మూల్యాంకనం - అచ్చంగా తెలుగు

మూల్యాంకనం

Share This

మూల్యాంకనం

-దోమల శోభారాణి 

       
అర్థరాత్రి దాటి  సమయం దాదాపు రెండు  కావస్తోంది...
          ఈ సమయం అంటే  ప్రతి రాత్రికీ అత్యంత ప్రియం. జరిగే అఘాయిత్యాలు.. దోపిడీలు.. అగ్ని ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదాలు.. ఇదే సమయంలో నమోదు చేసుకోవటం..  రాత్రుళ్లు తెగ మురిసిపోతూ వుంటాయి.
          కొందరు ఆత్మహత్యలు చేసుకునే వారు కూడా ఇదే సమయంలో భాగస్వాములవటం రాత్రుళ్లకు ఎక్కడలేని గిరాకి. రాత్రంతా ఎప్పుడు ఏం జరుగుతుందో..! అని కుతూహలంగా వేచి చూడటం ప్రతి రాత్రికీ అలవాటు...
           ఈనాటి రాత్రి కూడా అదేపనిలో వుంది. ‘మరో శాల్తీ  కౌంట్‍డౌన్ మొదలయ్యింది’ అని సంబర పడి పోతోంది. అక్షరను ఆహ్వానించడానికై సమాయాత్త మవుతూ నాట్యం చేస్తోంది.
          అక్షర  ముఖం కనబడటం లేదు కాని ఏకధాటిగా ఏడుస్తోందని  ఆమె ముఖాన్ని అదిమిపట్టుకున్న తలగడ తడిచి ముద్దై చెబుతోంది. తలగడ అక్షరను ఎలా ఊరడించాలో తెలియక తన అసహాయతను వ్యక్తపరుస్తోంది..
           అక్షరకు పదే పదే తన  పరీక్ష ఫలితమే గుర్తుకు వస్తోంది. ఆ ఫలితం అక్షర  తీసుకుంటున్న విర్ణయం తప్పని  చెప్పలేక పోతోంది.. దాని ఫలితమే అక్షర ఆత్మహత్యా యత్నంలో వుందనుటకు ఎలాంటి సందేహమూ లేదు.
          కాస్తా వెనక్కి వెళ్లి వివరాలు సేకరిద్దాం..!
***
          ఆవాళ అక్షర ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలు..
          తనకు ప్రథమ శ్రేణి వస్తుందని గట్టి నమ్మకం. ఇంటర్ నెట్‍లో వెబ్‍సైట్ ఓపెన్ చేసింది. హాల్ టిక్కట్టు నంబర్ ఎంటర్ చేసింది. ఫెయిల్ మెమో దర్శనమిచ్చింది. ఒక్కొక్క అంకె తరచి తరచి చూసింది.. పదే పదే ఎంటర్ చేసింది.. అదే ఫలితం.
          నమ్మశక్యం కాలేదు. మళ్లీ మళ్లీ వెరిఫై చేసింది. కాళ్లు చేతులు వణుక సాగాయి. కళ్లు బైర్లుకమ్ముకో సాగాయి. అదే ఫలితం.. మళ్లీ మళ్లీ అదే ఫలితం. గుండె వేగంగా కొట్టుకో సాగింది..
           ‘నా మొహం నాన్నకి ఎలా చూపించను? నాన్న నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు? కొడుకువయినా కూతురివయినా నువ్వేరా నా ప్రాణం అంటూ నన్ను తన గుండెల్లో పెట్టుకుని పెంచుతున్నాడు. అమ్మ లేని లోటు చవి చూడకుండా తాపత్రయపడ్తున్నాడు. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. అమ్మ  అనురాగం ఎలా వుంటుందో నాకు తెలియదు. కాని ప్రతీ రోజు ఉదయం లేవగానే అమ్మ ఫోటోకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకునే అలవాటు నాది. పరీక్షలన్నీ కూడా అలాగే అమ్మ ఆశీర్వాదం తీసుకుని రాసాను. ఎమ్సెట్‍లో కూడా మంచి ర్యాంకు వస్తుందని ఎదురి చూస్తుంటే ఇలా జరిగిందేమిటి?’ అని మనసులో అలజడి.. కన్నీళ్ల పర్యంతమైంది.
          “ఏరా? ఫస్టు క్లాసేనా.. ఎన్ని మార్కులు వచ్చాయి?” అంటూ వంటింట్లో నుండి హాల్లోకి ఆతృతగా వచ్చాడు భాస్కర్.
          ఒక్క సారిగా భోరు మంటూ భాస్కర్ గుండెల మీద వాలిపోయింది అక్షర. హఠాత్పరిణామానికి నిర్ఘాంత పోయాడు భాస్కర్. చేతిలోని గరిటె కింద పడిపోయింది. అయిదు సెకన్లు అట్టే నిలిచి పోయాడు.
