రెక్కలగుర్రం రాకుమారిడి కధ
- యనమండ్ర శ్రీనివాస్
పెసూనాంబ గొణిగిందంటే ఏదో కావాలన్న మాటేగా. అసలు పెసూనాంబే కాదు, ఈ ఆడాళ్ళంతా ఇంతే, మనకు ఏదైనా కావాలని అడిగితే అరుస్తారా, అదే వాళ్ళకి ఏదైనా కావాలంటే మటుకు భలే గొణుగుతారు. మనమేమో 100% లవ్ సినిమాలొ చెప్పినట్టు ఇన్ఫాట్చ్యుయేషన్ లో వుండి అన్నీ చేసేస్తాంట. బాబాయి చెప్పాడు.
“ఏంటీ పెసూనాంబా” అడిగాను నేను. అదేంటో గాని వాళ్ళని గొణిగామని అంటాం కానీ, ఆడాళ్ళూ అలా అడిగితే మనము కూడా అల్లానే మాట్లాడేస్తాం. ఇది కూడా ఇన్వాట్చ్యుయేషనేనా అని బాబాయిని అడగాలి ఈసారి.
“బుడుగూ, ఓ కధ చెప్పవా?” గోముగా అడిగింది పెసూనాంబ. “హాయిగా వింటూ నిద్రపోతా” అంది మళ్ళా తనే.
ఈ ఆడపిల్లల డాడీలని అందరినీ నించోపెట్టి షూట్ చేసేయ్యాలి. వాళ్ళు చిన్నప్పుడు లైన్ వేస్తే కాలేజీ అమ్మాయిలు పడలేదని వాళ్ళ ప్రేమంతా పెళ్లయ్యాక వాళ్ళ పాప మీద చూపించేస్తారు. ఇక గారాబం గాఠిగా చేసేస్తారు. కధలేంటి, కబుర్లేంటీ, బొమ్మలేంటి ఇక అన్నీ ఆ పాపతోనే. హాయిగా బాబు అయితే బయటికి వెళ్ళి ఆడుకుంటాడు. అదే పాప అయితే అస్సలు ఇల్లు కదలనివ్వరుగా. అందుకే గారాబాలు, గొణుగుళ్ళు. బాబాయి సీతతో పడుతున్నతిప్పలు చూస్తుంటే అర్దమయిపోతోందీ మధ్య నాకు.
“ఏ కధ చెప్పనూ” అని అడిగాను.
“ఏ కధైనా సరే” అంది పెసూనాంబ.
సరే అయితే మొన్న పార్కుకి నన్ను తీసుకెళ్ళి నన్ను గుర్రం ఎక్కింఛి బాబాయి, సీత పల్లీలు తింటూ వున్నారుగా. అప్పుడు ఆ గుర్రం అబ్బాయిని పోలీసు అబ్బాయి పట్టుకుని డబ్బులడిగితే ఇవ్వలేదుగా. అందుకని ఆ గుర్రం అబ్బాయిని నన్ను దింపేయమని చెప్పాడుగా ఆ పోలీసు. అలా దిగిపోయిన నేను బాబాయి, సీత కబుర్లు చెప్తున్న బెంచీ పక్కన గడ్డిలో పడుకుని బాబాయి చెప్పిన కధ విన్నాగా. ఆ కధ చెప్తుంటే సీత తెగ మెలికలు తిరిగిపోయిందిగా. ఇగో ఆ కధే పెసూనాంబకి చెప్పేయ్యాల్నని డిసైడ్ అయిపోయాను. కాకపోతే ఒకసారి డిసైడ్ అయిపోతే నేను గుడ్ బాయ్ ని కదా. పెసూనాంబ మాట తప్ప ఇంకెవరి మాటా వినను.
ఇక కధలోకి వచ్చేద్దాంః
“అనగనగనగా ఒకూళ్ళొ ఒక రాకుమారి ఉందిట” (అనగనగ అంటారు కానీ ఎవరు అనగ అనగానో ఎవ్వరూ చెప్పరు. పాయింటు నోటు చేసుకుని బాబాయిని అడగాలి ఈ సారి)
“ఆ రాకుమారికి చిన్నప్పటీ నుండీ రెక్కలగుర్రం రాకుమారిడి కధ చెప్తూ వుండేవాడట వాళ్ల డాడీ రాజుగారు. రెక్కల గుర్రం ఎక్కి తెల్లటి డ్రెస్సు వేస్కుని గాల్లో కత్తి తిప్పుకుంటూ రాకుమారి దగ్గరకొస్తాడట రాకుమారుడుగాడు. (ఈ రాకుమారుడుగాడికి ఇంట్లో ఏరియల్ ఫాక్టరీ వుందేమో గుర్రం మీద ఎగురుతూ తెల్లబట్టలు దేనికి. దుమ్ము పట్టదూ).
ఆ రాకుమారుడుగాడికి ఫైటింగ్ ఒకటే కాదు. వీణ వాయించటం వొచ్చు. డాన్స్ చెయ్యటం వొచ్చు. వంట చెయ్యటం వచ్చు. కన్ను కొట్టడం వచ్చు. ఇంకా ఇంకా చాలానే వచ్చుట. గూగుల్ మింగేసుంటాడు చిన్నప్పుడు.
