సంసారము
- వారణాసి రామబ్రహ్మం
సంసారమంటే మనస్సంసారమే. మనకు కలిగిన అనుభవముల వలన జనించే తలపులు, వ్యక్తీకరణలు ఈ మానసిక సంసారములో భాగము. మన చిన్నతనంనుంచీ మనసు మాధ్యమమున జ్ఞానకర్మేంద్రియముల ద్వారా, బుద్ది, అహంకారము, చిత్తముల ద్వారా గ్రహించిన విషయములు, విషయానుభవములు మనలో ప్రపంచంగా, వాసనలుగా స్థిరపడతాయి. మన అహంభావ, అహంకార, మమకారములు, వ్యక్తి, వ్యక్తిత్వ భావనల సమాహారమే అహంకారము. బుద్ధి విచక్షణను కలిగిస్తుంది. తర్కిస్తుంది.
వాసనలు మన విషయానుభవములే. మనసు విషయాన్ని, విషయసమూహాన్నీ ప్రపంచంగా మారుస్తుంది, గ్రహిస్తుంది, చిత్తము విషయానుభవములను జ్ఞప్తిగా మార్చి మరల అనుభవములుగా దృష్టికి తెస్తుంది. ఈ అనుభవములు తలపులుగా మారి అనుగుణంగా వ్యక్తమౌతాయి. ఇదంతా మన మెళకువ, కల మానసిక దశలలో జరుగుతుంది. అప్పుడు మనము అంతర్ముఖ, బహిర్ముఖ దృష్టులను కలిగి ఉంటాము.
ఇలా మానసికంగా కలాపించడమే సంసారములో చిక్కుకోవడము. భార్యా\బిడ్డలను ఇతర ప్రాపంచిక బంధములను, ఆస్తిపాస్తులను, పేరు, ప్రతిష్టలను కలిగి ఉండడం మాత్రమే కాదు. అన్నీ వదలి పెట్టేశాను అనుకున్న సన్యాసి, స్వామి, అమ్మ, బాబా, సాధు, సంత్ లకు ఈ మానసిక హడావుడి అంతా ఉంటే వారు పైకెంత చెప్పినా సంసారంలో చిక్కుకున్నవారే. ఇందుకు ఉదాహరణగా భాగవతంలో జడభరతుని కధను చెబుతారు.
మహా భక్తుడైన జడభరతుడు జపం చేసుకుంటున్న సమయంలో ఒక ఆడలేడి పిల్లని కని మరణించింది. జాలితో, ఆ లేడిపిల్లను ఆశ్రమానికి తీసుకువెళ్లి పెంచి పెద్ద చేసి ఆ లేడి ధ్యానంలోనే కన్ను మూసిన జడభరతుడు మరు జన్మలో లేడిగా జన్మించాడు. గత జన్మలో పరమ భక్తుడవడంవలన గత జన్మ స్పృహతో భగవధ్యానంతో భగవంతుని సన్నిధికి చేరుకున్నాడు.
జడభరతుడు ఒకనాటి ఉదయం స్నానం చేయడానికి మహానదీ తీరానికి వెళ్లాడు. స్నాన సంధ్యాద్యనుష్ఠానాలు ముగించుకొని తిరిగి తన ఆశ్రమానికి చేరుకోవాలనుకుంటూండగా, ఆ నదీతీరానికే దాహం తీర్చుకోవడానికి వచ్చిన ఒకలేడి అతని కంటపడింది. అయితే అది నిండుగర్భంతో ఉంది.
ఇంతలో సర్వప్రాణి భయంకరమైన మృగం (సింహం) గర్జన వినిపించింది. దాహం తీర్చుకోడానికి నీటిలో దిగిన లేడి, అ అరుపువిని ఒడ్డుకు ఒక్కగంతు వేయబోగా - ఆ దూకుడుకు దాని గర్భంజారి నీటిలో పడింది.
కెరటాల మీద తేలియాడుతూ, ఉక్కిరి బిక్కిరౌతూన్నది...అప్పుడేపుట్టిన ఆ లేడిపిల్ల. దాన్ని చూడటంతోనే జడభరతునికి జాలి కలిగింది. రాజు తటాలున పరుగెత్తి దాన్ని చే్తుల్లోకి తీసుకొని సంరక్షించాడు. గర్భపాతము - దానికి తోడు పైకి దూకిన శ్రమకలిసి అ ఆ ఆడపిల్ల (తల్లి) మరణించింది.
