సక్సస్ సూత్రం - అచ్చంగా తెలుగు

సక్సస్ సూత్రం

Share This

సక్సస్ సూత్రం

- బి.వి.సత్యనాగేష్

        
ప్రతీ మనిషికి కోరికలుంటాయి ఆకోరికలు నెరవేరితే సంతోషిస్తారు పెద్దస్థాయి లక్ష్యాలు నెరవేరితే విజయం సాధించాడంటాం. లక్ష్యం ఏదైనా కావచ్చు... లక్ష్యం నెరవేరితే విజయం సాధించినట్లే! ఈ విజయానికి ఒక సూత్రం ఉంది. అది సకెస్స్ అనే ఇంగ్లీషు పదం లోనే ఇమిడి ఉంది. ఈ సూత్రం లోని లక్షణాలేంటో చూద్దాం.
S= SETTING THE GOAL
U= UNLEASHING THE POTENTIAL
C= CARE AND COMMITMENT
C= CONTINUOUS EFFORTS
E= ENTHUSIASM
S= SELF CONFIDENCE
S= SELF START
        సకెస్స్ అనే పదంలో మొదటి అక్షరం ‘S’ ఇదే విజయానికి తొలిమెట్టు. విజయం సాధించాలనుకునేవారు లక్ష్యాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. నిర్దిష్టమైన లక్ష్యంతో పాటు ఆ లక్ష్యం వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు చూసుకోవాలి. ఆ లక్ష్యం చేరడానికి ఎంత సమయం పడుతుందనే విషయంపై సరియైన నిర్ణయం తీసుకోవాలి. ఆ తరువాత ఆ లక్ష్యాన్ని చేరడానికి ఒక ప్రణాళిక తయారు చేసి అమలు చేయాలి. ఈ విధంగా లక్ష్యానికి సంబంధించిన విషయాలను అధ్యయనం చేసి ఖచ్చితమైన లక్ష్యాన్ని ఎంచుకోవాలి.
        లక్ష్యాన్ని ఎంచుకున్న తరువాత మనలోని శక్తిని మేల్కొలపాలి. ఇది రెండవ లక్షణం. మనస్తత్వ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సగటు మనిషి కోవలం 3 శాతం శక్తిని మాత్రమే వాడుకుంటాడనేది ఒక అంచనా. కనుక విజయం కోరుకునే వ్యక్తి తన్ను తాను సవాలు (challenge) చేసుకుంటూ వుండాలి. విజేతలాగా ముందడుగు వెయ్యాలి. తనలో ఎంతో శక్తి వుందని నమ్మి నిత్యస్ఫూర్తి తో ప్రయత్నం చేస్తూనే వుండాలి. ఆ విధంగా నమ్మి వారి శక్తిని మేల్కొలిపి సాధన చేసి పెద్ద లక్ష్యాలను చేరుతున్న వారిని మనం చూస్తూనే వున్నాం..
        ఇక మూడవ లక్షణమైన CARE AND COMMITMENT. విజయం కోరుకునే వ్యక్తి తన లక్ష్యంపై అత్యంత శ్రద్దను చూపించాలి. శ్రద్ధతో బాటు అంకితభావాన్ని అలవరచుకోవాలి.
        నాలుగవ లక్షణం – నిరంతర కృషి. లక్షాన్ని సాధించేవరకు విసుగుచెందని విక్రమార్కునిలా నిరంతర కృషి చేస్తూనే వుండాలి. ఎన్నో అపజయాలు పొందినా నిరంతరం కృషి చెయ్యటం వల్లనే థామస్ ఆల్వా ఎడసన్ ఎలట్రిక్ బల్బుని కనుగొన్నాడనే విషయం మనందరికీ తెలిసిందే.
        అయిదవ లక్షణం – ENTHUSIAM. విజయాన్ని సాధించాలనే ఉత్తేజం, ఉత్సాహం, తపన మానసికమైనవి. వీటిని పట్టుదలతో వృద్ధిచేసుకోవాలి. మనసులో రగిలే కోరిక విజేతకు ఇంధనం (FUEL) లా పనిచేస్తుంది.
        ఆరవ లక్షణం – ఆత్మవిశ్వాసం. తన మీద తనకు అపారమైన నమ్మకం వున్నవాడే విజేత కాగలడు. ఆత్మవిశ్వాసం అనేది అనుభవంతో వస్తుంది. అనుభవం అనేది పరిస్థితులను ఎదుర్కొంటేనే వస్తుంది. పరిస్థితులను ఎదుర్కొనడానికి సానుకూల ఆలోచనా దృక్పథాన్ని ఉపయోగించాలి. లక్షాన్ని చేరే ప్రయాణంలో ప్రతీ విషయం గురించి సానుకూలంగా స్పందించి లక్ష్యం వైపు పరుగులు తీయాలి. మంచి అనుభవాలు కలగటం వలన ఆత్మవిశ్వాసం  పెరుగుతుంది.
