ప్రాణం ఖరీదు - అచ్చంగా తెలుగు

ప్రాణం ఖరీదు

Share This

ప్రాణం ఖరీదు 

పూర్ణిమ సుధ 


కిరణ్ కోసం ఎదురు చూసీ చూసీ... ఇక రాడని నిర్థారించుకుని, అన్యమస్కంగా అన్నం తినడానికి కూర్చుంది స్వప్న. ఇప్పటికీ తనకర్థం కాదు... ఒక్క మెసేజ్ పెట్టొచ్చు కదా ? రావట్లేదని ? ఏంటంత క్షణం తీరికలేని పని. బాధ్యత అనేది, ఆపాదిస్తే రాదు, తమంత తాము స్వీకరించాలి... అనుకుంటూ, తిన్నాననిపించి, పక్కమీదకి ఒదుగుతూనే గతంలోకి జారుకుంది. ఒక్కసారిగా వర్షించే మేఘాలయ్యాయి తన కళ్ళు.
సమీర్, తన కాలేజ్ మేట్. ఎన్ని క్షణాలు దొర్లిపోయేవో తనెదురుగా ఉంటే... లెక్కేలేదు. చదువులో, అందంలో, తెలివితేటల్లో... ఇలా ఒకటేమిటి ? టూ ఎక్సెల్ంట్స్ మీట్ ఫర్ పర్ఫెక్షన్ అన్నట్టుండేవారు... నాన్న ఎంతో శాంతంగా ఉండి అర్థం చేసుకునే వ్యక్తిగానే తెలుసు తనకి. మొట్టమొదటి సారి సమీర్ విషయంలో ఉగ్ర రూపం దాల్చడం చూసి, తల్లిదండ్రులని నొప్పించడం ఇష్టం లేక, తలొగ్గింది. ప్రేమ పెళ్ళిళ్ళు పడని ప్రసాద్ గారు, డాక్టర్ కిరణ్ కి ఇచ్చి, వైభవంగా పెళ్ళి చేసి, తమ చట్రంలో, ఇంత గొప్ప సంబంధం చేసుకున్నవాళ్ళెవ్వరూ లేరని నిరూపించారు. గొప్ప స్థితిమంతులు కాకపోయినా, డాక్టర్ అల్లుడుగా వచ్చినందుకు అంతా కుళ్ళుకున్నారు. కిరణ్ స్వతహాగా మితభాషి. పెళ్ళిచూపుల్లో కూడా పెద్దగా మాట్లాడలేదు. స్వప్నే తెగ ప్రశ్నలేసి ఊపిరి సలపనివ్వలేదు. అన్నిటికీ చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. ఇంత ఓర్పుంటుందా ? అనుకుంటూ, పెళ్ళయ్యేవరుకేలే ఇవన్నీ అని ఉడుక్కుంది. తను మాత్రం ఒక్కటే చెప్పాడు. నా వృత్తిని నేను గౌరవిస్తాను. నువ్వూ అర్థం చేసుకుని గౌరవిస్తే సంతోషిస్తాను అని లేచి వచ్చేసాడు. విఫల ప్రేమా ? పెళ్ళంటే ఆసక్తి లేదా ? మనిషి తత్వమే ఇంతా ? అనేది అర్థం కాక, సతమతమైంది. నాన్నా, తను చాలా బోరింగ్ క్యారెక్టర్ అంటున్నా వినకుండా, సమీర్ ధ్యాస నించీ మళ్ళాలంటే, ఇదే ఉత్తమం అనిపించి, పెళ్ళి చేసేసారు... జైలు పక్షిలాగా, పి.జి చేసి కూడా ఇంట్లో కాలక్షేపం చేస్తోంది.
ఎప్పుడో రాత్రి తొమ్మిది పదింటికి వచ్చిన కిరణ్, ఆ రోజు ఒత్తిడిని జయించడానికి, సరదాగా మాట్లాడదామని ప్రయత్నిస్తే, 'ఇప్పటికి గుర్తొచ్చానా ? నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, మీరడిగినప్పుడు నేను మాట్లాడాలా ? అయినా, మధ్యాన్నం ఒక మెసేజ్ పెట్టాను...' సమాధానం కూడా లేదు అంటూ నిష్ఠూరాలు ఆడసాగింది.
'నీకు తెల్సు కదా స్వప్నా ? ఆపరేషన్ థియేటర్లోకి మొబైల్ తీసుకెళ్ళకూడదని' అంటే, 'ఓహో, పొద్దుట్నించీ రాత్రి దాకా, అక్కడే పనా ? ఏం ? నర్సులంత బావున్నారా ?' అని విసిగించడంతో... నవ్వేసి, రఫీని, కిషోర్ ని ఆశ్రయిస్తుంటాడు.
