జ్ఞానుల మనసు
- డా.వారణాసి రామబ్రహ్మం
మేఘము నీటియావిరిని స్వీకరించి ఆర్ద్రత పెంచుకొని వివిధ ప్రదేశములలో ఆ నీటిని వివిధ రీతులలో వర్షముగా వర్షించును. అదే విధముగా ఋషులు, మునులు, తత్త్వవేత్తలు, కవులు, దార్శనికులు, భక్తులు, జ్ఞానులు తత్త్వమునకు సంబంధించి తాము చదివినది, ఆకళింపు చేసికున్నది, అనుభవానికి తెచ్చుకున్నది, తమ వ్యక్తిత్వముతొ కలిపి లేదా వ్యక్తిత్వానికి అతీతముగా గ్రహించి తమ భాషలో వ్యక్తీకరిస్తారు. జ్ఞానుల మనస్సే బ్రహ్మము.
అందుకనే తత్త్వం ఒకటే అయినా వివిధ జ్ఞానుల మనసులలో, బుద్ధి సునిశిత్వముతొ, అనుభవాలతో, వ్యక్తిత్వములో, సంప్రదాయములలో, సంస్కృతులలో, భాషా తదితర జ్ఞానములతొ వడగొట్టబడి మనకు అందిన ఆ తత్త్వ సారము, జ్ఞాన కషాయము, భక్తి రసముతో వివిధములుగా అందుతుంది."ఏకమ్ సత్ విప్రాః బహుధా వదంతి".
భగవత్ సంకల్పాన్ని బట్టి, మన ప్రకృతిని బట్టి, మనస్తత్త్వాన్ని బట్టి, ఏ సారాన్ని, కషాయాన్ని, రసాన్ని ఆస్వాదించినా అనుభవములోనికి వచ్చేసరికి ఒక్కటే అయిన (ఏకమేవ అద్వితీయమ్) ఆ తత్త్వమే మిగులుతుంది. నిలిచి వెలుగుతుంది. మనలని వెలిగిస్తుంది. ఎటొచ్చీ ఆ సారాన్ని స్వీకరించే ముందు, స్వీకరించాక, మన స్వభావాన్ని బట్టి. ప్రకృతిని బట్టి, తదనుగుణంగా, అతీతంగా తత్త్వానుభూతి సరళిని బట్టి తయారవుతాము. తరిస్తాము. అన్ని వ్యాఖ్యానాలు, అందరి తపనలు తత్త్వ దర్శనమునకే. తత్త్వానుభవమునకే. పరమాత్మతో అనుసంధానము కొఱకే.
పెద్దల మాటలు, వారి వివిధ అనుభవములు, వ్యాఖ్యానాలు, వివిధ నదీ ప్రవాహముల వంటివి. అన్ని నదుల ప్రవాహాలు - నదీనాం సాగారో గతి: - లాగ సముద్రం వైపే ప్రవహిస్తాయి. ఏ నదీ ప్రవాహాన్ని అనుసరించినా, ఆ నదిలో పయనించినా, నదితో పాటు సాగరుని చేరతాము.
ఇందులో ఒక నదీ ప్రవాహము గొప్పది, మిగిలినవి తక్కువ కాదు. పరమేశ్వరుని కరుణ వలన మనకు లభించిన నదీ ప్రవాహ సాన్నిధ్యంలో, సాన్నిహిత్యంలో, ఆ నదీ ప్రవాహ దిశలో, పథములో నారాయణుని చేరతాము. ఈశ్వరునితో సాయుజ్యము చెందుతాము. ఏ పథముయొక్క హెచ్చు తగ్గులు, తారతమ్యములు గణనకు రావు. మన పథములో పరమాత్మని చేరామా లేదా అన్నదే కావలిసినది. అంతే. పథముల హెచ్చు తగ్గులపై, వంకర టింకరలపై చర్చ కూడదు. మీమాంస వృథా. సమయయాపనము తప్ప, రాగద్వేషములు కలగడం తప్ప మరే ప్రయోజనము కలుగదు. మనకు నచ్చిన, ప్రకృతిచే, భగవంతునిచే నిర్దేశింపబడిన పథముని పట్టి పోవడమే. పథముల ఉత్తమత్వముల గణన శుష్కాయాసము. శూన్య హస్తము. లభించేది ఏమీ ఉండదు.
తెలివైనవాడు తన దారిని పయనించి తాను చివరకి తాను (పరమాత్మ) గా మారతాడు. చర్చల్లో మునిగి తేలేవాడు ఉన్నచోటే ఉండి చివరికి ములిగి పోతాడు. మీమాంసలో గడిపేవాడు నిరర్ధకంగా జీవితము గడిపి ఏ పయనము చేయకనే చెడతాడు. అందుకని తస్మాత్ జాగ్రత! జాగ్రత!
మోక్షః పరమాత్మనః ప్రసాదేన ఏవ లభ్యతే! పరమాత్మని సదా దృష్టిలో ఉంచుకుని తరిద్దాము. పరమాత్మగా మారుదాము.శ్రీరస్తు! శుభమస్తు! సమస్త సన్మంగలాని భవంతు! సర్వే జనాః సుఖినో భవంతు! భగవత్ ప్రీతిరస్తు!
No comments:
Post a Comment