          నెమ్మదిగా అక్షరను సముదాయిస్తూ విషయం ఏమిటో చూద్దామన్నట్లుగా ల్యాప్ టాప్‍ను చూపుడు వేలుతో టచ్ చేశాడు.  అక్షర మెమోరండం ఆఫ్ మార్క్స్ షీట్ ప్రత్యక్షమయింది. ఫెయిల్ మెమో అది. గుండె ఝల్లుమంది. రెండవ సంవత్సరం గణిత శాస్త్రంలో ఇరవై ఐదు మార్కులు మాత్రమే వచ్చాయి. మిగతా అన్ని సబ్జెక్ట్స్ లలో ఫస్టు క్లాసు మార్కులకంటే అధికంగానే వున్నాయి. భాస్కర్‍కూ నమ్మశక్యంగా లేదు. ‘ఎక్కడో ఏదో తప్పు జరిగి వుంటుంది’ అని మనసులో అనుకున్నాడు. తన ముద్దుల గారాల పట్టి ముఖం కన్నీటి ధారలతో తడిచి ముద్దవడం కలవర పడ్డాడు.
          “అక్షరా! ఏంటమ్మా నీ మీద నీకు నమ్మకం లేదా? మ్యాత్స్ లో ఇరవై ఐదు మార్కులంటే ఎలా నమ్ముతున్నావ్?. పిచ్చి తల్లి ఏడువకురా.. నేనున్నాను కదా.. తిరిగి సరిచూడటం (రీ వెరిఫికేషన్) పెట్టిస్తాను. నీ సమాధాన పత్రం జిరాక్స్ కూడా తెప్పిస్తాను” అంటూ చిన్న పిల్లను బుజ్జగించినట్లు బుజ్జగించ సాగాడు.
          భాస్కర్ కూకట్‍పల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మ్యాత్స్ లెక్చరర్. దాదాపు ఇరవై సంవత్సరాల అనుభవం, విద్యా బోధనలో మంచి పట్టు వుంది. ఇంటర్మీడియట్ బోర్డులో మంచి పేరూ వుంది. గత నాలుగు సంవత్సరాలుగా ప్రశ్నాపత్రాల కూర్పు(పేపర్ సెట్టింగ్‍)లో, రీవెరిఫికేషన్‍లో సీనియర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇంటర్మీడియట్ బోర్డు అధ్వైర్యంలో, డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రసారం చేసే మన టీ.వి. కార్యక్రమాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల గణితశాస్త్ర పాఠాలు, ఎమ్సెట్ పాఠాలు లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాడు...
           అటు కాలేజీలో పరీక్షల విభాగపు అధిపతి. ఇటు పరీక్షల అనంతరం పేపర్ ‘కీ’ తయారు చేయడంలో పాలు పంచుకోవటం. మూల్యాకన శిబిరం(వాల్యూయేషన్ క్యాంపు)లో సబ్జెక్టు ఎక్స్ పర్టుగా విధుల నిర్వహణ.. క్యాంపులో కొత్తగా విధుల్లో చేరే వారికి సూచనలు ఇవ్వటం.. వెరసి అందరి నోళ్లల్లో నాలుకలా కదలాడుతూ ఉంటాడు.
          అతని పైఅధికారులకు కూడా భాస్కర్ అంటే గౌరవం.. బోర్డు పబ్లిక్ పరీక్షలలో పిల్లల సిట్టింగ్ అరేంజ్‍మెంట్స్ దగ్గరి నుండి పేపర్ రీ వెరిఫికేషన్ వరకు సూచనలను తయారు చేసే కమిటీలో భాస్కర్ ఒక సభ్యుడుగా ఉంటాడు. భాస్కర్ సూచనల మేరకే ఈ జంబ్లింగ్ పద్ధతి అమలులోకి వచ్చింది. విద్యార్థుల పేపర్ రీ వెరిఫికేషన్ తరువాత పునః మూల్యాంకనం (రీ-వాల్యూయేషన్) కోసం కోర్టు కేసులు అధికం అవుతున్నాయని.. తమ తలకు మించిన భారమవుతుందని.. ‘సబ్జెక్టు వైస్ కమిటీలు ఏర్పర్చుకుని తిరిగి పేపర్ రీ-వాల్యూయేషన్ చేయించండి’ అంటూ హైకోర్టు జడ్జీలు ఇచ్చిన సూచనల మేరకు గణిత శాస్త్రంలో భాస్కర్ ఒక సభ్యుడు...
          ఇలాంటి అనుభవాల దొంతరలలో అక్షర మెమో చూసి  అది నిజమని ఏమాత్రమూ నిర్థారించుకోలేదు భాస్కర్..
