కాలం దాటిపోయిన కథ
పెయ్యేటి శ్రీదేవి
వాసంతి తన స్నేహితురాలింట్లో వారపత్రిక తిరగేస్తూంటే అందులో చిన్నకథల పోటీ అని చూసింది. మొదటి బహుమతి పదివేలు, రెండవ బహుమతి ఐదువేలు, మూడవ బహుమతి రెండువేలు. కథ రాయడానికి నిబంధనలు అన్నీ చదివింది. ఎందుకో తనకి కూడా కథ రాయాలనిపించింది. ఎన్నో కొత్త ఆలోచనలు వస్తాయి గాని ఆ ఆలోచనలనింతవరకు కథారూపంలో పెట్టలేదు. అసలు ఆ ఆలోచనలని కథారూపంలో ఎలా పెట్టాలో తెలియక పోవడం కూడా ఒక కారణం. అందుకే పేరున్న ప్రముఖ రచయితలు, రచయిత్రుల కథలు చదవడం మొదలు పెట్టింది. అవన్నీ చదువుతూ, ' ఓస్, కథ రాయడమంటే ఇంతేనా? పెద్ద కష్టమేం కాదు. ఇన్నాళ్ళూ అనవసరంగా కాలం వృధాగా గడిపేసాను.' అనుకుంటూ, కాగితం, కలం తీసుకుంది కథ రాద్దామని. మళ్ళీ ఆలోచనలో పడింది. తనకొచ్చే ఆలోచనల్లో దేనిగురించి కథ రాయాలా అని. కథ మొదలుపెట్టింది ప్రకృతి వర్ణనతో. కాని మళ్ళీ ప్రకృతి వర్ణన ఇప్పటి నవలల్లో కాని, కథల్లో కాని వుండటంలేదు. పాతకాలం కథల్లో వుండేవి ఎక్కువ వర్ణనలు. కాగితం నలిపి పడేసింది. సూటిగా కథలోకి వచ్చేద్దామని రెండు లైన్లు రాసింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. పనమ్మాయి. ' ఏమే నాగమ్మా, పొద్దున్నే పనికి వచ్చేదానివి? ఇప్పుడు పదకొండు అయింది. ఈ వేళప్పుడు వచ్చావేమిటి? ఓమూల నేనేదో రాసుకోడం మొదలుపెట్టాను.' ' రాసుకోండమ్మా, నేనేం అడ్డు రాను. ఇంటికి సుట్టాలొచ్చిండ్రు. ఆళ్ళు ఇప్పుడే ఎల్లారు. నా పని నేను చేసుకుపోతా. మీరు రాసుకోండి.' పనమ్మాయి వెళ్ళాక మళ్ళీ రాద్దామని మొదలుపెట్టింది. మళ్ళీ కాలింగ్ బెల్! సుపుత్రుడు స్కూలు నించి వచ్చాడు. వాడికి తినడానికేదో పెట్టింది. మళ్ళీ రాద్దామని మొదలెడుతుండగా పాలవాడు డబ్బులకొచ్చాడు. వాడొచ్చాడంటేనే భయం. ఎక్స్ ట్రా పేకెట్లు తీసుకున్నారంటూ ఎక్కువేసి దెబ్బలాడి మరీ డబ్బు లాక్కుపోతాడు. పద్దు రాసి చూపించినా మీరు రాసింది తప్పని వాదిస్తాడు. వాడితో గొడవ పడటం ఇష్టం లేక భర్త శరత్ అడిగిన డబ్బు ఇచ్చేయమంటాడు. సరే, వాడితో వాదించలేక వాడిచ్చిన బిల్లు ప్రకారం డబ్బిచ్చి పంపింది. ఇంక కథాకార్యక్రమం పక్కని పెట్టి వంటపనిలో పడింది. అందరి భోజనాలూ అయి, అందరూ నిద్ర పోయాక మళ్ళీ పెన్ను, కాగితం తీసుకుంది రాద్దామని. మళ్ళీ మామూలే. కథ ఎలా మొదలు పెట్టి ఎలా రాయాలో, ఎలా ముగించాలో తెలియలేదు. మళ్ళీ పెద్ద రచయిత్రుల కథలు చదవడం మొదలుపెట్టింది. ఈలోగా కునికిపాట్లు పడుతూంటే ఇంకేం రాస్తావు, రా రమ్మని నిద్రాదేవి ముంచుకొచ్చింది. సరే, కథాప్రక్రియ పక్కకి పెట్టి, ఏమైనా సరే, రేపు రాయొచ్చులే అని ఆవులిస్తూ నిద్రలోకి జారుకుంది. ఆ మరుసటిరోజూ కథ రాయాలనుకోవడం, కుదరకపోవడం, రేపు రాద్దాంలే అనుకోడం, ఈలోగా పెళ్ళికని ఊరెళ్ళాల్సొచ్చి, ఊర్నించి వచ్చాక, ఇంకా టైముందిలే అనుకుని స్తిమితంగా ఆవలెల్లుండి రాయొచ్చనుకుంది. ఊర్నించి వచ్చాక మళ్ళీ మామూలే. ఆవలెల్లుండి ఎల్లుండైంది. ఎల్లుండల్లా రేపు, రేపు నేడులోకొచ్చింది. నేడు నిన్నయింది. నిన్న మొన్న అయింది. మొన్న అటుమొన్న అయింది. అలా తెలీకుండా వారం గడిచిపోయింది. అలా వారం, వారం, వారం, వారం గడిచిపోయి నెల దాటిపోయింది. అమ్మో! ఇంక పదిరోజులే వుంది పోటీ గడువు! పెళ్ళికి వెళ్ళొచ్చిన అక్కడి విశేషాలు, డైలాగులతో సహా కథ తయారు చేసిందెలాగో వాసంతి. వాసంతి మామయ్య గౌరీనాథ్ పెద్ద పేరున్న రచయిత. ఆయనకి తన కథ వినిపించింది. ' చాలా బాగుందమ్మా. కొత్తరకంగా వుంది. తప్పకుండా నీకే ప్రైజు వస్తుంది. అసలిలాంటి మంచి కథ నాకెందుకు తట్టలేదా అనిపిస్తోంది. వెంటనే పోటీకి పంపించు.' అని సలహా ఇచ్చాడు గౌరీనాథ్. కథని ఫెయిర్ చేసి, హామీపత్రం జతచేసి, కవర్లో పెట్టి, కథలపోటీకి అని కవరు మీద రాసి అంటించింది. మర్నాడు భర్తగారు ఆఫీసుకెడుతుంటే, ' ఏవండీ! ఈ కవరు అర్జంటుగా పోస్తులో వేయండి.' అంటూ భర్త శరత్ కిచ్చింది.
