంపోస్ చేసి, పాడి, ప్రొడ్యూస్ చేసిన ఒక ప్రైవేట్ వీడియో రిలీస్ చేసాను. అది ‘సురూరే ఇష్క్ ‘ అనే పాట, నేనూ, నా ఫ్రెండ్ కలిసి కంపోస్ చేసాము. మొన్న ఆగష్టు 15 రోజున రిలీస్ చేసాము.
‘ఆదిశంకరాచార్య ‘ సినిమాలో మీ పాత్ర, అది మీపై చూపిన ప్రభావం గురించి చెప్పండి.
మొట్టమొదటి సారి నటిస్తున్న వ్యక్తికి అదొక పెద్ద చాలెంజి వంటిది. చూసేందుకు ఒక పాత్ర అయినా, రాజుగా ఒక విధంగా, శంకరాచార్యులు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాకా ఒక విధంగా నటించాలి. అసలే బలమైన పౌరాణిక పాత్ర, దానికి తోడు నాగార్జున గారు, మోహన్ బాబు గారు, శ్రీహరి గారు వంటి పెద్దపెద్ద నటులు ఉన్నారు. అసలు భారవి గారు మొదట నన్ను ఒకపాట పాడేందుకు పిలిచారు. అది ‘భ్రమ అని తెలుసు’ అనే తత్త్వం. నాగాశ్రీవత్స గారు కంపోస్ చేసిన అద్భుతమైన పాట అది. ఆయన ఫ్లూట్ మీద వాయించి నాకు ఈ పాట వినిపించారు. నేను పాట పాడిన నెల రోజుల తర్వాత ఆయన నన్ను కలిసి, ఈ పాత్ర నన్ను చెయ్యమని కోరారు. పోసాని కృష్ణమురళి గారు, రవిచంద్ర గారు నా వద్దనే ఉన్నారు. సినిమాలో నా ఇంట్రడక్షనే ఒక రేంజ్ లో ఉంటుంది. నా చుట్టూ ఓ 30 మంది ఆర్టిస్ట్ లు ఉంటారు. దానికి ఓ పెద్ద లాంగ్ షాట్, పెద్ద డైలాగ్, పెద్ద తతంగం ఉంటుంది. దానికోసం బాగా హోంవర్క్ చేసుకుని, భారవి గారితో చెప్పి, తర్వాత విగ్గు పెట్టుకుని, మేక్ అప్ వేసుకుని, అమరక మహారాజు పాత్రలో నటించాను. ఆ పాత్రలో నా నటన అందరికీ నచ్చింది. నేను అలా నటించేటట్టు ఆయన నాలోకి ఆవహించి నటింపచేసారు. ఇందులో మొత్తం క్రెడిట్ భారవి గారికే చెందుతుంది.
ఆ పాటను మాకోసం పాడతారా ?
తప్పకుండా అండి. నిజానికి, ఆ పాట శ్రీహరి గారిపై చిత్రీకరించారు. అది బహుశా ఆయన చివరి సినిమా ఏమో. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నాకు శ్రీహరి గారు చాలా ముందు నుంచి తెలుసు, ఆయన ఇండియన్ ఐడల్ లో నాకు వోట్ చేసానని కూడా చెప్పారు, చాలా మంచి వ్యక్తి. ఈ తత్త్వం భారవి గారే రాసారు. జీవితం గురించిన ఒక వేదాంత భావనతో కూడుకున్న ఉద్వేగపరమైన గీతం ఇది. (ఈ పాటను క్రింది లింక్ లో వినవచ్చు )
నటుడిగా మీ ప్రస్థానం ఎలా కొనసాగుతోంది ?
ఆదిశంకరాచార్య తర్వాత నేను ‘ప్రేమ గీమా జంతా నై” అనే సినిమా చేసాను. ఇది పోయిన సంవత్సరం జూన్ 14 న రిలీస్ అయ్యింది. అందులో కూడా నా నటనకి మంచి పేరొచ్చింది. నిజానికి నా కెరీర్ మొదలుపెట్టింది ఒక సింగర్ గా, కనుక నేను గత ఏడాదిగా బొంబాయి లోనే ఉంటున్నాను. ప్రస్తుతం గాయకుడుగా నా కెరీర్ మీదనే దృష్టి పెడుతున్నాను. హిందీ పాటలు, తెలుగు పాటలు, తర్వాత ఈ మధ్య బెంగాలి లో పాడాను, కన్నడ లో పాడుతున్నాను, ఇలా కొనసాగుతున్నాను. ఈ మధ్యలో నాకు మంచి ఆక్టింగ్ అవకాశాలు వస్తే చేద్దామని ఉంది.
ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్ట్ లు ఏమిటి ?
తెలుగులో రాం గోపాల్ వర్మ గారి 365 డేస్ అని ఒక సినిమా, మరో 2 సినిమాల్లో ఈ మధ్య పాడాను. హిందీలో అభిషేక్ బచ్చన్ ది ‘అల్ ఇజ్ వెల్ ‘ అనే సినిమా ఆగష్టు 22 న రిలీస్ అవుతోంది, అందులో ఒక పాట పాడాను. ‘సురూరే ఇష్క్’ అనే పాట ఈ మధ్యనే నా సొంత ప్రొడక్షన్ లో రిలీస్ చేసాను. అది కాకుండా, ఈ ఏడాది హిందీలో 4,5 పాటలు వేరే సినిమాల్లో కూడా రిలీస్ అవుతున్నాయి. తెలుగులో మిక్కి జె మేయర్ కు ఈమధ్య కొన్ని పాటలు పాడాను. నేను, మిక్కి కి చాలా పాటలు పాడాను. ‘లైఫ్ ఇస్ బ్యూటిఫుల్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి వాటిలో పాడాను. అతను నాకు మంచి స్నేహితుడు, అద్భుతమైన సంగీత దర్శకుడు. తర్వాత బ్రహ్మోత్సవాల్లో కూడా కొన్ని పాటలు పాడాను. తర్వాత బాలీవుడ్ కు చెందిన సలీం సులేమాన్ గార్లతో సెప్టెంబర్, అక్టోబర్ యు.ఎస్, కెనడా, యు.కె. ట్రిప్ కి వెళ్తున్నాను.
మున్ముందు రాబోయే గాయకులకి మీరిచ్చే సందేశం ఏమిటి ?ఇంకా నేను చాలా చిన్నవాడినండి. మన ఘంటసాల గారు, బాలు గారు పాడిన ముప్పై, నలభై వేల పాటలతో పోల్చుకుంటే, నేను చేసింది చాలా తక్కువ. వారు పర్వత శిఖరాల వంటివారు. అలాగే హిందీలో మహమ్మద్ రఫీ గారు, కిషోర్ కుమార్ గారు వంటివారు చరిత్ర సృష్టించారు. అప్పటికంటే ఇప్పుడు పోటీ ఎక్కువ ఉన్నా, జీవితంలో ఎవరి వాటా వారికి దక్కుతుందని నేను నమ్ముతాను. ఎప్పటికైనా నా ఆశయం నేనొక గొప్ప గాయకుడిగా పేరు తెచ్చుకోవాలి, అందరూ నన్ను గుర్తుపట్టాలి, అనే. ఇండియన్ ఐడల్ తో అది మొదలుపెట్టి, నేను కూడా ముప్పై, నలభై వేల పాటలు పాడాలని అనుకుంటున్నాను. కొత్తగా గాయకులు కావాలని వచ్చేవారికి సందేశం అంటే, ఎవరి దృక్పధం వారికి ఉంటుంది కదా, దాన్ని బట్టీ ఉంది. వాళ్లకు నచ్చిన శాస్త్రీయ, లేక హిందుస్తానీ సంగీతం ఏదైనా నేర్చుకోవచ్చు. అది మన అంతర్గతంలో సంగీతానికి ఒక పవిత్రతను ఇస్తుంది. అలా నేర్చుకుని, వారు అవగాహనతో వస్తే, వాళ్ళు అద్భుతాలు సృష్టించగలరు.
మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఎన్నో సంగతులను పంచుకున్నందుకు కృతజ్ఞతలండి. మీరు మరిన్ని పాటలు పాడి తెలుగువారి కీర్తిని దిగంతాలకు వ్యాపింపచెయ్యాలని, మనసారా ఆకాంక్షిస్తున్నాము.
కృతజ్ఞతలండి. నాకు కూడా మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. బై. శ్రీరాం గారితో నా సంభాషణ ను క్రింది లింక్ లో వినండి.

No comments:

Post a Comment

Pages