ఆ రాకుమారుడుగాడిని కూడా ఆ రాకుమారి రోజూ కధలు అడిగి చెప్పిచ్చుకునేదట. తనని కలవగానే ఒక కధ. కబుర్లు చెప్పేటప్పుడు ఒక కధ. ఐస్ క్రీము తినేటప్పుడు ఒక కధ. కుంటుళ్ళు, గచ్చకాయలు ఆడేటప్పుడు ఒక కధ. తోటలో మామిడి కాయలు కొట్టి గెంతేటప్పుడు ఒక కధ. సముద్రం దగ్గర ఇసుక గుళ్ళు కట్టేటప్పుడు ఒక కధ. ఆ రాత్రి చందమామ కనపడితే ఒక కధ. కనపడకపోతే ఒక కధ. మంచం మీద పడుకున్నప్పుడు ఒక కధ. లేచాక ఒక కధ. స్నానం చేసేటప్పుడు ఒక కధ. డ్రస్సు వేసుకునేటప్పుడు ఒక కధ. పప్పన్నం తినేటప్పుడు ఒక కధ. స్కూలుకి వెళ్ళేటప్పుడు ఒక కధ. లాంగ్ బెల్లులో ఒక కధ. లంచ్ బెల్లులో ఒక కధ.
ఇలా రాకుమారుడుగాడిని కధలు కధలు అని బాగా ఏడిపించేదిట రాకుమారి. కానీ రాకుమారుడుగాడు నాలాగా హీరో కదా. అందుకని ఎన్ని కధలైనా ఓపిగ్గా చెప్పేవాడట. పెతీ కధా చాలా చక్కగా సినిమా చూసినంత వివరంగా చెప్పేసరికి ఆ రాకుమారి రాకుమారుడుగాడితో ఎప్పుడూ నీ దగ్గరే వుంటాను అందిట. సరే అని ఇద్దరూ అలా కధలు కధలు చెప్పుకుంటూ వున్నారట.
ఓ రోజు రాకుమారి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిందిట. అప్పుడు రాకుమారుడుగాడు రాకుమారి వాళ్ళ నాన్న దగ్గరకి వెళ్ళి “ఓసారి నీతో మాట్లాడాలోయి రాజువారు” అన్నాడట.
ఆ రాజువారు సరే అని “ఏం మాట్లాడాలో చెప్పు” అన్నారట.
అప్పుడు ఆ రాకుమారుడుగాడు, “నీకో సలహా ఇద్దామని ఒచ్చాను. దాని ముందు నాకో సంగతి చెప్పు రాజువారు. చిన్నప్పుడు రాకుమారికి కధలు ఎలా చెప్పేవాడివి?” అని అడిగాడు.
రాజువారు “చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి కొనిపెట్టేవాడిని. నాకు టైము వుంటే నేను చదివి చెప్పేవాడిని. లేకపోతే రాకుమారే చదివేసేది. ఎందుకు” అని రాకుమారుడుగాడిని అడిగాడుట.
రాకుమారుడుగాడు అన్నాడట “ఇదిగో రాజువారు. మీ ఆడపిల్ల డాడీలందరూ ఇదే తప్పు చేస్తున్నారు. మీరేమో చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు మాత్రమే కొనిపెడతారు మీ పాపలకి. కానీ మా అబ్బాయిలు వాళ్ళ డాడీలకు తెలీకుండా, స్వాతి, నవ్య, ఆంధ్రభూమి పుస్తకాలు కొనేసుకుని కధలు చదివేస్తామా. అందుకని మాకు అమ్మాయిల కంటే ఎక్కువ కధలు తెలిసిపోతాయి. మాతో ఫ్రెండ్ షిప్ చేసే అమ్మాయిలకి ఆ కధలు చెప్తామా ఇంక అంతే. మాకు అతుక్కుపోయి కధలు చెప్పూ. కధలు చెప్పూ అని చంపుకుతింటారు. అందుకే నువ్వు ఈ రాజ్యంలో ఒక రూల్ పాస్ చెయ్యి. ఆడపిల్లలకి వాళ్ళ డాడీలు చందమామ, బాలమిత్ర ఒక్కటే కాదు, స్వాతి, నవ్య కూడా కొనాలని. ఆ కధలు కూడ వాళ్ళ అమ్మాయిలకి వాళ్ళనే చదువుకోమని చెప్పాలని. అర్ధమయిందా. లేకపోతే పొద్దున్నా, సాయంత్రం, రాత్రీ, పగలూ ఈ ఆడపిల్లలకి కధలు చెప్పలేక మాకు తల ప్రాణం తోకకొస్తోంది.” అని ఘబ ఘబా చెప్పేశాడట.
చెప్పేసి, రాజువారు ఏంచెప్తున్నారో వినకుండా ఇంటికెళ్ళి పోయి మంచం ఎక్కేసి హాయిగా బబ్బున్నాడట. చాలా రోజులయ్యిందిగా అలా వాగటం లేకుండా పడుకుని.
ఇదీ కధట.
సీత అయితే పడీ పడీ నవ్వింది, బాబాయి ఈ కధ చెప్తుంటే. పెసూనాంబని చూద్దును కదా. హాయిగా నిద్దురోతోంది. మీకేమైనా అర్ధమయిందా ఈ కధేమిటో. అర్ధం కాకపోతే నేనుకూడా బాబాయి అంత పెద్దయ్యాక అర్ధం చేసుకుని మీకు మళ్ళా చెప్తానే. నాకు కూడ రాకుమారిడిగాడిలాగా నిద్దురపోవాలని ఉంది. ఎవరికీ కధలు చెప్పకుండా.
మరి. ఉంటానే. బై.
No comments:
Post a Comment