          అక్షర మీద తనకు పూర్తిగా నమ్మకం వుంది. మ్యాత్స్ పరీక్ష రాసి వచ్చాక భాస్కర్ తయారు చేసిన ‘కీ’ తో సరి చూసుకుంది. ఒక రెండు మార్కుల ప్రశ్న తప్పుగా చేసానని, డెబ్బది మూడు మార్కులు వస్తాయని భరోసాగా చెప్పింది. ప్రథమ సంవత్సరంలో అక్షరకు సెంట్ పర్సెంట్ డెబ్బది ఐదు మార్కులు వచ్చాయి. స్టేట్ ర్యాంకు రాకపోయినా డిస్టింక్షన్ వస్తుందని తాను అనుకున్నాడు. కాని ఫెయిల్ కావడమంటే అసంభవం..
          “అక్షరా.. ఊర్కో తల్లీ.. నువ్వు ఏడుస్తుంటే నేను భరించలేనమ్మా!. నా మీద నమ్మకం ఉంది కదరా!.. ఎక్కడో పొరపాటు జరిగి వుంటుంది. అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. నీ ఆన్సర్ పేపర్  జిరాక్స్ కాపీ వచ్చాక చూద్దాం.. ఇలా బెంబేలు ఎత్తి పోతే ఎలారా?..” అంటూ అక్షర  చుబుకం పట్టుకుని ఊరడించ సాగాడు. అక్షర ఏమీ మాట్లాడలేక పోతోంది. అన్నిటికీ ఏడుపే సమాధానం.. ఏకధాటిగా కన్నీటి ధారలు..
          భాస్కర్ కాసేపు మౌనంగా వేచి చూశాడు...
          అక్షర చదువుపై గల ఆసక్తి..  ఆమె తెలివి తేటలు.. ఆమె మీద తనకు వున్న నమ్మకం.. అన్నీ వివరించసాగాడు.  అక్షర దృష్టి మరల్చాలనే ఉద్ధేశ్యంతో ఏదో జ్ఞప్తికి వచ్చిన వాడిలా..
          “అక్షరా నువ్వు ఒకవేళ ఏదైనా జవాబు తప్పు అనుకొని కొట్టి వేసాక ‘నాచే కొట్టి వేయబడినది’ అని రాసి ఇన్విజిలేటరుతో అటెస్టేషన్ చేయించుకున్నావా?” అంటూ అడిగాడు.
          “ఎక్కడా కొట్టి వేతలు లేవు నాన్నా.. చాలా ఫేర్‍గా రాశాను” అంది అక్షర.
          “హమ్మయ్య నా బేబి మాట్లాడింది” అంటూ లాలనగా దగ్గరికి తీసుకున్నాడు..
          “చూడు అక్షరా.. నేను నీ ఆన్సర్ పేపర్ జిరాక్స్ కోసం చలాన్ కడతాను. అది వచ్చాక చూద్దాం. అంత వరకు ధైర్యంగా ఉండు. నేనున్నాను కదా.. నువేం భయపడకు.. బేఫికరుగా ఉండు” అంటూ బుజ్జగించాడు.
          అయినా అక్షర మనసు ఆ మెమోలోనే స్టకపై పోయి ఇంకా బయటికి రాలేదని ఒక కంట కనిపెడ్తూనే వున్నాడు భాస్కర్.
          వేసవి సెలవులే.. ఆరోజు బయటికి వెళ్లలేదు. తన బెడ్ రూంలో కళ్లుమూసుకుని మౌన వేదన పడే అక్షరను ఎలా సముదాయించాలా అని భాస్కర్ తపించ సాగాడు. తనకూ కాలూ చేయి ఆడటం లేదు. అక్షర పరీక్ష ఫలితాలు వచ్చే రోజు అని గత రాత్రే ఐస్ క్రీం కేక్స్, స్వీట్స్ తెచ్చి ఫ్రిజ్ నింపి పెట్టాడు. అక్షరకు ఇష్టమని పలావు చేశాడు. అన్నీ దీనంగా భాస్కర వంకే చూస్తూ వున్నాయి.
          భాస్కరుకు అక్షర పరీక్ష తప్పిందనే బాధ కంటే తను ఏమీ తినడం లేదనే బాధే ఎక్కువగా బాధించ సాగింది. అక్షరను  పదే పదే వేడుకోసాగాడు. అక్షరలో ఏమాత్రమూ మార్పు కనిపించలేదు. తనూ మౌనంగా అలా అక్షర ముఖం వంకే చూస్తూ కూర్చుండి పోయాడు.
          సమయం మూడు కావస్తోంది.. అక్షర మూడ్ లోకి వచ్చింది. భాస్కర్ కూడా అలా అచేతనంగా దీనంగా తన వంకే చూస్తూ ఉండి పోవడం అక్షర మరొక్క సారి బిగ్గరగా ఏడ్చేసింది. భాస్కర్ లేచి అక్షర కన్నీళ్లను తుడిచాడు. అయిదు నిముషాల గడిచాయి.