        మూట లేదా సంచిలో వున్న విత్తనాలు పంటనియ్యవు. ఆ విత్తనాలు పంట నియ్యవు. ఆ విత్తనాలను భూమిలో పాతిపెట్టి నప్పటికీ ఆ విత్తనం భూమిని చీల్చుకుంటూ పైకి వచ్చి ఆటుపోట్లను తట్టుకుని పైపైకి ఎదిగి ఆకాశాన్ని తాకాలని ప్రయత్నిస్తేనే మహావృక్షం లా మారిపోతుంది. మళ్ళీ కొన్ని లక్షల విత్తనాలకు దారి చూపిస్తుంది. విత్తనంలో అంతటి మాహావృక్షం వున్నట్లు ప్రతీ మనిషిలోను ఒక మహావిజేత  వున్నాడు. అపారమైన అంతర్గత శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తిని ఉపయోగించుకుని ఆత్మవిశ్వాసంతో లక్ష్యం వైపు అడుగు వెయ్యాలి.
        విజేతకు ఉండవలసిన ఏడవ లక్షణం – SELF START ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా... అని సినిమా పాటలో ఉంది. నిజమే! మనలోనే అంతశక్తి వున్నప్పుడు మనం వేరే వారి గురించి ఎదురుచూస్తూ వుండటం తప్పు. ఆత్మవిశ్వాసంను వృద్ధిచేసుకున్న తరువాత ప్రయత్నాలు చెయ్యడం మన కర్తవ్యం. విజేతలా ఊహించుకోవాలి. ఊహలో దారిద్ర్యం వుండకూడదు. TNING BIG, THINK HIGH అంటున్నారు సైకాలజిస్టులు. తన్ను తానే ప్రోత్సహించుకుంటూ ముందడుగు వేస్తే విజేతకు కావలసిన రగిలే వాంఛ (BURNING DESIRE) సృష్టించబడుతుంది. విజేత కావాలనుకునే వారు ఎప్పటికీ వారిని వారు ప్రోత్సహించుకుంటూ, అభినందించుకుంటూ ముందుకు సాగిపోతూ వుండాలి. నిరుత్సాహ పరిచే వ్యక్తులకు దూరంగా వుండాలి.
        ఈ విధంగా పైన పేర్కొన్న లక్షణాలను అలవరచుకుని అభివృద్ధి చేసుకుంటే విజయాన్ని ఖచ్చితంగా సాధించగలం. ‘పిండి కొద్ది రొట్టె’ అన్నట్లు పెద్ద విజయాలు కావాలనుకునేవారు ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకుని ప్రయత్నించాలి పైన పేర్కొన్న లక్షణాలను అలవరచుకుంటే అది ఒక అలవాటుగా మారుతుంది. “తెలియనంతకాలం తెలియని విషయం క్రొత్తగానే వుంటుంది”, “సుళువు కానంత కాలం ప్రతీదీ కష్టంగానే వుంటుంది” అన్నట్లు మొదట్లో ప్రతీ విషయం క్రొత్తగానూ, కష్టంగానూ వుంటుంది. ప్రయత్నం చేయడం వలన క్రొత్తదనం. కష్టం అనేవి మాయం అవుతాయి. ఉదాహరణకు సైకిల్ త్రొక్కడం, మొదట్లో కష్టంగానే ఉంటుందనేది మనందరికీ వున్న ఒక అనుభవం. తర్వాత ఎంత సుళువుగా చెయ్యగలమో కూడా మనకు అనుభవమే. ఏ విషయంలో నైనా ప్రారంభదశలో క్లిష్టంగానే వుంటుంది. తపనతో ప్రారంభించి ఇష్టంతో చేస్తే సంతృప్తికరంగా విజయాన్ని సాధించి ‘విజేత’ అని అనిపించుకుంటాం. కనుక ఈ ప్రపంచంలో లేదా మీ చుట్టుప్రక్కల వున్న సమాజంలో వున్న విజేతలను “రోల్ మోడల్ “ గా తీసుకుని పైన పేర్కొన్న లక్షణాలతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూపోతే పై మెట్టుకు చేరుకొని ఉన్నత శిఖరాలను చేరుకొని ‘విజేత’ అని అనిపించుకుంటాం. ఇదే సకెస్స్ సూత్రం. ప్రయత్నించండి మరి!

No comments:

Post a Comment

Pages