స్వప్నకి పెద్ద పజిల్ కిరణ్ నవ్వు. కోపమో, విసుగో, చిరాకో ఏదో ఒకటి లేకుండా, ఆ నవ్వుతో ఇంకా చిరాకు తెప్పిస్తున్నాడు. అందులో లక్ష భావాలు. 'నీకెలా చెప్పినా అర్థం కాదు, నీ అనుమానపు బుధ్ధి పోనిచ్చుకున్నావ్ కాదు, ఇలా... పట్టించుకోకుండా ఉంటే, మాట్లాడ్తారులే అనేది మగవాళ్ళ స్ట్రాటజీ అనుకుంటా ?'
కానీ సమీర్ అలా ఉండేవాడు కాదే ? ఎవ్వరికి కోపమొచ్చినా, తనే మోకాళ్ళ మీద మోకరిల్లి మరీ సారీ చెప్పేవాడు. ప్రతీ సారీకీ ఒక ఐస్ క్రీం అని కండీషన్ పెడితే, తన పుణ్యమాని క్రీంస్టోన్ వాడు, ఆంధ్రా బ్యాంక్ వారి సౌజన్యంతో లాగా, స్వప్న సౌజన్యంతో అని ఒక బోర్డ్ పెట్టుకోవచ్చు అని నవ్వుకుని, ఇహలోకంలోకొచ్చి, నిట్టూర్చి, అటు తిరిగి పడుకుంది.
'స్వప్నా' అని పిలిచిన కిరణ్ కి మౌనంతో నిద్ర పోతున్న సంకేతం పంపింది. ఈ లోపు మొబైల్ మోగింది.
'అవునా ? ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ స్టార్ట్ చెయ్యండి. నేనిప్పుడే బయలుదేరుతున్నా...' అని బయలుదేరాడు.
'ఇంత రాత్రెక్కడికి ?' అంది.
క్రిటికల్ కేస్, వెళ్ళాలి అని తన మాట కోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోయాడు. ఛి... వాడిమీదున్న ప్రేమలో సగం కూడా నామీద లేదు కదా ? అదే సమీర్ అయితే, వాళ్ళమ్మ ఎన్ని సార్లు ఫోన్ చేసినా, కదిలేవాడే కాదు అనుకుంటూ ఒక్కతే నిద్రలోకి జారుకుంది.
మర్నాడు రాత్రి, ఇలా కాదని, మొబైల్ ని తనకి తెలీకుండా సైలెంట్ లో పెట్టింది. చాలా రోజుల తరువాత, ప్రేమగా తనే మాట్లాడింది. కిరణ్ లోని సరికొత్త కోణాన్ని చూసింది. ఇంత సరదాగా కూడా మాట్లాడ్తాడా ? అని విస్తుపోయింది. తనకిష్టమైన పాత హిందీ పాటల్ని పాడాడు. చక్కటి గొంతు. ఓ షామ్ కుఛ్ అజీబ్ థీ అంటూ అచ్చూ రాజేష్ ఖన్నా లా చేతులు వెనక్కి ఆనించి, కళ్ళు మూసుకుని తన్మయత్వంగా పాడుతున్న కిరణ్, తెల్లటి లాల్చీ పైజామాలో మెరిసిపోతున్నాడు.
అలా ఆ రాత్రి చాలా మధురంగా గడిచాక, మర్నాడు పొద్దున్నే కిరణ్ మొబైల్ సైలెంట్ తియ్యడం మర్చిపోయిన స్వప్నకి గట్టిగా గావు కేక వినబడింది... స్వప్నా అంటూ..! ఏమైందా అని గార్డెన్ లోంచి పరుగెత్తుకొచ్చింది. స్వప్నా..! 'నువ్వు రాత్రి మొబైల్ సైలెంట్ లో పెట్టావా ?' అన్నాడు.
'అవును... మనకంటూ ఒక లైఫ్ ఉండాలని. లేకపోతే ఏ ఫోనో వచ్చి, మళ్ళీ నువ్వెళ్ళిపోతావ్...' అందుకే అంది.
'దాని పర్యవసానం తెలుసా ? ఒక 69 ఏళ్ళ ప్రాణం', అని కన్నీటి పర్యంతం అయ్యాడు.
'దానికే ఇంత రాధ్ధాంతమా ? 69 ఏళ్ళు... మహా అంటే, ఇంకో పది పదిహేనేళ్ళు అంతేగా ? మన జీవితంలో ఇలాంటి ఒక జ్ఞాపకం మళ్ళీ వస్తుందా ?' అని స్వప్న వాదించింది.
