ఓవర్ స్మార్ట్ ఫోన్లు
- భావరాజు పద్మిని
'కత్తి పోయి ముల్లు వచ్చె డాం డాం డాం...' అన్న కోతి కధలోని పాటలా, ముందు టెలిగ్రామ్ లు, తర్వాత ల్యాండ్ లైన్ లు, తర్వాత పేజర్ లు, తర్వాత బండ మొబైల్ ఫోన్ లు, ఆపై వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ కు వెళ్ళిన సెలబ్రిటీ లాగా స్లిమ్ ఫోన్లు, చిట్టచివరికి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. మనం కూడా కోతికి కొబ్బరికాయ దొరికినట్లు మహదానంద పడిపోతూ, అరచేతిలో ఇవి చూపిస్తున్న వైకుంఠాన్నిచూసి మురిసి ముక్కలవుతూ, పక్కింట్లో పిడిగు పడ్డా చలించకుండా, ఆనందిస్తున్నాం. దరిమిలా ఈ ప్రవాహంలోకి మరొక కొత్త ఆవిష్కరణ వచ్చి చేరిందట... అవే ఓవర్ స్మార్ట్ ఫోన్లు.
మొబైల్ నెట్వర్క్ వాళ్ళ ఫోనులీసు లెక్కల ప్రకారం, భారత్ లో 50% మంది నిరక్షరాస్యులే కనుక, వీరికోసం, హచ్ కుక్కలా వీరి బుర్రతో కనెక్ట్ అయ్యి, కావలసినది తెలుసుకుని, వెంటనే తగిన సూచనలు ఇచ్చే 'ఓవర్ స్మార్ట్ ఫోన్లు ' తయారు చేసారట ! ఇందులో ఉన్న మరొక సౌకర్యం, ఈ ఫోన్లు నచ్చిన సినిమా అక్టర్ల గొంతులతో మాట్లాడుతూ సూచనలు ఇస్తాయట ! అవీ, అందుబాటు ధరల్లో. ఇక ఆలస్యం చెయ్యకుండా, ఇవి మార్కెట్ లోకి రాగానే, బాహుబలం చూపించి, కొట్టుకుని మరీ, బాహుబలి టికెట్లు సంపాదించిన ప్రేక్షకుల్లా, ప్రజలు ఎగబడి కొన్నారట ! వీళ్ళలో వెంకన్న కూడా ఉన్నాడు. అతను తాపీ మేస్త్రి. ఇక అసలు కధ చదవండి.
వెంకన్నకు సినిమా నటి నిర్మలమ్మ అంటే, తగని అభిమానం. అందుకే, ముందుగా ఆవిడ గొంతు సెట్ చేసుకున్నాడు. ఉదయాన్నే అలారం మోతకు బదులు నిర్మలమ్మ గొంతు వినబడింది. " లే నాయనా, బారెడు పొద్దెక్కింది, పనికి బోవాల..." అంది ఫోను. 'ఓహో, యెంత కమ్మగా నిద్దర లేపింది.." అని మహాదానందపడ్డాడు వెంకన్న. తర్వాత జర్దా నోట్లో వేసుకోబోతూ ఉండగా, ' వద్దురా, ఆరోగ్యానికి మంచిది కాదు బిడ్డా. ' అంది ఫోను. అయినా తినేసి, ఫోన్ జేబులో పెట్టుకు వెళ్ళాడు వెంకన్న. పనిచేస్తూ సిగరెట్ తాగాబోతూ ఉండగా, ' నీకిదేం పోయేకాలం రా, చెబితే వినవు, ముదనిష్టపు అలవాట్లూ నువ్వూనూ...' అని మిగతా కూలీల ముందు తిట్టింది ఫోను. వెంకన్నకు తలకొట్టేసినట్టు అయ్యింది. మధ్యాహ్నం అన్నం తింటూ ఉండగా, ' ఒరేయ్ వెంకా. ఆ కూలీలను తెచ్చే ముఠా వాడు, ఎక్కువ డబ్బుకోసం నిన్ను బెదిరించాలని చూస్తున్నాడు. ఇందాక నువ్వు నన్ను గదిలో వదిలి పైకి వెళ్లావు చూడు, అప్పుడు విన్నా...' అని చెప్తూ ఉండగా, అదే సమయానికి ఆ ముఠా పెద్ద అక్కడికి రానే వచ్చాడు. వెంటనే ' మాయదారి సచ్చినోడా ! మా వెంకడికే టోపీ పెట్టాలని అనుకుంటావట్రా, నీ జిమ్మడిపోనూ, నీకు మాయరోగం రానూ...' అని తిట్లు మొదలెట్టేసరికి, కోపం వచ్చిన ముఠా వాడు, మిగతా కూలీలతో సహా, పనోదిలేసి వెళ్ళిపోయాడు. ఇక లాభం లేదని నిర్ధారించుకున్న వెంకన్న, సుత్తి వీరభద్రరావు మోడ్ కి మారాడు.
