పండిట్ విశ్వమోహన్ భట్ - మోహనవీణ - అచ్చంగా తెలుగు

పండిట్ విశ్వమోహన్ భట్ - మోహనవీణ

Share This

పండిట్ విశ్వమోహన్ భట్ - మోహనవీణ

-మధురిమ 


మోహనవీణ మరియు దాని సృష్టి కర్త మీకు ఎవరో తెలుసా , అదే మన  ప్రఖ్యాత హిందుస్థానీ సంగీత విద్వాంసులు పండిట్ విశ్వమోహన్ భట్ గారు.
1951 జులై 27న రాజస్థాన్ రాష్ట్రం లోని జైపూర్ నగరంలో మన్మోహన్,చంద్రకళాభట్ లకు  జన్మించిన మూడవ సంతానం వీరు. వీరికి ఒక్క అన్నయ్య,ఒక అక్క,ఒక తమ్ముడు ఉన్నారు.వారి తల్లితండ్రులు ఎంతపుణ్యాత్ములంటే వీరందరూ సంగీత విద్వాంసులే.    తల్లితండ్రులు ఏఉద్దేశ్యంతో ఈయనకు విశ్వమోహన్ అని పేరు పెట్టారో మనకు తెలియదు కానీ , తన మోహనవీణా నాదంతో ఈయన విశ్వన్నంతా సమ్మోహనపరుస్తున్నరుగా మరి కనుక భట్ గారు  నిజంగా సార్ధక నామధేయులే.
 భగవంతుని సృష్టిలో జన్మకారకులు, కారణ జన్ములు అని రెండు రకాలుగా ఉంటారు. మొదటివారు సృష్టి నియమానుసారం పుడతారు,ఏదో ఒకరోజు "జాతస్య  హి ధ్రువొ మృత్యుః" అని వెళ్ళిపోతారు కానీ రెండవ వాళ్లని ఆ భగవంతుడు ఒక కారణం కోసం,లోక కళ్యాణం కోసం పుట్టిస్తాడు. వారి కీర్తి మాత్రం ఆచంద్ర తారార్కం నిలిచే ఉంటుంది.
భట్ గారు కారణ జన్ములు అనడానికి నిదర్శనం వారి అనన్య సామాన్యమైన సంగీత ప్రతిభా పాఠవాలు,తార్కాణం వారి సృజనాత్మక సృష్టి అయిన వారి మోహన వీణ.
పాశ్చాత్య సంగీత వాయిద్యమైన హవాయియన్ గిటార్ ను వీణ,సితార్,సరోద్ వాయిద్యాల ధ్వనిని పలికించేలా... ఆరు తీగలుండే గిటార్ కు, 20 తీగలు అమర్చి దానికి భౌతికంగా కూడా వీణ స్వరూపం తీసుకురావడానికి వీణలాగే ఎడమవైపు ఒక చిన్న కడవని కూడా అమర్చి, దీన్ని వాయించడంలో గిటార్ కి ధీటు గా ఒక సమాన ప్రక్రియను ఎంతో ఓర్పుతో,నేర్పుతో,నైపుణ్యంతో మేళవించి, ఈ కొత్త వాయిద్యానికి మోహనవీణ అని నామకరణం చేసారు..ఇక అక్కడినుంచీ తన నాదంతో అది  శ్రోతలను సమ్మోహన పరుస్తూ  భట్ గారి ఉనికికి మారు పేరు అయ్యింది.
 వీరి తల్లితండ్రులు కూడా ప్రఖ్యాత హిందుస్థానీ సంగీత విద్వాంసులే,వారే వీరి తొలి సంగీత గురువులు కూడా.సంగీత కుటుంబంలో పుట్టిన ఆయనకు ఆ ప్రణవ నాదం కేవలం గళంలోనే కాదు వారి శరీరం అంతా నిండి ఉంది.దానికి కారణం వీరి చిన్నతనంలో  తండ్రి గారు, బడే గులాం అలీఖాన్ వంటి పెద్ద పెద్ద విద్వాంసులతో కలిసి గంటల తరబడి సాధన చేస్తూ ఉండేవారట.తండ్రిగారు ఎప్పుడూ సంగీత ప్రపంచంలోనే ఉండేవారట,అర్ధరాత్రి కూడా నిద్రలేచి అప్పుడు ఏది తడితే అది స్వరపరిచి తిరిగి పడుకునేవారట. ఇక తల్లి గారైన చంద్రకళాభట్ ఎంత గొప్ప సంగీత శిక్షకులంటే రాజస్థాన్ రాష్ట్రంలో పాఠశాలలో,కళాశాలలో,విశ్వవిద్యాలయాలలో సంగీతాన్ని ఒక అంశం గా ప్రవేశ పెట్టడానికి తీవ్రమైన కృషిసలిపిన గొప్ప మహిళ. మరి ఇలాంటి సంగీత వాతావరణంలో పుట్టి పెరిగిన ఆయనకు సంగీతం వెన్నతో పెట్టిన విద్యే కదా మరి.
