లలిత కళారాధన
- అక్కిరాజు ప్రసాద్
మధుర భారతి పదసన్నిధిలో ఒదిగే తొలి పూవును నేను
ఏ ఫలమాశించి మత్తకోకిల ఎలుగెత్తి పాడును?
ఏ వెల ఆశించి పూచే పూవు తావిని విరజిమ్మును?
అవధిలేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం
ఏ సిరి కోరి పోతన్న భాగవతసుధలు చిలికించెను?
ఏ నిధి కోరి త్యాగయ్య రాగజలనిధులు పొంగించెను?
రమణీయ కళావిష్కృతికి రసానందమే పరమార్థం
డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డిగారు లలితకళల గురించి రాసిన అద్భుతమైన గేయం ఇది. కళారాధనలో కోకిల గానం, పూతావి, తవి నుండి మహాకవి పోతన భాగవత సుధలు, మహా వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి వారి స్వరరాగసుధల వరకు వివిధ రీతుల ఆత్మానందము, రసానందము ద్వారా పారమార్థ గోచరం కలిగించినవే అని ఆయన ఈ భావపారిజాతంలో తెలియజేశారు.
లలిత కళలు భారతీయ సంస్కృతి మరియు సనాతన ధర్మంలో నిబిడీకృతమైన దివ్యమైన శక్తి యొక్క ప్రచోదనలు. చతుష్షష్టి కళలతో ఆరాధంచిబడే పరమాత్మ వాటిలో రమిస్తాడు, వసిస్తాడు. అందుకే వాటికి అంతటి శక్తి. సగుణోపాసనకు ప్రత్యక్ష రూపాలు లలిత కళలు. వాటిని నిరంతరం అభ్యసించితే, పరమాత్మ వైభవాన్ని ద్వైతభావనతో మొదలిడి బాహ్యమంతా ఆయనను అనుభూతి చెందుతూ, మనలోని మాలిన్యాలను తొలగించుకుంటూ, ఆత్మశుద్ధులమై, అద్వైత భావన కలిగి, మనలోనే ఉన్నాడు తెలిసికొని, మోక్షాన్ని ప్రసాదించే అద్భుతమైన సాధనలు లలిత కళలు.
అనాదినుండి స్మృతి శ్రుతి పురాణేతిహాసములలో లలిత కళల ప్రస్తావన అడుగడుగునా జరిగింది. పరమాత్మ యొక్క సామగానప్రియము మొదలు వేషభూషణములు, నవరత్నములతో కూడిన ఆభరణములు, శరీరాకృతి వర్ణన, వాటిని సంగీతా సాహిత్య నృత్యాభినయనంలో మనకు ఆవిష్కరించటం, శిల్పకళలలో పొందుపరచటం, అద్భుతమైన చిత్రాలుగా అందించటం మొదలైనవి సనాతన ధర్మంతో లలిత కళలకు గల అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తాయి.
లలిత కళలు మనకు పరిపూర్ణమైన వ్యక్తిత్వ వికాసాన్ని అందజేస్తాయి. ఎలా?
1. మానవ జీవితానికి అతి ముఖ్యమైన క్రమశిక్షణ లలిత కళలకు తప్పనిసరి. ఎంతో ఓర్పు, శ్రద్ధ కలిగి ఉంటే తప్ప ఒక కళ మనకు అబ్బదు.
2. కళా ప్రావీణ్యానికి సద్గురువు అనుగ్రహం కావాలి. అంటే, సరైన గురువు దొరికి, ఆ గురువుతో అనుబంధం ఏర్పడి, ఆ కళ పట్ల ఆసక్తి కలిగేలా ఆ గురువు నేర్పాలి. ఈ ప్రక్రియలో అద్భుతమైన గురు-శిష్య సంబంధం ఏర్పడుతుంది.
3. కళను అభ్యసించటానికి మానసిక సంతులన, ఆరోగ్యమైన దేహము చాలా ముఖ్యము. కాబట్టి ప్రావీణ్యత పోందే సమయానికి మానసిక పరిపక్వత, ఆరోగ్యమైన దేహము, తద్వారా ఆత్మశుద్ధి కలుగుతాయి.
4. ప్రతి కళలోనూ సనాతన ధర్మం యొక్క ప్రాభవం అంతర్భాగం కాబట్టి మన సంస్కృతి, సాంప్రదాయలు, దేశము, మహాపురుషులు, దేవతలపై ఆరాధానా భావం ఏర్పడుతుంది.
5. ఆ కళలో సాధన చేసిన కొద్దీ కళలకు మూలమైన పరమాత్మతో అనుసంధానం ఏర్పడుతుంది.
కళారాధన ఎప్పుడు సఫలీకృతమైనట్లు?
1. గురువులు సంతుష్టులై శిష్యుల అభ్యున్నతిని మనసారా ఆశీర్వదించగలిగినపుడు, గురు శిష్యుల అనుబంధం శాశ్వతమైనప్పుడు
2. కళ ద్వారా సమాజంలో జీవనోపాధి కలిగి, గుర్తింపు పొందినపుడు పొగడ్తలకు అతీతంగా, ఎదిగిన కొద్దీ ఒదిగినట్లు ఉండగలిగినపుడు
3. కళ ద్వారా జీవితంలోని సమస్యలను తేలికగా అధిగమించగలిగే వ్యక్తిత్వాన్ని అలవరచుకోగలిగినపుడు
4. కళాసేవ ద్వారా సమాజ దేశ శ్రేయస్సుకు తోడ్పడగలిగినపుడు
5. మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని తాను తెలుసుకొని మరెందరికో ఆ సందేశాన్ని పవిత్రమైన గురు-శిష్య సంబంధం ద్వారా అందజేయగలిగినపుడు
నారాయణ రెడ్డి గారు పైన గీతంలో చెప్పినట్లు లలితకళా సార్థకతకు సూచిక అవధిలేని అనుభూతులు పొందటం, తద్వారా ఆత్మానందం పొందటం. అలాగే ఒక అనందమైన కళావిష్కరణకు అందులో పండించిన రసానందమే పరమార్థం. రసానందమంటే అందులో రమించి ఇతరులను ఆనందింపజేయటం.
కళాకారులు కళావిష్కరణలో అందులోని పాత్రలు, సందర్భము మరియు దివ్యత్వాలలో జీవించగలిగితే తప్పక ఆత్మానందం, రసానందం కలుగుతాయి. మొదటి దాని ద్వారా నేను అన్న భావన శాశ్వతంగా నశించి జీవాత్మ పరమాత్మతో ఐక్యమవుతుంది. రెందో దాని ద్వారా ఇతరులలోని పరమాత్మ శక్తితో లంకె గట్టిపడి అర్థంలేని వ్యత్యాసాలు తొలగుతాయి. ఈ జగమంతా నందనవనంలా కనిపిస్తుంది.
అందుకే లలిత కళారాధన అజ్ఞాన తిమిరాంధకారాన్ని తొలగించే దివ్వెగా, సకల కళలు తల్లి అయిన సరస్వతి పాదాల వద్ద పుష్పంగా సుకవి నారాయణ రెడ్డి గారు మనోజ్ఞంగా అభివర్ణించారు. వారి భావనను సార్థంకం చేద్దాం. మనలను మనం కళారాధనలో వెలుగులు చిమ్మే దివ్వెలుగా మలచుకుందాం.
No comments:
Post a Comment