ఖాళీగా ఉండడంతో ఓవర్ స్మార్ట్ ఫోన్ లో ఉన్న బటన్స్ నొక్కసాగాడు. ఇంతలో 'ఒరేయ్ కుంకా ! నువ్వు నొక్కి అఘోరించింది రేడియో పాటల ఆప్. పాడి చస్తుంది అంతే. అదేమన్నా గూగుల్ సెర్చ్ అనుకున్నావా, ఓ టపటపా అక్షరాలు కొట్టేస్తున్నావ్ ? నీలం రంగులో 'g' అన్న అక్షరం ఏడుస్తుంది. దాన్ని నొక్కు, అప్పుడు నీకు కావలసినవి వెతికి తగలడుతుంది !' అంది ఫోన్ బిగ్గరగా. సరే, ఎవరూ లేరు కనుక, వెంకన్న సర్దుకుని, సినిమా టికెట్ ల ఆప్ కోసం వెతకసాగాడు.
' ఏవిటీ, ఆ దిక్కుమాలిన కొత్త సినిమాలు చూసి తగలడతావా అక్కుపక్షి ! వెనకటికి ఒక నక్క ఫుడ్డు కోసం రోడ్డు మీద పడి, నది ఒడ్డున ఉన్న ద్రాక్ష తోట చూసి, జిడ్డు నాలుకతో చొంగ కార్చుకుంటూ, జెడ్డి పీనుగ లాగా ఎగిరి, నానా గడ్డి కరచి, చివరికి అందని ద్రాక్షా కంటే ఉడ్డు ముక్క తినడం నయమని, మడ్డి మొహం వేసుకు వెనుదిరిగి, దొరికిన ఫుడ్డు తిందట ! ఆ కధ తెలుసా వెర్రి వెంగలప్పా ? ఇందులో ఎన్నో డ్డ లున్నాయి, లెక్కెట్టుకో...' అంది ఫోన్.
అంతే, హడిలిపోయిన వెంకన్న టీవీ ఆంకర్ మోడ్ లోకి మారాడు. ఒక సేల్ఫీ తీసుకుందాం అనుకున్నాడు.
' హాయ్, వెంకన్న. మంచిగున్నవా ? నీ షర్టు మస్తుగుంది లే ! కాని, నీ ఫోన్ కుడిపక్కకి పెట్టినవ్. జర్రంత గిటు జరుపు. తర్వాత జుట్టు దువ్వుకుని, కాస్త నవ్వు. ఇవాళ ఏం తిన్నవ్, యాడికెల్లి వస్తన్నావ్నా... అంటూ ఒక అరగంట అర్ధం పర్ధం లేకుండా వాగాకా, ఆంకరింగ్ నీకు నచ్చితే అక్కడ లైక్ బటన్ ఒత్తు, బొటనవేలు నిల్చుని ఉంటది. తెలీకుంటే, నే జెప్తాలే, పరేషాన్ గాకు...' అంటూ వెంకన్న కున్న పీత బుర్ర కాస్తా స్పూన్ వేసుకు తినేసింది.
ఇక విసుగొచ్చిన వెంకన్న , సెల్ఫీ తీసుకోవాలన్న భ్రమ వదిలేసి, కొత్తగా మొదలెట్టే పనికోసం, మంచి ముహూర్తం చూద్దామని, కాల్ సెంటర్ మోడ్ లోకి మారాడు.
'నమస్కారము. మీరు ఫోన్ లో ఆప్ గురించి వెతుకుతుంటే ఒకటి ఒత్తండి, నావిగేషన్ కొరకు రెండు ఒత్తండి... అంటూ వెంకన్నకు ఒచ్చిన అంకెలన్నీ ఓ వంద సార్లు నొక్కించాకా... 'క్షమించండి, మీరు అడిగన సమాచారం కనిపించుటలేదు. మరలా ప్రయత్నించండి... ' అంది ఫోన్.
' వెర్రి వెంకన్నని అనుకున్నావా ? ఇన్ని వేలూ పోసి ఫోన్ కొన్నాకా, సమాచారం లేదా, అంటే ఏవిటి అర్ధం...' కోపంగా అడిగాడు వెంకన్న.
' మీ బాధ మాకు అర్ధం అవుతుంది. కాని, మరలా ప్రయత్నించండి వెంకన్న గారు. మీ కాల్ కస్టమర్ ఇంప్రూవ్మెంట్ కోసం రికార్డు చెయ్యబడుతుంది...' అంది ఫోన్ చల్లగా...
వెంటనే వెంకన్న మొబైల్ కొన్న షాప్ కి పరిగెత్తాడు.... పూర్తిగా పిచ్చెక్కక ముందే, ఓవర్ స్మార్ట్ ఫోన్ కి ఎక్స్చేంజ్ ఆఫర్ అడిగి, మామూలు మొబైల్ కొనుక్కునేందుకు !
No comments:
Post a Comment