          “నాన్నా!.. భోచేద్దాం” అంది.
          “గూడ్ గర్ల్. నా తల్లి కరుణించింది. ఇలాంటి సమయాల్లోనేరా ధైర్యంగా ఉండాలి.. మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు అన్యాయాన్ని  ఎదుర్కోవాలి కాని ఇలా బెంబేలు పడిపోగూడదు” అంటూ మెల్లిగా అక్షరను డైనింగ్ హాల్లోకి తీసుకెళ్ళాడు.
***
          భాస్కర్‍కు పేపర్ రి-వెరిఫికేషన్ కోసం అప్పాయింట్ ‍మెంటు ఆర్డర్స్ వచ్చాయి. ప్రతీ రోజూ ఉదయం ఎనిమిది గంటలకే ఇంటర్మీడియట్ బోర్డుకు వెళ్తున్నాడు.
          పది రోజులు గడిచాయి..
          ఆవాళ అక్షర ఆన్సర్ పేపర్ జిరాక్స్ కాపి వచ్చింది.. ఆతృతగా కవరు తెరచింది. కవరింగ్ లెటరులో ‘మార్క్స్ నో చేంజ్’ అని కనబడే సరికి గుండె జారిపోయింది. చేతులు వణుక సాగాయి. ముందుగా అది తన పేపరేనా అని వెరిఫై చేసుకుంది. అది ముమ్మాటికీ తన పేపరే. మెల్లిగా ఆన్సర్ షీటు ఓపెన్ చేసింది. మార్క్స్ చూసుకుంటూ వెళ్లింది. అన్నీ మూల్యాంకనం చేయబడే ఉన్నాయి. కాని సరియైన సమాధానాలకు కూడా ఫుల్ మార్కులు రాలేదు. ఏదో ఉడుతా భక్తిగా అన్నట్లు అతి స్వల్ప సమాధానాలకు ఒక్కొక్క మార్కు చొప్పున పది వేసారు. స్వల్ప సమాధాన ప్రశ్నలకు కూడా ఒక్కో మార్కు  చొప్పున అయిదింటికి అయిదు మార్కులు.. దీర్ఘ సమాధాన ప్రశ్నలు అయిదింటికి రెండేసి చొప్పున పది మార్కులు.. అలా మొత్తం ఇరవై అయిదు మార్కులు అని నమోదు చేయబడి వుంది. అప్రయత్నంగా అక్షర కళ్లు వర్షించ సాగాయి. కన్నీటి ధారలు అక్షర చెక్కిళ్లపై  జలపాతాలయ్యాయి.. భాస్కర్ రాకను గమనించనే లేదు.
          భాస్కర్‍కు ఇంట్లోకి అడుగు పెడుతూనే విషయం అవగతమయింది. నెమ్మదిగా అక్షర వద్దకు వెళ్లి ఆమె చేతిలోని సమాధాన పత్రం తీసుకుని చూశాడు. ఎగ్జామినర్ ఎవరో గాని చాలా తెలివిగా మూల్యాంకనం చేశాడు. అతడు రీ-వెరిఫికేషన్ గూర్చి అవగాహన ఉన్నవాడే అని పసి గట్టాడు. జరిమాన(పెనాల్టీ) తప్పించుకునే యత్నంలో నేర్పుగా మూల్యాకనం చేశాడు.
          రీ-వెరిఫికేషన్‍లో కేవలం మూల్యాంకనం చేయని ప్రశ్నలు, జీరో మార్కులు వచ్చిన ప్రశ్నలను మాత్రమే తిరిగి సరి చూస్తారు. మార్కులు నిర్ణయించిన ప్రశ్నలను చూడరు. నిర్ణయించిన మార్కులు తక్కువా? ఎక్కువా? అనే విషయం అసలే పట్టించుకోరు. పది శాతానికంటే అధికంగా వ్యత్యాసం ఉంటే మాత్రం అతడికి జరిమానా వేస్తారు. పూర్వం జరిమానా బదులు వాల్యూయేషన్ క్యాంపు నుండి తాత్కాలికంగా నిరోధించే(డిబార్) వారు. అలా అయితే మూల్యాంకనం చేయడానికి ఎవరూ మిగులడం లేదని ఇలా జరిమానాతో సరిపుచ్చుతున్నారు. అందుకే ఎగ్జామినర్ చాలా తెలివిగా ప్రతీ ప్రశ్నకు తనకు తోచిన మార్కులు వేసి రీ-వెరిఫికేషన్‍లో దొరకకుండా జాగ్రత్త పడ్డాడు.
