కృతజ్ఞత - అచ్చంగా తెలుగు

కృతజ్ఞత

Share This

కృతజ్ఞత

- అక్కిరాజు ప్రసాద్ 


ప్రపంచంలో అత్యద్భుతమైన భావనలలో కృతజ్ఞత ఒకటి. ఏమిటి కృతజ్ఞత అంటే? మనం విశ్వమనే యంత్రాంగంలో అనేక జీవరాశులతో (స్థావర జంగమాలు రెండిటితోనూ) అనుసంధానమై ఉంటాము కాబట్టి మనకు అందే ప్రతి ఫలానికీ ఒక మూలం ఉంటుంది. ఆ మూలాన్ని ఎరిగి దానికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వటం, ప్రపంచమంతా ఇచ్చిపుచ్చుకోవటంతోనే నడుస్తుందని గ్రహించి మెసలుకోవటం. ఇది మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మొదలుకొని ఈ విశ్వానికే తండ్రి అయిన పరమాత్మ వరకు పాటించ గలిగ్తే పరిపూర్ణమైన కృతజ్ఞత అవుతుంది. ఏ లక్ష్య సాధన కానీ, ఏ మైలు రాయి దాటటం కానీ మన గొప్పతనం కాదు మూలం యొక్క గొప్పతనం, మూలం యొక్క అనుగ్రహం అని భావించి దానిని త్రికరణ శుద్ధిగా పాటించటం కృతజ్ఞత.
దీని వలన ఫలితాలు?
1. శ్రీకృష్ణుడు కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తూ భగవద్గీతలో కేవలం కర్మ చేయటం వరకే నీ వంతు, కర్మ ఫలాన్ని నాకు వదిలేయి అని అర్జునునికి చెబుతాడు. అర్థం? కర్మలను చేయటంతో మనిషిలో అరిషడ్వర్గాలలో ఏదో ఒకటి ప్రకోపించే అవకాశం ఉంది. తద్వారా అహంకారం కలిగి కర్మయోగ సాధనలో అంతరాయాలు కలుగుతాయి. కాబట్టి కృతజ్ఞత వలన కలిగే అతి ముఖ్యమైన ఫలితం అహంకారం అదుపులో ఉండటం.
2. ఎప్పుడైతే కృతజ్ఞత మనసులో బలంగా పాతుకుంటుందో, జీవన విధానంలో అంతర్భాగమవుతుందో అప్పుడు మనలో ఇతరులకు సహాయం చేసే గుణం పెరుగుతుంది. ఎందుకంటే, మనం పొందే ఫలాలకు కారణమైన మూలం వేరు అని తెలుసుకుంటాము కాబట్టి ఇవ్వటంలో ఉన్న ఔన్నత్యం తొందరగా గ్రహిస్తాము. తద్వారా ఇచ్చుట మన జీవనశైలిలో ముఖ్య భాగమవుతుంది.
3. ఎప్పుడైతే ఇవ్వటం మొదలు పెడతామో, అప్పుడు మనకు మరింత అందుతుంది. అంటే, మనం ఆధ్యాత్మిక యానంలో ఎంతో ముఖ్యమైన అడుగు వేసినట్లు లెక్క. గుణింపబడిన ఆనందం మన సొంతమవుతుంది. తద్వారా ఆత్మప్రకాశవంతమవుతుంది. నేను నాది అన్న మాయా భావానలు లేదా అజ్ఞానం తొలగి మనం ఆత్మజ్ఞానులమవుతాము. జీవన్ముక్తిని పొందే యత్నంలో సఫలీకృతులమవుతాము.
మరి కృతజ్ఞత ఎలా అలవడుతుంది? సత్సాంగత్యము, సేవ మరియు అంతర్ముఖులమవ్వటం ద్వారా. ప్రతి మహానుభావునిలోనూ తప్పక కనిపించే లక్షణం కృతజ్ఞత. మంచి నీళ్లు ఇచ్చినా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరస్తాడు గొప్ప వ్యక్తి. అంటే, పొందిన వస్తు గుణ మూలములను, వాటి ప్రాముఖ్యతను, విలువలను పరిపూర్ణంగా ఎరిగి నమ్మే లక్షణం ఆ వ్యక్తిలో ఉంటుంది. అటువంటి వారి సాంగత్యం మనకు ఆ లక్షణాన్ని అందిస్తుంది. ఇతరులకు సేవ చేస్తుంటే మనకు మన జీవితంలో పొందిన ఫలాలు, వాటి మూలాలు స్ఫురణకు వస్తాయి. అంతే, మరుక్షణం మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. అంతర్ముఖులమయితే మానవ జన్మకు మూలం, దాని లక్ష్యం, దానిలోని మహత్తు తెలుస్తాయి. తద్వారా ఈ అద్భుతమైన ప్రపంచమనే జాలంలో మనకు కూడా ముఖ్యమైన స్థానం ఉందని, అది విశ్వవ్యాప్తమైన శక్తితో ఇతర జీవరాశులతో అనుసంధానమైనదని తెలిసి మనసంతా కృతజ్ఞతా భావంతో నిండిపోతుంది.
అందుకే సనాతన ధర్మం సత్సాంగత్యానికి, సేవకు, అంతర్ముఖులను చేసే సాధనాలు (యోగము, ధ్యానము, సగుణ నిర్గుణోపాసనా మార్గాలు) ఎన్నో మనకు అందించింది. ఈ కర్మ భూమిలో కృతజ్ఞత తల్లిదండ్రులతో మొదలు అన్నది మనకు పురాణేతిహాసములు నొక్కి వక్కాణించాయి. సేవలో తరించిన మహాపురుషులు ఎందరో. సత్పురుషుల సాంగత్యంలో అద్భుతమైన ఫలితాలు పొందిన వారు ఈ భరతభూమిలో అనంతం. వారందరిలోనూ కృతజ్ఞతా భావం దివ్యంగా వెలిగిపోయే ఒక ప్రధాన లక్షణం.
సంధ్యావందనం మొదలు పూజాది నిత్య నైమిత్తిక కర్మలు, క్రతువులు, యాగాలు, వ్రతాలు ఇలా ప్రతి ఉత్తమ కర్మలోనూ కృతజ్ఞత మూలకం. కృతజ్ఞతతో కూడిన జీవనం అతి పవిత్రమైన యజ్ఞంలా సాగుతుంది. ఫలితం తప్పక దివ్యమే. జన్మ నిచ్చిన అమ్మ మొదలు ఆది పరాశక్తివరకు కృతజ్ఞులమై ఉందాము. అతి దుర్లభమైన మానవ జన్మను సార్థకం చేసుకుందాము.

No comments:

Post a Comment

Pages