జడభరతుడు తపస్వి గనుక, 'ఇక దీనికి తల్లి లేదే! దీన్ని పెంచేబాధ్యత నాదికాక వేరెవ్వరిదౌతుంది?' అనుకుంటూ దాన్ని తెచ్చి పెంచసాగాడు. ఆ లేడిపిల్ల కూడా క్రమంగా పెరగసాగింది. అది ఆశ్రమప్రాంతమంతటా కలయదిరుగుతూ, దాపున ఉన్న పచ్చిక బయళ్లలో సంచరిస్తూండేది. భరతునికీ ఆ లేడికూన మీద మమకారం నానాటికీ హెచ్చయింది. దాని ఆలనా - పాలనా తానే స్వయంగా చూడటం చేత, అదిలేకపోతే కాలం గడపలేని స్థితికొచ్చాడు.
ఒక రోజు....
ఆ జింక పిల్ల ఇంకా సూర్యోదయం కాకముందే వనవిహారానికి బయల్దేరి, ఆశ్రమప్రాంత పరిధిని కూడా దాటి కీకారణ్యంలోకి అడుగుపెట్టింది. దారి తప్పిపోయి, ఎంతకూ ఆ జింకకూన తిరిగి రాకపోయేసరికి, దానిమీదనే ప్రాణాలు నిలుపుకున్న భరత మునీశ్వరునికి ఆదుర్దా అధికమైంది. అది ఏ మృగం వాతబడిపోయిందో అని విలవిల్లాడాడు. అన్ని వేళాలా తనను అంటిపెట్టుకు తిరిగే ఆ లేడికూన కానరాక కుంగిపోతూండగా, నాలుగైదురోజులు గడిచాక, అది ఎలాగో అశ్రమం దారిపట్టి తిరిగివచ్చి భరతుని వొళ్లోవాలింది. అప్పుడా రాజర్షికి కలిగిన ఆనందం వర్ణనాతీతం.
ఏదైనా గానీ, అంత వృద్ధాప్యదశలో జడభరతుడు ఒక అల్పమైన అమాయకప్రాణి మోహంలో చిక్కుకున్నాడు. సంసారబంధాలన్నీ త్యజించి వచ్చినా, ఇక్కడ ఈ ప్రాణితో అతనికి అనుబంధం అధికమైపోయింది. చూస్తూండగానే, అతడికి వార్ధక్యదశ కూడా గడిచి, మృత్యువు సంప్రాప్తించింది. అయితే, ఆ మహారాజు మరణించేముందు, తన పెంపుడులేడి గతి ఏమౌతుందో? తన తర్వాత దాని అలనాపాలన ఎవరు చూస్తారో? అని బాగా ఆందోళనచెందాడు. అతడా వ్యథతోనే కన్నుమూసాడు.
ఈ అంతిమ దశలో మృగసాబకంపైన మమకారం వదల్లేక పోవడంతో, జడభరతునికి మరుజన్మలో జింక జన్మయే ప్రాప్తించింది. కాలంజర పర్వతాలకు చేరువలోనే ఒక నేరేడు వనంలో జింకగా పుట్టాడు. గత జన్మలో పరమ భక్తుడవడంవలన గత జన్మ స్పృహతో భగవధ్యానంతో భగవంతుని సన్నిధికి చేరుకున్నాడు.
భార్య లేక భర్త, పిల్లలు, ఇంటి బాధ్యతలు ఆధ్యాత్మికతకు ఎన్నడూ అడ్డంకులు కావు. పైపెచ్చు సహాయకారులు కూడా. అంతర్ముఖ, బహిర్ముఖ దృష్టులలో చిక్కుకున్న మనసు కలాపములను విరమించుకొని విశ్రాంత దృష్టి యుత కావడమే సంసారమును అధిగమించుట.
నేను ఫలానా వ్యక్తిని ( సంసారిని, స్వామిని, సన్యాసిని, అమ్మను, బాబాను మొదలైన అన్వయములు) అనే స్పృహా రహితంగా వర్తించడమే, జీవన యానం చేయడమే ఋషి లక్షణం. మౌనము, ఆనందము, నిరంతర ధ్యానమై ప్రశాంతతను అనుభవముగా చేసికొనడమే. అటువంటివారే సంసారమును అధిగమించినవారు. ఇతరులందరూ, వారి వేషభాషలేవైనా, సంసారులే !
No comments:
Post a Comment