తండ్రిగారి వద్ద గాత్రంలో శిక్షణ  పొందుతూ, ప్రఖ్యాత సితార్ విద్వాంసులైన పండిట్ రవి శంకర్ గారి వద్ద సితార్లో శిక్షణ పొందుతూ ఉండేవారట. వీరి కుటుంబానికి  రవి శంకర్ గారితో ఎనలేని అనుబంధం ఉండేదట.వీరే రవి శంకర్ గారి తొలి శిష్యులు కూడా వీరు ,వీరి సోదరి మంజుశ్రీ ,అన్నయ శశి మోహన్ భట్,వీరి తమ్ముడు కృష్ణ మోహన్ భట్ అందరూ రవి శంకర్ గారి  శిష్యులే. వీరి అన్నగారైన శశి మోహన్ భట్ గారు,వీరి అక్క మంజుశ్రీ మెహతా కూడా ప్రముఖ సంగీత విద్వాంసులే, వీరి తమ్ముడు కృష్ణ మోహన్ భట్ వయొలిన్ విద్వాంసులు.
చిన్నతనం నుంచీ కూడా వీరికి ఎప్పుడూ కొత్తగా ఏదో ఒక ప్రయోగం చెయ్యడం అలవాటు. చిన్నతనం నుంచీ గాత్రం యొక్క పరిపూర్ణ, రాగ,హావ భావలను ఆవిష్కరింపచేసే ఒక కొత్త వాయిద్యాన్ని కనిపెట్తాలని కోరికగా ఉండేదట.అంటే ఆ వాయిద్యం వాయిస్తూ ఉంటే పాడుతున్నారేమో అన్న అనుభవం రావలన్నది ఆయన అభిలాష. అదే సమయంలో జరిగిన ఓసంఘటన ఆయన జీవితాన్నే మార్చివేసింది.తండ్రిగారి వద్ద ఒక జెర్మన్ మహిళ సంగీతం నేర్చుకుంటూ ఉండేదట. ఆమె ఓసారి గిటార్ ను తీసుకుని రాగా ఆ గిటార్ యొక్క ధ్వనికి భట్ గారు చాలా ఆకర్షితులయ్యారట.
15 సంవత్సరాల ఆ యువకుడికి అసలే ఏదో ఒక కొత్త ప్రయోగం చెయ్యడం అలవాటు.ఎలాగైనా దానిపై శాస్త్రీయ సంగీతం వాయించాలి అనిపించిందట.
కానీ దాని కోసం ఈ గిటార్ కి ఎన్నో మార్పులు చెయ్యవలిసిన అవసరం ఉందని గ్రహించి ఇక అప్పటినుంచీ. శాస్రీయ సంగీతాన్ని వాయించి రంజింపచేసేందుకు వీలుగా మార్పులు మొదలు పెట్టారు,1966 నుంచీ  ఒక నాలుగు సంవత్సరాలు ఎంతో ఓపికగా ఆ గిటార్ పై ఎన్నో మార్పులూ చేర్పులూ చేస్తూ  వచ్చారు.శాస్త్రీయ సంగీతం యొక్క ముఖ్య అంశం గమకం. గమకంతోనే రాగానికి జీవం,పాటకి ప్రత్యేక భావం వస్తాయి.సాధారణంగా ఏ తంత్రీ వాయిద్యంలో(తీగల ద్వార ధ్వనిని ప్రశరింపచేసే వాయిద్యం)  అయినా ధ్వనిని నిలబెట్ట గలిగే అవకాశం ఉండదు కానీ అలాధ్వనిని,గమకాన్నీ నిలపగలిగేలా కూడా కొన్ని ప్రత్యేక తీగలు అమర్చిమోహన వీణకు  నిజంగానే సమ్మోహన పరచగలిగే ప్రత్యేక లక్షణంతో రూపుదిద్దారు.
సాధారణంగా  గిటార్ కి 6 తీగలు ఉంటాయి. కానీ తాను కోరుకున్నట్లుగా శాస్త్రీయ సంగీతంలో ఉండే ఆ రాగ,భావ మాధుర్యం పలికించేలా 20 తీగలను అమర్చి ,వాటికోసం సాధారణ గిటార్ లా కాక పెద్ద ఫింగెర్బోర్డ్ ను,తేలికపాటి చెక్కతో తయారుచేసి, వీణలాగే ఎడమవైపు ఒక చిన్న కడవని కూడా అమర్చి 1970వ సంవత్సరానికి మోహన వీణకి ప్రాణం పోశారు. "కృషితో నాస్తి దుర్భిక్షం" అంటే ఇదేమరి.
