వెన్నెల యానం – 6
భావరాజు పద్మిని
( జరిగిన కధ : వెన్నెల రాత్రి పాపికొండల నడుమ చక్కటి పూలపడవపై ప్రయాణిస్తూ ఉంటారు కొత్త జంట శరత్, చంద్రిక. తమ పరిచయం గురించి ముచ్చటించుకుంటూ ఉంటారు. శరత్ తండ్రి చిన్నప్పుడే పోవడంతో, తల్లి సంరక్షణలో పెరుగుతుంటాడు. తనకు ఎం.సి.ఎ లో సీట్ రాగా, దిల్సుక్ నగర్ బాబా గుడికి, సద్గురుదీవేనలకై వస్తాడు శరత్. గుడి బయట తన మెళ్ళో చైన్ లాగాబోయిన అబ్బాయిని బైక్ పై నుంచి లాగి పడేసి, కొడుతున్న చంద్రికను చూసి, ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతాడు... చంద్రికను తను రెండవసారి బస్సు లో చూసిన వైనం, సీతారామపురం మామిడి తోటలో ఆమె దొంగతనం చెయ్యబోయిన పాలేరును కొడుతూ, భయపడి చెట్టెక్కిన శరత్ తో అతని భయం మటుమాయమయ్యేలా ఆమె చెప్పిన మాటలు, గుర్తుచేసుకుంటాడు శరత్... కాలేజీ బంద్ మూలంగా లేకపోతే, గోదావరి ఒడ్డున నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకుని, ఏదో రాసుకుంటున్న శరత్ ను ఆటపట్టించి, జానపద భాషలో గోదావరిపై గేయం రాయమని అడుగుతుంది చంద్రిక. తాను రాస్తే, ఆమె వెంటనే ట్యూన్ కట్టి పాడాలని, సవాల్ చేస్తాడు శరత్. శరత్ రాసిన పాటను అద్భుతంగా పాడుతుంది, అతని మనసులో చంద్రిక పట్ల ఒక ఆరాధనాభావం కలుగుతుంది. ఫ్రెషర్స్ పార్టీ కి వెళ్ళినప్పుడు నదిలో మునిగిపోతున్నసీనియర్లను తాను రక్షించిన వైనం చెప్తాడు శరత్. వారి పడవ గోదావరి మధ్యనున్న ఒక లంకకు చేరుకోగా, అక్కడ తమ తొలిరాత్రి మజిలీ చేస్తారు వారు. ఇక చదవండి...)
చంద్రిక ‘ఉండు, కాస్త ఫ్రెష్ అయి వస్తాను,’ అంటూ అతన్ని విడిపించుకుని వెళ్ళింది.
చంద్రిక స్నానం చేసి, ఫ్రెష్ అవుతుండగా, సరంజామా అంతా తిరిగి పడవలో సర్దేసాడు శరత్. ఆమె రాగానే, వేడివేడి కాఫీ, బ్రెడ్ అందించాడు. ఇద్దరూ కొండల్లోంచి ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండగా,
“ఆ, నీ డ్రీం గర్ల్ గురించి చెప్తూ ఆపేసావు కదా, కొనసాగించు...” అంది చంద్రిక.
“నాకెప్పుడూ ఒకటే కల, ఆ కల్లో అస్పష్టమైన ఒక అందమైన అమ్మాయి. నాలాగే ఆడుతూ, పాడుతూ, రాస్తూ, చదువుతూ, అన్ని కళల్లో మేటిగా ఉండే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నట్లు కల వచ్చేది. నువ్వు పరిచయం అయ్యాకా, ఆ అస్పష్టత తొలగి, అది నీ రూపంగా మారింది. నీ పాట, మనోధైర్యం, నీ నడత, అన్నీ నా మనసులో నీపట్ల బలమైన ఆరాధనా భావాన్ని పెంచాయి. నాకు తెలియకుండానే నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను.”
“ఓహ్, అలాగా, మరి నాకెప్పుడూ చెప్పలేదే ! ఇంతలా నన్ను పొగుడుతుంటే నాకు మబ్బుల్లో తెలుతున్నట్టు ఉందనుకో!” సిగ్గుపడ్డట్టు నటిస్తూ అంది చంద్రిక.
