శివం – 15 - అచ్చంగా తెలుగు

శివం – 15

Share This

శివం – 15

(శివుడే చెబుతున్న కధలు )

రాజ కార్తీక్

9290523901

(  శివభక్తుల కధలను గురించి చెబుతుంటాడు శివుడు...)

 ఊరేగింపు సాగిపోతుంది. సాంబయ్య పార్థివ దేహానికి కావలసిన ఏర్పాట్లు మొదలయ్యాయి. ఊరేగింపులో అందరికీ సాంబయ్య శివుడికి వేసిన చెప్పులు అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు  అయినా ఇంత బాగా చెప్పులు కుట్టిన పనివాడిని ఎక్కడ చూడలేదు అని కొంతమంది అంటున్నారు. సాంబయ్య శవాన్ని రాజపరివారం చూసుకుంటారు, మనం తిరునాళ్ళ చేసుకుందాం అంటున్నారు.
శూస్యం...మోక్షస్థితి....యదార్ధస్థానం...
కళ్ళు తెరిచాడు సాంబయ్య. సాంబయ్య ఆత్మ అన్ని రకాలుగా మోక్ష అర్హత సంపాదించుకుంది. సాంబయ్య కి శూన్యం తప్ప ఏమి కనబడుటలేదు. ఆ శూన్యంలో ఒక పెద్దవెలుగు నా రూపంలో అతనికి కనబడింది. సాంబయ్య చేతులెత్తి నమస్కరిస్తున్నాడు.
నేను సాంబయ్య, ఇదే ఆత్మ యొక్క యదార్ధస్థితి, నీవు జన్మరాహిత్యం పొందావు. మోక్షాన్ని సాధించావు. నీ నిశ్చలమైన వైరాగ్యభక్తితో, నన్ను పొందావు, అందుకే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను, చెప్పానుగా ఇక మీద నిన్ను నన్ను ఎవరూ వేరు చేయలేరు అని ,
సాంబయ్య “ఆ..ఆ... “కళ్ళవెంట నీరుతో ...
నేను “సాంబయ్య నీ ఇష్టదైవాన్ని నేను కాబట్టి నీకు ఈ రూపంలో నేను దర్శనమిచ్చాను, ఎవరు ఎట్లా పూజించినా, వారికీ అలానే దర్శనం ఇస్తాను, అటువంటి భక్తి పదార్ధాన్ని నేను”,
సాంబయ్య “మనసంతా ఆనందంగా ఉంది సామి,”
నేను “దీనికే ఇంత ఆనందపడితే, ఇక నాలో లీనమైపోతే...”
సాంబయ్య “వస్తున్నా సామి” అంటూ అడుగు ముందుకేశాడు.
అడుగుఅడుగుకీ సాంబయ్యకీ.
“మనస్సు బుద్ధి చిత్తం అహంకారం శివోహం”
“భూమి, ఆకాశం, వాయువు, నీరు, అగ్ని శివోహం”
“పాపం పుణ్యం సుఖం దుఃఖం శివోహం”
“తల్లి తండ్రి గురువు దైవం భార్య బిడ్డ, ఆస్థి,పాస్థి శివోహం”
“ధర్మం అర్ధం కామం మోక్షం శివోహం”
“ప్రేమ, రాగం, అసూయ, ద్వేషం, లోభం, మొహం, కామం, మధువు, మాత్సర్యం శివోహం”
“వేదం, తత్త్వం, సంగీతం, కళ శివోహం”
“అండ, పిండ, తేజ, బ్రహ్మాండం శివోహం”
అంతా శివోహం.. చిదానంద ఈశ్వర శివోహం అన్ని సాంబయ్య అడుగడుగుకీ వినబడుతున్నాయి. ప్రతి మాటకీ అర్ధం అయినట్లుగా సాంబయ్య తల ఊపుతూ , నా రూపం లేని వెలుగు రూపాన్నే చూస్తున్నాడు. “అన్ని నీవే, అంతా నీవే శివా” అంటూ గానం చేస్తున్నాడు “ఇక నాలో లీనమైపోతా” అంటుండగా నేను “ఆగు సాంబయ్య, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది ఒకటి ఉంది” సాంబయ్య ప్రశ్నలు ఇప్పుడు అతనికి వినబడుతున్నాయి.
ప్రశ్న:మనుషులను ప్రాధేయపడే వారిని బిచ్చగాళ్లు, నిన్ను ప్రాధేయపడే వారిని భక్తులు అంటారు.
సమాధానం:”అవును సాంబయ్య, ఇక్కడ ప్రాదేయపడేది లేదు, అందరిలో ఆత్మలాగా ఉంది నేనే కాబట్టి నన్ను నేనే అడుగుతున్నాను అది మోక్షమైన, కోరికైన, వరమైనా.
సాంబయ్య తల ఊపాడు. అటు చూడు సాంబయ్య “నీ కుటుంబం ఎంత ఆనందంగా ఉన్నారో అంటూనే.. అటు చూశాడు. అంతే సాంబయ్య కుటుంబం ఎటువంటి ఆనందస్థితిలో ఉన్నారో చూశాడు, “నీకన్నా నీ కుటుంబాన్ని నేను బాగా చూసుకున్న చూశావా?”...
