ముకుతాడు - అచ్చంగా తెలుగు

ముకుతాడు

Share This

ముకుతాడు

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


పిచ్చేశ్వర్రావు పినాకిని దంపుతులకి లేక లేక పుట్టాడు గున్నేశుడు.
ఇన్నాళ్ళూ తర తరాలకి తరగని ఆస్తులున్నాయిగాని..వాటిని కాపాడే వారసత్వ నలుసులేనందుకు కుమిలిపోయారు.
వాళ్ళ పెళ్ళై ఏడెళ్ళయింది. పిల్లాపీచు లేకపోతే పిచ్చేశ్వర్రావు తండ్రి గున్నేశుడు పాత సినిమాల చివరి సీనులో గుమ్మడిలా దగ్గుతూ ’కోడలి కడుపున కాయ కాచేదెన్నడో..ఆ పుట్టినోడితో నా మీసాలు పీకించుకుంటూ గుర్రమాట ఆదేదెప్పుడో’ అంటూనే ఒకరాత్రి తనువు చాలించాడు.
ఆయన పోయిన ఆర్నెళ్ళలో పినాకిని నెల తప్పింది.
తన తండ్రి చనిపోయి తమకి ’గొడ్డు దంపతుల” ని ముద్రపడకుండా పిండమై పినాకిని పొట్టలో కొలువయ్యాడని గొప్ప నమ్మకమేర్పడింది. వాళ్ళమ్మ మంగమ్మ కూడా ’చచ్చేదాకా మీ నాన్నకి నా మీద చచ్చేంత ప్రేమరా! అందుకే నన్నొదల్లేక మళ్ళీ ఈ ఇంట్లో పుడుతున్నాడు. నేనిదే చెబుతున్నాను ఆయన పుట్టాక మనందరం ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పాపం జీవితంలో ఆయన సుఖపడింది లేదు..మళ్ళీ పుట్టాకన్నా మనందరం ఆయన్ని సుఖపెట్టాలి ఆఁ’ అంది.
"అలాగే లేవే ఆయన్ని జాగ్రత్తగా..ప్రేమగా చూసుకుందాం"అని ఏకగ్రీవ తీర్మాణం చేశాడు.
తొమ్మిది నెళ్ళూ కాలు కింద పెట్టనీయకుండా అడిగిందల్లా పెడుతూ చూసుకునే సరికి పినాకిని డ్రమ్ములా తయారయింది. కాన్పు కష్టమవుతుందేమోనని హాస్పిటల్లో చేర్చారు. ఒక శుభఘడియలో సుఖప్రసవమై ‘కేర్ కేర్’ మంటూ భూమ్మీద పడ్డాడు బిడ్డడు. నల్లగా.. బండగా..గమ్మత్తుగా వున్నాడు.
"అమ్మా చూడవే అచ్చు నాన్నే! కాకపోతే మనందరి కోసం సంపాదించలేక నాన్న కాస్త పీనుగల్లే వుండేవాడు కాని మిగతా పోలికలన్నీ సేమ్ టు సేమ్"అన్నాడు ఆనందంగా!
"అవున్రా! ఆయనే సందెహం లేదు..కళ్లూ ముక్కూ..ఛాయ అన్నీను"అంది ఆవిడ కళ్ళొత్తుకుంటూ..
"సిస్టర్, పుట్టిన పిల్లాడు ఏడవకూడదనుకున్నాం. ఆయన మా నాన్నగారు. దయచేసి ఏడవకుండా చూడండి.."అన్నారు ముక్తకంఠంతో!
‘బానే వుంది మీ చాదస్తం, పుట్టిన పిల్లాడు ఏడవకపోతే ప్రమాదం. అయినా ’బాలానాం రోదనం బలం” అంటారు. అంచేత వాడి ఏడుపు వాడినేడవనీయండి"అని విసుక్కుంది.