***************************
ఇక ఆ రోజునించి ఊహల్లో తేలిపోతోంది వాసంతి. ఫస్టుప్రైజు పదివేలు వస్తే, ఆ పదివేలతో ఏం కొనుక్కోవాలి? ఏవిధంగా ఖర్చు చేయాలో ఆలోచించుకుంటోంది. వారం వారం ' చందన ' తెప్పించి చదువుతోంది. తనకొక వేళ ప్రథమ బహుమతి వస్తే ఫొటో పంపమని అడుగుతారు కదా అని మంచి చీర కట్టుకుని స్టూడియోకెళ్ళి ఫొటో తీయించుకుంది. తనగురించి పరిచయం రాసి వుంచుకుంది. ' మేడమ్! మీకు కథల పోటీలో మొదటి బహుమతి వచ్చింది!' అని పత్రికల వాళ్ల వద్దనించి వచ్చే ఉత్తరం కోసం ఎదురు చూస్తోంది. పేపరువాడు మధ్యలో రెండు వారాలు పత్రిక వెయ్యకపోతే పక్కనున్న షాపుకెళ్ళి కొని తెచ్చుకుంది. కాని అందులో ఫలితాలు రాలేదు. ఇంకో ఆరువారాలు ఎదురు చూసాక వీక్లీ అట్ట మీద ' కథలపోటీ ఫలితాలు ' అని రాసుంది. గమ్మున చేస్తున్న పని వదిలేసి వీక్లీ తిరగేసింది. కథలపోటీ ఫలితాలలో తన పేరుకోసం ఆత్రంగా చూడసాగింది.
ప్రథమ బహుమతి - రాలేదు. రెండవ బహుమతి - రాలేదు. మూడవ బహుమతి - రాలేదు. సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలలొ కూడా తన పేరు ............. లేదు!
వాసంతి కంట్లోంచి వచ్చే కన్నీటిని ఆపలేక పోతోంది. తను సరిగ్గా చదివిందో లేదో అని కన్నీళ్ళు తుడుచుకుని మళ్ళీ మళ్ళీ చూసింది. ఊహూ.......తన పేరు లేదు. అప్పుడే తన భర్త శరత్ కేంపు నించి వస్తూ ఆటోలోంచి దిగాడు. లోపలికొస్తూ, ' వాసంతీ! నీ కవరు వస్తూ వస్తూ ఇప్పుడే పోస్ట్ చేసి వస్తున్నానోయ్! మళ్ళీ వెయ్యలేదని తిట్టుకుంటావు. ఆ రోజే వేద్దామంటే కుదరలేదు. రైలుకి టైమయిపోయిందని అర్జంటుగా వెళ్ళాల్సి వచ్చింది..............' వాసంతికి భర్త చెప్పే కహానీలేం చెవికెక్కటల్లేదు. తనెంతో కష్టపడి రాసిన కథ అసలు పోస్టే చెయ్యలేదంటే..........వరదలై పారే కంట్లో కన్నీటి ప్రవాహాన్ని అరికట్టలేక, భర్తగారిని ఏమీ అనలేక, పళ్లు బిగబట్టి, మనసులో ' మొగుడు..........మొగుడు....... మొగుడు............మొగుడే దేముడు..........మొగుడంటే భయం............మొగుడంటే ఏమైనా చెయ్యొచ్చు............ఏం చేసినా ఓర్పుతో పడివుండాలి.........తను మాత్రం చేసే పనిలో తేడా వస్తే సహించడు,క్షమించడు, గట్టిగా అరుస్తాడు.' అనుకుంటూ నిరాశగా, చెప్పుకోలేని బాధతో కాలం దాటిపోయిన కథని తలుచుకుని మూగగా రోదించింది వాసంతి.
**************************
No comments:
Post a Comment