“మరీ అంతలా తేలకు, వానపడితే, మబ్బుల నుంచి దబ్బునకింద పడతావు. మొదట్లో చెప్పేంత చనువు మన మధ్యన లేదు. తర్వాత నెమ్మదిగా చెబుదాము అనుకుంటుండగా, నువ్వు నా గుండెల్లో ఆటం బాంబు పేల్చావు..”
“హమ్మో, ఇలా ఎక్కడన్నా అనేవు. యురేనియం తో చేసారేమో అని ,నీ గుండెతో రీసెర్చ్ చేసి, న్యూట్రాన్ లతో దెబ్బకొట్టి పరీక్షించగలరు. ఇంతకీ నేను నీ గుండెను హిరోషిమా, నాగసాకి చేసానంటావ్ , ఎలా ? ఎప్పుడు ?”
“సెకండ్ ఇయర్ మొదట్లో ఉండగా, ‘మా బావతో నాకు ఎంగేజ్మెంట్, మీరు తప్పక రావాలి,’ అంటూ నువ్వు కార్డులు తెచ్చి అందరికీ పంచావు. నాక్కూడా ! అశనిపాతంలా తాకింది ఆ వార్త నన్ను. ఆరోజు మీ ఫ్రెండ్స్ తో నీ సంభాషణ నాకు ఇంకా గుర్తే !
‘మీ బావ ఏం చేస్తుంటాడే... ‘
’ మా బావా వాళ్ళు నా చిన్నప్పుడే అమెరికాలో స్థిరపడ్డారు, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ తీసేసి, భారత్ లోనే కంపెనీ పెట్టి, పూర్తిగా ఇక్కడికే వచ్చెయ్యాలని వాళ్ళ ఆలోచన. ఏవో కుటుంబకలహాల వల్ల ఇన్నాళ్ళూ రాకపోకలు లేవు. ఇప్పుడు మా అత్తయ్య స్వయంగా ఫోన్ చేసి, ఈ సంబంధం కలుపుకోమందిట ! నాన్నగారు ఒప్పుకున్నారు.’
‘అయితే నువ్వు మీ బావని ఇంతవరకూ చూడలేదా ?’
‘లేదే, పెద్దరాజు గారి మాటంటే ఈ ఊరి వాళ్లకు వేదవాక్కు. ఆయన కూతుర్ని నేను. ఆయన ఏది చేసినా, నా మంచికే చేస్తారన్న నమ్మకం నాకుంది.’
‘కంగ్రాట్స్ చంద్రికా. మీ ఎంగేజ్మెంట్ కి తప్పకుండా వస్తాం’. అంటూ అభినందిస్తున్న వాళ్ళతో, నేనూ విష్ చేసి వెళ్ళిపోయాను. ఆ రాత్రే ఏమైనా, నువ్విచ్చిన ప్రేరణకు కృతజ్ఞతగా నవ్వుతూనే ఉండాలని, నీతో స్నేహం చెడిపోకూడదని, నీపై ఉన్న ప్రేమని నా మనసులోనే సమాధి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.
మావిడాకుల తోరణాలు కట్టిన కొబ్బరాకుల పందిరి మీ ఇంటిముందు వేసుంది ఆ రోజున. మిత్రులం అంతా నీకు మంచి బహుమతి తెచ్చాము. మీ బావ చూడచక్కగా, ఆరడుగుల ఎత్తుతో ఉన్నాడు. ఇక్కడి పద్ధతులు తెలీవేమో, కాస్త ఇబ్బంది పడుతున్నా, చిరునవ్వు చెక్కుచెదరనివ్వట్లేదు. ‘చక్కని జోడీ’ అనుకున్నాను మనసులోనే. నాకంటే, అన్ని విధాలుగా అతనే నీకు తగినవాడు అనిపించింది.