          భాస్కర్ ఒక చిరునవ్వు నవ్వుతూ “అక్షరా.. అండర్ వాల్యూయేషన్ అయిందిరా.. నీ సమాధానాలన్నీ సరి అయినవే. అయితే పొరపాటున ‘కీ’ ఫాలో గాకుండా మార్క్స్ అలాట్ అయినట్లు గమనించాను. దీని కోసం నేను బోర్డులో అప్పీల్ చేస్తాను. నువేం దిగులు పడకు” అంటూ సమాధాన పరిచాడు. అక్షర మౌనమే సమాధానమైంది.
          ***
          అదే రాత్రి మనకు అక్షర ముఖం కనపడనిది... అక్షర కౌంట్ డౌన్ ప్రారంభమయిందని వేచి చూసే రాత్రి..
          ‘నాన్న ఏదో నన్ను మభ్యపెట్టడానికి అలా అంటున్నాడే కాని ఒక సారి వాల్యూ అయిన తరువాత మళ్లీ వాల్యూ చేయటం.. అది జరగని పని’ అని తన పరిధిలోనే ఆలచిస్తూ  ధృఢ నిర్ణయం తీసుకుంది.
          లేచి ఫ్యానుకు చున్నీ విసిరేసింది. చున్నీ రెండవ చివర చేతికి అందగానే జారు ముడి వేసి లాగింది. మరో మారు లాగి చూసుకుంది. చిన్న స్టూలుపైకి ఎక్కి మెడకు చున్నీ చుట్టుకును ముడి వేసుకుంది. స్టూలును తన్నిన శబ్దంలో తలుపు తెరుచుకున్న శబ్దం కలిసి పోయింది. వాయువేగంగా పరుగెత్తుకుంటూ వచ్చిన భాస్కర్ అక్షర కాళ్లను చుట్టేసి పైకి లేపాడు. పడిపోయిన స్టూలును తిరిగి నిలబెట్టి వణుకుతున్న చేతులతో అక్షర మెడ కట్టును విప్పతీస్తూ బిగ్గరగా ఏడ్చేశాడు. అక్షర స్పృహ తప్పి భాస్కర్ భుజంమ్మీద వాలిపోయింది. నెమ్మదిగా అక్షరను బెడ్ మీద పడుకోబెట్టి టేబుల్‍పై ఉన్న వాటర్ జగ్‍లోనుండి నీళ్లు తీసి అక్షర ముఖాన చల్లాడు.
          “అక్షరా..! అక్షరా..!” అంటూ చెక్కిళ్లపై తట్టుతూ ఆవేదనతో పిలిచాడు.
           అక్షర కళ్లు తెరిచింది. భాస్కర్ టవలుతో అక్షర ముఖం తుడువసాగాడు. తుడిచినకొద్దీ కన్నీళ్లు వరదల్లా పొంగి పొరల సాగాయి. భాస్కర్ ఏడుస్తుండటం అక్షర మరింత భోరు మంది.
          అక్షర తనలో కలిసిపోలేదని నిరాశతో వెల వెల బోతూ ఆ రాత్రి వేకువ ఝాముకు సమాయత్తం కాసాగింది.
          “అక్షరా.. నా పెంపకంలో ఇదేనా నీవు నేర్చుకుంది. ఇన్నాళ్లు కష్టపడి చదివి నీ విజ్ఞానాన్ని ఈ ఫ్యానుకు బలి చేస్తావా? నీకు నా మీద నమ్మకం లేదు. సరికదా నీకు నీ మీదే నమ్మకం లేదు. ఇలాగయితే ఎలాగురా? మనం నమ్మకాన్ని నమ్ముకోవాలి.. నువు కష్టపడి చదివావు. పరీక్ష చాలా బాగా రాశావు. నీకు మ్యాత్స్ లో నీ గెస్ ప్రకారం సెవెన్టీ త్రీ రావాల్సిందే. కాని ఒక ఎగ్జామినర్ మూల్యాంకనం తప్పిదం వల్ల నీకు అన్యాయం జరిగింది. దాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలే గాని ఇలా ప్రాణాలు తీసుకుంటామా? ఆ ఎగ్జామినర్ నీ పేపరు విషయంలో ఎలా తప్పు చేశాడో నువ్వూ నీ జీవిత విషయంలో అలాగే  తప్పుడు మూల్యాకనం చేసుకుంటున్నావు. మన మీద మనకు గల విశ్వసనీయత మేరకు సరియైన మూల్యాకనం మనమే చేసుకోవాలి. అప్పుడే మనకు మన జీవితం మీద విశ్వాసం పెరుగుతుంది. చక్కగా తీర్చి దిద్దపడుతుంది. తప్పుడు మూల్యాకనంతో నీ పేపరు పేపరు పోయినట్లే నీ జీవితం పోగొట్టుకోవద్దు. పేపరుకు పునఃమూల్యాకనం చేయిస్తాను. అలాగే నువు కూడా స్తిమితంగా ఆలోచించి పునఃమూల్యాకనం చేసుకో. పేపరు పోతే మళ్లీ రాసుకోవచ్చు గాని ప్రాణం పోతే తిరిగి వస్తుందా?.. దేవుడు మనకు బతుకుతో బాటు ఆలోచనా శక్తిని కూడా ఇచ్చాడు. సరియైన ఆలోచనలతో బతుకు బంగారు బాటగా తీర్చి దిద్దుకోవాలి గాని ఇలా వ్యర్థంగా ఫ్యాను పాలు చేసుకోకూడదు.