 ఈ ప్రయత్నంలో అందరికంటే తనకి ఎక్కువగా సహకరించిందని తన తల్లిగారే అని వారు చెప్తారు. ఆమే నా దైవం,నా ప్రేరణా అన్నీ అంటారు.నా మనో సంకల్పానికి బలాన్ని ఇచ్చి ప్రోత్సహించింది మా అమ్మే అంటారు.నాకు ఆవిడ ఎప్పుడూ ఏం చెప్పేదంటే నువ్వు ముందు మంచి హృదయం కలిగిన  మనిషివి అవ్వాలి ఆ తరువాతే నువ్వేమైనా అవ్వు అనేది. చిన్నప్పటినుంచీ సంగీతమే కాక అన్ని విషయాలకి మా అమ్మే నాగురువు.నేను నా సంగీత జ్ఞానానినే  కాక అన్ని విషయాలనూ ఆమె వద్దనుంచే నేర్చుకున్నా. సంగీతంతో మమేకమైన నేను అందరి పిల్లలా పాఠశాలకి, కళాశాలకి కూడా వెళ్లలేదు. నా సమయం అంతా సంగీతానికే ఎప్పుడూ ఉపయోగించేవాడిని. అలా వెళ్ళలేక పోయానని నేను ఎప్పుడూ భాధ కూడా పడలేదు నేను చెయ్యాలనుకున్నది సాధించాననే తృప్తి నాకు ఉన్నది.
మోహన వీణపై తన మొట్టమొదటి కచేరి 1970లో 18 సంవత్సరాల లేత వయసులో అప్పటి బోంబాయి నగరంలో ఇచ్చారట.మొదటి కచేరీలోనే చాలామంది ప్రముఖుల ప్రశంసలు  లభించడం ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది అంటారాయన.ఆరోజు ఆ కచేరీకి ప్రముఖ హెచ్.ఎం.వి. కేసెట్ ల సంస్థ అధికారి కూడా వచ్చారట,వారు కూడా ఈ కచేరి విని ముగ్ధ మనోహరులై "రేపే మాసంస్థ నీతో మొదటి కేసెట్ విడుదల చేస్తుంది,రేపు రికార్డింగ్ కి వచ్చేయండి" అన్నారట.
 ఇక ఆ రోజు మొదలైన ఆ మహాప్రస్థానం అలా కొనసాగుతూనే ఉంది.ఆ తరువాత ఆయన ఎన్నో ప్రముఖ ఆల్బంస్ విడుదల చేసారు వాటిలో కొన్ని "సాంగ్స్ ఆఫ్ నేచర్" ,"గోల్డెన్ ట్రయొ", "గీత్ గోవిందం","మ్యూసిక్ ఫర్  రెలాక్సేషన్" ,"రొమేంటిక్ రాగా",ఇలా ఎన్నో ఎన్నెనో.. ఈ ఆల్బంస్ లో కొన్ని ప్రముఖులతో జుగల్ బందీలు కూడా ఉన్నాయి.
1996లో ఆయన విడుదల చేసిన "మేఘ్ దూత్" అనే ఆల్బంలో ప్రముఖ వర్ధమాన గాయకులు హరిహరన్ గారు,గాయిని కవితా కృష్ణమూర్తి గారు సంస్కృత శ్లోకాలకు తమ  గాత్రాన్ని  అందించారు కూడా.
 తన సంగీత ప్రయాణంలో విశ్వమోహన్ గారు ఎంతోమంది పాశ్చాత్యులతో కూడా పనిచేశారు. చైనా కి చెందిన జై బింగ్ చాంగ్ తో జుగల్ బందీ చేసి, చైనా దేశస్తునితో జుగల్బందీ జరిపిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్రకి ఎక్కారు.అలాగే అమెరికా దేశానికి చెందిన ప్రముఖ  గిటారిస్ట్ జెర్రీ డగ్లెస్ తో,అరబ్ దేశానికి చెందిన సిమొన్ షాహీన్ గార్లతో కూడా పనిచేసిన ఘనత వీరిదే.
 అమెరికా దేశానికి చెందిన ప్రముఖ గిటారిస్ట్  రికూడెర్ గారితో వీరు చేసిన "మీటింగ్ బై థ రివెర్" ఆల్బం కి ప్రఖ్యాత గ్రామీ అవార్డ్  కూడా లభించింది. వీరి గురువుగారైన రవి శంకర్ గారి తరువాత మళ్ళీ గ్రామీ అవార్డ్ గెలుచుకున్న రెండవ భారతీయులు వీరు. ఈ ఆల్బం ను కేలిఫోర్నియా లో ఒక చర్చిలో రికార్డ్ చేశారట.ఏ కంప్యూటర్ కానీ ఏ సాంకేతిక యంత్రం లేకుండా లైవ్ రికార్డింగ్ లో ఈ ఆల్బం ను వీరిరువురూ కలిసి స్వర పరిచారు.
  ఇక వీరి అవార్డుల విషయానికొస్తే
1970లో సుర్ మణి  అవార్డ్