మరుసటిరోజు హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయి ఇంటికి వచ్చాక వాళ్ళ సంబరం అంబరాన్నంటింది.
వాడికి మెత్తటి పక్క..ఆ రూము చల్లగా వుండడానికి ఏ సీ ఏర్పాటు చేశారు. ఇన్ఫెక్షన్లు వస్తాయని వాడు ఉచ్చపోసినా..క్యాక్ వెళ్ళినా ముడ్డి కింద కొత్త గుడ్డలేస్తున్నారు. తల్లీ పిల్లాడిని చూడ్డానికొచ్చిన అమ్మలక్కలు ’మేము మాత్రం పిల్లల్ని కనలేదా? ఏవిటో విడ్డూరం?’ అని  మూతులు మూడొంకర్లు తిప్పుకుంటూ వెళ్ళసాగారు.
ఇరవై ఒకటో రోజు బారసాల చాలా ఘనంగా చేశారు. బంగారు పూత పూసిన ఉయ్యాల్లోనల్లగా నిగ నిగ లాడుతున్నాడు పిల్లాడు. అందరూ ’అచ్చం కృష్ణుడిలా వున్నాడు’ అని వాళ్ళు తాంబూలంతో ఇచ్చిన కానుకలు తీసుకుని ముఖం ముందు పొగిడి..బయట కెళ్ళాక ”నల్లటి గున్న ఏనుగు ఉయ్యాల్లో ఊగుతున్నట్టుంది’ అని నవ్వుకోసాగారు.
నామకరణం రోజున బాబుకి గున్నేశుడు అని తండ్రి పేరు పెట్టి ఆనందబాష్పాలు కళ్ళలోంచి జాలువారుస్తూ "అమ్మా..నాన్నే..మనమీద ప్రేమతో పుట్టిన నాన్నే!"అన్నాడు.
"పిచ్చి కన్నా..అనుకున్నదే కదరా! నేనండీ మీ మంగూని"అంది వాడి కళ్లల్లోకి చూస్తూ.
వాడు పాలకోసం మూతిని సున్నాలా చుట్టాడు. "చూడ్రా మీ నాన్న ఇలాగే నన్ను ముద్దుపెట్టడానికి మూతి సున్నాలా చుట్టేవాడు"అంది సిగ్గు పడుతూ.
వాడి ముందు పెన్ను, వెండిగ్లాసు, బంగారు గాజు, పుస్తకం పెట్టి ‘వాడు దేన్ని పట్టుకుంటాడా?’ అని ఆత్రంగా ఎదురుచూడసాగారు. వాడు దేక్కుంటూ వెళ్ళి బంగారం అందుకున్నాడు. "ఇహనేం మీ బాబు భవిష్యత్తు బంగారమే!"అని భారీ సంభావన అందుకున్న పంతులుగారు దీవించారు. వాళ్ళ ఆనందానికి అవధి లేదు.
అన్నప్రాసన కార్యక్రమమైతే ఆ ఊర్లో జరిగిన ఒక గొప్ప వేడుక. పిల్లలందరికీ వెండి గిన్నెలు పంచారు.
గున్నేశుడికి పిల్లలకి జరిగే వేడుకలన్నీ అతి ఘనంగా జరగసాగాయి. పిడికిలి ముడిస్తే ముద్ద కుడుములు..పలుకులకి పంచదార చిలకలు..అడుగులకి అరిసెలు ఊరందరికి పంచారు.
గున్నేశుడు దిన దిన ప్రవర్థమానమై ఒంటి మీదకి మూడేళ్ళు తెచ్చుకున్నాడు.
బాసరలో అట్టహాసంగా అక్షరాభ్యాసం జరిపించాడు. వాడినిప్పుడు స్కూల్లో వేయాలి. అదే ఇప్పుడు వాళ్ళకి చింత.