          అయినా నువ్వు పోయాక నేనెందుకురా బతకడం.. ఇంకెవరి కోసం నేను బతకాలి?.. నీతో బాటు నేను గూడా వస్తాను..
          నేను ఆఫోటోలోని మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నీకు న్యాయం జరిగే వరకు పోరాడుతాను.నన్ను నమ్ము తల్లీ.. ” అంటూ అక్షర పాదాలపై తల పెట్టి మొక్కసాగాడు.
          “నాన్నా!..” అంటూ కాళ్లు గబుక్కున వెనక్కి లాక్కొంటూ బిగ్గరగా ఏడ్చేసింది.
          భాస్కర్ అక్షరను తన హృదయానికి హత్తుకున్నాడు. ఇలాంటి ఆత్మ హత్యా ప్రయత్నాలు ఇక ముందు చేయనని ప్రమాణం చేయించుకున్నాడు అక్షరతో.
          పూర్తిగా తెల్ల వారింది.. సూర్యోదయం కాసాగింది..
***
          భాస్కర్ ఇంటర్మీడియట్ బోర్డుకు వెళ్లి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కమ్ సెక్రటరీ కాశీనాథ్ గారిని కలిసి అక్షర మ్యాత్స్ పేపర్ చూపించాడు. మూల్యాంకనంలో జరిగిన పొరపాటును దృష్టికి తీసుకు వచ్చాడు. పునః మూల్యాంకనం కోసం అనుమతి తీసుకున్నాడు. ఫీజు బ్యాంకులో జమచేశాడు. చలాన్ ఒరిజినల్ రశీదు జత చేసి బోర్డులో సబ్మిట్ చేశాడు. ఇది తన కూతురి పేపర్ కనుక వేరే బోర్డుకు అలాట్ చేయుమని వనతి పత్రం జత చేశాడు.
          అక్షర పేపర్ రీవాల్యూ జరిగింది. అనుకున్నట్లుగానే డెబ్బది అయిదు మార్కులకు గాను డెబ్బది మూడు వచ్చాయి. అక్షర ఫలితం చూసి ఆశ్చర్యపోయాడు కాశీనాథ్. భాస్కర్ మీది గౌరవంతో ప్రత్యేక శ్రద్ధ వహించాడు. అక్షర రీ-వాల్యూ అయిన పేపరు తెప్పించుకొని ప్రతీ ప్రశ్నను పరిశీలించాడు. రీ-వాల్యూలో ప్రతీ ప్రశ్నకు ఎందుకు మార్కుల్లో తేడా వచ్చిందో నోట్ చేసిన రిమార్క్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి ఆశ్చర్యపోయాడు. ‘ఎంత వ్యత్యాసం?. భాస్కర్ మ్యాత్స్ లెక్చరర్ కాబట్టి అక్షరకు న్యాయం జరిగింది. మరి పల్లెటూళ్లలో ఏమీ తెలియని అభాగ్యులు ఎంత మంది బలి అవుతున్నారో..’ అని వాపోయాడు. భాస్కర్‍ను పిలిచి మాట్లాడాడు. భాస్కర్ ఆరాత్రి జరిగిన సంఘటన కాశీనాథ్‍కు వివరించాడు. అర నిముషం ఆలస్యమైతే అక్షర జీవితం ఇలాంటి ఎగ్జామినర్ తప్పిదాల వల్ల బలి అయిపోయేదని కంట తడి పెట్టాడు. కాశీనాథ్ చలించి పోయాడు.
          “కేవలం సూచనలు సర్క్యులర్‍ల ద్వారా పంపటం కాదు సార్..  ప్రతీ సంవత్సరం పేపర్ మూల్యాంకన శిబిరాలలో పిల్లల జీవితాలతో చెలగాటాలాడు కోవద్దంటూ ఆన్‍లైన్లో మీరు మాట్లాడాలి. ఉదాహరణకు కొన్ని శాంపుల్ పేపర్లు తీసుకుని ఎలా పిల్లలకు అన్యాయం జరుగుతుందో చూపించాలి. మీ  ప్రేరణ కావాలి. అప్పుడే అందరూ అంకిత భావంతో పనిచేయడానికి అవకాశం వుంటుందని అనుకుంటున్నాను. పై అధికారులందరూ కేవలం ఏసీ గదుల్లో కోర్చోకుండా క్యాంపులను విజిట్ చేయాలి”  అంటూ కాస్తా చొరవ తీసుకొని మాట్లాడాడు భాస్కర్.