1981లో చండీగఢ్ ప్రభుత్వం చే తాన్ శ్రీ శింగార్
1983లో స్వర్ శిరోమణి
1994లో గ్రామీ అవార్డ్
1995లో తంత్రీ సామ్రాట్ అవార్డ్
1999లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్
2002లో పద్మశ్రీ
2002లో ఆస్టిన్ నగరం టెక్సాస్ వారిచే వాద్య రత్నాకర్ అవార్డ్ ఇవన్నీ వారికి లభించిన పురస్కారలలో కొన్ని మాత్రమే
సంగీతమునందు  ఎంతో ప్రతిభ, ఆప్రతిభకి తగ్గట్లు ఎన్నో పురస్కారాలు,సత్కారాలు అందుకున్న ఇప్పటికీ నేను నిత్య విద్యార్ధినే అంటారు.సంగీతం మానవజాతి మేలుకై భగవంతుడు సృష్టించిన ఒక అందమైన భాష అంటారు.ఈ భాషతో అతి తేలికగా భగవంతునితో సంభాషించ వచ్చు అంటారాయన.ఈ మోహన వీణను సృష్టించడం ఇదంతా భగవంతుడు చేయించినదే తప్ప నా గొప్పతనమేదీ లేదనే గొప్ప వినమ్రశీలి శ్రీ విశ్వమోహన్ భట్.
  నేను కచేరిలో కూర్చునే ప్రతీసారీ ఆ సరస్వతీమాతని ప్రార్ధిస్తున్నట్లుగానే భావిస్తాను.అప్పుడు జ్ఞానానికి రూపమైన ఆమె  నేను శ్రోతలకు అమంచి సంగీతం అందిచేలా నన్ను ఆశీర్వదిస్తుంది.
   నేను సంగీత కచేరిలో అన్నివర్గాల శ్రోతలను ఆనందింపచేయడానికి ప్రయత్నిస్తానంటారు ఆయన.ఎందుకంటే కొందరు శ్రోతలు సంగీతంలో ప్రవేశం ఉన్నవారుంటారు,కానీ కొందరికి సంగీతంలో ఏ ప్రవేశంలేక కేవలం శ్రవణానందానికే వచ్చిన వారూ ఉంటారు.వారి మనసులను కూడా రంజింపచెయ్యాలన్నదే నా ఉద్దేశ్యం.ఇలా అందరికీ ఆనందం కలిగించినప్పుడే కచేరీ పరిపూర్ణమైనదిగా భావిస్తాను అంటారాయన ఎంతో వినయంతో.
 ఈతరం యువతకు ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే సంగీతం దైవదత్తమైనది ఏకొందరిలోనో భగవంతుడు ఆ దైవాంశను పెడతాడు. కాబట్టి అఖండ సాధన సంగీతానికి చాలా అవసరం. తన కుమారులైన సలీల్,సౌరవ్ ఇద్దరూ సంగీతజ్ఞులే.
సలీల్ తండ్రిగారితో కలిసి ఎన్నో జుగల్బందీలు కూడా చేశాడు.కానీ తన పిల్లలను సంగీతజ్ఞులు కావాలని ఎప్పుడూ వారిపై ఒత్తిడి పెట్టలేదట.వారంత వారిగా నేర్చుకుంటానన్నప్పుడు మాత్రం గురువుగా విద్యని భోదించి మెలకువలు చెప్పినారట.
భట్ గారు మోహన వీణతో పాటు "విశ్వవీణ" అనే ఇంకో వీణ కూడా  సృష్టించారు కానీ మోహన వీణకే ఎక్కువ పేరు వచ్చింది. వీరి అబ్బాయి సలిల్ మోహన వీణకే ఇంకొన్ని మార్పులు చేసి దానికి "సాత్విక వీణ" అనిపేరు కూడా పెట్టాడు.సలీల్ తండ్రికి తగ్గ తనయుడు  అని నిశ్శందేహం గా చెప్పచ్చు.
ఒక కళాకారుడు  శ్రోతలను మెప్పించే,ముందు తనని తాను మెప్పించుకోవాలని 64వ సంవత్సరకాలంలో కూడా నమ్మే ఈయన తన నిరంతర మోహనవీణా సమ్మోహనాస్తాలతో మనలను అలా ఓలలాడించాలనీ అందుకు భగవంతుడు ఈయనకు ఆరోగ్యంతో కూడిన ఆయువును ప్రసాదించాలి.
************
వీరి మోహనవీణ ను క్రింది లింక్ లో వినవచ్చు.... చూడవచ్చు...

No comments:

Post a Comment

Pages