ఇన్నాళ్ళూ వాడిని కంటికి రెప్పలా కాచుకున్నారు. ఇపుడు లోకం కాకుల మధ్య కోకిలవుతాడు. వాడినెవరన్నాతోసేయొచ్చు, లేదా టీచరన్నా తను అడిగింది వాడు  సరిగా చెప్పలేకపోయాడని ముక్కు పట్టుకుని చెంపలు రెండూ వాయించవచ్చు. హోంవర్కు చేయలేదని గోడకుర్చీ వేయించవచ్చు. పేపర్లలో ఎన్ని చదవడం లేదు. పిల్లల్ని స్కూళ్ళలో పశువులని బాదినట్టు బాదుతున్నారని. వాడికేమన్నా జరగొచ్చు. ఎలా? ఎలా??.
కానీ పిల్లాడు చదువుకోవాలి కదా! ఆస్తులు వున్నాయి. వాటిని చూసుకోవడానికి కాని, పని వాళ్ళని ఆజమాయిషి చేయడానికి కానీ చదువుండాలి లేకపోతే అమాయకుడ్ని చేసి ఆస్తంతా దోచేస్తారు.
తప్పదు వాడిని జాగ్రత్తగా మంచి స్కూల్లో వేసి చదివించాలి.
వాడిని స్కూల్లో అడ్మీషను కోసం తీసుకెళ్ళారు. వాడితో పాటు తన భార్య కాని తల్లి కాని తరగతి గదిలో కూర్చుంటారని. అందుకు ఎంత ఫీజైనా..డొనేషనైనా చెల్లిస్తానని చెప్పాడు.
స్కూలు యాజమాన్యం ససెమిరా అంది. ’పిల్లాడిని జాగ్రత్తగా చూసుకుంటామని..తమ మీద భరోసాతో స్కూల్లో చేర్పించండని’ ప్రిన్స్ పల్ రిక్వెష్ట్ చేశాడు.
పిచ్చేశ్వర్రావు కుదరదని చెప్పి వచ్చేశాడు. ఆ తర్వాత ఎన్నో స్కూళ్ళు తిరిగాడు. కొంత మంది డొనేషన్..ఫీజుల మీద ఇష్టంతో ఒప్పుకుందామనుకన్నా తర్వాత తర్వాత మిగతా పిల్లల తల్లి దండ్రులతో ఇబ్బంది పడాల్సొస్తుందని..నీళ్ళు నమలసాగారు. మొత్తానికి పిచ్చేశ్వర్రావు ప్రొపోజల్ ఫెయిలయింది.
మంగమ్మ "పసివాడి ముడ్డిమీదకి ఇంకా మూడేళ్ళు పూర్తిగా రాలేదు..ముక్కేదో మూతేదో తెలియదు..వాడిని అప్పుడే చదువులని ఇబ్బంది పెట్టడం న్యాయం కాదురా. అసలు స్కూల్లో అయిదేళ్ళకి వెయ్యాలి. ఇంకో రెండేళ్ళు అవనీ!" అంది.
అయిదేళ్ళు అవలీలగా సాగిపోయాయి. వాడు గారాబంతో బాగా ముదిరిపోయాడు. పిల్లలతో ఆడినా పాడినా వాడితో పాటు ఎవరో ఒకరు వుండాల్సిందే! వాడిలో మొండితనం కూడా ప్రవేశించింది. ఎవరి మాటా వినడం లేదు. అనుకున్నది జరగాల్సిందే! వెన్నా మీగడ చిరుతిళ్ళూ బాగా తినడం వల్ల గున్న ఏనుగులా తయారయ్యాడు.
వాడిని స్కూల్లో వేద్దామని మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టాడు పిచ్చేశ్వర్రావు. మామూలే! ఎవరూ చేర్చుకోలేదు.
ఇంట్లో ప్రైవేటు ట్యూషన్ పెట్టించారు. వచ్చిన మాస్టారు కూడా వాడి ధాటికి తట్టుకోలేకపోయాడు.
‘వాడికిహ పొట్టకోస్తే అక్షరం ముక్క రావడం కల్ల’ అని ఇంట్లో వాళ్ళకి అర్ధమైపోయింది.
