నాకు తెలిసిన యండమూరి
- శ్రీనివాస్ బట్టు
మాదొక చిన్న పల్లెటూరు. పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలన్న సంగతేమోగాని, అక్కడుండే వారికి అందే సౌకర్యాలు మాత్రం అరకొర మాత్రమే. మా ఊరికి న్యూస్ పేపర్ కూడా వేరే వూరినుంచి వచ్చేది. ఏదైనా కారణాల వల్ల, ఆరోజు పేపర్ రాకుంటే ఇక పిచ్చి బోర్ కొట్టేసేది. ఊర్లో ఒక లైబ్రరీ కూడా వుంది, కానీ అందులో ఇప్పటికి కూడా కొత్త పుస్తకాలు వచ్చినట్లు నాకు తెలియదు. మరి పల్లెటూరు పిల్లల జ్ఞాన సముపార్జనకు మార్గాలేంటి...? వాళ్ళలా వుండిపోవాల్సిందేనా...? J సాధారణంగా పల్లెల్లో వుండే పిల్లలకు పెద్దదిక్కు ఆ ఊరిలో చదువుకున్న పెద్దలే. వాళ్ళే మాలాంటి పిల్లలు ఒక స్టేజ్ కొచ్చేవరకు సలహాలు ఇచ్చి మా కెరీర్నేగాకుండా, గుణగణాల్ని కూడా తీర్చిదిద్దుతూ వుంటారు. ఆతరువాత మేము, మా ముందు తరాల పిల్లలకిస్తుంటాము. ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ...!!! అన్నయ్య చెప్పిన ‘ఆ’ కథ విని నాకు భయం వేసింది. “అన్నయ్యా... ఇప్పటికి కూడా చేతబడులు చేసే వారున్నారా...? ” అని అడిగాను.‘ఉంటారు....యండమూరి ఎంతో రీసెర్చ్ చేసే, ఈ నవల రాసారు...’ అని చెప్పారు. ఆ తరువాత భయంతో రెండు మూడు రోజులు నిద్రపోలేదన్నది వేరే సంగతి. అప్పుడు నేను ఆరవ తరగతి చదువుతున్నాననుకుంటాను. ఆతరువాత అన్నయ్య చెప్పిన ఇంకోకథ ‘అభిలాష’. ఆయన ఈసారి కథ చెప్పడం మాత్రమే కాదు, ‘ .....ఆ పుస్తకం చదవమని కూడా ఇచ్చారు.’ అదే నేను చదివిన యండమూరి మొదటి నవల. యండమూరి వీరేంద్రనాథ్ గారు తన ప్రతి నవలకు, ఒక వైవిధ్య భరితమైన సబ్జెక్టును ఎన్నుకుని, దానిచుట్టూ కథలల్లుతారు. ఆయన నవలలు కేవలం టైం పాస్ కాదు, వాటిల్ని చదివిన దానివల్ల ఎంతో నాలెడ్జ్ పెరుగుతుంది. కేవలం అవి చదివిన దానివల్లనే, నాకు ఎన్నో సబ్జెక్టుల మీద అవగాహనొచ్చింది. ఆ తరువాత మిగతా రచయితలు కూడా ఆయన్ని అనుసరించాల్సి వచ్చింది. “ ఆనందోబ్రహ్మ, అంతర్ముఖం, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, ధ్యేయం, ప్రేమ, లేడీస్ హాస్టల్, పర్ణశాల, వెన్నెల్లో ఆడపిల్ల......” నాకిష్టమైన నవలల్లో కొన్ని. అమితంగా నన్ను ప్రభావితం చేసి, జీవితాన్ని మలుపుతిప్పిన నవల “పర్ణశాల”. అందులో జీవితాన్ని ‘జీరో బేస్డ్’ స్థాయి నుంచి ఎలా పునర్నిర్మించుకోవాలో వివరించారు. ఆయన రచనల్లో విశ్లేషణాత్మక వివరణలు విపులంగా ఉంటాయి. ఎక్కడా ‘బోర్ కొట్టడం’ అనేదుండదు. తెలుగు సాహిత్యంలోని ప్రముఖ కవులు, ఆంగ్ల కవుల పద్య పాదాలు సందర్భానుసారం రచనలో ప్రస్తావనకి తెస్తారు. అవి నవల శిల్పాన్ని మరింత రమణీయం చేస్తాయి. వస్తు వైవిధ్యం, ప్రక్రియా పరమైన విభిన్నత, చక్కటి శైలి యండమూరి రచనల్లో వుండి అలరిస్తాయి. పాఠకులకి రసానుభూతిని కలిగిస్తాయి. ఇంకా చెప్పుకోవలిసింది “... ఆయన నవలల్లో నాయికల గురించి ”. వాళ్ళు సరదాగా, అల్లరిగా,అమాయకంగా, ఏమి తెలియనట్టే వుండి, సమయానుకూలంగా తమ తెలివితేటలు ప్రదర్శిస్తూ వుంటారు. ప్రతి అంశాన్ని తమదైన దృక్కోణం నుంచి ఆలోచించడం, మానసికంగా బలహీనమైనప్పుడు సైతం ఆలోచనల్లో లాజిక్ ని విడిచిపెట్టక పోవడం వారి ప్రత్యేకత. ధ్యేయం లో ‘నిఖిత’, అంతర్ముఖం లో ‘ప్రణవి’, లేడీస్ హాస్టల్ లో ‘కిరణ్మయి’, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు లో ‘హారిక’- నాకిష్టమైన నాయికలలో కొందరు. వీళ్ళందరి గురించి చదివి, విపరీతంగా ప్రభావితమై, అమ్మాయంటే ఇలా వుండాలని, నా మనసులో ఒక ‘ఊహా సుందరి’ (డ్రీం గర్ల్) ప్రత్యక్షమైంది. వీరేంద్రనాథ్ నవలల్లో నేను విపరీతంగా అభిమానించే ఇంకో నవల ‘అంతర్ముఖం’. చాలా చిన్న వయసులోనే చదివాను. మనుషుల మనస్తత్వాలను విశ్లేషించి, అర్థం చేసుకునేందుకు ఈ నవల చాలా ఉపయోగపడింది. ‘ప్రేమ’ నవల ఒక అద్భుతం. దాంట్లో ప్రేమను గురించి రాసిన చాలా వాఖ్యాలు డైరీ లో రాసుకున్నాను. ఆయన రాతల్లో భ్రమలుండవు....వాస్తవాలుంటాయి. అవి చెరగని అక్షర సత్యాలు. ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలంటే, పరిస్థితులకు తగ్గట్టు మనల్ని మనం మలచుకోవాలి. ఎంచుకున్న రంగంలో నెం.1 గా నిలవాలంటే, మన పోటీదారుల కంటే ఆలోచనల్లో ముందుండాలి. ఎప్పుడైతే జనాలు నవలలు చదవడం తగ్గించడం మొదలెట్టారో, అప్పుడే యండమూరి వ్యక్తిత్వ వికాస పుస్తకాల బాట పట్టారు. ‘విజయానికి ఐదు మెట్లు’ విజయం గురించి చెప్పాల్సిన పనేలేదు. జనాలు ఎప్పుడైతే పుస్తకాలను చదవడం తగ్గించారో, వీరేంద్రనాథ్ వ్యక్తిత్వవికాస శిక్షకుడిగా కొత్త అవతారం ఎత్తారు అందులోను విజయం సాధించారు. యండమూరి తన నవలల్లో హీరోలకు అనేక కష్టాలు సృష్టిస్తారు. చదివే పాఠకులు ‘... వీడు అయిపోయాడ్రా బాబు’ అనుకుంటారు. వారు ఊహించని విధంగా చిన్న చిన్న ఆధారాలతో మన హీరోను అందులోంచి బయట పడేస్తారు. ఇవన్ని చదివి, విశ్లేషిస్తే ‘ ... మన నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను, మనం కూడా ఇంతే తెలివిగా పరిష్కరించుకునే నేర్పు అలవడుతుంది’. ఆయనలో వుండే ఇంకో మంచి అలవాటు ఏంటంటే, అక్కడక్కడ మంచి ఇంగ్లీష్ బుక్స్ పేర్లు ఉదహరిస్తారు. ఆయన పుస్తకాలు చదవడం వల్లనే, “ The Alchemist, Rich dad poor dad, who moved my cheese, The monk who sold his Ferrari, How to win friends and influence people, The art of war, The Seven habits of highly effective people, Success is never ending Failure is never final ” మొదలైన ఇంగ్లీష్ బుక్స్ గురించి తెలుసుకొని చదవగలిగాను. ‘The Alchemist’ నా జీవితాన్నే మార్చేసింది. ‘విజయానికి ఐదు మెట్లు’ నుంచి..... “ ప్రతి రాయీ తనలో ఒక శిల్పాన్ని దాచుకుని వుంటుంది, సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు, ఉలితో చెక్కాలి. అలాగే ప్రతి మనిషిలోను ఒక శక్తి వుంటుంది. బ్రహ్మాండం బద్దలు కొట్టేద్దామన్న ఊహల్లో బ్రతికితే విజయం రాదు. కష్టమనే ఉలితో పట్టుదలగా చెక్కితేనే గెలుపనే శిల్పం బయటపడుతుంది. ఆ తపన లేని మనిషి రాయిలానే బ్రతుకుతాడు....” ఆయన్ని నేను ఇంటి దగ్గర కలిసాను. వ్యక్తిగత కారణాలవల్ల, టైం కేటాయించలేకపోయారు. నా అలక తీర్చేన్దుకేమో కాబోలు ‘...ఆటోగ్రాఫ్ కావాలా ?’ అనడిగారు. ‘...వద్దన్నాను’. ‘వద్దు’ అనడం నా పొగరుకు చిహ్నం కాదు. ‘ ఉపయోగం లేని పనులు చేయకపోవడం అనేది ఆయన పుస్తకాల నుంచే నేర్చుకున్నాను.....!!!’
_________________________****************____________________________
No comments:
Post a Comment