తీర్థయాత్ర - అచ్చంగా తెలుగు

తీర్థయాత్ర

Share This

తీర్థయాత్ర

- అక్కిరాజు ప్రసాద్ 


తీర్థయాత్ర అనగానే మనలో చాల మందికి రెండు ప్రశ్నలు వస్తాయి.
1. విహారయాత్ర లేదా వ్యాపార యాత్రకు లేని పవిత్రతు తీర్థయాత్రకు ఎందుకు?
2. తీర్థయాత్ర వలన మనకు వచ్చే లాభాలు ఏమిటి?
ఈ రెండు ప్రశ్నలకు సమాధానం స్వామి శివానంద గారి మాటల్లో తెలుసుకుందాం.
1. విహారయాత్ర లేదా వ్యాపార యాత్రకు లేని పవిత్రతు తీర్థయాత్రకు ఎందుకు?
ఎందుకంటే తీర్థయాత్ర చేయాలన్న ఆలోచనే మన మనసుయొక్క గ్రహణశీలతను పెంచుతుంది, మనలో ప్రార్థనా భావాన్ని నింపుతుంది. కాబట్టి, ప్రాపంచిక విషయాలకు మనసులో స్థానాన్ని కొంత తొలగిస్తుంది. ఆఫీసును వదలగానే అక్కడి అశాంతులను వదులుతాము. మన ఊరు వదలగానే అక్కడి సాధారణ సామాజిక జీవనపు వస్త్రాలవంటి ఆలోచనలను విడుస్తాము. మన కుటుంబం మనతో ఉన్నా కూడా వారిని తోటి యాత్రికులలాగానే భావిస్తాము తప్ప  కుటుంబ బాంధవ్యాలు, బాధ్యతలు మనసును ఆక్రమించవు. ఒకవేళ ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే కుటుంబ ఆందోళనలు, ఆలోచనలు, ఉద్యోగపు బాధ్యతలకు అతీతమైన ఒకరకమైన ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళతాం. ఇటువంటి మానసిక పరిస్థితి భగవంతునితో అనుసంధానం కావటానికి అత్యంత అనువైనది. అనంతమైన విశ్వశక్తి నిరంతరం మనపై కురుస్తూనే ఉంటుంది, కానీ, మన మనసు బంధాలు, బాధ్యతలు, ఆందోళనలు మరియు ఇతర మాలిన్యాలతో నిండి ఉండటం వలన ఆ శక్తి యొక్క ప్రసరణను గ్రహించలేదు. తీర్థయాత్ర చేసేటప్పుడు ప్రత్యేకమైన మానసిక పరిస్థితుల వలన ఆ శక్తిని మనం గ్రహించి, అనుభూతి చెందే అవకాశాలు చాలా ఎక్కువ. యాత్రలో అనుభూతులు పొందాలి అన్న ప్రగాఢమైన వాంఛ కలిగిన యాత్రికునికి తప్పక ఆ అనుభూతులు తీర్థములలో కలుగుతాయి. అటువంటి అనుభూతులు పొందిన తరువాత ఆ వ్యక్తి మునుపటి వ్యక్తి కాడు. ఆధ్యాత్మికంగా పది అడుగులు ముందుకు వేసిన ఉన్నతిని పొందిన వ్యక్తే అవుతాడు. ఇదీ తీర్థయాత్రలోని పవిత్రత.
2. తీర్థయాత్ర వలన మనకు వచ్చే లాభాలు ఏమిటి?
ఈ ప్రశ్నకు సమాధానం యాత్ర చేసే వ్యక్తి దగ్గరే ఉంది. ఫలితం అతని హృదయంలో ఆ యాత్ర పట్ల, అక్కడి దైవం పట్ల భక్తి, విశ్వాసం, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. నమ్మకమే మనిషిలోని ఆధ్యాత్మికతకు ప్రాణం. అది లేకుంటే ఆధ్యాత్మికత గమ్యాన్ని చేరలేదు. అచంచలమైన విశ్వాసంలేని ఆధ్యాత్మిక యానం ఫలాలను