ప్రశ్న: శరీరాన్ని జోలేగా భిక్షగా ఇవ్వు, వేరొకరు మోసం చేస్తే పగ పెంచుకుంటారు, నీవు ఏమి చేసిన ప్రేమ పెంచుకుంటారు, వేరొకరు చేస్తే తప్పు, నీవు చేస్తే లీల
జవాబు: శరీరాన్ని ఇచ్చింది, ఆత్మసాధనకే, అదే నిజమైన భిక్ష సాంబయ్య నేను ఎవర్ని మోసం చేయను, జీవుల యొక్క పాపపుణ్యాలతో వారికి తలరాత ఇచ్చేవాణ్ణి మాత్రమే, పిలిస్తే పలికేవాణ్ణి మాత్రమే, నిజమైన భక్తికి లీలను చూపేవాడిని మాత్రమే, మీ ప్రార్థన పరాకాష్టకు చేరితే అన్ని కర్మలను దహించేవాడిని మాత్రమే.
ప్రశ్న: స్మశానంలో ఉండే నీకు మడి మైల ఏందయ్యా..
జవాబు: అవును సాంబయ్య మడి, మైల, నాకు లేవు శుభ్రత, పరిశుభ్రత కోసం అది మీరు పెట్టుకున్న కట్టుబాట్లు.
ప్రశ్న:నీ దర్శనం కోసం వచ్చిన వారి చెప్పులు తాకిన నాకేం పాపాలు
జవాబు: అవును, సాంబయ్య నిజంగా వారి చెప్పులను తాకి, నీ నమ్మకంతో నీ కర్మలను ప్రక్షాళన చేశావు.
ప్రశ్న: అవిటివాడి మరణ ఉదంతం
జవాబు:సాంబయ్య, నీ కోరిక మేరకే, ఆ అవిటివాడికి జన్మవిముక్తి చేసి, వేరొక మంచి జన్మ ఇచ్చాను, కావాలంటే చూడు అంటూ వాడు , పూర్వ పాపాలు, వాడికి వేసిన శిక్ష మొత్తం చూపాను...
సాంబయ్య, అవును సామీ, నీ తీర్పులో ఏ అన్యాయం ఉండదు. అపుడు నేను “సాంబయ్య, నా స్థానంలో ఉన్నవారు ఎవరైనా అంతే “
సాంబయ్య: నీ స్థానం నీకు మాత్రమే ప్రభూ”...
ఇలా, సాంబయ్య మనసులో ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభించింది.
నేను కరిగిపోయాను, నీ భక్తి నన్ను కదిలించింది. ఇది వరకు స్మశానంలో చెప్పులు లేకుండా తిరిగేవాణ్ణి, కానీ ఇప్పుడు నీ పుణ్యమా అని చెప్పులు వేసుకుంటాను అంటూ మందహాసం చేసి, మీ మాతా పార్వతి దేవికి నీవు ఇచ్చిన గాజులు చేరాయి, ఎంతగానో ఆనందపడింది, అంటూ .. పార్వతీదేవి తను తెచ్చిన గాజులను వేసుకొని ఉండి ఆశీర్వదించటం కనబడింది..
సాంబయ్య చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు. నేను ఎంతగానో సంతోషపడ్డాను, నీవు ఏ వరం కోరిన నేను ఇచ్చేవాన్ని, కానీ నీలో కోరిక ఏమాత్రం లేదు వైరాగ్యమని నా మీద ప్రేమ తప్ప, అందుకే, నీవు మోక్షాన్ని పొందావు, వైరాగ్యమంటేనే, నా మీద ప్రేమ, ఆ మీద నీవు ఎప్పుడూ ప్రేమను చూపుతూనే ఉన్నావు , ఎన్నో భక్తి మార్గాల్లో నీవు చూపిన ప్రేమ మార్గం ఒకటి”
సాంబయ్య “ధన్యుడిని సామీ, ఇక ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను,”
సాంబయ్య, అంతా ఒక అణువులాగా కనబడింది,
ముందుకు సాగుతూ సాంబయ్య “శంభో అంటే చాలా స్వామి, భంభం అంటే చాలా స్వామి, “ అంటూ ఆనందస్థితిలో పాడుతూ నా చెంతకు చేరాడు, సాంబయ్య ఆత్మను జ్యోతిరూపంలోకి మార్చాను, కర్పూర హారతి ఇచ్చినట్లు, ఆ జ్యోతి నా చుట్టూ తిరిగింది,”శివ శివ హర శివ శివ హర , హర హర శివ “ అంటూ ఆ జ్యోతి నాలో లీనంయ్యింది, ఇప్పుడు సాంబయ్య కూడా శివుడు అయ్యాడు సాంబయ్య ఆత్మలో శివునిలో లీనమయిన తర్వాత తను చేసిన శివధ్యానం అంతా గుర్తుచేసుకున్నాడు, చివరికి తన కోసం నేను చెప్పులు కుట్టింది గుర్తు చేసుకొని, ఇక పూర్తిగా ఆ ఆత్మ పదార్ధం, ఈ పరమాత్మ పదార్ధంలో విలీనమయింది.
అంతా శివమయం...శివోహం...శివం....

No comments:

Post a Comment

Pages