          కాశీనాథ్‍లో చలనం కనిపించింది..
***
                   ఇంటర్మీడియట్ బోర్డు ఈసంవత్సరం హైదరాబాదులోని లాల్‍బహద్దూర్ స్టేడియంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దాని ముఖ్య ఉద్ధేశ్యం ప్రజలలో పబ్లిక పరీక్షల పేపర్ వాల్యూ యేషన్‍కు సంబంధించిన అపోహలు ఇంటర్మీడియట్ పిల్లల తల్లిదండ్రుల నుండి తొలగించడం. అందులో భాగంగా ఒక ప్రముఖ వ్యక్తిని సన్మానించటం.
          మైదానమంతా రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ బోధన, బోధనేతర సిబ్బంది ఇంకా పేరెంట్స్ తో కిక్కిరిసి పోయింది. ఇలాంటి మహాసభ జరగడం ఇంటర్మీడియట్ చరిత్రలో ఇదే ప్రథమమని ఆహ్వానితులంతా ఉత్సుకతతో ఎదురి చూడసాగారు.
          మహాసభ ఆరంభమైంది..
          బోర్డు కమీషనర్  సభకు అద్యక్షత వహించాడు. ముందుగా గత పది సంవత్సరాల క్రితం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గా పని చేసి బోర్డులో విప్లవాత్మకమైన మార్పులతో పలు సంస్కరణలు చేసి రిటైరయిన కాశీనాథ్‍ను వేదిక పైకి ఆహ్వానించాడు.
          సభ అతడిని సన్మానిస్తుందని అనుకుంది. కాని అది వాస్తవం కాదని కాసేపటికే తేలింది.
          నేటి పరీక్షా విధానాలు, పేపర్ మూల్యాంకనం మీద తగిన సలహాలు సూచనలు ఇవ్వవల్సినదిగా కోరాడు కమీషనర్.
          కాశీనాథ్ మాట్లాడుతూ భాస్కర్‍ను వేదిక పైకి అద్యక్షులవారి అనుమతితో ఆహ్వానించాడు. భాస్కర్‍ను సభకు పరిచయం చేస్తూ ఆనాడు అతడి కూతురుకి జరిగిన అన్యాయాన్ని.. దానిని సరిదిద్దిన వైనాన్ని వివరించాడు. భాస్కర్ లాంటి లెక్చరర్ రిటైర్ అయినప్పటికీ అతడి సలహాలు బోర్డు స్వాగతించాలని అప్పీల్ చేశాడు. సభ చప్పట్లతో మారుమ్రోగి పోయింది..
          అంతా భాస్కర్‍ను సన్మానిస్తారని ఎదురు చూడసాగారు. కాని అదీ నిజం కాలేదు.. సభలో ఉత్కంఠ మొదలయ్యింది.
          భాస్కర్‍తో బాటు మరో నలుగురు సీనియర్ లెక్చరర్లు పేపర్ వాల్యూయేషన్ విషయంలో పారదర్శకతను వివరించారు.
          సన్మాన గ్రహీత ఎవరు? ఎందుకు సన్మానిస్తున్నారు?.. అని సభ ఎదురి చూడ సాగింది.
          చివరగా కమీషనర్  అద్యక్షోపన్యాసం..
          కమీషనరు సభను సంభోదిస్తూ..
          “ఈనాటి కార్యక్రమంలో ఒక గొప్పవ్యక్తిని మనం సన్మానించుకోబోతున్నాం. అది మన బోర్డు చేసుకున్న అదృష్టం. వారి కోరిక ప్రకారం వారి పేరు గాని సన్మానం చేస్తున్నట్లు గాని బయట ప్రకటించలేదు. ‘పేపర్ వాల్యూయేషన్’ ఔనత్యాన్ని చాటి చెప్పాలని మనకందరికి అది స్ఫూర్తిదాయకమవుతుందని బోర్డు అభ్యర్థన మేరకు వారు సభకు రావటం మనం అదృష్టం...
          నేను ఈ మధ్య ఒక దిన పత్రికలో చదివాను..‘నేతల మేత.. పాపాల ఖాత’ అనే శీర్షిక. నల్ల ధనం దేశ ద్రోహం.. మన దేశపు సొమ్ము దాదాపు ఇరవై ఎనిమిది  లక్షల నాలుగు వందల డెబ్బది కోట్ల రూపాయలు విదేశాలలో మూల్గుతోందట. 2007 సంవత్సరంలో ఒకే ఒక వ్యక్తి ఇంటిపై దాడి జరిపి నలుబది వేల అయిదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల నల్లధనం పట్టు పడిందట. ఇలాంటి వారు దేశద్రోహులు మన దేశానికి అపఖ్యాతిపాలు చేస్తున్నారు. ఇదే పుణ్యభూమిలో నిస్వార్థ సేవలు అందించే వారు ఉన్నారు.. వైజ్ఞానిక పరంగా దేశ పురోగతికి పాటుపడే వారూ వున్నారు. అది మన భారతమాత చేసుకున్న పణ్యఫలం. వారిని సన్మానించుకోవటం మన కర్తవ్యం. వారిని పరిచయం చేయటం నా భాగ్యంగా భావిస్తాను.