మొదటిసారి, తన మొహంలో ఒక ఏహ్యభావం కనబడింది. స్వప్న అహం దెబ్బ తిన్నది. తను వెళ్ళిపోగానే రకరకాలుగా మర్చిపోదామని వ్యాపకాల్లో మునిగింది. అలా ఊసుపోక, నెట్ సర్ఫింగ్ చేస్తుంటే, ఫేస్ బుక్ లో సమీర్ మళ్ళీ దగ్గరయ్యాడు. ఎక్కడో లక్నో లో జాబ్ చేస్తున్నవాడు, తనకోసం, ఉద్యోగం మానేసి, వైజాగ్ లో ఒక చిన్న ఉద్యోగం లో చేరాడు. కిరణ్ ఎప్పుడొస్తాడో తెలీదు. ఊసుపోని స్వప్నకి మళ్ళీ పాత రోజులు రుచి చూడాలనిపించింది. ఇద్దరూ, బీచ్ అనీ మాల్ అనీ తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తున్నారు. అర్థరాత్రో అపరాత్రో వచ్చినా ఈ మధ్య స్వప్న ఎదురుచూడట్లేదు... తరచూ మనస్ఫర్థలు, వాగ్వివాదాలతో జీవితం గడిచిపోతోంది. కానీ కిరణ్ మొహం పై చెరగని చిరునవ్వు ఇంకా చిరాకు తెప్పిస్తోంది స్వప్నకి.
ఎదుటి మనిషి నిర్లక్ష్యం ఇంకా నిలువునా దహిస్తుంది అని నమ్మే స్వప్న ఒకరోజు ఆసుపత్రి నించీ వస్తూనే వాదనేసుకుంది. 'ఎప్పట్లాగే, ఎమర్జెన్సీ కేస్, అందుకే లేట్' అని లోపలికి వెళ్ళబోయాడు కిరణ్.
'నాకు మాత్రం అస్సలు ప్రాముఖ్యం ఉండదు, అందరికీ టైం ఇస్తావు, నాకు తప్ప... 'అంటూ ఏడుపు మొదలు పెట్టింది.
కిరణ్ అన్నాడు "చూడు స్వప్నా... నీకు ముందే చెప్పాను, నా వృత్తి అంటే నాకు గౌరవం. నువ్వు కూడా అర్థం చేసుకుని గౌరవిస్తే సంతోషిస్తాను అని. ఒకరి ప్రాణం కన్నా నాకు ముఖ్యమైనదేదీ లేదు. ఎక్కడో లక్నోలో ఇంజనీరు, రీసెంట్ గా వైజాగ్ కి వచ్చాట్ట. ఆఫీసులో ఇంకా పరిచయాలు కూడా సరిగ్గా లేవు. ఆక్సిడెంట్ అయింది కానీ ఏమీ చెప్పే స్థితిలో లేడు, కనీసం ఐ.డి. కార్డ్ కూడా మారలేదు. డీటైయిల్స్ తెలిస్తేనే కానీ, వాళ్ళ వాళ్ళు సంతకం చేస్తేనే గానీ సర్జరీ చెయ్యలేం. ఇక తప్పక, నేనే సంతకం పెట్టి, సర్జరీ చేసొచ్చాను..." అని ఇంకా ఏదో చెప్తున్నా అవేమీ వినబడట్లేదు స్వప్నకి.
"ఇంతకీ ఇప్పుడెలా ఉన్నారు ? అని మాత్రం గొంతు పెగుల్చుకుని అడిగింది. ఇంకో 24 గంటలు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేం. అన్నట్టు, నీకెప్పుడూ అలవాటుగా, ఫోన్ ని సైలెంట్ లో పెట్టడం. ఇప్పుడు మాత్రం అలా పెట్టకు. క్రితం సారి ఇలాగే క్రిటికల్ కేస్ చాలా ప్రమాదకరంగా మారింది... సారీ నేనిప్పుడు మాట్లాడలేను. అన్నట్టు, ఈ వీకెండ్ మనిద్దరికీ సింగపూర్ కి హాలిడే బుక్ చేసాను. హ్యాపీ యేనా ?" అంటూ అటు తిరిగి పడుకున్నాడు.
మొదటిసారి, తన వృత్తి మీద గౌరవం పెరిగింది. కానీ ఎందుకో తెలీదు సమీర్ మీద ఉన్నది కేవలం ఆకర్షణ అని అర్థమయింది, ఎందుకంటే, కిరణ్ మీద ప్రేమతో కూడిన గౌరవం మొదటిసారి కలిగింది. పెళ్ళైన ఈ ఏడు నెలల్లో, మొదటిసారి తనంతట తాను, తన మీద చెయ్యేసి పడుకుంది, ప్రశాంతంగా... అప్పుడర్థమయింది, సమీర్ ఇంప్రెస్ చెయ్యడానికి ట్రై చేసాడు. అది ఆకర్షణ. కిరణ్ బాధ్యత నిర్వర్తిస్తున్నాడు... ఇది కన్సర్న్ అని.
**************

No comments:

Post a Comment

Pages