పొందలేదు. తీర్థయాత్ర వలన తనలోని పాపాలు తొలగించబడి, తనకు పరమాత్మతో (లేదా విశ్వవ్యాప్తమైన అనంతశక్తితో) అనుసంధానం ఏర్పడుతుందని, మోక్షము కలుగుతుందని త్రికరణ శుద్ధితో (మనసా వాచా కర్మణా) నమ్మిన యాత్రికునికి అటువంటి ఫలితాలు నిస్సందేహంగా కలుగుతాయి. బదరీ, కేదార్ వంటి అమోఘమైన ప్రదేశాలకు తీర్థయాత్ర భక్తి విశ్వాసాలతో చేస్తే తప్పకుండా పాపాలు తొలగి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇది అనుభవైకవేద్యం. కానీ, ఒక్కటి గుర్తుంచుకోవాలి. తీర్థయాత్రపై మనకు గల విశ్వాసానికి మొదటి పరీక్ష ఆ యాత్రను తిరిగి రాగానే మనం ఏ విధంగా మసలుకుంటామో అన్నది. యాత్ర తరువాత నిజంగా మనలోని పాపాలు తొలగాయి, అక్కడి తీర్థము లేదా నదీ స్నానం తరువాత మనలోని కుసంస్కారాలు అన్నీ కొట్టుకుపోయాయి, అక్కడి మహత్తరమైన ఆధ్యాత్మిక ప్రకంపనలను మన శరీరం అనుభూతి చెంది గ్రహించింది అని నిరూపణ కలిగితే తప్పక ముక్తి కల్గినట్లే. ఆ తీర్థయాత్రకు సార్థకత కలిగినట్లే. తీర్థయాత్రకు వెళ్లిన కొంతమంది, బహుశా అతి కొద్దిమందే కావచ్చు, ఇటువంటి అనుభూతులను పొందుతారు. కాకపోతే, వారు తమ అనుభూతులను చాటుకోరు. అంతమాత్రమున అనుభూతులు ఉండవు అన్నది పూర్తిగా నిజానికి దూరం.
శివానంద స్వామి చెప్పిన సమాధానాల్లో సారాంశం మన మానసిక పరిస్థితి, మనలోని విశ్వాసం యాత్రా ఫలాలను నిర్ణయిస్తాయి. కాబట్టి, ఇకముందు తీర్థయాత్ర చేసేటప్పుడు మనసులో మూసుకున్న ఆధ్యాత్మిక కవాటాలను (లేదా జ్ఞానేంద్రియములను) తెరచుకునే ప్రయత్నం చేద్దాం. తప్పక ఫలితాలు మనకు అందుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం. తీర్థయాత్ర చేయాలి అన్న సంకల్పం కలిగింది అంటే ఆ దైవస్వరూపం యొక్క దృష్టి మనపై పడినట్లే. ఆ సంకల్పానికి మన కర్మల వాసనలే విఘ్నాలు. కాబట్టి సంకల్పాన్ని గట్టి చేసుకోవాలి. అంటే, ఎలాగైనా వెళ్లాలి అన్నది మన మనసులో నాటుకోవాలి, ఆ దైవం యొక్క లీలలను, ఆ క్షేత్రం యొక్క మహాత్మ్యాలను పఠించాలి. వాటిని పునశ్చరణ చేసుకోవాలి. చాలామంది తీర్థయాత్ర ముందు ముడుపు కడతారు. ముడుపు మనలోని సంకల్పం యొక్క దృఢత్వానికి సూచిక. మనకు ఆ దైవంపై గల నమ్మకానికి సూచిక. మనం ఆ దైవానికి సమర్పించే భక్తి శ్రద్ధలకు సూచిక. లంచం మాత్రం కాదు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే యద్భావం తద్భవతి. యాత్రాఫలం మనలోని భావ నైర్మల్యం, సంకల్ప బలం బట్టే.

No comments:

Post a Comment

Pages