          ఈ మధ్యనే నేను చదివిన మరో వార్త.. ”
          ఇలా వార్తలు చదువుకుంటూ వెళ్తున్నాడే గాని అసలు సన్మాన గ్రహీత ఎవరో చెప్పటం లేదని సభలో గుస, గుసలు మొదలయ్యాయి. అది గమనించిన కమీషనర్ టేబుల్ మీద వున్న గ్లాసు మంచి నీళ్లు సగం వరకు త్రాగి గొంతు సవరించుకున్నాడు.
          “మీ కుతూహలం అర్థమయ్యింది. అక్కడికే వస్తున్నా ఈ రోజు సన్మాన గ్రహీతను ఆహ్వానించే ముందు కొంత పరిచయం అవసరం..” అంటూ మళ్ళీ ఉపన్యసించటం మొదలు పెట్టాడు.
          “సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల నాల్గవ తారీఖున పోలార్ శాటి లైట్ లాంచ్ వెహికిల్ పి.ఎస్.ఎల్.వి. సి 24  శ్రీహరి కోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు మన శాస్త్రజ్ఞులు. దీనిని ఐ.ఆర్.ఎన్.ఎస్.ఎస్.1బి అనే రాకెట్టు తీసుకు వెళ్ళింది. ఇందులో మూడు ప్రథానమైన దశలు ఉన్నాయి. ఒకటి అంతరిక్షము, రెండు భూమి, మూడవది ఉపగ్రహాన్ని నిర్దేశించిన కక్ష్యలో ప్రవేశ పెట్టటం. ఈ మూడవ దశ అత్యంత కీలకమైనది.. ఈ  దశలో పాల్గొన్న శాస్త్రవేత్తలలో అతి పిన్న వయసు శాస్త్రవేత్తగా పేరు గాంచిన మన సన్మాన గ్రహీత అత్యంత నేర్పును ప్రదర్శించి  మంచి పేరు సంపాదించారు. వారు మన రాష్ట్రానికి చెందిన వారు కావటం మనం గర్వించాల్సిన విషయం.. ఆమె మన పూర్వ ఇంటర్మీడియట్ విద్యార్థిని శ్రీమతి అక్షర. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను..” సభ చప్పట్లతో మారు మ్రోగి పోయింది. లయబద్దంగా మ్రోగే చప్పట్లలలో ఇద్దరు లేడీ జూనియర్ లెక్చరర్స్ అక్షరను అనుసరిస్తూ వినయంగా వేదిక పైకి ఆహ్వానించారు.
          కమీషనర్ ఉపన్యాసం కొనసాగుతునే వుంది.
          “ఈ సన్మాన విశేషం ఏమిటంటే అక్షర ఇంటర్మీడియట్‍లో మన ఇంటర్మీడియట్ పుణ్యమా అని ఫెయిలయ్యింది” అనే సరికి సభ ఆశ్చర్య పోయింది..
          “అది మన బోర్డులో ఒక ఎగ్జామినర్ చూపించిన నిర్లక్ష్యం.. ఆమె ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోబోయింది. అలా జరిగి వుంటే మన దేశం గర్వించే ఒక శాస్త్రవేత్తను కోల్పోయి ఉండేది. ఆమె నాన్నగారు ఎవరో కాదు.. మన బోర్డుకు విశేషమైన సేవలు అందించిన భాస్కర్ రిటైర్డు జూనియర్ లెక్చరర్. భాస్కర్ ఆమెకు ధైర్యం నూరిపోశాడు. పేపర్ రీ-వాల్యూయేషన్‍తో అక్షర గారికి న్యాయం జరిగింది. అందుకే మై డియర్ స్టాఫ్ మెంబర్స్ మీరంతా మరోమారు  ఆలోచించండి. విద్యార్థుల జీవితాలతో ముడిపడి వున్న ఈ పేపర్ మూల్యాంకనం విషయంలో అత్యంత శ్రధ్ధ వహించగలరని కోరు కుంటున్నాను.
          ప్రతీ సమాధాన పత్రం మీ స్వంత పిల్లలదని భావించి మూల్యాంకనం చేయండని మరో మారు అందరికీ వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను”
          సభలో మరో మారు చప్పట్లు మ్రోగాయి...
          అక్షర ముందుగా తన తండ్రి గారికి పాదాభివందనం చేసింది..  అనంతరం అక్షర సన్మానం ఆరంభమయింది.
           ************

No comments:

Post a Comment

Pages