వాడు ఎదుగుతుంటే వాడి భవిష్యత్తు మీద బెంగతో ఇంట్లో వాళ్ళు క్షీణించిపోసాగారు.
అలా గున్నేశుడు ఇరవై ఏళ్ళవాడయ్యాడు.
అచ్చోసిన ఆబోతులా తిరుగుతాడు. ఎవరూ ఏవనడానికి లేదు.
వాడు ఒకమ్మాయిని కోరుకున్నాడు. ఆమె వాడికి గంతకు తగ్గ బొంత. పేరు నల్లమణి. ఆమెకి జీవితమంటే ఏమిటో..బ్రతకడం ఎంత భయంకరమో తెలుసు. వాళ్ళ కుటుంబం అలాంటిది మరి.
పిచ్చేశ్వర్రావు తన కొడుకు ఆమెపై మనసు పడ్డాడని తెలుసుకుని మట్లాడదామని వాళ్ళింటికెళ్ళాడు. పెళ్లయితే వాడు మారతాడని ఆశ. సేం వీళ్ళింట్లో పరిస్థితే అక్కడకూడాను. ఆమె తండ్రి ఆమెకి పెళ్ళి చేయలేక చేతులెత్తేశాడు. ఆమెతోటే మాట్లాడి ఫైనల్ చేసుకోమన్నాడు.
పిచ్చేశ్వర్రావు ఆమె గదిలోకెళ్ళి. "చూడమ్మా! నేను గున్నేశుడి తండ్రిని. వాడు నీమీద మనసు పడుతున్నాడు. మా ఆస్తి అంతస్తూ చూశావుగా..నువ్వు ఒప్పుకుంటే..చాలు. వాడిని ఎంతో గారాబంగా పెంచి తప్పు చేశాము. వాడు ఎవ్వరిమాటని వినని మొండిఘటం లా తయారయ్యాడు. నువ్వే వాడిని మనిషిలా తీర్చిదిద్దాలి."అని కళ్ళ నీళ్ళెట్టుకున్నాడు.
"నా కంతా తెలుసు! మీ అబ్బాయిని నాకు ఒదిలేయండి. నేను ఆ ఆబోతుని దారిలోకి తెస్తా! కానీ మీరు అడ్డు వస్తే ఊరుకోను"ఖరాఖండిగా అంది.
"అలాగే తల్లీ! నోరుమెత్త జీవాలం! మమ్మల్ని మాత్రం కాస్త కనికరించాలి"అన్నాడు.
అలాగే అన్నట్టుగా చెయ్యూపింది.
వాళ్ళిద్దరి పెళ్ళి ఘనంగా జరిగింది.
‘అబ్బో గొప్ప పెళ్ళి! రెండు ఏనుగుల మధ్య పెళ్ళి’ అనుకోసాగారు ఊళ్ళోనివాళ్ళు.
"పెళ్ళికొచ్చిన వాళ్ళు పొట్ట పగిలేట్టు తినెళ్ళండి అంతేకాని ఎటకారపు మాటలొద్దు"అంది భద్రకాళిలా! అంతే అందరూ తోక ముడుచుకు వెళ్ళిపోయారు కాదు పారిపోయారు.
కోడలి గయ్యళితనం తెలుస్తోంది. మొగుడ్ని కొంగున చుట్టుకుని లైన్లో పెట్టేసుకుంది. ఆస్తిని జాగ్రత్తగా చూసుకోసాగింది. మంచి మాస్టారిని పెట్టి మొగుడ్ని చదివించుతోంది. మొదట్లో కాస్త మొండికేశాడు. కానీ ఏం చేసిందో మారిపోయాడు. కోడలు ఊరందరికీ గయ్యాళిదే! కాని తమని మాత్రం ఇబ్బంది పెట్టదు. పొగరుబోతు కొడుక్కి ముకుతాడు వేసింది. ఆస్తిని కాపాడింది. సర్వనాశనమైపోతుందనుకున్న ఇంటిని చక్కబెట్టింది. ఆమె దేవత! దేవతలు అందంగానే వుండాలని లేదు. మనసు మంచిగా వుండే వాళ్ళూ వుంటారు.
***

No comments:

Post a Comment

Pages