నిరుపేద బుడుగు - అచ్చంగా తెలుగు

నిరుపేద బుడుగు

Share This

నిరుపేద బుడుగు

- యనమండ్ర శ్రీనివాస్  


“ఒరేయి బుడుగూ, లాభం లేదు. మీ పెద్దవాళ్ళనోసారి రమ్మను. మాట్లాడాలి” అన్నారు మా కొత్త మాస్టారు ఈ రోజు క్లాసులో. ఈ మాస్టారు వైజాగు నుండీ వచ్చారట. వచ్చినప్పటినుండీ నాకు ప్రైవేటులు బాగా చెప్పేస్తున్నారు.
అసలు ఈ వైజాగు వాళ్లు కొద్దిగా టింగరి వాళ్ళుట. బాబాయి చెప్తుంటాడు. ఇదివరకైతే వాళ్ళ ఊళ్ళో జైలు పక్కన బస్టాండు, యూనివర్శిటీ పక్కన మెంటల్ హాస్పటల్ వుండేవట. ఇందులోంచి పారిపోయినవాళ్ళు అందులో లిడింగున దూరేందుకు వీలుగాట. భలే భలే. వచ్చిన కొత్తలొ మాస్టారిని అడిగేశా. నిజమేనా సార్ అని. ఆయన నా డిప్పమీద గాఠిగా ఓటిచ్చుకున్నారు.
అప్పటినుండీ కొద్దిగా జాగ్రత్తగా వుంటున్నా ఈ మాస్టారితో. మామూలగా అందరితో కోపమొస్తే “జాటర్ ఢమాళ్” అని తిట్టేస్తానా? కానీ, ఈ మాస్టారి మీద కోపం రావట్లేదెందుకో. ఆయన నాకన్నా గాఠిగా “డిప్పలు ధడేల్” అనేస్తాడేమో అని బయ్యం వేస్తొంది. ఆ బయ్యంలో ఉక్రొషం వొచ్చేస్తోంది. ఆయనకి నేను లొంగిపోతున్నాని. లొంగిపోవటం అంటే – బాబాయి సీతని చూసి మెలికలు తిరిగిపోతాడే, అలాంటి లొంగిపోవటం కాదు. కృష్ణుడు యశోద దగ్గర ఛుప్ అయిపోతాడే. అట్లా.
అయినాకానీ, మాస్టారికి ఒకసారి లొంగిపోయినట్టు కనపడ్డామా. ఇక మన పని అయిపోయినట్టే. మన మీద బయ్యం వుండదు వాళ్ళకి. అందుకే ఒకోసారి గాఠిగా సమాధానం చెప్పేస్తా.
ఇవాళ అదే అయ్యింది. ఆయన పాఠం చెప్తున్నారా? నాకేమో బోరు కొడుతున్నట్టు అనిపించింది. సరేకదా అని ఆయన పీరియడ్ అయ్యాక ఎంచక్కా ఇంటికి చెక్కేద్దామనుకున్నా. ఇంతలో గేటు దగ్గర సింహంలా ఈయన.
“ఎక్కడికిరా బయలుదేరావు” అమ్మో, భలే హుంకరింపు. నాలాంటి వాడైతే పర్వాలేదు. వేరే ఎవడికైనా ఐతే ఒంటేలు వొచ్చేస్తుంది ఆ అరుపుకి.
“మరేమో. డిప్ప కటింగుకండీ” అని కళ్ళు మూస్కుని ఘబుక్కున చెప్పేశా. కళ్లు తెరిస్తే బయ్యమేస్తుందేమో అని.
“స్కూల్లొ చెయ్యాల్సిన పనులు స్కూల్లో చెయ్యి. ఇంట్లొ చెయ్యాల్సిన పనులు ఇంట్లో చెయ్యి. బడుద్దాయి” అన్నారు మాస్టారు.