నీ ఎంగేజ్మెంట్ వేడుకల్లో మన మిత్రులు చేసిన హడావిడి అంతాఇంతా కాదు. అంత్యాక్షరి ఆడించారు, మూగసైగల ఆట ఆడించారు, ఆటపాటలు, సందడి. అన్నీ చూసి ఆనందిస్తూనే ఉన్నా, మీ బావ నీ చేతికి ఉంగరం తొడుగుతూ ఉండగా మాత్రం, జన్మజన్మలుగా నాకు స్వంతమైన అపురూపమైన మనిషిని ఎవరో తన్నుకుపోతున్న అనుభూతి కలిగింది. ఏదో పనుంది అంటూ, అక్కడినుంచి మౌనంగా నిష్క్రమించాను. చిన్నప్పటి నుంచి అమ్మా, నాన్నా అన్నీ తానే అయ్యి నా మీదే ప్రాణాలు పెట్టుకున్న అమ్మ గుర్తుకు వచ్చింది. అంతే, ఆ రాత్రికే బస్సు ఎక్కి అమ్మదగ్గరికి వెళ్లాను. అమ్మ ఒడిలో పడుకుని, మళ్ళీ అప్పుడే పుట్టినట్లు భావించాను, నన్ను నేను తమాయించుకున్నాను. మూడు రోజుల తర్వాత నేను తిరిగి వచ్చేసరికి, హడావిడిగా వచ్చిన మీ అత్తయ్య కుటుంబం వెనక్కు వెళ్ళిపోయిందని, నీ చదువు పూర్తి కాగానే జరిగే మీ పెళ్ళికి మళ్ళీ తిరిగి వస్తుందనీ విన్నాను.
ఆటపాటలు, అల్లరి, విజ్ఞాన సముపార్జన, వినోదం అన్నీ కలగలసి కాలేజి జీవితం అందరి మనస్సులో ఒక మధుర జ్ఞాపకం. చూస్తుండగానే మూడో సంవత్సరం చివరికి వచ్చేసరికి, మన కాలేజీ లో క్యాంపస్ ఇంటర్వ్యూ లు మొదలయ్యాయి. తొలి విడత సెలక్షన్ లోనే నాకు మంచి కంపెనీ లో ఉద్యోగం వచ్చింది. వారే పైచదువులు చదివిస్తామని, విదేశాలకు పంపుతామనీ చెప్పారు. మన మిత్రులంతా అభినందించారు. అమ్మ చాలా సంతోషించింది. ఆమె ఋణం తీర్చుకునే అవకాశం ఇచ్చినందుకు ఆ దైవానికి కృతఙ్ఞతలు తెలుపుకున్నాను.
చివరి రోజున మనం కలిసినప్పుడు, నువ్వు ఎర్రంచు ఉన్న తెల్లటి చీరలో దేవకన్య లాగా అనిపించావు. మళ్ళీ నువ్వు కనిపించవు కదా అని, నిన్ను అభ్యర్ధించి, నీతో ఒక ఫోటో తీయించుకున్నాను. అది ఇప్పటికీ నాదగ్గర పదిలంగా ఉంది. ఆ రోజు వెళ్ళిపోతున్న నిన్నే చూస్తూ, మళ్ళీ కలవలేనేమో అని మనసులో కట్టలు తెంచుకున్న ఉద్వేగం కన్నీళ్ళ రూపంలో ఉబికి వస్తోంది... చూస్తుండగానే ఆ కన్నీటితో పాటే, మసకబారిన నీ రూపం అలా కళ్ళవెంట జారి, కరిగిపోయింది...”
“ఓహో, ఇంత కధ దాచావా ? అయినా, ట్వంటీ ఫస్ట్ సెంచరీ లో కూడా ఈ ఉద్వేగాలు ఏంటి శరత్... చిటికెడు సెంటిమెంట్ డబ్బాడు కన్నీరు అంటూ ! ఇవన్నీ నాకు నచ్చవు. అదే ‘శ్రీ’ అయితే యెంత సరదాగా ఉంటాడో తెలుసా. క్షణాల్లో నవ్వించేస్తాడు. అసలు నీ బదులు అతన్నే చేసుకోవాల్సింది !” అంది చంద్రిక నిట్టూరుస్తూ !
“అవును చంద్రికా, కాలేజీ అయిపోయాకా నేను నిన్ను కలవలేదు. తర్వాత ఏమి జరిగింది ? మీ బావ ఏమయ్యాడు ? ఈ ‘శ్రీ’ ఎవరు ?” అడిగాడు శరత్...
‘చెప్తా, చెప్తా... నది పోటు ఉదయం తగ్గిపోతుంది. అలా పడవలో వెళ్తూ మాట్లాడుకుందామా ?’ అంది చంద్రిక. ఇద్దరూ, మళ్ళీ పయనం కొనసాగించారు.
(సశేషం...)
No comments:
Post a Comment