సత్సంగత్వే నిస్సంగత్వం - అచ్చంగా తెలుగు

సత్సంగత్వే నిస్సంగత్వం

Share This

సత్సంగత్వే నిస్సంగత్వం 

- అక్కిరాజు ప్రసాద్ 


సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః
సత్పురుషుల సాంగత్యం వలన ప్రాపంచిక విషయాలు, మనుషుల పట్ల వాసనలు తొలగుతాయి. వాసనలు తొలగుట వలన మోహము నశిస్తుంది. దానివలన స్థిరమైన తత్త్వము వస్తుంది. దాని వలన పరమాత్మపై తదేక దృష్టి ఏర్పడి జీవికి ముక్తి కలుగుతుంది. 
- ఆదిశంకరుల మోహముద్గర నుండి (భజగోవిందంగా ప్రసిద్ధి చెందింది)
సత్సాంగత్యానికి సనాతన ధర్మం ఉన్న ప్రాముఖ్యతను శంకరులు తమ మోహముద్గర రచనలో అత్యద్భుతంగా తెలియజేశారు.
ఎందుకు సత్సాంగత్యం ముఖ్యం? సగటు మనుషులకు నిరంతరం ప్రేరణ, తులన, భావాలను పంచుకునేందుకు ఇంకో వ్యక్తి కావాలి. మనం ఎక్కువ సమయం ఎవరితో గడుపుతామో వారి నడవడికలు, విలువలు మనకు తప్పకుండా అబ్బుతాయి. అవే మన జీవన విధానం అవుతాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తల్లిదండ్రులు. వారు ఎలా వ్యవహరిస్తే పిల్లలకు అటువంటి ఆలోచనలే వ్యక్తిత్వంగా రూపొందుతాయి. అదేవిధంగా, పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రభావం కూడా. ఎందుకు? వీరితో మిగత ప్రపంచం కన్నా ఎక్కువ సమయం పిల్లలు గడుపుతారు కాబట్టి.
సత్పురుషుల లక్షణాలు ఏమిటి? సమభావన, రాగద్వేష రహితమైన ఆలోచన, ఆశలేని ప్రేమ, శాశ్వతమైన ప్రశాంతత. ఇవి వారికి ఎలా వస్తాయి? సాధన చతుష్టయం వలన. వివేకము, వైరాగ్యము, షట్సంపదలు, ముముక్షత్వము అనే నాలు మూలస్తంభాలు సత్పురుషుల సాధనలో ప్రధాన లక్షణాలు. అభ్యాసము వలన జ్ఞానము, తద్వారా వైరాగ్యము కలుగుతాయి. షట్సంపదలు వారికి ఈ మార్గంలో పనిముట్లు - శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానములు. ఈ సంపదలను తమ తమ వ్యక్తిత్వాలకు అనుగుణంగా అలవరచుకొని, సాధన చేసి, త్యాగము చేసి సామాన్యులు సత్పురుషులవుతారు.
మరి వీరి సాంగత్యం వలన మనం ఎలా మారతాము? మనిషికి ఇంకొక మనిషి వ్యక్తిత్వం చాలా ప్రభావవంతమైన ప్రేరణ. సత్పురుషులతో సమయం గడిపిన కొద్దీ మనలోని అరిషడ్వర్గాలు వారిలోని షట్సంపదల ద్వారా నశింపబడతాయి. అనగా, మాయా ప్రేరితమైన మన ఆలోచనలు సత్పురుషులకు సాధన వలన కలిగిన దివ్యత్వం చేత తొలగించ బడతాయి. వాటి స్థానంలో మన  సాధనను బట్టి ఆ దివ్యలక్షణాలు ప్రవేశించి మనలను అంతర్ముఖులను చేస్తాయి. అది మొదలు సాధనలో పురోగతి వేగవంతమవుతుంది.
మనలోని అశాంతికి కారణాలు ఏవో వాటిని సత్పురుషుల నడవడి ప్రశ్నిస్తుంది. తద్వారా ఆయా కారణాలను నిర్మూలం చేసే అంతర్మథనం మొదలవుతుంది. ఈ మథనం జరిగే సమయంలో మనకు శాంతి, శాశ్వతానందం ముఖ్యమనే గ్రహింపు వస్తుంది. అప్పుడు మనకు ఆ సత్పురుషులలోని లక్షణాలు నచ్చుతాయి. నచ్చిన లక్షణాలు ప్రేరణగా, ప్రేరణలు సంకల్పంగా, సంకల్పం లక్ష్య సాధనకు ముందడుగుగా పరిణమిస్తాయి.
ఈ పరిణామాలనే శంకరులు పైన పొందుపరచిన శ్లోకాన్ని మనకు మోహముద్గర ద్వారా అందించారు.
కస్తరతి కస్తరతి మాయాం? యః సంగం త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి.
ఎవరు మాయని దాటి, మాయను అధిగమించగలరు? దుస్సాంగత్యాలను త్యజించి, మహానుభావుల సాంగత్యాన్ని ఆశ్రయించినవానికి, 'మమ '  అన్న భావము తొలగుతుంది.
మహత్సంగస్తు దుర్లభో అగమ్యో అమోఘశ్చ! లభ్యతేపి తత్కృపయైవ!
సత్పురుషుల సాంగత్యం దొరకుట అతి కష్ట తరమైనది. అది ఎలా జరుగుతుందో చెప్పలేము. కానీ ఒక్కసారి అది జరిగిన తరువాత అది తిరుగులేనిది. ఆ సాంగత్యము దొరకుట భగవంతుని అనుగ్రహము వలననే! 
- నారద భక్తి సూత్రములు 
ఈ విధంగా మన శృతి స్మృతి పురాణములు, మహానుభావుల భాష్యాలు మనకు సత్సాంగత్యం ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నాయి. సత్సంగమనేది మనకు సాగర తరణంలో నావ వంటిది. విచక్షణ మనకు దిక్సూచి. వైరాగ్యము మనకు లంగరు. జీవితమనే నావను భయరహితంగా నడిపి సంసార సాగరాన్ని దాటి ముక్తి తీరాన్ని చేరదాము.

No comments:

Post a Comment

Pages