హమ్మో. ఇపుడు బయ్యమేస్తే గోడకుర్చీ వేయిస్తారు. అందుకే బయ్యపడకుండా చెప్పా. “అవునండీ. ఈ డిప్ప స్కూల్లో వున్నప్పుడు పెరిగిందే కదండీ. అందుకే. స్కూలుటైములో తీయించుకోడానికి వెళ్తున్నా?” అని. లాజికల్ గా మాట్లాడితే ఎవడైనా పడిపోతాడని బాబాయి ఊరికే అనలేదుగా.
“అవునా. మరి. మొత్తం డిప్ప ఇక్కడున్నప్పుడే పెరగలేదుగా” ఎదురు హుంకరింపు. ఈ మాస్టారు గొంతులో కిచ్ కిచ్ వొచ్చి మెడికల్ షాప్ వాడి దగ్గర విక్స్ బిళ్ళలు లేకుండా వుంటే ఎంత బాగుంటుందో కదా.
“అందుకే కదండీ. మొత్తం డిప్ప కొట్టించుకోవట్లేదు. కొద్దిగానే స్కూలులో పెరిగినంతే కొట్టించుకుంటున్నా” అనేసి తుర్రుమందామనుకున్నా. కానీ అంతలోనే ఆయన నా కాలరట్టేసుకుని చెప్పారు. “ఒరేయి బుడుగూ, లాభం లేదు. మీ పెద్దవాళ్ళనోసారి రమ్మను. మాట్లాడాలి” అని.
అలాగే అని చెప్పి నా కాలరు ఆయన చేతినుంచీ దొరక పట్టుకుని బయటకు పరిగెత్తాను.
సాయంత్రం బాబాయి సీతకిచ్చి రమ్మని ఒక ఉత్తరం నా చేతిలో పెట్టినప్పుడు చెప్పాను. “నువ్వు నన్ను రషించుకోవాలోయి మా మాస్టారు దగ్గరనుండీ” అని. బాబాయికి ఇది వెన్నతొ పెట్టిన విద్య. విద్య వెన్నతో ఎలా పెడతారో నాకు తెలీదు. కాకపోతే ఇదీ మా వైజాగు టింగరి మాస్టారు చెప్పిందే.
మర్నాడు బాబాయిని తీసుకుని మాస్టారి దగ్గరకి వెళ్లాను. ఆయన ఆఫీసు రూములొకి రమ్మన్నారు.
“మీ బుడుగుని గత నెల రోజులుగా గమనిస్తున్నాను. అల్లరి గడుగ్గాయి, బుర్ర ఉంది గానీ. ఉపయోగించడు. మీకొసారి చెప్పి వీడి చెవి మెలి వేద్దామని రమ్మన్నాను” అన్నారు.
“కాదండీ. పాపం వీడికి చదువంటే ఎంత ఇష్టమో మీకు తెలియదు.” అని బాబాయి చెప్పబోయాడు.
మాస్టారు ఆపమన్నట్టు చెయ్యి చూపించి, ఓ పేపరు బాబాయికిచ్చారు. “రిపబ్లిక్ డేకి మేము వ్యాసరచనల పోటీ పెట్టాము. “నిరుపేద కుటుంబము” మీద. మీ వాడి రాతలు మీరే చూడండి” అన్నారు.
బాబాయి చదవడం మొదలెట్టాడు పైకి.
“నిరుపేద కుటుంబము
నాకు తెలిసిన ఒక నిరుపేద కుటుంబము విదేశమునందు కలదు. ఆ కుటుంబములోని అతను నిరుపేద. అతని అన్నయ్య నిరుపేద. వదిన నిరుపేద. వారిద్దరి పిల్లలు కూడ నిరుపేదలే. వారి నాన్న కూడ నిరుపేదవాడే. వారింట్లోని అందరు నౌకర్లూ నిరుపేదవారే. పనిచేసే పనిమనిషి, బట్టలుతికి పెట్టే చాకలి, ఇంటి పనులు చూసుకునే మేనేజరు, ఆఫీసు పనులు చూసుకునే వారి కింది ఆఫీసరూ, ఇంటి తోటమాలి, వాళ్ళ మెర్సిడీసు కారు డ్రైవరూ – అందరూ నిరుపేదవారే. వారు ఎంత నిరుపేద వారంటే, వారి బాడీగార్డులకు, వారి ఫ్లైటు పైలట్లకు ఒక్క యూనిఫామ్ తప్ప వేరే బట్టలు ఉండేవి కావు. ఆఖరుకి ఆ ఇంట్లోని రెండు డాబర్ మేన్ కుక్కలు కూడా నిరుపేదవే. ఆ నిరుపేదలకి వారి జీవితము మీద భయముతో వారు అన్నం తిన్నా తినకపోయినా ప్రతీ వారికి ఒక గన్ను వుంచుకునేవారు. వారు చుట్టూపక్కల దేశాలు వెళ్ళాలంటే రైలు టిక్కెట్లకు డబ్బులు లేక ఉన్న ఫ్లైటులోనే తిరుగేవారు. ఆ అబ్బాయికి ఒక అత్తయ్య ఇండియాలో ఉంది. అంతే అంతకు మించి బంధువులు వేరే ఎవరూ లేరు వాళ్ళకి. కానీ వారి ఫ్లైటులో అంత దూరం వెళ్ళేందుకు పెట్రోలు లేదు. కొట్టించేందుకు డబ్బులు లేక ఆవిడని చాలా రోజుల నుండీ అతను కలవలేదు. అలా అతని బతుకు నిరుపేదగా గడిచిపోయినది.”
ఇంతవరకూ బాబాయి చదివి పేపరు మడతపెట్టి జేబులో పెట్టుకున్నాడు. మాస్టారితో “సార్ నాకర్దమయింది. వీడి సంగతి నేను చూసుకుంటా” అని చెప్పి అక్కడనుండీ లేచి వచ్చాడు.
బైటకొచ్చాక బాబాయి జెల్లకాయ ఇస్తాడు అనుకున్నాను. కానీ ఆపకుండా నవ్వుతూ. “ఒరేయి బుడుగూ. ఇదేం నిరుపేద కుటుంబంరా” అని పొట్ట పట్టుకున్నాడు.
నాకు బాగా ఇంసల్ట్ అనిపించింది. “జాటర్ ఢమాళ్” అని తిట్టేశా బాబాయిని. “నువ్వు సినిమాలు చూస్తావు కానీ, అందులో విషయాలు అర్దం చేస్కోవు బాబాయి. ఈ మధ్య వచ్చిన సినిమాలో ఇలాంటి కుటుంబమే ఉంది కదా. ఆ అబ్బాయి కూడ వాళ్ళ అత్తయ్యను కలసినప్పుడు అంటాడు కదా – అత్తా మాకు అన్నీ వున్నా, కేవలం నువ్వు లేకపోవటం వల్ల, ఇన్నాళ్ళూ మేము నిరుపేదలుగా బతికేస్తున్నాం అని”
ఛ. ఈ బాబాయిని స్కూలుకి తీసుకురావడం నా తప్పు. ఇప్పుడు మాస్టారేమో నాకు వ్యాసం రాయటం రాదనుకుంటారు. అసలు బాబాయికి సినిమా చూడటం రాదని తెలుసుకోరే.
అందుకే. అబ్బాయిలూ. మీ స్కూలుకి మీ బాబాయిని తీసుకెళ్ళేడప్పుడు అన్ని సినిమాలు చూసి బాబాయి అన్ని విషయాలు తెలుసుకుంటేనే తీసుకెళ్ళండి. లేకపోతే వద్దు. సరేనా.
ఉంటా మరి.

No comments:

Post a Comment

Pages